మోడిని అమెరికా రానివ్వకండి

దేశ వ్యాప్తంగా మోడీ హవా బలపడుతున్న నేపథ్యంలో  ప్రత్యర్థి పార్టీలు ఆయనను ఎదుర్కోవటానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు.. ఇప్పటికే మోడిపై గుజరాత్ అల్లర్లు లాంటి విషయాలతో విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న పార్టీలు ఇప్పుడు మరో ఎత్తు వేశాయి. గుజరాత్ అల్లర్ల తరువాత హిందుత్వ వాదిగా ముద్రపడ్డ మోడిపై అమెరికా నిషేదం విదించింది.. ఆయన అమెరికా అనుమతించకుండా విసా నిరాకరించింది.. అయితే ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రన్ని అభివ్రుద్ది పథంలో నడిపిస్తుండటంతో అమెరికా ఆయనపై కొనసాగుతున్ననిషేదం పై పునరాలోచనలో పడింది. దీంతో ఇప్పుడు మోడీని అమెరికాకు అనుమతించొద్దు అంటూ పత్యర్ధి పార్టీల ఎంపిలు అమెరికా అధ్యక్ష్యుడు బరాక్ ఒబామాకు లేఖ రాశారు.. 25 మంది రాజ్యసభ, 40 మంది లొక్ సభ ఎంపిల సంతకాలతో ఈ లేఖను ఒబామాకు పంపించారు..మొదట రాజ్యసభ స్వతంత్ర అభ్యర్ది మొహమద్ అదిబ్ లేఖ రాయగా దానికి పలువురు కాంగ్రెస్, సిపిఐ, సిపియం సభ్యలు మధ్దతు పలికారు..

పంచాయితీల్లో సత్తా చాటిన టిడిపి

రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత పోలింగ్ లో 26 రెవెన్యూ డివిజన్లలో 5803 గ్రామ పంచాయితీల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం దాదాపు అన్ని జిల్లాలోనూ టిడిపి ముందంజలో ఉండగా, కాంగ్రెస్ వైసిపిలు రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.   ప్రస్థుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల ఫలితాల ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో ప్రత్యక్షంగా కనిపించింది. ఈ పంచాయితీ ఎలక్షన్స్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కింది స్ధాయిలో ఏమాత్రం కేడర్ లేకపోవటంతో వైసిపి దాదాపు అన్ని చోట్లా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. మరి కొన్ని గంటల్లో పంచాయితీ ఎన్నికల తొలిదశ పోలింగ్ పూర్తి ఫలితాలు వెలుడనుండగా ఈ ఫలితాలు రెండు మూడో దశలలో జరిగే పోలింగ్ పై కూడా ప్రభావం చూపిస్తాయంటున్నారు విశ్లేషకులు.

తాజ్ కన్నా ముందున్న తిరుపతి

  దేశంలోనే అత్యధిక మంది టూరిస్ట్ లను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ చరిత్ర స్రుష్టించింది.. మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలను వెనుకకు నెట్టి ఆంద్రప్రదేశ్ ఈ రికార్డును స్రుష్టించింది.గత సంవత్సరంలో దాదాపు 206.8 మిలియన్ల టూరిస్ట్ లు ఆంద్రప్రదేశ్ ను సందర్శించారు..అయితే ఆంద్రప్రదేశ్ ను సందర్శించిన వారిలో అధికంగా తిరుపతిని సందర్శించటానికే వచ్చారు.   ఆంద్రప్రదేశ్ తరువాత 184.1 మిలియన్ టూరిస్ట్ లతో తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉండగా,168.4 మిలియన్ టూరిస్ట్ లతో ఉత్తర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే అత్యధిక మంది టూరిస్ట్ లను ఆకర్షించిన మూడు ప్లేస్ లు ఆధ్యాత్మిక కేంద్రాలే కావటం విశేషం..   టూరిజం మినిస్టరీ హైయర్ అఫీషియల్స్ చెప్పిన లెక్కల ప్రకారం తాజ్ మహల్, ఎల్లోరా కేవ్స్ లాంటి పర్యాటక ప్రదేశాల కన్నా ఎక్కువ మంది టూరిస్ట్ లు ఆధ్యాత్మిక దామాలను చూడటానికి ఇష్టపడుతున్నారట.. విదేశి టూరిస్ట్ లు కూడా ఎక్కువగా ఇంలాటి స్ధలాలను చూడటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.. ప్రతి ఏటా ఆరు శాతానికి పైగా విదేశి టూరిస్ట్ ల సంఖ్య పెరుగుతుందని అంచనా..

తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనం

      తెలంగాణ సాధన కోసమని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిన ఎంపీ వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ఇబ్బంది కలిగే ప్రకటన చేశారు. తెలంగాణ ఇస్తే తిరిగి కాంగ్రెస్ లో చేరతారా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వకుండా తెలంగాణ ఇస్తే తెరాసే కాంగ్రెస్ లో విలీనమవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరినప్పటికీ వివేక్ ఆ పార్టీ వ్యవహారాల్లో పాల్గొనడం లేదు. ఆయనతో పాటు తెరాసలో చేరిన కేకే మాత్రం పార్టీలో చురుగ్గా ఉన్నారు. విభజన జరిగితే నక్సలిజం పెరుగుతుందంటూ సీఎం ఇచ్చిన నివేదికపై వివేక్ మండి పడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఆయనపై నక్సల్స్ దాడి జరిగింది సీమాంధ్రలోనే అన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రుల ఆస్తులపై ఎలాంటి దాడులు జరగడం లేదన్నారు. తెలంగాణపై ఎలాంటి ప్యాకేజీలకు తాము ఒప్పుకునేది లేదన్నారు. రాష్ట్రం తప్ప ఎవరూ ప్యాకేజీలు కోరుకోవడం లేదన్నారు. ఆంధ్రా ప్రాంతంలోనే నక్సలిజం మొదలైందని తాను హోం మంత్రి షిండేకు చెప్పానన్నారు. నీరు, విద్యుత్ తదితర సమస్యలపై చట్టపరంగా వ్యవహరించవచ్చన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడి

      రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో ఫలితాలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో తొలుత వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఫలితాలను సాయంత్రం విడుదల చేస్తారు.   మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లలో నిర్వహించిన ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. గన్నవరం నియోజకవర్గం తుంటగుంట పంచాయితీ సర్పంచ్ గా టిడిపి బలపరిచిన జీ.రాణి 51 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు.

ప్రముఖ సినీనటి మంజుల కన్నుమూత

      ప్రముఖ సినీనటి మంజుల ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మంజుల ప్రముఖ తమిళ నటుడు విజయకుమార్ సతీమణీ. ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మంజుల కథానాయికగా తెలుగు,తమిళ్, కన్నడ లో దాదాపు వంద చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా 'వాసు'. ఎన్టీ రామారావుతో మగాడు, మా ఇద్దరికథ, వాడే వీడు వంటి చిత్రాల్లో, కృష్ణతో మాయదారి మల్లిగాడువంటి చిత్రాల్లో, అక్కినేని నాగేశ్వర రావు సరసన బంగారు బొమ్మలు వంటి చిత్రాల్లో నటించారు. శోభన్ బాబు సరసన ఆమె పలు చిత్రాల్లో నటించారు. శోభన్ బాబు, మంజుల అప్పట్లో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందింది. తమిళంలో ఆమె శివాజీ గణేషన్, యంజీ రామచంద్రన్, జెమినీ గణేషన్ సరసన నటించింది.

ఐబీఎల్ లో సైనా కి భారీ ఆఫర్

      ప్రతిష్ఠాత్మక భారత బ్యాడ్మింటన్ లీగ్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ను మంచి డిమాండ్ ఏర్పడింది. ఐకాన్ ప్లేయర్ సైనాను రూ. 71.27 లక్షలకు హైదరాబాద్ హాట్‌షాట్స్ దక్కించుకుంది. పురుషుల ప్రపంచ నంబర్‌వ న్ లీ చాంగ్ వీకి వేలంలో అత్యధిక రేటు దక్కింది. ముంబయి మాస్టర్స్ అతడిని రూ. 80.19 లక్షలకు కొనుగోలు చేసింది. ఒలింపిక్ క్వార్టర్ ఫైనలిస్ట్ పారుపల్లి కశ్యప్‌ను బంగా బీట్స్ రూ. 44.55 లక్షలకు దక్కించుకుంది. లక్నో వారియర్స్ వర్ధమాన తార పీవీ సింధును రూ.47. 52 లక్షలకు దక్కించుకుంది.   ఇక డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప కనీస ధరను తగ్గించారు. తొలుత రూ. 29.75 లక్షలుగా ఉన్న ధరను తర్వాత దానిలోని సగం ధర రూ. 14.85 లక్షలుగా నిర్ణయించారు. జ్వాలను ఢిల్లీ స్మాషర్స్ 18.81 లక్షలకు.. వేలం చివరి నిమిషంలో అశ్వినిని పుణె కనీస ధరకు దక్కించుకున్నాయి.   ఆగస్ట్ 14 నుంచి ప్రారంభమయ్యే ఐబీఎల్ మొత్తం 6 ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ 11 మందిని కొనుగోలు చేయగా..అందులో ఆరుగురు భారత్ ఆటగాళ్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటారు.

సం'గ్రామం': వేగంగా పోలింగ్

      మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ మంగళవార౦ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైందని ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాదులో వెల్లడించారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ జోరుగా సాగుతోంది.   అనంతపురం 50%, మెదక్ 54%, కృష్ణా 63%, గుంటూరు 70%, కడప 45%, చిత్తూరు 66%, కర్నూలు 70%, కడప 45%, విజయనగరం 61%, నల్గొండ 50%, రంగారెడ్డి 50%, ఎస్పీఎస్ నెల్లూరు 54%, రంగారెడ్డి 50%, పశ్చిమ గోదావరి 57%, తూర్పు గోదావరి 50%, వరంగల్ 57%, కరీంనగర్ 51%, ప్రకాశం 67%, మహబూబ్ నగర్ 47%, అదిలాబాద్ 35%, నిజామాబాద్ 48%, శ్రీకాకుళం 62%, విశాఖ జిల్లాల్లో 46% శాతంగా ఓటింగ్ నమోదయింది.

తెలంగాణ కోసం ఆత్మహత్య కాదు..హత్య!!

      తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్ధి వినోద్ కేసు సడన్ గా మలుపు తిరిగింది. వినోద్ ఆత్మహత్య చేసుకోలేదని..అతనిని గొంతునులిమి హత్య చేసి కాల్చేసారని పోలీసులు చెబుతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ విషయం బయటపడిందని పోలీసులు వాదిస్తున్నారు.   ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సీఐ గిరిబాబు మాట్లుడుతూ.. బీటెక్ స్టూడెంట్ వినోద్ ను ఎవరో పథకం ప్రకారం హత్య చేసి తెలంగాణ రంగు పూలమడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతుందని...మృతుదేహం పోస్ట్ మార్టానికి వెళ్ళడంతో అసలు విషయం బయట పడిందని అంటున్నారు. ఈ హత్యకు రాజకీయమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.        ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన వినోద్..చిన్నాన్న సర్పంచ్ గా పోటి చేస్తుండడంతో ప్రచార౦ కోసం గ్రామానికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసిన వినోద్..ఇంటి వెనుక పశువుల పాకలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.     

కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు

  కాంగ్రెస్ నేతలు ముందు ప్రతిపక్ష నేతలపై బురద జల్లడం, ఒకవేళ దానివల్ల పార్టీ ఇరుకున పడినట్లయితే, వెంటనే ఆవిమర్శలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ మరో ఖండన చేసి చేతులు దులుపుకోవడం రివాజు. తద్వారా తమ శత్రువులపై బురద జల్లడం దిగ్విజయంగా పూర్తవుతుంది. పార్టీకి ఆ మైల అంటుకోకుండా జాగ్రత పడుతోంది.   ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత షకీల్ అహ్మద్ “గోద్రా సంఘటన తరువాతనే ఇండియన్ ముజాహుదీన్ ఉగ్రవాద సంస్థ పుట్టుకు వచ్చిందని” చెపుతూ అందుకు మోడీ, బీజేపీ, ఆర్.యస్.యస్. సంస్థలే కారణమన్నట్లు ఆరోపణలు చేసారు. మోడీని విమర్శించడంలో ఎప్పుడు ముందుండే దిగ్విజయ్ సింగ్ కూడా షకీల్ అహ్మద్ ను వెనకేసుకు వస్తూ ఆయన చేసిన ఆరోపణలలో అసత్యమేమి లేదని అన్నారు.   కానీ, ఊహించని విధంగా బీజేపీ వేరే కోణంలోంచి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేసింది. “షకీల్ అహ్మద్ ఒక తీవ్రవాద సంస్థ తరపున వఖల్తా తీసుకొని మాట్లాడుతున్నట్లున్నారు,” అని తీవ్ర ప్రతివిమర్శలు చేయడంతో, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వెంటనే స్పందిస్తూ”షకీల్ అహ్మద్ చేసిన వ్యాక్యలతో పార్టీకి సంబంధం లేదు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చును,” అని ప్రకటన చేసారు. అయితే, అంత మాత్రాన్న కాంగ్రెస్ పార్టీ మోడీని అంత తేలికగా వదిలిపెట్టదని అందరికీ తెలిందే.

మోడీని అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం

  నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా నిలబెట్టే విషయంలో నేటికీ బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కుమ్ములాడుకొంటుంటే, మరోపక్క ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయిన మోడీ తనపని తానూ చేసుకుపోతూనే ఉన్నాడు. ఇదంతా చూస్తున్నకాంగ్రెస్ పార్టీ కూడా తన జాగ్రత్తలో తానూ ఉండాలనే ఆలోచనతో మోడీని అడ్డుకొనేందుకు తనపని తానూ చేసుకుపోతోంది.   ఒక దశాబ్ధం క్రితం గుజరాత్ లో జరిగిన గోద్రా సంఘటన, తదనంతర మారణఖాండను కాంగ్రెస్ నేతలు పదేపదే ఎత్తి చూపుతూ మోడీ ఒక కరడుకట్టిన మతతత్వవాది అని, అందువల్ల అతను ప్రధాని పదవి చేపట్టడానికి అనర్హుడని గట్టిగా ప్రచారం చేస్తోంది. అదే సమయంలో మోడీని వ్యతిరేఖిస్తున్ననితీష్ కుమార్ వంటి వారిని కూడా ప్రోత్సహిస్తూ, గుజరాత్ లో కంటే బీహార్ వంటి రాష్ట్రాలలోనే బాగా అభివృద్ధి జరగుతోందని ప్రచారం చేయిస్తోంది.   ఇక కాగల కార్యం గందర్వులే చేస్తారన్నట్లు, బీజేపీకే చెందిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి వారు కూడా గుజరాత్ కంటే తమ రాష్ట్రంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతోందని ప్రచారం చేసుకోవడం, దానికి మోడీని వ్యతిరేఖిస్తున్న అద్వానీ వంటివారు వత్తాసు పలకడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. మోడీ ప్రచారం చేసుకొంటున్నట్లుగా గుజరాత్ లో ఏమీ అద్భుతాలు జరిగిపోవడం లేదని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ గట్టిగానే చేస్తోంది.   తద్వారా, గుజరాత్ రాష్ట్రాన్నిఅభివృద్ధిపధంలో నడిపిస్తునందున, మోడీ చేసిన తప్పులను క్షమించడానికి సిద్దపడుతున్నప్రజల మనస్సులో మోడీ పట్ల ఏర్పడుతున్న మంచి అభిప్రాయాన్నిపూర్తిగా తుడిచిపెట్టి, రానున్న ఎన్నికలలోగా అతనిపట్ల ప్రజలు మళ్ళీ ఏహ్యభావం పెంపొందించుకొనేలా చేసేందుకు కాంగ్రెస్ ఈ దీర్గకాలిక ప్రణాళికతో ముందుకు సాగిపోతోంది.

మొదలైన తొలి సమరం

      మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ మంగళవారమే జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. రెండు గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత వార్డుల ఓట్లు లెక్కించి ప్రకటిస్తారు. బ్యాలెట్ పేపరుపై జరగనున్న ఈ ఎన్నికల్లో 1.25 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మొదటి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. వేలం జరిగిన 18 పంచాయతీల్లో ఎన్నికలు రద్దు చేశామని, వాటికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.   ఇక, తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల పరిధిలో 5803 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి, ఈనెల మూడో తేదీన మొదటి విడతలో 6,863 సర్పంచి, 69,450 వార్డు పదవులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 683 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా మొదటి విడతలో జరగాల్సిన 237 పంచాయతీల్లో ఎన్నికలను మూడో విడతకు వాయిదా వేశారు. వీటితోపాటు 48 వేల వార్డులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవులకు బరిలో నిలిచిన సుమారు 17 వేల మంది, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తున్న దాదాపు లక్ష మంది భవితవ్యం మంగళవారం తేలిపోనుంది. వర్షాల కారణంగా భద్రాచలం డివిజన్లో ఎన్నికలను వాయిదా వే యడంతో మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో అసలు పంచాయతీ ఎన్నికలే జరగడం లేదు. లక్ష మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.

దేశంలోనే తొలి కంప్యూటరైజ్డ్‌ అసెంబ్లీ

      ఇక మీదట రాష్ట్ర అసెంబ్లీలో కాగితాలు కనిపించవు.. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర అసెంబ్లీని పూర్తి స్థాయిలో కంప్యూటరీకరించనున్నారు.. దాదాపు అసెంబ్లీ ఇచ్చే అన్ని ఆదేశాలు సందేశాలను ఇకపై ఎలక్ట్రానిక్‌ పద్దతిలోనే పంపనున్నారు.. అందుకు ఈ మెయిల్స్‌ సందేశాలను వినియోగించుకోనున్నారు..   అసెంబ్లీ కంప్యూటరీకరణకు కేంద్రం ఆర్ధిక సాయం ప్రకటించదన్నారు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌..ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన స్పీకర్‌ మనోహర్‌ మీడియాతో మాట్లాడారు.. కేంద్రం 16.15 కోట్ల రూపాయలను అసెంబ్లీ ఆధునీకరణకు కేటాయించిందని చెప్పారు.. ఇకపై కౌన్సిల్, అసెంబ్లీకి సంబంధించిన కార్యక్రమ వివరాలను ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తామన్నారు.ఈ ఆధునికరణకు సంవత్సరంనర కాలం పడుతుందని, దీనిపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అసెంబ్లీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు అసెంబ్లీ వెబ్‌సైట్‌ను కూడా తెలుగులో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు..

బ్రిటన్‌కు బుల్లి యువరాజు

   బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్ మిడల్టన్‌లకు బాబు జన్మించాడనే వార్తతో రాజకుటుంబంతో పాటు బ్రిటన్‌ అంతట సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాజకుటుంబానికి అభినందనలు తెలిపారు. సోమవారం సాయంత్రం 4.24 నిమిషాలకు మగబిడ్డకు యువరాణి కేట్‌మిడిల్‌టన్‌ జన్మనిచ్చింది. ప్రిన్స్‌ డయానా తన ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన పాడింగ్టన్ లోని సెయింట్ మేరీస్ హస్పిటల్ లోనే  కేట్‌ మిడల్టన్ కూడా తన బాబుకు జన్మనిచ్చింది.   ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రదాన మంత్రి కామెరూన్‌ ట్విటర్లో వెల్లడించారు. కేట్ మిడిల్ టన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ప్రెస్‌తో పాటు , పలువురు ప్రముఖులు ప్రజలు హస్పిటల్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బ్రిటన్‌ మీడియా అక్కడి పరిస్థితులను నిరంతరం లైవ్‌ అప్‌డేట్స్‌ ఇచ్చింది.. అంతేకాదు రాయల్ బేబి పుట్టటానికి ముందే వారికి పెట్టబోయే పేర్లపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్‌ జరిగింది. రాయల్ బేబీగా వ్యవహరిస్తున్న బేబీ పేరు గురించి ప్రధానంగా రెండు పేర్లమీద బెట్టింగ్  జరిగింది. కేట్‌కు పుట్టబోయేది ఆడపిల్ల అయితే ఆ పాప పేరు ‘అలెగ్జాండ్రా’ అని మగపిల్లవాడైతే ఆ బాబు పేరు ‘జార్జ్’ అవుతుందని బెట్టింగ్‌రాయుళ్లు అంచనా వేశారు. ఇంతకీ బ్రిటన్‌ రాజవంశం ఏ నిర్ణయం తీసుకుంటుందో  చూడాలి..

ఉదయభాను కొప్పులో కమలమా

  ప్రముఖ టీవీ యాంకర్, సినీనటి ఉదయభాను త్వరలో బీజేపీలో చేరబోతోందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు ముహూర్తం కూడా మీడియానే ఖరారు చేసేసింది. వచ్చేనెల 11న హైదరాబాద్ లో జరుగనున్న నరేంద్ర మోడీ సమావేశంలో ఆమె బీజేపీ తీర్ధం పుచ్చుకొంటారని, ఆమెకు పార్టీ టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని, అదేవిధంగా తెరాస కూడా ఆమెకు అటువంటి ఆఫర్లతోనే గేలం వేస్తోందని అంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, అవి తన ఒంటికి పడవని ఆమె చెప్పారు. తనకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన టీవీ, సినిమా రంగాలని విడిచి రాజకీయాలలో చేరే ఉద్దేశ్యం లేదని ఆమె స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఆమె రాజకీయ ఆరంగ్రేటంపై వార్తలు మాత్రం ఆగలేదు.

అమెరికా ఉపాధ్యక్షుని భారత పర్యటన

  దాదాపు 30 ఏళ్ల తరువాత అమెరికా ఉపాద్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నాడు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా బాద్యతలు నిర్వహిస్తున్న జోసెఫ్ జో బిడెన్ నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జోబిడెన్ భారత్ పలు రంగాల్లో మరింత ఆర్ధిక సరళీకరణ విధానాలు అమలు చేసే దిశగా చర్చలు జరపనున్నారు. పర్యటనలో భాగంగా జో పలువురు రాజకీయనాయకులతో సమావేశం కానున్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రదాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ తోపాటు ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ లతో భేటి కానున్నారు. హెచ్ 1 బి వీసాల విషయంలో భారత్ పట్ల అమెరికా అనుసరిస్తున్నవిధానాన్ని కూడా చర్చించనున్నారు. తరువాత ముంబైలోని పలువురు రాజకీయ పరిశ్రామిక వేత్తలను కూడా కలవనున్నారు.. పర్యటనలో భాగంగా తొలి రెండు రోజులు ఢిల్లీలో పర్యటిస్తున్న బిడెన్ తరువాత రెండు రోజుల పాటు భారత ఆర్ధిక రాజధాని ముంబైలో పర్యటించనున్నారు.

మంత్రి గారబ్బాయికి మర్యాదలు

  రామ్ చరణ్.. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ వారసుడు..చిరంజీవి వారసునిగా టాలీవుడ్లో ఈజీ విక్టరీస్ కొడుతున్న రామ్ చరణ్ పొలిటిక్స్ లో కూడా బాగానే చక్రం తిప్పుతున్నాడు.. ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగంలో మంచి ఫాలోయింగ్ అందుకున్న చెర్రీ ఇప్పుడు కేంద్రమంత్రి తనయుడిగా పొలిటికల్ ఫాలోయింగ్ ను కూడా అదే రేంజ్ లో అందుకుంటున్నాడు.. గతంలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరైన చరణ్ కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా చాలా మంది రాష్ట్రమంత్రులు, కేంద్రమంత్రులు లేచి నిలబడి మరీ స్వాగతం పలికారు..ఇప్పుడు అదే తరహాలో అఖిల భారత యాదవ మహాసభకని ఆంద్రప్రదేశ్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పొలిటికల్ లీడర్స్ తో పాటు రామ్ చరణ్ ను కూడా పలకరించి వెళ్లారు.. దీంతో తన సినీ వారసునిగా చరణ్ నిలబెట్టిన చిరు, తన రాజకీయ వారసునిగా కూడా ఇప్పటి నుంచే చెర్రీని రెడీ చేస్తున్నట్టుగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.. ఏది ఏమైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలా కేవలం ఓ మంత్రిగారబ్బాయికి మర్యాదలు చేయటం మాత్రం ఏం బాలేందటున్నారు ప్రజలు.

అయోధ్య హనుమాన్ గుడిలో కాల్పులు

      వివాదాస్పద రామ జన్మభూమి - బాబ్రీ మసీదుకు సమీపంలోని హనుమాన్ గుడి ఆలయంలో ఆదివారం కాల్పులు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహంతులకు చెందిన రెండు ముఠాల మధ్య వివాదమే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది.   హనుమాన్ గుడి ఆలయానికి చెందిన మహంత్ భవనాథ్ దాస్ ఆధ్వర్యంలో ముఠాకు, మహంత్ హరిశంకర్ దాస్ నేతృత్వంలోని ముఠాకి మధ్య.. భక్తుల నుంచి స్వీకరించిన ఆస్తులు, సంపద పైన ఆధిపత్యం విషయమై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోందని తెలుస్తోంది. రెండు వైపుల నుంచి కాల్పులకు సంబంధించి లిఖిత పూర్వక ఫిర్యాదులు అందాయని, ప్రస్తుతం ఎప్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు.