ఖాకీ కండకావరం, ఎస్సై సస్పెన్షన్
posted on Sep 20, 2015 @ 6:45PM
సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే గూండాలు చెలరేగిపోతారని పేరు. అత్యాచారాలు, హత్యలు అధికంగా జరిగే యూపీలో పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారనే పేరుంది. దాన్ని మరోసారి రుజువు చేస్తూ లక్నోలోని హజ్రత్ గంజ్ లో ఓ ఎస్సై రాక్షసత్వాన్ని చూపించాడు. ఫుట్ పాత్ పై టైప్ రైటర్ పనిచేసుకుని పొట్ట పోసుకునే అరవై ఏళ్ల వృద్ధుడిపై ఎస్సై ప్రదీప్ కుమార్ తన ప్రతాపాన్ని చూపించాడు. ఫుట్ పాత్ ను ఖాళీ చేయాలని చెప్పినా వినలేదని, టైప్ రైటర్ ను ఫుట్ బాల్ లా తన్ని పగలగొట్టి నానా బీభత్సం చేశాడు. తన జీవనాధారమైన టైప్ రైటర్ ను ధ్వంసం చేయొద్దని చేతులెత్తి దండం పెట్టి వేడుకున్నా, ఆ ఖాకీ మనసు కరగలేదు, 30ఏళ్లుగా తాను ఈ పనే చేసుకుంటున్నానని, రోజంతా కష్టపడితే 50 రూపాయలే వస్తాయని చెప్పినా వినిపించుకోని ఆ ఎస్సై దౌర్జన్యానికి దిగాడు, అయితే ఎస్సై దుర్మార్గాన్ని ఫొటోలు తీసి స్థానికులు సోషల్ మీడియాలో పెట్టడంతో, విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అఖిలేష్... ఎస్సై ప్రదీప్ కుమార్ ను సస్పెండ్ చేసి, బాధితుడు కిషన్ కుమార్ కు కొత్త టైప్ రైటర్ అందేలా చేశారు. సీఎం ఆదేశాలకు కిషన్ కుమార్ ఇంటికెళ్లిన జిల్లా కలెక్టర్, డీఎస్పీలు... ముసలాయనకు క్షమాపణ చెప్పి, కొత్త టైప్ రైటర్ ను అందించారు.