కిరణ్‌ పై కంప్లయింట్‌

  పదవిలో కొనసాగుతూనే సమైఖ్యగానం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై తెలంగాణ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే పలువురు నాయకులు సియం వైఖరిపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండగా మరి కొందరు నాయకులు ఇప్పుడ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు.   జీవోయంకు తెలంగాణ నేతలు తుది నివేదిక ఇవ్వనున్న నేపధ్యంలో టి కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో మకాం వేసి చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి సారధ్యంలో ఇప్పటికే రెండు సార్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో కిరణ్‌ వైఖరిపై చర్చించినట్టుగా సమాచారం. కిరణ్‌ పట్ల పార్టీ హైకమాండ్‌ ఇంకా ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తే అది చివరకు పార్టీకే నష్టంచేకూర్చుతుందని, ఇదే విషయాన్నిపార్టీ అధినేత్రి సోనియాగాంధీకి చెప్పాలని ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

విభజనకు ఓకె, యూటి చేయండి

  రాష్ట్ర విభజన నేపధ్యంలో ఇన్నాళ్లు సమైక్యవాదం బలంగా వినిపించినట్టు కనిపించిన సీమాంద్ర కేంద్ర మంత్రులు ఇప్పుడు పూర్తిగా తమ మాట మార్చారు. ఇక సమైక్య రాష్ట్రం కష్టం అని భావించిన మంత్రులు ఇక ప్యాకేజీల మీద దృష్టి సారించారు.  ప్రధానంగా హైదరాబాద్, సాగునీటి వనరుల పంపకం, నూతన రాజధాని అభివృద్ధికి తగిన ఆర్థిక ప్యాకేజీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలను.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ముందు ఉంచాలని భావిస్తున్నారు.   ముఖ్యంగా హైదరాబాద్‌ విషయంలో సీమాంద్రుల్లో నెలకొన్న భయాందోళనలను కేంద్ర నివృత్తి చేయాలని మంత్రులు నివేదించనున్నారు. హెచ్‌ఎండీఎ పరిధి మేరకు హైదరాబాద్‌ను ఢిల్లీ పుదుచ్చేరి లా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని, అలా అయితే విభజనకు సీమాంద్రునలు ఒప్పిస్తామని జీవోయంకు నివేదించే ఆలొచనలో ఉన్నారు.   సోమావారం జీవోయం ఎదుట కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే జీవోయం ముందుంచవలసి అంశాలపై చర్చించిన కేంద్ర మంత్రులు సోమావారం ఉదయం మరోసారి పళ్లం రాజు నివాసోం సమావేశం అయి చర్చించనున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులతో పాటు అందుబాటులో ఉన్న రాష్ట్ర నాయకులు కూడా హాజరు కానున్నారు.

రామాంజనేయ యుద్ధం!

    ఎప్పుడో రామాయణంలో రామాంజనేయ యుద్ధం జరిగిందని చదువుకున్నాం. ఇప్పుడు తెలంగాణాయణంలో కూడా మరో రామాంజనేయ యుద్ధం జరుగుతోంది. ఆ రామాంజనేయులు ఎవరో కాదు.. మాజీ పోలీసు ఉన్నతాధికారులు. రాముడేమో పేర్వారం రాములు.. ఆంజనేయుడేమో ఆంజనేయరెడ్డి!   పేర్వారం రాములేమో అర్జెంటుగా తెలంగాణ వచ్చేయాలని అంటూ వుంటే, ఆంజనేయరెడ్డేమో తెలంగాణ వస్తే తెలుగుజాతి నష్టపోతుందని అంటున్నారు. తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితి మీద ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశం సందర్భంగా వీరిద్దరి పేర్లు ఒకేసారి వార్తల్లోకి వచ్చాయి. సదరు సమావేశానికి ఆంజనేయరెడ్డిని ఆహ్వానించిన కేంద్రం పేర్వారం రాములుని ఆహ్వానించలేదని టీఆర్ఎస్ హడావిడి చేసింది. అప్పుడు వీరిద్దరి మధ్య పరోక్షంగా యుద్ధం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరిగే అవకాశం వుందని, అది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీసే అవకాశం వుందని ఆంజనేయరెడ్డి ఇటీవల ఒక  సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టులకు అడ్డాగా మారే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించారు.  ఆంజనేయరెడ్డి ఇలా మాట్లాడారో లేదో టీఆర్ఎస్ నాయకత్వం పేర్వారం రాముల్ని అర్జెంటుగా యుద్ధంలోకి దించింది. యుద్ధంలోకి దిగిన పేర్వారం రాములు ఆంజనేయరెడ్డి మీద విమర్శనాస్త్రాలు సంధించారు.   అసలు నక్సల్ సమస్య పుట్టింది తెలంగాణ కాదని, సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం బలపడటానికి కారణమయ్యారని ఎదురుదాడి చేశారు.  మొత్తమ్మీద ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల మధ్య మాటల యుద్ధం ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ యుద్ధం భవిష్యత్తులో ఎంత దూరం వెళ్తుందో చూడాలి.   Video Courtesy Tv9

భజన సంఘంలో విజయశాంతి!

      తెలంగాణ సీఎం కావాలని కలలు కంటున్నవాళ్ళంతా ఎవరికి వాళ్ళు ముమ్మరంగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్రులను తిట్టిపోయడం, సోనియాగాంధీని ఆకాశానికెత్తేయడం ద్వారా ఇటు తెలంగాణ ప్రజల అభిమానం, అటు సోనియాగాంధీ అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తున్నారు. జైపాల్‌రెడ్డి దగ్గర్నుంచి షబ్బీర్ అలీ వరకూ ఎవరి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు గానీ వీళ్ళ హడావిడి మాత్రం బాగా ఎక్కువైపోయింది.   రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్న సోనియాగాంధీని సీమాంధ్రులెవరైనా కడుపుమండి విమర్శిస్తే టీ కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడిపోతున్నారు. సోనియాగాంధీని ఎవరేమన్నా సహించేది లేదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఆ స్టేట్‌మెంట్లు ప్రింటయిన పేపర్ కటింగ్స్, టీవీలో టెలీకాస్ట్ అయిన వీడియో క్లిప్పింగ్స్ ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. సోనియాగాంధీ అంటే తమకెంత అభిమానం వుందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సర్లే.. పదవికోసం ఎవరి తంటాలు వారివి! ఇప్పుడు ఈ తంటాలు పడేవాళ్ళ లిస్టులో అభినయ రాములమ్మ విజయశాంతి కూడా చేరింది. మొన్నటి వరకూ మెదక్ పార్లమెంట్ సీటు మీదే మమకారాన్ని పెంచుకున్న విజయశాంతి, ఆ సీటు కోసం టీఆర్ఎస్‌కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరింది. ఇప్పుడు ఆమె మనసు మెదక్ సీటు మీద నుంచి సీఎం సీటు మీదకి మళ్ళినట్టుంది. అందుకే, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎంతమాత్రం తీసిపోని విధంగా సోనియాగాంధీ భజన మొదలుపెట్టింది. మెదక్ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి సోనియా వ్యతిరేకుల మీద విరుచుకుపడింది. తెలంగాణ ఇచ్చిన దేవతని కొంతమంది రాష్ట్ర మంత్రులు విమర్శిస్తున్నారని, అలాంటి వారిని క్షమించకూడదని ఉపన్యాసం ఇచ్చింది. సదరు ఉపన్యాసం ఇచ్చే సమయంలో  విజయశాంతి గారి హావభావాలు, ఆవేశం చూసిన వారికి విజయశాంతి ఎంత గొప్ప నటి అన్న విషయంలో ప్రత్యక్ష్యానుభవం కలిగి తరించిపోయారు. విజయశాంతి కూడా తెలంగాణ సీఎం పదవికి గాలం వేస్తోందన్న విషయం అర్థమైపోయి పులకరించిపోయారు.

ఆపండయ్యా మీ మోసాలు!

      సీమాంధ్రులు తమ సమస్యలకు అసలు కారకులు విభజనవాదులు అనుకుంటున్నారుగానీ, నిజానికి అసలు కారకులు ఎవరో కాదు.. సీమాంధ్ర కేంద్రమంత్రులు! తమను గెలిపించి కేంద్రానికి పంపిన తమ సొంత ప్రాంత ప్రజల్నే దారుణంగా మోసం చేసి రాష్ట్రాన్ని విభజన వరకు తీసుకొచ్చారు. తమను నమ్మినవాళ్ళని దారుణంగా మోసం చేశారు. ఇక్కడ సీమాంధ్రులందరూ రోడ్లమీదకి చేరి ఆందోళనలు చేస్తుంటే వాళ్ళంతా ఢిల్లీలో కూర్చుని రాష్ట్రాన్ని ఏరకంగా విభజిస్తే బాగుంటుందో కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.   సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇప్పటి వరకూ తాము చేసిన మోసాలతో సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. సీమాంధ్రులను ఇంకా మోసం చేసి కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. అందులో మొదటి స్థానంలో నిలిచే మంత్రిగారు ఘనత వహించిన కావూరి సాంబశివరావు గారు. మంత్రి పదవి వచ్చే వరకూ సమైక్యాంధ్ర అంటూ వీరంగాలు వేసిన ఆయన మంత్రి పదవి వచ్చాక గోడమీద పిల్లిని గుర్తుచేస్తూ అధిష్ఠానం దగ్గర మ్యావ్ అన్నారు. రాజకీయ నాయకులు ఎంత ఫాస్టుగా ప్లేటు ఫిరాయించగలరో స్పష్టంగా చూపించారు. ఇప్పటికీ ఆయన  సీమాంధ్రులకు మెత్తటి మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. విభజన ఘట్టాన్ని క్లైమాక్స్ వరకూ పట్టుకొచ్చిన ఆయన ఇప్పుడు తీరిగ్గా విభజన ఏ దశలో అయినా ఆగే అవకాశం వుందని చెబుతూ సీమాంధ్రుల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌ పర్యటనకు వచ్చిన ఆయన సీమాంధ్రులు తనను టెన్షన్ పెట్టకుండా వుండటం కోసం ఇలాంటి రెడీమేడ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఆయనగారు ఇచ్చిన స్టేట్‌మెంట్ విని మురిసిపోయిన సీమాంధ్రులు ఆయనకు అతిథి సత్కారాలు చేసి పంపించారు. కావూరిగారు ఇంకా చాలా గొప్ప రహస్యాలు వెల్లడించారు. రాష్ట్రం నుంచి తప్పుడు సమాచారం వెళ్ళడం వల్లే ఢిల్లీ పెద్దలు తప్పుగా అర్థం చేసుకుని రాష్ట్ర విభజనకు పూనుకున్నారట. తాను, ఇతర కేంద్రమంత్రులు ఈ నిర్ణయాన్ని మార్చడానికి కృషి చేస్తున్నారట. హలో కావూరీ అండ్ కేంద్ర మంత్రులూ.. ఇప్పటికైనా మీ మోసాలు ఆపండయ్యా.. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్ళిందంటున్నారుగా.. ఆ సమాచారం ఇచ్చింది వేరెవరో కాదు.. మీ గోడమీద పిల్లుల గ్యాంగే అయి వుంటుంది.. నో డౌట్!  

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో రాజా రవీంద్ర

  సిటీలో మందుబాబుల మీద ట్రాఫిక్‌ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్‌, బంజారా హిల్స్‌ లాంటి ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు అధికంగా బుక్‌ అవుతున్నాయి. అంతే కాదు ఇలా పట్టుబడుతున్న వారిలో సెలబ్రిటీలే ఎక్కువగా ఉంటున్నారు తాజా శనివారం రాత్రి కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఓ సిని నటుడు పట్టుబడ్డాడు.   శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో బంజారా హిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సినీనటుడు రాజారవీంద్ర రోడ్‌ నంబర్‌ 12లో పట్టుబడ్డారు. ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ వైపు స్కోడా కారులో (ఏపీ 20ఏపీ 1111) ప్రయాణిస్తున్న రాజా రవీంద్రను కూడా ఆపి పరీక్షించగా, ఆయన మద్యం సేవించినట్లు తేలింది. పోలీసులు ఆయన కారును స్వాధీనం చేసుకుని, ఆయనపై కేసు నమోదు చేశారు.  

సామాన్యులెరుగని అసమాన్యుడు భారత రత్నసి.ఎన్.ఆర్.రావు

  సామాన్య ప్రజలెవరికీ పెద్దగా పరిచయంలేని సుప్రసిద్ధ శాస్త్రవేత్త ప్రొఫెసర్ శ్రీ. సి.ఎన్.ఆర్.రావు కూడా ఈరోజు సచిన్ తో బాటే భారత రత్నఅవార్డుకి ఎంపికయ్యారు. ఆయన పూర్తి పేరు చింతామణి నాగేశ రామచంద్ర రావు. కర్నాటక రాష్ట్రానికి చెందినవారు. జూన్ 30, 1934న బెంగళూరులో జన్మించారు.   ఆయన డిగ్రీ-మైసూర్ విశ్వవిద్యాలయంలో, మాస్టర్స్ డిగ్రీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, పిహెచ్ డి ఫుర్డ్యూ యూనివర్సిటీలో పూర్తి చేసారు. ఆ తరువాత కాన్పూర్ ఐ.ఐ.టి.లో 13 ఏళ్లు రసాయ శాస్త్ర అధ్యాపకుడిగా చేశారు. సాలిడ్‌ స్టేట్‌ కెమిస్ట్రీ, మెటీరియల్‌ సైన్స్‌ రంగాలలో ఆయన ప్రముఖ శాస్త్రవేత్తగా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన వారు.   ఆయన జీవితం దాదాపుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో బోధన, పరిశోధనలకే అంకితం చేసారు. రసాయన మరియు ఇతర శాస్త్రాలకు చెందిన అంశాలపై ఆయన 45 పుస్తకాలు, దాదాపు 1500 పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు. ఆయన అసమాన ప్రతిభను గౌరవిస్తూ వివిధ దేశాలకి చెందిన 50 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ లు ప్రధానం చేసాయి.   శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన విశిష్టలకు గుర్తింపుగా ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్‌ అవార్డులు అందజేసింది. అవి కాక దేశవిదేశాల నుండి కూడా ఆయన 150కి పైగా ప్రతిష్టాత్మకమయిన అవార్డులు అందుకున్నారు. ఇక ఆయన ప్రతిష్టాత్మకమయిన ‘శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డును’ 1968లోనే స్వంతం చేసుకొన్నగొప్ప వ్యక్తి.   ఆ తరువాత కూడా ఆయన యొక్క ఆ అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. కానీ వాటన్నిటినీ పేర్కొనాలంటే మరో ప్రత్యేక గ్రంధం వ్రాయవలసి ఉంటుంది. ఇంత వరకు ఆయన అందుకొన్న ప్రతిష్టాత్మకమయిన అవార్డులలో రాయల్ సొసైటీ హ్యూస్ మెడల్ (2000), భారత్ ప్రభుత్వం నుండి ఇండియా సైన్స్ అవార్డు (2004), తెల అవీవ్ విశ్వవిద్యాలయం నుండి డాన్ డేవిడ్ ప్రైజ్ (2005), ఫ్రాన్సు ప్రభుత్వ అవార్డు (2005) కాగా ఇప్పుడు తాజాగా ఆయన కీర్తి కిరీటంలో భారత రత్న వచ్చి చేరింది.   ఈ అసమాన మేధావి డా. సి.ఎన్.ఆర్.రావు ప్రస్తుతం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు శాస్త్ర, సాంకేతిక సలహాదారులుగా ఉన్నారు. భారత రత్న అవార్డు అందుకొంటున్న సందర్భంగా శ్రీ డా. సి.ఎన్.ఆర్.రావు గారికి తెలుగువన్ తరపున , తెలుగు ప్రజల తరపున అభినందనలు.

ఫుల్‌స్టాప్ పెట్టిన బాబు!

      క్రమశిక్షణకు మారుపేరుగా ప్రజల నుంచి ప్రశంసలు అందుకునే తెలుగుదేశం పార్టీలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చేదోడు వాదోడుగా వుండే ఎర్రబెల్లి దయాకరరావు ఈమధ్యకాలంలో పార్టీ క్రమశిక్షణ గీతను దాటడం ఎవరూ ఊహించని పరిణామంగా అందరూ భావించారు.   తన సహచరులు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాదరావు మీద ఎర్రబెల్లి ఘాటైన పదజాలంతో విరుచుకుపడటం పార్టీలో ఆందోళనకు కారణమైంది. ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకునే తెలుగుదేశం పార్టీలో మీడియాకెక్కి విమర్శించుకునే కాంగ్రెస్ పార్టీ తరహా సంస్కృతి బయల్దేరడాన్ని ఎవరూ హర్షించలేకపోయారు. పార్టీకి విధేయుడిగా వుండే ఎర్రబెల్లి తన పొరపాటును దిద్దుకుంటారని అందరూ భావించారు. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోకపోయినా పరిస్థితి సర్దుకున్న వాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా ఎర్రబెల్లి మరోసారి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీద ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడటం, ఇది వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీయడం, ఇద్దరూ వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్ళడంతో ఈ అంశంలో చంద్రబాబు జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని పార్టీలో చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప ఇలా మీడియాకెక్కి తిట్టుకోవడం భావ్యం కాదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. పార్టీలో అంతర్గత క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోతోందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతున్న సమయంలో చంద్రబాబు రంగంలోకి దిగడం మంచి పరిణామమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో సీమాంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య తలెత్తుతున్న విభేదాల విషయంలో చంద్రబాబు ఇంతవరకూ జోక్యం చేసుకోకపోవడం వల్లే నాయకులు కట్టు తప్పుతున్నారని, ఇప్పుడు చంద్రబాబు రంగంలోకి దిగడం వల్ల ఇలాంటి వివాదాలకు ఫుల్‌స్టాప్ పడే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇకముందు ఎర్రబెల్లి మీడియాకెక్కి విమర్శలు చేసే అవకాశం వుండదని తెలుగుదేశం పార్టీలో భావిస్తున్నారు.

క్రికెట్ దేవుడు సచిన్ కు 'భారతరత్న'

      భారత క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు భారత అత్యున్నత పురస్కారం 'భారత రత్న' ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 'భారత రత్న' కు ఎంపికైన తొలి క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్. ఇరవై నాలుగు ఏళ్ళుగా భారత క్రికెట్ సచిన్ అందించిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రకటించింది.   భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' ను ప్రకటించడం పట్ల సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారాన్ని తన తల్లికి అంకితం ఇస్తున్నానని ప్రకటించారు.

రచ్చబండ మీద నిలబడి అరిస్తే విభజన ఆగుతుందా

  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని మా ముందు ఎంత గొంతు చించుకొని అరిస్తే మాత్రం ఏమి లాభం? అదేదో మీ అధిష్టానం ముందు అరిస్తే బాగుంటుంది కదా! అని ప్రజలు భావిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చ బండ మీద నిలబడి మన సమైక్యనినాదాలు ఢిల్లీకి విన్పించేలా గొంతెత్తి నినదించమని వారినే అడగడం విశేషం. తమ పార్టీ తీసుకొన్న నిర్ణయానికి తాను చింతిస్తున్నానని, అయితే ఈ నెల 18న జరుగనున్న కేంద్ర మంత్రుల బృందం సమావేశంలో పాల్గొని సమైక్యరాగం మరింత గట్టిగా ఆలపిస్తానని  ఆయన ప్రజలకి హామీ ఇచ్చారు.   నిజానికి సమైక్య ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో ఆయన ప్రజల మధ్యకి వచ్చి ఉంటే, ముందుగా ఆయన రాజీనామా కోసం వారు పట్టుబట్టేవారేమో! ఒకవైపు డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే, మరో పక్క కేంద్రమంత్రుల బృందానికి అవసరమయిన నివేదికలు కూడా పంపుతూనే,మళ్ళీ ఇక్కడ రచ్చబండ మీద నిలబడి గొంతు చించుకోవడం దేనికి ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే! తనను నిలదీయవలసిన ప్రజల చేతనే కిరణ్ కుమార్ రెడ్డి తనకు జై కొట్టించుకోవడం నిజంగా గొప్ప విషయమే.

ఇంతకీ జగన్ డిల్లీ వెళ్లి ఏమి సాధించినట్లో

  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంత దూరమయినా వెళ్లేందుకు సిద్దమంటున్నజగన్ బాబు ఈరోజు ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసేందుకు డిల్లీకి వెళ్ళారు. అయితే ఆయన కలుస్తున్న పార్టీల్లో దాదాపు అన్నీ కూడా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నవేనని తెలిసి ఉన్నప్పటికీ, వాటిని కలిసి మద్దతు కూడగట్టుకోవాలను కోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.   మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుని సమర్దిస్తున్నసీపీఐ పార్టీ నేతలనే జగన్ మొట్ట మొదట కలవడం కాకతాళీయమే కావచ్చు. గానీ, ఊహించినట్లే వారు తెలంగాణాపై తమ వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని మొహం మీదనే చెప్పేశారు. అయితే సీమాంధ్రకు అన్యాయం జరుగకుండా తమ పార్టీ శ్రద్ద వహిస్తుందని అభయం ఇచ్చిసాగనంపారు.   ఇక తరువాత ఆయన కలువబోయే సీపీయం, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నపటికీ ఇటీవల జరిగిన అఖిల పక్షసమావేశంలో విభజన అనివార్యమయితే ఏమి చేయాలో చెప్పడంతో ఆ పార్టీ కూడా విభజనకు అంగీకరించినట్లే అయింది. కానీ మున్ముందు జగన్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్న ఆ పార్టీ బహుశః అతనికి సానుకూలంగానే స్పందించవచ్చును. ఆ పార్టీ కూడా సీమాంద్రకు అన్యాయం జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చి సాగానంపవచ్చును.   ఇక రేపు జగన్ కలువబోయే బీజేపీ మొదటి నుండి తెలంగాణాకు మద్దతు పలుకుతోంది. అయితే సీమాంధ్ర, తెలంగాణాలలో తన పార్టీ ప్రయోజనాలను, భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఇటీవల తన వైఖరి మార్చుకొంటున్నట్లుగా సంకేతాలు ఇస్తోంది. రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచాలని కోరుకొంటోంది గనుక మున్ముందు జగన్ మద్దతు అవసరం ఉంటుంది గనుక, అతను తన మద్దతు గురించి కన్ఫర్మ్ చేస్తేనే సానుకూలంగా స్పందించవచ్చును.   ఇక బహుజన్ సమాజ్ వాది పార్టీ తన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్నేనాలుగు ముక్కలు చేయాలని డిమాండ్ చేస్తోంది. గనుక జగన్ కోరికను మన్నించడం కష్టం. కానీ, ములాయం సింగ్ నేతృత్వంలో సమాజ్ వాది పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్న కారణంగా జగన్ కి మద్దతు పలుకవచ్చును. కానీ కాంగ్రెస్ అధిష్టానం ములాయం కుటుంబ సభ్యులందరిపై తన సీబీఐ చిలుకలను ప్రయోగించి, వారినందరినీ తన అదుపులో ఉంచుకొంది. ఈ విషయాన్ని గతంలో స్వయంగా ములాయం సింగే చెప్పారు కూడా. అందువల్ల ములాయంకి మద్దతు ఈయలని ఉన్నపటికీ అతనికీ జగన్మోహన్ రెడ్డికీ మధ్య సీబీఐ అడ్డుగోడ ఉంది. గనుక దానిని దాటే సాహసం చేయకపోవచ్చును.   అంటే జగన్ కలిసిన పార్టీలలో ఏ ఒక్కటీ కూడా అతనికి బేషరతుగా మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని అర్ధం అవుతోంది.

వెల్‌కమ్ టు క్రిమినల్స్

      తలుపులు బార్లా తెరిచివున్న ఇంట్లోకి ఎవరు వెళ్ళారు? కుక్కలు, పిల్లలు, దొంగలు దూరేస్తారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ పార్టీ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. వచ్చే ఎన్నికలలో ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలో భారీ సంఖ్యలో సీట్లు సంపాదించేయాలని జగన్ భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా డబ్బు భారీగా పెట్టగల వారికి ఎవరికైనా తన పార్టీలో స్థానం వుంటుందని సూచనలు ఇస్తున్నాడు. అలాంటి వారికి తన పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ పార్టీ తలుపులు బార్లా తెరిచిపెట్టాడు. దాంతో పార్టీలోకి నేరచరితులు భారీగా వచ్చి చేరుతున్నారు.   ఏ దిక్కూ లేకుంటే అక్కమొగుడే దిక్కన్నట్టు ఏ పార్టీలోనూ స్థానం దొరకని నేరచరితులు ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు ఆశగా చూస్తున్నారు. మొన్నటి వరకూ జైల్లో ఆతిథ్యం తీసుకున్న మోపిదేవి వెంకటరమణ వైసీపీలో మహా దర్జాగా చేరిపోయారు. ఈమధ్యకాలంలో ఈ పార్టీలో చేరిన వాళ్ళలో నేరచరితులే ఎక్కువగా వున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఒకటో అరో కేసులు వున్నవాళ్ళతోపాటు భారీ క్రిమినల్ రికార్డులు వున్నవారు కూడా వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జైలు శిక్షలు పడ్డవాళ్ళు కూడా ఎలాంటి జంకూ గొంకూ లేకుండా ఈ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే పదహారు నెలలు జైలులో వుండొచ్చాడు కాబట్టి పార్టీలో చేరడానికి తమకు అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరని సదరు జైలుపక్షులు భావిస్తున్నట్టున్నారు. అయితే ఈ ధోరణి వైసీపీలో వున్న ఒకటీ అరా ఉత్తములకు నచ్చడం లేదని తెలుస్తోంది. అయితే పార్టీలోకి నేరచరితుల ప్రవాహాన్ని ఆపే శక్తి తమకు లేకపోవడం వల్ల ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ధోరణి మంచిది కాదని జగన్‌కి చెప్పాలని ఒకరిద్దరు తాపత్రయ పడినా, మంచి సలహాలిచ్చేవారినే బయటకి నెట్టేసే జగన్ తత్వం తెలిసినవారు కావడంతో వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.

క్రికెట్ దేవుడికి ఇక శలవు

    క్రికెట్ ఆడని భారత్ ను ఊహించుకోవడం ఎంత కష్టమో, సచిన్ లేని క్రికెట్ ను ఊహించుకోవడం కూడా అంతకంటే చాలా కష్టం. క్రికెట్, సచిన్, దేవుడు మూడు కూడా మూడక్షరాల పదాలే కావడం సచిన్ క్రికెట్ దేవుడని చెప్పడానికే పుట్టాయని అనుకోవాలేమో.   క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వేల పరుగులు, ఇంకా అనేక అద్భుతాలను సృష్టించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నకోట్లాది మంది అభిమానుల నుండి, తనకు ప్రాణంతో సమానమయిన క్రికెట్ నుండి ఇక శలవంటూ ఈ రోజు వీడ్కోలు తీసుకొన్నాడు.   నిన్నముంబై వాంఖేడ్ స్టేడియంలో వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచులో తన 200వ టెస్ట్ మ్యాచు ఆడి మరో సరి కొత్త రికార్డు నెలకొల్పిన సచిన్, నిన్ననే 76 పరుగులు తీసి అవుటవడంతో సాంకేతికంగా అతని క్రికెట్ ఆట ముగిసినట్లే అయింది. కానీ, అభిమానుల, ఆటగాళ్ళ కోరిక మేరకు ఈ రోజు మ్యాచులో కూడా అతను రెండు ఓవర్లు బౌలింగ్ చేసాడు. వెస్ట్ ఇండీస్ జట్టుని ఓడించిన భారత్ జట్టు ఆ క్రికెట్ దేవుడికి సవినయంగా దక్షిణ సమర్పించుకొంది.   అనేక ఏళ్ళు ఉద్యోగం చేసి పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగిలాగే, ఏకంగా 24సం.లు ఏకధాటిగా క్రికెట్ ఆడిన తరువాత రిటర్మెంట్ తీసుకొంటున్నసచిన్ కూడా మళ్ళీ తన జీవితంలో ఇక మైదానంలో అడుగుపెట్టేది లేదని గ్రహించినప్పుడు, చాలా ఉద్విగ్నతకు లోనయ్యి కన్నీళ్ళు పెట్టుకొన్నాడు.   తనకు ఇంత ఉన్నతమయిన జీవితాన్ని, పేరు ప్రతిష్టలని, గౌరవాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ఆ మైదానానికి వంగి నమస్కరించి శలవు తీసుకొన్నాడు. అతనిని ఆటగాళ్ళు తమ భుజాలపై ఎక్కించుకొని మైదానం చుట్టూ తిప్పుతుంటే, అతనికి వీడ్కోలు పలకడానికి వచ్చిన వేలాది ప్రజలు అదోరకమయిన సందిగ్దావస్థలో భారమయిన హృదయాలతో అతనికి వీడ్కోలు పలికారు.   సచిన్ టెండూల్కర్ వారినందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, తనకు జన్మనిచ్చిన తల్లి తండ్రులే తనని క్రికెట్ వైపు మళ్లించి తనకీ గొప్ప జీవితాన్ని, అరుదయిన గౌరవాన్ని కల్పించారని అందుకు వారికి సదా రుణపడి ఉంటానని అన్నారు. తన ఆటకోసం, ఉన్నతి కోసం, తన వ్యక్తిగత ఆనందాలను, సంతోషాలను పణంగా పెట్టి సహకరించిన అర్ధాంగి అంజలికి అతను ప్రేక్షకుల సమక్షంలో కృతజ్ఞతలు తెల్పుకొన్నాడు. ఈ రెండున్నర దశాబ్దాలలో తనకు సహకరించిన క్రికెట్ ఆటగాళ్ళకు, అభిమానులకు, బోర్డు మెంబర్లకు, మీడియాకి అందరికీ పేరుపేరునా అతను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నపుడు, అతనితో బాటు స్టేడియం లోపల బయట, టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్న లక్షలాది అభిమానులు కూడా తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు.   ఈ రోజుతో క్రికెట్ ప్రపంచంలో ఒక అధ్యాయం ముగిసి, చరిత్రగా మారింది. క్రికెట్ అనే పదానికి మారుపేరుగా మారిన సచిన్ ఇక ఆ క్రికెట్ లో ప్రత్యక్షంగా కనబడకపోవచ్చును. కానీ ఈ ప్రపంచంలో క్రికెట్ ఉన్నంత కాలం అతని పేరు తలచుకోకుండా బహుశః ఏ మ్యాచ్ కూడా పూర్తవదని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చును.   తెలుగువన్ తరపున, అభిమానుల తరపున సచిన్ టెండూల్కర్ కి శుభాకాంక్షలు.

సమైక్య చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్ లో గెలుపెవరిది

  ఒక సమైక్య కృషీవలుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్దమని ప్రకటిస్తుంటే, మరొకాయన ఉంగరం పడిపోయిన చోటనే వెతుకోవాలనట్లు డిల్లీలో వాలి కాంగ్రెసేతర పార్టీలను తనతో సమైక్యం కమ్మని కోరుతున్నాడు.   పదవులు త్యాగాలు చేసినంత మాత్రాన్నఫలితం ఉండదని అనుభవపూర్వకంగా చెపుతున్నకావూరి, చిరంజీవి, పల్లంరాజు, పురందేశ్వరి వంటి వారి మాటలను ఖాతరు చేయక 'త్యాగం.. త్యాగం' అంటూ చాంపియన్ నెంబర్:1 ఒకటే పలవరిస్తున్నపటికీ, మరో వైపు ‘ఆయన కాంగ్రెస్ అధిష్టానం గీసిన గీతను జవదాటే రకం’ కాదని డిల్లీ వాళ్ళే సర్టిఫై చేస్తున్ననేపద్యంలో ఆయన విశ్వసనీయతపై జనాలలో అనుమానాలు మొదలయ్యాయి.   ఇక ‘సమైక్యసెంటిమెంటుతో సీమాంధ్రలో మొత్తం యంపీ సీట్లు అన్నినొల్లెస్తా, రాష్ట్రంలోనే కాదు డిల్లీ లెవెల్లో కూడా గిరగిర చక్రం తిప్పేస్తా’ అంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన చాంపియన్ నెంబర్:2 జగన్ బాబు ఇప్పుడు ఆ పనిమీదనే నేడు డిల్లీలో వాలిపోయారు. అందువల్ల ఇంతకీ ఆయన చేస్తున్నది సమైక్యయాత్రనా లేక ఎన్నికల పొత్తుల యాత్రనా అనే అనుమానాలు జనాలకున్నాయి.   ఏమయినప్పటికీ ఈనెలాఖరులోగా ఫైనల్స్ జరుగబోతున్నాయని షిండే మహాశయులు డేట్ కూడా ప్రకటించేసారు గనుక, ఇప్పుడు జరుగుతున్నవి సమైక్య చాంపియన్ ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్ లో సెమీ ఫైనల్స్ గా భావించవచ్చును. డిల్లీలో కూర్చొన్న థర్డ్ ఎంపైర్స్ ఇంతకీ ఈ మ్యాచ్ లో ఎవరిని చాంపియన్ గా ప్రకటిస్తారో తెలుసుకోవాలంటే మరి కొన్ని వారాలు వేచి చూడక తప్పదు.  

టీడీపీ నాయకులకు గాలం!

      రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఘనకార్యాన్ని విజయవంతంగా పూర్తిచేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ పార్టీలు ఇప్పుడు తమ దృష్టిని తెలుగుదేశం పార్టీ మీద కేంద్రీకరించాయి. రాష్ట్ర విభజన విషయంలో అడ్డగోలు వాదనలకు పోకుండా ఒక స్పష్టమైన విధానంలో వున్న తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నాలను మూడు పార్టీలూ ముమ్మరంగా చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అనుకూల పార్టీ కాదంటూ గోబెల్స్ ప్రచారం చేసే పని ఎప్పటినుంచో అమలులో వుంది.     ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని తెలంగాణ నాయకులను తమ వైపు లాక్కునే ప్రాజెక్టును మూడు పార్టీలూ చేపట్టాయి. నోటి బలమే తప్ప ఓటుబలం లేని కడియం శ్రీహరి లాంటి నాయకులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బలంగా వున్న తెలంగాణ ప్రాంత నాయకుల మీద మూడు పార్టీల దృష్టి పడింది. టీడీపీలో ఈమధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చ చేస్తున్న ఎర్రబెల్లి దయాకరరావును లాక్కోవాలని కాంగ్రెస్ పార్టీ  తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. రాజకీయాలు మానేసి వ్యవసాయం చేసుకుంటానే తప్ప తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టేది లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఎర్రబెల్లి కోసం గాలం వేసే వుంచింది. ఇప్పుడు మూడు పార్టీలూ రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ తెలంగాణ నాయకులను తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోంచి మా పార్టీలోకి వస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు వుంటుందంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అయినా వాళ్ళ పప్పులు ఉడకటం లేదు. హడావిడి చేసే కార్యకర్తలే తప్ప ఓట్లు పడే నాయకులు లేని టీఆర్ఎస్ పార్టీ.. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద బోలెడంత ఆశలు పెట్టుకుంది. ఏ సీటు కావాలన్నా ఇస్తాం. ఏం కోరినా తీరుస్తాం అంటూ ఆఫర్లు ఇస్తోంది. ఇక తెలంగాణలో పూర్తిగా గల్లంతైపోయిన వైఎస్సార్సీపీ తన దింపుడుకళ్ళం ఆశలతో వుంది. తెలుగుదేశం పార్టీ నాయకులను తనవైపు లాక్కుని అయినా తెలంగాణలో ఉనికిని నిలుపుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మూడు పార్టీల ఆశలు ఆవిరవడం తప్ప ప్రయోజనం వుండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

రత్నప్రభ ఫైర్...జగన్ మైండ్ బ్లాంక్

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సీనియర్ ఐఏఎస్ అధికారిణి కత్తి రత్నప్రభ నిప్పులు చెరిగారు. సీబీఐ కోర్టు ప్రాంగణంలో తీవ్ర స్వరంతో ఆమె విరుచుకుపడటంతో జగన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రెండు రోజుల కిందట ఇందుటెక్ జోన్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరై వస్తున్న జగన్ కు ..అదే కేసులో నిందితురాలిగా ఉన్న రత్నప్రభ ఎదురుపడింది. అంతే.. జగన్‌ను చూడగానే ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. "వాట్ మిస్టర్ జగన్..? వాటీజ్ దిస్ నాన్సెన్స్..? మీరెవరో నాకు తెలియదు.. ఎప్పుడూ చూడనూ లేదు.. మీతో మాట్లాడిందీ లేదు. కానీ మీ వల్ల మేమందరం సమస్యల్లో పడిపోయాం.. ఈ గొడవలతో మాకేమీ సంబంధం లేదు.. మేం రూల్స్ ప్రకారమే నడుచుకున్నాం.మీ నాన్న ముఖ్యమంత్రిగా ఆదేశాలిస్తే.. వాటిని మేం పాటించాం. అయినా మాకెందుకీ సమస్యలు.. మీ కారణంగా మేమందరం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా మేమెందుకు తిరగాలి. ఇంతకాలం నిజాయతీగా బతికి ఇప్పుడు మీ వల్ల మేమంతా అభాసుపాలయ్యాం.. '' అంటూ జగన్‌పై రత్నప్రభ నిప్పులు చెరిగారు. వాస్తవానికి రత్నప్రభ గురించి జగన్‌కు కూడా పెద్దగా తెలియదు. విచారణకు హాజరై తిరిగి వస్తున్నప్పుడు ఎదురుపడి దుమ్ము దులిపేయడంతో ఆయన కాసేపు నిశ్చేష్టుడయ్యాడు.  

వైకాపా కొత్త పాయింటు

  ‘కీప్ సమ్ చేంజ్’ అంటే దానికి అర్ధం జనాలు రకరకాలుగా చెప్పుకోవచ్చు గాక. వాటిలో ఒకటి నిరంతరం కొత్త ఆలోచనలకి ప్రయత్నించమనే సందేశం కూడా ఇమిడి ఉంది. దానిని ఎవరు పట్టించుకొన్నా, కోకపోయినా వైకాపా మాత్రం బాగా వంట పట్టించుకొంది. అందుకే ఎప్పటి కప్పుడు సరి కొత్త ట్విస్టులు, యూ టర్నులు, వ్యూహాలతో దూసుకుపోతూ ఉంటుంది. ఈవిషయంలో ఏ ఇతర పార్టీ కూడా దానికి సరిసాటి కాదని ఒప్పుకోక తప్పదు. ఇక లేటెస్ట్ గా ఆ పార్టీ కనుగొన్నకొత్త సిద్దాంతం ఏమిటంటే తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తోందని! ఈ సంగతి కనిపెట్టడానికి కొంచెం ఆలస్యమయినా చాలా చక్కటి పాయింటుతో వచ్చామని ఆ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి భావించారు. కానీ, తెదేపా కూడా సరిగ్గా ఇలాగే భావించడం యాదృచ్చికమేమో? అయితే అంత మాత్రాన్న ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యే అవకాశమే లేదని గట్టిగా చెప్పవచ్చును.

సోనియా కడుపులో మంట!

      కడుపులో వున్న బాధ బాగా పెరిగిపోతే అది కడుపు మంటగా మారి బయటపడుతుంది. దానికి తాజా ఉదాహరణగా మనం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని తీసుకోవచ్చు. రాజకీయ ప్రసంగాలు చేయడంలో నరేంద్రమోడీకి, రాహుల్ గాంధీకి వున్న తేడాని దేశం మొత్తం గమనిస్తోంది. నరేంద్ర మోడీ ప్రసంగిస్తే జనం మంత్రముగ్ధుల్లా వింటున్నారు. అదే రాహుల్ గాంధీ నోరు విప్పితే జనం పెదవి విరుస్తున్నారు.   పసలేని, పనికిరాని ప్రసంగాలతో రాహుల్ గాంధీ అందరిచేతా అక్షింతలు వేయించుకుంటున్నాడు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ప్రసంగాల్లో మత ఘర్షణలు, ఇందిర, రాజీవ్ హత్యల్లాంటి విషయాలను ప్రస్తావించి అందరి చేతా తలంటి పోయించుకున్నాడు.  చివరకు ఎన్నికల కమిషన్ కూడా రాహుల్ గాంధీని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది. తన కడుపున పుట్టిన రాహుల్ గాంధీ సరైన రీతిలో ప్రసంగాలు చేయలేక భంగపడుతూ వుండటం చూసి ఆయనగారి మాతృమూర్తి సోనియాగాంధీ ఎంతో బాధపడుతోంది. అయినా సోనియాగాంధీకే సరిగా ప్రసంగాలు చేయడం రాదు.. మరి రాహుల్‌కి ఎలా వస్తుంది? అందుకే, తన కొడుకు ప్రసంగాలు బాగా చేయలేడుగానీ, దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగడని ఆమె తల్లి హృదయం నమ్మేస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ కంటే నరేంద్రమోడీ బాగా ప్రసంగిస్తూ జనాన్ని ఆకట్టుకుంటూ వుండటం ఆమె కడుపులో బాధని కలిగిస్తోంది. ఆ బాధ కడుపు మంటగా మారి బయటపడింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన సోనియాగాంధీ నరేంద్రమోడీ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ప్రసంగాలతో దేశ సమస్యలను పరిష్కరించలేం.. అభివృద్ధి సాధించలేం’’ అని తన కడుపుమంటని బయటపెట్టుకున్నారు. రాహుల్ గాంధీ కంటే నరేంద్రమోడీ బాగా ప్రసంగిస్తున్నారన్న విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారు. నరేంద్రమోడీ కంటే రాహుల్ బాగా మాట్లాలేకపోతున్నాడని ఏడవటం కంటే, రాహుల్‌ని నరేంద్రమోడీ ప్రసంగాలు విని ఎలా మాట్లాడాలో నేర్చుకోమని చెప్పొచ్చు కదా సోనియా మేడమ్!