మావోయిస్టులకు టీఆర్ఎస్ సర్కార్ షాక్

      తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాము విస్తరించడానికి అవకాశం ఏర్పడుతుందని, తమమీద వున్న నిషేధం తెలంగాణ వరకు అయినా తొలగే అవకాశం వుందని కలలు కంటున్న మావోయిస్టులకు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే మావోయిస్టులకు అనుకూలంగా వుండే ప్రకటన వచ్చే అవకాశం వుందని చాలామంది భావించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం నుంచి అందుకు విరుద్ధమైన ప్రకటన రావడం మావోయిస్టు వర్గాలను షాక్‌కి గురిచేసింది.   మావోయిస్టులపై కొనసాగుతున్న నిషేధం తెలంగాణ రాష్ట్రంలో యధావిధిగా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆ రాష్ట్ర తొలి హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలు ఎంత అదుపులో ఉంటే రాష్ట్రం అంత బాగా అభివృద్ధి చెందుతుందన్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవని, అయితే సానుభూతి పరులు మాత్రం అక్కడకక్కడ ఉన్నారన్నారు. మావోయిస్టులు పౌర సమాజంలోకి రానప్పుడు వారిపై నిషేధం ఎత్తివేసే సమస్యే లేదన్నారు. ఎన్నికల ముందు మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడ్డం పట్ల మావోయిస్టులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఏడవలేక నవ్విన సోనియా!

        మొన్నటి ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోవడంతో ఆ పార్టీ నాయకురాలు సోనియాగాంధీకి ఏడుపు ఒక్కటే మిగిలింది. మొత్తం దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఏడుపుకి ఒక కారణమైతే, ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ మట్టికరవడం ఏడుపుకి మరో కారణం. తెలంగాణ విషయంలో సోనియాగాంధీకి కేసీఆర్ భలే షాకిచ్చాడు. టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి ఇప్పుడు చక్కగా ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు.   తెలంగాణ విషయంలో షాకులు తిన్న సోనియా గత కొంతకాలంగా తెలంగాణ ఊసు లేకుండా వున్నారు. తాజాగా తెలంగాణ విషయంలో ఆమె ఏడవలేక నవ్వారు. అదెలాగంటే, జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్‌కి శత్రువులు, మిత్రులు అభినందనలు తెలియజేస్తున్నారు. కేసీఆర్ విషయంలో కడుపులో కత్తులు పెట్టుకున్నవాళ్ళు కూడా అభినందనలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం అభినందనలు తెలిపే విషయం ఎలా వున్నా, కేసీఆర్ తమని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని విమర్శలు చేశారు. ఇదిలా వుంటే, కేసీఆర్ తనను చేసిన మోసాన్ని తలుచుకుని ఇంతకాలం కుమిలిపోయిన సోనియా గాంధీ మాత్రం కేసీఆర్‌కి, తెలంగాణ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు. సోనియా తెలిపిన శుభాకాంక్షలు చెప్పక తప్పక చెప్పినట్టే వున్నాయని, సోనియాగాంధీ కేసీఆర్‌కి, తెలంగాణకి శుభాకాంక్షలు తెలపడం ఏడవలేక నవ్విన చందంగా వుందని రాజకీయ పరిశీకులు భావిస్తు్న్నారు.

ప్రతిపక్ష నాయకుడు పదవి కోసం టీ-కాంగ్రెస్ నేతల సిగపట్లు

  కాంగ్రెస్ పార్టీని దేశంలో మరే ఇతర పార్టీ కూడా ఓడించలేదని, కాంగ్రెస్ పార్టీ తనను తాను ఓడించుకొన్నపుడే, ఇతర పార్టీలు గెలుస్తుంటాయని కాంగ్రెస్ నేతలు అందరూ కించిత్ గర్వంగా చెప్పుకొంటుంటారు. అది నూటికి నూరు శాతం నిజమని సోనియా, రాహుల్ గాంధీలు మొన్న జరిగిన ఎన్నికలలో మరోమారు నిరూపించి చూపారు. కాంగ్రెస్ చేసిన ఘోర తప్పిదాల వల్లనే బీజేపీకి విజయావకాశాలు మెరుగుపడ్డాయి. దానికి మోడీ ప్రభంజనం తోడవడంతో కాంగ్రెస్ పార్టీ దేశంలో, ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాలలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.   తమ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా రాష్ట్రం ఇచ్చినప్పటికీ, దానిని సరిగ్గా ప్రచారం చేసుకోకుండా, ఎంతసేపూ పదవులు, టికెట్స్ కోసం కీచులాడుకొంటూ తెలంగాణాలో అధికారాన్ని చేజేతులా జారవిడుచుకొన్నారు టీ-కాంగ్రెస్ నేతలు. అయినా వారి ఆలోచనలలో కానీ, పద్దతులలో గానీ ఎటువంటి గొప్ప మార్పులురావు...రాబోవని ఇప్పుడు మరోమారు నిరూపిస్తున్నారు. ఎన్నికలలో పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ తదితరులందరూ ఇప్పుడు కనీసం పార్టీ శాసనసభా పక్ష నేతగానయినా ఎంపికయితే చాలని పోటీలు పడుతున్నారు. ఉన్నది 21మంది శాసనసభ్యులే అయినా వారిలో కనీసం ఒక డజను మందికి పైగా పోటీలో ఉన్నారు.   ఈరోజు జరుగబోయే శాసనసభ, శాసనమండలి ఫ్లోర్ లీడర్ల ఎన్నికకు కేంద్రం నుండి దిగ్వజయ్ సింగ్, వాయిలార్ రవి అధిష్టానం దూతలుగా వచ్చేరు. మామూలు పరిస్థితుల్లో వారు సూచించిన వారినే తమ నేతలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కాంగ్రెస్ లో పరిపాటి. కానీ, ఈసారి మాత్రం ఈ ఎన్నికలలో వారు జోక్యం చేసుకోవడాన్ని కొందరు టీ-కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. సీయల్పీ నేతను ఎన్నుకొనే బాధ్యతను తమకే విడిచి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల వారిరువురూ ఈ ఎన్నికలలో జోక్యం చేసుకోకపోవచ్చును.   అయితే ఇప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలలో ఎవరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలనే విషయంలో ఏకాభిప్రాయం రాలేదు, పైగా టీ-కాంగ్రెస్ నేతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ ఒక ముటాగా, మిగిలిన వారందరూ మరో ముటాగా విడిపోయి ఎవరికివారు తమ ముటాకు చెందిన వారినే నాయకుడిగా ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఆ రెండు ముటాలలో కూడా అనేకమంది పోటీ పడుతుండటంతో వారు కూడా కొత్తగా ఎన్నికయిన యం.యల్యే.లతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.   అందువల్ల కాంగ్రెస్ సంప్రదాయానికి భిన్నంగా మొట్ట మొదటిసారిగా టీ-కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యబద్దంగా రహస్య బ్యాలట్ ద్వారా ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరక మంచిదే అంటే ఇదేనేమో!

ఆందోళనతో గుండెపోటు కారణంగానే ముండే మరణం

  ఈరోజు తెల్లవారు జామున కారు ప్రమాదంలో మరణించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండేకు ప్రమాదంలో ఎటువంటి తీవ్ర గాయాలు అవలేదని, ఆందోళన కారణంగా ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని ఆయన సహచర కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు వెనుక సీటులో కూర్చొన్న ముండే బయటపడిపోయారని, దానితో తీవ్ర ఆందోళన చెందిన ఆయనకు గుండె పోటు వచ్చిందని తెలిపారు. కారు ప్రమాదం తరువాత ముండే తనకు త్రాగేందుకు మంచినీళ్ళు కావాలని తన సహాయకుడిని అడిగినట్లు చెప్పారు. ఆ మరుక్షణమే ఆయన గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయినట్లు తెలిపారు. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే ఆయన ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనకు కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేసినప్పటికీ, అయన శ్వాస తీసుకోలేక చనిపోయారని వైద్యులు చెప్పారు.

గోపీనాధ్ ముండే మృతి: మోడీ దిగ్భ్రాంతి

      కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి గోపీనాధ్ ముండే కన్నుమూశారు. ఢిల్లీలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి వెళ్లడం కోసం ఢిల్లీ విమనాశ్రయానికి బయలుదేరిన ముండే కాన్వాయ్ మోతీబాగ్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముండేకు తీవ్రగాయాలు కావడంతోపాటు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఈ ఉదయం 8 గంటలకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1949 ఫిబ్రవరి 14న గోపినాథ్‌ముండే జన్మించారు. ఈయనకు భార్య ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మహారాష్ట్ర శాసనసభకు ముండే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992-1995 మధ్య మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అదేవిధంగా 1995 నుంచి 1999 వరకు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముండే దుర్మరణం గురించి తెలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ముండే మృతి విషయం తెలియగానే మోడీ ట్విట్టర్‌లో స్పందించారు. ముండే నిజమైన ప్రజా నాయకుడు అని, అతని మృతి దేశానికి, ప్రభుత్వానికి తీరని లోటు అన్నారు.ముండే కుటుంబ సభ్యులకు మోడీ తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. తాము వారికి అండగా నిలబడతామని చెప్పారు.  

రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే దుర్మరణం

  నరేంద్రమోడీకి, మహారాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి పెద్ద షాకింగ్ న్యూస్. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం ఉదయం న్యూఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ దగ్గర ముండే కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముండే తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ గోపీనాథ్ ముండే మరణించారు.భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో గోపినాథ్ ముండే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా 16వ లోక్సభకు గోపినాథ్ ముండే ఎన్నికయ్యారు. పరిపాలనాదక్షుడిగా పేరున్న ముండే ఇలా దుర్మరణం పాలు కావడం మోడీ కేబినెట్‌కి, మహారాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఒక దుర్వార్త.

రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకి తీవ్ర గాయాలు

  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర గోపినాథ్ ప్రయాణిస్తున్న వాహనం కాన్వాయి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  ఈ ప్రమాదంలో గోపీనాథ్ ముండేకి చాలా బలమైన గాయాలు తగిలినట్టు ప్రాథమిక సమాచారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో గోపినాథ్ ముండే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా 16వ లోక్సభకు గోపినాథ్ ముండే ఎన్నికయ్యారు.

రాష్ట్రంలో ప్రియాంకకి ఏం పని చిరూ?

      ఎన్నికలు ముగిశాయి. అటు కేంద్రంలో, ఇటు రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్లు ఫిక్స్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎందుకు సర్వనాశనమయ్యామా అన్న ఆలోచనలో, అంతర్మథనంలో వుంది. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు సోనియమ్మని, రాహులయ్యని కలిసి తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నాశనమైపోయిందీ వివరిస్తున్నారు.   కాంగ్రెస్ అధినేత్రి తిడితే బాధపడుతున్నారు. ఓదారిస్తే రిలీఫ్ అవుతున్నారు. మొన్నామధ్య తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్ళి సోనియా, రాహుల్ చేత తలంటు పోయించుకుని, ముఖాలని నయాపైస అంతగా మార్చుకుని తిరిగి వచ్చారు. ఎన్నికలు అయిపోయిన ఇన్నాళ్ళ తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, చిరంజీవి తీరిగ్గా ఢిల్లీకి వెళ్ళి సోనియాని, రాహుల్‌కి కలిశారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకం పడిపోవడానికి గల కారణాలను పూస గుచ్చినట్టు వివరించారు. జరిగిందేదో జరిగిపోయింది సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కృషి చేయండని సోనియా వాళ్ళతో అన్నారు. ఇక్కడి వరకు బాగానే వుంది. ఇక్కడ చిరంజీవి ప్రదర్శించిన అతి వినయం అందరికీ నవ్వు తెప్పించేలా వుంది.   సోనియా మేడమ్ దగ్గరకి వెళ్లినప్పుడు చిరు గారికి ప్రియాంక గారు కనిపించారట. అంతే వెంటనే చిరంజీవికి ఒక వండర్‌ఫుల్ ఐడియా వచ్చింది. వెంటనే ఆయన ప్రియాంకని కలిసి మీరు మా రాష్ట్రంలో పర్యటించాలని ఆహ్వానించారు. దానికి ప్రియాంక స్పందించి సరే అన్నారు. ఈ అంశంలో చిరంజీవికి సూటి ప్రశ్నలు ఏమిటంటే, 1. అసలు ప్రియాంకని తమరు రాష్ట్రానికి ఎందుకు ఆహ్వానించారు? 2. ప్రియాంక ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఏం ఒరుగుతుంది? 3. ఆంధ్రప్రదేశ్‌లో ప్రియాంక పర్యటించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒనగూడే లాభమేంటి? ఈ ప్రశ్నలకి చిరంజీవి గారు అర్జెంటుగా సమాధానాలు చెప్పాలి.

తెలంగాణలో స్వార్థం గెలిచింది: గద్దర్

      తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయనకు ఆ ఆనందాన్ని తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువకాలం ఉంచేట్టు లేరు. కేసీఆర్ని నీడలా వెంటాడి, తెలంగాణ ప్రజలకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, ఆయన చేసిన వాగ్దానాలలో 25 శాతమైనా నెరవేర్చాలని తాము కోరుకుంటున్నామని, అలా జరగకుంటే తెలంగాణ ప్రజలు ఉద్యమబాటలో పయనిస్తారని చెప్పారు.   తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం మీద గద్దర్ స్పందిస్తూ, తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, అయితే ఈ ఎన్నికలలో త్యాగం గెలవలేదని, స్వార్థమే గెలిచిందని అన్నారు. ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికలలో ఓడిపోవడం, తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలు చేయని వాళ్ళు గెలవటం దీనికి ఉదాహరణ అని గద్దర్ అన్నారు. త్యాగానికి ప్రతీక అయిన శంకరమ్మ ఓడిపోవడానికి, ఎలాంటి త్యాగాలూ చేయనివాళ్ళు గెలవటానికి రాజకీయ గారడీలే కారణమని ఆయన చెప్పారు.

కొప్పుల ఈశ్వర్ తెలంగాణా అసెంబ్లీ స్పీకర్?

  కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎన్నికైన తెరాస యం.యల్యే కొప్పుల ఈశ్వర్ మంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. ఈరోజు తనకూ పదవీ ప్రమాణం చేసే అవకాశం ఉంటుందని ఆయన చాలా ఆశపడ్డారు. కానీ, కేసీఆర్ మొదటి జాబితాలో ఆయన పేరు కనబడలేదు. కొప్పుల ఈశ్వర్ దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వంలో తనకు కీలక మంత్రి శాఖ దొరుకుతుందని ఆశించారు. కేసీఆర్ ఈ నెల 15 తర్వాత మళ్ళీ తన కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. కనీసం అప్పుడయినా మంత్రి పదవి దక్కవచ్చని ఆశపడుతున్న ఈశ్వర్ కు కేసీఆర్ తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పదవిని ఖరారు చేసినట్లు తాజా సమాచారం. అందుకు ఆయన స్పీకర్ పదవి తీసుకొనేందుకు అంగీకరిస్తారా లేదా? చూడాలి.

సీఎం కేసీఆర్ మీద విమర్శలు షురూ!

      తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో ఇలా విమర్శల పర్వం మొదలైపోయింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కేబినెట్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కాదని, కేసీఆర్ కుటుంబ మంత్రివర్గం అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తండ్రీకొడుకులు, అల్లుడు కలసి సొంత ఆస్తిని పంచుకన్నట్టు మంత్రివర్గాన్ని పంచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. 12 మంది సభ్యులున్న తెలంగాణ మంత్రివర్గంలో కేసీఆర్‌తో కలిపి ముగ్గురు ఆయన కుటుంబానికే చెందినవారు వున్నారని విమర్శించారు. వెనుకబడిపోయిన మహబూబ్‌నగర్ జిల్లాకు కేసీఆర్ కేబినెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని, టీఆర్ఎస్‌కి అత్యధిక సీట్లు ఇచ్చిన జిల్లాకి కేసీఆర్ మొండిచెయ్యి చూపించారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రిపదవులకు అర్హులు కాని సన్నాసులు.. దద్దమ్మలా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట తప్పడమే కాకుండా మంత్రివర్గంలో కూడా దళితులకు స్థానం కల్పించలేదని విమర్శించారు.

కేసీఆర్ మంత్రివర్గం...శాఖల వివరాలు

      29వ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం ఉదయం కేసీఆర్‌తోపాటు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రులుగా మహమూద్ అలీ, రాజయ్య నియమితులయ్యారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు.. అలాగే తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. తెలంగాణ అధికారిక ముద్రకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.   మంత్రులకు కేటాయించిన శాఖలు : 1.  మహమూద్ అలీ - రెవన్యూ శాఖ 2.  రాజయ్య - వైద్య ఆరోగ్య శాఖ 3.  నాయిని నరసింహారెడ్డి - హోంమంత్రి 4.  ఈటెల రాజేందర్ - ఆర్థిక శాఖ 5.  పోచారం శ్రీనివాస్‌రెడ్డి - పపంచాయతీ రాజ్ శాఖ 6.  హరీష్‌రావు - విద్యుత్ నీటి పారుదల శాఖ 7.  పద్మారావు - ఎక్సైజ్ శాఖ 8.  మహేందర్‌రెడ్డి - క్రీడలు, యువజన వ్యవహరాల శాఖ 9.  కేటీఆర్ - ఐటీ, పరిశ్రమల శాఖ 10.  జోగురామన్న - సాంఘిక సంక్షేమ శాఖ 11. జగదీశ్‌రెడ్డి - రోడ్డు, భవనాల శాఖ

కేసీఆర్ కి శుభాకాంక్షలు: చంద్రబాబు

  తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నేతలయిన జానారెడ్డి, వీ.హనుమంత రావు వంటి వారినెవరినీ ఆహ్వానించకపోవడంతో వారెవరూ ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు. మరికొద్ది సేపటిలో కేసీఆర్ సచివాలయం చేరుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత చంద్రబాబు నాయుడు ఆయనకు అభినందనలు తెలియజేస్తారు. కేసీఆర్ తనను తన పార్టీ నేతలను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనప్పటికీ, చంద్రబాబు మాత్రం కేసీఆర్ ను ఈనెల 8న నిర్వహించే తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించబోతున్నారు. కేసీఆర్ ఈరోజు పెరేడ్ గ్రౌండ్స్ లో చేసిన తన ప్రసంగంలో ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటానని హామీ ఇచ్చారు. దానిని ఆయన మాటలలో కాక చేతలలో చూపితే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి తమ వాళ్ళని కూడా ఆహ్వానించి ఉండి ఉంటే బాగుండేది అని చంద్రబాబు వ్యాక్యానించారు.

ఆంధ్రప్రదేశ్ కి రాముడు, కృష్ణుడు, చంద్రుడు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాముడు, కృష్ణుడు, చంద్రుడు రక్షగా నిలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడు (చంద్రుడు), డీజీపీగా జేవీ రాముడు, (రాముడు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఐవై.ఆర్. కృష్ణా రావు (కృష్ణుడు) రక్షగా నిలబోతున్నారు. ముగ్గురూ కూడా మంచి కార్యదక్షులు, అనుభవజ్ఞులుగా పేరు తెచ్చుకొన్నవారే.   రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయినా ఐవై.ఆర్. కృష్ణారావు 1979 ఐఏయస్ బ్యాచ్ కు చెందినవారు. ఆయన పూర్తి పేరు ఇప్పగుంట యశోధరా రామకృష్ణారావు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలంలో గల చౌటపాలెం గ్రామం. ఇప్పటి వరకు ఆయన విజయవాడ, నెల్లూరు జిల్లాలకు జాయింటు కలెక్టరుగా, నల్గొండ జిల్లా కలక్టరుగా, రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉన్నతాధికారులలో ఆయనకు సౌమ్యుడు, కార్యదక్షుడనే మంచి పేరుంది. నిన్న ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలన్నిటినీ చక్కగా సమన్వయ పరుచుకొంటూ త్వరితగతిన సజావుగా రాష్ట్ర పునర్నిర్మాణం జరిగేందుకు కృషిచేస్తానని తెలిపారు.   రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జాస్తి వెంకట రాముడు 1981 బ్యాచ్ కు చెందిన ఐ.పీ.యస్ అధికారి. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లాలో తడ్డిమర్రి మండలంలో గల నర్సింపల్లి గ్రామం. ఆయన గుంటూరు, కరీం నగర్, వరంగల్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ లలో వివిధ శాఖలలో వివిధ హోదాలలో సేవలందించారు. ఆయన పోలీసు శాఖలో అన్ని విభాగాలలో కూడా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చెప్పట్టే ముందు వరకు ఆయన డీజీ ఆపరేషన్స్ గా సేవలందిస్తున్నారు. బాధ్యతలు చేప్పట్టిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర తొలి డీజీపీగా తనకు అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అన్ని విధాల కృషి చేస్తానని, అలాగే రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా చంద్రబాబు ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు.

తెలంగాణ తొలి సీఎంగా కేసిఆర్ ప్రమాణం

      తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలుపొందిన విషయం విదితమే. మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో కేసీఆర్ 1954, ఫిబ్రవరి 17న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు నుంచి పట్టా పొందారు. కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభించారు. అనంతరం 1983లో టీడీపీలో చేరారు. టీఆర్‌ఎస్ పార్టీని 2001, ఏప్రిల్ 27 ప్రారంభించి తెలంగాణ కోసం ఆలు పెరగని పోరాటం చేశారు.

టీఆర్ఎస్‌లోకి తుమ్మల నాగేశ్వరరావు జంప్?

  ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి జంప్ అవబోతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. తుమ్మల నాగేశ్వరరావుతోపాటు సత్తుపల్లి తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వీరయ్య కూడా టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీరిద్దరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతోనే సండ్ర వీరయ్య తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టబోతున్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ఒక్క ఎమ్మెల్యే స్థానం సండ్ర వీరయ్యదే. ఇప్పుడాయన టీఆర్ఎస్‌లో చేరితే ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడానికి ప్రధాన కారణం ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో తారస్థాయికి చేరిన విభేదాలే కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామా నాగేశ్వరరావు పోటీ చేయగా, ఖమ్మం అసెంబ్లీ స్థానానికి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు. వీరిద్దరి మధ్య ఎప్పుడూ ఘర్షణ పూర్వక వాతావరణం నెలకొని వుండేది. ఇలా ఇద్దరు నాగేశ్వరరావులూ ఒకరి మీద మరొకరు విభేదాలు పెంచుకున్నారు. ఫలితంగా ఇద్దరూ గత ఎన్నికలలో ఓడిపోయారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం భంగపడటానికి కారణం మీ నాయకుడంటే మీ నాయకుడంటూ తుమ్మల, నామాలకు చెందిన వర్గీయులు రోడ్డుమీద జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు కూడా! తన ఓటమికి నామా నాగేశ్వరరావు వర్గీయులు తనను వెన్నుపోటు పొడవటమే కారణమని తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచీ తన సన్నిహితుల దగ్గర వాపోతూ వస్తున్నారు. నామా మీద చర్యలు తీసుకోవాలని ఆయన భావించారు. అయితే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి నామా సన్నిహితుడు కావడం వల్ల తనకంటే నామాకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం తుమ్మలలో వుంది. దీనివల్లే ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగినా చురుగ్గా పనిచేసే తుమ్మల తాజాగా జరిగిన మహానాడుకు హాజరు కూడా కాలేదు. టీఆర్ఎస్‌లో బెర్త్ కన్ఫమ్ కావడం వల్లే ఆయన తెలుగుదేశం పార్టీ వేడుకకు దూరంగా వున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.