కాంగ్రెస్ మంత్రిగారి కొడుకు తెదేపావైపు చూపు
posted on Nov 30, 2013 @ 11:15AM
చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ త్వరలో రాజకీయ ఆరగ్రేటం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి బదులు తెదేపావైపు చూడటమే ఆశ్చర్యం. మరో ఆశ్చర్యకరమయిన సంగతి ఏమిటంటే ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన వాడయినప్పటికీ, గుంటూరు నుండి తెదేపా టికెట్ పై లోక్ సభకు పోటీచేయాలనుకొంటున్నారు. ఒకవేళ అందుకు చంద్రబాబు అంగీకరిస్తే ఆయన తెదేపాలో చేరే అవకాశాలున్నాయి. జయదేవ్ భార్య పద్మావతి గుంటూరు జిల్లాకు చెందినవారవడంతో ఆ జిల్లాలో ఆయనకు గట్టి పరిచయాలు, బంధాలే ఉన్నందున అక్కడి నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెదేపా నుండి ఇంత వరకు ఆయనకు ఎటువంటి జవాబు రాలేదు.
గుంటూరులో బలమయిన నేతగా పేరొందిన కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు, రాష్ట్ర విభజన చేస్తున్నందుకు పార్టీపై అలిగి ఇటీవల తెదేపా వైపు చూస్తునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని ఇరు వర్గాలలో ఎవరూ దృవీకరించలేదు. అదేవిధంగా గల్లా జయదేవ్ అకస్మాత్తుగా పార్టీలో ప్రవేశించి లోక్ సభ టికెట్ కోరితే, గుంటూరు తెదేపా నేతలు అంగీకరించకపోవచ్చును. ఆ పరిస్థితుల్లో ఆయనకు ఇక మిగిలింది వైకాపా మాత్రమే. అయితే గుంటూర్ లోక్ సభ టికెట్ ను బాలశౌరికి ఇచ్చేందుకు జగన్ వాగ్దానం చేసినట్లు సమాచారం. అప్పుడు మరిక ఆయన చేసేదేమీ లేదు గనుక, మళ్ళీ చిత్తూరు నుండే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించుకోక తప్పదేమో! వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ప్రవేశిస్తున్నారు. ఆయన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వర్గానికి చెందినవారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకుననారు. ధర్మానతో పాటు తాను కూడా పార్టీ మారుతున్నట్లు ఆయన వెల్లడించారు.దీనిపై కార్యకర్తలతో కూడా సమావేశం జరుపుతున్నానని ఆయన అన్నారు.కాగా మరో ఎమ్ఎల్ ఎ భారతి (టిక్కలి) కూడా పార్టీ మారవచ్చని ప్రచారం జరుగుతోంది. కాని టిక్కెట్ గ్యారంటీ లేకపోవడం తో ఆలోచినస్తున్నట్లు చెబుతున్నారు.