లేడీ కండక్టర్ని బట్టలు చించి కొట్టిన దుర్మార్గుడు!

      దేశం నాశనమైపోతోంది. మహిళల మీద వుండాల్సిన గౌరవం మంటగలిసిపోతోంది. ఎన్ని చట్టాలు వచ్చినా అవి మహిళలకు ఎంతమాత్రం రక్షణ కల్పించలేకపోతున్నాయి. మహిళల మీద దాడులు చేసే ఉన్మాదులకు భయం పుట్టించలేకపోతున్నాయి. అలాంటి ఉన్మాది ఒకడు ముంబైలో బయటపడ్డాడు. బస్సులో ప్రయాణిస్తున్న అభిషేక్ సింగ్ అనే ఉన్మాది ఆ బస్సుకు కండక్టర్‌గా వున్న మహిళను బట్టలు చించి దారుణంగా అవమానించడమే కాకుండా, ఆమెని దారుణంగా కొట్టాడు. ఈ సంఘటన వెనుక పూర్తి వివరాలు ఇలా వున్నాయి. థానే జిల్లాలో కల్యాణ్-పన్వేల్ మధ్య తిరిగే బస్సులో ప్రయాణిస్తున్న అభిషేక్ సింగ్ (30)కు, ఆ బస్సు డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బస్సులోని మహిళా కండక్టర్ (34) అతనిని బస్సుదిగాల్సిందిగా ఆదేశించింది. పట్టలేని ఆవేశంతో ఆ యువకుడు లేడీ కండక్టర్‌ను కిందకు లాగి, ఆమె దుస్తులు చించి కొట్టడం మొదలుపెట్టాడు. అతన్ని వెనుక బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు వచ్చి అడ్డుకున్నారు. దీనిపై లేడీ కండక్టర్ స్థానికంగా వున్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అతడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

కేసీఆర్.. ఇది పద్ధతి కాదు: జానా

      రైతుల రుణాల మాఫీ విషయంలే కేసీఆర్ వేసిన మెలికలు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం మీద రెండు రోజుల్లోనే వ్యతిరేకత వచ్చేలా చేసింది. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ని విమర్శల వెల్లువలో ముంచేస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు కేసీఆర్‌కి వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు. ఇదిలా వుంటే, రైతుల రుణాల మాఫీ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడం పద్ధతి కాదని తెలంగాణ కాంగ్రెస్ శానసనభ పక్ష నేత జానారెడ్డి అన్నారు. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వెనక్కి తగ్గితే టీఆర్ఎస్ ప్రభుత్వం అపఖ్యాతిని మూటగట్టుకోక ఆయన చెప్పారు. రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కాలపరిమితి విధించడం సబబు కాదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాలపరిమితితో సంబంధం లేకుండా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారని, రైతులకి ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని చెప్పారు.

బాబు ప్రమాణానికి మోడీ రాకపోవచ్చా?

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈనెల 8వ తేదీన గుంటూరు సమీపంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబు చాలామందికి ఆహ్వానాలు పంపారు. చాలామందికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. తన రాజకీయ ప్రత్యర్థులైన కేసీఆర్, జగన్‌ని కూడా చంద్రబాబు ఆహ్వానించారు. తాజాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో హాజరు కావాల్సిందిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా చంద్రబాబు ఆహ్వానించారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు నేతృత్వంలో తెలుగుదేశం ఎంపీలు గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని కూడా అందించారు. అయితే నరేంద్రమోడీ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళే అవకాశం లేదని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు అంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, మోడీకి ఇది మొదటి పార్లమెంట్ సమావేశాలు అయినందున ఆయన పార్లమెంట్ సమావేశాలను వదిలి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేది కష్టమేనని అంటున్నారు. అయితే చంద్రబాబు మీద ప్రత్యేక అభిమానం వున్న నరేంద్రమోడీ ఏదో రకంగా వీలు చేసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తారేమో చూడాలి.

తెరాస కొంపముంచుతున్న రుణమాఫీ

  కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీలపై వెనకడుగు వేయడంతో కేవలం ప్రతిపక్షాలే కాక స్వంత పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకాలం ఎవరినిపడితే వారిని నోటికి వచ్చినట్లు తిట్టిపోసిన కేసీఆర్ మరియు ఆయన మంత్రివర్గ సభ్యులకు, ఇప్పుడు తమను ప్రతిపక్షాలు జాడించి వదిలిపెడుతుంటే ఆ కష్టం ఏమిటో బాగా తెలిసివస్తోంది. ఎన్నికల సమయంలో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు కేవలం 2013-14 సం.లలో లక్షరూపాయలలోపు తీసుకొన్న వ్యవసాయ రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, బంగారు నగలు తాకట్టుపెట్టి తెచ్చిన వ్యవసాయ రుణాలను మాఫీ చేయలేమని అప్పుడే తేల్చి చెప్పేయడంతో, తీవ్ర ఆగ్రహం చెందిన కొందరు తెరాస కార్యకర్తలు ఆర్మూరు మండలంలో మందని గ్రామంలో తెరాస జెండా దిమ్మను కూల్చి వేసారు. అదేవిధంగా మాచారెడ్డి మండలంలో కూడా తెరాస జెండా దిమ్మను కూల్చి వేసినట్లు తాజా సమాచారం. ఇక నిజామాబాద్ జిల్లాలో గాంధారి గ్రామంలో మాతు సంఘం రైతులు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా, రుణాలన్నిటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లమీడకు వచ్చి ధర్నాలు చేసారు.కేసీఆర్ ప్రభుత్వంపై అప్పుడే తీవ్ర ఒత్తిడి మొదలయినట్లు కనబడుతోంది.   ప్రతిపక్షంలో ఉన్నంత కాలం ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ ప్రజలను, ఉద్యోగులను కేసీఆర్ వెంట తిప్పుకోగలిగారు. కానీ ఇప్పుడు స్వయంగా ప్రభుత్వం నడపడం మొదలు పెట్టేసరికి, ఇంతవరకు వెంట నడిచిన ప్రజలే ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. కేసీఆర్ మొదటి హామీపై వెనక్కి తగ్గితేనే ఇంత రగడ మొదలయింది. ఆయన ఇంకా చాల చాలా హామీలు ఇచ్చారు. వాటి విషయంలో కూడా ఇలాగే వెనక్కు తగ్గినట్లయితే మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు. బహుశః అందుకే ‘కేసీఆర్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ళ పండుగ’ అని తెదేపా నేత రేవంత్ రెడ్డి మొదటిరోజే అనేసారు.

తెలంగాణలో మావోయిస్టుల సమస్య లేదట!

      తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా గురువారం నాడు బాధ్యతలు తీసుకున్న నాయని నర్సింహారెడ్డి మావోయిస్టుల విషయంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ విని నవ్వాలో, ఏడవాలో, జాలిపడాలో అర్థంకాని స్థితికి ప్రజలు చేరుకున్నారు. నాయిని అంచనా ప్రకారం తెలంగాణలో మావోయిస్టుల సమస్య అస్సలు లేదట.  ఈ సందర్భంగా తెలంగాణ భద్రత గురించి ఆయనేమన్నారంటే... 1. హైదరాబాద్ భద్రతకు పెద్దపీట వేస్తాం. 2. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తాం. 3.  అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తాం. 4. హైదరాబాదులో సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పిస్తాం. 5. తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తాం. 6. హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తాం. 7. కేసుల సత్వర పరిష్కారానికి సీఐడీని బలోపేతం చేస్తాం.

రేప్‌లు మామూలే: సమాజ్‌వాది బలుపు

      ఏదో వాషింగ్ పౌడర్ ప్రకటనలో ‘మరక మంచిదే’ అని చెప్పినంత ఈజీగా ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలో వున్న సమాజ్‌వాది పార్టీ ‘పెద్ద రాష్ట్రాల్లో రేప్‌లు మామూలే’ అని బాధ్యతారహితమైన ప్రకటన ఇచ్చింది. యు.పి.లోని బదౌన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మీద అత్యాచారం చేసి చెట్టుకి ఉరేసి చంపిన సంఘటన దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించింది. దేశమంతా ఈ సంఘటన గురించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంటే, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, సమాజ్‌వాది పార్టీ నాయకులు మాత్రం ఈ సంఘటని చాలా తేలిగ్గా తీసిపారేస్తూ రోజుకో విచిత్రమైన ప్రకటన ఇస్తున్నారు.   తాజాగా ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్యలు సహజమని సమాజ్‌వాది పార్టీ నేతలు ఎంతమాత్రం సిగ్గుపడకుండా చెబుతున్నారు.  దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంది. అలాంటి రాష్ట్రంలో అత్యాచారాలు సహజమేనంటూ సమాజ్వాదీ పార్టీ నాయకుడు మొహిసిన్ ఖాన్ గురువారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చెప్పి అందరికీ జ్ఞానోదకం కలిగించాడు.  అత్యాచారాలు ఒక్క ఉత్తరప్రదేశ్లో మాత్రమే జరగడం లేదని, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరువాత ఆయన అనుకూల వర్గం మొత్తం ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తమ నాయకుడి దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు.  

మెదక్ ఎంపీ స్థానం నుంచి సీఎల్ రాజం పోటీ?

      నమస్తే తెలంగాణ పత్రిక ఛైర్మన్ సి.ఎల్.రాజం మెదక్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ ఎంపీ స్థానం నుంచి, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ తర్వాత మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని టీఆర్ఎస్‌లో ఎంతోమంది ఉవ్విళ్ళూరుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ స్థానాన్ని తానే గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ స్థానంలో పోటీ చేయగల బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇది వుంటే, తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి సీఎల్ రాజం ఛైర్మన్‌గా వున్న నమస్తే తెలంగాణ పత్రిక ఎంతో సహకరించింది. ఓ సందర్భంలో కేసీఆర్ కూడా ఈ విషయాన్ని చెబుతూ, సీఎల్ రాజంని టీఆర్ఎస్ తరఫున ఎన్నికలలో పోటీ చేయించడం గానీ, ఒకవేళ అది కుదరకపోతే రాజ్యసభకు పంపడం గానీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎంతోమందిని పక్కన పెట్టేశారు. పట్టించుకోవడమే మానేశారు. ఆ లిస్టులో సీఎల్ రాజం కూడా వున్నారు. ఆ బాధ సీఎల్ రాజంలో వుంది. అలాగే కేసీఆర్ ఖాళీ చేసిన మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున తాను పోటీ చేస్తానని సీఎల్ రాజం కోరగా కేసీఆర్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ తీరు సీఎల్ రాజంను బాధించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎల్ రాజం బీజేపీలో చేరారు. నరేంద్రమోడీ నాయకత్వంలో ‘జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు’ చేయాలని వుందని అన్నారు. రాజం బీజేపీలో చేరడానికి ముందే మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ నుంచి పోటీ చేయడానికి ఒప్పందం కుదిరినట్టు సమాచారం.

ఆమ్ ఆద్మీ పార్టీ ‘ప్రాజెక్ట్ 101’

      ఆమ్ ఆద్మీ పార్టీకి పార్లమెంట్‌లో పెద్దగా సీన్ లేకపోయినప్పటికీ మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి తీవ్రంగా క‌ృషిచేస్తామని చెబుతోంది. తమ పార్టీ సభ్యుల సంఖ్య తక్కువ (4) అయినప్పటికీ మోడీ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేయడంలో సక్సెస్ అవుతామని సదరు పార్టీ లోక్ సభ సభ్యులు చెబుతున్నారు. నరేంద్రమోడీ తాను ప్రధాని అయిన తర్వాత వంద రోజుల్లో దేశంలోని పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తామని చెప్పిన పాయింట్‌ని ఆప్ ఆద్మీ గట్టిగా పట్టేసుకుంది. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా ‘ప్రాజెక్ట్ 101’ అనే పథకాన్ని రెడీ చేసింది. దీని ప్రకారం మోడీ అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి కాగానే 101వ రోజు నుంచి మోడీ సర్కారును నిలదీయడం ప్రారంభిస్తుంది. ఆ వంద రోజుల్లో మోడీ ప్రభుత్వం పనితీరును సమీక్షిస్తుంది. ఈ విషయాన్ని ఆప్ ఎంపీలు చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణమని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ సభ్యులు అంటున్నారు.

కేసీఆర్‌కి, సీఎల్ రాజం‌కి చెడింది: బీజేపీలో చేరిక

      తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కి, నమస్తే తెలంగాణ పత్రిక ఛైర్మన్ సి.ఎల్.రాజం మధ్య ఇంతకాలం కొనసాగిన సత్సంబంధాలు బెడిసికొట్టాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కి, టీఆర్ఎస్‌కి తన పత్రిక ద్వారా ఎంతో మద్దతు ఇచ్చిన సీఎల్ రాజం బుధవారం నాడు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అది ఆయనకి, కేసీఆర్‌కి మధ్య దూరం పెరిగిన విషయాన్ని తెలియజేస్తోంది. సి.ఎల్.రాజం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఆయన గురువారం నాడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ స్ఫూర్తితోనే బీజేపీలో చేరానన్నారు. బీజేపీ ద్వారా దేశానికి సేవ చేయనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌ని వ్యతిరేకిస్తూనే మీరు బీజేపీలో చేరారా? అని అడిగిన ప్రశ్నకు రాజం స్పందిస్తూ, ‘‘కేసీఆర్ చాలా పెద్దవాడు.. ముఖ్యమంత్రి.. నేను చాలా చిన్నవాడిని’’ అని సమాధానం చెప్పారు. తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిసిన తర్వాత కేసీఆర్ అప్పటి వరకూ తనకెంతో ఉపయోగపడినవారిని దూరం పెట్టడం ప్రారంభించారు. రాజకీయ ఐకాస కన్వీనర్ కోదండరామ్‌ని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. అదే తరహాలో రాజం విషయంలో కూడా కేసీఆర్ అవమానకరంగా వ్యవహరించి వుండవచ్చన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే రాజం కేసీఆర్‌కి దూరమై బీజేపీకి దగ్గరయ్యారని అనుకుంటున్నారు.

కేసీఆర్ నోట రాజీనామా మాట

      తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వారం కూడా తిరక్కుండానే టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట ‘రాజీనామా’ మాట వచ్చింది. ఆయన మాట మీద నిలబడే నాయకుడు కాదని అందరికీ తెలిసినప్పటికీ ఈ టైమ్‌లో ఆయన నోటి వెంట రాజీనామా చేస్తానంటూ మాట బయటపడటం విచిత్రంగా వుంది. ఇంతకీ కేసీఆర్ నోట రాజీనామా మాట వచ్చి సందర్భం ఏమిటో చూద్దాం.   కేసీఆర్ తాను ఎమ్మెల్యేగా గెలిచిన గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కలవటానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు చాలామంది వచ్చారు. జనాన్ని చూస్తే కేసీఆర్‌కి ఏదో ఒకటి మాట్లాడాలని అనిపిస్తుంది కదా.. అందుకే మాట్లాడారు. ఆ మాటల్లో భాగంగానే తన రాజీనామా ప్రస్తావన కూడా వచ్చింది. గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను నివారిస్తానని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రెండేళ్ళ తర్వాత నీటి సమస్యలు తీరక గజ్వేల్ నియోజకవర్గంలో మహిళలు మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లపైకి వస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ స్టేట్‌మెంట్ విన్న అక్కడ వున్న చాలామంది చప్పట్లు కొట్టారు. కేసీఆర్ రాజీనామా చేస్తానంటే చప్పట్లెందుకు కొట్టారో కొంతమందికి అర్థంకాక అయోమయానికి గురయ్యారు. మరికొందరు మాత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న మాట ఆయన నోటి వెంట వచ్చిందంటే, నిప్పు లేకుండా పొగ రాదన్నట్టు దీని వెనుక ఏదైనా కారణం వుందా అని ఆలోచించారు. మరికొందరు మాత్రం కేసీఆర్‌కి ఆడిన మాట తప్పే అలవాటు వుంది కాబట్టి ఆయన అంత ఈజీగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడులే అనుకుని సరిపెట్టుకున్నారు.

లోక్‌సభ స్పీకర్‌గా మళ్ళీ మహిళ: సుమిత్రా మహాజన్

  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎనిమిదో సారి ఎన్నికైన సుమిత్రా మహాజన్‌ను పదహారవ లోక్‌సభకు స్పీకర్‌గా ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బుధవారం జరిగిన బిజెపి సీనియర్ నాయకుల సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ పదవికి సుమిత్రా మహాజన్ పేరును ప్రతిపాదించేందుకు వీలుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం మధ్యాహ్నం సుమిత్రా మహాజన్‌ను కలిసి నామినేషన్ పత్రాలపై ఆమె సంతకాలు తీసుకున్నారు. స్పీకర్ పదవికి ఆమె నామినేషన్ పత్రాలను గురువారం దాఖలు చేస్తారు. ఆరో తేదీ సాయంత్రం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. లోక్‌సభలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోవటంతో స్పీకర్ పదవికి సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై బిజెపి నాయకులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

తెదేపా పార్లమెంటరీ నాయకుడిగా సుజనాచౌదరి

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న పార్టీ పార్లమెంటరీ నాయకులను నియమించారు. పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా సీనియర్ నేత సుజనా చౌదరిని, లోక్ సభలో పార్టీ నాయకుడిగా తోట నరసింహంను, రాజ్యసభ నాయకుడిగా దేవేందర్ గౌడ్ లను నియమించారు. పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిమ్మల కిష్టప్ప, కోశాధికారిగా తోట సీతరామలక్షిలను నియమించారు. లోక్ సభలో ఉపనేతగా యన్.శివ ప్రసాద్, కొనకళ్ళ నారాయణను పార్టీ విప్ గానియమించారు. రాజ్య సభలో ఉపనేతగా సీయం రమేష్, విప్ గా గుండు సుధారాణి వ్యవహరిస్తారు. పార్టీ జాతీయస్థాయి అధికార ప్రతినిధులుగా గల్లా జయదేవ్,  కింజారపు రామ్మోహన్ నాయుడు మరియు సి,హెచ్. మల్లారెడ్డి వ్యవహరిస్తారు.

అత్యాచారాన్ని ప్రతిఘటిస్తే ప్రాణాలే తీసేశారు

  మేఘాలయలో మిలిటెంట్లు సాగించిన కీచకపర్వంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించినందుకు ఒక గిరిజన మహిళ(35)ను మిలిటెంట్లు అతి దారుణంగా చంపేశారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలపై కాల్పులు జరపడంతో ఆమె తల రెండు ముక్కలైంది. గరో నేషనల్ లిబరేషన్ ఆర్మీ(జీఎన్‌ఎల్‌ఏ)కు చెందిన తీవ్రవాదులు మంగళవారం సాయంత్రం సౌత్ గరో జిల్లాలోని రాజా రోంగత్ గ్రామంలోకి వచ్చి, పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా నెపంతో ఆమెను ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చారు. అందరిముందు అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దాంతో తీవ్రవాదులు ఆమె నుదురుపై తుపాకీ పెట్టి తలలోకి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆమెకి భర్త, ఐదుగురు పిల్లలు వున్నారు వారిని ఇంట్లో బంధించి ఇంటి ముందే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని స్థానిక ఎంపీ పీఏ సంగ్మా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రప్రభుత్వం ఆ మహిళ కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దోషులను గుర్తించి, కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించానని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. ప్రజల తరఫున పోరాడుతున్నామని చెబుతున్న మిలిటెంట్ సంస్థ ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం దారుణమని మేఘాలయ సీఎం ముకుల్ సంగ్మా అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న జీఎన్‌ఎల్‌ఏను కేంద్రప్రభుత్వం 2012లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే, ఆ మహిళపై తమ సభ్యులు అత్యాచారయత్నం చేశారన్నది అవాస్తవమని, పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందునే ఆమెకు శిక్ష విధించామని జీఎన్‌ఎల్‌ఏ ప్రకటించింది. కాగా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రం అభ్యర్థన మేరకు కేంద్రం 1,000 మంది పారా మిలటరీ బలగాలను మేఘాలయకు పంపింది.

కేసీఆర్ రైతుల్ని మంచిగ మోసంచేసిండు: కిషన్‌రెడ్డి

  రైతుల రుణాలను మాఫీ చేస్తానని హామీల మీద హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు రైతుల రుణ మాఫీ విషయంలో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ చెప్పని విధంగా ఇప్పుడు రుణాల మాఫీలో రకరకాల కోణాలను బయటకి తీసి మాట్లాడుతున్నారు. రైతుల రుణ మాఫీ విషయంలో రకరకాల పరిమితులు విధిస్తున్నారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఆ రైతులందరి వాణిని తెరాసయేతర రాజకీయ పార్టీలు కూడా వినిపిస్తున్నాయి. రైతుల రుణాల మాఫీ విషయంలో ఇప్పుడు కేసీఆర్ మాట మార్చడమంటే రైతులను మోసం చేయడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ చేస్తానని తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశాడని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతుల ఓట్ల కోసమే రుణమాఫీ హామీ ఇచ్చారని.. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన ఆయన ప్రస్తుతం మాటమార్చడంపై కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు 2013-14 తర్వాత తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాననడం మాటమార్చడమే అని కిషన్ రెడ్డి అన్నారు.

లోక్‌సభలో రాహుల్ గాంధీ బ్యాక్ బెంచ్ బాయ్!

  బుధవారం 16వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు.. ఆయన తల్లి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. అయితే, సోనియాకు ముందు వరుసలోని ప్రతిపక్ష స్థానంలో సీటు కేటాయించారు. కానీ... రాహుల్‌కు మాత్రం లోక్‌సభలో వెనుక వైపు తొమ్మిదో వరుసలోని ఓ సీటును కేటాయించారు. లోక్‌సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడానికి రాహుల్ విముఖత చూపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రధాని అవ్వాలని కలలు కన్న రాహుల్ గాంధీ చివరికి లోక్ సభలో బ్యాక్ బెంచ్ బాయ్ అయ్యాడు పాపం. రాహుల్ గాంధీ పక్కన కాంగ్రెస్ సభ్యులు శశి థరూర్, అస్రార్ ఉల్ హక్‌లు కూర్చున్నారు. ప్రతిపక్ష పార్టీ ముందు వరుస సీట్లలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే, వీరప్ప మొయిలీ, కెహెచ్ మునియప్పన్‌లు కూర్చున్నారు. ఇదిలావుండగా రాహుల్ గాంధీకి వరుసకు సోదరుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా అధికార పక్షం విభాగంలో వెనుక వరుసలోనే కూర్చున్నారు. 15వ లోక్‌సభ సమావేశాల్లో 206 మంది సభ్యులను కలిగి ఉన్న కాంగ్రెస్, 16వ లోకసభ సమావేశాలకు 44 మంది సభ్యులకు పడిపోయిన విషయం తెల్సిందే. అలాగే, గత పదేళ్ల నుంచి స్పీకర్‌కు కుడివైపున కూర్చొనే కాంగ్రెస్ సభ్యులు ఇపుడు ఎడమవైపుకు మారారు.

టీడీయల్పీ నేతగా ఎన్నికయిన చంద్రబాబు

  తిరుపతి యస్వీ యూనివర్సిటీలో సమావేశమయిన తెదేపా శాసనసభ్యులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును తమ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. చంద్రబాబు పేరును తెదేపా సీనియర్ నేత కే.ఈ. కృష్ణమూర్తి సరిగ్గా 8.31 నిమిషాలకు ప్రతిపాదించగా, దానిని సభ్యులందరూ కరతాళ ధ్వనులతో ఏకగ్రీవంగా ఆమోదించారు. తెదేపా నేతలు తమ ఈ తీర్మానాన్నిరేపు గవర్నర్ నరసింహన్ కు అందజేసిన తరువాత గవర్నర్ చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారు. చంద్రబాబు జూన్ 8న రాత్రి 7.41 గంటలకు ముఖ్యమంత్రిగా గుంటూరు సమీపంలో గల నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేరోజు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ ఏర్పడబోతోంది.

నన్నపనేనికి వడదెబ్బ.. కుదుటపడిన ఆరోగ్యం

  తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయడంతో ఆమె కోలుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ టీడీఎల్పీ నాయకుడిగా ఎన్నికయ్యే కార్యక్రమం ఏర్పాట్లను నన్నపనేని రాజకుమారి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎండలో తిరగడం వల్ల ఆమెకు వడదెబ్బ తగిలి స్పృహ తప్పారు. వెంటనే స్పందించిన తెలుగుదేశం నాయకులు ఆమెను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు తక్షణం చికిత్స చేయడంతో కోలుకున్నారని తెలిసింది.

ఈ తెలివి అప్పుడేమైంది సోనియా?: వెంకయ్య

  చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు లేఖ పట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన కారణంగా ఎంతో నష్టపోయిన సీమాంధ్రను ఆదుకోవాలని మంగళవారం నాడు సోనియాగాంధీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. సోనియాగాంధీ సీమాంధ్రుల మీద ఇంత ప్రేమ ఒలకబోస్తూ ప్రధానికి లేఖ రాయడం పొట్టలో కత్తితో పొడిచిన తర్వాత తల నిమిరినట్టుగా వుందన్న అభిప్రాయాలు తెలుగు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. సోనియాగాంధీ రాసిన సదరు లేఖ కాంగ్రెస్ నీచ రాజకీయాలలో భాగమేనన్న విమర్శలూ వినిపించాయి. సోనియాగాంధీ రాసిన లేఖ మీద భారతీయ జనతాపార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పందించారు. సోనియాగాంధీ తన లేఖలో సీమాంధ్రుల మీద కురిపించిన ప్రేమలో కొంత శాతమైనా తమ ప్రభుత్వం వున్నప్పుడు చూపించి వుంటే బాగుండేదని వెంకయ్య వ్యాఖ్యానించారు. సీమాంధ్రులను ఆదుకోవాలని సోనియా తన లేఖలో పేర్కొన్నారని, సీమాంధ్రులను ఆదుకోవాలన్న సోనియాగాంధీ తెలివి తమ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఏమైందని సోనియాగాంధీని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. సోనియా సీమాంధ్రులను ఆదుకోవాలని లేఖ రాశారు సంతోషం.. అయితే ఆమె లేఖ రాయకపోయినా తమ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో, రాజకీయాలు లేకుండా కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

ఆ పాప ప్రాణం ఖరీదు 20 రూపాయలు!

  అన్నెం పున్నెం ఎరుగని ఏడేళ్ళ పసిపాప 20 రూపాయల కారణంగా తన ప్రాణాలను కోల్పోయింది. 20 రూపాయలు ఆమె దారుణ హత్యకి గురవడానికి కారణమయ్యాయి. అత్యంత విషాదకరమైన సంఘటన ముంబైలోని చెంబూరు ప్రాంతంలో జరిగింది. ప్రకాష్ హజ్రా అనే వ్యక్తి తన పక్కింట్లోకి సెల్ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చాడు. అక్కడ ఆ ఇంటి యజమాని సర్కార్‌కి సంబంధించిన పర్స్ అతనికి కనిపించింది. ఆ పర్సు చూడగానే హజ్రాలో దొంగ బుద్ధి ప్రవేశించింది. ఆ పర్సులో వున్న 20 రూపాయలను కాజేసి ఏమీ ఎరుగనట్టుగా పర్సు అక్కడే పెట్టేశాడు. అయితే హజ్రా తన తండ్రి పర్సులోంచి 20 రూపాయలు దొంగతనం చేయడాన్ని అక్కడే ఓ పక్కన ఆడుకుంటున్న ఏడేళ్ళ వయసున్న బ్యూటీ సర్కార్ చూసింది. అంతే హజ్రాలోని రాక్షసుడు నిద్రలేచాడు. తాను చేసిన దొంగతనం గురించి ఆ పాప ఇంట్లో చెప్పేస్తే తన పరువు పోతుందని అనుకున్న హజ్రా బ్యూటీ సర్కార్‌ తలని అక్కడే వున్న నీటి తొట్టెలో ముంచేసి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.