రాహుల్ గాంధీకి గంతలు కట్టిన కిరణ్

  నిన్న డిల్లీలోముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సమావేశమయిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులతో బాటు, చంద్రబాబు మరియు షర్మిల చేస్తున్నపాదయాత్రల గురించి కూడా వాకబు చేశారు. వారి పాదయాత్రల ప్రభావం ప్రజల మీద ఎలాఉంది? తద్వారా ఆయా పార్టీలకు ప్రయోజనం ఏ మేరకు ఉంటుంది? దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ఏవిధంగా ఉంటుంది? అని రాహుల్ గాంధీ ప్రశ్నించడం చూస్తే వారిద్దరూ పాదయాత్రలు చేస్తూ ఒకవైపు తమ పార్టీలు బలోపేతం చేసుకొంటూనే, మరోవైపు తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేఖతను పెంచుతున్నారని, తద్వారా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు అర్ధం అవుతోంది. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం, రాహుల్ గాంధీ కళ్ళకు కూడా గంతలు కట్టే ప్రయత్నం చేయడం విశేషం.   గత 7 నెలలుగా చంద్రబాబు పాదయాత్రల చేస్తున్నపటికీ, ఆయన స్వంత పార్టీ మీద కానీ, ప్రజలమీద గానీ ఆయన ప్రభావం చూపలేకపోయారని, ప్రజలు కూడా ఆయన మాటలు విశ్వసించడంలేదని చెప్పారు. అంతే కాకుండా వారి పార్టీలో, కుటుంబంలోనే కలహించుకొంటున్నారని అందువల్ల ఆ పార్టీ నుండి రాబోయే ఎన్నికలలో తమకు ఎటువంటి ప్రమాదం ఉండబోదని కిరణ్ స్పష్టం చేసారు.   షర్మిలా చేస్తున్న పాదయాత్రల పట్ల కూడా ఆయన అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. జగన్ అవినీతి గురించి, అక్రమార్జన గురించి క్రమంగా ప్రజలు కూడా నమ్మడం మొదలుపెట్టారని అందువల్ల వైయస్సార్ కాంగ్రెస్ వల్ల కూడా తమకొచ్చే నష్టం ఏమిలేదని ఆయన వివరించారు.   తానూ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పధకాల గురించి వివరించి, త్వరలో మరి కొన్ని పధకాలు ప్రవేశ పెట్టబోతున్నట్లు కూడా తెలిపారు. తానూ ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పధకాల వల్ల రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని, అది వచ్చే ఎన్నికల నాటికి పూర్తి అనుకూల వాతావరణం సృష్టించడం ఖాయమని గట్టిగా భరోసా ఇచ్చారు.   ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం చూస్తే, రాష్ట్రప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టబోతున్నారని అర్ధం అవుతుంది. కానీ, ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికయినా ఆయన స్వయంగా ఆత్మవంచన చేసుకొంటూ, తమ అధినేతను కూడా మభ్యపెడుతున్నారని అర్ధం అవుతుంది. ఇద్దరు ప్రతిపక్ష నాయకులు కలహించుకొంటున్నపటికీ, ఇద్దరూ కూడా గత 6నెలలుగా కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల గురించి,అవినీతి గురించి ప్రజలకు అర్ధమయ్యే విధంగా సోదాహరణగా వివరిస్తుంటే, ఆ ప్రభావం అసలు ప్రజల మీద ఉండబోదని నమ్మించే ప్రయత్నం చేయడం భ్రమలో బ్రతకడమే అవుతుంది.   ఇక ఒకవైపు ఎన్ని పధకాలు ప్రవేశ పెడుతున్నపటికీ, మరో వైపు కరెంటు కోతలు, తద్వారా ఎండుతున్న పంటలు, కుంటుపడిన పరిశ్రమలు , దివాలా తీస్తున్న వ్యాపారాలు, తద్వారా పెరుగుతున్న నిరుద్యోగం వంటివి ఆయన తమ అధినేతకు చెప్పకుండా కేవలం తన పధకాల గురించి మాత్రమె చెప్పుకోవడం ఆయన కళ్ళకు గంతలు కట్టడం కాక మరేమిటి?   గతంలో ఏ ఆరు నెలలకో, ఏడాదికో పెరిగే కరెంటు బిల్లులు ఇప్పుడు ప్రతీ నెలా పెరగడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ, వారు తను ప్రవేశ పెడుతున్న సంక్షేమ పదకాలను చూసి ఐస్’ అయిపోయి తమకే గంప గుత్తగా ఓట్లేసి గెలిపించేస్తారని భావించడాన్ని ఏమనుకోవాలి?   ఇక, ప్రజాగ్రహం సంగతి పక్కన పెట్టినా, తెలంగాణలో తెరాస ప్రభావం, ఆంధ్రాలో తెదేపా, జగన్ ప్రభావం అసలు ఉండబోదని అనుకోవడం భ్రమ కాదా? రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కాకపోవచ్చును. కానీ, తెరాస, తెదేపా, మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక ఆ మూడు పార్టీలు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేయకమానవు. వీటికి అదనంగా రాష్ట్రంలో ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడుతున్న కులం, ప్రాంతం, ధనం మొదలయిన వాటి ప్రభావం ఎన్నికలపై ఉండనే ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని లుకలుకలు, ముఠాలు మరే పార్టీలోను కనబడవని లోకోక్తి ఉండనే ఉంది.   ఇన్ని అంశాలు కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంటే మరి రాష్ట్రంలో సమస్యలేవీ లేనట్లు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో చాలా హాయిగా బ్రతుకుతున్నట్లు, రాష్ట్రంలో ప్రతిపక్షాల ప్రభావం అసలు ఏమిలేనట్లు, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా నమ్మడమే కాకుండా, తమ పార్టీ అధినేతకు కూడా చెప్పడం చూస్తే, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆయనే శల్యసారద్యం చేస్తున్నారని భావించవలసి ఉంటుంది. నిద్ర పోయే వారిని లేపోచ్చు కానీ, నిద్ర నటించే వారిని లేపడం ఎవరి తరం?

సివిల్స్ ప్రహసనంలో దాగిన డెవిల్స్!

 డా.ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       కుడుము చేతికిస్తే చాలు అదే పండగనుకొనేవాడు అల్పసంతోషి! ఆరంభశూరత్వానికి ఆంధ్రుడు ఎంతపేరు మోశాడో, అల్పసంతోషానికి కూడా అంతగా అలవాటు పడిపోయాడు. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఐ.ఎ.ఎస్. సిబ్బంది రిక్రూట్ మెంట్ కోసం అఖిలభారత స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ అవసరమైన ఉన్నతస్థాయి సబార్డినేట్ స్థాయి శాఖలకు నిర్వహించే పరీక్షలు రాయగోరే అభ్యర్థులకు ఇంగ్లీషు, హిందీ భాషలలోనే రాయాలన్న నిబంధనను "ప్రస్తుతానికి నిలుపు చేసినట్టు'' ఒక వార్త [16-03-2013] వెలువడింది. గడచిన నలభైఏళ్ళుగా ఈ 'రూలు'తోనే హిందీమినహా రాజ్యాంగం గుర్తించిన 8వ షెడ్యూల్ లోని 17 ప్రాంతీయభాషల అభ్యర్థుల నోళ్ళకు 'సీళ్ళు' వేసేశారు! భారతదేశంలోని చట్టాలముందు పౌరులంతా సమానులేననీ, ఈ చట్టాల కింద అందరికీ సరిసమాన రక్షణ ఉంటుందనీ, ప్రభుత్వ ఉద్యోగ సద్యోగాలలో సర్వులకూ సమానావకాశాలుంటాయనీ హామీపడిన రాజ్యాంగంలోని 14-16 అధికరణలకు విరుద్ధంగా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహణకు, ఉద్యోగాల్లో అభ్యర్థుల నియామకాలకు బాధ్యత వహించవలసిన స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (ఎస్.ఎస్.సి.) వ్యవహరిస్తూవచ్చింది. దీని పర్యవసానంగా దక్షిణాది రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర కేంద్ర-రాష్ట్ర సర్వీసులకు లక్షలసంఖలోనే ఉద్యోగార్హులుకాగల అవకాశమున్న యువకులు ప్రాంతీయ భాషలయిన మాతృభాషలకు దూరంకావలసివచ్చి ఉపాధి కోల్పోయారు!     40 ఏళ్ళుగా రాష్ట్రప్రభుత్వాలు స్థానిక భాషలలో కేంద్ర సర్వీసులకు పరీక్షలను (ప్రిలిమ్స్/మెయిన్) నిర్వహించే విషయాన్ని పట్టించుకోకుండా "గుడ్లు అప్పగించి'' చూస్తూ ఉన్నందున ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 2011 వరకూ సుమారు 4 లక్షలమంది యువకులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని అంచనా! ఇప్పటికైనా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పాక్షిక విధానాన్ని కేంద్రమూ, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ శాశ్వతంగా నిరోధించి, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషలలో కూడా సివిల్ సర్వీసు పరీక్షలను, ఇంటర్వ్యూలనూ, నియామకాలనూ నిర్వహించకపోతే జాతీయ సమైక్యతా భావనను సంరక్షించడం ఉత్తరోత్తరా సాధ్యపడకపోవచ్చు. ఈ మాట ఎందుకు అనవలసి వస్తోందంటే, దక్షిణాది రాష్ట్రాలు సహా కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు (బీహార్ వగైరా) కూడా ఎస్.ఎస్.సి. నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమించడంవల్ల 05-03-2013 నాటి సివిల్స్ నోటిఫికేషన్ ను తాత్కాలికంగా ("ప్రస్తుతానికి'') నిలిపి ఉంచారుగాని, దాని ఉపసంహరణ మాత్రం జరగలేదని గుర్తుంచుకోవాలి. ఆ నోటిఫికేషన్ ఉపసంహరణ జరిగి, యావద్భారతంలోనూ రాజ్యాంగం హామీపడిన ప్రాంతీయ భాషలలో కూడా యూనియన్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ లు నిర్వహించే పరీక్షలను రాయడానికి అభ్యర్థులకు అధికారికమైన ఏర్పాట్లు జరిగేదాకా యువకులు విశ్రమించరాదు. ఎందుకంటే, ఇప్పటికీ, నోటిఫికేషన్ కేవలం "తాత్కాలిక నిల్పివేత'' [నోటిఫికేషన్ పుటాన్ హోల్డ్] జరిగిన తరువాత కూడా "సామర్థ్యం'' పేరిట, "సంభాషణా నైపుణ్యా''ల పేరిట, "అవగాహనశక్తి'' పేరిట, "గ్రహ్యశక్తి''. "సంక్షిప్తీకరణ యోగ్యతా'' వగైరాల పేరిట ప్రాంతీయ భాషలను అవమానపరిచే ప్రయత్నం కొందరు ఉన్నతాధికారులు మానుకోలేకుండా ఉన్నారు! ఉదాహరణకు నోటిఫికేషన్ "తాత్కాలిక నిలుపుదల'' వార్త వచ్చిన మరునాడే [17-03-2013] యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ పూర్వాద్యక్షుడు అరుణ్ నిగావేకర్ ఓ విచిత్రమైన "కప్పదాటు'' ప్రకటనతో ముందుకొచ్చాడు. సర్వీస్ కమీషన్ పరీక్షలను, ఇంటర్వ్యూలనూ కేవలం ఇంగ్లీషు, హిందీ భాషలలో మాత్రమే నిర్వహించాలన్న నోటిఫికేషన్ జారీ చేయడానికి సిఫారసు చేసిన "నిపుణుల కమిటీకి'' ఇంతకుముందు సారథ్యం వహించిన వ్యక్తి ఈ నిగావేకరే! నిజానికి ఇతర ప్రాంతీయ భాషలలో పరీక్షలను, ఇంటర్వ్యూలను నిరోదిస్తున్న నిరంకుశ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈ - వేళ కాదు ఎనిమిదేళ్ళ క్రితమే క్రితమే [2004లో] సోదర ప్రముఖ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త సుభాష్ చంద్రన్, నేనూ ఆందోళన లేవనెత్తాం. సుభాష్ చంద్రన్ సర్వీస్ కమీషన్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ రాష్ట్ర హైకోర్టులో కీలకమైన రిట్ వేయగా [రిట్ నెం డబ్యు.పి.11000/2004] నేను దానికి దన్నుగా రచనాపరంగా ఆందోళన చేపట్టాను. రిట్ ను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కూ నోటీసులు జారీ చేయడమూ తరువాత పరీక్షలు, ఇంటర్వ్యూలను తెలుగు సహా దక్షిణాది ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలన్న కోర్కెలోని సామంజస్యాన్ని సమర్థించడమూ జరిగింది. దానితో చెన్నై కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలలో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూచే సర్వీస్ కమీషన్ సంచాలకుడు మన రాష్ట్ర హైకోర్టుకు లేఖరాస్తూ "పిటీషనర్ల డిమాండ్ మేరకు రాజ్యాంగం 8వ షెడ్యూల్ లో పేర్కొన్న ప్రాంతీయ భాషలలో దేనిలోనైనా సరే అభ్యర్థులు సమాధాన పత్రాలు రాయడానికి ప్రభుత్వం ఇప్పుడు సమ్మతించింద''ని తెలిపాడు!   అయినా సరే "కుక్కతోక వంకర'' అన్నట్టుగానే ప్రాంతీయ (మాతృ) భాషలలో సర్వీస్ కమీషన్ ప్రిలిమ్స్, మెయిన్ తుది పరీక్షలు రాయకుండా అభ్యర్థులను నిరోధిస్తూ సర్వీస్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ ఈసారి కూడా జారీ చేసిందంటే పాలనా నియంత్రణ వ్యవస్థ ఎలా పతనోన్ముఖంగా ప్రయాణిస్తోందో అర్థమవుతుంది. ఇంతకుముందొకసారి సుప్రీంకోర్టు సహితం [రాధేశ్యామ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు] ఇలాంటి నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమనీ, జోనల్ పద్ధతిపైన విడివిడిగా పరీక్షలు నిర్వహించడం "సమానత్వ సూత్రానికే విరుద్ధమ''నీ సర్వీస్ కమీషన్ లాంటి అఖిలభారత స్థాయి సంస్థలకు రిక్యూట్ మెంట్ పరీక్షలను ఏకకాలంలో దేశమంతటా ఒకేసారి నిర్వహించాలనీ ఆదేశించిందని మరవరాదు. కానీ నిగావేకర్ తన కమిటీ సిఫారసును పరోక్షంగా సమర్ధించుకోడానికి 'రూటు'మార్చి ఒక ప్రకటనలో "ఫలానా భాషలోనే సివిల్స్ పరీక్షలను నిర్వహించాలని కమిటీ నొక్కి చెప్పలేద''ని అంటూనే మరొక మెలిక పెట్టాడు : "అభ్యర్థులు సంభాషణా సామర్థ్యాల్ని (కమ్యూనికేషన్ స్కిల్స్) పరీక్షించి మరీ నిర్ణయం చేయాల''ని మాత్రమే కమిటీ కోరిందని చెప్పాడు! కాని ఆ వెంటనే మరొక ఉన్నతాధికారేమో "కమిటీ పరిశీలనకు నివేదించిన అంశాలలో భాషా సమస్యే లేద''ని 'కథ' వినిపించడానికి ప్రయత్నించాడు! అయినప్పుడు మెడమీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడికీ వెంటనే స్ఫురించే ప్రశ్న : "అయితే మరి ఇంతకూ ప్రాంతీయ భాషలలో పరీక్షలను అడ్డుకుని సివిల్స్ ను కేవలం ఇంగ్లీషు, హిందీ భాషలలో మాత్రమే రాయాలన్న నిబంధనను చేర్చిందెవరు? లేదా 'రూల్స్'ను మార్చిందెవరు?'' అని! దేశ స్వాతంత్ర్యం అప్పనంగా అర్థరాత్రి పూట చేతికి బదిలీ అయినట్టే, పాలకులు, అధికారగణం బుద్ధులు కూడా వలసపాలనా వశేషంగా అప్పనంగా సంక్రమించాయి! దాని ఫలితమే నేటి సర్వవ్యాపిత సంక్షోభంలో భాగంగా "చుట్టుచూపు లేని'' విద్యలు, విద్యావిదానాలూ ఏలినాటి శనిగా, ఎలేనాటి శనిగా పీడించడం! సివిల్స్ పరీక్షల నోటిఫికేషన్ తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశారనడానికి మరొక ఉదాహరణ - ఆ యు.జి.సి. మాజీ చైర్మన్ నిగావేకర్ "ప్రపంచీకరణ'' నేపథ్యంలో మాట్లాడుతూ "21వ శతాబ్దపు సివిల్ సర్వెంటు (ఉన్నతాధికారి, అంటే ఇంగ్లీషు చదవరి) వర్తమాన ప్రపంచంనుంచి ఎదురయ్యే అనేక రకాల సవాళ్ళను ఎదుర్కోవడానికి తగిన లక్షణాలు, అర్హతలూ కలిగి ఉండాల''ని ఒక షరతును ముందుకు నెట్టడం! అంటే, మరొక మాటలో, మాతృభాష లేదా 'ప్రాంతీయ భాష నీకు బువ్వపెట్టదు, ఉద్యోగమివ్వదు, కాబట్టి ఇంగ్లీషో, హిందీయో రాకపోతే అసలు నీకు బతుకే లేదు' పొమ్మని చెప్పడమే!   నిజానికి, ఏ సమాచార సాంకేతిక వ్యవస్థ ఆధారంగా ఐ.టి.రంగం దండిగా బువ్వపెడుతుందని, రెండు చేతులూ రెండు జేబులూ కాసులు నింపుతుందని భ్రమింపజేసి అమెరికా పాలకులు తమ బాడుగుపనులను (ప్రోగ్రామింగ్ వగైరా) మనకు అప్పగించారో ఆ పనులను కాస్తా అమెరికాలో తామెదుర్కొంటున్నతీవ్ర నిరుద్యోగ పరిష్కారంలో భాగంగా రేపో మాపో నిలిపివేయక తప్పదని ప్రెసిడెంట్ ఒబామా యిప్పటికీ పదే పదే బెదిరిస్తున్నాడు! పైగా శృతిమించిన ఐ.టి. మోజులో పడిపోయిన మన పాలకులు, బ్యూరోక్రాట్లు దేశంలో భారీ ఎత్తున కోట్లాదిమందికి ఉపాధిని కల్పించగల వ్యవసాయక, వస్తూత్పత్తి (మాన్యుఫాక్చరింగ్), లఘుపరిశ్రమల రంగాలను 'మాడ' బెట్టారు! ఇప్పుడు మన దేశ పరిస్థితి - "తల్లినీతండ్రినీ చంపి వచ్చి అయ్యా నేను తల్లీతండ్రీ లేనివాడిని, ఆదుకోండ''ని మొట్టుకున్నట్టు అయింది! స్థానిక పాలనా సంస్థలు, గ్రామస్థాయి వరకూ సామాన్య ప్రజల అవసరాలు, వారి అవసరాలను గురించి తెలుసుకోడానికి ఉపయోగించాల్సిన సంభాషణా మాధ్యమం ఏది, ప్రజాసమస్యల పరిష్కారంలో ఏ భాషా మాధ్యమం ద్వారా ప్రజాబాహుళ్యాన్ని సమీకరించాలన్న ప్రశ్నలే, ఆచార్య నిగావేకర్ లాంటి "వేతనకర్మ''లకు అనవసరం!   పైగా "నేడు వీస్తున్న పరివర్తనా వాయువులకు అనుగుణంగా'', అంటే, "ప్రపంచభాష అయిన ఇంగ్లీషు భాషకు కిటికీలను బాహాటంగా తెరిచి ఉంచాల''నీ, నేడు "ప్రపంచ సరిహద్దులు చెరిగిపోయి, ఇంగ్లీషే చలామణీలో ఉన్న ఈనాటి కరెన్సీ'' అనీ, అదే వెలుగూ, జిలుగూ, అదే కాంతీ, అదే ధ్వనీ (లైట్ అండ్ సౌండ్) అనీ నిగావేకర్ పూనకం పూనారు! ఈ సందర్భంగా ఆయన మరొక అబద్ధాన్ని కూడా వ్యాపింప చేయడానికి వెనుకాడలేదు: "అన్ని వైపులనుంచి శుభ్రపవనాలను-ఆరోగ్యకర గాలుల్ని-వీచనివ్వండి'' అని గాంధీజీ మతమౌఢ్యంతో తీసుకుంటున్నవారికి హెచ్చరికగా వాడిన మాటల్ని వక్రీకరించుతూ "గాంధీజీ కోరుకున్నది ఈ మార్పునే''నని భాషాపరంగా వర్తింప చేయడానికి నిగావేకర్ ప్రయత్నించాడు! కాని, ఇంగ్లీషు భాషా బోధనా గురించి, మాతృభాషలను పణంగా పెట్టి దానిని పెంచాలన్న దేశీయ ఆంగ్ల విద్యాధికుల ప్రయత్నాలను గాంధీజీ వ్యతిరేకిస్తూ ఎలా హెచ్చరించవలసి వచ్చిందో ఈ క్రింది గాంధీజీ మాటల్లోనే నిగావేకర్ వినడం మంచిది:   "భారతీయ విద్యార్థులు ఒక విదేశీభాషను (ఇంగ్లీషును) పాఠశాల తరగతుల్లో నేర్చుకోడానికి వారానికి ఏడుగంటల శ్రమను వృధా చేసుకుంటున్నారు. ఈ దేశానాయకులు పవిత్రమైన ప్రజల విశ్వాసాన్ని కాస్తా వమ్ము చేస్తున్నారు. ఒక భాషగా నేర్చుకోడానికి ఇంగ్లీషు పట్ల నాకు వ్యతిరేకత లేదు. కానీ దేశీయ మాతృభాషలను చంపి వాటి సమాధిపైన ఇంగ్లీషుభాషను మీరు రుద్ద దలిచితే 'స్వదీషీ'భావాన్ని మీరు సరైన అర్థంలో అనుసరించడం లేదని నేను స్పష్టం చేయదలచాను. ఏ దేశమూ తన సొంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేదు. వీరికి ఎంతసేపూ ఇంగ్లీషు విద్యావ్యాప్తిని గురించిన గొడవే. కాని మనం అసలు సమస్యను మరచిపోరాదు - గత అనేక దశాబ్దాల కొలదీ మన తల్లిభాషలోనే మనం విద్య పొందుతూ [ఇంగ్లీషు ఒక భాషగా నేర్చుకోడానికి అవకాశం కల్పిస్తూనే] వస్తున్నామే అనుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? మనకీపాటికే స్వేచ్చాభారతం ఏర్పడి, మన సొంత విద్యావంతులు మనకు తయారై ఉండేవారు. అప్పుడు తమ సొంత నేలపైన తామే విదేశీయులుగా గడపాల్సిన పని మనకి ఉండేది కాదు; అలా సొంత భాషను గుండెగొంతుకలో పలికించడం ద్వారా నిరుపేదల మధ్యకు చొరబడి బాగా పనిచేయగలిగి ఉండేవారు.   ఆ అనుభవం జాతి భద్రపరచుకోదగిన వారసత్వ సంపదై ఉండేది. కాని ఈ రోజున మనం పరాయిభాషకు అలవాటు పడినందున, మన మంచి భావాలను చివరికి మన భార్యలు కూడా పంచుకోగల స్థితిలో లేరు! అంతేగాదు, మన విద్యాధిక వర్గమంతా విదేశీ (ఇంగ్లీషు) భాష ద్వారానే విద్యావంతులయినందున దేశ ప్రజాబాహుళ్యం సమస్యలపైనగాని, వారి కోర్కెల గురించిగానీ మనలో స్పందన లేకుండా పోయింది. ఎందుకని? మన ప్రజాబాహుళ్యం ఇంగ్లీషు ఆఫీసర్లను గుర్తించిన దానికన్నా మించి మనల్ని గుర్తించడంలేదు గనుక ఫలితం? అటు ఇంగ్లీషు నేర్చిన అధికారులతోనూ, ఇటు మనతోనూ కూడా ప్రజలు మనసువిప్పి మాట్లాడలేకపోతున్నారు. కనుకనే ప్రజల అవసరాలు, కోరికలు మనవి కాకుండా పోయాయి. అన్ని రకాల విజ్ఞాన శాఖలలోనూ మాతృభాషలోనే బోధనా జరిగి ఉంటే ఈ సరికి ఆ శాఖలన్నీ అద్భుతంగా పరిపుష్టమై ఉండేవి. ఆ పనే జరిగి ఉంటే, గ్రామ పంచాయితీలు తమ ప్రత్యేక పద్ధతుల్లో నేడు సజీవశక్తులుగా మనగల్గుతూ ఉండేవి; అదే జరిగి ఉంటే, భారతదేశం స్థానిక అవసరాలకు తగినట్టుగా స్వపరిపాలనా దిశలో, సౌభాగ్యదశలో ఉండేది; అదే జరిగి ఉంటే, తన పవిత్ర భూమిపైన పనిగట్టుకుని మాతృభాషల హత్య అనే అవమానకరమైన దృశ్యాన్ని చూడకుండా దేశప్రజలు తప్పించుకొగలిగేవారు. నాకు ఇంగ్లీషుపైన ద్వేషంలేదు. కాని నాబాధల్లా మాతృభాషల స్థానాన్ని తాను ఎన్నటికీ పొందలేని ఇంగ్లీషుకు అవసరాలకు మించిన ప్రాధాన్యం యివ్వడానికి చేసే ప్రయత్నం గురించే. మాతృభాషలను విస్మరించితే దేశాన్ని భాషా దారిద్ర్యం ఏలడం ఖాయం!''   అంతేగాదు, నిగావేకర్ మరొక అబద్ధాన్ని కూడా ప్రచారంలో పెట్టడానికి సాహసిస్తున్నాడు : "ఒక దశాబ్దం కిందటి దాకా చైనా, జపాన్ లు కూడా ఇంగ్లీషుపైన కేంద్రీకరించకుండానే అభివృద్ధిని సాధించాయ''ని ఒప్పుకుంటూనే ఆయన "ప్రపంచపోటీని తట్టుకోడానికి'' ఇంగ్లీషు భాషను ఒక సాధనంగా గుర్తిస్తున్నాయ''ని ఒక 'టూమ్రీ' వదిలాడు! కాని ఈ రోజుకీ ఆ రెండు దేశాలూ ఇంగ్లీషును కేవలం వాణిజ్యభాషగానే వినియోగించుకుంటున్నాయనిగాని పాఠశాల దశలనుంచి పట్టభద్ర, పట్టభద్రానంతర దశలవరకూ చైనీస్, జాపనీస్ భాషలలోనే విద్యాబోధ జరుగుతోందని ఈ పెద్దమనిషి మరచిపోకూడదు. రేపో మాపో చైనా, ప్రపంచంలోకెల్లా ఆర్థికరంగంలో ఇప్పటికి ప్రథమస్థానంలో అగ్రేసరశక్తిగా ఉన్న అమెరికాను తోసిరాజనబోతోందని అమెరికన్ ఆర్థిక నిపుణులు, అమెరికా, బ్రిటన్, జర్మనీ పాలకులే ప్రకటిస్తున్నారు. అందుకు తగినట్టుగానే రేపటి వాణిజ్యభాషగా చైనీస్ భాష దూసుకు వస్తున్నందున, ఈ మూడు అగ్రరాజ్యాలూ తమ దేశాలలో వందలాదిగా చైనీస్ భాషాధ్యయన పాఠశాలలు ఎందుకు తెరవవలసి వచ్చిందో నిగావేకర్ వివరిస్తే బావుంటుంది!  దూసుకువస్తున్న రేపటి చైనీస్ భాషను కూడా ఇంగ్లీషులాంటి వాణిజ్య భాష మాత్రమే కాగల్గుతుందిగాని దేశీయ మాతృభాషల స్థానాన్ని తోసిపుచ్చజాలదు!   అంతేగాదు, ఇంగ్లీషుభాష మాత్రమే ఉపాధి అవకాశాలు పెంచగలదన్న భ్రమలో పడిన నిగావేకర్ లాంటి విద్యాధికులు అమెరికా, బ్రిటన్ లాంటి "అభివృద్ధి'' చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో అక్కడి పాలనా, బోధనా భాషగా శతాబ్దాల తరబడిగా ఉన్న ఇంగ్లీషు, ఆ దేశాలలో రోజుకొక తీరుగా రెండు అంకెల జోడుగుర్రాలపైన పరుగెత్తుతున్న నిరుద్యోగ సమస్యను (10 నుంచి 11 శాతం దాకా) ఎందుకు పరిష్కరించలేక పోతున్నాయో కూడా నిగావేకర్ సమాధానం చెప్పగలగాలి; పెట్టుబదీదారీ విధానాలవల్ల ముమ్మరించి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆ దేశాల ఆర్థిక సంక్షోభంలో పెట్టుబడి వ్యవస్థకు మూలవిరాట్టుగా ఉన్న వాల్ స్ట్రీట్ గుత్తవ్యాపార వానిజ్యపు ఆయువుపట్టును నొక్కడానికి "ఆక్యుపై ది సిస్టమ్'' అన్న (వ్యవస్థా మార్పుకోసం ఆక్రమణోద్యమం) నినాదంతో విద్యాధికులయిన నిరుద్యోగాలు ఎందుకు ప్రయత్నించవలసి వచ్చిందో నిగావేకర్ సమాధానం చెప్పగలగాలి! కాని అమెరికా ఆర్థిక విశ్లేషకులలో ప్రసిద్దుడయిన ప్రొఫెసర్ మైఖేల్ యేట్స్ తాజా అంచనాల ప్రకారం, 2009-2011 మధ్యకాలంలో అమెరికా జాతీయోద్యమంలో 88 శాతం కార్పోరేట్ గుత్తసంస్థల లాభాల కింద స్వాహా అయింది; కాగా కేవలం 1 శాతం ఆదాయం మాత్రమే ఉద్యోగవర్గాల వేతనం కింద జమ అయింది! వ్యక్తిగత ఆదాయాల్లో మొత్తం ఆదాయ పెరుగుదలలో 93 శాతం ఆదాయం జనాభాలో కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్న అమెరికన్ల హక్కుభుక్తమై పోయింది! అమెరికా విధాన నిర్ణయాలలో కీలకపాత్ర వహించే అమెరికన్ గూఢచారి సంస్థ (సి.ఐ.ఎ) నిర్వహిస్తున్న "వరల్డ్ ఫేస్ బుక్'' అంచనా ప్రకారం నేడు ఇంగ్లీషు ప్రపంచభాషా కేంద్రంలో ఒకటైన అమెరికాలో ప్రబలిపోయిన ఆర్థిక అసమానతలు ఏస్థాయికి వెళ్ళాయంటే చిన్నదేశాలయిన ఐవరీకోస్టు, కామెరూన్ దేశాలకన్నా అమెరికాను వెనకపడేశాయి, ఇక అసమానతలలో ఉగాండాకన్నా అమెరికా ఓ మెట్టు కొంచెం పైస్థాయిలో మాత్రమే ఉంది! ఇక ఇంగ్లీషుకు శిష్టాది గురువుగా భావించుకుంటున్న అదే అమెరికాలో 2001 తర్వాత ఈరోజు దాకా మొత్తం ఉద్యోగాల సంఖ్యా పెరగనేలేదు. 16-50 సంవత్సరాల మధ్య వయస్సుగల ప్రతి ఒక్క వయోవిభాగంలోనూ ఉపాధి పొందినవారి సంఖ్య "సముద్రంలో నీటిబొట్టు''తో సమానమని నిపుణుల అంచనా! విచిత్రమేమంటే, ఈ ఆంగ్లభాషా కేంద్రం (అమెరికా)లో కార్పోరేట్ రంగం చెల్లించవలసిన పెన్షన్ ల విషయంలో అనుసరిస్తున్న దోపిడీ పద్ధతుల మూలంగా వృద్ధాప్యంలో ఉన్న కార్మికులు మాత్రమే ఎక్కువ శ్రమించవలసి రావటం! ఇక 16-29 సంవత్సరాల మధ్యవయస్సులో ఉన్న యువతకు ఉపాధి బాగా దూరమైపోయింది! కళాశాలల నుంచి వచ్చే పట్టబద్రులలో మెజారిటీ నిరుద్యోగులుగా ఉండిపోవలసివస్తోంది, లేదా డిగ్రీ అవసరంలేని పనులకయినా ఎగబడాల్సి వస్తోందని అంచనా! [2011 డిసెంబర్ 15: అసోసియేటెడ్ ప్రెస్]! ఆంగ్లభాషా కేంద్రమైన అదే అమెరికాలో కళాశాలల పట్టభద్రులు అసంఖ్యాకంగా ఉపాధి దొరకక తిరిగి ఇళ్ళదారి పడుతూండటం మరొక విశేషం! అతి చిన్న దేశాలయినా, అమెరికానుంచి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను 50 ఏళ్ళకుపైగా ఎదుర్కొంటున్న క్యూబా, వెనిజులాల్లో విద్య, వైద్య, ఉపాధిరంగాలను ఎంతటి సామర్థ్యంతో నిర్వహించుకుంటూ ప్రపంచప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారో మన పాలకులు, బ్యూరోక్రాట్లూ తెలుసుకోవటం శ్రేయస్కరం! తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుడుతూనే ఉందట, తెలుకొండిలాంటి నిరంకుశాధికారవర్గం కనుసన్నల్లో జరిగే తంతు కూడా అంతే! నోటిఫికేషన్ "నిలుపుదల'' ఉపసంహరణ కాదు, స్పష్టమైన జీ.వో. విడుదలయ్యేదాకా అల్పసంతోషం అల్పాయుర్థాయం లాంటిది! ఇంతవరకూ కేంద్రప్రభుత్వంగాని యు.పి.ఎస్.సి.గానీ జీ.వో. విడుదల చేసినట్టు వార్తలేదు, నోటి ప్రకటనలు తప్ప!    

బోస్టన్ పేలుళ్ళ కు పాల్పడిన వ్యక్తి కాల్చివేత

        అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్ళకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చివేశారు. అంతకు ముందు ఇద్దరు వ్యక్తులు 'మిట్' క్యాంపస్ లో భద్రతా సిబ్బంది పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భద్రతాదళసిబ్బంది ఒకరు చనిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల కోసం వేట ప్రారంభించారు. దుండగులపై పోలీసులు కాల్పుల్లో ఒకరు చనిపోగా మరో వ్యక్తి పారిపోయాడు. కాల్పుల్లో హతమైన వ్యక్తిని బోస్టన్ మారథాన్ లో బాంబు పేలుళ్ళకు పలుపడిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. బోస్టన్ బాంబు పేలుళ్ళకు సంబంధించి ఎఫ్.బి.ఐ అధికారులు ఇద్దరు అనుమానితుల ఛాయాచిత్రాలను విడుదల చేశారు. సీసీటీవీ కెమెరాల విడియో ఆధారంగా వీరిని అధికారులు గుర్తించారు.

డీకే అరుణ కలియుగ తాటకి

      పాలమూరు జిల్లాలో మంత్రి అరుణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య మాటల యుద్దం ముదిరి పాకాన పడింది. తనపై డికె అరుణ చేసిన వ్యాఖ్యలపై జూపల్లి ధీటుగా సమాధానం ఇచ్చారు. చీర, గాజులు నీ భర్త భరత్ సింహారెడ్డికి ఇవ్వాలని సూచించారు. నీవు కలియుగ తాటకివి అని, దమ్ముంటే రాజీనామా చేసి ఒక్క ఓటుతో గెలిచినా నేను రాజకీయ సన్యాసం చేస్తానని జూపల్లి సవాల్ విసిరారు. తెలంగాణ వాదాన్ని అణచేందుకు ముఖ్యమంత్రి ఆడించినట్లు ఆడుతుందని, సోదరిలా భావించి ఊరుకుంటే బజారున పడి బజారు మాటలు మాట్లాడుతుందని, హోంమంత్రి పదవి కోసమే ఆమె ఆరాటం అని అన్నారు. జడ్పీటీసీగా గెలిపించి అరుణకు రాజకీయ భిక్ష పెడితే అధికారం ఉందని ఎగిరిపడుతుందని, పోలీసుల బలం చూసుకుని మాట్లాడుతుందని విమర్శించారు. అరుణ జీవితం దందాల మయం అని, నాకు దమ్ముంది కాబట్టే పోలీసుల భద్రతలేకుండా తిరుగుతున్నానని, గద్వాలలో పాదయాత్ర చేశానని, అరుణ అహంకారం చూసి అక్కడ జనం బ్రహ్మరథం పట్టారని అన్నారు. నన్ను పిల్లి అని అరుణమ్మ అందని, అవును నేను పిల్లినే అందుకే ప్రజల చుట్టూ తిరుగుతున్నాను. మీలాగ రక్త మాంసాలు తినే పులిని, తోడేలును కాదు అని జూపల్లి అన్నారు.

వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

        శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి ఆలయంలోని మిథిలాస్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శుక్రవారం ఉదయం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా స్టేడియంకు తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.అనంతరం అభిజిత్ లఘ్యాన వేదపండింతులు మాంగల్య ధారణ చేశారు. అంతకు ముందు టీటీడీ తరపున చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకై రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భద్రాద్రికి పోటెత్తారు. సీతారాముల కల్యాణానికి కేంద్ర మంత్రి బలరాంనాయ్, మంత్రులు సి.రామచంద్రయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. ప్రముఖుల రాకతో భద్రాద్రిలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

హైదరాబాదులో నెలరోజుల-భార్యలతో అరబ్బుల వ్యభిచారం

  కొన్ని సం.ల క్రితం హైదరాబాద్ జంటనగరాలలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న నిరుపేద ముస్లిం తల్లితండ్రులు డబ్బుకు ఆశపడి తమ కుమార్తెలను అరబ్ షేకుల ఇచ్చి బలవంతపు పెళ్ళిళ్ళు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి ఇంకా అడ్డుకట్ట పడిందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు కొత్తగా ‘నెల రోజుల కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు’ పేరిట అరబ్ షేకులకు తమ కుమార్తెలను ఇచ్చి బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.   ఇస్లాం మతంలో వ్యభిచారం నేరం కనుక, అరబ్ షేకులు దానికి పరిష్కార మార్గంగా ఈ నెల రోజుల ఉత్తుత్తి పెళ్ళిళ్ళు పేరుతో తమ కామదాహం తీర్చుకొని గడువు పూర్తయిన తరువాత ఆ బాలికలకు మతాచారం ప్రకారం ‘తలాక్’ చెప్పేసి విమానం ఎక్కేస్తున్నారు. కానీ, వ్యభిచారం నేరమని భావించేవారు అదే పనిని మరో పద్దతిలో చేయడం, అందుకు నీతి నియమాలు పక్కన పెట్టడం ఏవిధంగా సమర్ధనీయం?  హైదరాబాద్ జంట నగరాలలో ఇటువంటి వ్యవహారాలూ గత కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్నట్లు సమాచారం.   అటువంటి బలవంతపు వ్యభిచారం నుండి తప్పించుకొన్న 17 ఏళ్ల నౌషీన్ తోబస్సుం అనే బాలికను హైదరాబాద్ మోఘల్పురా పోలీసులు రక్షించడంతో ఈ కాంట్రాక్ట్-పెళ్ళిళ్ళ పేరిట సాగుతున్నవ్యభిచార వ్యవహారం వెలుగులోకి వచ్చింది.   ఆమెను సూడాన్ దేశానికి చెందిన ఉసామా ఇబ్రహీం మొహమ్మద్ (44) అనే వ్యక్తికిచ్చి ఆమె తల్లి తండ్రులు ఇటీవలే ‘నెలరోజుల కాంట్రాక్ట్ పెళ్లి’ చేసారు. అందుకు ప్రతిఫలంగా అతను లక్ష రూపాయలు ఇవ్వగా, దానిలో ఆ బాలిక బంధువు ముంతాజ్ బేగం రూ.70,౦౦౦ బాలిక తల్లితండ్రులకిచ్చి, మిగిలిన దానిలో రూ.5,౦౦౦ పెళ్ళికి ‘తలాక్ నమాతో కూడిన అగ్రిమెంటు’ పేపరు తయారు చేసిన ఖాజీకి రూ 5,౦౦౦, ఆ అగ్రిమెంటు పేపర్లను ఉర్దూ బాషలో అనువాదo చేసిన వ్యక్తికి రూ. 5,౦౦౦ ఇచ్చి, మిగిలినది తానూ ఉంచుకొన్నట్లు ఆమె తెలియజేసింది.   ఆమెతో కలిసి సుడాన్ వ్యక్తి బసచేసిన హోటల్ కి వెళ్ళిన తోబసం అతను బలవంతం చేయబోతే తప్పించుకొని ఇంటికి పారిపోయి వచ్చేసింది. కానీ, అతను కూడా ఆమెను వెంబడిస్తూ ఇంటికి రావడంతో, ఆమె తల్లితండ్రులు తమ కుమార్తెకు నచ్చజెప్పి త్వరలో అతని వద్దకు పంపుతామని హామీ ఇచ్చి పంపేసారు. తన కన్నతల్లితండ్రులే తనకు రక్షణ కల్పించకపోగా అతనికి అప్పజెప్పే ప్రయత్నం చేయడంతో, తోబసుం వారి నుండి తప్పించుకొని పోలీసుల ఆశ్రయంలో జేరడంతో ఈ వ్యవహారం అంతా బయట పడింది.   ఈ నెల రోజుల పెళ్లిళ్లకు వ్యతిరేఖంగా చాలా కాలంగా పోరాడుతున్న హైదరాబాదు మహిళా మరియు శిశు సంక్షేమ సంఘానికి చెందిన షిరాజ్ ఆమినా ఖాన్ కూడా ఒక్క హైదరాబాద్ జంట నగరాలోనే ఇటువంటి నెలరోజుల కాంట్రాక్ట్ పెళ్లి-వ్యభిచార వ్యవహారాలూ నెలకి కనీసం 15 వరకు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతీనెలా హైదరాబాద్ జంట నగరాలోనే ఇటువంటివి చాలా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విజయ్ కుమార్ అనే స్థానిక పోలీసు అధికారి కూడా చెప్పడం విశేషం. ఇక దేశం మొత్తం మీద ఇంకెన్ని జరుగుతున్నాయో లెక్క లేదు, ఎవరికీ తెలియదు.   ఈ వ్యవహారంలో కొందరు దురాశాపరులయిన ఖాజీలు, బ్రోకర్లు చేతులు కలిపి పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. గల్ఫ్ దేశాలలో కన్యా శుల్కం పద్దతి అమలులో ఉన్నందున అక్కడ అబ్బాయిలకు వధువులు దొరకక పెళ్ళిళ్ళు కాకపోవడం దీనికి ఒక కారణం అయితే, పెళ్ళిళ్ళు అయినప్పటికీ, ధనవంతులయిన అరబ్ షేకులు తమ కామవాంఛలు తీర్చుకోవడానికి భారత్, పాక్ వంటి దేశాలలో పేదరికంలో మగ్గుతున్న ముస్లిం సమాజంపై కన్నేశారు.   ఈ వ్యవహారంలో అన్నెం పున్నెం ఎరుగని నిరుపేద ముస్లిం చిన్నారులు బలయిపోతుంటే, సమజానికి సరయిన మార్గ దర్శనం చేయవలసిన కొందరు ఖాజీలే ఆ పాపానికి ఒడిగట్టడం చాలా దారుణం. ఇక మరో దయనీయమయిన విషయం ఏమిటంటే, నెలరోజుల తరువాత తలాక్ ఇవ్వబడిన బాలిక కష్టాలు దానితో తీరకపోగా, అప్పటి నుండే నిజమయిన కష్టాలు మొదలవుతాయి. నెలరోజుల పెళ్లి పేరిట వ్యభిచార కూపంలోకి నెట్టబడిన ఆ బాలికల పేర్లు బ్రోకర్స్ లిస్టులో చేరిపోవడంతో నాటి నుండి ఆమె ఇటువంటి కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు చాలానే చేసుకోవలసి వస్తుంది.   మరో దయనీయమయిన విషయం ఏమిటంటే, ఆవిధంగా సంపాదించిన డబ్బుతో ఆమె తన కుటుంబ అవసరాలు ఒక పక్క తీర్చుతూనే, ఆ తరువాత కాలంలో ఎప్పుడయినా సాద్యపడితే తన ‘నిజమయిన పెళ్లికోసం’ కూడా ఆమె డబ్బు కూడబెట్టుకోవలసిఉంటుందని ఆ బాలిక పోలీసులకి తెలిపింది. హృదయ విదారకమయిన ఇటువంటి వ్యవహారాలను చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాలి.   యావత్ ముస్లిం సమాజానికి తామే ప్రాతినిద్యం వహిస్తున్నామనే కొందరు నేతలు ఇటువంటి వాటిని అరికట్టడానికి ఏమి చేసారని ప్రశ్నించాల్సిన ఆవసరం ఉంది. ఈ ఊబిలో చిక్కుకొన్న, చిక్కుకొంటున్న అనేక మంది అభం శుభం తెలియని చిన్నారులను, బాలికలను కాపాడేందుకు వారేమి ప్రయత్నాలు చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాల్సి ఉంది.

బ్రాహ్మణుల కోసం 500కోట్లు

        మొన్న కాపు ఓటర్లకు వరాలు కురిపించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు బ్రాహ్మణులకు కూడా వరాలిచ్చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు ఉచితంగా విద్యా సదుపాయం కల్పిస్తామని, దానికి బడ్జెట్‌లో రూ.500కోట్లు కేటాయి స్తామని చంద్ర బాబు హామీ ఇచ్చారు. పేద బ్రాహ్మ ణులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక కార్యా చరణను తయారు చేసి అండగా ఉంటా మన్నారు. వృద్ధ బ్రాహ్మణులకు రూ.600ల పెన్షన్‌ ఇస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు కనీసం బంగారు తాళిబొట్లు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు, తీసుకున్న రుణాలు మాఫీ చేసి వారిని ఆదుకుంటామన్నారు.

తెలంగాణ కోసం యువకుడు బలిదానం

      తెలంగాణ కోసం మరో యువకుడు ప్రాణాలర్పించాడు. ప్రత్యేక రాష్ట్రం రావాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, బీజేపీతోనే తెలంగాణ సాధ్యమని లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేత విద్యాసాగర్ రావును గెలిపించాలని సూసైడ్ నోట్‌లో కోరాడు. తెలంగాణ కోసం తన చావే చివరిది కావాలని అందులో పేర్కొన్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన పెరుమాండ్ల నరేష్ బీజెవైఎం మండల ఉపాధ్యక్షుడు. బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి, రాత్రివరకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అర్ధరాత్రి వెతకగా పొలం వద్ద పురుగుల మందు డబ్బా కనిపించింది. ఆ పక్కనే నరేష్ పడి ఉండడం గమనించిన అతని తండ్రి నారాయణ 108కు సమాచారాన్ని అందించాడు. 108 సిబ్బంది వచ్చి నరేష్ మరణించినట్లు తెలిపారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొన్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణను ఇస్తుందని, బీజెపీని ప్రజలు గెలిపించాలని ఆ లేఖలో రాశాడు.

బయ్యారం గనుల కేటాయింపుపై టి.ఆర్.ఎస్. గరం గరం

  బయ్యారం గనులలోని ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టి.ఆర్.ఎస్. నేతలు హరీష్ రావు, టి.ఆర్.ఎస్.ఎల్పీ నేత ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సబ్యుడు వి.హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విభేదించగా లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ స్వాగతిస్తున్నారు. గనుల కేటాయింపుపై మాట్లాడుతూ హరీష్ రావు ... విశాఖ స్టీల్స్ కు తెలంగాణాలోని గనులు అప్పగిస్తే తెలంగాణాకు ఎలాంటి లాభం చేకూరుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని , తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే బొకారో స్టీల్ ఫ్యాక్టరీ లాంటి భారీ ఫ్యాక్టరీ బయ్యారంలో స్థాపించి లక్షలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎంతమంది తెలంగాణా యువతకు ఉద్యోగాలు కల్పించారో స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. టి.ఆర్.ఎస్. ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణాలోని సహజ వనరులను తాతజాగీరులా సీమాంధ్రకు కట్టబెడితే ఖబడ్దార్ అని ఘాటుగా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.  బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు అని ఖమ్మం జిల్లాలోని ఖనిజాన్ని ఇక్కడే వినియోగించుకునేందుకు వీలుగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బయ్యారం, తెలంగాణాలోని బాగా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడే ఉక్కుపరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పాలని, దీనిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సిఎంకు లేఖ రాశారు. బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే సరిపోదని, దాని ద్వారా ఖమ్మంలో పూర్తీస్థాయి స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వం ఆలస్యంగానైనా బయ్యారం సహా 5342 హెక్టార్ల ఇనుపగనులను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు

యూనిట్ కు 70 పైసలు పెరగనున్న విద్యుత్ ఛార్జీలు

  విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనలు, నిరాహార దీక్షలు, బంద్ లతో కాస్త వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి యూనిట్ కు 70 పైసలు చొప్పున వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈ.ఆర్.సి.) ప్రస్తుత చైర్మన్ రఘోత్తమరావు ఈ నెల 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగానే విద్యుత్ ఛార్జీల పెంపు తీర్పు రాబోతోంది. సర్ ఛార్జీ (ఎఫ్.ఎన్.ఏ.) పేరిట ఈ.ఆర్.సి. 2012-2013 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో అక్టోబరు, నవంబరు, డిసెంబరు(త్రైమాసికం)లో వాడిన విద్యుత్ కు ఒక్కొక్క యూనిట్ కు 70 పైసలు వసూలు చేయాలని నిర్ణయించింది. మొత్తం 850కోట్ల రూపాయలు సర్ ఛార్జీని ఈ.ఆర్.సి. విధించాబోతోంది. డిస్కంలు 1098కోట్ల రూపాయల ఇంధన సర్ ఛార్జీ వసూలుకు అనుమతి కోరాయి. దీని వసూలు జూన్ నెల బిల్లు నుంచి ఆగస్టు బిల్లు వరకు ఉంటుందని ఈ.ఆర్.సి. వసూలు చేసేందుకు సిద్ధమైంది.

పాక్ బోనులో చిక్కుకొన్న ముషారఫ్

  నాలుగేళ్ళ క్రితం దేశం విడిచి దుబాయ్ పారిపోయిన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తనపై కోర్టుల్లో అనేక కేసులున్నాయని తెలిసికూడా ఆ దేశంలో వచ్చేనెలలో జరగనున్నసాధారణ ఎన్నికలలో పాల్గొనేందుకు కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ తిరిగి వచ్చారు. ఆయన దేశంలో అడుగుపెడితే చంపకుండా వదిలిపెట్టమని తాలిబాన్ ఉగ్రవాదులు తీవ్రహెచ్చరికలు జారీ చేశారు.   కానీ, అల్లకల్లోలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, దైర్యం చేసి వచ్చి ఎన్నికలలో పోటీ చేస్తే అవలీలగా విజయం సాదించి తిరిగి పాకిస్తాన్ దేశాధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నట్లు భావించిన ముషారఫ్ దేశం కోసం అవసరమయితే ప్రాణ త్యాగాలకి కూడా వెనకాడనని భారీ డైలాగులు చెపుతూ బోనులోకి పులి ప్రవేశించినట్లు తిరిగి పాకిస్తాన్ లోకి అడుగుపెట్టారు.   ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశంలో న్యాయ వ్యవస్థపట్ల కనీస మర్యాద, గౌరవం చూపకపోగా, 2007 ఎమర్జన్సీ సమయంలో ఒకేసారి 60 మంది జడ్జీలను ఉద్యోగాల నుండి తొలగించడమే కాకుండా వారిలో చాలా మందిని ఆయన జైళ్ళలో నిర్బంధించారు కూడా. అందువల్ల అతనిపై న్యాయవ్యవస్థ సైతం కక్ష కట్టిందిప్పుడు.   ఆయన దేశంలో అడుగు పెట్టగానే, అందరూ ఊహించినట్లే, కోర్టులు ఆయనపై ఉన్న కేసులన్నిటినీ బయటకి తీసి అతని చుట్టూ ఉచ్చుబిగించడం మొదలుపెట్టాయి. మొదట హైకోర్టు ఆయనకి వారం రోజులు బెయిలు మంజూరు చేసింది. ఆ సమయంలో దేశంలో నాలుగు చోట్ల నుండి ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతే పోలింగ్ అధికారులు మూడు చోట్ల వివిధ కారణాలతో తిరస్కరించగా మరో చోట ఆయన నామినేషన్ వేయడానికి అనర్హుడని కోర్టు ప్రకటించడంతో అక్కడ కూడా ఆయన నామినేషన్ వేయలేకపోయారు.   ముషారఫ్ పాకిస్తాన్ లో అడుగు పెట్టిన మరునాటి నుండే జడ్జీలను నిర్బందించిన కేసు, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో పై హత్యా యత్నం కేసులలోకోర్టుల తిరుగుతున్న ఆయన ఈరోజు మళ్ళీ తన బెయిలు పొడిగింపు కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చినప్పుడు కోర్టు “ఆయన ఒక తప్పించుకొని పారిపోయిన ఖైదీ” అని, అటువంటి వ్యక్తికి బెయిలు మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పి ఆయనని వెంటనే అరెస్ట్ చేయమని పోలీసులకి ఆదేశాలు ఇచ్చింది.   సాధారణంగా అటువంటప్పుడు ఎవరయినా పోలీసులకి లొంగిపోయి ఆ తరువాత పై కోర్టులో అప్పీలు చేసుకొంటారు. కానీ, కోర్టు అరెస్ట్ ఉత్తర్వులు జారీ చేయగానే ఆయన హడావుడిగా బయటకి వచ్చి, పోలీసులకు దొరక్కుండా తన అంగరక్షకుల సహాయంతో నగరం శివార్లలో ఉన్న చక్ షహాద్ అనే ప్రాంతంలో ఉన్న తన ఫాంహౌస్ కి తనకారులో పారిపోయారు.   ఆయన ఫాం హౌసులో ప్రవేశించిన కొద్దిసేపటికే పాకిస్తాన్ రెంజర్స్ ఆ ఇంటిని చుట్టుముట్టాయి. అయితే వారు ఇంతవరకు ముషారఫ్ ను అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వం ఆయనను గృహనిర్బంధం చేయాలని ఆలోచిస్తునందున ఆయన అక్కడి నుండి తప్పించుకొని పారిపోకుండా ఈ ఏర్పాటు జరిగినట్లు సమాచారం.   ఇప్పుడు ఆయన పరిస్థితి మేకపిల్లను చూసి లొట్టలేసుకొంటూ వచ్చి బోనులో ఇరుకొన్న పులిలాగ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలలో పోటీ చేయడం సంగతి మాటెలా ఉన్నా, అందరి కళ్ళు గప్పి మళ్ళీ దేశం నుండి పారిపోగలిగితే, బ్రతికుంటే బలిసాకు తినయినా బ్రతకొచ్చునని ఆయన కోరుకొంటున్నారు. కానీ,యావత్ దేశం ఆయనపై కక్ష కట్టి ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ సారి తప్పించుకోవడం కష్టమే.ఆయనకు కోర్టు ఉరి శిక్ష విధించినా ఆశ్చర్యం లేదు.తన నేతృత్వంలో భారత్ పై చేసిన కార్గిల్ దాడికి చాలా గర్వపడే ముష్కర్ ముషారఫ్ ఇప్పుడు తానూ తవ్వుకొన్న గోతిలో తానేపడి ప్రాణభయంతో విలవిలలాడుతున్నారు పాపం!

టీవి నటి పై అత్యాచారం, పదేళ్లు శిక్ష

        బ్రిటన్ లో టీవి నటి పై అత్యాచారం చేసిన కేసులో ఓ బారతీయ విద్యార్ధికి బ్రిటన్ కోర్ట్ పదేళ్ళ జైలు శిక్ష విదించింది. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న టీవి నటి మద్యం సేవించి హోటల్ గదిలో నిద్రిస్తుండగా అత్యాచారానికి గురైంది. తాను మద్యం మత్తులో నిద్రిస్తుండగా తనపై జాన్ సోబి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె లండన్ పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె పిర్యాదు మేరకు కోర్ట్ విచారణకు ఆదేశించింది. టెలివిజన్ స్టార్ పై అత్యాచారం చేసినట్లు జాన్ సోబి విచారణంలో అంగీకరించాడు. హోటల్ సిబ్బంది సహాయంతో ఆమె గదిలోకి ప్రవేశించిన జాన్ మద్యం మత్తులో వున్న నటి పై అత్యాచారం జరిపినట్లు కోర్ట్ కి వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అతనికి పదేళ్లు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత సోబీ జాన్‌ను భారతదేశానికి పంపించనున్నట్లు బ్రిటిష్ టాబ్లాయిడ్ 'ది సన్' రాసింది.

ఢిల్లీ లో మాయమైన ముఖ్యమంత్రి

        ఢిల్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు గంటల పాటు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా వదిలిపెట్టి ఎవరికి చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికీ సమచారం ఇవ్వకుండా రెండు గంటల పాటు ఎవరికీ తెలియని చోటుకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం ఆయన సెక్యురిటీ ఎవ్వరూ తోడు లేకుండా, ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆయన ఓ ప్రైవేట్ వాహనంలో బయటకు వెళ్లిపోయారు. ఎపి భవన్‌లో ఉన్న ఆయన సెక్యురిటీ సిబ్బందికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ఎక్కడు వెళ్లారు, ఎవర్ని కలిశారు అనేది తెలియడం లేదు. ఈ విషయం తీవ్ర ఉత్కంఠకు కారణమైంది.

డిల్లీ సమావేశంలో తేల్చేదేమిటి

  ఈ రోజు డిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. సబితా ఇంద్రరెడ్డిపై సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేసినందున ఆమెను పదవి నుండి తొలగించాలనే విషయంపై ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ కి తలొగ్గబోమని మొన్ననే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ ఆజాద్ స్పష్టం చేసినందున ఆమెను హోంమంత్రి పదవినుండి వేరే శాఖకు మార్చి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం చెప్పకపోతే బొత్ససత్యనారాయణకు ఆ పదవి కట్టబెట్టవచ్చును.   ఈ సమావేశంలో కేవలం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ పదవి మార్పు విషయమే ప్రధాన చర్చాంశం కావచ్చును. ఇప్పటికే మాజీ పీసీసి అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ డిల్లీకి ఆహ్వానించబడ్డారు గనుక, బొత్స స్థానంలో ఆయనను నియామకం ఖరారు చేసి, బొత్సకు తగిన ఉపాధి చూపడమే ప్రధాన అజెండాగా సమావేశం జరుగవచ్చును. తద్వారా, ఒకేసారి మూడు అంశాలు పరిష్కరించినట్లవుతుంది. బొత్సకు మంత్రి పదవి, సబితకు శాఖా మార్పు, పీసీసీ కొత్త అధ్యక్షుని నియామకం జరుగుతాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డిని వెనకేసుకు వస్తూనే, తనను దిక్కరిస్తున్నాడనే కారణంతో ఆరోగ్య శాఖామంత్రి డా. డీ.యల్.రవీంద్రారెడ్డిని పదవి నుండి తొలగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరనున్నట్లు వార్తలు రావడం విశేషం.   ఇక పార్టీ నుండి తెరాసలోకి వలసల గురించి, జగన్ మోహన్ రెడ్డితో, అతని పార్టీతో ఏవిధంగా వ్యవహరించాలనే విషయం కూడా ఈ సమావేశంలో చర్చించవచ్చును. అదే విధంగా తిరుగుబాటు యం.యల్.యేలపై అనర్హత వేటు వేయాలా వద్దా? వేస్తే ఎప్పుడు వేయాలి? అనే అంశం కూడా వారి మద్య చర్చకు రావచ్చును. అయితే, కాంగ్రెస్ పధ్ధతి ప్రకారం ముఖ్యమయిన అన్ని విషయాల గురించి కేవలం చర్చలు మాత్రమే చేసి నిర్ణయాలు మాత్రం తీసుకోకపోవచ్చును.

రావూరి భరద్వాజను వరించిన జ్ఞానపీఠ్ అవార్డు

  86 ఏళ్ళ ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్త రావూరి భరద్వాజ తన సాహితీ ప్రస్థానంలో ఇప్పటివరకు 37కు పైగా కథల సంపుటాలు, 17 నవలలు రాశారు. సినిమా (అథో)జగత్తుపై ఆయన రాసిన పాకుడురాళ్ళు, జీవన విజయంపై అందించిన కాదంబరి నవలలు ఆయనకు ఎనలేని పేరుప్రతిష్ఠలు సాధించిపెట్టాయి. ప్రముఖ ఒరియా కవి సీతాకాంత్ మహాపాత్ర నేతృత్వంలోని జ్ఞానపీఠ అవార్డు కమిటీ 2012కి గాను రావూరి భరద్వాజను ఎంపిక చేసింది. భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠం అవార్డు సొంతం చేసుకుంటున్న తొలి తెలుగు వచన రచయిత రావూరి భరద్వాజ. తెలుగులో ఇదివరకు 1970లో జ్ఞానపీఠం సాధించిన విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షం, 1988లో డాక్టర్ సి.నారాయణ రెడ్డి విశ్వంబర ... కవితా వాక్యాలే.భరద్వాజ రచనలు పలు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా, పరిశోధకులకు ఆధారాలుగా నిలిచాయి. భరద్వాజకు పలు రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు. సోవియట్ ల్యాండ్ అవార్డు, తెలుగు అకాడమీ, బాల సాహిత్య పరిషత్ అవార్డులూ అందుకున్నారు.

మాజీ గవర్నర్ వి.ఎస్. రమాదేవి మృతి

  కర్నాటక మాజీ గవర్నర్ వి.ఎస్. రమాదేవి (78) పదేళ్ళ క్రితం గవర్నర్ గా పదవీ విరమణ చేసిన తరువాత హైదరాబాద్ లో ఉంటున్నారు. రమాదేవి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోనే ఉంటున్న తన సోదరితో మాట్లాడుతూ ఉన్నట్లుండి ఛాతీ పట్టుకుని పక్కకు ఒరిగిపోయారు. చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆమెను సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించే సరికే తుదిశ్వాస విడిచారని వైద్యులు నిర్థారించారు. రమాదేవి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కేంద్ర ఎన్నికల కమీషనర్ గా సేవలందిచిన మహిళగా గుర్తింపు పొందారు. తరువాత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా, కర్నాటక గవర్నరుగా సేవలందించారు. రమాదేవి పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు లో 1934 జనవరి 15న జన్మించారు. సివిల్ సర్వెంట్ గా, ఆబ్కారీ సీఏటీ జ్యుడిషియల్ సభురాలిగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఉన్నత హోదాలో సేవలు అందించారు. రమాదేవి ప్రస్తానం హైదరాబాద్ లోనే జరిగింది. హైదరాబాద్ లోని ఆకాశవాణి రేడియోలో  పిల్లల కార్యక్రమం ద్వారా రచయిత్రిగా ప్రస్థానం ఆరంభించారు. రేడియోలో పనిచేస్తున్న సమయంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, గోపీచంద్, స్థానం నరసింహారావు లాంటి పరిచయంతో తానూ రచయితగా రాణించారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి పత్రికల్లో వివిధ వ్యాసాలూ నిర్వహించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఎర్రగడ్డ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

తెదేపా నేతకి గాలం వేస్తున్న కేసీఆర్

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్ హుషారుగా మొదలుపెట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష’ అటు ఎదుట పార్టీలలోనే కాకుండా స్వంత పార్టీలో కూడా చిచ్చుపెట్టడంతో కొంచెం వెనక్కి తగ్గక తప్పలేదు. అయినప్పటికీ, ఆయన ఆ ఆకర్షణలోనుండి ఇంకా బయటపడనట్లున్నారు. ఆయన చొప్పదండి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెదేపా శాసనసభ్యుడు సుద్దాల దేవయ్యతో మొన్నరాత్రి మెదక్ జిల్లాలో జగదేవ్ పూర్ లోగల తన ఫాంహౌసులో దాదాపు అర్ధగంట పైగా రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఆ విషయాన్ని కేసీఆర్ కానీ, దేవయ్య గానీ దృవీకరించలేదు. వారు దృవీకరించకపోయినప్పటికీ, గతంలో తెదేపా నుండి తెరాసలోకి మారిన హరీశ్వర్ రెడ్డి వ్యతిరేఖిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.   అదేవిధంగా కేసీఆర్ ఇప్పటికీ కాంగ్రెస్ నేతలతో పూర్తీ ‘టచ్’ లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నెల 27న అర్మూరులో పార్టీ 12వ వార్షికోత్సవ సభ నిర్వహిస్తునందున ఆలోగా తెరాసలో ఎవరెవరు చేరబోతున్నారనే విషయం స్పష్టం అయ్యే అవకాశాలున్నాయి. రాబోయే ఎన్నికలకు పోటీ చేయనున్న అభ్యర్ధుల మొదటి లిస్టును మేనెలాఖరులోగా విడుదల చేయ నున్నట్లు తెరాస ఇదివరకే ప్రకటించింది గనుక ఆలోగా మిగిలినవారు ఎవరయినా ఉంటే వారు కూడా ఆలోగా తెరాసలో చేరుతారని కేసీఆర్ భావిస్తున్నారు.

మొహమ్మద్ గజ్నివీ చరిత్రను జగన్ పునరావృత్తం చేశారు

  మొహమ్మద్ గజ్నవీ చరిత్రను జగన్ పునరావృత్తం చేశారు ... వ్యవస్థను తనకు అనువుగా మార్చుకున్నారు అని ఈడీ లాయర్ విపుల్ కుమార్ తెలిపారు. ఈ వ్యాఖ్యలను హైకోర్టు చేసిందా? అని ధర్మాసనం ప్రశ్నించగా ... "హైకోర్టు నేరాన్ని గుర్తించింది. హైకోర్టు వైఖరి ఆధారంగా నేనీ వ్యాఖ్యలు చేస్తున్నాను అని, తండ్రి అధికారంలోకి రాగానే జగన్ సంపద కూడగట్టారు, ప్రభుత్వ భూ కేటాయింపులు, సెజ్ లు, రియల్ ఎస్టేట్ అనుమతులు, కాంట్రాక్టులు, మైనింగ్ తవ్వకాల అనుమతుల్లో అవినీతికి పాల్పడ్డారని, తండ్రి అధికారాన్ని అడ్డం పట్టుకుని భారీగా అవినీతికి పాల్పడినందునే జగన్ ను గజ్నవీతో పోల్చాను అని విపుల్ ధర్మాసనానికి విన్నవించారు. జగన్ అక్రమాస్తుల కేసులో జనవరి 8వ తేదీనాటి రూ.143.74 కోట్ల విలువైన ఆస్తుల జప్తుపై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ సభ్యులు పి.జె.శర్మ, రామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం తుది వాదనలు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను తనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకుని, ప్రజాధనాన్ని దోచుకున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) స్పష్టం చేసింది. నేరుగా లంచాలు తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 36 కంపెనాలను సృష్టించి ముడుపులకు పెట్టుబడుల రూపం ఇచ్చారని, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టినవారంతా ప్రభుత్వం నుంచి లబ్ది పొందినవారేనని, లంచాలను షేర్ల కొనుగోలుకు చెల్లించారని ఈడీ తరపు న్యాయవాది ధర్మాసనం ముందు వాదించారు. వైఎస్ అధికారంలోకి రాకముందు వారి ఐటీ రిటర్న్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని, 36పైగా కంపెనీలను ప్రారంభించిన జగన్ అవినీతి సొమ్మును పెట్టుబడుల రూపంలో మళ్ళించారని, జగతి పబ్లికేషన్స్ లోకి కూడా ఇదే తరహాలో నిధులు మళ్ళించారని ఈడీ తరపు న్యాయవాది విపుల్ కుమార్ తెలిపారు. జగతి ఆస్తుల విలువపై డెలాయిట్ నివేదిక తప్పుల తడక అని జగన్, విజయసాయి రెడ్డి ఒత్తిడి మేరకే ఈ నివేదిక తయారు చేశారని తెలిపారు. ధర్మాసనం సభ్యుడు రామ్మూర్తి కల్పించుకుని "ఆస్తులను మదింపు చేసే కంపెనీల కారణంగానే అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి, సత్యం కుంభకోణంలో జప్తు సందర్భంగా సంబంధిత ఆడిటింగ్ సంస్థపై భారీ జరిమానా విధించాలని సిఫారసు చేశానని ఆయన గుర్తు చేశారు. విపుల్ కుమార్ వాదించుతూ సిబీఐ జగతి అప్బ్లికేశంస్ ఆస్తులను ఎస్.బి.ఐ. క్యాపిటల్ సంస్థ చేత ముదింపు చేయించిందని, ఈ సందర్భంగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

సిఎంపై ఒత్తిడి తెస్తున్న సుబ్బిరామి రెడ్డి

  కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు నెల్లూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ సారి తాను విశాఖపట్నం నుండి పోటీ చేస్తున్నాని, తాను రాజ్యసభకు ఎన్నిక అవడంవల్ల పురందీశ్వరి విశాఖపట్నం నుండి పోటీ చేశారని, వచ్చే ఎన్నికల్లో పురందీశ్వరి నరసరావుపేట నుండి పోటీ చేయనున్నారని అందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 32 ఏళ్ళుగా తనకు విశాఖపట్నం ప్రజలతో ప్రేమానుబంధాలు ముడిపడి వున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే తాను మైనారిటీ, మత్సకారులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, క్రీడాకారుల కమిటీలను ఎప్పుడో నియమించానని, వంద మందిరాలు, వంద చర్చిలను, వంద మసీదులను పునర్మిస్తున్నానని చెప్పారు. అలాగే తాను మైనారిటీ, అట్టడుగు, అణగారిన వర్గాల కోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నాని తెలిపారు. ఈ నెల 28న ఎస్సీ, ఎస్టీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి రావాల్సిందిగా పిసిసి చీఫ్ బొత్సా సత్యనారాయణను ఆహ్వానించడానికి తాను కలిసానని తెలిపారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సా సత్యనారాయణను సుబ్బిరామిరెడ్డి వేరువేరుగా కలిసి సమావేశమయ్యారు.