దొందూ దొందే

  సాదార‌ణ ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతుండ‌టంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపిల్లో ప్రదాని అభ్యర్ధిత్వం పై వార్తలు జోరుగా సాగుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ అఫిషియ‌ల్‌గా ప్రక‌టించ‌క‌పోయినా ఈ సారి త‌ప్పకుండా రాహుల్ గాంధీ యే త‌మ ప్రదాని అభ్యర్ధి అని నాయ‌కులంతా చెపుతున్నారు. అయితే ఈనేప‌ద్యంలో బిజెపిలో మాత్రం ప్రదాని అభ్యర్ధిత్వంపై సందిగ్ధత కొన‌సాగుతుంది. పార్టీలో మోడీ అభ్యర్ధిత్వానికి మ‌ద్దతు ప‌లికే వారు చాలా మందే ఉన్న వ్యతిరేకించే వర్గం కూడా బ‌లంగానే ఉంది.. దీంతో ఇప్పుడు భావి ప్రదాని ఎవ‌రు అనే చ‌ర్చ జ‌రుగుతుంది.. స‌ర్వేలు కాస్త మోడి వైపు మొగ్గు చూపిన గ‌త రికార్డులు మాత్రం మోడిని వెంటాడుతూనే ఉన్నాయి.. ఈ విష‌యంపై  సామాజిక ఉద్యమ‌కారుడు అన్నాహ‌జ‌రే త‌న అభిప్రాయాన్నిచెప్పారు.. ఫరూఖాబాద్ జ‌నతంత్ర యాత్రలో పాల్గొంటున్న హ‌జ‌రే మోడి, రాహుల్‌ల అభ్యర్ధిత్వంపై మాట్లాడారు.. త‌న దృష్టిలో ఈ ఇద్దరు ప్రదాని ప‌ద‌వికి అర్హులు కార‌న్నారు అన్నా..

సంప్రదింపులు ముగిసాయి.. ఇక నిర్ణయ‌మే

  డిల్లీ లో వెడెక్కిన తెలంగాణ‌ రాజ‌కీయం.. ఇవాళ కోర్ క‌మిటీ నేపధ్యంలో ఢిల్లీ చేరిన రాష్ట్ర నాయ‌క‌త్వం అక్క‌డ జోరుగా మంత‌నాలు చేస్తుంది.. ఇప్పటికే తెలంగాణ అంశంపై ఓ నిర్ణయానికి వ‌చ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఆఖ‌రిసారిగా సియం పిసిసి చీఫ్ ల అభిప్రాయాల‌ను తీసుకుంది.. ఈ రోజు ఉద‌యం జ‌ర‌గాల్సిన కోర్‌క‌మిటీ భేటి వాయిదా ప‌డ‌టంతో, మ‌ధ్యాహ్నం దిగ్విజ‌య్ సింగ్ అందుబాటులో ఉన్న నాయ‌కుల‌తో మినీ కోర్‌క‌మిటీ భేటిని నిర్వహించారు.. ఈ భేటి త‌రువాత దిగ్విజ‌య్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్రకంప‌న‌లు పుట్టిస్తున్నాయి. మినీ కోర్‌క‌మిటీ భేటి త‌రువాత మీడియాతో మాట్లాడిన దిగ్విజ‌య్ తెలంగాణ పై సంప్రదింపుల ప్రక్రియ ముగిసింద‌ని, ఇక నిర్ణయం వెలువ‌డాల్సి ఉంది అని ప్రక‌టించారు. దీంతో ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ధ్యం అన్న వాద‌న బ‌లంగా వినిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం భేటి అవుతున్న కోర్ క‌మిటీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశం పై ఓ నిర్ణయానికి రానుంది అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు.

అనిశ్చిత స్థితిలో రాష్ట్రం

  పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లు వైకాపా ఎత్తుకొన్న సమైక్యరాగంతో ముందుగా ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు, ఆ తరువాత కాంగ్రెస్, తెదేపాలకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే, వైకాపా తెలంగాణా నేతలు అధ్యక్షురాలు విజయమ్మతో జరిపిన చర్చలు విఫలమయినట్లు వార్తలు వస్తున్నాయి. వారు మళ్ళీ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మరో మారు సమావేశం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కూడా చర్చలు విఫలమయితే, వారు తట్టాబుట్టా సర్దుకోవడానికి సిద్దంగా ఉన్నారు.   ఇక, కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా సరిగ్గా నాలుగు గంటలకే డిల్లీలో సమావేశం అవుతోంది. అందులో తెలంగాణాపై ఏదో ఒకటి తేల్చుకొని, ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లో వర్కింగ్ కమిటీలోఅంతిమ నిర్ణయమ ప్రకటించే అవకాశాలున్నాయి. అందువల్ల కాంగ్రెస్ వైకాపా రాజీనామాలను పట్టించుకొనే స్థితిలో లేదిప్పుడు.   ఇక, తెలుగుదేశం పార్టీ నేతలెవరూ కూడా, వైకాపా చేసిన రాజీనామాలపై గానీ, కేంద్రంలో జరుగుతున్న సమావేశాల గురించి గానీ, ఎటువంటి వ్యాక్యాలు చేయవద్దని, ముఖ్యంగా వైకాపా ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తున్నందున మరింత అప్రమత్తతతో మెలగాలని చంద్రబాబు తన నేతలందరికీ ఖచ్చితమయిన ఆదేశాలు ఇచ్చికట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజులలో కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై ఖచ్చితమయిన ఒక నిర్ణయం తీసుకొన్న తరువాతనే స్పందించడం మంచిదని అంతవరకు సమన్వయము పాటించడం మేలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సిద్దమయితే, అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తన సీమంధ్ర నేతలను అదుపుచేయక తప్పదు. అప్పుడు సహజంగానే తెదేపాపై ఒత్తిడి తగ్గుతుందని చంద్రబాబు అంచనా.   కాంగ్రెస్, తెదేపాలు రెండూ కూడా తమ నేతలను నియంత్రించుకొనగలిగితే అకస్మాత్తుగా సమైక్యరాగం అందుకొన్న వైకాపా అప్పుడు రెండు ప్రాంతాలలో ఒంటరి అయ్యే అవకాశం ఉంది. అందువల్ల తెదేపా అధికార ప్రతినిధులు తప్ప ఇతర నేతలెవరూ కూడా ప్రస్తుత పరిణామాలపై మీడియాకెక్కి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. మరొక మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో నెలకొన్న ఈ అనిశ్చితస్థితి తొలగిపోవచ్చును. అప్పుడు ఎవరు కొత్తగా ఉద్యమ బాట పడతారో, ఎవరు పైచేయి సాధిస్తారో, ఎవరు నష్టపోతారో చూచాయగా తెలిసిపోవచ్చును.

త్వరలో తెలంగాణపై నిర్ణయం

      తెలంగాణ పై కాంగ్రెస్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెసు పార్టీ వార్ రూమ్‌లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో భేటీ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం చెప్పేందుకే తమ పార్టీ అధిష్టానం ఈ సమావేశాలు నిర్వహిస్తోందని, వైకాపా డ్రామాలు ఆపాలని అన్నారు. త్వరలో తెలంగాణపై కాంగ్రెసు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఉంటాయన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజీనామాలతో డ్రామాలు ఆడుతోందన్నారు. వారు డ్రామాలు ఆపి తెలంగాణపై తమ పార్టీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీలోనే స్పష్టమైన వైఖరి లేదన్నారు. త్వరలో తమ పార్టీ విధానం చెబుతామన్నారు.

తెరాసకు జీవం పోసిన వైకాపా వ్యూహం

  కాంగ్రెస్ తెలంగాణా అంశాన్ని తన చేతిలోంచి కాకిలా తన్నుకుపోయిన తరువాత, దిగాలుపడిన తెరాసకి మొన్న వెలువడిన మొదటి విడత పంచాయతీ ఫలితాలు మరో పెద్ద షాకిచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో ఏమిచేయాలో, ఏవిధంగా స్పందించాలో తెలియని తెరాస అధినేత కేసీఆర్ మళ్ళీ తన గుహలోకి (ఫాంహౌసులోకి) వెళ్ళిపోయారు. ఇటువంటి క్లిష్ట సమయంలో వైకాపా శాసనసభ్యులు సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకొని రాజీనామాలు చేయడంతో మళ్ళీ తెరాసకు శ్వాస ఆడింది.   సీమంధ్ర ప్రాంతానికి చెందిన నేతల అద్వర్యంలో నడుస్తున్న పార్టీలు, తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడేందుకే ఈ రాజీనామా డ్రామాలు మొదలుపెట్టాయని, వాటిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే వెనుకనుండి ప్రోత్సహిస్తున్నారని తెరాస నేత హరీష్ రావు ఆరోపించారు.   ఇంతవరకు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆకర్షించడానికి ఎన్నితిప్పలు పడినప్పటికీ, ఆ పార్టీలో నలుగురైదుగురు పెద్ద నేతలు తప్ప ఎవరూ చేరలేదు. ఆ చేరిన వారిలో మళ్ళీ కాంగ్రెస్ యంపీలు వివేక్, మందా జగన్నాథం ఇద్దరూ కూడా ఏక్షణంలోనయినా తిరిగి కాంగ్రెస్ గూటికి ఎగిరిపోయెందుకు సిద్దంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైకాపా తెలంగాణాలో అకస్మాతుగా బోర్డు తిప్పేయడంతో ఆ పార్టీకి చెందిన నేతలు,తప్పని పరిస్థితుల్లో తెరాసనే ఆశ్రయించవచ్చును.   అదేవిధంగా కాంగ్రెస్ తన ప్రమేయం లేకుండా తెలంగాణాపై నిర్ణయం తీసుకోవడానికి సిద్దపడటం జీర్ణించుకోలేని తెరాస నేతలకు, ఇప్పుడు వైకాపా రాజేసిన ఈ సమైక్యాంధ్ర మంటతో మళ్ళీ తెలంగాణా ప్రక్రియ ఆగిపోతే, అప్పుడు కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయపార్టీలతో తెలంగాణాలో చెడుగుడు ఆడేసుకొనే అవకాశం కూడా తప్పకుండా దొరుకుతుంది. నేడు వైకాపా రాజేసిన మంట రేపు తెలుగుదేశం పార్టీని తాకక మానదు. అప్పుడు తెదేపా గనుక మళ్ళీ తెలంగాణపై మాట మార్చితే అది తెరాసకు మరో ఆయుధంగా అందివస్తుంది.   కనీసం సీమంధ్ర ప్రాంతంలోనయినా బలపడాలనే ఆలోచనతో వైకాపా వేసిన ఈ ఎత్తుతో, వైకాపా ముందు తన తెలంగాణా ప్రాంత సభ్యులను పోగొట్టుకోవడమే కాకుండా తెరాసకు మరో లైఫ్ పాయింటు అందించింది.

విశ్వసనీయత అంటే ఇదేనా

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సమైక్యాంధ్ర కోరుతూ నిన్న అకస్మాత్తుగా రాజీనామాలు సమర్పించడంతో ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు కంగు తిన్నారు. తెరాస విసురుతున్న సవాళ్ళను తట్టుకొంటూ పార్టీకోసం అవమానాలు భరిస్తూ పనిచేస్తున్న తమతో కనీసం చర్చించకుండా మాట మాత్రమయినా చెప్పకుండా పార్టీ ఈవిధమయిన నిర్ణయం తీసుకోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తీసుకొన్నఈ నిర్ణయంతో పార్టీనే నమ్ముకొన్నతమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరం అయిపోయిందని వాపోతున్నారు. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తెలంగాణాలో ఆయన అభిమానులు ఆ పార్టీకోసం లక్షలు ఖర్చుబెట్టి నష్టపోయిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకొంటున్నారు. తాము కూడా వైకాపా కోసం చాలా ఖర్చుచేసి, తెలంగాణాలో బలమయిన తెరాసను డ్డీకొంటూ పార్టీని కాపాడుకొంటున్నామని, అయినప్పటికీ పార్టీ తమపై ఏమాత్రం విశ్వాసం చూపకుండా అకస్మాత్తుగా ఈవిధంగా తెలంగాణాలో బోర్డు తిప్పేయడం చాలా అన్యాయమని వారు వాపోతున్నారు. ఆ పార్టీకి చెందిన కొండా సురేఖ కేవలం స్వర్గీయ వైయస్సార్ పట్ల తమకున్న కృతజ్ఞతా భావంతో తాను వైకాపాకోసం తన మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి చివరికి కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామాలు చేసివస్తే, ఇప్పుడు పార్టీ ఈవిధంగా చేసి తమను చాల ఘోరంగా దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాల వ్యవహారంపై విజయమ్మ వెంటనే స్పష్టమయిన ప్రకటన చేయాలని కొండా సురేఖతో సహా ఆపార్టీకి చెందిన తెలంగాణా నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైకాపా చేసిన ఈ పని వల్ల తమపై కూడా ప్రజలలో అపనమ్మకం ఏర్పడుతుందని తెదేపా నేతలు భయపడుతున్నారు.   వైకాపా తన రాజకీయ మనుగడకు చాలా గొప్ప నిర్ణయమే తీసుకొన్నట్లు భావించవచ్చు గాక, కానీ ఆ పార్టీ తన తెలంగాణా నేతలకి ఏమని సమాధానం చెపుతుందిప్పుడు? విస్వసనీయతకు మారుపేరుగా చెప్పుకొనే ఆ పార్టీ తన తెలంగాణా నేతల రాజకీయ భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఎటువంటి విశ్వసనీయత?

కాంగ్రెస్ నెల్లూరు ఎమ్మెల్యేల రాజీనామా

      ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలనే ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరూ ఎమ్మెల్యే లు రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తమ పదవులకు రాజీనామాలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాజీనామా తర్వాత ఈ రోజుల వీరిద్దరూ చేయడం విశేషం. ఇప్పటికే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు ప్రకటించారు.

బొత్స ఎంపైరింగ్ అంటే మాటలా మరి

  రాష్ట్ర విభజన అంశం నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో రెండు ప్రాంతాల నేతలు తమతమ ‘స్టార్ బ్యాట్ మ్యాన్స్’తో డిల్లీలో జరగబోయే ఫైనల్ గేంకి సిద్దం అయ్యారు. ఈ గేంలో తనకీ సమైక్యాంధ్ర తరపున బ్యాటింగ్ చేయాలనీ ఉన్నపటికీ, రాష్ట్ర హితం కోరే పెద్దమనిషిగా ‘న్యూట్రల్ ఎంపైర్’ పాత్ర పోషిస్తానని బొత్ససత్యనారాయణ శలవిచ్చారు. ఇక ఫీల్డింగులో ఉన్నకొందరు సీమంధ్ర నేతలు ఆట మద్యలో వెళ్ళిపోతే తానేమీ చేయలేనని, ఆట చివరివరకు ఆడదలచుకొన్నవారికి మాత్రమే చివరాఖరున ‘రాష్ట్ర విభజన కప్పు’ స్వీకరించే అర్హత ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.   తానూ ఎంపైర్ గా ఉన్నపటికీ తన సీమంద్ర టీం గెలవాలని మనసారా కోరుకొంటున్నానని స్పష్టం చేసారు. అదేవిధంగా తమ స్టార్ బ్యాట్స్ మ్యాన్ కిరణ్ కుమార్ రెడ్డికి తానూ కాలు అడ్డుపెట్టి, జైపాల్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడుతున్నట్లు వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టేనని ఆయన తెలిపారు. ఒకవేళ ఆయన బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున తన కాలు అడ్డం పెట్టినా, దానిని మీడియా వాళ్ళు ఫాల్స్ రిపోర్టింగ్ చేసేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.   ఇక, వైకాపాకి చెందిన 11మంది ప్లేయర్లు గ్రౌండులోకి రాకుండానే గేం డిక్లేర్ చేసి వెళ్ళిపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. పంచాయితీ ఎన్నికలలో క్లీన్ బౌల్డ్ అయిపోవడం వలననే వైకాపా పాత గేం పక్కనబెట్టి, మరో కొత్త గేం మొదలుపెట్టాలని చూడటం ఫౌల్ గేం అవుతుందని ఆయన అన్నారు. తమ కాంగ్రెస్ ఫ్రాంచైసర్లు(అధిష్టానం) ఏ టీముని ఇచ్చినప్పటికీ తాను చక్కగా ఎంపైరింగ్ చేయగలనని, తనకు ఏ టీమయినా ఒకటేనని ఆయన చెప్పారు.

రాజీనామలపై కొండా ఆగ్రహం

      మరోసారి కొండా సురేఖ పార్టీ పై దిక్కార స్వరం వినిపించారు.. తెలంగాణ పై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తమ ఎమ్మేల్యేలు శాసన సభ్యత్వాలకు రాజీనామ చేసిన నేపధ్యంలో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేవారు.. గతంలో కూడా పార్టీలో తమకు సముచిత స్థానం దక్కటం లేదని పక్కచూపులు చూసిన కొండా దంపతులు. నాయకత్వం బుజ్జగింపులతో తిరిగి పార్టీలో కొనసాగారు..   ప్రస్థుతం మరోసారి ఎమ్మెల్యే రాజీనామాల విషయం కూడా తమ దృష్టికి రాకుండానే జరగటంతో సురేఖ మండిపడ్డారు.. ఇలాంటి పరిణామాలతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కేవలం సీమాంద్ర పార్టీగా మిగిలిపోతుందన్నారు.. ఈ విషయంపై పార్టీ అధినాయకురాలు విజయమ్మ సమాధానం చెప్పాలని కొండా సురేఖ డిమాండ్‌ చేశారు.. విలైనంత త్వరగా పార్టీ స్పందించి ఎమ్మేల్యేల రాజీనామాలు పార్టీ పరంగా జరిగినవా లేక, వారి వ్యక్తిగతంగా చేశారా అన్నది తేల్చని పక్షంలో పార్టీని విడటానికి కూడా వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు.. త్వరలొ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తెలంగాణ నాయకులంతా కలిసి ఓ నిర్ణయం తీసకుంటామని చెప్పారు.

తెలంగాణలో సమైఖ్యగానం

      దేశ రాజకీయాల్లో తెలంగాణ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాదం కు ఉన్న బలం ఎంత అన్న వాదన మొదలైంది.. ఇన్నాళ్లు తెలంగాణలోని ప్రతి వ్యక్తి ప్ర్యతేక రాష్ట్రం కోరుకుంటున్నాడంటూ చెపుతూ వచ్చిన కొంత మందికి ప్రస్థుత పరిస్థితులు మింగుడు పడటం లేదు..   ప్రస్థుత రాష్ట్ర రాజదానిగా ఉంటూ ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాజధానిగా కూడా ఉండే హైదరాబాద్‌లోనే తెలంగాణ వాదం అంత బలంగా లేదంటున్నారు.. ఇక్కడ బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న మజ్లీస్‌ పార్టీతో పాటు.. కొంత మంది అధికార కాంగ్రెస్‌ నాయకులకు కూడా సమైఖ్య రాష్ట్రనికే సై అంటున్నారు.. ముఖ్యంగా భాగ్యనగర్‌ బ్రదర్స్‌గా పేరు పడిన దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌లు మొదటి నుంచి తెలంగాణ వాదం పై భిన్న వాదనలు వినిపిస్తున్నారు.. ఇప్పుడు వీరి వాదానికి మరింత బలం చేకూరుస్తూ ఎమ్మేల్యే జగ్గారెడ్డి కూడా సమైక్యరాగం అందుకున్నారు.. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరూ ప్ర్యతేక రాష్ట్రం కోరుకుంటున్నారనడం అవాస్తవమని ఇక్కడి ప్రజల్లో కూడా చాలా మంది కలిసుండాలని కోరుకుంటున్నారన్నరు..

కోర్‌ కమిటీ మీటింగ్‌ వాయిదా

      తెలంగాణపై రాజకీయాలు వేడెక్కుతుండటంతో కేంద్రంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.. ఇప్పటికే పలువురు తెలంగాణ, సీమాంద్రనాయకులు డిల్లీలో ఉంటూ తమ పరిది మేరకు లాభియింగ్‌లు చేస్తున్నారు.. ఈ నేపధ్యంలో ఇవాళ జరగాల్సిన కోర్‌కమిటీ బేటిని కాంగ్రెస్‌ అధిష్టానం వాయిదా వేసింది..   కోర్‌కమిటీ వాయిదాకు ప్రదాని ఆరోగ్యసమస్య కారణంగా చూపుతున్నా దీని వెనుక మరేదో ఉదంటున్నారు విశ్లేషకులు.. సీయం సహ పలువురు రాష్ట్ర నాయకులను ఢిల్లీ పిలిపించిన తరువాత ఇలా అర్ధాతరంగా వాయిదా వేయడం పై అంతా చర్చించుకుంటున్నారు.   కోర్‌ కమిటీ బేటి జరిగే నేపధ్యంలో తెలంగాణ సమస్య ప్రస్ధావనకు వస్తుంది.. ఆ విషయంపై ఎటూ తేల్చలేకపోయినా కనీసం సిడబ్లూసి మీటింగ్‌ డేట్‌ అయినా ఎనౌన్స్‌ చేయాల్సి వస్తుంది.. ప్రస్థుతం పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాటం సరికాదని భావించిన కేంద్రం కోర్‌కమిటీ మీటింగ్‌ వాయిదా వేసింది..

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం: 80 మృతి

      స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 80 మృతి చెందగా...140 మంది తీవ్రంగా గాయపడ్డారు. శాంటియాగో డి కంపోస్టీలాలోని నార్త్ స్పానిష్ సిటీలో రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. 13 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.   గంటకు 180 కి.మీతో వస్తున్న రైలు మలుపు వద్ద ఎనిమిది బోగీలు పట్టాలు తప్పి అదేవేగంతో వెళ్లి పక్కనున్న గోడను ఢీకొట్టాయి. దీంతో భారీ శబ్దం రావడంతో.. స్థానికులు భూకంపం వచ్చిందన్న భయంతో పరుగులు తీశారు. తీరా.. చూసేసరికి రైలు ప్రమాదం! రైలు ఎగిరిపడటంతో మంటలు వ్యాపించి.. అందులోనే 73 మంది సజీవదహనమయ్యారు. మరో ఐదుగురు అసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. వెంటనే స్పందించిన ప్రభుత్వ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.  స్పెయిన్ రైల్వే చరిత్రలో వందలాది మందిని బలి తీసుకున్న 1944 దుర్ఘటన తరువాత మళ్లీ ఇదే అతిపెద్ద ప్రమాదమని, దీనికి కారణం మలుపులో రైలు మితిమీరిన వేగమేనని నిపుణులు చెబుతున్నారు. సంఘటనాస్థలిని ప్రధానమంత్రి మారియానో రాజోయ్ సందర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వెల్లడించారు.

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ నెహ్రూ ఇకలేరు

      కేంద్ర మాజీ మంత్రి అరుణ్ నెహ్రూ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి 10.47 గంటలకు గుర్గావ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య సుభద్ర,ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించిన అరుణ్ నెహ్రూ మూడు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ హయాంలో ఆయన రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆ తర్వాత ఆయన రాజీవ్ గాంధీతో విభేదించి జన మోర్చాను ఏర్పాటు చేసిన విపి సింగ్‌తో చేతులు కలిపారు. ఢిల్లీలోని లోడీ శ్మశాన వాటికలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

వాజ్ పేయి కోరితే భారతరత్న వాపసుకి సిద్ధం: అమర్త్యసేన్

  నోబెల్ మరియు భారతరత్నవంటి అత్యున్నత అవార్డులు అందుకొన్న ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఇటీవల తాను నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా అంగీకరించలేనని ప్రకటించడం ఒక సరికొత్త వివాదానికి దారి తీసింది. ఆయన ఎన్డీయే ప్రభుత్వ హయంలో నాటి భారతప్రధాని అటల్ బీహారీ వాజపేయి చేతుల మీదుగా భారతరత్నఅవార్డు అందుకొన్నారు. ఇప్పుడు ఆయన మోడీకి వ్యతిరేక వ్యాక్యలు చేయడంతో ఆ పార్టీకి చెందిన చందన్ మిత్రా అనే నేత, అమర్త్యసేన్ కనీసం భారతదేశంలో ఓటరుగా ఉండే హక్కు కూడా లేదని తీవ్రంగా విమర్శించారు. అంతే గాక, బీజేపీ హయంలో ఆయన పుచ్చుకొన్న భారత రత్న అవార్డును కూడా వెనక్కు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసారు. దీనితో తీవ్రంగా నొచ్చుకొన్న అమర్త్యసేన్, తనకు ఆ అవార్డు ప్రధానం చేసిన వాజపేయి కోరితే, తను తప్పకుండా ఆ అవార్డుని వెనక్కి తిరిగి ఇచ్చేస్తానని జవాబిచ్చారు. కానీ, అవార్డుని వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం చాల దురదృష్టమని అన్నారు. ఈ సంఘటన రాజకీయ పార్టీల పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ఆయనతో సహా ప్రజలందరికీ కూడా భావ ప్రకటన స్వేచ్చఉంది. అయితే, కొందరు రాజకీయ నాయకులు దానిని మన్నించలేకపోవడం నిజంగా విచారకరమే. మోడీని ఈ దేశంలో ఎంతమంది అభిమానిస్తున్నారో, అంతే మంది వ్యతిరేఖిస్తున్నారు కూడా. చివరికి ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీతో సహా పలువురు నాయకులు మోడీని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నవిషయం అందరికీ తెలిసిందే. మరటువంటప్పుడు, సదరు బీజేపీ నేత చందన్ మిత్రా అద్వానికీ, బీజేపీలో మోడీని వ్యతిరేఖిస్తున్నవారికీ, మోడీని వ్యతిరేఖిస్తున్న భారతీయులకీ కూడా అదే సూత్రం వర్తింపజేయగలరా?

రాయలసీమలో మొదలయిన రాజకీయ అల్పపీడనం

  కమలాపురం కాంగ్రెస్ శాసనసభ్యుడు వీరశివారెడ్డి రాజీనామాతో రాయలసీమలో రాజకీయ అల్పపీడనం మొదలయి, పదకొండు మంది వైయస్సార్ కాంగ్రెస్ శాసన సభ్యుల రాజీనామాలతో పెను తుఫానుగా మారి, అది తెలంగాణాలో ఉరుములు, మెరుపులు సృష్టిస్తోంది.   సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 11మంది శాసన సభ్యులు రాజీనామాలు చేసారు. వారు: శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ); బాలినేని శ్రీనివాసరెడ్డి(ఒంగోలు); గుర్నాథరెడ్డి (అనంతపురం); అమర్ నాథరెడ్డి(రాజంపేట); భూమన కరుణాకరరెడ్డి( తిరుపతి); మేకపాటి చంద్రశేఖరరెడ్డి(ఉదయగిరి); శ్రీనివాసులు(రైల్వేకోడూరు); శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి); పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల); కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) మరియు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (కోవూరు). వీరందరూ తమ రాజీనామా లేఖలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫాక్స్ ద్వారా ఈ రోజు పంపారు.   ఇక నేడో రేపో తెలంగాణా రాబోతోందని ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలంగాణా ప్రజలకు, తెలంగాణా వాదులకు, ముఖ్యంగా టీ-కాంగ్రెస్ నేతలకు, తెలంగాణా విద్యార్ధులకు ఇది తీవ్రఆగ్రహం కలిగించింది. వైసీపీ శాసన సభ్యులు రాజీనామాలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఓయూ జేఏసీ అందుకు నిరసనగా తెలంగాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా కార్యకర్తలు, నేతలు అందరూ కూడా పార్టీని వీడాలని కోరింది. జగన్, విజయమ్మల దిష్టి బొమ్మలు దగ్ధం చేసి వారు తమ నిరసన తెలిపారు. తెలంగాణను అడ్డుకొనే ఆ పార్టీలో ఎవరూ కొనసాగరాదని, వెంటనే పార్టీని వీడి ఉద్యమంలోకి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. బహుశః త్వరలో ఆ పార్టీకి చెందిన తెలంగాణా కార్యకర్తల, నేతల రాజీనామాలు మొదలయ్యే అవకాశం ఉంది.   ఇక, ఈ వేడి తెలుగుదేశం పార్టీని కూడా తాకితే, ఆ పార్టీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో, రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన చంద్రబాబు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

విభజిస్తే ఎంతకైనా తెగిస్తాం

      రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రాన్ని, రాయలసీమను విభజించే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారని శ్రీకాంత్ ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నారు. రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించవద్దని ఆయన కోరారు. విభజన విషయంలో నిర్ణయం తీసుకునే ముందు అన్ని పార్టీల నిర్ణయం తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆటాడుకుంటోందని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాను ఎప్పుడో రాజీనామా లేఖ ఇచ్చానని, ఈ విషయంలో తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా చేస్తామని సీమాంధ్ర మంత్రులు చెప్పడం ఓ డ్రామా అన్నారు. ఆ నేతలకు ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

ఎమ్మెల్యే బాలినేని రాజీనామా!

      ఒంగోలు ఎమ్మెల్యే వైఎస్ఆర్.కాంగ్రెస్ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని కోరుతూ ఎమ్మెల్యే బాలినేని పదవికి రాజీనామా చేసినట్లు ఒంగోలులోని తన కార్యాలయంలో నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవిభజన కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాష్ట్ర నేతలతో చర్చలు జరిపే నేపధ్యంలో ఈ రాజీనామా ప్రకటన వెలువడింది. రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలనే డిమాండుతో తాను రాజీనామా చేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబు కష్టం ఫలించిందా

  గత రెండేళ్లుగా గడ్డు కాలం ఎదుర్కొన్నతెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో మళ్ళీ ఆ పార్టీ దారిన పడుతున్నట్లు కనబడుతోంది. ఇందుకు ప్రధాన కారణాలు ఆ పార్టీ తెలంగాణా అనుకూల వైఖరి ప్రకటించడం, అదే సమయంలో చంద్రబాబు తన సీమంధ్ర నేతలని అదుపుతప్పకుండా ఉంచగలగడం, ఆయన తన శక్తికి మించి శ్రమపడి పాదయాత్ర చేయడం, పంచాయితీ ఎన్నికలను కూడా సాధారణ ఎన్నికలంత సీరియస్ గా తీసుకొని పకడ్బందీ వ్యూహాలతో పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయడం, అంతే స్పూర్తితో పార్టీ క్యాడర్లు కూడా పనిచేయడంవంటివన్నీకలిసి పంచాయితీ ఎన్నికలలో ఆ పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టాయి.   మొదట్లో తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజనపై రెండు కళ్ళ సిద్ధాంతం పాటించినప్పటికీ, అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా తీసుకోవడంతో తెలంగాణా ప్రాంతంలో ఆ పార్టీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. (నేటికీ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనపై కుమ్ములాడుకొంటుంటే, వైకాపా తన వైఖరి ప్రకటించడానికి కూడా జంకుతోంది.) అదే సమయంలో ఆయన తెలంగాణాలో పాదయాత్ర చేయడం కూడా పార్టీకి కలిసివచ్చింది.   ఆ సమయంలో తెరాస, తెదేపాను దాని అధ్యక్షుడు చంద్రబాబును ఎంతగా విమర్శలు చేసినప్పటికీ, ఆయన తన సీమంద్రా నేతలను కట్టడి చేయడంతో, తెలంగాణా ప్రజలు తెరాస మాటలు నమ్మలేదు. దానితో చంద్రబాబులో, తెదేపా నేతలలో, క్యాడర్లలో కొత్త ఉత్సాహం వచ్చింది. తత్ఫలితంగా సీమంధ్ర ప్రాంతంలో కంటే తెలంగాణాలోనే ఆయన పాదయాత్ర మరింత ఉత్సాహభరితంగా, దిగ్విజయంగా సాగింది. ఆయన తన పాదయాత్రలో మారుమూల గ్రామాలలో కార్యకర్తలను కూడా కలుస్తూ, జిల్లాలవారిగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తూ ముందుకు సాగడం వలన పాదయాత్ర వలన పార్టీకి ప్రయోజనం చేకూరింది.   ఇక, విశాఖలో నిర్వహించిన బహిరంగ సభ ఊహించిన దానికంటే చాలా విజయవంతం అయ్యింది. పాదయాత్ర ముగించిన తరువాత చంద్రబాబు కార్యాలయానికి చేరుకొన్న వెంటనే ముందుగా పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. నేతలకి, కార్యకర్తలకి మధ్య చక్కని సమన్వయం ఏర్పరచి పంచాయితీ ఎన్నికలకి ముందు నుండే అందరినీ సన్నధం చేయడంతో విజయం సాధించగలిగారు.

రాజీనామా చేస్తామని ప్రకటించలేదు

      సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను మంత్రి టిజి వెంకటేష్ ఖండించారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని...రాజీనామాలు చేస్తామని ప్రకటించలేదన్నారు.   నాలుగు గోడల మధ్య జరిగిన భేటీపై వివరణ తీసుకొని వార్తలు రాస్తే బాగుండేదన్నారు. సమైక్య రాష్ట్రమే తాము కోరుతున్నామన్నారు.  వెనుకబాటుతనం విషయానికి వస్తే మాత్రం ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని వారు అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నామే గానీ రాజీనామాలను చెప్పలేదన్నారు. విభజన పైన కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్నదనే గానీ.. విభజన ఇప్పుడే అని చెప్పలేదని అన్నారు.