మళ్ళీ తెలంగాణపై కొత్త రాగాలు

  రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, హోంమంత్రి షిండే ఇద్దరూ తెలంగాణపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని ఎంత గట్టిగా చెపుతున్నాకూడా మీడియాలో మాత్రం రోజుకో కధనం వండి వడ్డించబడుతూనే ఉంది.   ఈ రోజు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఇక తెలంగాణా వచ్చేసినట్లే అంతా ఖాయమయి పోయింది’ అంటూ తెలంగాణావాదులకు మంచి కమ్మటి వార్త అందిస్తే, మరో పత్రిక ‘వర్కింగ్ కమిటీ తరువాత అఖిలపక్ష సమావేశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2వ యసార్సీ గురించి కూడా ఆలోచిస్తోంది’ అంటూ ఒక వార్త మోసుకు వచ్చింది. మరి ఈ విధంగా రకరకాల వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఎవరు ఇటువంటి కబుర్లు వారికి అందజేస్తున్నారు? అసలు వాటిలో నిజమెంత అబద్దమెంత? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.   మీడియాలో నిత్యం వండి వడ్డించే ఇటువంటి వార్తల వలన ప్రజలలో ఆందోళన మరింత పెరుగుతుంది. గనుకనే దిగ్విజయ్ సింగ్, షిండే ఇద్దరూ కూడా పదేపదే రాష్ట్ర విభజన అంశంపై ప్రకటనలు చేయక తప్పడం లేదు.   మరి ఈ వార్తలపై వెంటనే స్పందించకపోతే ఏమి జరుగుతుంది అందరికీ తెలిసిందే గనుక కాంగ్రెస్ నేత అహ్మద్‌పటేల్ మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణపై మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించే ప్రసక్తి లేదు. అవన్నీ ఒట్టి వదంతులే”నని తేల్చిపారేసారు. అందువల్ల ప్రజలు కూడా త్వరలో జరుగబోయే వర్కింగ్ కమిటీ కోసమే ఓపికగా ఎదురుచూడటం మంచిది.

ముగిసిన కోర్ కమిటీ భేటి

      ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ నివాసంలో సాయంత్రం జరిగిన కోర్ కమిటీ ముగిసింది. ప్రత్యేక తెలంగాణ సమస్యపై సిడబ్ల్యూసీ సమావేశం త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్య సంతరించుకుంది. తెలంగాణ సమస్య పరిష్కారంపై మంతనాలు జరిపారు. రెండో ఎస్సార్సీయా లేక అఖిలపక్షమా అన్న దానిపై చర్చలు జరిపారు. అలాగే యుపీఏ భాగస్వామ్య పార్టీలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి యుపిఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్‌నాథ్, అహ్మద్ పటేల్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌కూడా మహారాష్ట్రలో ఈరోజు మధ్యాహ్నాం ఓ ప్రటకన చేశారు. తెలంగాణ విషయంలో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయిందని, అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని త్వరలో ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు.

భారతరత్నకు సచిన్ కాదని ధ్యాన్‌చంద్

      భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు నిరాశే ఎదురైంది. క్రీడా మంత్రిత్వ శాఖ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి క్రికెట్ దిగ్దజం సచిన్ టెండూల్కర్ పేరును కాదని ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేసింది. ధ్యాన్ చంద్ మరణించిన 25 ఏళ్ల తర్వాత ఆయన పేరును భారత రత్న అవార్డుకు సిఫార్సు చేశారు. క్రీడారంగం నుంచి దేశంలో భారతరత్నకు సిఫార్సు అయిన మొదటి పేరు ధ్యాన్ చంద్‌దే కావడం విశేషం.   సచిన్ టెండూల్కర్ పేరును కాదని ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేయడాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సమర్ధించుకుంది. సచిన్ పట్ల తమకు గౌరవం ఉందని, కాని ధ్యాన్ చంద్ దేశ క్రీడాచరిత్రలో ఉత్తమ స్థానంలో ఉండదగినవారని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్ దేవ్ అన్నారు. ప్రధాని కార్యాలయానికి ఒక్క పేరును మాత్రమే సిఫార్సు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ధ్యాన్ చంద్ 1928, 1932, 1936 సంవత్సరాల్లో వరుసగా ఒలింపిక్స్‌లో భారతదేశానికి హాకీలో స్వర్ణపతకాలు సాధించి పెట్టాడు. భారత హాకీ చరిత్రకు ఇది చాలా గర్వకారణమని, ధ్యాన్ చంద్‌కు ఈ అవార్డు వస్తుందని తాము ఆశిస్తున్నామని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రా అన్నారు.  

అక్బరుద్దీన్ కు హైకోర్టులో ఊరట

      హిందువులు, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసికి హైకోర్టులో ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేయవద్దని అక్బరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కోర్టు దానిపై తీర్పు ఇచ్చింది. ఒక నేరానికి సంబంధించి వేర్వేరుగా ఎప్ఐఆర్‌లు దాఖలైనా, ఒకే సంస్థ దర్యాఫ్తు చేస్తుందని న్యాయస్థానం తెలిపింది. కేసులన్నీ ఒకటిగా చేసి సిఐడితో విచారణ జరిపించాలని ఆదేశించింది.   అక్బరుద్దీన్ ఓవైసీ అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగాను గత జనవరిలో అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను కొన్నాళ్లు జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుండి పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో పలువురు అక్బరుద్దీన్ పైన ఫిర్యాదు చేశారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు.

కాంగ్రెస్ లో కన్ ఫ్యూజన్

  ఏనుగు చచ్చినా బ్రతికినా దాని విలువ ఒక్కటే నన్నట్లు, కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన రాజశేఖర్ రెడ్డి చనిపోయి చాలా కాలం అయినప్పటికీ ఆయనని తలుచుకొని కాంగ్రేసోడు లేడు. కొందరు “ఆయనంత మంచోడు ఈ భూప్రపంచం మీదనే పుట్టలేదు, మరి పుట్టడు కూడా!” అని వాదిస్తుంటే, “నిజమే అటువంటి అవినీతిపరుడు పుట్టలేదు. ఇక ముందు కూడా పుట్టబోడు” అని వారినే సమర్దిస్తూ అడ్డుగా వాదిస్తుంటారు. మళ్ళీ చూస్తే అందరూ కాంగ్రెసోళ్ళే! ఇంతకీ ఆయనని వదిలించుకోవాలో లేక ఇంకా భుజానికెత్తుకొని తిరగాలో తెలియక పాపం! నేటికీ ఇంకా తికమకపడుతూ డిల్లీ వైపు చూస్తుంటారు ఆదేశాలకోసం. “ఆయన చాలా మంచివాడని” “వాళ్ళది మనదీ డీ.యన్.యే. సేంసేం” అని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ అంతటివాడు చెప్పినా కూడా ఈ కాంగ్రెస్సోళ్ళకు కనఫ్యుస్ పోలేదు.   పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు “ఆయన (రాజశేఖర్ రెడ్డి) పెద్దమందు బాబు గొంతు తడపుకోనిదే పాపం! ఆయనకి నిద్రపట్టదని” శలవిస్తుంటే, “ఓస్! అందులో తప్పేముంది? నేను కూడా ఓ పెగ్గు వేస్తుంటానని” గండ్ర నిలకడగా నిలబడి మరీ చెప్పారు. “అసలు బొత్స చెప్పింది ఆవగింజలో అరవయ్యో వంతే, వైయస్సార్ జాతక చక్రమంత ఔపోసన పట్టిన ఘనాపాటి మా బొత్స బాబు. ఆయన నోరు విప్పితే వైయస్ కుటుంబం మరిక చుట్టుపక్కల కనబడకుండా పారిపోకతప్పదు. అయినా రాజశేఖర్ రెడ్డి అదృష్టం బాగుంది గాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మా అదృష్టం బాగోలేదు గాబట్టి మేము కాలేకపోయాము” అని హనుమంతన్న బరువుగా నిట్టూర్చారు.   ఇక ఉండవల్లి “పాపం పెద్దాయన చాలా అమాయకుడు. వెనుక నుండి కొడుకు నొక్కేస్తుంటే సరిగ్గా చూసుకోలేకపోయాడు. ఆయన మహా నిఖార్సయిన మనిషి, కానీ కొడుకే ప్చ్!” అని బాధపడ్డారు. “వాళ్లిద్దరూ కూడా ఒక గూటి చిలుకలే కదా! మరి అందుకే ఆయన అలా పలుకుతారు. రాజశేఖర్ రెడ్డి గురించి మమ్మల్ని అడగండి, ఆయన మా తెలంగాణా నీళ్ళని, గనులని, భూములని, ఎట్లా దోచుకోన్నాడో చెపుతాము” అని టీ-కాంగ్రెస్ నేతలు గర్జిస్తున్నారు. ఇంతకీ ఈ కాంగ్రెస్సోళ్ళకు ఈ  కన్ ఫ్యూజన్  ఎప్పుడుపోతుందో? అసలు పోతుందో లేదో కూడా తెలియదు.

ఉండవల్లి ఓ ఊసరవెల్లి

      రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌ తెలంగాణపై మరోసారి విషం చిమ్ముతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు మండిపడ్డారు. విశాఖ వెనుకబడిందని ఆయన చెబుతున్నారని కానీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో విశాఖ ఉందన్నారు. 1972లోనే విభజన జరిగితే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందేవన్నారు.   విభజన ద్వారా తెలంగాణే కాకుండా సీమాంధ్ర కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణపై విస్తృత చర్చ జరగాలని ఉండవల్లి అంటున్నారని, అరవై ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉందని, ఎప్పుడు చర్చ జరగలేదో చెప్పాలన్నారు. విభజన జరగకపోవడం వల్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు యాభై ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. ఉండవల్లి అనవసర రాద్ధాంతం చేయవద్దన్నారు. ఉండవల్లి సమైక్యవాది కాదు, వేర్పాటువాది కాదని, అవకాశవాది అన్నారు. ఒకవేళ విశాఖ అభివృద్ధి చెందలేదంటే అది సీమాంధ్ర నేతల వల్లే అన్నారు. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని మండిపడ్డారు. 1973లో సినీ హీరోలు కృష్ణ, కృష్ణం రాజులు కూడా విభజననే కోరుకున్నారన్నారు.

బొత్స దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి

        దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చాలా తెలుసునని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత్‌రావు పేర్కొన్నారు. బొత్స ప్రస్తుతం ఒక్క బాణం మాత్రమే వదిలారని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నారు. వైఎస్ కష్టంతో ప్రభుత్వం ఏర్పడిందనడం సరికాదని అన్నారు. అలాగైతే 2009లో 156 సీట్లే ఎందుకు వచ్చాయని వీహెచ్ ప్రశ్నించారు. తన అన్న పులి బోనులో ఉన్నాడని, బయటకు వస్తారని, రామరాజ్యం తెస్తారని షర్మిల ప్రచారం చేస్తున్నారు. ప్రజలను చంపుకు తినే పులి జైలులోనే ఉంటే మంచిదని వీహెచ్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకు వస్తే రాష్ట్రాన్ని దోచేస్తాడని వీహెచ్ అన్నారు. ఏమీ లేనప్పుడే రాష్ట్రాన్ని దోచుకున్నాడు, ఇప్పుడు బయటకు వస్తే అందరినీ తినేస్తాడని వీహెచ్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకు వస్తే రామరాజ్యం అయితే తాను చూడలేనని, ఏం జరుగుతుందో మాత్రం రాష్ట్ర ప్రజలకు తెలుసునని హనుమంతరావు పేర్కొన్నారు.

వైయస్ హయాంలో ఉద్యమంలా ఫీజు పథకం

      వైయస్ హయాంలో ఉద్యమంలా ఫీజు పథకం ఉండేదని, అదో విప్లవమని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మండిపడ్డారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి విద్యార్థి చదువుకు భరోసా ఇచ్చారని, వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా చెల్లించారని అన్నారు.ఆయన చనిపోయాక అసలు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులకు చెల్లించే ఫీజు ఎగ్గొట్టటానికి సర్కారే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.కళాశాలల యాజమాన్యాలు వేధింపుల వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. అందుకే తాము ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ దీక్షలకు ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.  సమస్యలకు జవాబు చెప్పలేని ప్రభుత్వం, ప్రజలకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోందని విమర్శించారు.  

పదవీ విరమణకు ముందు భంగపడిన చీఫ్ జస్టిస్ కబీర్

పలు సంచలనాత్మకమయిన తీర్పులు వెలువరించి భారత న్యాయ వ్యవస్థకే వన్నెతెచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ పీ.సదాశివం ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్ది వారల క్రిందటే ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.   ఆయన రెండు వారల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ తనతో సహా హెచ్.యల్.దత్తు, ఆర్.యం.లోదా, పీ.సదాశివం, జీ.యస్.సంగ్వీలతో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కలేజియంను హాజరుపరచి, ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న ఒకరిని సుప్రీంకోర్టు జడ్జీగా నియమించాలని కోరారు.అయితే అప్పటికీ, రాష్ట్రపతి పీ.సదాశివంను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో, వారు అల్తమాస్ కబీర్ కోరికను సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ ఆయన నలుగురు సభ్యులని తన ప్రతిపాదనపై విడివిడిగా అభిప్రాయలు తెలుపవలసినదిగా కోరడంతో వారు నిర్ద్వందంగా అయన ప్రతిపాదన తిరస్కరించారు. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న ఆయన అటువంటి కోరిక కోరడం అనుచితమని, చట్టవిరుద్దమని వారు తేల్చి చెప్పడంతో వారిపట్ల అల్తమాస్ కబీర్ ఆగ్రహంతో ఉన్నారు.   ఏదిఎమయినప్పటికీ, అత్యంత హుందాగా, సమర్ధంగా తన పదవీ బాధ్యతలను నిర్వర్తించిన ఆయనకి కొద్ది రోజులలో పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఇటువంటి కోరిక కోరడం వలన భంగపాటు తప్పలేదు. కానీ, అది చంద్రునికి మచ్చవంటిదే.

వైఎస్, బొత్సల గుట్టు బయటపడింది

      దివంగత వైఎస్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలపై టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వైఎస్ బతికున్న రోజుల్లో ఒకరి తప్పును మరొకరు కాపాడుకుంటూ వచ్చారని, ఇప్పుడు బొత్స విమర్శలతో అసలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విభేదాలు చోటుచేసుకోనంతవరకూ వైఎస్, బొత్స చేసిన అక్రమాలు, దోపిడీల్లో ఇరుకుటుంబాలూ భాగస్వాములయ్యాయని ఆరోపించారు. వైఎస్ అల్లుడు అనిల్ చేసిన తప్పులు, దోపిడీల గురించి ఇప్పటికైనా వెల్లడించాలని బొత్సను.. తన తప్పులు, అక్రమాలను బొత్స ఎలా కప్పిపుచ్చారో చెప్పాలని అనిల్‌ను డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రాన్ని మరెంతగా దోపిడీ చేసేవారోనని ఆందోళన వ్యక్తం చేశారు. బయ్యారం గనులను వైఎస్ తన అల్లుడు అనిల్‌కు కట్టబెట్టినప్పుడు బొత్సకు మాట ఎందుకు పెగల్లేదని నిలదీశారు.

కాంగ్రెస్ గోత్రాలు కాంగ్రెస్ వాళ్ళకే ఎరుక

  గొర్రెల గోత్రాలు కాపరుల కెరుక, గొప్ప వాళ్ళ గోత్రాలు ఇంట్లో పని మనుషులకు కెరుక అన్నట్లు, కాంగ్రెస్ గోత్రాలు కాంగ్రెస్ వారికి తెలిసినంత బాగా మరొకరికి తెలిసే అవకాశం లేదని వారు అప్పుడప్పుడు నిరూపిస్తుంటారు. వాళ్ళు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకొంటున్నపుడు అవి విని ఆశ్చర్యపోవడం ప్రజలవంతవుతుంది. మొన్నబొత్స బాబుగారి విజయనగర సామ్రాజ్యంలో అడుగుపెట్టిన షర్మిల, ఆయనని ‘గుమ్మడి కాయలదొంగ’ అని ఉంటే ఈ కధ అంతా బయటకి వచ్చేదే కాదు. కానీ, ఆమె నేరుగా ఆయనకి ‘లిక్కర్ మాఫియా డాన్’ అనే బిరుదు ప్రకటించేయడంతో, ఆయన కంగు తిన్నారు.   ఇదివరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా ఒకసారి ఏసీబీ అధికారులని తనపైకి ఇలాగే ‘ఉస్కోఉస్కో..’అని పంపిస్తే, అందులోంచి బయటపడేందుకు తలప్రాణం తోక్కకి వచ్చినంత పనయింది. అందువల్ల ఇప్పుడు ఇంకా భుజాలు తడుముకొంటూ కూర్చొంటే దెబ్బయిపోతామని భావించిన బొత్సబాబు వెంటనే తన దగ్గర ఉన్న వైయస్ కుటుంబ జాతక చక్రం బయటకి తీసి అందులోఉన్నకొన్ని వివరాలను గడగడా చదివి వినిపించేసరికి జనాలు ఔరా! అని నోటి మీద వెళ్ళేసుకోక తప్పలేదు.   రాష్ట్రానికి దైవపాలన అందజేసిన వైయస్ రోజూ ఒక పెగ్గు బిగిస్తే గానీ మంచం ఎక్కేవారు కాదని ఆయన ప్రజలకి తెలియజేసారు. అయితే, ఈ రోజుల్లో ఇదంతా కామన్ అంటూ, అదేమంత గొప్ప పట్టించుకోవలసిన విషయం కాదని జనాలు కొట్టి పడేస్తారనుకొన్నారో ఏమో గానీ, ఆయన మరో గొప్ప రహస్యం కూడా బయటపెట్టారు. తన అద్భుతమయిన మహత్తులతో ప్రజలందరినీ కాపాడిపడేస్తున్న అనిల్ ఏదో కేసులో ఇర్రుకొంటే సతీసావిత్రిలా నా భర్తని కాపాడమని ఆ రోజు నువ్వు నా చుట్టూ తిరిగిన రోజులు గుర్తులేవా? అంటూ ప్రశ్నించడంతో రాష్ట్ర ప్రజలు “ఔరా! వీళ్ళ మధ్య ఇంత మంచి అండర్ స్టాండింగ్ ఉందా?” అనుకొంటూ ఆశ్చర్యపోయారు మరోసారి.   “పాపం చిన్నపిల్ల షర్మిల ఏదో ముచ్చటపడి ఆయనకి చిన్న బిరుదు ఇస్తే దానికే ఇంతగా ఆవేశపడిపోవాలా?” అని రాజకీయ నేతలందరూ ముసిముసినవ్వులు నవ్వుకొంటుంటే, అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకే మండిందన్నట్లు, బొత్స మరింత ఆవేశపడిపోతూ “అసలు విజయమ్మ ఫీజుపోరు దీక్ష అంతా దొంగ దీక్ష, ఆమె కార్పోరేట్ కాలేజీలకి మద్దతుగా వారికి లాభాలు తెచ్చిపెట్టేందుకు ఇప్పుడు సిట్టింగ్ వేసారు,” అంటూ పాపం దీక్షలో ఉన్న విజయమ్మనుకూడా అదే నోటితో ఏకిపారేశారాయన.   దీని వల్ల పామర జనాలకి అర్ధమయింది ఏమిటంటే సీబీఐ, ఏసీబీ,సీఐడీ మొదలయిన గూడచారి సంస్థలన్నీకలిసిగట్టుగా శోధించినా కనిపెట్టలేని ఇటువంటి బ్రహ్మ రహస్యాలను కేవలం కాంగ్రెస్ వాళ్ళు తలచుకొంటేనే బయటపడతాయి, లేకుంటే అవి వాళ్ళు ధరిస్తున్న టోపీల క్రిందనే శాశ్వితంగా పడిఉంటాయని, అప్పుడు వారందరూ కూడా వారు ధరించి తిరుగుతున్నతెల్ల ఖద్దరు చొక్కాలంత స్వచ్చంగా కనిపిస్తారని జ్ఞానోదయం కలిగింది.   ప్రజలు కూడా “హాట్స్ ఆఫ్ టూ కాంగ్రెస్” అనుకొన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం “వద్దులే! ఆ హ్యాట్స్ తీస్తే మీరు తట్టుకోలేరని నెత్తిమీద ఖద్దరు టోపీలను సర్దుకొన్నారు.

బీహార్‌లో శవరాజకీయాలు

      చాప్రా జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి 27 మంది చిన్నారులు చనిపోయిన ఘటనను కూడా రాజకీయం చేస్తున్నాయి ఆ రాష్ట్ర పార్టీలు..బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బీహార్‌ విద్యాశాఖ మంత్రి పీకే షాహి ఘటనలో కుట్ర ఉందని ఆరోపించారు. సర్కారు మీద ఎలాంటి ఆరోపణలు రాకుండా తప్పంతా ప్రిన్స్‌ పాల్‌దే అని తేల్చేశారు.. వంటనూనె కల్తీవల్లే దుర్ఘటన జరిగిందని... వంట నూనెలో ఆర్గానిక్‌ పాస్ఫరస్‌ కలిసినట్లు వైద్యులు ధృవీకరించారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌ మీనాకుమారి దృష్టికి తీసుకెళ్లినా ఆమె నిర్లక్షం వహించింది అని చెప్పారు. ఈ క్రమంలో మంత్రి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఖండించింది. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర సర్కారు ఇలాంటి ఆరోపణలు చేస్తుందని విమర్శించింది.. ప్రభుత్వ అసమర్థతే దుర్ఘటనకు కారణమని ఆరోపించింది. బాధితులు సైతం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పాఠశాల యాజమాన్యం సక్రమంగా పనిచేస్తే ఘోరం జరిగేది కాదని మండిపడ్డారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్  చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం నితీశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్  చేశారు.చాప్రా కలెక్టర్  నివాసం ముందు ఆందోళనకు దిగారు. అటు చాప్రా ఘటన నుంచి తేరుకోకముందే.. బీహార్‌లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. మధుబని జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 22 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. భోజనంలో బల్లి పడటంవల్లే ఘటన జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.

సీఎం కిరణ్‌ చిన్నపిల్లాడు

      కోర్‌ కమిటీలో తెలంగాణ విషయమై కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇచ్చిన రోడ్‌మ్యాప్‌ పై టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్యాకేజి ఇవ్వాలన్న సీఎం మాటలతోనే తెలంగాణ వెనుకపడిందన్న విషయం ప్రభుత్వం అంగీకరించిందన్నారు ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌ కేశవరావు.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నక్సల్స్‌ సమస్య వస్తుందనటం సియం అజ్ఞానం అన్నారు..   రాష్ట్రన్ని విడదీస్తే జలవివాదాలు వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటలు చిన్నపిల్లాడిలా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు కేకే. తెలంగాణ ఉద్యమం ప్యాకేజీలు సాదించటానికి కాదని స్వరాష్ట్ర సాదించే వారకు ఉద్యమాన్ని కోనసాగిస్తామన్నారు.. సియం తెలంగాణకు వ్యతిరేకంగా రోడ్‌మ్యాప్‌ ఇచ్చినప్పటికీ నోరు మెదపని టికాంగ్రెస్‌ నేతలపై కూడా కేకె విరుచుపడ్డారు.. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు సియం ఎందుకు నిలదీయటం లేదంటూ ప్రశ్నించారు.. తెలంగాణ పై కాంగ్రెస్‌కి ముందునుంచి సానుకూల వైఖరి లేదని... కాంగ్రెస్‌కు ప్రత్యేకరాష్ట్ర అంశాన్ని తేల్చే ఉద్దేశం లేదన్నారు.

మోడీ స్టేట్‌మెంట్స్‌పై బిజెపిలో దుమారం

      గోద్రా అల్లర్లపై మోడీ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రుపుతూనే ఉన్నాయి.. మోడీ వ్యాఖ్యలను సమర్థించినందుకు బీఎస్పీ ఎంపీపై ఆ పార్టీ వేటు వేసింది. గోద్రా అల్లర్లకు సంబంధించి మోడీ చేసిన కుక్కపిల్ల వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని... కావాలనే ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని బీఎస్పీకి చెందిన ఎంపీ విజయ్‌ బహదూర్‌సింగ్‌ మీడియాకు తెలిపారు. అయితే తన ప్రత్యర్ధికి సపోర్ట్‌ చేయటం పై మాయావతి తీవ్రంగా స్పందించింది.. విజయ్‌ కామెంట్‌లను ఆమే తీవ్రంగా పరిగణించింది. అంతేకాదు మరెవరు అలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇవ్వకుండా విజయ్‌ బహుదూర్‌ సింగ్‌ను  పార్టీ నుంచే సస్పెండ్‌ చేసేసింది. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంభందం లేదని బహిరంగ ప్రకటన విడుదల చేసింది. మొదదటి నుంచి బీఎస్పీ మొదటి నుంచి మోడీని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మోడీని సమర్థిస్తే పార్టీ ఇమేజ్‌ దెబ్బతింటుందని భావించిన మాయావతి.. ఎలాంటి వివరణ తీసుకోకుండానే ఎంపీ విజయ్‌ బహదూర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇదిలా ఉంటే మోడికి సొంతం పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది.. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీ బిజెపి ఉపాధ్యక్షుడు ఆమీర్‌ రాజా హుస్సేన్‌ పార్టీకి రాజీనామా చేశారు.. పైగా 2002 గోద్రా అల్లర్ల పాపం నుంచి మోడీ తప్పించుకోలేరని విమర్శించారు.

తెలంగాణాలో వైకాపా సెల్ఫ్ గోల్

  అన్ని పార్టీలు తెలంగాణా అంశంపై అనర్గళంగా మాట్లాడుతుంటే, తాము మాత్రం ఇంత కాలం ఈ అంశంపై మాట్లాడకుండా ఉండి రాజకీయంగా నష్టపోయామనే ఆలోచన రావడం వలననో, లేక కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న రాయల తెలంగాణా ఆలోచన వద్దని హెచ్చరించాలనే ఆలోచనో మరి తెలియదు కానీ వైకాపా తెలంగాణా అంశంపై కాంగ్రెస్ ఒంట్టెత్తు పోకడలకు పోతోందని విమర్శిస్తూ ఒక లేఖ వ్రాసింది. అయితే అది కాస్తా ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయబోయి చివరికి పేడలో కాలు వేసినట్లయింది.   ఇంత కాలం తెలంగాణా అంశంపై ఏమి మాట్లాడితే ఏమవుతుందో అనే భయంతో నోరుమెదపకుండా నెట్టుకొచ్చిన వైకాపా, ఇక నేడో రేపో కాంగ్రెస్ తెలంగాణా అంశం తెల్చేసేందుకు సిద్దపడుతుంటే, ఇప్పుడు ఆఖరి నిమిషంలో లేఖ వ్రాయడంతో తెలంగాణావాదులు ఆ పార్టీపై భగ్గుమన్నారు.   కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “క్రిందటి సం. జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకొన్నాతమకి ఎటువంటి అభ్యంతరం లేదని పదిమంది ముందు చెప్పివచ్చిన వైకాపా, ఆ సంగతి మరిచిపోయి నేడు కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా తెలంగాణా అంశం ఏదో ప్రైవేట్ వ్యవహారంలా చేసుకుపోతోందని విమర్శించడం ఆ పార్టీ రాజకీయ అజ్ఞానమయినా అయి ఉండాలి లేదా తెలంగాణా అడ్డుకొనేందుకు కుట్ర అయిన అయ్యి ఉండాలి. సీమంద్రాకు చెందిన మైసూరా రెడ్డి, తమ పార్టీ వ్రాసిన లేఖను ఖండించలేకపోవచ్చును. కానీ, స్వయంగా అఖిలపక్షానికి కూడా హాజరయ్యి, ‘కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకొన్నాతమకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలుపుతూ’ ఆపార్టీ వ్రాసిన లేఖని తన స్వహస్తాలతో హోంమంత్రికి ఇచ్చిన తెలంగాణకు చెందిన ఆ పార్టీనేత మహేంద్ర రెడ్డి తమ పార్టీ కాంగ్రెస్ కు వ్రాసిన లేఖను ఎందుకు ఖండించట్లేదు?” అని ప్రశ్నించారు. వైకాపా ఏదో ఆశించి తెలంగాణా అంశం గురించి ప్రస్తావించబోతే అదికాస్తా చివరికి ఇలా బెడిసికొట్టింది.

నల్లసూరీడి పుట్టిన రోజు

      నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా తన 95 వ పుట్టినరోజును ఈ సారి హాస్పిటల్‌లోనే జరుపుకుంటున్నారు.. 67 సంవత్సరాల పాటు నల్లజాతి హక్కుల పోరాడిన ఈ పోరాట మోదుడి జన్మదినాన్ని దక్షిణాఫ్రికా ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తుంది..   ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణం జూన్‌ 8 న హాస్పిటల్‌లో చేరిన మండేలా అప్పటి నుంచి ట్రీట్‌మెంట్‌లోనే ఉన్నారు.. ఇంతకు వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోయినా నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు.. ఆఫ్రికాలో అనగారి వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలకు గుర్తుగా నోబల్‌ ప్రైజ్‌న్‌ కూడా అందుకున్నారు మండేలా.. అంతేకాదు ఆయన చేసిన సేవలకు గాను ఆయన పుట్టిన రోజును ఇంటర్‌నేషనల్‌ మండేలా డేగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి.. ప్రస్థుతం సీరియస్‌ కండిషన్‌లో హాస్పిటల్‌లో ఉన్న మండేలా కోసం ఆ దేశ ప్రజలు ఆయన అభిమానులు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు..

దట్ ఈజ్ బొత్స

  ఇంతకాలం రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం చెప్పకుండా ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పుకొస్తూ రోజులు దొర్లించేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మొన్న కోర్ కమిటీ సమావేశంలో సమైక్యాంధ్రకి అనుకూలంగా గట్టిగా వాదించడంతో, ఇంతవరకు ఆయన చుట్టూ తిరిగిన పార్టీలోని తెలంగాణా నేతలు ఇప్పుడు తెరాస, టీ-జేయేసీల విమర్శలకు జడిసి ఆయనతో కలిసి మీడియా ముందుకి రావడానికి కూడా భయపడుతున్నారు.   ఇటువంటి సమయంలో చాలా తెలివిగా మసులుకొనే బొత్స సత్యనారాయణ, బహుశః తెలంగాణా వాదుల దాడి నుండి తప్పించుకోవడానికి రాష్ట్రం విభజిస్తే నక్సలిజం పెరిగిపోతుందని ముఖ్యమంత్రి అభిప్రాయంతో తానూ విభేదిస్తున్నానని మీడియాకు చెప్పుకొన్నారు. తద్వారా తాను కూడా తెలంగాణా వాదుల వాదనలతో ఏకీభవిస్తున్నానని చెప్పకనే చెపుతూ వారు తనమీదకు అస్త్రాలు ఎక్కుపెట్టకుండా జాగ్రత్తపడ్డారు.   పనిలోపనిగా సమైక్యవాదులను కూడా మంచి జేసుకోవడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కేవలం హైదరాబాదులోనే స్థాపించబడటం వలన రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏమాత్రం అభివృద్దికి నోచుకోకుండా చాలా వెనుకబడిపోయాయని, అయితే పరిస్థితులు ఇంతవరకు వచ్చిన తరువాత ఇప్పుడు దీని గురించి ఆలోచించడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదని, అందువల్ల రాష్ట్ర విభజన అనివార్యమయితే, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, సీమంధ్రకు రాజధాని ఏర్పాటు చేసుకొని, కొత్త రాష్ట్రం అన్నివిధాల స్థిరపడేవరకు అంటే కనీసం ఓ 20సం.ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని కోరినట్లు ఆయన చెప్పుతున్నారు.   బొత్స రాజకీయంగా చాలా చక్కగా వ్యవహరిస్తున్నారని అంగీకరించక తప్పదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వంలో, పార్టీలో గత నాలుగేళ్ళుగా కీలకమయిన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన మరి ఈ నాలుగేళ్ళ కాలంలోతన విజయనగరం జిల్లా అభివృద్దికి ఎన్ని కొత్త పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, మౌలిక వసతులు తీసుకు వచ్చారని ప్రశ్నిస్తే అందుకు సమాధానం ఉండదు. కానీ ఆయన కూడా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు వెనుకబడిపోయాయని బాధపడటం విడ్డూరం.

బిజెపి తెలంగాణ ఇవ్వలేదు: ఉండవల్లి

      తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని రాజమండ్రి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ పైన ఉన్న ప్రేమతో సీమాంధ్రులు విశాఖను విస్మరించారన్నారు. దేశ ప్రజలు ఒప్పుకుంటేనే రాష్ట్ర విభజన ఆపలేమన్నారు. రాష్ట్రం విడిపోయినా వచ్చే ప్రమాదమేమీ లేదని అన్నారు. దేశానికి మేలు జరిగే ఏ అభిప్రాయమైన తెలంగాణ, సీమాంద్ర నేతలు అంగీకరించాలని చెప్పారు.   టీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలకు అవాస్తవాలను చెప్పి, సీమాంధ్రులను దోపీడీ దొంగలుగా ముద్ర వేస్తున్నారని అన్నారు.  తెరాస నేతలు ఇరుప్రాంతాల మద్య విద్వేషాలు రగిలించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇవ్వలేదని అంటున్నారు. బిజెపి ఇచ్చిన మాటపై నిలబడలేదన్నారు. కాకినాడ ఒక వోటు రెండు రాష్ట్రాల తీర్మానం ఏమైందని ప్రశ్నించారు.  

తెలంగాణ పై ఆజాద్‌తో కిరణ్ భేటి!

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బెంగళూరులో కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో రహస్యంగా భేటి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆజాద్‌తో సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటి లో తెలంగాణాపై ఆజాద్‌తో కిరణ్ అరగంట పాటు చర్చించినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కిరణ్ కలవాల్సి ఉన్నా.. ఆజాద్‌తో భేటీ అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణపై త్వరలో సీడబ్యూసీ కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో ఆజాద్‌తో కిరణ్ సమావేశం కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.