పోలవరం ముసుగులో దోపిడీకి కుట్ర: హరీష్

      పోలవరం ముసుగులో తెలంగాణలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు ఇద్దరు నాయుడులు కుట్రలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడు మండలాలు సీమాంధ్రలో కలపడంవల్ల తెలంగాణకు యేడాదికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నా ఈ ప్రాంత టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన అర్డినెన్స్ విధానాన్నే బీజేపీ అమలు చేసిందని ఆ పార్టీ నేతలు పేర్కొనడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్ అయితే, బీజేపీ ఆపొచ్చు కదా..? అని ఆయన ప్రశ్నించారు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆగమేఘాల మీద ఎందుకు అర్డినెన్స్ తీసుకువచ్చారో ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రధానికార్యాలయం నుండి గవర్నరుకు పిలుపు

  ప్రధానికార్యాలయం నుండి పిలుపు రావడంతో గవర్నరు నరసింహన్ ఈ రోజు ఉదయం డిల్లీ బయలు దేరి వెళ్ళారు. మరొక రెండు రోజుల్లో అధికారికంగా రాష్ట్రవిభజన జరుగుతున్నందున, అందుకు అవసరమయిన ఏర్పాట్లను పునఃసమీక్షించేందుకు గవర్నరును పిలిచినట్లు తెలుస్తోంది. ఆయన ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరెంద్రమోడిని కలుస్తారు. గవర్నరు కూడా మోడీ ప్రమాణస్వీకారం హాజరయ్యారు. కానీ ఇదే వారి మొట్ట మొదటి సమావేశం. ఈ సమావేశంలో వారు పోలవరం ముంపు ప్రాంతాలపై తెలంగాణాలో మొదలయిన నిరసనలు, ధర్నాలు, ఉద్యోగుల పంపకాలలో తలెత్తుతున్న సమస్యల గురించి చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం డిల్లీలోనే ఉన్నారు. ఆయన కూడా వివిధ మంత్రిత్వ శాఖల మంత్రులను, మోడీని కలవబోతున్నారు. బహుశః నరేంద్రమోడీ వారిరువురితో ఒకేసారి సమావేశమయ్యి ఉభయ రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలను చర్చించే అవకాశం ఉంది.

చంద్రబాబు ప్రమాణ స్వీకార మూహూర్తం మార్పు

  చంద్రబాబు నాయుడు నిన్న కృష్ణా-గుంటూరు జిల్లాలో పార్టీ నేతలతో చర్చించిన తరువాత వారి సూచన మేరకు, తన ప్రమాణస్వీకార ముహూర్తాన్ని మార్చుకొన్నారు. జూన్ 8న ఉదయం 11.45 నిమిషాలకు బదులు, అదేరోజు సాయంత్రం 7.21నిమిషాలకు నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న మైదానంలో ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని ముహూర్తంలో మార్పు చేసారు.   జూన్ 4న తిరుపతిలో తెదేపా శాసనసభాపక్షం సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది. ఆ సమావేశంలో కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యులు చంద్రబాబును తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొంటారు. చంద్రబాబు నాయుడు తన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు డిల్లీ వెళ్ళి ఆయనను కలిసినప్పుడు ఆయనను ఆహ్వానించవచ్చును. అయితే కొత్తగా ప్రధానమంత్రి బాధ్యతలు చేప్పట్టిన మోడీ ప్రస్తుతం క్షణం తీరికలేకుండా ఉన్నందున, బహుశః చంద్రబాబు ఆహ్వానం మన్నించలేకపోవచ్చును. ఒకవేళ మన్నిస్తే, మరింత కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది కనుక కేంద్రం నుండి అధనంగా ప్రత్యేక భద్రతాదళాలు బయలుదేరవచ్చును. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ముహూర్తం సాయంత్రానికి మారింది గనుక బహుశః భారీగా జనాలు, కార్యకర్తలు తరలిరావచ్చును.

కేంద్రమంత్రులను కలిసేందుకు బాబు డిల్లీ ప్రయాణం

  ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు డిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు అవసరమయిన నిధులు, వివిధ అంశాల గురించి మాట్లాడబోతున్నారు. త్వరలో రెండు రాష్ట్రాలు విడిపోతునందున రెండు రాష్ట్రాల నడుమ వివాదం సృష్టిస్తున్న విద్యుత్, ఉద్యోగ, జలవనరుల పంపకాలు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం కోసం నిధులు విడుదల, రాష్ట్రంలో ఉన్నత విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు వంటి అనేక అంశాల గురించి వివిధ శాఖల మంత్రులతో చర్చించనున్నారు. ఆఖరుగా ప్రధానిమంత్రి నరేంద్ర మోడీని కలిసి తమ చర్చల సారాంశం ఆయనకు వివరించి, ఆయన సహాయ, సహకారాలు కోరనున్నారు. ఈరోజు చంద్రబాబు ఉదయం 10.30గంటలకు ఆర్ధికమంత్రి-అరుణ్ జైట్లీ, ఆ తరువాత వరుసగా జలవనరుల శాఖ మంత్రి-ఉమాభారతి, ప్రణాళికా సంఘం మంత్రి- జితేంద్ర ప్రసాద్, విద్యుత్ శాఖా మంత్రి- అనంత గీతే, పెట్రోలియం శాఖ మంత్రి-ధర్మేంద్ర ప్రాధాన్ తదితరులను కలవనున్నారు. చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు.

తెలంగాణా ప్రభుత్వ లోగోను ఆమోదించిన కేసీఆర్

  త్వరలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధతలు చెప్పట్టనున్న కేసీఆర్ ఈరోజు తెలంగాణా ప్రభుత్వ అధికారిక లోగోను ఆమోదించారు. చిలుక పచ్చని రంగులో కాకతీయ శిల్పతోరణం దాని మద్యలో చార్మినార్ ఉంటుంది. ఈరెండు బొమ్మలు ఒక వృత్తంలో ఉంచి దానికి పైభాగాన ఇంగ్లీషులో గవర్నమెంటు ఆఫ్ తెలంగాణా అని, ఆ వృత్తంలో క్రిందన ఎడమ వైపు తెలుగులో, కుడివైపు ఉర్దులో తెలంగాణా ప్రభుత్వం అని వ్రాయబడి ఉంటుంది. వృత్తం పైన భారత ప్రభుత్వ అధికార ముద్ర నాలుగు సింహాలు బొమ్మ ఉంటుంది. వృత్తం క్రింద హిందీలో సత్యమేవ జయతే అని వ్రాసి ఉంటుంది. ఈ లోగోను కేసీఆర్ జూన్ రెండున తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత విడుదల చేస్తారు.(గమనిక: పైన ఇవ్వబడిన చిత్రం కేవలం అంచనా కోసమే. అసలు చిత్రం కాదు. తెలంగాణా లోగోలో పైన పేర్కొనబడిన విధంగా మధ్యలో చార్మినార్ బొమ్మ ఉంటుంది.)

చదువు కాదు..నా పని తీరు చూడండి: స్మృతి ఇరానీ

      కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ, ఎన్నికల కమిషన్‌కి గతంలో సమర్పించిన అఫిడవిట్‌కీ, ఇటీవల ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌కీ తేడాలున్నాయనీ..2004 ఎన్నికల అఫిడవిట్లో బీఏ పూర్తి చేశానని, 2014 ఎన్నికల్లో బీకామ్ మొదటి సంవత్సరంతో ఆపేశానని ఆమె తెలిపారు. అయితే 12వ తరగతి చదివిన వ్యక్తికి కీలకమైన మానవ వనరుల శాఖను ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ విమర్శలపై స్పందించారు. తన విద్యార్హతలను లక్ష్యం చేసుకుని కాంగ్రెస్ సృష్టించిన వివాదం విధులపై దృష్టి పెట్టకుండా చేసేందుకెనని..చదువు ముఖ్యమే కానీ నా పని తీరును..నా సామర్థ్యాన్ని చూసి చివరకు ప్రజలే తీర్పు చెబుతారని ఆమె అన్నారు.

జూన్ 4 నుంచి 12 వరకు పార్లమెంట్ సమావేశాలు

      పదహారవ పార్లమెంటు సమావేశాలు జూన్ 4 నుంచి మొదలుకానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలు ఇవి. జూన్ 4 నుంచి 12 తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని గురువారం ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. జూన్ 4, 5 తేదీల్లో పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు. జూన్ 6న స్పీకర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎంపి కమల్‌నాథ్ వ్యవహరిస్తారని వెంకయ్య నాయుడు తెలిపారు. జూన్ 9న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారని చెప్పారు. మరోవైపు రాష్ట్రానికి చెందిన అంశాలపై కేబినెట్ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుల కేటాయింపుపై ఆర్డినెన్స్ అవసరం లేదని హోంశాఖ అధికారులు స్పష్టంచేశారు. అలాగే ఉద్యోగుల విభజనలో తలెత్తిన సమస్యలపై కూడా కేబినెట్‌లో చర్చించినట్లు సమాచారం.

పోలవరం ఆర్డినెన్స్ బాబు కుట్ర

      పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు అత్యధికంగా జీవిస్తున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో చేరుస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వటం దారుణమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, దీనికి ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా బాబు చేస్తున్న కుట్రలపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ముంపునకు గురవుతున్న ఏడు మండలాల రక్షించేందుకు న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

తెలంగాణవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

      పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా గురువారం బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఈ ఉదయం నుంచే టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.ఆర్టీసీ డిపోల ఎదుట టీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన తెలిపారు. దీంతో ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్‌లో బస్సులు నిలిచిపోయాయి. బంద్‌కు టీఎన్‌జీవో, టీజీవో, ఆర్టీసీ టీఎంయూ, లాయర్ల జేఏసీ, టీజేఎఫ్ మద్దతు తెలిపాయి. కాగా బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు.

కేసీఆర్ సవాలుకి మోడీ లొంగుతారా?

  పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడాన్ని నిరసిస్తూ తెరాస ఇచ్చిన తెలంగాణా బంద్ పిలుపుకు ఊహించినట్లే మంచి స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులు డిపోల నుండి బయటకు రాలేదు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ స్వయంగా బందుకు పిలుపీయడంతో ప్రభుత్వోద్యోగులు కూడా విధులను బహిష్కరించి బందులో పాల్గొంటున్నారు. తెరాస కార్యకర్తలు మళ్ళీ జెండాలు పట్టుకొని రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అందువల్ల తెలంగాణా దాదాపు స్తంభించిపోయింది. ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న ఒక వ్యక్తి, అధికార పార్టీ స్వయంగా బందులకు పిలుపీయడం, వ్యాపార సంస్థలకు, పారిశ్రామిక వేత్తలకు ఏ విధమయిన సంకేతాలు పంపుతుందనే ప్రశ్నకు, మాటల మాంత్రికులయిన కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలా ధీటయిన సమాధానమే చెప్పవచ్చును. కానీ, కేసీఆర్ ఈ విధంగా బంద్ కు పిలుపివ్వడం ద్వారా, కొత్తగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన నరేంద్ర మోడీకి కూడా సవాలు విసిరినట్లయింది.   మోడీ ప్రభుత్వం తీసుకొన్న మొట్ట మొదటి నిర్ణయాన్నే కేసీఆర్ ఈవిధంగా బహిరంగంగా సవాలు చేస్తుంటే, ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన నరేంద్ర మోడీ కూడా వెనక్కి తగ్గకపోవచ్చును. ఈ వ్యవహారం మరింత ముదిరినట్లయితే, మోడీ ప్రభుత్వం తెలంగాణాపట్ల సవతిప్రేమ చూపించే అవకాశం ఉంది. పోలవరం ముంపు గ్రామాల గురించి యూపీఏ హయంలో నోరు మెదపని కేసీఆర్, ఇప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను ఆమోదించిన తరువాత వ్యతిరేఖించడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బందులకు పిలుపీయడం, ప్రభుత్వోద్యోగులను అందులో పాల్గొనమని ప్రోత్సహించడం, ఇరుగు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో, చివరికి ప్రధానమంత్రితో, కేంద్రప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వడంవల్ల తెలంగాణాకు ప్రతికూలాంశాలుగా మారే అవకాశం ఉంటుంది కనుక కేసీఆర్ సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోనేందుకే ప్రాధాన్యం ఇవ్వడం మేలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

త్వరలో పార్లమెంటు సమావేశాలు

  నిన్న జరుగవలసిన కేంద్రమంత్రి వర్గం సమావేశం ఈరోజు జరుగబోతోంది. మొదటి సమావేశంలోనే నల్లదనం వెలికి తీతకు సుప్రీంకోర్టు రిటర్డ్ జడ్జ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు, పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకొన్న మోడీ క్యాబినెట్, ఈరోజు సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు జరిగే సమావేశంలో లోక్ సభకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లు ఎంపిక, పార్లమెంటు సమావేశాల తేదీలను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.   స్పీకర్ పదవికి మాజీ కేంద్రమంత్రి సుమిత్రా మహాజన్ పేరు బీజేపీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించే అవకాశం ఉంది. మొదటి విడతలో జూన్ 4 నుండి మూడు రోజులు సమావేశాలు నిర్వహించ వచ్చును. తరువాత మళ్ళీ కొన్ని రోజుల వ్యవధి తరువాత రెండో విడతలో వారం-పది రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. మొదటి రెండు రోజుల సమావేశాలలో కొత్తగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారం, మూడో రోజు ఉభయసభలను ఉద్దేశ్యించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. రెండో విడత సమావేశాలలో సాధారణ బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చును. పార్లమెంటు సమావేశ తేదీలు ఈరోజు జరిగే మోడీ మంత్రివర్గ సమావేశంలో ఖరారు కావచ్చును.

బాబు ప్రమాణ స్వీకారానికి చురుకుగా ఏర్పాట్లు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన వచ్చేనెల 8న ఉదయం 11.40 గ.లకు విజయవాడ-గుంటూరు మధ్యగల నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రమాణస్వీకారం చేయనున్నటు నిన్న మహానాడులో స్వయంగా ప్రకటించారు. అందుకోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.   చంద్రబాబు ఇకపై అక్కడి నుండే హైదరాబాదుకు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు గనుక, స్థానిక నాగార్జున నగర్ లో కొత్తగా రెండు హెలీప్యాడ్ లు నిర్మిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంతంలో ఇప్పటికే రెండు కంపెనీల రిజర్వు పోలీసు దళాలు చేరుకొని భద్రతా ఏర్పాట్లు నిమగ్నమయ్యాయి. వాటికి అదనంగా త్వరలో హైదరాబాదు నుండి మరో నాలుగు కంపెనీల రిజర్వు పోలీసు దళాలు చేరుకోబోతున్నాయి.   గండిపేటలో తెదేపా నిర్వహించిన మహానాడు సమావేశాలకే రాష్ట్రం నలుమూలల నుండి నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిబొడ్డున జరుగబోయే చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి అన్ని జిల్లాల నుండి చాలా ప్రజలు, కార్యకర్తలు చాలా భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. ప్రమాణస్వీకారం చేస్తున్న ప్రాంతం విజయవాడ-గుంటూరు హైవేకు చాలా దగ్గరలో ఉన్నందున అక్కడికి చేరుకోవడం చాలా సులువు గనుక ఊహించిన దానికంటే చాలా భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. అందువలన తెదేపా నేతలు, పోలీసులు కూడా అందుకు తగ్గటే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు విజయవాడ-గుంటూరు ప్రాంతాల తెదేపా నేతలతో ఈవిషయమై చర్చించనున్నారు. ఆ తరువాత ఆయన ఒకటి రెండు రోజుల్లో డిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనలో సంక్లిష్టంగా మారనున్న పలు అంశాలను మోడీకి వివరించి, ఇరుప్రాంతలకు నష్టం జరగకుండా పరిష్కరించేందుకు మోడీ సహకారం కోరేందుకు ఆయన వెళుతున్నట్లు తాజా సమాచారం.

రేపు తెలంగాణ బంద్: కేసిఆర్ పిలుపు

      తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్ర కేబినెట్ రేపు ఆర్డినెన్స్‌ను జారీ చేస్తుందని భావిస్తున్న ఆయన బంద్‌కు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు. ముంపు గ్రామాలపై కేంద్ర కేబినెట్ పాస్ చేసే ఆర్డినెన్స్‌ను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూన్నారు. ఈ అప్రజాస్వామికమైన ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం వైఖరిని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు.

మాటల యుద్ధం మొదలైంది

      స్మృతి ఇరానీకి మానవ వనరుల శాఖ అప్పగించడంపై కాంగ్రెస్ విమర్శలు కురిపించింది. 12వ తరగతి చదివిన వ్యక్తికి మానవ వనరుల శాఖ బాధ్యతలా? అని ఏఐసీసీ నేత అజయ్ మాకెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏం కేబినెట్ మోడీది. మానవ వనరుల శాఖా మంత్రి కనీసం డిగ్రీ కూడా చదివి లేరు అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మానవవనరుల శాఖ బాధ్యతలు అనుభవం ఉన్నవారికి అప్పగించాల్సిందని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ అభిప్రాయపడ్డారు. అయితే, బీజేపీ మాత్రం ఎదురుదాడికి దిగింది. సోనియా విద్యార్హత ఏంటో చెప్పాలని జౌళీ శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వర్ డిమాండ్ చేశారు. దేశంలో విద్యకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు మానవనరుల శాఖ కిందకే వస్తాయి.

పోలవరంపై నాయుడుల కుట్ర

      పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతూ అక్రమంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి టిడిపి అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కలిసి కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అక్రమంగా ఆర్డినెన్స్ తెస్తే చూస్తూ ఊరుకోమని, నాయపోరాటం చేయడానికి సిద్దంగా వున్నామని హెచ్చరించారు. పోలవరంపై టీడీపీ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టీటీడీపీ నేతలు చంద్రబాబును నిలదీసి ఆర్డినెన్స్‌ను ఆపించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి, చర్చలకే వార్‌రూం అని తెలిపారు. వార్‌రూంపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల గొంతు కోస్తున్నా టీటీడీపీ నేతలు ఆ పార్టీలో బానిసలుగా పడిఉన్నారని ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ కు భారతరత్న:మహానాడు తీర్మానం

      దివంగత నేత, ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వలని మహానాడు తీర్మానం చేసింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే వరకు కృషిచేస్తామని అన్నారు. పేదవారు లేని సమాజం తెలుగుదేశం పార్టీ ఆశయమని అదే ఎన్టీఆర్ కు అర్పించే నిజమైన నివాళి అన్నారు. గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడితే దానిని కాంగ్రెస్ పార్టీ ఆ పేరును మార్చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం వివరించి విమానాశ్రయానికి ఎన్టీఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తానని హామీ ఇచ్చారు.

అభివృద్దిలో పోటీపడాలి: బాలకృష్ణ

      నగరశివారులోని గండిపేటలో నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. మహానాడు వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ 91వ జయంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు తెచ్చిన భారీ కేక్‌ను బాబు కట్‌ చేసి బాలకృష్ణకు తినిపించారు. మహానాడులో ఇవ్వలా పండుగ రోజని నటుడు, టిడిపి శాసన సభ్యుడు బాలకృష్ణ అన్నారు. అనాడు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ టిడిపి పార్టీని పెట్టారని గుర్తు చేశారు. బౌగోళిక౦గా విడిపోయినా మనమంతా తెలుగు వాళ్ళమేనని..అభివృద్దిలో రెండు రాష్ట్రాలు పోటీపడాలని సూచించారు. మహానాడుకి భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులకి బాలకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

నల్లధనంపై మోడీ స్పెషల్ టీమ్

      ప్రధాని నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు స్వీకరి౦చిన తొలి రోజే తన మార్కును ప్రదర్శించారు. మోడీ టీమ్ తొలిరోజే కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై దర్యాప్తు కోసం విశ్రాంత న్యాయమూర్తి ఎంబీ షా నేతత్వంలో ప్రత్యేక దర్యాప్తు బందం(సిట్)ను ఏర్పాటు చేసింది. వైస్‌చైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అర్జిత్ పసాయత్‌ను నియమించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరక్టర్ జనరల్, రెవెన్యూ కార్యదర్శి, సీబీఐ, రా, ఈడీ డైరెక్టర్లు, సీబీడీటీ చైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌లను సిట్ సభ్యులుగా నియమించారు. క్యాబినెట్ భేటీలో ప్రధానంగా రెండు అంశాలపైనే చర్చించామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సిట్ ఏర్పాటుతోపాటు గోరఖ్‌ధామ్ రైలు ప్రమాదంపై చర్చించామన్నారు. నల్లధనం వ్యవహారంలో కేంద్రం నిబద్ధతకు సిట్ ఏర్పాటే నిదర్శనమని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సుప్రీంకోర్టు విధించిన గడువు బుధవారంతో ముగుస్తుండటంతో తొలిసమావేశంలోనే సిట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. రైలు ప్రమాదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉన్నత స్థాయి సమీక్ష జరపనున్నట్లు ఆయన తెలిపారు.

తాత ఎన్టీఆర్ మళ్ళీ పుట్టాలి: జూ.ఎన్టీఆర్

      ఈ రోజు స్వర్గీయ ఎన్టీఆర్‌ 91వ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు. నందమూరి హరికృష్ణ ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలిసి వచ్చి స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన తాత ఎన్టీఆర్‌ ఇంకోసారి పుట్టాలని ఆకాంక్షించారు సినీ నటుడు జూ.ఎన్టీఆర్‌.   ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం వారి సంక్షేమం కోసం పోరాడారని, అందువల్ల తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో కలిసి మెలిసి జీవించాలని, అభివృద్ధి సాధించాలని, అదే వారు స్వర్గీయ యన్టీఆర్ కి ఇచ్చే ఘన నివాళి అవుతుందని హరికృష్ణ అన్నారు.