పరకాలలో విజయమ్మకు ప్రతిఘటన తప్పదా ?
posted on Jun 6, 2012 @ 12:58PM
పరకాల అసెంబ్లీ ఎన్నికలు తాజామాజీ, వై.కా.పా. అభ్యర్థి కొండాసురేఖ ఆత్మరక్షణలో పడ్డారు. మానుకోట ఘటనలో టిఆర్ ఎస్ కార్యకర్తలపై విసిరిన రాళ్లను సేకరించి కొండాసురేఖను తెలంగాణా వ్యతిరేకిగా చిత్రీకరించి ఊరూ వాడా ప్రచారం చేశారు. టిఆర్ ఎస్ ప్రచారాన్ని తట్టుకోలేక ఆత్మరక్షణలో పడ్డ సురేఖ తన తరుపున ప్రచారానికి వచ్చే వై.కా.పా. గౌరవాధ్యక్షరాలు విజయమ్మను తెలంగాణా వాదుల ముందు నిలబెట్టడంలో విజయవంతమవుతారా? లేక విఫలమవుతారా? అన్న సందేహాలు నియోజకవర్గంలో ఎక్కువయ్యాయి. టిఆర్ ఎస్, బిజెపి అభ్యర్థుల ప్రకటన ముందు వరకూ సురేఖకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉందని అంచనాలు వినిపించాయి. తీరా! ఇప్పుడు చూస్తే ఆ అంచనాలు తప్పని అనిపిస్తోంది. తెలంగాణా వ్యతిరేకిగా సురేఖపై టిఆర్ ఎస్ చేసిన గ్లోబల్ ప్రచారం ఆమెకున్న ఓటుబ్యాంకును దెబ్బతీసింది. దీంతో ఓటర్లను కాపాడుకునేందుకు కసరత్తులు చేస్తున్న ఆమెకు విజయమ్మ రూపంలో మరో సవాల్ ఎదురవుతోంది. గతంలో రాళ్లతో స్వాగతం పలికిన తెలంగాణా వాదులు ఈసారి మనస్సు మార్చుకుంటారా? నంద్యాలలో తన భర్త వైఎస్ ప్రకటించినట్లు వీసా, పాస్ పోర్టులతో తెలంగాణాకు రావాలా అని విజయమ్మ కూడా ప్రశ్నిస్తారా? లేక తెలంగాణా వాదానికి మద్దతు ఇస్తారా? ఈ రెండింటిలో ఏ ఒక్కవైపు సురేఖను, మరోవైపు విజయమ్మను సవాల్ చేస్తున్నాయి. వీరిద్దరూ ఆత్మరక్షణ రాజకీయం అవలంబించి జగన్ పై సానుభూతి కోసం ప్రయత్నిస్తే ఏమైనా ఫలితముంటుందా? తెలంగాణా వాదులు ఇప్పటికే 8న విజయమ్మను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై రీహార్సల్స్ చేస్తున్నారు. ప్రత్యేకించి టిఆర్ ఎస్ విజయమ్మను నిలదీసేందుకు సిద్ధంగా ఉంది.