కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటుతో లబ్ధికి జగన్ ప్రయత్నం

  ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ‘సమైక్య ఓదార్పుయాత్ర’ నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి, 2014ఎన్నికల తరువాత తను మద్దతు ఇస్తానని చెప్పిన సోనియా గాంధీ మీద కూడా తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఆమె తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే మన రాష్ట్రం విడదీస్తోందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజలను హైదరాబాదు నుండి బయటకి పొమ్మనట్లే, ఆమెను కూడా ఇటలీకి పొమ్మంటే పోతారా? అని ప్రశ్నిస్తున్నారు. తనకు 30యంపీ సీట్లు ఇస్తే, రాష్ట్రాన్ని ఎలాగ విడదీస్తారో చూస్తానని సవాలు చేస్తున్నారు. అప్పుడు తనే దేశానికి ప్రధానిగా ఎవరుండాలో నిర్ణయిస్తానని అంటున్నారు.   జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అంత్యక్రియలు కూడా చేయకుండానే, ముఖ్యమంత్రి పదవి కోసం శాసనసభ్యుల సంతకాలు సేకరించిన నాడే తన పదవీ కాంక్ష బయటపెట్టుకొన్నారు. నేటికీ కూడా సమైక్యాంధ్ర సెంటిమెంటుతో 30యంపీ సీట్లు సంపాదించుకొందామనే యావే తప్ప, నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చిత్తశుద్ది అతనిలో ఏ కోశాన్న కనబడటం లేదు. తను ముఖ్యమంత్రి అయ్యేందుకు, ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేఖతను తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నంలోనే సోనియా గాంధీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంత మాత్రాన్న తమ పార్టీ వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయేకి మద్దతు ఈయదని ఖరాఖండిగా ఎన్నడూ చెప్పరు కూడా.   వచ్చేఎన్నికలు పూర్తయ్యే వరకు అతను, అతని పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ తమ ప్రధాన శత్రువన్నట్లుగానే మాట్లాడుతారు. ఎన్నికల తరువాత ఒకవేళ యూపీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థితిలో ఉంటే, అప్పుడు తప్పకుండా దానికే మద్దతు ఇచ్చి జగన్ తన కేసుల నుండి బయటపడే ప్రయత్నం చేయవచ్చు. బహుశః అందుకే నారా లోకేష్ ఇటీవల ట్వీట్ చేస్తూ వైకాపాకి, ప్రజారాజ్యానికి పెద్దగా తేడా లేదని విమర్శించారు.            సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించి తన కొడుకుని ప్రధానిని చేయాలనుకొంటుంటే, జగన్ రాష్ట్ర విభజన అంశాన్ని ఈవిధంగా ఉపయోగించుకొని ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ కూడా రాష్ట్ర విభజన ద్వారా లబ్ది పొందాలనుకొంటున్నపుడు మరి వారిరువురి మధ్య తేడా ఏమిటి?   ఆమె రాష్ట్ర విభజన చేసి లాభం పొందాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి, తను రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా సమైక్యవాదంతో, కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు అనే రెండు అంశాలను తెలివిగా వాడుకొని ఎన్నికలలో గెలిచి, కేంద్రంలో రాష్ట్రంలో కూడా చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఇద్దరివీ లక్ష్యాలు వేరయినా, అందుకు వారు అనుసరిస్తున్న మార్గం మాత్రం ఒక్కటే.

సర్వరోగ నివారణి ‘రాయల తెలంగాణ’

      రాష్ట్ర విభజన తేనెతుట్టెని కదల్చగానే కేంద్రాన్ని అనేకానేక సమస్యలు చుట్టుముట్టాయి. కొన్ని సమస్యలు ప్రథమ చికిత్స చేస్తే తగ్గిపోయే రోగాల్లాంటివి కాగా, మరికొన్ని సమస్యలు ఎప్పటికీ వదలక పీడించే దీర్ఘకాలిక రోగాల్లాంటివి. ఈ రోగాలన్నిటినీ నివారించే సర్వరోగ నివారణి ‘రాయల తెలంగాణ’ అని కేంద్రం భావిస్తోంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపేయడం వల్ల  కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వుండే అద్భుతమైన ఫలితాలేవో వచ్చేస్తాయని కేంద్రం కలలు కంటోంది. కొత్త రాష్ట్రంలో తాను అధికారంలోకి రావడానికి, ఎక్కువ ఎంపీ సీట్లు గెలవటానికి, టీఆర్ఎస్, బీజేపీలను కొత్త రాష్ట్రంలో కంట్రోల్ చేయడానికి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేసుకోవడానికి, జలవివాదాలు తలెత్తకుండా వుండటానికి, సీమాంధ్రకు రాజధాని సమస్య రాకుండా వుండటానికి... ఇలా ఒకటీ రెండు కాదు రెండు మూడు డజన్లకు పైగా అంశాలను కేంద్రం ఆలోచించి పెట్టేసుకుంది. తెలంగాణను ప్రకటించి తాను తప్పు చేశానన్న అపరాధభావం కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో అంతర్లీనంగా వుంది. తనకు ఎంతమాత్రం ఉపయోగపడేలా లేని లేనిపోని తద్దినాన్ని అనవసరంగా నెత్తికెత్తుకున్నానని మథనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకోవడానికి కూడా రాయల తెలంగాణ ప్రతిపాదన ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఢిల్లీలో 'హస్తం' మాయం

      తాజాగా ఢిల్లీ ఎన్నికలలో ఏం జరగొచ్చన్న అంశం మీద రెండు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు విశ్వసనీయమైన సర్వే సంస్థలతో ఒపీనియన్ పోల్ నిర్వహించాయి. ఇండియా టుడే గ్రూప్ సంస్థ ఓఆర్జీ సంస్థతో కలసి సర్వే జరిపింది. అలాగే ఏబీపీ న్యూస్, దైనిక్ భాస్కర్, నీల్సన్ సంస్థలు సంయుక్తంగా మరో సర్వే నిర్వహించాయి.   ఈ రెండు సర్వేల్లోనూ ఢిల్లీలో రాబోయేది బీజేపీ పాలనేనని స్పష్టమైంది. ఈ సర్వేలో ఢిల్లీ ఓటరు మహాశయులు ‘కమలానికి ఓటేయని కరములు కరముల్?.. కాంగ్రెస్‌ని తిట్టని జిహ్వ జిహ్వా?’ అంటూ ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపిస్తామని చెప్పేశారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వే బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి స్పష్టమైన ఆధిపత్యం లభించే అవకాశం వుందని చెప్పింది. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వే మాత్రం బీజేపీకి సాధారణ మెజారిటీ కంటే నాలుగు స్థానాలు తక్కువగా వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ పార్టీకి 18 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశం వుంది. రెండు సర్వేలూ ఆమ్ ఆద్మీ పార్టీకి పది స్థానాలు వస్తాయని వెల్లడించడం విశేషం. బీజేపీకి మెజారిటీ కంటే సీట్లు తక్కువ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం తప్పని సరి అవుతుంది. ఏది ఏమైనా ఢిల్లీలో పదిహేనేళ్ళ కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలతో తెరపడింది. కేంద్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం వుందన్నదానికి ఢిల్లీ ఫలితాలు నిదర్శనం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బ్రిజేష్ తీర్పుతో కాంగ్రెస్ కి కొత్త సంకటం

  తమ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర విభజన జరుగుతుండటంతో ఆత్మాభిమానం దెబ్బతిన్నసీమాంధ్ర ప్రజలకు ఇప్పుడు బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పుండు మీద కారం చల్లినట్లయింది. అదేవిధంగా తెలంగాణా ఇస్తామని చెపుతూనే రోజుకొక ప్రతిపాదనతో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పై రగిలిపోతున్న తెలంగాణావాదులు కూడా ఈ ట్రిబ్యునల్ తీర్పుతో ఒక్కసారిగా భగ్గుమన్నారు.   రాష్ట్ర విభజన కీలకదశ చేరుకొన్న ఈ తరుణంలో, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ ట్రిబ్యునల్ తీర్పు వెలువడటంతో, అది ప్రతిపక్షాలకు ఆయుధంగా అందిరాగా, కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకి ఊహించని విధంగా కొత్త ఇబ్బందులను సృష్టించింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేఖంగా పోరాటాలకి సిద్దం అవుతూనే, మరో వైపు దానిని కూడా రాజకీయం చేస్తూ ఒకరిపై మరొకరు బురద జల్లుడు కార్యక్రమం కూడా మొదలుపెట్టేసాయి.   ఇప్పటికే, రాష్ట్ర విభజన అంశంపై చేతులు కాల్చుకొని బాధపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం, ఆ సమస్య నుండి గౌరవప్రదంగా బయటపడేందుకు దారులు వెదుకుతుంటే ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో మరో సరికొత్త సమస్య తలకు చుట్టుకొంది. అదికూడా సరిగ్గా అసెంబ్లీ మరియు పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే ముందు ఈ తీర్పు వెలువడటంతో మరింత ఇబ్బంది తప్పదు.   రాష్ట్రం కలిసున్నపుడే ఇరుగుపొరుగు రాష్ట్రాలతో నీటి యుద్దాలు తప్పడంలేదని, విడిపోతే ఇక తెలుగు ప్రజలు కూడా ఒకరితో ఒకరు నీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితులు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న వాదనలకు బలం చేకూరుస్తున్నట్లు బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ తీర్పు వెలువడటం, అది కూడ సరిగ్గా అసెంబ్లీ సమావేశాలకు ముందుగా వెలువడటంతో, ఆయన ఇదే అంశం ఆధారంగా అసెంబ్లీలో గట్టిగా వాదనలు వినిపించవచ్చును.   ఈ తీర్పు ఆధారంగా సమైక్యవాదం బలంగా వినిపిస్తున్నలగడపాటి వంటి యంపీలు సైతం పార్లమెంటులో గట్టిగా వాదించవచ్చును. అయితే, పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడినప్పుడే ఏ మాత్రం చలించని కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి అంశాలకు భయపడే అవకాశం లేదు. దానికి ఇదొక ఇబ్బందే తప్ప అవరోధం కాబోదు.

ఈ నెల ఏడున పులిచింతల శంకుస్థాపన

  ఈ నెల ఏడున పులిచింతల ప్రాజెక్ట్‌కు సియం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మాద్యమిక విధ్యాశాఖ మంత్రి పార్థసారధి చెప్పారు. ముందుగా ఎనిమిదో తేదిన ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తారని ప్రకటించినా ఆ రోజు సియంకు వేరే కార్యక్రమాలు ఉండటంతో ఒకరోజు ముందుగానే ప్రాజెక్ట్‌ పనులు మొదలు పెట్టనున్నారు. పులిచింతల్లో ప్రాజెక్ట్‌ ప్రారంభించిన సియం శంకుస్థాపన చేసిన తరువాత విజయవాడ స్వరాజ్‌మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలొ పులిచింతల నమూనా నుంచి నీటి విడుదల చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టుగా మంత్రి తెలిపారు.

టి బిల్లు శీతాకాల సమావేశాల్లో డౌటే

  సీమాంద్ర ప్రాంతం నుంచి ఎన్ని నిరసనలు వ్యక్తం అవుతున్నా.. కేంద్రం మాత్రం తెలంగాణ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర విభజన బిల్లు త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని కేంద్ర హొం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. అయితే ఖచ్చితంగా శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్‌కు వస్తుందా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జీవోఎం సమావేశాలు దాదాపు పూర్తయ్యాయి. కేంద్ర న్యాయ శాఖ అభిప్రాయం తీసుకున్న తర్వాత,అది మళ్లీ జీవోఎం ముందుకు వస్తుంది. ఆ తర్వాతే దానిని కేబినెట్ ముందు పెడతాం అని షిండే తెలిపారు. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత, రాష్ట్రపతి అనుమతి కోసం పంపిస్తామన్నారు.

కృష్ణ జలాల కోసం టిడిపి పోరుబాట

  కృష్ణాజలాల పంపిణీ విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ యుద్దం ప్రకటించింది. తెలుగు రైతులకు అశనిపాతంలా మారిన ఈ తలతిక్క తీర్పుకు వ్యతిరేకంగా టిడిపి ఆందోళనలకు రెడీ అవుతుంది. బ్రిజేష్‌కుమార్‌ కమిటీ ఇచ్చిన తీర్పు ప్రకారం ఇకపై ఎగువ రాష్ట్రాల వారి దయతోనే మనకు పంటలు పండే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తెలుగువారి తరుపున పోరాడటానికి టిడిపి పార్టీ సిద్దమవుతుంది. బ్రిజేష్‌కుమార్‌ కమిటీ తీర్పుతో పాటు, తెలంగాణ ఏర్పాటు వల్ల కలగబోయే నష్టాలను జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు త్వరలో ఢిల్లీ వెల్లనున్నారు, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు పలువురు జాతీయనాయకులతో ఆయన ఈ సమస్యలపై చర్చించనున్నారు. అదే సమయంలో ఇటు రాష్ట్రంలోనూ ప్రత్యక్ష పోరాటం చేసేందుకు ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ నెల నాలుగో తేదీన ధర్నాకు సిద్ధమవుతున్నారు. బ్రిజేష్ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఆదివారం రాత్రి లేఖ రాశారు.

రాయల తెలంగాణాకు నో

  తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్‌ అధిష్టానం వేగంగా అడుగులు వేస్తుంది. అందులొ భాగంగా ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు డీ శ్రీనివాస్‌ ఢిల్లీ వెళ్లారు.రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌తో భేటి అయిన ఆయన ముఖ్యంగా రాయల తెలంగాణ అంశం చర్చించినట్టుగా సమాచారం. అయితే విభజన విషయాన్నిసానుకూలంగా పరిష్కరించటానికే రాయల తెలంగాణ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చినట్టుగా దిగ్విజయ్‌, డియస్‌కు వివరించారు. అయితే రాయల తెలంగాణ అంశాన్ని తెలంగాణ ప్రాంతంలోని రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా అంగీకరించారని డియస్‌, దిగ్విజయ్‌కి స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతికి, రాయలసీమ సంస్కృతికి చాలా వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి రాయల తెలంగాణ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

చిరంజీవి రాజీనామా చేస్తే, నేనూ చేస్తా

  ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు కేంద్ర మంత్రి చిరంజీవిపై మండిపడ్డారు. పదే పదే అశోక్‌బాబు రాజీనామ చేయాలంటూ ప్రకటనలు చేస్తున్న చిరంజీవి ముందుగా ఆయన రాజీనామ చేసిన తన రాజీనామ గురించి మాట్లాడాలని అన్నారు.. చిరంజీవి రాజీనామ చేసిన వెంటనే తన కూడా రాజీనామ చేస్తానని అందుకు చిరు సిద్దమేనా అని ఆయన సవాల్‌ విసిరారు. సీమాంధ్రకు చెందిన నేతలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చని ఏపీఎన్జీవో సంఘం అభిప్రాయపడితే.. చిరంజీవి మాత్రం తనను రాజీనామా చేయమంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారన్నారు. అయినా తనను రాజీనామా చేయమని అడిగే హక్కు చిరంజీవికి లేదన్న విషయం గుర్తించుకోవాలని అశోక్ బాబు స్పష్టం చేశారు. సమైక్యాంద్రకు మద్దతుగా సీపీఎం కార్యదర్శి రాఘవులతో ఆదివారం భేటీ అయిన అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు.

రోడ్డు ప్రమాదంలో పాల్‌ వాకర్‌ మృతి

  ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సినిమాతో హాలీవుడ్‌తో పాటు ఇండియన్‌ ప్రేక్షకులకు కూడా దగ్గర అయిన పాల్‌ వాకర్‌ రోడ్డు ప్రమాదంలొ మరణించారు. శనివారం  వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో కాలిఫ్లోర్నియాలోని శాంతా క్లారిటాలోఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాధానికి కారణం అని ప్రాధమిక విచారణలో తేలింది. ఫిలీప్పిన్స్ తుపాను బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న ఆయన ప్రమాధవశాత్తు మరణించారు.  స్నేహితునితో కలిసి పోర్చ్ జీటీ కారులో వెళుతుండగా  ఈ ప్రమాదం జరిగిందని వాకర్ ప్రతినిధి మీడియాకు తెలిపారు.

గల్లీకో మెగాస్టార్.. జిల్లాకో పవర్‌స్టార్!

      తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త. పొరపాటున తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మీ జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతే పడిపోతాయేమోగానీ, మీకు మాత్రం సినిమా వినోదానికి ఎంతమాత్రం లోటుండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేశాక తెలంగాణ బిడ్డల నుంచి గల్లీకో మెగాస్టార్, జిల్లాకో పవర్‌స్టార్ పుట్టుకొస్తారు మరి. ఈ లెక్క ప్రకారం తెలంగాణ సినిమా పరిశ్రమకు మొత్తం పదిమంది పవర్‌స్టార్లు దొరుకుతారు.   ఇక తెలంగాణలో మొత్తం ఎన్ని గల్లీలు ఉన్నాయో లెక్కేస్తే అంతమంది మెగాస్టార్లు మిమ్మల్ని ఆనందపరుస్తారు. ఈ శుభవార్తని చెబుతోందెవరో కాదు.. తెలంగాణ సినిమా కళాకారులు! ఇంతకీ అసలు జరిగిందేంటంటే, తెలంగాణ సినిమా కళాకారులు ఈమధ్య ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తెలుగు సినిమా పరిశ్రమను బాగా తిట్టిపోశారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల పిడికిళ్ళలో తెలుగు సినిమా రంగం నలిగిపోతోందని, వాళ్ళంతా తెలంగాణ బిడ్డల్ని సినిమా రంగంలో దారుణంగా తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనభయ్యేళ్ళ సినిమా రంగంలో తెలంగాణ నుంచి ఎనిమిది మంది హీరోలు కూడా రాలేదని వాపోయారు. రేపు తెలంగాణ వచ్చాక తెలుగు సినిమా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి తెలంగాణ బావుటా ఎగరేస్తామని డిసైడ్ చేశారు. తెలంగాణలో ఎన్నో వేలమంది ప్రతిభావంతులైన కళాకారులు సినిమా అవకాశాలు దొరక్క బాధపడుతున్నారని, తెలంగాణ వచ్చేస్తే వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని అన్నారు. గల్లీకో మెగాస్టార్, జిల్లాకో పవర్‌స్టార్ పుట్టుకొస్తారని చెప్పారు.  ఇంకేం.. సీ అండ్ ఎంజాయ్!  

కేసీఆర్ నెత్తిన ‘రాయల’ బండ!

      అందరూ అనుకుంటున్నదే జరిగింది. కేసీఆర్ నెత్తిన రాయల తెలంగాణ బండ పడింది. లేకపోతే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతోనే పెట్టుకుంటాడా? కేంద్ర ప్రభుత్వం మరోసారి రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తీసుకురావడం, రాయల తెలంగాణ దిశగా వేగంగా పావులు కదుపుతూ వుండటం రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త పరిణామం. మొత్తమ్మీద కేంద్రం రాయల తెలంగాణ వైపే పూర్తిగా మొగ్గు చూపే అవకాశం వుందని తెలుస్తోంది. కేంద్రం అనుసరిస్తున్న ఈ తాజా వ్యూహం కేసీఆర్‌ని టార్గెట్ చేసినదేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.   తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా? కరెక్ట్ టైమ్ చూసి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ని విలీనం చేసే మాట అటుంచి, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని అనడం, బీజేపీకి చేరువ కావాలని ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీకి చిర్రెత్తేలా చేసింది. తెలంగాణ ఇస్తాననడం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా తమకు అధికారం దక్కకపోయే పరిస్థితులు రావడాన్ని కాంగ్రెస్ భరించలేకపోతోంది. తన అధికార దాహం తీరాలంటే, తనను నమ్మించి మోసం చేసిన కేసీఆర్ తిక్క కుదర్చాలంటే రాయల తెలంగాణ ఒక్కటే మార్గమని కాంగ్రెస్ భావిస్తోంది. పది జిల్లాల తెలంగాణకు రాయలసీమలోని మరో రెండు జిల్లాలు కలిపితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బలం బాగా తగ్గిపోతుంది. రాయలసీమ రెండు జిల్లాల్లో టీఆర్ఎస్‌కి అంత సీన్ లేదు. ఇక తెలంగాణ లోని హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో టీఆర్ఎస్‌ని పట్టించుకునేవారే లేరు. ఉన్న పన్నెండు జిల్లాల్లో ఆరు జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభావమే ఉండదు. మిగిలిన ఆరు జిల్లాల్లో అన్ని సీట్లూ టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు.  దీనివల్ల అటు పార్లమెంటు సీట్లలో గానీ, ఇటు అసెంబ్లీ సీట్లలోగానీ టీఆర్ఎస్ బావుకునేది ఏముంటుంది? కొద్దిగా పార్లమెంటు సీట్లతో టీఆర్ఎస్‌కి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వుండదు. కాసిన్ని అసెంబ్లీ సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశమూ వుండదు. అప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి టీఆర్ఎస్ కాంగ్రెస్‌నే శరణు కోరాల్సి వస్తుంది. కాంగ్రెస్ ఆధిపత్యానికి తల వంచాల్సి వస్తుంది. ఎన్నికల ముందు టీఆర్ఎస్ చచ్చినట్టు జట్టు కట్టాలన్నా, ఒకవేళ ఎన్నికలలో విడివిడిగా పోటీ చేసినా ఆ తర్వాత టీఆర్ఎస్ తన దారిలోకి రావాలన్నా రాయల తెలంగాణ మాత్రమే ఉపయోగపడగలదని కాంగ్రెస్ ఫిక్సయింది. అందుకే రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో మిక్స్ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ రాజకీయ ప్రయోజనాల ఫిక్సింగ్, మిక్సింగ్ బారిన పడి తెలుగుజాతి వెక్సయిపోతోంది.  

విభజనను ఆపండి

  అసెంబ్లీ పార్లమెంట్‌ సమావేశాలకు గడువు దగ్గర పడుతుండటంతో సమైక్యాంద్ర కోరుకునే నాయకులు కూడా వేగం పెంచారు. ఇన్నాళ్లు రాజకీయనాయకులను విమర్శిస్తూ వచ్చిన ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేఖించాలని రాజకీయపార్టీ నేతలను కోరారు. శనివారం ప్రతిపక్షనేత చంద్రబాబును, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫోరం చైర్మన్, మంత్రి శైలజానాధ్‌ను అశోక్‌బాబు కలుసుకున్నారు. అసెంబ్లీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే రాష్ట్ర విభజన జరగదని, ఏకాభిప్రాయం లేకుండా విభజన బిల్లును ఆమోదించబోమని కొన్ని జాతీయ పార్టీలు హామీ ఇచ్చాయని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు.

చరిత్ర కాదు.. చరిత్రహీనం!

      తెలంగాణ తెచ్చింది మేమేనని చెప్పుకోవడానికి అటు టీ కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ చేస్తున్న ఫీట్లు చూస్తుంటే నవ్వొస్తోంది. తెలంగాణ వచ్చేసిందని తెలంగాణ కాంగ్రెసోళ్ళు కృతజ్ఞతల సభలు.. ఆ సభలు.. ఈ సభలు అంటూ బిజీగా వుంటే, టీఆర్ఎస్సోళ్ళు మేం మాత్రం తక్కువా అని దీక్షాదివస్ అనే కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ నిరాహారదీక్ష విరమించి నాలుగేళ్ళయిన సందర్భంగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ‘దీక్షాదివస్’ నిర్వహించారు.   తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు మరణించినప్పుడు ఆయన్ని తెలుగువారు ఎంతగా కీర్తించారో, ఇప్పుడు కేసీఆర్ని కూడా టీఆర్ఎస్ నాయకులు అంతకు పదిరెట్లు కీర్తిస్తున్నారు. ఒక వి‘భజనుడు’ కేసీఅంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని గొంతు చించుకు అరిస్తే, మరొక విభజనుడు కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష చరిత్రలో నిలిచిపోతుందని అని నమ్మకంగా చెప్పాడు. కేసీఆర్ కారణంగానే తెలంగాణ ఉద్యమం ఇంత ‘శాంతియుతం’గా జరుగుతోందని ఒక విభజనుడు పులకరించిపోతూ వివరించాడు. తెలంగాణ పోరాటం క్రెడిట్ అంతా కేసీఆర్ అకౌంట్లోకే చేరాలని ఇంకొక విభజనుడు వెర్రిగా అరిచాడు. ఈ సమావేశం సందర్భంగా మరో కామెడీ కూడా చేశారు. కేసీఆర్‌ని శ్రీరాముడి గెటప్‌లో చూపిస్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని చూసి టీఆర్ఎస్ సేన మురిసిపోయిందేమోగానీ, దారినపోయే జనం మాత్రం దాన్ని చూసి నవ్వుకున్నారు. కేసీఆర్ చేసిన దీక్ష చరిత్ర సృష్టించిందని టీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఫ్లూయిడ్లతో చేసిన సదరు దీక్ష ఎంత చరిత్ర హీనమైనదో వాళ్ళ మనసులని అడిగితే చెబుతుంది. ఇదే దీక్షా శిబిరంలో టీఆర్ఎస్ చేసిన ఒక ప్రకటన విమర్శనార్హంగా వుంది. తెలంగాణ రాగానే, తెలంగాణ కోసం అమరవీరులైన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారట. వారి కుటుంబానికి 5 నుంచి 10 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తారట. ఇలా ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ నాయకులు ఏ ప్రయోజనం ఆశిస్తున్నారో, ఎవర్ని రెచ్చగొట్టదలచుకున్నారో వారికే తెలుసు.

చిరంజీవికి కోపమొచ్చింది

  రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, తన మెగా పార్టీని పణంగాపెట్టి మరీ సంపాదించుకొన్న కేంద్రమంత్రి పదవికి ఎప్పుడో రాజీనామా గీకి పడేసినా, ఇంకా ఈ అశోక్ బాబు లాంటి వాళ్ళు అవాకులు చవాకులు వాగుతుంటే, అలుగుటయే ఎరుంగని ధర్మరాజు వంటి చిరంజీవికయినా కోపం రాకపోదు.   అయినపట్టికీ పంటి బిగువున ఓర్చుకొంటూ డిల్లీలో అధిష్టానం చుట్టూ తిరుగుతూ రాష్ట్రం విడగొడితే ప్యాకేజీలు ఇస్తే తప్ప ఊరుకొనేది లేదని, భద్రాచలం మాదేనని ఆయన ఎంత గట్టిగా వాదిస్తున్నారో ఆ అశోక్ బాబుకి తెలుసా?ఎంత సేపు చిరంజీవి రాజీనామా చేయలేదని ఆయన మీద పడి ఏడవడమే కానీ, ఆ అశోక్ బాబు రాజీనామా చేసారా? అంటూ ఆయన కూడా చాలా కోపడిపోయారు. తను పదవికి రాజీనామా చేసినా, ప్రధానమంత్రి ఆకాయితం ముక్కని ఎక్కడో పడేసుకొంటే దానికి కూడా తననే నిందించడం భావ్యమా? అని ఆ జీవి పాపం చాలా బాధ పడిపోయారు.   అయినా కాయలున్నచెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు నిస్వార్ధంగా ప్యాకేజీలకోసం కృషి చేస్తున్నతనవంటి ప్రజాసేవకులకే ఈ సూటిపోటి మాటలు తప్పవని సర్ది చెప్పుకొని, సోనియమ్మని కలిసి హైదరాబాదుని పదేళ్ళకో, పాతికేళ్ళకోసమో యూటీగా చేసి తీరవలసిందేనని, లేకుంటే తన కేంద్ర మంత్రి పదవికి ఈసారి నిజంగానే రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పేందుకు బయలుదేరారు.   అయితే శుభమా అని బయలుదేరుతుంటే ఈ మీడియా వాళ్ళు పిల్లిలా ఎదురవడమే కాక అర్ధం పర్ధం లేని ప్రశ్నలు వేస్తూ అతితెలివి ప్రదర్శిస్తుంటారు. “ఈసారి మేడం గారిని ఏమేమి అడగబోతున్నారు?” అంటూ అమాయకంగా ప్రశ్నిస్తారు. తీరాచేసి జేబులోంచి ఓ పెద్ద లిస్టు బయటకి తీసి అంతా చెప్పిన తరువాత, “అయితే మీరు రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటునట్లే కదా?”అని ప్రశ్నిస్తే ఎటువంటి జీవికయినా నిజంగా కాలుతుంది.   ఈసారి కూడా వాళ్ళు ఆ మెగామంత్రిగారు ఇంట్లోంచి బయటకు వస్తుంటే ఆయన మొహం మీద కెమెరా పెట్టి మళ్ళీ అదే ప్రశ్నను ఇంకోలా అడిగి ఇరికించేదామనుకొన్నారు.   ఒకసారి పొరపాటు చేస్తే మామూలు జీవి. రెండుసార్లు చేస్తే చిరంజీవి. మూడు సార్లు చేస్తే మెగాజీవి అవుతారు. కానీ, నాలుగయిదు నెలలుగా డిల్లీ నీళ్ళకి బాగా అలవాటుపడిన మీడియా వేసే ఈ చిలక ప్రశ్నలకి కూడా తడబడకుండా సమాధానం చెప్పలేకపోతే ఈ కాంగ్రెస్ జీవికి ఎంత నామోషీ అనుకొంటూ ‘అయితే అడుకోండి’ అన్నారు.   అప్పుడు మీడియా వాళ్ళు “అయితే మీకు రాయల తెలంగాణా ఓకేనా? కాదా?”అని చిన్న ప్రశ్న అడిగారు.   "హా..హా...నేను ‘ఓకే!’ అనో లేక ‘నాట్ ఓకే!’ అనో జవాబు చెపితే మళ్ళీ నన్ను ఇరికించేదామనుకొన్నారు ఈ వెర్రి సన్నాసులు" అని మనసులోనే నవ్వుకొంటూ, రాజీనామా చేసిన మన కేంద్ర మంత్రిగారు తన మొహం మీడియ వైపుకి ఓసారి గంభీరంగా టర్నింగ్ ఇచ్చుకొని, “నాకు రాయల తెలంగాణా టాపిక్ తో అసలు సంబంధం లేదు. అది నేను మాట్లాడే సబ్జక్ట్ కానే కాదు. దాని గురించి వెళ్లి కోట్ల గారిని అడగండి. నేను కేవలం ‘హైదరాబాద్ యూటీ’ అనే టాపిక్ గురించే మాట్లాడుతాను. మీకు ఆ సబ్జెక్ట్ మీద ఏవయినా డౌట్స్ ఉంటే అడుకోండి."   "రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా రెండు రాష్ట్రాలలో పరిపాలన సవ్యంగా జరగాలంటే హైదరాబాదుని వీలయితే శాశ్వితంగా లేకుంటే కనీసం పదేళ్ళకోసమయినా యూటీ చేసి తీరాల్సిందే. లేకుంటే బోలెడు ప్రొబ్లెంస్. అందుకే నేను ఇప్పుడే సోనియా మాడం వద్దకు వెళ్లి ఈవిషయం గురించి గట్టిగా చెప్పిరావాలని బయలు దేరుతున్నాను. కానీ మధ్యలో మీ వల్ల ఆలశ్యం అయిపోతోంది,” అంటూ కారులోకి ఎక్కబోయారు.   “అయితే మీరు రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటునట్లేనని మమ్మల్ని రాసేసుకొమ్మంటారా?” అని అమాయకంగా మొహం పెట్టుకొని మీడియావాళ్ళు ప్రశ్నించారు.

బస్సు ప్రమాద బాధిత కుటుంబాలపై పోలీస్ ప్రతాపం

  మెహబూబ్ నగర్ పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు దగ్ధమయి అప్పుడే నెలరోజులవుతోంది. ఈ ఘోర ప్రమాదంలో45మంది నిండు ప్రాణాలు నిమిషాలలో గాలిలో కలిసిపోయాయి. అయితే అందుకు భాద్యులయిన వారిని ఒక్కరిని కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. రవాణా అధికారులు మాత్రం అనుమతి లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను పట్టుకొని, కేసులు వ్రాయడంతో సరిబెడుతున్నారు.   బాధిత కుటుంబాలకు ఇంత వరకు న్యాయం చేయలేకపోయినా, రవాణా మంత్రి బొత్ససత్యనారాయణ కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ ప్రభుత్వం తరపున మరెవరూ గానీ,  కనీసం మానవతాదృక్పదంతో వారిని కలిసి ఓదార్చాలని కూడా భావించలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన రాజకీయాలతో ఎవరికీ తీరిక లేకుండా పోయింది. ప్రజలు కూడా ఈ ఘోర దుర్ఘటన గురించి క్రమంగా మరిచిపోవచ్చు గాక. కానీ తమ ఆత్మీయులను, కొడుకులను, భర్తలను, తల్లులను పోగొట్టుకొన్న వారి దుఃఖం, బాధ ఎన్నటికీ తీరేది కాదు, మరిచిపోగలిగేది కాదు.   మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ వద్దకు రాకపోతే తామే వారి వద్దకు వెళ్లి గోడు వెళ్ళబోసుకొందామని బాధిత కుటుంబాలవారు కొందరు ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు వచ్చినప్పుడు, లోనున్న మంత్రులెవరు బయటకి రాకపోగా, పోలీసులు వారి నందరిని అరెస్ట్ చేసి పోలీసు వ్యానులో కుక్కి బలవంతంగా గోల్కొండ పోలీస్ స్టేషన్ కి తరలించారు.   అరెస్ట్ చేసిన వారిలో వృద్దులు, మహిళలు వాళ్ళ చేతుల్లో పసిపిల్లలూ ఉన్నారు. పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నవారు, అక్కడకి చేరుకొన్నమీడియాతో మాట్లాడుతూ, “ఈ మంత్రులు, ప్రభుత్వానికి కనీసం మానవత్వం కూడా లేదు. ఈ దుర్ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్కరిని కూడ అరెస్ట్ చేయకపోవడాన్ని ఏమని భావించాలి? అసలు ఇంతవరకు ఎవరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసులు ఎందుకు నమోదు చేయలేదు? దోషులను వదిలి గోడు వెళ్ళబోసుకోవడానికి వచ్చిన బాధితుల మీదనా మీ ప్రతాపం చూపించేది? ఈవిధంగా అరెస్ట్ చేయడానికి మేమేమయినా ఉగ్రవాదులమా లేక క్రిమినల్స్ మా? పసిపిల్లలు, మహిళలు, వృద్ధులతో కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా అసలు ఎలా వ్యవహరించగలుగుతున్నారు?మీకు ఎంతసేపు ఆంధ్ర, తెలంగాణా గొడవలే తప్ప ప్రజల ప్రాణాలకు మీ దృష్టిలో అసలు విలువ లేదా? ఒకవేళ మాకు న్యాయం చేయలేమని భావిస్తే మమ్మల్ని కూడా ఈ వ్యానులోనే పెట్టి తగులబెట్టేయండి. ఇక మీరు ఎవరికీ సంజాయిషీ చెప్పుకోనవసరం లేదు. మీకు ఎటువంటి సమస్యా కూడా ఉండదు.” అని ఆక్రోశిస్తున్నారు.   వారినందరినీ ఉంచిన వ్యానుని ప్రస్తుతం గోల్కొండ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిలిపి, పై అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.

నేను సైతం అంటున్న బొత్స

  పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ నిన్న ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నపటికీ, సాంకేతిక లేదా రాజకీయ కారణాల వలన రాష్ట్ర విభజన జరగకపోవచ్చని నా రాజకీయ అనుభవంతో చెపుతున్నాను’ అని చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది.   ఇంతవరకు సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్రమంత్రులు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగబోదని చివరి వరకు హామీలు గుప్పిస్తూ, రాజినామాలంటూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. ఇప్పుడు వారే ప్యాకేజీల గురించి గట్టిగా కృషిచేస్తున్నట్లు మీడియా ముందు చాలా హడావుడి చేయడం ప్రజలు చూస్తూనే ఉన్నారు.   ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగబోదని గట్టిగా హామీలు ఇచ్చినవారు ఇప్పుడు ప్యాకేజీల గురించి పోరాడుతుంటే, “హిందీ ఓళ్ళకి పది రాష్ట్రాలుండగా, మనోళ్ళకి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేటి?” అంటూ నిన్నమొన్నటి వరకు రాష్ట్ర విభజన సమరిస్తూ వచ్చిన బొత్ససత్యనారాయణ, ఇక నేడో రేపో రాష్ట్ర విభజన జరగబోతున్న ఈ తరుణంలో తను సమైక్యవాదినని, రాష్ట్ర విభజన జరుగకపోవచ్చునని అనడంలో ఉద్దేశ్యం ఏమిటి?   రాజకీయ లేదా సాంకేతిక కారణాలతో విభజన ప్రక్రియ ఆగిపోవచ్చని ఆయనకు తెలిసిన విషయం మరి కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదా లేక తెలిసినప్పటికీ ఏమి తెలియనట్లు ముందుకు సాగుతోందనుకోవాలా? లేకపోతే కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయంపై ఉన్న అవగాహన, వ్యూహం గురించి బొత్సకే అవగాహన లేదనుకోవాలా? రాష్ట్రంలో తమ కాంగ్రెస్ నేతలే ఈ గందరగోళానికి కారకులని చెపుతున్న బొత్ససత్యనారాయణ మరి తను చేస్తున్నదేమిటి?

కాంగ్రెస్ మంత్రిగారి కొడుకు తెదేపావైపు చూపు

  చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ త్వరలో రాజకీయ ఆరగ్రేటం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి బదులు తెదేపావైపు చూడటమే ఆశ్చర్యం. మరో ఆశ్చర్యకరమయిన సంగతి ఏమిటంటే ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన వాడయినప్పటికీ, గుంటూరు నుండి తెదేపా టికెట్ పై లోక్ సభకు పోటీచేయాలనుకొంటున్నారు. ఒకవేళ అందుకు చంద్రబాబు అంగీకరిస్తే ఆయన తెదేపాలో చేరే అవకాశాలున్నాయి. జయదేవ్ భార్య పద్మావతి గుంటూరు జిల్లాకు చెందినవారవడంతో ఆ జిల్లాలో ఆయనకు గట్టి పరిచయాలు, బంధాలే ఉన్నందున అక్కడి నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెదేపా నుండి ఇంత వరకు ఆయనకు ఎటువంటి జవాబు రాలేదు.   గుంటూరులో బలమయిన నేతగా పేరొందిన కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు, రాష్ట్ర విభజన చేస్తున్నందుకు పార్టీపై అలిగి ఇటీవల తెదేపా వైపు చూస్తునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని ఇరు వర్గాలలో ఎవరూ దృవీకరించలేదు. అదేవిధంగా గల్లా జయదేవ్ అకస్మాత్తుగా పార్టీలో ప్రవేశించి లోక్ సభ టికెట్ కోరితే, గుంటూరు తెదేపా నేతలు అంగీకరించకపోవచ్చును. ఆ పరిస్థితుల్లో ఆయనకు ఇక మిగిలింది వైకాపా మాత్రమే. అయితే గుంటూర్ లోక్ సభ టికెట్ ను బాలశౌరికి ఇచ్చేందుకు జగన్ వాగ్దానం చేసినట్లు సమాచారం. అప్పుడు మరిక ఆయన చేసేదేమీ లేదు గనుక, మళ్ళీ చిత్తూరు నుండే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించుకోక తప్పదేమో! వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ప్రవేశిస్తున్నారు. ఆయన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వర్గానికి చెందినవారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకుననారు. ధర్మానతో పాటు తాను కూడా పార్టీ మారుతున్నట్లు ఆయన వెల్లడించారు.దీనిపై కార్యకర్తలతో కూడా సమావేశం జరుపుతున్నానని ఆయన అన్నారు.కాగా మరో ఎమ్ఎల్ ఎ భారతి (టిక్కలి) కూడా పార్టీ మారవచ్చని ప్రచారం జరుగుతోంది. కాని టిక్కెట్ గ్యారంటీ లేకపోవడం తో ఆలోచినస్తున్నట్లు చెబుతున్నారు.