మేడారం జాతర భక్తులకు హెలికాప్టర్ సేవలు సిద్దం... అందుబాటులో రెండు ప్యాకేజీలు
posted on Feb 20, 2024 @ 11:19AM
మహా కుంభమేళాగా పిలిచే మేడారం వనదేవతల మహాజాతరకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. రేపటి నుంచి గిరిజన జాతర ప్రారంభం కానుండగా.., ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాటపట్టారు.. అటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మేడారానికి చేరుకున్నారు.. ఆలయానికి చేరుకొని తులాభారంలో కూర్చొని ఎత్తు బంగారం సమర్పించారు. డెంగ్యూ జ్వరం బారిన పడ్డ ఆటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మేడారం చేరుకోలేకపోయారని సమాచారం.
మేడారం జన గుడారంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే.. మాఘశుద్ధ మాసపు మంచి ఘడియలు వచ్చేస్తున్నాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబైంది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో.. మేడారం కీకారణ్యంలో… ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ.. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి.. గోవిందరాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు
వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు.. అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళా గా ప్రత్యేక గుర్తింపు ఉంది..ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలికాఫ్టర్ స్థాయికి చేరుకుంది.. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటు లోకి వచ్చాయి.
ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది.
మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయవచ్చు..
హన్మకొండ నుంచి మేడారం జాతరకు ప్రయాణీకులు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా విఐపి దర్శనాన్ని పొందవచ్చు.. దీని ధర ఒక్కొక్కరికి రూ. 28,999.. హెలికాప్టర్లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది.
మరో రైడ్.. జాతర జరిగే ప్రాంతం మీదుగా 6 నుంచి 7 నిమిషాల పాటు గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది.. అమ్మ వారి గద్దెల పక్క నుంచి మొద లయ్యే రైడ్ జంపన్న వాగు, చిలుకల గుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా ఉంటుంది.దీని కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 4800 ఛార్జీ వసూలు చేయనున్నారు. హెలికాప్టర్ టిక్కెట్లు, ఇతర సమాచారం కోసం, ఈ ఫోన్ నంబర్‌లను సంప్రదించవచ్చు: 74834 33752, 04003 99999, లేదా infor@helitaxi.comలో ఆన్‌లైన్ లో సంప్రదించవచ్చు..