సత్యం కేసు తీర్పు: రామలింగరాజు దోషి

  సత్యం కుంభకోణం కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు తుది తీర్పు గురువారం నాడు వెలువరించింది. ఈ కేసులో రామలింగరాజు సహా మిగతా నిందితులపై నేరం రుజువైంది. రామలింగరాజును ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. సత్యం సంస్థ మాజీ చైర్మన్ రామలింగరాజు, ఆయన ఇద్దరు సోదరులు బి.రామరాజు, బి.సూర్యనారాయణ రాజు, ఆ సంస్థ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వడ్లమాని శ్రీనివాస్, ఆ సంస్థ ఆడిటర్స్ యస్. గోపాల కృష్ణన్, తాళ్ళూరి శ్రీనివాస్ తదితరులను దోషులుగా కోర్టు పేర్కొంది. క్రిందటి సంవత్సరం అక్టోబరులోనే తుది తీర్పు ప్రకటించవలసి ఉన్నప్పటికీ వివిధ కారణాల వలన తీర్పు మూడుసార్లు వాయిదా వేశారు. ఈ కేసులో దోషులుగా నిరూపణ అయిన రామలింగరాజుతో సహా మిగతా ముద్దాయిలందరూ గురువారం నాడు కోర్టుకు హాజరయ్యారు.

ఆంధ్రాబ్యాంకు మీద బాంబు

  తమిళనాడుకు చెందిన కూలీలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్ కావడం మీద అక్కడి రాజకీయ పార్టీలు నానా హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అనేక బస్సులను ధ్వంసం చేశారు. ఇప్పుడు మరింత ముందడుగు వేసి బాంబుల వరకూ వెళ్ళారు. తూత్తుకుడిలో వున్న ఆంధ్రాబ్యాంకు మీద ఆందోళనకారులు బాంబు విసిరారు. ఆ సమయంలో బ్యాంకు మూసి వుండటంతో ప్రమాదం తప్పింది. అలాగే వేలూరు, తిరువణ్ణామలైలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సంస్థలు, బ్యాంకుల వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్ళే 200 బస్సులను మూడోరోజు కూడా ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ షార్ట్ రివ్యూ

తెలుగు ప్రేక్షకులు, అభిమానులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి సినిమా గురువారం నాడు విడుదలైంది.. ఆ సినిమా ఫస్ట్ రివ్యూ రిపోర్టు ఇది.. అల్లు అర్జున్, త్రివిక్రమ్, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, ప్రకాష్ రాజ్, సమంత, నిత్యామీనన్... ఇలా భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను చేరుకుందా.. అధిగమించిందా అనేది చూద్దాం. ‘జులాయి’ తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సెకండ్ కాంబినేషన్ కూడా ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి కారణమైంది. సినిమా ప్రారంభం అల్లరు అర్జున్ ఈ సినిమా ప్రధాన కథాంశాన్ని చెబుతుండగా జరుగుతుంది. అల్లు అర్జున్ సత్యమూర్తి (ప్రకాష్‌రాజ్) అనే ఒక పెద్ద బిజినెస్మేన్ ఒక్కగానొక్క కుమారుడు. సత్యమూర్తి గారు తన కొడుకు పెళ్ళి అదా శర్మ అనే అమ్మాయితో ఫిక్స్ చేస్తాడు. ఎంగేజ్‌మెంట్ కూడా జరిపిస్తాడు. అయితే ఆ తర్వాత సత్యమూర్తి ఒక ప్రమాదంలో మరణిస్తాడు. ఆ తర్వాత అదాశర్మతో సన్నాఫ్ సత్యమూర్తి పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం చనిపోయిన సత్యమూర్తి ఆస్తుల విషయంలో కొన్ని సందేహాలు ఏర్పడటమే. 3000 కోట్ల ఆస్తిపరుడైన అల్లు అర్జున్ జీవితం తారుమారు అయిపోతుంది. దాంతో అతను వెడ్డింగ్ ప్లానర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. తర్వాత అతని జీవితంలోకి సుబ్బలక్ష్మి అనే సమంత ఎంటరవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. మాటల మాంత్రికుడిగా పేరు పొందిన దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా ద్వారా ట్విస్టుల మాంత్రికుడు అనిపించుకునే ప్రయత్నం చేశాడు. సినిమాలో కామెడీ పర్లేదనిపించింది. బ్రహ్మానందం కామెడీ మాత్రం ఆశించినంత, ఊహించినంత లేదు. సినిమాటోగ్రఫీ, రీ - రికార్డింగ్ బాగున్నాయి.  అల్లు అర్జున్ నటన బాగుంది. చాలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. సమంత కూడా బాగానే నటించింది. రాజేంద్రప్రసాద్ కేరెక్టరైజేషన్ చాలా బాగుంది. ఉపేంద్ర రాకింగ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. స్నేహ, నిత్యామీనన్ కూడా మెప్పించే నటన ప్రదర్శించారు. ప్లస్సులు అల్లు అర్జున్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాటోగ్రఫీ రాజేంద్రప్రసాద్ మైనస్సులు స్లో నెరేషన్ వీక్ సెకండాఫ్ ఎడిటింగ్ డైరెక్షన్ త్రివిక్రమ్ సినిమా అని నమ్మకంతో వెళ్ళిన వారికి ఆ నమ్మకం నిలబడటం డౌటే.

సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై తుది తీర్పు నేడే

  సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసును విచారించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానం నేడు దోషులుగా నిరూపించబడిన ఆ సంస్థ మాజీ చైర్మన్ రామలింగ రాజు, ఆయన ఇద్దరు సోదరులు బి.రామరాజు, బి.సూర్యనారాయణ రాజు, ఆ సంస్థ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వడ్లమాని శ్రీనివాస్, ఆ సంస్థ ఆడిటర్స్ యస్. గోపాల కృష్ణన్, తాళ్ళూరి శ్రీనివాస్ తదితరులకు ఈ రోజు శిక్షలు ఖరారు చేయనున్నారు. క్రిందటి సంవత్సరం అక్టోబరులోనే తుది తీర్పు ప్రకటించవలసి ఉన్నప్పటికీ వివిధ కారణాల వలన తీర్పు మూడుసార్లు వాయిదా వేయబడింది. చివరికి ఈరోజు తుది తీర్పు వెలువడనుంది. కనుక ఈ కేసులో దోషులుగా నిర్ధారించబడిన వారంరూ ఈరోజు కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఒకవేళ కోర్టు వారందరికీ జైలు శిక్షలు విధించినట్లయితే, వారందరినీ జైలుకి తరలించవచ్చును అలాగే వారు మళ్ళీ బెయిలు తీసుకొని బయటకు రావచ్చును. కోర్టు శిక్షలు ఖరారు చేసినప్పటికీ వారందరూ మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీలు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది కనుక ఎవరికీ అంత త్వరగా శిక్షలు అమలుచేసే అవకాశం ఉండకపోవచ్చును.

లండన్‌లో 1860 కోట్ల దోపిడీ

  లండన్‌లో భారీ దోపిడీ జరిగింది. భారత కరెన్సీతో లెక్కవేస్తే దాదాపు 1860 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. లండన్ నగరంలోని హాటన్ గార్డెన్స్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్ బ్యాంకులో దొంగలు పడి 1860 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, నగలను దోచుకుపోయారు. ఈస్టర్ సెలవుల కారణంగా గత మూడు రోజులుగా బ్యాంకు మూసి వుంది. ఈ ఛాన్స్‌ని లడ్డులాగా అందుకున్న దోపిడీదారులు చక్కగా వినియోగించుకుని బ్యాంకుకు గుండుకొట్టారు. బ్యాంకు పైకప్పును తొలగించి లోపలకు వెళ్ళిన దొంగలు లోపల వున్న మొత్తం 600 సేఫ్ డిపాజిట్ లాకర్లలో 300 లాకర్లను తెరిచి, వాటిలోని వజ్రాలు, నగలు, నగదును దోచుకున్నారు. లాకర్లు తెరవడానికి దొంగలు అత్యాధునిక కటింగ్ యంత్రాలను ఉపయోగించారు. బ్యాంకులోని అలారం వ్యవస్థ కూడా పనిచేయపోవడంతో ఈ ఘటన వెనుక ఇంటిదొంగల పని వుండి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

70 లక్షలకి టోపీ పెట్టిన పోలీసు పెద్దాయన

  ప్రస్తుతం పోలీసులు చేసిన త్యాగాలను అందరూ స్మరించుకుంటున్నారు. ఇప్పుడు మరోరకం పోలీసు అధికారి గురించి వెలుగులోకి వచ్చింది. అడిషనల్ డీజీగా పనిచేసి రిటైరైన ఓ పెద్దాయన ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని చెప్పి ఓ యువకుడి నుంచి 70 లక్షలు వసూలు చేశాడు. ఎంబీబీఎస్ సీటు కోసం తనను ఆశ్రయించిన వ్యక్తికి బాగా నమ్మకంగా మాటలు చెప్పిన ఆ రిటైర్డ్ పోలీసు అధికారి అతన్ని చక్కగా మోసం చేశాడు. ఎంబీబీఎస్ సీటు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వవయ్యా మగడా అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దాంతో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మాజీ పోలీసు అధికారి మీద కేసు నమోదు చేశారు.

నాగార్జునసాగర్‌కి ముప్పు?

  నాగార్జున సాగర్‌కి ముప్పు పొంచి వుందా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. నల్గొండ జిల్లాలో సిమి ఉగ్రవాదుల ఘాతుక చర్యలు, వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రతీకార చర్యలకు పాల్పడే ప్రమాదం వుందని భావిస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం బెంగుళూరులో కొంతమంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ పేల్చివేయాలన్న తీవ్రవాదుల కుట్ర వెలుగులోకి వచ్చింది. దీనికితోడు సిమి ఉగ్రవాద సంస్థలో కీలకంగా ఉండే ఒక తీవ్రవాది నాగార్జున సాగర్‌కి చెందినవాడు కావడంతో అప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఏ ఘటన జరిగినా నాగార్జున సాగర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఉగ్రవాదుల ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌కు ప్రతీకార చర్యలకు అవకాశం ఉందనే నిఘావర్గాల హెచ్చరించడంతో నాగార్జునసాగర్‌లో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్‌, ఎన్‌ఐఏ బలగాలు మకాం వేసి ఉగ్రమూలాలను శోధిస్తున్నాయి. సాగర్‌ డ్యాం భద్రతపై నిఘా వర్గాలు మరోసారి దృష్టి సారించాయి.

పోలీసు సంక్షేమ సంఘం సూటి ప్రశ్నలు

  తిరుపతి సమీపంలో ఎర్రచందనం దొంగల ఎన్‌కౌంటర్‌ మీద రాజకీయ పార్టీలు రకరకాల కామెంట్లు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పార్టీల రాద్ధాంతాన్ని పోలీసు సంక్షేమ సంఘం ఖండించింది. ఎన్‌కౌంటర్ ఘటన జరిగీ జరగకముందే రాజకీయం చేయడం దారుణమని పేర్కొంది. కాల్పులు జరిగినప్పుడు మృతుల కులం, ప్రాంతం తాము చూడలేదని తెలిపింది. ఎర్రచందనం దొంగల కుల, మతాలు, ప్రాంతం పార్టీలకు ఎలా తెలుసని పోలీసు సంక్షేమ సంఘం ప్రశ్నించింది. దొంగలకు మద్దతు ఇస్తున్నవారే వారిని అడవులకు పంపారా అని ప్రశ్నించింది. అధికారులను స్మగ్లర్లు చంపినప్పుడు పార్టీలు ఎందుకు మాట్లాడలేదని పోలీసులు సంక్షేమ సంఘం ప్రశ్నించింది.

ఐపీఎల్-8 వచ్చేసింది..

  వరల్డ్ కప్ అయిందో లేదో అప్పుడే ఐపీఎల్-8 సీజన్ వేడి మొదలైంది. మంగళవారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఐపీఎల్-8 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయితే వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమం మొదలైంది. మొత్తం ఎనిమిది జట్ల కెప్టెన్లు ఎప్పటిలాగే బ్యాట్‌పై సంతకాలు చేసి, ట్రోఫీ ముందు కెమెరాలకు పోజులిచ్చారు. అనంతరం బాలీవుడ్ హీరో షాషిద్‌కపూర్‌ బైక్‌ నడుపుతూ వేదికపైకి వచ్చి డిస్కో డాన్సర్‌ పాటకు నృత్యం చేశాడు. తరువాత అనుష్కశర్మ పీకే, జబ్ తక్ హై జాను సినిమాలో పాటలకు అదరగొట్టే స్టెప్పులు వేసింది. అయితే అనుష్కశర్మ డ్యాన్స్ చూసి విరాట్ కొహ్లి ముసిముసిగా నవ్వుకున్నాడు. చివరిగా స్టయిలిష్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కళ్లు చెదిరే ప్రదర్శనతో కార్యక్రమం ముగిసింది. ఐపీఎల్-8 ఎడిషన్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. 47 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ లో మొత్తం 60 మ్యాచ్ లు నిర్వహిస్తారు. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈడెన్ గార్డెన్స్‌లో బరిలోకి దిగనున్నాయి.

ధోనీ చెంప పగులగొట్టేవాణ్ణి....

  తాను విలేకరి అయినట్టయితే భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెంప పగులగొట్టేవాడినని క్రికెట్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అన్నారు. ప్రపంచ కప్ క్రికెట్ ప్రారంభానికి ముందు ధోనీ మీద విమర్శల వర్షం కురిపించిన యోగరాజ్ మరోసారి తన గళం విప్పాడు. ‘‘ధోనీ ఏదోరోజు బికారి అయిపోతాడు. పైసాకి కూడా ఠికాణా లేకుండా పోతాడు. రావణుడి గర్వం ఎలా అణిగిందో ధోనీ గర్వం కూడా అలాగే అణిగిపోయే రోజు వస్తుంది. నా కుమారుడు యువరాజ్ సింగ్ వరల్డ్ కప్‌కి దూరం కావడానికి ధోనీయే కారణం. ధోనీ ఒక అహంకారి. నిజానికి ధోనీ స్థాయి చాలా చిన్నది. కేవలం మీడియా వల్లే అతను క్రికెట్‌లో రాణించాడు. మీడియానే అతణ్ణి గొప్పవాణ్ణి చేసింది. కానీ ఆ స్థాయిని పొందే అర్హత అతనికి లేదు. తనకు ఎంతో సహకరించిన మీడియాని చూసి అతను ఎగతాళిగా నవ్వుతాడు. నేనే విలేకరిని అయితే అక్కడే ధోనీ చెంప పగులగొట్టేవాడిని. ధోనీకి కూడా రావణాసురుడిలా ఏదో ఒక రోజు గర్వభంగం కలుగుతుంది. ధోనీ గురించి అతని సహచర క్రికెటర్లు చెప్పిన విషయాలు విన్న తర్వాత అతనిని మించిన దారుణమైన వ్యక్తి మరొకరు వుండరని అనిపిస్తోంది’’ అన్నాడు. అయితే తన తండ్రి యోగరాజ్ వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు. ‘‘మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలతో నాకెలాంటి సంబంధం లేదు. ధోనీ నాయకత్వంలో ఆడటాన్ని ఆనందిస్తానని నేనున గతంలోనే చెప్పాను. అతనితో నాకు ఎలాంటి సమస్య లేదు. ధోనీ తండ్రి అయినందుకు అతన్ని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటున్నాను’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

పాపం.. పరీక్ష చివరి రోజున...

  బుధవారం నాటితో తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ముగిశాయి. ఈరోజుతో పరీక్షలు ముగుస్తాయన్న ఆనందంలో ఉన్న ఒక విద్యార్థి ఊహించని విధంగా మృత్యువుపాలయ్యాడు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన మంద చందు (15) అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం చివరి పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. అయితే పరీక్షా కేంద్రానికి వెళ్ళేముందు మూత్ర విసర్జన కోసం పరీక్షా కేంద్రం పక్కనే వున్న రైల్వే ట్రాక్‌ని దాటే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో వరంగల్ నుంచి విజయవాడ వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ చందును ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.

హోం మంత్రి రాజ్‌నాథ్ బంధువు హత్య

  కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బంధువైన అరవింద్ సింగ్ మంగళవారం అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. తన భార్యను కారులో ఎయిర్పోర్ట్లో దింపి ఇంటికి బయలుదేరగా దుండగులు బైక్ మీద వచ్చి ఆయన వాహనానికి అడ్డుగా నిలిపారు. తరువాత వారి వద్ద ఉన్న తుపాకీతో అరవింద్ పై కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే అదే రహదారిలో వెళుతున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అరవింద్ సింగ్ అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు. ఘటన జరిగిన ప్రదేశంలో 32 ఖాళీ బులెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని వారణాసి రూరల్ ఎస్పీ ఏకే పాండే తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ స్పందిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది లేదని విమర్శించారు.

చెన్నైలో ఏ.పీ.యస్.ఆర్.టీ.సి. బస్సులపై దుండగుల దాడి

  చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో నిన్న తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో తమిళనాడుకి చెందిన 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు చనిపోయారు. వారిలో 12మంది సాధారణ కూలీలని, వారు డబ్బుకు ఆశపడి స్మగ్లర్లతో వెళ్లి అన్యాయంగా బలయిపోయారని వాదిస్తున్న తమిళనాడులో రాజకీయపార్టీలు చెన్నైలో నిరసన ర్యాలీలు మొదలుపెట్టాయి. చెన్నైలో కోయం బేడ్ బస్ కాంప్లెక్స్ లో నిలిచి ఉన్న ఏపీయస్.ఆర్.టీ.సి.కి చెందిన బస్సులపై గుర్తు తెలియని దుండగులు దాడులు చేసి బస్సుల అద్దాలు పగులగొట్టారు. చెన్నైకి వెళుతున్న మరో ఏపీయస్.ఆర్.టీ.సి.బస్సుపై కూడా నెల్లూరు జిల్లా తడ మండలం పూడి గ్రామం వద్ద దుండగులు దాడి చేసి బస్సులో ప్రయాణికులు ఉండగానే పెట్రోల్ బాంబు విసిరిపారిపోయారు. ఈ సంఘటనలతో అప్రమత్తమయిన ఏపీయస్.ఆర్.టీ.సి. అధికారులు తమిళనాడుకు వెళ్ళే బస్సులన్నిటినీ తాత్కాలికంగా నిలిపివేశారు.   ఎర్ర చందనం స్మగ్లర్లు తమపై ఎదురుదాడికి పాల్పడినందునే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము తప్ప ఎవరినీ చంపాలనే ఉద్దేశ్యంతో కాల్పులు జరపలేదని ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసు మరియు అటవీశాఖ అధికారులు వాదనలను తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ పై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసి ఈ సంఘటనపై రెండు వారాలలో సంజాయిషీ ఇవ్వవలసినదిగా ఆదేశిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర డీజీపికి నోటీసులు జారీ చేసింది.

పెళ్ళిరోజే ప్రాణాలు కోల్పోయిన సిద్ధయ్య

  నల్లగొండ జిల్లా జానకిపురంలో తీవ్రవాదులతో పోరాడి తీవ్రంగా గాయపడిన ఆత్మకూర్ (ఎం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. మంగళవారం నాడే ఆయన పెళ్ళి రోజు. జీవితంలో ఆనందించిన రోజునే అత్యంత విషాదకరమైన ఘటన జరిగిన రోజుగా ఆయన జీవితంలో మిగిలిపోయింది. ఆయన భార్య ధరణి కన్నీరు మున్నీరవుతున్నారు. సిద్ధయ్య మరణించిన హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలోనే ఆమె రెండు రోజుల క్రితం మగశిశువుకు జన్మనిచ్చారు. తాను తండ్రిని అయిన విషయం కూడా తెలుసుకోకుండానే సిద్ధయ్య కన్నుమూశారు. ఎంతో సంతోషంతో సాగిపోతున్న ఈ కుటుంబం అకస్మాత్తుగా విషాదంలో మునిగిపోయింది.