అద్భుతమైన రాజధానిని నిర్మిస్తా

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చెంగ్డూ రౌండ్ టేబుల్ సమావేశంలో పారిశ్రామిక వేత్తలతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి చైనా సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిని నిర్మించే అవకాశం తమకు దొరికిందని, అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని చెప్పారు. ఇప్పటికే సింగపూర్ వాళ్లు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారని, మరో రెండు నెలల్లో మాస్టర్ ప్లాన్ ఇస్తారని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అందుకోసం పథక రచన చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయని, పరిశ్రమలు, హార్డ్‌వేర్‌, సేవారంగాలకు అక్కడ పుష్కల అవకాశాలున్నాయని ఆయన అన్నారు.

హైదరాబాద్ లో నేటి నుంచి ఉచిత వైఫై

  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఉచిత వైఫై సేవలు అందించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో గురువారం ఉదయం నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో వైపై సేవలు అందించామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వైఫై సేవలను అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తొలి వీడియో(ఫేస్‌టైం) కాల్ చేసి కేటీఆర్ సంభాషించనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, క్వాడ్‌జెన్ సంస్థలు కలిసి ఈ ఉచిత వైఫై సేవలను అందించనున్నాయి.

కోతి రైళ్లను ఆపేసింది

  ఒక కోతి వల్ల రైళ్లు ఆగిపోయాయి. ఈ విచిత్రమైన ఘటన ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా.. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు స్టేషన్లో ఓ గూడ్స్ రైలును క్రాసింగ్ కోసం ఆపారు. అయితే ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఒక కోతి ఆగి వున్న గూడ్స్ వ్యాగన్ మీదకు ఎక్కింది. అక్కడితో ఆగకుండా అక్కడి నుండి ఎగురుతూ విద్యుత్ కాంటాక్ట్ వైరును పట్టుకుంది. దీంతో ఒక్కసారిగా హైవోల్టేజ్ విద్యుత్ ప్రసారం జరిగి మంటలు చెలరేగి, విద్యుత్ తీగలు కూడా తెగిపోయాయి. ఈ ఘటనతో రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల పాటు రైళ్లన్నీ ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇంత జరిగినా కూడా కోతికి మాత్రం ఏం జరగలేదు. విద్యుత్ తీగ తెగినవెంటనే దానిని వదిలి చక్కగా పారిపోయింది.

శివసేన తాజా వాగుడు

  అతిగా వాగే వాళ్ళలో శివసేన నాయకులు మొదటి వరసలో వుంటారు. నిన్నగాక మొన్నే ఒక శివసేన నాయకుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకే ఓటుహక్కు ఇవ్వాలని వంకరగా మాట్లాడాడు. ఇప్పుడు శివసేన భారత ప్రభుత్వానికి మరో కుళ్ళు ప్రతిపాదన చేసింది. ముస్లింలు, క్రైస్తవులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకుంటేనే ఓటుహక్కు కల్పించాలని చెప్పింది. జనాభాను పెంచుకుంటే సరిపోదని, కుటుంబానికి నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం గురించి ఆలోచించాలని పేర్కొంది. కుటుంబం ఆరోగ్యంగా వుండేలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం వరకు బాగానే వుందిగానీ, ముస్లింలు, క్రైస్తవులను టార్గెట్ చేయడం మాత్రం బాగాలేదని పరిశీలకులు అంటున్నారు.

బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు

  మృగాళ్ళ బారి నుంచి మహిళలకు భద్రత కల్పించడానికి ప్రభుత్వాలు ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నా మహిళల భద్రత ప్రశ్నార్థకంగానే వుంటోంది. తాజాగా మహిళల భద్రత కోసం కోల్‌కతా ఆర్టీసీ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. జేఎన్ఎన్‌యుఆర్ఎం ఆధ్వర్యంలో నడిచే 632 బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో రెండు బస్సు ముందు భాగంలో, ఒకటి వెనుక భాగంలో అమర్చి వుంటాయి. మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, దొంగతనాలకు పాల్పడినా కెమెరాల్లో రికార్డైన్ ఫుటేజ్ ఆటోమేటిగ్గా ఆర్టీసీ కార్యాలయానికి చేరిపోతుంది. దీనివల్ల మహిళల మీద జరిగే దౌర్జన్యాలను కొంతవరకు నివారించవచ్చని భావిస్తున్నట్టు కోల్‌కతా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

పది కుక్కలు.. బాలికను చంపేశాయి

  గుంటూరు జిల్లాలోని కాకుమాను గ్రామంలో ఘోరం జరిగింది. షేక్ కౌషర అనే ఆరేళ్ళ బాలిక మీద పది కుక్కలు ఒకేసారి దాడిచేసి చంపేశాయి. ఈ పాప తన ఇంటి ముందే ఆడుకుంటూ వుండగా ఈ దారుణం జరిగింది. ఈ గ్రామంలో ఇటీవలి కాలంలో పిచ్చికుక్కల బెడద పెరిగిపోయింది. జనం ఇళ్ళలోంచి బయటకి రావడానికి కూడా జంకుతున్నారు. కుక్కల దాడి కారణంగా బాలిక మరణించడంతో ఆ బాలిక తల్లిదండ్రులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలిక మృతదేహంతో గుంటూరు - కాకుమాను రహదారి మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలికను కుక్కలు చంపిన ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో, రాష్ట్రంలో పిచ్చికుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

‘మా’ ఓట్ల లెక్కింపుకి లైన్ క్లియర్

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కి ఇటీవల ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు ‘మా’ ఎన్నికల ఓట్లను కౌంటింగ్ చేసుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది. ‘మా’ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన నటుడు ఒ.కళ్యాణ్ మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు అతనికి జరిమానా కూడా విధించింది. బుధవారం నాడు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పటి వరకూ ‘మా’ ఎన్నికల విషయంలో ఏర్పడిన గజిబిజి పరిస్థితి తొలగిపోయింది. ప్రతి సంవత్సరం ‘ఏకగ్రీవం’గా జరిగిపోయే ‘మా’ ఎన్నికలు ఈసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో జరిగాయి. అధ్యక్ష పదవి కోసం పోటీలో వున్న జయసుధ, రాజేంద్ర ప్రసాద్ వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ మీడియాకి ఎక్కారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఇంతలా వేడి ఎక్కడంతో, ప్రజలకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ‘మా’ ఎన్నికల మీద సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. మరి శుక్రవారం జరిగే కౌంటింగ్‌లో ఎవరు విజయం సాధిస్తారన్న ఉత్కంఠ మాత్రమే ప్రస్తుతానికి మిగిలి వుంది.

జగన్ మీద లోకేష్ సెటైర్

ప్రస్తుతం ఏం చేయాలో అర్థంకాక ప్రాజెక్టుల దగ్గరకి బస్సు యాత్ర చేపట్టిన వైసీపీ నాయకుడు జగన్ మీద తెలుగుదేశం నాయకులు వాగ్బాణాలు సంధిస్తున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కార్యకర్తల సంక్షేమానికి పార్టీ నిరంతరం కృషి చేస్తుంది. రాయలసీమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పాటుపడుతున్నారు. పట్టిసీమ విషయంలో జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే పిల్ల కాంగ్రెస్ కనుమరుగవటం ఖాయం’’  అన్నారు. అలాగే మరో సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హోమంత్రి చినరాజప్ప జగన్ బస్సు యాత్ర మీద మండిపడ్డారు. రాజకీయ మనుగడ కోసమే వైకాపా నాయకులు బస్సు యాత్ర చేపట్టారని ఆయన ఆరోపించారు. ఈడీ జగన్‌కి సంబంధించిన ఆస్తులను, డబ్బును జప్తు చేస్తుంటే జగన్ ఎందుకు కిక్కురుమనడం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే, జగన్ కక్కుర్తి వల్లే ఆనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. పోలవరం టెండర్లు పిలవటానికి కాంగ్రెస్ పార్టీకి నాలుగేళ్ళు పట్టిందని, తమ ప్రభుత్వం ఏడాది లోగానే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేస్తుందని ఆయన చెప్పారు.

జైల్లో సిమీ ఉగ్రవాదుల నిరాహార దీక్ష

  నల్గొండజిల్లాలో ఐఎస్ఐ ఏజెంట్, సిమీ ఉగ్రవాది వికారుద్దీన్ ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ లో హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే అతన్ని ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ చంచల్‌గూడలో ఉన్న పలువురు ఇస్లామిక్ ఉగ్రవాదులు నిరాహారదీక్షకు దిగారు. జైల్లో ఉన్న ఉగ్రవాదులు జాహిద్, ఖలీమ్, అబిద్ హుస్సేన్, బిశ్వాక్, షకీల్‌లు నోటీసులు ఇచ్చి మరీ దీక్షకు దిగారని జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. మరోవైపు వీళ్లు దీక్ష చేయడానికి ఉగ్రవాద నేతల నుంచి ఏమైనా సందేశాలు అందాయా? ఉగ్రవాదులను విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా ఆసమయంలో ఏమైనా సందేశాలు అందాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాళి తెంచు శుభవేళ...

  తమిళనాడుకు చెందిన ద్రావిడార్ కజగం అనే సంస్థ మహిళలు తమ తాళిబొట్లను తెంచుకునే కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళల మెడలలో వుండే తాళిబొట్లు బానిసత్వానికి చిహ్నాలని, వాటిని తెంచుకోవాలని ద్రావిడార్ కజగం గత కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. హిందూ వ్యతిరేకి అయిన దివంగత పెరియార్ స్ఫూర్తితో ఈ సంస్థ ఆవిర్భవించింది. ఈ తాళిబొట్లు తెంచే కార్యక్రమానికి కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకుని నిర్వహించింది. తొలివిడత కార్యక్రమంలో 25 మంది మహిళలు తమ మెడల్లో వున్న తాళిబొట్లను తెంచుకున్నారు. వాటిని ద్రావిడార్ కజగం సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఇంతకాలం తమను బానిసలుగా చేసిన తాళిబొట్లను తెంచుకోవడం తమకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని సదరు మహిళలు మురిసిపోతూ చెప్పారు. ఇదిలా వుంటే, తాళిబొట్లు తెంచుకునే కార్యక్రమం హిందూ మత విశ్వాసాలను దెబ్బ తీసేలా వుందని తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో దీన్ని నిలిపివేస్తే న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే న్యాయస్థానంలో పోరాటం చేసి తాళిబొట్లు తెంచుకునే కార్యక్రమానికి అనుమతులు తెచ్చుకుని కొనసాగిస్తామని ద్రావిడార్ కజగం సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

‘మా’ ఎన్నికల తీర్పు నేడే

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఈరోజు హైదరాబాద్ నగర సివిల్ న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. ‘మా’ ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా వుందంటూ కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడిగా పోటీ చేసిన నటుడు ఓ.కళ్యాణ్ కోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం పోలింగ్‌కి అనుమతించిన కోర్టు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి, న్యాయ సలహాదారుడిని నియమించలేదని కళ్యాణ్ వాదించారు. కళ్యాణ్ ఆరోపణల్లో నిజం లేదని ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి అలీ, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కోర్టుకు తెలిపారు. కళ్యాణ్‌కి అభ్యంతరం వుంటే ముందే ఎందుకు చెప్పలేదని, ఆయన కూడా నామినేషన్ దాఖలు చేసి, ప్రచారం చేసి, అంతా ముగిశాక కోర్టుకు రావడం ఏమిటని వారు వాదించారు. ఎన్నికల ప్రక్రియ అంతా నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని, ఓట్ల లెక్కింపుకు కోర్టు అనుమతించాలని కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఈ కేసులో కోర్టు తీర్పు ఇవ్వనుంది.

స్వామిగౌడ్ క్షమాపణ చెప్పాలి

  తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. ముస్లింలను డామినేట్ చేయడానికి హిందువులు నలుగురేసి పిల్లల్ని కనాలని స్వామిగౌడ్ పిలుపు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పలువురు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఈ వ్యాఖ్యలను దుయ్యబట్టారు. ఈ ప్రమాదకర వ్యాఖ్యలను స్వామిగౌడ్ వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఖండించకపోవడాన్ని కూడా నారాయణ తప్పుపట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించకపోతే స్వామిగౌడ్ వ్యాఖ్యలను ప్రభుత్వం ఆమోదించినట్టు భావించాల్సి వుంటుందని ఆయన అన్నారు.

పుట్టగొడుగులు తిని నలుగురి మృతి

  విషపు పుట్టగొడుగులు తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలో జరిగింది. అసోంలోని శివసాగర్ జిల్లాలోని లలిత్ పత్తర్ ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు సమీపంలోని అడవిలో సేకరించిన పుట్టగొడుగులను వండుకుని తిన్నారు. దాంతో ఆ నలుగురూ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. స్థానికులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల మేఘాలయ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అడవిలో రోడ్డు వేసే పనికి వెళ్ళిన 14 మంది కూలీలు అడవిలో కనిపించిన పళ్ళను కోసుకుని తిన్నారు. దాంతో ఆ 14 మంది అక్కడిక్కడే మరణించారు.

రెండు లక్షల కోళ్ళకు బర్డ్ ఫ్లూ

  హైదరాబాద్ శివార్లలో వున్న హయత్‌నగర్ ప్రాంతంలో వున్న కోళ్ళ ఫారాలలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది. ఈ లక్షణాలను గమనించిన అధికారులు పరీక్షలకు పంపగా కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఎవరూ చికెన్, కోడిగుడ్లు తినరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొదట 18 వేల కోళ్ళకు బర్డ్ ప్లూ వచ్చిందని గుర్తించారు. ఆ తర్వాత పరీక్షించగా రెండు లక్షల కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చిందని నిర్ధారించారు. దాంతో ఈ రెండు లక్షల కోళ్ళనూ పెద్ద గుంట తీసి పూడ్చేయాలని అధికారులు నిర్ణయించారు. హయత్ నగర్ ప్రాంతలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న విషయం తెలుసుకుని హైదరాబాద్ చుట్టుపక్కల వున్న కోళ్ళ ఫారాల యజమానులు అప్రమత్తమై తమ కోళ్ళ ఫారాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. చాలా వేగంగా వ్యాపించే బర్డ్ ఫ్లూ తమ కోళ్ళకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హయత్ నగర్‌కి పది కిలోమీటర్ల దూరంలో వున్న కోళ్ళఫారాలన్నిటిలోనూ ముందస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. బర్డ్ ఫ్లూ ప్రమాదం వుందని తెలిసి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కోళ్ళఫారాల యజమానులు అప్రమత్తం అయ్యారు.

బర్డ్ ప్లూ హెచ్చరిక: చికెన్, గుడ్లు తినొద్దు

  అందరికీ హెచ్చరిక.... హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ బయటపడింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో వున్న కోళ్ళఫారాలలో ఉన్న కోళ్ళకు బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు భోపాల్ ల్యాబ్‌కి శాంపిల్స్ పంపించారు. ల్యాబ్ ఫలితాలు బర్డ్ ఫ్లూ ఉన్నట్టు వచ్చాయి. దాంతో అధికారులు చికెన్‌, గుడ్లు తినవద్దని ప్రజలకు సూచించారు. కొద్ది సంవత్సరాల క్రితం బర్డ్ ఫ్లూ కారణంగా మరణాలు సంభవించాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కొంతకాలం పాటు చికెన్, కోడిగుడ్ల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఒక్క హైదరాబాద్‌లో వారు  మాత్రమే కాదు... తెలుగు రాష్ట్రాల వారు కొద్ది రోజులపాటు చికెన్, గుడ్లకు దూరంగా వుంటే మంచిది.

తెదేపా కార్యకర్తల కోసం నారా లోకేష్ సంక్షేమ యాత్ర

  దేశంలో ప్రప్రధమంగా తెదేపాయే తన కార్యకర్తల సంక్షేమం కోసం నిధులు ఏర్పాటు చేసి వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చాలా ఏళ్ళబట్టి తెదేపా తన కార్యకర్తలు, వారి కుటుంబాల కోసం, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నప్పటికీ వాటన్నినీ నిరంతరంగా కొనసాగించేందుకు పటిష్టమయిన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది మాత్రం నారా లోకేష్ అని చెప్పక తప్పదు. పార్టీ కార్యకర్తలకి రూ. 2 లక్షల ప్రమాద భీమా చేయాలనే ఆలోచన కూడా ఆయనదే.   ప్రస్తుతం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన ఈరోజు నుండి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో పర్యటించి, ప్రమాదాలలో మరణించిన 49 మంది కార్యకర్తల కుటుంబాలను కలిసి వారికి ఒక్కొక్కరికీ రూ.2లక్షల భీమా పరిహారం అందజేస్తారు. ముందుగా అయన చిత్తూరు జిల్లాలో కుప్పం నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఆ తరువాత జిల్లాలో మదనపల్లి, పుత్రమద్ది, శెట్టిపల్లె గ్రామాలలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను కలిసి వారికి చెక్కులు అందజేస్తారు.   రాత్రికి తిరుపతిలోనే బస చేసి రేపు కడప జిల్లాలో కేశవాపురం, అనంతపురం జిల్లాలో కండ్లగూడూరు, హోసూరు, డోన్ మండలాలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేస్తారు. బుధవారం నాడు కర్నూలు జిల్లాలో కార్యకర్తల కుటుంబాలను కలిసి వారికి చెక్కులు అందజేస్తారు.