కేసీఆర్ నెత్తిన ‘రాయల’ బండ!
posted on Dec 1, 2013 @ 10:28AM
అందరూ అనుకుంటున్నదే జరిగింది. కేసీఆర్ నెత్తిన రాయల తెలంగాణ బండ పడింది. లేకపోతే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతోనే పెట్టుకుంటాడా? కేంద్ర ప్రభుత్వం మరోసారి రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తీసుకురావడం, రాయల తెలంగాణ దిశగా వేగంగా పావులు కదుపుతూ వుండటం రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త పరిణామం. మొత్తమ్మీద కేంద్రం రాయల తెలంగాణ వైపే పూర్తిగా మొగ్గు చూపే అవకాశం వుందని తెలుస్తోంది. కేంద్రం అనుసరిస్తున్న ఈ తాజా వ్యూహం కేసీఆర్‌ని టార్గెట్ చేసినదేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా? కరెక్ట్ టైమ్ చూసి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ని విలీనం చేసే మాట అటుంచి, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని అనడం, బీజేపీకి చేరువ కావాలని ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీకి చిర్రెత్తేలా చేసింది. తెలంగాణ ఇస్తాననడం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా తమకు అధికారం దక్కకపోయే పరిస్థితులు రావడాన్ని కాంగ్రెస్ భరించలేకపోతోంది. తన అధికార దాహం తీరాలంటే, తనను నమ్మించి మోసం చేసిన కేసీఆర్ తిక్క కుదర్చాలంటే రాయల తెలంగాణ ఒక్కటే మార్గమని కాంగ్రెస్ భావిస్తోంది.
పది జిల్లాల తెలంగాణకు రాయలసీమలోని మరో రెండు జిల్లాలు కలిపితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బలం బాగా తగ్గిపోతుంది. రాయలసీమ రెండు జిల్లాల్లో టీఆర్ఎస్‌కి అంత సీన్ లేదు. ఇక తెలంగాణ లోని హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో టీఆర్ఎస్‌ని పట్టించుకునేవారే లేరు. ఉన్న పన్నెండు జిల్లాల్లో ఆరు జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభావమే ఉండదు. మిగిలిన ఆరు జిల్లాల్లో అన్ని సీట్లూ టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు. దీనివల్ల అటు పార్లమెంటు సీట్లలో గానీ, ఇటు అసెంబ్లీ సీట్లలోగానీ టీఆర్ఎస్ బావుకునేది ఏముంటుంది?
కొద్దిగా పార్లమెంటు సీట్లతో టీఆర్ఎస్‌కి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వుండదు. కాసిన్ని అసెంబ్లీ సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశమూ వుండదు. అప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి టీఆర్ఎస్ కాంగ్రెస్‌నే శరణు కోరాల్సి వస్తుంది. కాంగ్రెస్ ఆధిపత్యానికి తల వంచాల్సి వస్తుంది. ఎన్నికల ముందు టీఆర్ఎస్ చచ్చినట్టు జట్టు కట్టాలన్నా, ఒకవేళ ఎన్నికలలో విడివిడిగా పోటీ చేసినా ఆ తర్వాత టీఆర్ఎస్ తన దారిలోకి రావాలన్నా రాయల తెలంగాణ మాత్రమే ఉపయోగపడగలదని కాంగ్రెస్ ఫిక్సయింది. అందుకే రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో మిక్స్ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ రాజకీయ ప్రయోజనాల ఫిక్సింగ్, మిక్సింగ్ బారిన పడి తెలుగుజాతి వెక్సయిపోతోంది.