టీడీపీలోకి కొడాలి నాని..?

కృష్ణాజిల్లా.. గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీలోకి చేరేందుకు సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. పార్టీ ఏదైనా ఆ నియోజకవర్గం నుండి నాని గెలవడం ఖాయం అన్నట్టు ఏర్పడింది పరిస్థితి. 2004, 2009 లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా టీడీపీ నుండి ఆయన గెలుపు సాధించారు. ఆ తరువాత 2014లో టీడీపీ నుండి వైకాపా కి జంప్ అయి ఆపార్టీ నుండి కూడా గెలుపొందాడు. అలాంటి నాని ఇప్పుడు టీడీపీ లోకి రావడానికి సిద్దమవుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనికి ఆపార్టీ నేత వైఎస్ జగనే కారణమంట. ఎందుకంటే.. జ‌గ‌న్ త‌న‌కు స‌రైన ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌ని ఫీలవుతున్నారంట. అంతేకాదు.. ఇటీవ‌ల గుడివాడ‌లోను, బంద‌రు పోర్టు విష‌యంలో జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో పార్టీ నుంచి త‌న‌కు అంత‌గా మ‌ద్ద‌తు రాక‌పోవ‌డం.. అలాగే జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే విష‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు కూడా నానికి న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. ఇవన్నీ కలిసి నాని టీడీపీ వైపు రావడానికి కారణాలు అని తెలుస్తోంది. మరోవైపు నాని అనుచరులు కూడా తనను టీడీపీలోకి రావాలని కోరుకుంటున్నారంట. అయితే నాని టీడీపీలోకి వస్తానంటే పార్టీ నేతలు హ్యాపీగానే ఉన్నా దీనికి చంద్రబాబు నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావాలి మరి.

సోనియాకు మోడీ విషెస్.. ఇందిరా గాంధీ కోడలిని.. భయపెట్టలేరు.. సోనియా

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఈ రోజు 69వ పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఆమె పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు ప్రధాని నరేంద్రమోడీ కూడా సోనియా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆ భగవంతుడు సోనియాకు సుదీర్ఘ జీవితాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ట్వీట్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్ చేశారు. ఇదిలా ఉండగా ఉభయసభల్లో ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కేసు గురించి రగడ జరుగుతుంది. అయితే దీనిపై సోనియా మీడియా ముందు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నేను ఇందిరా గాంధీ కోడలిని.. నన్ను ఎవరూ భయపెట్టలేరంటూ మండిపడ్డారు..

జగన్ కు కౌంటర్ ఇచ్చిన సోమిరెడ్డి..

విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మందు తాగి పలువురు మృతి చెందిన విషయం తెలసిందే. అయితే చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు దొరికిందే ఛాన్స్ గా ఈ విషయంపై అధికార పార్టీపై విమర్శలు చేశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు గాను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ కు కౌంటర్ ఇచ్చారు. కల్తీ మందు గురించి జగన్ మాట్లాడుతుంటే చాలా హ్యాస్యాస్పదంగా ఉంది.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మందు ఏరులై పారేదని విమర్శించారు. అంతేకాదు మద్యం వ్యాపారులను తన పార్టీలోనే ఉంచుకొని ఇతరులను విమర్శించడం తగదని.. తన పార్టీలో ఉన్న బొత్స సత్యనారాయణకు అయిదు జిల్లాల్లో మద్యం వ్యాపారం ఉందని.. గతంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని.. మరి అలాంటి ఆయనను పార్టీలోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ బొత్సపై కేసులు నడుస్తున్నాయని అన్నారు. అసలు ఇన్ని మాట్లాడుతున్నా జగన్ దీనంతటి కారణమైన మల్లాది విష్ణువు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మరి సోమిరెడ్డి కౌంటర్ కి వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా.. లేక ఎందుకులే అని ఊరుకుంటారా?

బీఫ్ ఫెస్టివల్ కు నో చెప్పిన హైకోర్టు..

  ఈనెల 10వ తేదీన బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఎప్పటినుండో ఓయూ విద్యార్దులు అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై అనేక వివాదాలు తలెత్తాయి. ఈ బీఫ్ ఫెస్టివల్ కు పోటీగా కొంతమంది పోర్క్ ఫెస్టివల్ కూడా నిర్వహించాలనుకున్నారు. కాగా ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులకు హైకోర్టులో చుక్కెదురైంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడానికి అనుమతించవద్దని కడియం రాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించవద్దని.. ఫెస్టివల్ నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి.. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపింది. సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు కూడా అమలు పరచాలని హైకోర్టు ఆదేశించింది

నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంట్లో రచ్చ..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నేషనల్ హెరాల్డ్ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై లోక్ సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందని స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కక్షసాధిస్తుందని మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యుల తీరుపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని. కరువు పై చర్చ జరగకుండా కావాలనే కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారన్నారు. ఓటమిని భరించలేకే కాంగ్రెస్ ఇలా చేస్తుందని అన్నారు.

కల్తీ మద్యం కేసుపై సిట్..

కల్తీ మద్యం ఘటనపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా దర్యాప్తు చేపడుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు స్వర్ణ బార్ సీసీ పూటేజ్ ను కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కల్తీ మద్యం కేసుపై సిట్ ఏర్పాటు చేసింది. డీఐజీ మహేశ్ చంద్ర లడ్డా ఆధ్వర్యంలో ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఘటనపై డీజీపీ రాముడు మాట్లాడుతూ కల్తీ మద్యం దందాపై ఉక్కుపాదం మోపుతాం.. అయితే ఈ వ్యవహారంపై ఎవరిపై ఆరోపణలు చేయం.. నిజనిజాలు తేలిన తరువాతే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. విజయవాడలోని కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ మైండ్ గేమ్.. గుణపాఠం తప్పదు.. ఉత్తమ్

టీ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వికృత రాజకీయాలు చేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఎక్కువకాలం కొనసాగదు.. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు..ఏదో ఒక సమయంలో గుణపాఠం తప్పదు అని వ్యాఖ్యనించారు. అంతేకాదు ఇతర పార్టీనేతలకు పదవులు ఆశ చూపించి.. ఆపర్ ఆకర్ష్ ద్వారా నేతలను ఆకర్షించి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బలం లేకపోయినా ఎమ్మేల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెటిలర్స్‌కు రక్షణ కల్పించేది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని..హైదరాబాద్ పరిధిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు.

ఆయన చెప్పులు మోయలేదు.. నా చెప్పులు ఇచ్చాను.. రాహుల్ చెప్పుల రగడ

రాజకీయ నేతలు తమ చెప్పులనో, బూట్లనో తమ పక్కన ఉన్న అనుచరులతో మోయించి విమర్శలపాలైన దాఖలాలు చాలానే చూశాం. ఇప్పుడు ఆ లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చేరిపోయారు. రాహుల్ గాంధీ నిన్న చెన్నైలోని వరదబాధితులను పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చెప్పులను కాంగ్రెస్ పార్టీ నేత పట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పట్టుకుంది ఏ చిన్ననేతనో కూడా కాదు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వీ నారాయణస్వామి. అంతే ఇక రాహుల్ పై విమర్శల వర్షం కురిపించారు అందరూ. అయితే ఈ వార్తలకు స్పందించిన నారాయణ స్వామి మాత్రం.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. అసలు ఆయన చెప్పులు వేసుకురాలేదు.. షూ వేసుకొచ్చారు.. వరద నీటికి నడవలేని కారణంగా నా చెప్పులను తీసి ఆయనకు ఇచ్చాను.. ఎలాంటి మొహమాటం లేకుండా ఆయన వాటిని తీసుకొని వేసుకున్నారు అని తెలిపారు. అంతేకాదు.. ఆయన షూని కూడా కనీసం సెక్యూరిటీ గార్డుకు ఇవ్వలేదని.. తన చేత్తోనే పట్టుకున్నారని అన్నారు. మరి ఏ జరిగిందో రాహుల్ కు, నారాయణస్వామికే తెలియాని..

సతీసమేతంగా కేసీఆర్ చంద్రబాబుకు ఆహ్వానం..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఈ నెల చివరి వారంతంలో ఆయుత చండీయాగం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాగానికి గాను కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా ఆహ్వానించాలని నిర్ణయించున్నారు. అయితే ఇప్పటికే రెండుమూడుసార్లు కేసీఆర్, చంద్రబాబును కలుద్దామని అనుకున్నా అది జరగలేదు. అయితే ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్నారు. కాగా  వీరివురు ఢిల్లీ నుండి రాగానే కేసీఆర్ స్వయంగా వెళ్లి చంద్రబాబును ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రమే కాదు.. కేసీఆర్ ఆయన సతీమణి ఇద్దరు కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడకు వెళ్లి చంద్రబాబును ఆహ్వానిస్తారని అనుకుంటున్నారు.

జయలలిత బురద రాజకీయం..

భారీ వర్షాల వల్ల చెన్నై అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాల వల్ల చెన్నై వాసులు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. దాంతో ఎంతో మంది దాతలు చెన్నైను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. అంతేకాదు మన తెలుగు నాట నుండి కూడా ఎంతోమంది చెన్నై ప్రజలకు సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచినంత వారు సాయం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే దీనిపై కూడా తమిళనాడు ప్రభుత్వం బురద రాజకీయం చేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. అమ్మ బోమ్మతోనే సాయం అందించాలని.. పలువురు స్వచ్ఛంధ సంస్థలను కూడా కార్యకర్తలు అడ్డుకుంటున్నారట. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పొలిటికల్ మైలేజ్ కోసం ఆరాటపడుతున్నారని.. జయలలితపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వరద సాయం అందించడంలో జయలలిత విఫలమైందని అంటున్నారు.

వరంగల్ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కొండా మురళి

  ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్ నుంచి తెరాస అభ్యర్ధిగా మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పేరు ఖరారు అయింది. గత ఏడాది వైకాపాని వీడి తెరాసలో చేరినప్పటి నుంచి కొండా దంపతులను పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదనే తీవ్ర అసంతృప్తి ఉన్నారు. అందుకే పార్టీ వ్యవహారాలలో కూడా ఎక్కువ జోక్యం చేసుకోవడం లేదు. బహుశః అందుకే కొండా మురళికి అవకాశం కల్పించి ఉండవచ్చును. కొండా దంపతులకు వ్యక్తిగతంగా ఉన్న పలుకుబడికి తోడు, అధికార పార్టీకి చెంది ఉండటంతో కొండా మురళి చాలా తేలికగానే ఈ ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందని భావించవచ్చును.   తెలంగాణాలో మొత్తం 12 స్థానాలలో తెరాస పోటీకి దిగుతోంది. తెరాస తరపున రంగారెడ్డిలో రెండు స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, మహబూబ్‌నగర్‌లో రెండు స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీ సుంకిరెడ్డి జగదీశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీ చేయబోతున్నారు. కనుక ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలలో అన్ని పార్టీలలో క్రాస్ ఓటింగ్ జరగడం తధ్యంగా కనిపిస్తోంది. తెరాస ఎన్నికలలో గెలిచేందుకు ఫిరాయింపులని ప్రోత్సహిస్తూ, దౌర్జన్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెరాస దౌర్జన్యాలని ఎదుర్కొనే శక్తి తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు.

దయచేసి సచివాలయంలో ఉండండి.. కేసీఆర్ పై ఎర్రబెల్లి ఫైర్

  టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల బాణాలు వదిలారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని.. కరువు మండలాలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపలేదు..  కేసీఆర్ ఒంటెత్తు పోకడకు పోయారు అని విమర్శించారు. మండలానికో కోటి రూపాయలు ఇవ్వాలని.. ఉపాధిహామీ పని దినాలు పెంచాలని.. ఒకేసారి రుణమాఫీ చేయాలని కోరారు. అంతేకాదు దయచేసి సచివాలయంలో ఉండండి.. రైతలను ఆదుకోండి అని కేసీఆర్ కు సూచించారు. యాగాలకు కేటాయించే సమయంలో కొంచెం రైతులకోసం కేటాయించండి అని వ్యాఖ్యానించారు.

అయినా కోర్టుకు హాజరు కాని సోనియా, రాహుల్..

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు గాను ఇరువురు కోర్టు హాజరుకావాల్సి ఉంది. కానీ సోనియా గాంధీ, రాహుల్ ఇద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. దీనిపై స్పందించిన కోర్టు.. కోర్టుకు కచ్చితంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోర్టుకు హాజరు కావాలని కోర్టు చెప్పినా ఇద్దరూ హాజరుకాకపోవడం. అంతేకాదు కోర్టు ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజే రాహుల్ చెన్నై వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. మరోవైపు ఈ విషయంపై మీడియా సోనియాను పదేపదే అడుగగా ఈ విషయంలో ఏ విధంగాను స్పందిచబోనని 'మీరయితే ఎలాంటి న్యాయం చెప్తారో చెప్పండి' అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. మొత్తానికి కోర్టు ఆదేశాలను కూడా దిక్కరించిన సోనియా, రాహుల్ పై.. కోర్టు ఇంకెలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

కొత్త నియోజకవర్గాలు పెంపు ఇప్పట్లో లేనట్టే..

రాజకీయ పదవులు కోసం ఆశగా ఎదురుచూసే వాళ్లకి నిరాశే ఎదురైంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీ, తెలంగాణ రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో.. రాష్ట్రాల్లో కొత్త నియోజక వర్గాలు ఏర్పడుతాయని.. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందని పలువురు ఆశపడ్డారు కానీ అవేమి ఇప్పట్లో వర్కవుట్ అయ్యేలా పరిస్థితులు కనిపించడంలేదు. అయితే గతంలో కూడా ఇరు రాష్ట్రాల ఎంపీ లు కూడా కలిసి ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడారు కానీ..ఇప్పుడు అవన్నీ కుదిరే పరిస్థితులు లేవని కేంద్రం చెబుతుంది. ప్రసుత్తం.. ఏపీలో 175 - తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు  ఏపీలో 225 - తెలంగాణలో 150 సీట్లకు పెంచాలని కోరగా.. 2026 వరకూ నియోజక వర్గాలు పెంచడం కుదరదని..కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌధురి మంగళవారం పార్లమెంటులో చెప్పేశారు. దీంతో 2026 వరకూ నియోజకవర్గాల పెంపు సాధ్యమని తెలిసిపోయింది.

అజాంఖాన్ ను తిట్టి ఎంఐఎం ను పొగిడిన శివసేన..

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎవరి ప్రత్యేకత వారిది. అందులో శివసేనది ఒక స్టైల్ అయితే.. ఉత్తర ప్రదేశ్ మంత్రి అజాంఖాన్ ది మరో స్టైల్.. కానీ కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరికీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంటే చాలా ఇష్టం. అయితే ఈసారి మాత్రం శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అజాంఖాన్ తిడుతూ.. వేరే పార్టీని పొగిడారు. అందులో ఆశ్చర్యం ఏముందంటారా.. అయితే శివసేన పొగిడింది ఎవర్నో కాదు.. తాము ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే ఎంఐఎం పార్టీని.. అసలు సంగతేంటంటే.. అజాంఖాన్ తాజాగా పారిస్ లో దుర్మార్గుల బాంబు దాడిని బాబ్రీ మసీదు సంఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు ముస్లింలను రెచ్చగొట్టడం వల్లే పారీస్ ఘటన జరిగిందని.. బాబ్రీలో లేనిపోని విద్వంసం సృష్టించడం వల్లే ముంబైలో బాంబు దాడి జరిగిందని అన్నారు. అంతే అజంఖాన్ చేసిన వ్యాఖ్యలకు శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కంటే అజాంఖానే చాలా డేంజరస్ అని.. అజాంఖాన్ లాంటి వారు ఒక్కరుంటే చాలు ఇంక ఉగ్రవాదులు అవసరం లేదు.. ఆయనే పెద్ద ఉగ్రవాది అని మండిపడ్డారు. అంతేకాదు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ  ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడలేదని.. ఒవైసీ నుంచి అజాంఖాన్ పాఠాలు నేర్చుకోవాలని సూచించింది.

వైసీపీ నేతలకు నెహ్రూపై అంత ఇంట్రస్ట్ ఎందుకో.. ?

  వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆపార్టీ నేతలకే అర్దంకాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పార్టీలో ఉన్న కొంతమంది నేతల వల్ల పార్టీకి లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే నాయకుల కంటే.. వివాదాస్పద నాయకులే ఎక్కవ తయారయ్యారు వైకాపాలో.. దానికి తోడు ఇప్పుడు మరో నేతను పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. అయితే తీసుకొచ్చేది వేరే పార్టీలోని ఏబలమైన నేతనో అయితే పార్టీకి కాస్త బలంగా అన్న ఉండేది.. కానీ తాము తీసుకురావాలని చూసేది  మాజీ మంత్రి దేవినేని నెహ్రూని.. ప్రస్తుతం ఫేడవుట్ లో ఉన్న నెహ్రూనే పార్టీలోకి తీసుకురావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారంట. అయితే నెహ్రూ ఎంట్రీకి అభ్యంతరం చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారంట. అందులో మొదటి వ్యక్తి  వంగవీటి రాధా. నెహ్రూ కనుక పార్టీలోకి వస్తే తాము వెంటనే పార్టీ వీడతామని ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి రాధా చెప్పారంటా. వంగవీటి రాధా ఒక్క విషయమే కాదు.. ఒకవేళ నెహ్రూ కనుక వైసీపీ లోకి వస్తే  ఆయన సామాజిక వర్గంతో బలం చేకూరవచ్చు కానీ కాపు సామాజిక వర్గం నుండి వ్యతిరేకత వస్తుందని అనుకుంటున్నారు.. మొత్తానికి ఎంతోమంది బలమైన నాయకులు ఉండగా.. వైసీపీ మాత్రం నెహ్రూపై ఎందుకు ఇంట్రస్ట్ చూపుతుందో..

చంద్రయ్య కోసం కారు ఆపిన చంద్రబాబు..

ఒక్కొక్కసారి చిన్న విషయాలే కదా అని అవి పట్టించుకోం..కానీ వాటి వల్లే ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పుడు అలానే చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కూడా పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయలు దేరారు. అయితే ఆయన నివాసం బయట ఒక కార్యకర్త చంద్రబాబు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు కారు దిగి.. అతని దగ్గరికి వెళ్లారు. ఒక సాదాసీదా కార్యకర్త కోసం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కారు ఆపి వెనక్కి వస్తుండటంతో పార్టీ కార్యకర్త చంద్రయ్య పరుగున బాబు వద్దకు వెళ్లి.. ఆయన కాళ్లకు నమస్కారం పెట్టారు. చంద్రబాబు ఆయనతో మాట్లాడి.. ఏదైనా కష్టం ఉంటే చెప్పమని కోరి తిరిగి వెళ్లిపోయారు. దీంతో చంద్రయ్య చంద్రబాబే స్వయంగా వచ్చి మాట్లాడినందుకు ఆనందంతో పులకరించిపోయాడు. ఏది ఏమైనా కార్యకర్తలను ఆదరించడంలో చంద్రబాబు తరువాతే ఏవరైనా అని చెప్పవచ్చు.

కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటన.. 9 మందిపై ఎఫ్ఐఆర్

విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కృష్ణలంక పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బార్ లైసెన్సీ భాగవతుల శరత్ చంద్ర సహా రాజపురెడ్డి మాలకొండారెడ్డి, టి. వెంకటేశ్వరరావు, కావూరి పూర్ణచంద్ర శర్మ, కావూరి లక్ష్మీ, మల్లాది బాల త్రిపుర సుందరి, కాళిదాసు, వెంకటరమణ, సున్నా వెంకటేశ్వరరావు, మల్లాది విష్ణువుల పై ఎఫైఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఏపీ వ్యాప్తంగా పలు బార్లు మూతపడ్డాయి. పలు బ్రాండ్లపై ఏపీ ప్రభుత్వం నిషేదం విధించింది. ఎక్సైజ్ అధికారులు బార్లపై తనిఖీలు నిర్వహించి.. వాటి శాంపిళ్లను తీసుకున్నారు. వాటిని పరీక్షించిన తరువాతే తిరిగి బార్లను ప్రారంభించాలని ఆదేశించారు. 

పార్టీ మారే నేతలకు చంద్రబాబు ఆహ్వానం..!

  ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పార్టీ నేతల వలసల పర్వం నడుస్తోంది. తెలంగాణలో అధికారం టీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి మక్కువ చూపిస్తుంటే.. ఏపీలో టీడీపీలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే అటు కాంగ్రెస్.. వైసీపీ కాంగ్రెస్ నుండి నేతలు టీడీపీలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు వీరి రాకకు అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ పార్టీనుండి ఆదినారాయణరెడ్డి.. కొణతాల రామకృష్ణ టీడీపీలోకి చేరడానికి సిద్దమయ్యారు. వీరితో పాటు మాజీ కేంద్రమంత్రి.. కాంగ్రెస్ నాయకుడు సాయి ప్రతాప్ ను కూడా టీడీపీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారంట. అంతేకాదు ఓ కర్నూలు ఎంపీ.. నలుగురు శాసనసభ్యులు కూడా టీడీపీలోకి చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అయితే వీరందరి చేరికకు చంద్రబాబు పార్టీనేతలతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల నుండి నేతలను టీడీపీలోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కాని.. వైసీపీ లోకాని ముఖ్య నేతలెవరూ ఉండకుండా చూడాలని చంద్రబాబు వ్యూహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.