పిచ్చికుక్కల సీజన్ మొదలైంది...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పిచ్చికుక్కల సీజన్ మళ్ళీ మొదలైంది. రెండేళ్ళ క్రితం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పిచ్చికుక్కలు రెచ్చిపోయి స్వైర విహారం చేసి వందలాది మంది మృతికి కారణం అయ్యాయి. వాటి ధాటికి మనుషులు కుక్కలను చూస్తేనే భయంతో వణికిపోయే పరిస్థితికి చేరుకున్నారు. ఏ ఆస్పత్రిలో బెడ్లు చూసినా పిచ్చికుక్కలు కరిచిన పేషెంట్లతో నిడిపోయి వుండేవి. ప్రతిరోజూ కనీసం ఇద్దరు ముగ్గురైనా పిచ్చికుక్కల బారిన పడి మరణించేవారు. పిచ్చికుక్కలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం పెద్ద గుణపాఠం నేర్చుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్రం విభజన కావడం వల్లనో, మతిమరుపు వల్లనోగానీ, అధికారులు అప్పుడు నేర్చుకున్న గుణపాఠాన్ని మరచిపోయినట్టున్నారు. అందుకే మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పిచ్చికుక్కల సీజన్ మొదలైంది. మొన్నటికి మొన్న గుంటూరు జిల్లా కాకుమానులో పిచ్చికుక్కలన్నీ ఒక ఆరేళ్ళ పసిపాప మీద మూకుమ్మడిగా దాడి చేసి ఆ చిన్నారి పాప ప్రాణాలు తీసేశాయి. మా ఊళ్ళో పిచ్చికుక్కలు పెరిగిపోయాయి మహాప్రభో అని అంతకుముందు ఎన్నో రోజుల నుంచి ఆ గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. అధికారుల ఈ నిర్లక్ష్యానికి ఫలితం... ముక్కుపచ్చలారని పసిపాప... ఎంతో భవిష్యత్తు వున్న ఒక బాలిక తన ప్రాణాలను కోల్పోయింది. పసిపాప మీద కుక్కలు దాడి చేసి చంపిన ఈ ఘటన ప్రభుత్వ అధికారుల వైఫల్యానికి దారుణమైన నిదర్శనం. ఈ ఘటన తర్వాత అయినా మేలుకుని కుక్కలను అదుపు చేయాల్సిన అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారు. దాంతో శనివారం నాడు కూడా ఆ కుక్కల మంద మరోసారి తమ ప్రతాపం చూపించాయి. అయితే ఈసారి మనుషుల మీద కాకుండా పశువుల మీద చూపించాయి. కుక్కలు జరిపిన దాడిలో ఒక లేగదూడ మరణించింది. మరో లేగదూడ తీవ్రంగా గాయపడింది. ఈ లేగదూడల స్థానంలో మనుషులు వుంటే ఆ దారుణాన్ని ఊహించలేం. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా వుంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి మొదలైంది. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం గౌసాబాద్ గ్రామంలో శనివారం నాడే పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. ఊళ్ళో జనం మీద పడి విచక్షణా రహితంగా కరిచేశాయి. ఈ పిచ్చికుక్కల బారిన పడి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి మరీ దారుణంగా వున్నట్టు తెలుస్తోంది. అలాగే శనివారం నాడే కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లిలో పిచ్చికుక్కలు 10 మందిని దారుణంగా కరిచేశాయి. కుక్కలకు పిచ్చిపట్టడం, జనం మీద పడి కరవడం సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువగా జరుగుతూ వుంటుంది. ఇది అధికారులకు తెలిసిన విషయమే. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే ఎండాకాలం ప్రారంభమైంది. ముందు ముందు ఎండలు పెరిగేకొద్దీ కుక్కల్లో ప్రకోపం పెరిగే ప్రమాదం కూడా వుంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు ఈ దిశగా ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే సదరు అధికారులు కూడా ఈ కుక్కల బారిన పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదీ విషయం... రెండేళ్ళ క్రితం వచ్చిన పరిస్థితి మళ్ళీ రాకుండా చేసే శక్తి అధికారులకే వుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే.... పిచ్చిపట్టిన కుక్కలకంటే అధికారులే మరింత ప్రమాదకరమైన వారిగా భావించాల్సి వుంటుంది.

గర్భవతి అనే జాలి కూడా లేకుండా...

  రాజస్టాన్ లో ఓ దారుణమైన ఘటన జరిగింది. ప్రియుడే గర్బవతైన ప్రియురాలును చంపే ప్రయత్నం చేశాడు. రాజస్ఠాన్ జైపూర్ లో నరేంద్రకుమార్ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేసేవాడు. అతను బ్యూటీ పార్లర్ లో పనిచేసే అమ్మాయితో పరిచయం పెంచుకొని పేమించాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఫలితం ఆ అమ్మాయి గర్భం దాల్చింది. విషయం తెలిసిన అతను అబార్షన్ చేయించుకోమని చెప్పగా ఆమె లేదు వివాహం చేసుకుందామని అతనిని కోరింది. కాని అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవాలనుకొని పథకం ప్రకారం ఆమెను కొండ ప్రాంతానికి తీసుకెళ్లి ముఖం పై రాయితో మోది కొండ మీద నుండి తోసేశాడు. దాదాపు 12 గంటల తరువాత స్పృహలోకి వచ్చిన ఆమె సహాయం కోసం అరవడంతో అరుపులు విన్నవారు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.

ఉచిత వైఫై పొందాలంటే

  ట్యాక్ బండ్ చుట్టూ పదికిలోమీటర్ల మేర ఉచిత వైఫై సేవలు పొందాలంటే ఎలా అనుకుంటున్నారా మొదటగా వైపై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి తరువాత వైపై లిస్ట్‌లో క్యూఫై/ బీఎస్‌ఎస్‌ఎల్ అని డిస్‌ప్లే అవుతుంది. * అక్కడ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్‌ చేయాలి. * ఎంటర్‌చేసిన మొబైల్ నెంబర్‌కు ఎంఎస్‌ఎంస్ ద్వారా వైఫై పాస్‌వర్డ్ వస్తుంది * ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేస్తే వైఫై అందుబాటులోకి వస్తుంది. ఈ వైఫై సేవలను మొదటి 30 నిమిషాల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, తరునాత నుంచి ఛార్జ్ పడుతుందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఛార్జీలు కూడా మిగతా సర్వీసులతో పోలిస్తే నామామాత్రంగానే ఉంటాయని అన్నారు.

ఎస్ఐ పై నైజీరియన్ల దాడి

  ఈమధ్య నగరంలో నైజీరియన్ల ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. ఎక్కడి నుండో చదువు పేరుతో వచ్చిన వీళ్లు మన వాళ్లపైనే దౌర్జన్యంగా దాడులు చేస్తున్నారు. కొంతమంది వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా ఉంటూ పలు మోసాలు చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. గతంలో వీళ్లు పోలీసుల పై దాడి చేశారు. మళ్లీ ఇప్పుడు శుక్రవారం రాత్రి ఎస్ఐ పై దాడి చేశారు. లంగర్హౌస్ బాపూఘాట్ ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతలో అటుగా కారులో వెళ్తున్న ముగ్గురు నైజీరియన్లు కారు ఆపమన్నందుకు పోలీసు అధికారిపై దాడి చేశారు. తరువాత ఆ ముగ్గురు పారిపోయారు. పోలీసులు వెంబడించగా ఇద్దరు తప్పించుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్లని నైజీరియన్ చట్టాల ప్రకారం విచారించాల్సి రావడంతో పోలీసులు కూడా కఠినంగా శిక్షించలేకపోతున్నారు.

మళ్ళీ రెచ్చిపోయిన కాకుమాను కుక్కలు

  గుంటూరు జిల్లా కాకుమానులో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం పది కుక్కలు ఒక్కటై ఆరేళ్ళ బాలిక కౌసర్‌ని దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత మంత్రి ప్రత్తిపాటి పిచ్చికుక్కలను పట్టుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఆ ఆదేశాలకు కార్యరూపం దాల్చలేదు. దాంతో ఇదే గ్రామంలో మరోసారి పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. ఈసారి ఈ కుక్కల దాడిలో ఒక లేగదూడ మరణించింది. మరో లేగదూడ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఈ గ్రామంలో ప్రజలు భయభ్రాంతులు అయ్యారు. ఇప్పటికైనా కుక్కలను అదుపు చేయాలని విజ్ఞప్తి చేశారు. కుక్కలు మరోసారి బీభత్సాన్ని సృష్టించకముందే అధికారులు మేల్కొనాలని అంటున్నారు.

హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషను

  తెలంగాణా బడ్జెట్ సమావేశాలు మొదలయినప్పుడు శాసనసభలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో తెదేపా సభ్యులు అనుచితంగా ప్రవర్తించారంటూ మొత్తం పదకొండు మందిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు తెలంగాణా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వారు క్షమాపణ చెప్పేందుకు సిద్దపడినా వారిపై సస్పెన్షన్ వేటు ఎత్తి వేయలేదు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన అవేవీ ఫలించలేదు. చివరికి వారు లేకుండానే శాసనసభ సమావేశాలు ముగించేసారు. దాని వలన సహజంగానే తెదేపా సభ్యులు చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిలో కొంచెం ఆవేశపరుడయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ని చాలా ఘాటుగా విమర్శించడంతో తెరాస తరపున ఆయనపై ఒక కేసు దాఖలయింది. తనపై పెట్టిన ఆ కేసుని కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషను వేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను నిలదీసి ప్రశ్నించేవారిని భయపెట్టేందుకే ఈవిధంగా అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని కనుక తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషనును హైకోర్టు విచారణకు స్వీకరించింది.

సచివాలయం తరలింపుకి మళ్ళీ ఆటంకం

    ఎర్రగడ్డలో ఉన్న మానసిక, ఛాతి వ్యాధుల ఆసుపత్రులను వేరే చోటికి తరలించి, అక్కడ కొత్తగా సచివాలయం నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం భావించింది. దానిని వ్యతిరేకిస్తూ ఇదివరకు హైకోర్టులో ఒక పిటిషనుపడింది. అటువంటి ప్రభుత్వ నిర్ణయాలలో తాము తల దూర్చబోమని హైకోర్టు స్పష్టం చేస్తూ ఆ పిటిషనుని కొట్టివేసింది. ఎర్రగడ్డ ఆసుపత్రులున్న ప్రాంగణంలో ఒక చారిత్రక భవనం ఉందని ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, “మనం నివసిస్తున్న భూమి కూడా చాలా పురాతనమయినదే. అంత మాత్రాన్న భూమిని ముట్టుకోవద్దంటే కుదురుతుందా?” అని వితండవాదం చేసి వారి నోళ్ళు మూయించారు. కానీ అటువంటి వాదనలతో కోర్టులని ఒప్పించడం మాత్రం వీలుపడదని, ఆ భవనం తొలగింపుపై స్టే విధించడం ద్వారా హైకోర్టు స్పష్టం చేసింది.   తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు బి.మద్దిలేటి, తెలంగాణ నవ నిర్మాణ సేన అధ్యక్షుడు కె.వెంకటయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషను వేసారు. చారిత్రిక ప్రాధాన్యమున్న ఆ భవనాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చవలసి ఉంటుందని కానీ దానిని తెలంగాణా ప్రభుత్వం కూలద్రోసి ఆ ప్రదేశంలో సచివాలయం నిర్మించాలనుకొంటోందని, కనుక ఆ భవనాన్ని కాపాడాలంటూ వారు తమ పిటిషనులో పేర్కొన్నారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆ భవనానికి చారిత్రిక ప్రాధాన్యం ఉందా లేదా అనే విషయం తేలేవరకు దానిని కూల్చవద్దని స్టే విధించింది. దాని చారిత్రిక ప్రాధాన్యం నిర్దారించేందుకు తక్షణమే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, వారి చేత ఆరు వారాలలో నివేదిక తయారు చేయించి తనకు సమర్పించాలని హైకోర్టు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.   ఆ భవనం కూల్చితేగాని ఆ ప్రదేశంలో కొత్త సచివాలయ భవన నిర్మాణం మొదలుపెట్టడానికి వీలుపడదు. తెలంగాణా ప్రభుత్వం తన బడ్జెట్ లో కొత్త సచివాలయ భావన నిర్మాణానికి రూ. 150కోట్లు కేటాయించింది. కానీ ఈ కేసు తేలేవరకు పనులు మొదలు పెట్టడానికి వీలులేకుండాపోయింది. తెలంగాణా ప్రభుత్వం తరపున వాదించిన కె.రామకృష్ణారెడ్డి భవనాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చాలా? వద్దా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే ఒక కమిటీ వేసి నివేదిక తయారు చేసి కోర్టుకు సమర్పిస్తామని హామీ ఇచ్చేరు.

జయసుధకి రాజకీయ నేపద్యం ఉంటే నేరమా?

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికయిన రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కొంచెం అతిగా స్వంత డప్పు కొట్టుకొన్నారు. అదేవిధంగా తనపై పోటీ చేసిన జయసుధ వర్గం చాలా అన్యాయంగా, దుర్మార్గంగా వ్యవహరించిందని అనవసరమయిన మాటాలు మాట్లాడేరు. ఎన్నికలలో గెలిచిన తరువాత మరింత హుందాగా వ్యవహరిస్తే బాగుండేది. కానీ ఆయన అనవసరమయిన కామెడీ చాలా చేసారు. ఈ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తారని భావించిన జయసుధ ఓడిపోవడం, గెలిచే అవకాశాలు లేవనుకొన్న ఆయన భారీ మెజార్టీతో గెలవడం వెనుక రాజేంద్రప్రసాద్ వాదిస్తున్నట్లుగా రాజకీయాలు కాక ఇంకా ఇతర కారణాలే చాలానే ఉన్నాయి.   తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న హీరో, హీరోయిన్లకు , జూనియర్ ఆర్టిస్టులకు ఎటువంటి గౌరవం, గుర్తింపు లేదనే సంగతి పెద్ద బ్రహ్మ రహస్యమేమీ కాదు. అయితే వారికి అండగా నిలబడవలసిన ‘మా’ కూడా నిర్లక్ష్యం చేయడం వలన, ఇంతవరకు ‘మా’కు అధ్యక్షుడిగా కొనసాగిన మురళీ మోహన్ జయసుధకు మద్దతు తెలుపడంతో వారందరూ జయసుధను ఓడిస్తే ఆయననే ఓడించినట్లవుతుందనే ఉద్దేశ్యంతోనే రాజేంద్రప్రసాద్ కు ఓటు వేసి గెలిపించారు. అందుకే ఆమె ఓటమి మురళీమోహన్ ఓటమిగానే చూడాలని సీనియర్ నటుడు విజయ్ చందర్ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ కి సినీ పరిశ్రమలో చిన్న తారలు, జూనియర్ ఆర్టిస్టులతో సత్సంబంధాలు కలిగి ఉండటం కూడా ఆయనకీ కలిసి వచ్చింది. కానీ జయసుధకు కూడా సినీ పరిశ్రమలో మంచి పేరుంది. ఒకవేళ మురళీ మోహన్ ఆమెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించకపోయుంటే, అప్పుడు తప్పకుండా వారందరి ఓట్లు చీలిపోయేవేమో.   జయసుధ రాజకీయ నేపధ్యం కలిగి ఉండటం, ఆమెకు తెదేపా యంపీ మురళీమోహన్ మద్దతు ప్రకటించడం నేరమేమీ కాదు. కానీ ఆ వంకతో ఆమె వర్గంవారు తమపై చాలా ఒత్తిడి తెచ్చారని చెప్పడం మాత్రం తప్పు. ఒకవేళ నిజంగా జయసుధ వెనుక ఉన్న రాజకీయ నాయకులు రాజేంద్రప్రసాద్ వర్గంపై ఒత్తిడి తెచ్చినా అది ఎన్నికల యుద్దంలో భాగంగానే తీసుకోవాలి తప్ప ఆమెను సినీ పరిశ్రమ ముందు, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించడం చాలా తప్పు.   నిజానికి ఆమె చాలా కాలంగా ఏదో ఒక రూపంగా సమాజసేవ చేస్తున్నారు. ఆమె రాజకీయాలలో ప్రవేశించడానికి కారణం కూడా అదే. కానీ ఆమె ఆ కుళ్ళు రాజకీయాలలో ఇమడలేక బయటకు వచ్చేసారు. మా అధ్యక్షురాలిగా ఎన్నికయితే సినీ పరిశ్రమలో నిరుపేద కళాకారులకు సేవలందించాలనుకొన్నారు తప్ప రాజకీయాలు చేయడానికి ఆమె పోటీ చేయలేదు. తెలుగు సినీ పరిశ్రమలో జయసుధ అందరికంటే సీనియర్ నటి. కనుక సినీ పరిశ్రమ గురించి ఆమెకు మంచి అవగాహన ఉంది. అదేవిధంగా తెలుగు ప్రజలకు కూడా ఆమె పట్ల చాలా ఆదరాభిమానాలున్నాయి.   రాజేంద్ర ప్రసాద్ మా అధ్యక్షడిగా ఎన్నికయిన తరువాత సినీ పరిశ్రమలో అందరికీ తనంటే ఎంతో ఇష్టమని అదేవిధంగా తనకు కూడా సినీ పరిశ్రమలో ఉన్న వారందరూ ఎంతో ఇష్టమని చెప్పుకొన్నారు. కానీ అదే నోటితో జయసుధ వర్గం గురించి అగౌరవంగా మాట్లాడటం సబబు కాదు. ఎన్నికల వరకు ఏవిధంగా మాట్లాడుకొన్నా మళ్ళీ అందరూ కలిసి పనిచేయవలసి ఉంటుందనే విషయం మరిచిపోకూడదు. ఏదో ఒకరోజు వారిరువురూ కలిసి నటించవచ్చును. కానీ ఈవిధంగా చులానగా మాట్లాడుకొన్నాక గౌరవం ఉన్నట్లు నటించడమే చాలా కష్టం అవుతుంది. అటువంటప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం వలన నలుగురిలో చులకన అవడం తప్ప ఒరిగేదేమీ ఉంది?

యాసిడ్ దాడి బాధితురాలి వివాహం

  యాసిడ్ దాడికి గురైన బాధితురాలు సోనాలీ ముఖర్జీ వివాహం జరిగింది. ఝార్ఖండ్‌కి చెందిన సోనాలీ ముఖర్జీని ఆమె ఫేస్‌బుక్ స్నేహితుడు వివాహం చేసుకున్నాడు. ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చిత్తరంజన్ దాస్ తివారీ అనే వ్యక్తితో ఝార్ఖండ్‌లోని బొకారోలో ఆమె వివాహం జరిగింది. యాసిడ్ దాడికి గురైన ఆమె గతంలో కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఎంతో స్ఫూర్తిమంతంగా మాట్లాడి అమితాబ్ బచ్చన్ నుంచి ప్రశంసలను కూడా పొందింది. ఆమె ప్రభుత్వోద్యోగం కోసం డిమాండ్ చేశారు. ఆమె చేసిన పోరాటం ద్వారా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆమె ధైర్యాన్ని గమనించిన చిత్తరంజన్ తివారి ఆమెకు ఫేస్‌బుక్‌ లకౌంట్‌కి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ పంపించాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఇప్పుడు వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.

చనిపోయాడనుకున్నారు.. కానీ

  చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగివస్తే ఎలా ఉంటుంది. మనకెలా ఉన్నా అతని కుటుంబసభ్యులు మాత్రం ఆనందంలో మునిగితేలుతారు. అలాంటి ఆనందంలో ఉన్నారు మిడ్డిల్ లోని ఓ కుటుంబ సభ్యులు. పెంటయ్య అనే వ్యక్తి 20 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి రైలు ప్రమాదంలో చనిపోయాడని అతని కుటుంబసభ్యులు భావించారు. శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు కూడా చేశారు. ఇదిలా ఉండగా చనిపోయాడనుకున్న పెంటయ్య ఇటీవల తన గ్రామస్థుడికి కనిపించాడు. మొదట షాక్ కు గురైన అతను పెంటయ్య బ్రతికున్న విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలిపాడు. దీంతో పెంటయ్య కుటుంబసభ్యులు అతనిని ఇంటికి తీసుకెళ్లారు. ఇంతకీ అంత్యక్రియలు చేసిన శవం ఎవరిదా అనే వివరాలు మాత్రం తెలియలేదు.

చెస్ట్ ఆస్పత్రిని కూల్చొద్దు.. హైకోర్టు...

  ఎర్రగడ్డలో వున్న చెస్ట్ ఆస్పత్రి భవనాన్ని కూల్చేసి, అక్కడ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ అంశం మీద హైకోర్టులో కేసు నమోదైంది. ఇప్పుడున్న సచివాలయం వాస్తు బాగా లేదని చెస్ట్ ఆస్పత్రికి కూల్చి అక్కడ సచివాలయాన్ని నిర్మించాలని ఆ కేసులో పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసమే సచివాలయాన్ని మార్చుతున్నామని వివరణ ఇచ్చింది. అయితే చెస్ట్ ఆస్పత్రి హెరిటేజ్ భవనమని, దాన్ని కూల్చరాదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో చెస్ట్ ఆస్పత్రిని ఆరు వారాలపాటు కూల్చరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. చెస్ట్ ఆస్పత్రి భవనం హెరిటేజ్ భవనమా కాదా అనే విషయాన్ని ఆరు వారాల్లోగా ప్రభుత్వం తేల్చాలని, అప్పటి వరకు భవనాన్ని కూల్చరాదని కోర్టు ఆదేశించింది.

‘మా’ విజేతలు వీరే... లిస్ట్...

  ‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ గెలిచారని పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ ప్రకటించారు. రాజేంద్రప్రసాద్ 85 ఓట్ల మెజారిటీతో జయసుధ మీద విజయం సాధించారని ఆయన వెల్లడించారు. ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా తనికెళ్ల భరణి (168 ఓట్ల మెజారిటీ) ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా (36 ఓట్ల మెజారీటీ), కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు (159 ఓట్ల మెజారిటీ), సంయుక్త కార్యదర్శులుగా నరేష్‌ (225 ఓట్ల మెజారిటీ), రఘుబాబు (239 ఓట్ల మెజారిటీ) గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఈ క్రిందివారు గెలుపొందారు. మెంబర్లుగా బెనర్జీ 281 ఓట్లు, బ్రహ్మాజీ 303, ఛార్మి కౌర్ 249, ఢిల్లీ రాజేశ్వరి 262, ఏడిద శ్రీరామ్‌ 253, మహర్షి రాఘవ 255, శశాంక్ 283, గీతాంజలి 285, ఎం. హరనాథ్‌బాబు 255, హేమ 252, జాకీ 311, జయలక్ష్మి 250, కాదంబరి కిరణ్‌ 315, కృష్ణుడు 282, నర్సింగ్‌ యాదవ్‌ 301, పి. శ్రీనివాసులు 245, రాజీవ్‌ కనకాల 315, విద్యాసాగర్‌ 245 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

బాంబు పెట్టబోయాడు.. పేలింది.. పోయాడు..

  ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ ఇటీవలి కాలంలో బాగా వేళ్ళూనుకుని ఎంతోమందిని చంపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ చీఫ్ హఫీజ్ మహ్మద్ సయీద్ బాంబు పేలుడులో మరణించాడు. ఈయనగారు వాయవ్య పాకిస్థాన్‌లోని తిరాహ్ లోయలో రోడ్డు పక్కన బాంబు పాతిపెడుతూ వుండగా అది అతని చేతిలోనే పేలిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఇతనితోపాటు మరో ఇద్దరు తీవ్రవాదులు కూడా అక్కడే మరణించారు. బాంబు పేలిన సమాచారాన్ని అందుకుని అక్కడకు చేరుకున్న పాకిస్థాన్ భద్రతాదళాలు మరణించింది. ప్రఖ్యాత తీవ్రవాది మహ్మద్ సయీద్ అని తెలుసుకుని, ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశారు. అయితే తమ చీఫ్ మరణించారన్న విషయం మీద ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ఎలాంటి స్పందననూ తెలియజేయలేదు.

మొగుళ్ళే యముళ్లు

  కట్టుకున్న భర్తలే భార్యలను అతి కిరాతంగా చంపుతున్నారు. మొగుళ్లే యముళ్లులాగా తయారయ్యారు. గొడవేదైనా కాని చంపడమే పరిష్కారంగా ఆలోచిస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ భర్త తన ఇల్లాలితో గొడవ పడి గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. ఇప్పుడు అదే తరహాలో శుక్రవారం మరో రెండు దారుణాలు జరిగాయి. గుడిబండ జిల్లాలో ఓ భర్త తన భార్యను కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. తరువాత తను కూడా ఉరేసుకొని చనిపోయాడు. ఇదిలా ఉండగా లక్కవరపుకోటలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గోల్డ్‌స్పాట్‌ కంపెనీ కూడలి దగ్గర ఓ గర్భిణి దారుణహత్యకు గురైంది. భర్తే తన భార్యకు నిప్పంటించి చంపేశాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

18 మంది టెర్రరిస్టులు ఖతం

  టెర్రరిస్టులు ఖతమయ్యారనే వార్త ఈ ప్రపంచానికి నిజంగానే శుభవార్తే. అలాంటి శుభవార్త మరోసారి వినే అవకాశం వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది టెర్రరిస్టులు ఖతమయ్యారు. ఈజిప్టులోని నార్త్ సినాయ్ ప్రావిన్స్‌లో జరిగిన సైనిక దాడుల్లో ఈ 18 మంది మరణించారు. ఉత్తర సినాయ్ ప్రాంతంలో తీవ్రవాదుల ఆగడాలను అరికట్టడానికి సైనిక బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో ఈ తీవ్రవాదులు హతమయ్యారు. మరో నలుగురు తీవ్రవాదులను సజీవంగా పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదుల మీద భద్రతా దళాలు సాధించిన చాలా చిన్న విజయమిది. చంపడంలో ఇప్పటి వరకు తీవ్రవాదులదే పైచేయిగా వుంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 500 మంది భద్రతా సిబ్బందిని తీవ్రవాదులు చంపేశారు.