జూన్ 4 నుంచి 12 వరకు పార్లమెంట్ సమావేశాలు
posted on May 29, 2014 @ 2:33PM
పదహారవ పార్లమెంటు సమావేశాలు జూన్ 4 నుంచి మొదలుకానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలు ఇవి. జూన్ 4 నుంచి 12 తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని గురువారం ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. జూన్ 4, 5 తేదీల్లో పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు. జూన్ 6న స్పీకర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎంపి కమల్‌నాథ్ వ్యవహరిస్తారని వెంకయ్య నాయుడు తెలిపారు. జూన్ 9న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారని చెప్పారు. మరోవైపు రాష్ట్రానికి చెందిన అంశాలపై కేబినెట్ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుల కేటాయింపుపై ఆర్డినెన్స్ అవసరం లేదని హోంశాఖ అధికారులు స్పష్టంచేశారు. అలాగే ఉద్యోగుల విభజనలో తలెత్తిన సమస్యలపై కూడా కేబినెట్‌లో చర్చించినట్లు సమాచారం.