కుక్కకి ఆధార్ కావాలన్న తింగరోడు

  తనతో పాటు తన కుక్కకి ఆధార్ కార్డ్ కావాలని ధరఖాస్తు చేసుకున్నాడు ఓ తింగరోడు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని రాజాపూర్ లో మనీశ్ కుమార్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతను గత మార్చి నెలలో తన కుక్క ఫోటోతో పాటు తప్పు సమాచారాన్ని నింపి ఆన్ లైన్ లో ధరఖాస్తు పెట్టాడు. అది కాస్తా ప్రభుత్వ అధికారుల కంట పడింది. మనీశ్ పెట్టిన దరఖాస్తును వారు తిరస్కరించి ఈ తిక్కలి పనికి పాల్పడినందుకు అతనిపై కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని చూసి చివరికి తనే ఇరుకున పడ్డాడు.

రోజుకు మూడు లక్షల లడ్డూలు

  తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ అంటే ఇష్టం లేనిదెవరికి? శ్రీవారి లడ్డూ భక్తులకు మహా ప్రసాదం. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. భక్తి, ముక్తి విషయంలో మాత్రమే కాదు... రుచి విషయంలో కూడా తిరుమల లడ్డు ప్రత్యేకతే వేరు. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే శ్రీవారి లడ్డూ ఎవరికైనా స్పెషల్ ఎట్రాక్షన్.. అయితే తిరుమలలో వీఐపీ భక్తులకు తప్ప సాధారణ భక్తులకు ఎక్కువ సంఖ్యలో లడ్లు దొరకవన్న అభిప్రాయం వుంది. క్యూలో వెళ్ళే సమయంలో ఇచ్చే లడ్లు సరిపోకపోవడంతో భక్తులు ఆ తర్వాత గంటలు గంటలు క్యూలో నిల్చుని అదనంగా లడ్లు కొనుగోలు చేస్తూ వుంటారు. అయితే ప్రస్తుతం తిరుమలలో రోజుకు భక్తుల కోసం రెండు లక్షల లడ్డు తయారు చేస్తున్నారు. ఈ లడ్లు సరిపోవడం లేదు. దాంతో ఇకపై రోజుకు మూడు లక్షల లడ్లు చేయాలని టీడీటీ ఇవో నిర్ణయించారు. లక్ష లడ్లు అదనంగా సమకూరడం వల్ల ఇకపై భక్తులకు లడ్లు సులభంగా లభించే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. లడ్ల తయారీని పెంచడానికి వీలుగా ఇటీవల పోటును విస్తరించారు కూడా.

అసెంబ్లీ సీట్లు పెంచరట

  ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు వున్నాయన్న వార్తలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఆసక్తిగా వుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచే అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అసెంబ్లీ స్థానాలను పెంచడం 2026 తర్వాత మాత్రమే సాధ్యమవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170వ అధికరణ ప్రకారం 2026వ సంవత్సరం వరకు ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. తెలంగాణ ఎంపీ వినోద్ కుమార్‌ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానం ఇచ్చారు. అయితే ఈ విషయంలో తమ పోరాటాన్ని ఆపేదే లేదని ఎంపీ వినోద్ కుమార్ అంటున్నారు.

అవనిగడ్డ ఆంజనేయ ఆలయం ధ్వంసం

  కృష్ణాజిల్లా దివిసీమలోని అవనిగడ్డలో అత్యంత పురాతన ఆంజనేయ స్వామి ఆలయం, విగ్రహం సమూలంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ దేవాలయాన్ని విశేషంగా సందర్శిస్తూ వుంటారు. ఈ ఆలయం అవనిగడ్డ వంతెన సెంటర్ వద్ద ప్రధాన కాల్వ గట్టు మీద వుంది. అయితే, మంగళవారం ఉదయం ఈ ఆలయం అకస్మాత్తుగా కాలవలోకి కూలిపోయింది. ఈ విషయం తెలుసుకుని స్థానిక ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా ఓ కాంట్రాక్టర్ డెల్టా ఆధునీకరణ పనులు చేయిస్తున్నాడు. కాల్వ గట్టు మీద ఆంజనేయ దేవాలయం ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా దేవాలయం పక్కనే భారీ కందకం తవ్వించాడు. మంగళవారం నాడు కాల్వలోకి నీళ్ళు విడుదల చేశాడు. దాంతో ఆ నీటి ఒరవడికి గట్టు మొత్తం కోసుకునిపోయి దేవాలయం ఒక్కసారిగా కుప్పకూలింది. దేవాలయం మొత్తం ధ్వంసం కావడంతోపాటు దేవాలయంలో వున్న ఆంజనేయ స్వామివారం విగ్రహం కూడా దెబ్బతింది. ఇలా జరగడం అమంగళకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడానికి కారకుడైన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు రాస్తారోకోకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజల ఆందోళనతో దారికి వచ్చిన కాంట్రాక్టర్ కూలిపోయిన దేవాలయాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు శాంతించారు. అనంతరం, ఘటనలో దెబ్బతిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పులిగడ్డ వద్ద నిమజ్జనం చేశారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవం

  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కెసీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ ఇప్పటి వరకు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని, పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఎన్నికల పర్యవేక్షకుడిగా వ్యవహరించిన మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేసీఆర్‌ని పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించారని, ఆ ప్రతిపాదనను ఆరుగురు మంత్రులు బలపరిచారని నాయిని తెలిపారు. దీంతో కేసీఆర్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని నాయిని వివరించారు.

క్రికెటర్ అంకిత్ కేసరి దుర్మరణం

  క్రికెట్ అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ ఆ క్రికెట్ వల్లే క్రీడాకారులు ప్రాణాలను కోల్పోతున్నారు. గతంలో ఆస్ట్రేలియా క్రీడాకారుడు హ్యూస్ బ్యాటింగ్ చేస్తూ బంతి తగలడంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈస్ట్ బెంగాల్ క్లబ్ క్రికెటర్ అంకిత్ కేసరి మరణించాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సీనియర్ నాకౌట్ పోటీల్లో భాగంగా సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భవానీపూర్ క్లబ్ ఆటగాడు కొట్టిన బంతిని అంకిత్, మరో ఆటగాడు క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించి ఒకరికొకరు గట్టిగా ఢీ కొట్టుకోవడంతో అంకిత్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

నేనున్నా.. లేకున్నా... కేసీఆర్...

  ఆదివారం నాడు హైదరాబాద్‌లోని మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన తెలంగాణ కళాకారుల సమ్మేళనంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తీరు కళాకారులందరితోపాటు, టీఆర్ఎస్ వర్గాల్లో ఆవేదన కలిగించింది. ఆయన ఈ తరహా మాటలు మాట్లాడకుండా వుంటే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్, తెలంగాణ పోరాటంలో కళాకారుల పాత్ర ఎంతో వుందని అన్నారు. తాను వున్నా, లేకున్నా తెలంగాణను మీరే కాపాడాలని అన్నారు. ఈ ఒక్క మాట అందరి మనసులలో ఆవేదన కలిగించింది. తెలంగాణ పోరాటాన్ని విజయంతంగా పూర్తిచేసి, ఇప్పడు బంగారు తెలంగాణను సాధించడానికి కృషి చేస్తున్న కేసీఆర్ నోటి వెంట ‘‘నేనున్నా.. లేకున్నా’’ అనే మాట రావడాన్ని కళాకారులు, టీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇలాంటి అశుభమైన మాటలు ఆయన నోటివెంట రావడం తమకు ఎంతో బాధ కలిగిస్తోందని వారు అంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని, ఇలాంటి సమయంలో కేసీఆర్ నోటి వెంట అలాంటి మాటలు రావడాన్ని తాము భరించలేకపోతున్నామని వారు అంటున్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు జీవించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయాలని తామందరం కోరుకుంటున్నామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల కేసీఆర్ భవిష్యత్తులో ఇలాంటి అశుభపు మాటలు మాట్లాడవద్దని వారు ప్రార్థిస్తున్నారు.

చావుబతుకుల్లో జాయింట్ కలెక్టర్

  ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ రోడ్డు ప్రమాదానికి గురై చావుబతుకుల్లో వున్నారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నిర్మల్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఆదిలాబాద్‌కి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అబ్నార్ పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్‌కి తరలించారు.

నేటి నుంచి లోక్‌సభ

  బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. భూసేకరణకు సంబధించిన ఆర్డినెన్స్‌ను సోమవారం నాడే లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాలు వాడిగా, వేడిగా జరుగుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఆమధ్య జరిగిన సమావేశాలకు హాజరు కాకుండా లీవ్ తీసుకుని ఎటో వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ ఈ సమావేశాలకు హాజరు అవుతున్నారు. ఆయన తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ సమావేశాల్లో హడావిడి చేసే అవకాశం వుందని అనుకుంటున్నారు. ఈ సమావేశంలో పలు బిల్లులను ఆమోదిస్తారు. మే 13 తేదీతో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు పూర్తవుతాయి.

ఘనంగా చంద్రబాబు బర్త్ డే

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 66వ పుట్టినరోజు వేడుకలు సోమవారం నాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగాయి. పార్టీ కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కేక్ కట్ చేసి, అందరి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అని అన్నారు. అందరి త్యాగాల ఫలితం కారణంగానే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న స్థాయికి ఎదిగిందని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. ‘‘నా జీవితం తెలుగు జాతికి అంకితం. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటున్నాను. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాను’’ అన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ, శ్రీకాళహస్తి నుంచి వచ్చిన వేద పండితులు ఆశీస్సులు అందించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేత్ర, దంత వైద్య శిబిరాలతోపాటు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంధులకు బ్రెయిలీ ల్యాప్‌టాప్‌లను అందజేశారు.

బోటు మునిగి 700 మంది గల్లంతు

  లిబియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లిబియా నుంచి జర్మనీకి వలస వెళ్తున్న ఏడు వందల మంది శరణార్థులు మరణించారు. లిబియా అధ్యక్షుడు గడాఫీని అక్కడ జనం దారుణంగా చంపేసిన తర్వాత తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయింది. ఎక్కడ చూసినా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అనేకమంది లిబియా నుంచి జర్మనీకి సముద్ర మార్గం ద్వారా వలస వెళ్తున్నారు. ఇలా వలస వెళ్ళే వారి పడవలు మునిగి ఇప్పటి వరకు మూడు వందల మంది మరణించారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ఏడు వందల మంది గల్లంతయ్యారు. లిబియా తీరం నుంచి ఇటలీలోని లాంపేడ్యూసాకి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ శరణార్థులు ప్రయాణిస్తున్న బోటుకు మరో పెద్ద వ్యాపార నౌక ఎదురు వచ్చింది. ఈ బోటులో ప్రయాణించడం కంటే ఆ నౌకలో ప్రయాణించడం మంచిదని దాంట్లోవారు భావించారు. ఆ నౌక పక్కనే బోటును ఆపి అందరూ అందులో ఎక్కడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో అందరూ బోటుకు ఒకే వైపుకు రావడంతో బోటు ఒరిగిపోయి నీటిలో మునిగిపోయింది. దాంతో 700 మంది గల్లంతయ్యారు. వీరిలో 24 మందిని కాపాడారు. 28 మంది ఈదుతూ బతికిపోయారు. మిగతావారంతా నీటిలో మునిగి మరణించి వుంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన పట్ల అటు జర్మనీలో, ఇటు లిబియాలో ప్రభుత్వ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. పోప్ ఫ్రాన్సిస్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

నారాయణా! వారానికోసారి సింగపూర్ వెళ్లివస్తారుట!

  రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇస్తున్న సింగపూర్ ప్రభుత్వానికి అవసరమయిన సహాయసహకారాలు అందించేందుకు మునిసిపల్ మంత్రి నారాయణ నలుగురు అధికారులతో కలిసి ప్రతీ ఆదివారం సింగపూర్ వెళ్లి వస్తానని ప్రకటించారు. రాజధానికి మైక్రో లెవెల్ ప్లానింగ్ సిద్ధమయ్యే వరకు తాను పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి గిరిధర్, సి.ఆర్.డి.ఏ. కమీషనర్ శ్రీకాంత్, సి.ఆర్.డి.ఏ.కి చెందిన మరో ఇద్దరు అధికారులు ప్రతీ ఆదివారం సింగపూర్ వెళ్లి వస్తామని మంత్రి నారాయణ మీడియాకు తెలియజేసారు.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకువచ్చేందుకు సింగపూర్, జపాన్ దేశాలు పర్యటిస్తేనే ఆయన ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చుపెట్టేస్తున్నారంటూ నానాయాగీ చేసిన వైకాపా మంత్రిగారి బృందం వారం వారం సింగపూర్ యాత్రల గురించి ఏవిధంగా స్పందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింగపూర్ ప్రభుత్వం రాజధానికి మాస్టర్ ప్లాన్ అందజేసే బాధ్యతలు తీసుకొన్నప్పుడు, అవసరమయినప్పుడు వారే క్షేత్ర స్థాయిలో పర్యటించి అవసరమయిన వివరాలు సేకరిస్తే సమంజసంగా ఉంటుంది గానీ ఈవిధంగా మంత్రిగారు తన బృందాన్ని వెంటబెట్టుకొని సింగపూర్ బయలుదేరుతానని చెప్పడం విమర్శలకు తావిచ్చేదిగా ఉంది.