సినీ నటి మీద ఛీటింగ్ కేసు

  ఈ మధ్య కాలంలో సినీ తారలపై ఛీటింగ్ కేసులు ఎక్కువయ్యాయి. మొన్నటికి మొన్న దక్షిణాది హీరోయిన్ శ్రుతిహాసస్ పై కూడా ఛీటింగ్ కేసు నమోదయింది. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ సినీ నటి హిమాని శివపురి పై ఇండోర్ లోని విజయ్ నగర్ పోలిస్ స్టేషన్ లో ఒక సినిమా డైరెక్టర్ ఛీటింగ్ కేసు పెట్టారు. వివరాల ప్రకారం బాలీవుడ్ డైరెక్టర్ మహమ్మద్ అలీ కుమారుడు గమ్ము భక్ష్ తను తీయబోయే రెండు సినిమాల్లో నటించేందుకు గాను హిమాని శివపురి తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. అయితే కాంట్రాక్ట్ లో భాగంగా కొంత మొత్తాన్ని ముందుగా హిమానికి ఇచ్చాడు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆమె సినిమాల నుండి తప్పుకోవడం, ఇచ్చిన అమౌంట్ ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో హిమాని పై కేసు నమోదు చేశారు.

ఎవరెస్ట్ కింద చైనా సొరంగం

  ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం ఎవరెస్ట్ కింద నుంచి రైలు మార్గం కోసం సొరంగాన్ని తవ్వాలని చైనా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మార్గం నిర్మాణంతో నేపాల్‌తో చైనాకి రైలు సదుపాయం ఏర్పడనుంది. ఇప్పటికే చైనా నుంచి టిబెట్‌కి రైలు మార్గం వుంది. ఖింఘాయ్ - లాసా రైల్వే మార్గాన్ని నేపాల్ వరకూ పొడిగించాలనే పథకానికి చైనా రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం నేపాల్ ప్రభుత్వంతో చైనా చర్చలు జరిపింది. ప్రాజెక్టుకు నేపాల్ నుంచి అనుమతి లభిస్తే 2020 నాటికల్లా ఈ మార్గాన్ని పూర్తి చేయాలని చైనా భావిస్తోంది. ఈ నిర్మాణం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు భారత దేశానికి భద్రతాపరమైన సమస్యలు ఏర్పడవచ్చని పరిశీకులు భావిస్తున్నారు. అలాగే హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వతం ఎవరెస్ట్. మరి హిందూ దేశమైన నేపాల్ ఈ పర్వతానికి సొరంగం వేయడానికి ఎంతవరకు అనుమతిస్తుందో చూడాలి.

ఆప్కాబ్ ఛైర్మన్‌గా పిన్నమనేని

  ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) నూతన అధ్యక్షునిగా కృష్ణా జిల్లాకు చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనలో భాగంగా ఈ బ్యాంకును కూడా రెండుగా విభజించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ శాఖకు పాలకవర్గాన్ని ఎన్నుకోవలసి వుంది. ఆప్కాబ్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. టీడీపీకి చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావుకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్‌, వైసీపీలకు చెందిన డీసీసీబీ అధ్యక్షులు కూడా సుముఖత చూపడంతో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఉపాధ్యక్ష పదవి కోసం తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు వరుపుల రాజా, నెల్లూరు అధ్యక్షుడు ధనుంజయ్‌ రెడ్డి, ప్రస్తుత ఉపాధ్యక్షుడు రత్నం పోటీపడుతున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెంటల్

  టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెంటల్ ఎక్కిందని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ఉస్మానియా ఆస్పత్రిలో 24 అంతస్తుల ట్విన్ టవర్లు కడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. ఆ ఆస్పత్రి భవనం హెరిటేజ్ బిల్డింగ్. ఈ కట్టడాన్ని కూలగొడతాననడం దారుణం. కేసీఆర్ కట్టాలని అనుకుంటున్న ఆ ట్విన్ టవర్లు చెస్ట్ ఆస్పత్రిలోనే కట్టొచ్చుగా? అనాలోచిత నిర్ణయాలకు సచివాలయంలోని సీ బ్లాకు నిలయంగా మారింది. మెంటలెక్కిన ప్రభుత్వం అంటే ఇదే. హైదరాబాద్‌లో కాలుష్యం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో చెస్ట్ ఆస్పత్రి వుండాల్సిన అవసరం వుంది. ఆయుర్వేద ఆస్పత్రిని ఎర్రగడ్డ నుంచి తరలిస్తే ఉద్యమిస్తాం’’ అన్నారు.

జగన్ కూడా తప్పించుకోలేడు

  దేశంలో ఎక్కడ ఎవరు అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళినా అందరికీ టక్కున జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తుంటారు. ఇదివరకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుల్లో జైలుకి వెళ్ళినప్పుడు చాలా మంది జగన్ కేసుల గురించి మాట్లాడుకొన్నారు. మళ్ళీ నిన్న రామలింగ రాజుకి కోర్టు ఏడేళ్ళు జైలు శిక్షవేసిన తరువాత చర్లపల్లి జైలుకి తరలించినప్పుడూ మళ్ళీ జగన్ ప్రస్తావన వినబడింది.   రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు సి. కుటుంబరావు మీడియాతో మాట్లాడుతూ రామలింగరాజుకి ఏడేళ్ళు జైలు శిక్ష విధించడం గమనిస్తే ఆర్ధిక నేరాలపట్ల కోర్టులు చాలా కటినంగా వ్యవహరిస్తాయని స్పష్టమవుతోంది. కనుక అనేక ఆర్ధిక నేరాలకి పాల్పడిన జగన్ కూడా చట్టం నుండి తప్పించుకోలేడు. ఏదో ఒకరోజున అతను కూడా జైలుకి వెళ్ళాక తప్పదు. ఆ సంగతి గ్రహించబట్టే అతను ప్రజలలో సానుభూతి సంపాదించుకోవడానికి బస్సు యాత్రలు చేస్తున్నారు,” అని అన్నారు.

ప్రవేశపన్నుపై నేడు హైకోర్టు తీర్పు

  ఆంధ్రా వాహనాలపై ప్రవేశపన్నువిధిస్తూ గతేడాది తెలంగాణా ప్రభుత్వం జీ.ఓ. జారీ చేసినప్పుడు, దానిని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించడమే కాకుండా మార్చి31,2015వరకు అమలుచేయకుండా నిలిపివేసింది. ఆగడువు ముగిసింది కనుక తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ కొత్తగా మరో జీ.ఓ. జారీ చేసింది. కానీ దానిపై కూడా ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు కోర్టులో పిటిషను వేసాయి. వారి పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు దానిపై తీర్పు చెప్పేవరకు వారి వద్ద నుండి ప్రవేశపన్ను వసూలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషనుపై ఈరోజు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ప్రవేశపన్ను వసూలుపై హైకోర్టు స్టే విధించడం ఎదురుదెబ్బ అనుకొంటే, ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపన్ను కోసం జారీ చేసిన జీ.ఓ.పై హైకోర్టు మళ్ళీ అభ్యంతరం వ్యక్తం చేసినా, స్టే విధించినా చాలా అవమానకర విషయం అవుతుంది.

నర్రా రాఘవరెడ్డి కన్నుమూత

  సీపీఎం సీనియర్ నాయకుడు నర్రా రాఘవరెడ్డి (88) కన్నుమూశాడు. నెలరోజుల క్రితం ఆయన తన ఇంట్లో జారిపడ్డారు. కాలు విరిగిన ఆయన కొంతకాలం నిమ్స్‌లో చికిత్స పొందారు. అనంతరం స్వగ్రామమైన నల్గొండ జిల్లా వట్టిమర్తిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన తిరిగి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. నర్రా రాఘవరెడ్డి స్వగ్రామం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి. నకిరేకల్ నుంచి 1967లో ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఏడేళ్ళపాటు వట్టిమర్తి సర్పంచ్‌గా పనిచేశారు. నకిరేకల్ సమితి అధ్యక్షుడిగా ఏడాదిపాటు పనిచేశారు. అత్యంత నిరాడంబరంగా జీవనాన్ని సాగించిన కమ్యూనిస్టు నేతగా ఆయన పేరొందారు. నర్రా రాఘవరెడ్డి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు.

మిషన్ కాకతీయ కాదు.. మిషన్ కల్వకుంట్ల...

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘాటుగా విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు మిషన్‌కాకతీయను మిషన్ కల్వకుంట్లగా మార్చారని వారు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులు మధుయాష్కి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 750మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. తెలంగాణలో 353 మండలాలు కరువుతో తల్లడిల్లుతున్నాయని, వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని అన్నారు. ప్రాణహిత-చేవెళ్లను నిలిపివేయడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.

ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: అసద్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం మతపెద్దలు గురువారం భేటీ అయ్యారు. వరంగల్ - నల్గొండ జిల్లాల సరిహద్దులో తీవ్రవాది వికారుద్దీన్ ముఠా ఎన్‌కౌంటర్ మీద విచారణ జరిపించాలని ఈ సందర్భంగా వారు కేసీఆర్‌కి విజ్ఞప్తి చేశారు. పోలీసులను తీవ్రవాదులు కాల్చి చంపడాన్ని అసదుద్దీన్ తీవ్రంగా ఖండించారు. వికారుద్దీన్ బృందం ఎన్‌కౌంటర్ బూటకమేనని, సంకెళ్ళతో వున్న వికారుద్దీన్ బృందం తుపాకీ ఎలా వాడతారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని అసదుద్దీన్, ముస్లిం పెద్దలు సీఎంని కోరారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో బాధిత పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని వారు కేసీఆర్ని కోరారు.

రైల్లో దోపిడీ యత్నం

  రైళ్లలో చోరీలకు పాల్పడేవాళ్లు ఎక్కువైపోయారు. వీరికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. ఇటీవల చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దోపిడిని మరచిపోకముందే మళ్లీ అదే తరహాలో పుణె-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి దొంగలు భీభత్సం సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలోని గొల్లగూడ-శంకరపల్లి మధ్యలో ఈ ఘటన జరిగింది. దోపిడీ దొంగలు ప్రయాణికులను కత్తులతో బెదిరించి వారి దగ్గర ఉన్న డబ్బును దోచుకునేందుకు ప్రయత్నించారు. దీనిని ప్రతిఘటించినందుకు ఇద్దరు ప్రయాణికులను గాయపరిచి పారిపోయారు.బాధితులు జరిగిన ఘటనపై వికారాబాద్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగల కోసం గాలిస్తున్నారు.

రామలింగరాజుకు ఏడేళ్ళ జైలు

  సత్యం కుంభకోణంలో రామలింగరాజుకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. నిందితులలో ఏ1 నుంచి ఏ10 వరకూ ఉన్న మొత్తం పది మందికీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వీరికి రూ.25 లక్షల నుంచి 5 కోట్ల వరకు జరిమానా విధించింది. సత్యం రామలింగరాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, 5 కోట్లు జరిమానా పడింది. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ కేసు తీర్పు గురువారం వెలువడనుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఢిల్లీనుంచి వచ్చిన మీడియాతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది. కొంతమంది విదేశీ పాత్రికేయులు కూడా వచ్చారు.

కొత్త పైత్యం.. సెల్ఫీ షూ

  ఈమధ్యకాలంలో సెల్ఫీల గోల ఎక్కువైపోయింది. చేతిలో ఫోన్ వుండటం ఆలస్యం.. వెంటనే సెల్ఫీ తీసేసుకోవాలని అనిపించడం మామూలైపోయింది. ప్రస్తుతం సెల్ఫీ అనేది ఇందుగలదు అందు లేదనే సందేహం అక్కర్లేని సర్వాంతర్యామి అయిపోయింది. మొన్నటి వరకూ చేత్తోనే సెల్ఫీలు తీసుకునేవారు. రీసెంట్‌గా సెల్పీ స్టిక్కులు అందుబాటులోకి వచ్చాయి. పర్సులో పట్టేంత సెల్ఫీ స్టిక్ వుంటుంది. ఆ స్టిక్‌ని తీసి బయటకి లాగితే బారెడు స్టిక్కులా మారుతుంది. చివర్లో ఫోన్ పెట్టే ఏర్పాటు కూడా వుంటుంది. ఇప్పటి వరకు సెల్ఫీల శాస్త్రంలో ఈ స్టిక్కే హైలైట్ అనుకుంటుంటే, ఇప్పుడు ఇందులో మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్‌గా సెల్ఫీ షూస్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే మన ఇండియా మార్కెట్లో కాదు.. అమెరికాలాంటి దేశాల్లో సెల్ఫీ షూలకి డిమాండ్ బాగా వుంది. మనం తొడుక్కునే షూలకి సెల్‌ఫోన్ పెట్టడానికి వీలుగా ఖాళీ ప్రదేశం కూడా వుంటుంది. అందులో సెల్‌ఫోన్‌ పెట్టేసి కాలితో సెల్ఫీ తీసుకోవచ్చు. ఈ కొత్త పైత్యం యూత్‌కి బాగా నచ్చినట్టుంది... ప్రస్తుతం సెల్ఫీ షూలు బాగా అమ్ముడుపోతున్నాయి. మరి ఈ షూలు మన ఇండియా మార్కెట్ని ఎప్పుడు పావనం చేస్తాయో మరి!

భద్రతలో ఇండియా విమానాలు సూపర్

  అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ భారత వైమానిక రంగానికి భద్రతా ర్యాకింగ్ ను పెంచుతున్నట్లు వెల్లడించింది. గత సంవత్సరం అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విఫలం కావడంతో భారత ర్యాంకింగ్ ను కేటగిరీ-2 తగ్గించింది. అయితే ఇప్పుడు విమానయాన సేవల్లో అత్యంత భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉంటున్నందుకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ ర్యాకింగ్ పెంచింది. భారత్ తన ర్యాంకును పునరుద్ధరించుకోవడానికి తీవ్రంగా శ్రమించిందని, భద్రతా ప్రమాణాల విషయంలో భారత వైమానిక రంగం మెరుగుపడిందని అమెరికా ట్రాన్స్‌పోర్టు సెక్రటరీ ఆంథోనీ ఫాక్స్ తెలిపారు.

ఎన్కౌంటర్ కి దగ్గరలో శ్రుతిహాసన్

  మొన్నామధ్య ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఏపీ మంత్రి అవాక్కయ్యేలా చేసిన శ్రుతిహాసన్ ఇప్పుడు తను అవాక్కయ్యింది. ఏలాగంటారా.. శేషాచల అడవిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే 20 మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో హీరోయిన్ శ్రుతిహాసన్, హీరో విజయ్ వారు నటిస్తున్న పులి చిత్రం షూటింగ్ లో పాల్గొన్నారు. సాయంత్రం షూటింగ్ పూర్తి చేసుకొని వారు తిరుపతి వెళ్తుండగా తలకొన చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్కౌంటర్ జరిగిన విషయం పోలీసులు చిత్ర యూనిట్కు తెలిపారు. కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలో ఎన్కౌంటర్ అనేసరికి శృతి హాసన్ అవాక్కయినట్లు సమాచారం.

‘సత్యం’ కేసు పూర్తి వివరాలు

‘సత్యం’ కుంభకోణం కేసులో రామలింగరాజుతోపాటు ఇతర నిందితుల మీద నేరం రుజువైన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు.. * 2009 జనవరి 7న సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. *  లేని లాభాలను ఉన్నట్టు చూపినట్టు బయటపడింది. * 2009 జనవరి 9న సీఐడీ కేసు నమోదు. రామలింగరాజు అరెస్టు. * నిందితులుగా రామలింగరాజు, రామరాజు, సూర్యనారాయణ రాజు, వడ్లమాని శ్రీనివాస్, ఆడిటర్లు గోపాలకృష్ణన్, తాళ్ళూరి శ్రీనివాస్, మాజీ ఉద్యోగులు రామకృష్ణ, వెంకటపతిరాజు, శ్రీశైలం, అంతర్గత ఆడిటర్ ప్రభాకర్‌ గుప్తాపై కేసు నమోదు. * 2009 ఫిబ్రవరి 9న కేసు నమోదు. రామలింగరాజు అరెస్టు. * ఐపీసీ 120 బీ, 420, 409, 467, 471, 477ఎ, 201 సెక్షన్ల కింద కేసు నమోదు. * 2009 ఫిబ్రవరి 16న రంగంలోకి దిగిన సీబీఐ. * మూడు అభియోగపత్రాలను కలిపి ప్రత్యేక న్యాయస్థానం విచారణ. * 2011 నవంబర్ 4న రామలింగరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. * మదుపుదారుల నష్టంతో కలిపి ఈ కుంభకోణం విలువ 14 వేల కోట్లుగా సీబీఐ తేల్చింది. * కుంభకోణం ద్వారా రామలింగరాజు, ఇతర నిందితులు కలసి 2743 కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధరించింది.