రివర్స్ అవుతున్న విజయమ్మ ఎత్తుగడ !
posted on Jun 6, 2012 @ 2:49PM
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై అనుమానం వ్యక్తం చేయడం ద్వారా లభ్ది పొందాలన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎత్తుగడ రివర్స్ అవుతోంది. జగన్ అరెస్టు అనంతరం ప్రచార బాధ్యతలు చేపట్టిన ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తన ప్రచారం ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావిస్తున్నారు. మొదట "జగన్ ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారు?" అని ప్రశ్నించడం ద్వారా ప్రచారం ప్రారంభించారు. అయితే దీనికి అంతగా ప్రజలలో స్పందన కనిపించలేదు. దాంతో "తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక అనేక అనుమానాలు వున్నాయని, సమగ్రంగా దర్యాప్తు జరపలేదు" అని రెండో అంశాన్ని ముందు తెచ్చారు. అయితే వైఎస్ మరణించిన సమయంలో "వాతారణం బాగా లేదని చెప్పినా వినకుండా హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారని" ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలే ఆమెకు నేడు అడ్డుగా నిలుస్తున్నాయి. విజయమ్మ మాటమార్చడం, నాడు కనీసం శవం ఇంటికి రాకుండానే జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం శాసన సభ్యుల సంతకాలు సేకరించడం గుర్తుచేసుకొంటుంటే అసలు పదవి కోసం జగన్, విజయమ్మలే హత్యకు కుట్ర చేశారని కాంగ్రెస్ నేతలు ప్రతిదాడికి దిగారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారానికి, విజయమ్మ మీడియాలో మాట్లాడిన మాటలు రుజువుగా మిగలడంతో వైకాపా నేతలకు కనీసం కౌంటర్ చేసుకొనే అవకాశం కూడా లేకుండా పోయింది. దాంతో విజయమ్మ తాజా వైఎస్ మరణం అనుమానాస్పదంగా జరిగిందని వ్యాఖ్యానించానేగాని, మరణానికి ఎవరో కారణమని చెప్పలేదనే రీతిలో వివరణ ఇచ్చుకొంటున్నారు.