ఇది హత్యా? ఆత్మహత్యా?
posted on Nov 14, 2015 4:40AM
పరీక్ష పత్రాల వాల్యుయేషన్ చేసేవారి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైపోయింది. బాగా చదువుకునే విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆ తర్వాత ఆ విద్యార్థి పాసయ్యాడని తెలిసింది. వాల్యుయేషన్ చేసేవారి నిర్లక్ష్యం ఒక ప్రాణం తీసింది. జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కి చెందిన మహ్మద్ అద్నాన్ హిలాల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మొదటి సెమిస్టర్లో తనకు ఇష్టమైన సబ్జెక్టులో అతను ఫెయిలయ్యాడు. దాంతో హిలాల్ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ అంశం మీద అనుమానం వచ్చిన హిలాల్ తండ్రి ఫెయిలైన పేపర్ని రీ వాల్యుయేషన్ చేయిస్తే హిలాల్ క్లాస్ టాపర్‌గా నిలిచాడు. దాంతో ఆ తండ్రి గుండె మరోసారి పగిలపోయింది. ఆ తండ్రి తన కొడుకుది ఆత్మహత్య కాదని హత్య అంటూ రోదిస్తున్నాడు. పేపర్లు దిద్దేవారే తన కొడుకును హత్య చేశారని అంటున్నారు. ఈ అంశాన్ని కాశ్మీర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థ మాత్రం చాలా లైట్‌గా తీసుకుంది. ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే వుంటాయని, అంతమాత్రానికి ఆత్మహత్య చేసుకోవడమే తప్పని అంటోంది.