ప్యారిస్ మృతులు 150 మంది
posted on Nov 14, 2015 6:06AM
ప్యారిస్ నగరంలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనల్లో మృతుల సంఖ్య 150 కి పెరిగింది. ప్యారిస్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటంతో ఈ ఘోరం జరిగింది. ప్యారిస్ మొత్తంలో ఆరుచోట్ల కాల్పులు, మూడు చోట్ల పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ప్యారిస్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి కూడా జరిగినట్టు సమాచారం. వందమంది ప్రజలను తీవ్రవాదులు ఒకేచోట బంధించి బాంబులతో పేల్చివేశారని తెలుస్తోంది. అయితే కాల్పుల సంఘటనల తర్వాత సైన్యం అప్రమత్తమై మొత్తం వందమంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొంతమంది తీవ్రవాదులను కాల్చి చంపారు.కాల్పుల దుర్ఘటనల అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో ఎమర్జెన్సీని విధించారు. ఈ దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్యారిస్ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు.