మాజీ గవర్నర్ వి.ఎస్. రమాదేవి మృతి
posted on Apr 18, 2013 @ 12:34PM
కర్నాటక మాజీ గవర్నర్ వి.ఎస్. రమాదేవి (78) పదేళ్ళ క్రితం గవర్నర్ గా పదవీ విరమణ చేసిన తరువాత హైదరాబాద్ లో ఉంటున్నారు. రమాదేవి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోనే ఉంటున్న తన సోదరితో మాట్లాడుతూ ఉన్నట్లుండి ఛాతీ పట్టుకుని పక్కకు ఒరిగిపోయారు. చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆమెను సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించే సరికే తుదిశ్వాస విడిచారని వైద్యులు నిర్థారించారు. రమాదేవి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కేంద్ర ఎన్నికల కమీషనర్ గా సేవలందిచిన మహిళగా గుర్తింపు పొందారు. తరువాత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా, కర్నాటక గవర్నరుగా సేవలందించారు. రమాదేవి పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు లో 1934 జనవరి 15న జన్మించారు. సివిల్ సర్వెంట్ గా, ఆబ్కారీ సీఏటీ జ్యుడిషియల్ సభురాలిగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఉన్నత హోదాలో సేవలు అందించారు. రమాదేవి ప్రస్తానం హైదరాబాద్ లోనే జరిగింది. హైదరాబాద్ లోని ఆకాశవాణి రేడియోలో పిల్లల కార్యక్రమం ద్వారా రచయిత్రిగా ప్రస్థానం ఆరంభించారు. రేడియోలో పనిచేస్తున్న సమయంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, గోపీచంద్, స్థానం నరసింహారావు లాంటి పరిచయంతో తానూ రచయితగా రాణించారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి పత్రికల్లో వివిధ వ్యాసాలూ నిర్వహించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఎర్రగడ్డ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.