వాజ్ పేయి కోరితే భారతరత్న వాపసుకి సిద్ధం: అమర్త్యసేన్
posted on Jul 25, 2013 @ 8:40PM
నోబెల్ మరియు భారతరత్నవంటి అత్యున్నత అవార్డులు అందుకొన్న ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఇటీవల తాను నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా అంగీకరించలేనని ప్రకటించడం ఒక సరికొత్త వివాదానికి దారి తీసింది. ఆయన ఎన్డీయే ప్రభుత్వ హయంలో నాటి భారతప్రధాని అటల్ బీహారీ వాజపేయి చేతుల మీదుగా భారతరత్నఅవార్డు అందుకొన్నారు. ఇప్పుడు ఆయన మోడీకి వ్యతిరేక వ్యాక్యలు చేయడంతో ఆ పార్టీకి చెందిన చందన్ మిత్రా అనే నేత, అమర్త్యసేన్ కనీసం భారతదేశంలో ఓటరుగా ఉండే హక్కు కూడా లేదని తీవ్రంగా విమర్శించారు. అంతే గాక, బీజేపీ హయంలో ఆయన పుచ్చుకొన్న భారత రత్న అవార్డును కూడా వెనక్కు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసారు. దీనితో తీవ్రంగా నొచ్చుకొన్న అమర్త్యసేన్, తనకు ఆ అవార్డు ప్రధానం చేసిన వాజపేయి కోరితే, తను తప్పకుండా ఆ అవార్డుని వెనక్కి తిరిగి ఇచ్చేస్తానని జవాబిచ్చారు. కానీ, అవార్డుని వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం చాల దురదృష్టమని అన్నారు. ఈ సంఘటన రాజకీయ పార్టీల పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ఆయనతో సహా ప్రజలందరికీ కూడా భావ ప్రకటన స్వేచ్చఉంది. అయితే, కొందరు రాజకీయ నాయకులు దానిని మన్నించలేకపోవడం నిజంగా విచారకరమే. మోడీని ఈ దేశంలో ఎంతమంది అభిమానిస్తున్నారో, అంతే మంది వ్యతిరేఖిస్తున్నారు కూడా. చివరికి ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీతో సహా పలువురు నాయకులు మోడీని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నవిషయం అందరికీ తెలిసిందే. మరటువంటప్పుడు, సదరు బీజేపీ నేత చందన్ మిత్రా అద్వానికీ, బీజేపీలో మోడీని వ్యతిరేఖిస్తున్నవారికీ, మోడీని వ్యతిరేఖిస్తున్న భారతీయులకీ కూడా అదే సూత్రం వర్తింపజేయగలరా?