మేనల్లుడి పెళ్లికి జగన్ డుమ్మా.. మొహం చెల్లలేదా?
posted on Feb 19, 2024 @ 10:07AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. సొంత చెల్లెలి కుమారుడు, అంటే మేనల్లుడి పెళ్లికి డుమ్మా కొట్టారు. ఆయన రాష్ట్రంలో మహిళలందరినీ అక్కచెల్లెమ్మలు అంటూ పిలుస్తుంటారు. కానీ సొంత చెల్లెల్లి కుమారుడి వివాహానికి మాత్రం హాజరు కాలేదు. సొంత మేనల్లుడి పెళ్లిలో సహజంగా హడావుడి అంతా మేనమామదే అయి ఉండాలి. కానీ ఎపీ సీఎం జగన్ మాత్రం సొంత మేనల్లుడి పెళ్లికే హాజరు కాలేదు. రాజస్థాన్ లో జరిగిన మేనల్లుడి పెళ్లికి డుమ్మా కొట్టిన జగన్ అనంతపురం జిల్లాలో సిద్ధం సభలో ప్రసంగించారు. ఆ సభకు జనాలను తరలించేందుకు ఆయన పార్టీ వారు పెద్ద ఎత్తున మద్యం, సొమ్ములూ పంచారు. ఏపీ సీఎం జగన్ తన మేనల్లుడు-చెల్లి షర్మిల కొడుకయిన రాజారెడ్డి పెళ్లికి డుమ్మా కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు ఓ రేంజ్ లో జగన్ పై సెటైర్లు వేస్తున్నారు. సామీ మేనల్లుడి పెళ్లికి పోలేదా? అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలోని సామీ నదికి పోలేదా అన్న డైలాగ్ స్ఫురించేలా తెగ ట్రోల్ చేస్తున్నారు. అలాగే మావయ్య అన్న పిలుపు అన్న సాంగ్ కు షర్మిల కుమారుడి వివాహ వీడియోను అటాచ్ చేసి సోషల్ మీడియాలో జగన్ ను ఓ ఆటాడేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు పక్కన పెడితే.. సొంత పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా జగన్ సొంత మేనల్లుడి వివాహానికి గైర్హాజర్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జగన్, షర్మిలను ఆదరించిన దివంగత వైఎస్ అభిమానులు కూడా జగన్ సొంత మేనల్లుడి వివాహానికి హాజరు కాకపోవడాన్ని తప్పు పడుతున్నారు. బంధుత్వాన్ని సైతం కాదనుకునేలా రాజకీయ కక్ష పెంచుకోవడం ఏమిటని నిలదీస్తున్నారు.
జగన్ మేనల్లుడి వివాహ నిశ్చితార్థానికి హాజరైన సందర్భంలోనే ఆయన అక్కడ మెలిగిన తీరు, ఎప్పుడు వెళ్లిపోదామా అని చూసిన వైఖరిపైనే అప్పట్లో పలు విమర్శలు వెల్లువెత్తన సంగతి తెలిసిందే. ఆ నిశ్చితార్థ వేడుక తరువాత షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన సంగతి తెలసిందే. ఇక అక్కడి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఆమెసై అనుచిత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా ఆమె పేరు ముందు వైఎస్ అన్న పేరును కూడా తీసేసి వైసీపీ సోషల్ మీడియా ఆమెపై దారుణంగా విమర్శల దాడులు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసి విమర్శల దాడులు చేయడం ఈ నాలుగున్నరేళ్లుగా వైసీపీ అనుసరిస్తున్న విధానమే అయినా.. సొంత చెల్లి విషయంలో జగన్ అంతే కక్ష పూరితంగా వ్యవహరించడంపై వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. మొత్తం మీద సొంత మేనల్లుడి పెళ్లికి డుమ్మా కొట్టి జగన్ తన ఇమేజీని మరింత డ్యామేజీ చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.