సినీ రచయిత సత్యమూర్తి కన్నుమూత

  ప్రముఖ సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి కన్నుమూశారు. సోమవారం తెల్లవారుఝామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో ఆయన ప్రాణాలు విడిచారు.ఆయన దాదాపు వంద చిత్రాలకు రచయితగా పనిచేశారు. ‘దేవత’, ‘చంటి’, ‘ఛాలెంజ్’, ‘భలేదొంగ’ వంటి సినిమాలకు సత్యమూర్తే రచయిత. తన కుమారుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా రాణించడానికి సత్యమూర్తి ప్రోత్సాహం ఎంతో వుంది. కొద్ది సంవత్సరాల క్రితం పక్షవాతానికి గురైన సత్యమూర్తిని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సత్యమూర్తి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. తన కుమారుడిని సినీ హీరోగా చూడాలన్నది సత్యమూర్తి కోరిక. ఆ కోరిక నెరవేరబోయే తరుణంలో సత్యమూర్తి కన్నుమూశారు.

సివిల్స్ పరీక్షను వాయిదా వేయండి

  ఈనెల 18 నుంచి 23 వరకు జరగనున్న యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. ఇటీవలి భారీ వరదలకు తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇప్పుడున్న పరిస్థితులలో తమిళనాడుకు చెందిన అనేక మంది విద్యార్థులు పరీక్షలు రాసే పరిస్థితిలో లేరని ఆమె తెలిపారు. ఈ పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేసి తమ రాష్ట్ర అభ్యర్థులకు సహకరించాని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

పెళ్ళి కాదు... రేప్!

  ఒక యువతిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన ఆ వ్యక్తి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అతను అక్కడ తన స్నేహితులతో కలసి ఆమె మీద సామూహిత అత్యాచారం జరిపాడు. ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ ప్రాంతానికి చెందిన ఒక యువతికి మీరట్‌కి చెందిన నకుల్ అనే వ్యక్తితో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆమెని పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రేమ మైకంలో వున్న ఆమె అతనితో కలసి డెహ్రాడూన్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళింది. ఆ ప్రదేశంలో పెళ్ళి చేసుకుందామని అతను చెప్పడంతో ఆమె అక్కడకి వెళ్ళింది. అక్కడే ఆమె ఊహించనిది జరిగింది. నకుల్ అతని ఇద్దరు స్నేహితులతో కలసి ఆ యువతి మీద సామూహిత అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితులు పరారీలో వున్నారు.

జీతాలు పెరగబోతున్నాయ్!

  గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు నిరంతరం పెరుగుతూనే వుంటాయి. మరి ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితేంటి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని పలు సర్వే సంస్థలు ఇస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగులకు వచ్చే ఏడాది భారీ స్థాయిలో పెరిగే అవకాశం వుందని సదరు సంస్థలు చెబుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో సగటున 10 నుంచి 30 శాతం వరకు జీతాలు పెరిగే ఛాన్సుందని సర్వేల సారాంశం. ప్రైవేటు ఉద్యోగుల జీతాలు పెంచాలని ఏడో వేతన సంఘం సూచించడంతోపాటు ఈ కామర్స్, మేక్ ఇన్ ఇండియా అంశాలు జీతాల పెరుగులకు కారణం కానున్నాయని సదరు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఉద్యోగాల్లో కొత్తవారిని చేర్చుకునే అంశం 2015 సంవత్సరంలో 10 శాతం పెరిగిందని, వచ్చే ఏడాది ఈ శాతం మరింత పెరిగే అవకాశం వుందని చెబుతున్నారు. అత్యుత్తమ పనితీరును ప్రదర్శించేవారికి గరిష్టంగా 30 శాతం వేతనాలు పెరిగే అవకాశం వుందట.

ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

  కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పొట్యాల వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆటోలో పెట్రోల్ తరలిస్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఆటోలోనిపెట్రోలు చెల్లాచెదురై మంటలు వ్యాపించాయి. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా వున్నారు. మృతులు బెల్లంపల్లి, సోమన్‌పల్లి, పొట్యాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

రేపిస్టుని లేపేసింది

  రేపిస్టులకి మరణ దండన విధించడం న్యాయమని చాలామంది అంటూ వుంటారు. అందుకేనేమో తనను రేప్ చేసిన వ్యక్తిని కోర్టు వరకూ తీసుకెళ్ళడం ఎందుకులే అనుకుందా మహిళ... తనను రేప్ చేసిన వ్యక్తిని తానే చంపేసింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగింది. రాంచీలో నివసించే ఒక ఒంటరి మహిళ మీద మనోజ్ కుమార్ అనే కాముకుడు కన్నేశాడు. ఆమెని లోబరుచుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఆమె లొంగకపోవడంతో ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణానికి గురైన ఆ మహిళ ఏడుస్తూ కూర్చోలేదు. అక్కడే వున్న సుత్తిని తీసుకుని మనోజ్ కుమార్ తలమీద కొట్టింది. దాంతో ఆ కాముకుడు అక్కడికక్కడే మరణించాడు.

చెన్నై కి పారిస్ సాయం..

చెన్నైలో భారీ వర్షాల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల కారణంగా అతలాకుతలమైన చెన్నైని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్రాలు కూడా తమవంతు సాయం అందిస్తున్నాయి. ఇప్పుడు ఒక్క రాష్ట్రంలే కాదు దేశాలు సైతం ముందుకొస్తున్నాయి. ఒకపక్క ఉగ్రవాదుల దాడి జరిగి.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి.. ఇప్పటికీ ఆ భయం నుండి ప్రజలు భయటకి రాకముందే చెన్నైకి సాయం చేయడానికి పారిస్ ముందుకొచ్చింది. ఎక్కడో ఉన్నో చెన్నైకి పారిస్ సాయం అందిచడమేంటి అనుకుంటున్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. చెన్నై వాసులను ఆదుకోవడానికి వారు ఆన్ లైన్ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. షేర్ ఫర్ చెన్నై పేరిట విరాళాలు సేకరిస్తున్నారట. అంతేకాదు చెన్నై వాసులకు పారిస్ వాళ్లు భోజనం కూడా త్యాగం చేస్తున్నారట.

రెండు రోజుల్లో చెబుతా.. విజయరామరావు

టీడీపీ మాజీ మంత్రి విజయరామారావు నిన్న టీడీపీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఫ్యాక్స్ ద్వారా విజయరామారావు తన రాజీనామా పత్రాన్ని టీడీపీ నేతలకు అందజేశారు. అయితే ఇప్పుడు విజయరామారావు పార్టీ మారుతారా లేదా అన్నదానిపై సందేహాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి విజయరామారావు మాట్లాడుతూ.. నిన్ననే టీడీపీకి రాజీనామాచేశాను.. టీఆర్ఎస్ లో చేరమని నన్ను ఆహ్వానించారని.. టీఆర్ఎస్ లో చేరేది లేనిది  రెండు రోజుల్లో చెబుతానని చెప్పారు. అయితే మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు విజయరామారావుకి ఫోన్ చేశారని.. పార్టీ మార్పుపై ఆలోచించుకోవాలని చెప్పినట్టు దీంతో విజయరామారావు సందిగ్ధంలో పడినట్టు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి రెండు రోజుల తరువాత విజయరామారావు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

నా భార్యనే నన్ను కామెంట్ చేస్తుంది.. వెంకయ్య

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పంచ్ డైలాగ్లు వేయడంలో దిట్ట. ప్రతిపక్షాలపై.. విమర్శలు చేయాలన్నా.. వాళ్లపై పంచ్ డైలాగ్స్ వేయాలన్నా ఆయనకు ఆయనే సాటి. అలాంటి ఆయనపై ఆమె భార్యనే పంచ్ డైలాగ్స్ వేసిందట. సాదారణంగా రాజకీయ నాయకులకు కుటుంబసభులతో కలిసి గడిపే సమయం ఉండదు.. ఇక కేంద్రమంత్రులకైతే చెప్పక్కర్లేదు.. అందునా నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న రాజకీయ ఉద్దండుడు వెంకయ్య.. మరి అలాంటి వెంకయ్యకు ఇంటికి వెళ్లే తీరిక ఉంటుందా.. ఎప్పుడో ఒకసారి కాని వెళ్లే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే వెంకయ్యపై ఆమె భార్య పంచ్ డైలాగ్ వేసిందట. ఈ విషయాన్ని స్వయంగా వెంకయ్యనే తెలిపారు. నరసారావుపేటలో జరుగుతున్న మున్సిపాలిటీ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కన్నతల్లిని మాతృభాషను, జన్మనిచ్చిన ఊరును మరచినవాడు మనిషే కాదని తాను నమ్ముతానని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కానీ రాజకీయ నాయకుడిగా ఉన్న కారణంగా దేశం మొత్తం తిరగాల్సి ఉంటుంది.. అందుకే ఇంటికి కూడా సరిగా వెళ్లలేని పరిస్థితి.. నా భార్య కూడా `అప్పడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారని అంటుంటుంద`ని చెప్పారు.

టీఆర్ఎస్ పై ఎర్రబెల్లి ఫైర్.. సంతలో పశువుల్ని కొన్నట్టు కొంటున్నారు..

టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ నేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ను అడ్డంపెట్టుకొని నేతలను సంతలో పశువులను కొంటున్నట్టు కొంటున్నారని విమర్శించారు. అంతేకాదు మంత్రులే బ్రోకర్ లా మారి నేతలను పార్టీల్లోకి లాక్కుంటున్నారని ఎద్దేవ చేశారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను సైతం కేసీఆర్ కొన్నారని.. అందుకే  వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుంది.. అని వ్యాఖ్యానించారు. అంతేకాదు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి.. అందుకే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటూ హడావుడి చేస్తున్నారని అన్నారు. కాగా స్థానిక సంస్ధల ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో టీడీపీ అభ్యర్ధులు బరిలోకి దిగుతున్నారని ఆయన చెప్పారు. మరోవైపు మాజీ మంత్రి విజయరామారావు నిన్న టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే చంద్రబాబే స్వయంగా విజయరామారావుకి ఫోన్ చేసి పార్టీ మార్పుపై ఇంకోసారి ఆలోచించుకోమని.. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పడంతో విజయరావారావు సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఇప్పుడు విజయరామారావు టీడీపీలోనే కొనసాగుతారని చెప్పారు. కానీ అధికారికంగా తెలియాల్సి ఉంది.

విజయరామారావుకి చంద్రబాబు ఫోన్..సందిగ్ధంలో విజయరామారావు..

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే చాలామంది ఆపార్టీలోకి చేరారు. ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేత విజయరామారావు  కూడా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు పడిపోయాడని.. టీఆర్ఎస్ లో చేరుతున్నారని.. కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి గులాబి కుండువా కప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే నిన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే విజయరామారావు పార్టీకి రాజీనామాచేయడంతో.. పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. చంద్రబాబే స్వయంగా విజయరామారావుకి ఫోన్ చేసి పార్టీ మారే విషయంలో ఆలోచించుకోమని.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచించారట. ఇక చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి చెప్పేసరికి విజయరామారావు కూడా సందిగ్దంలో పడిపోయారంట.

12 ఎమ్మెల్సీ స్థానాలు.. 6 కైవసం చేసుకున్న టీఆర్ఎస్

తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండురోజులకు గాను నాలుగు ఎమ్మెల్సీ స్ఠానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్. ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలను సైతం తన ఖాతాలో వేసుకుంది. కరీంనగర్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు వేసిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ ఈ స్థానాలను సొంతం చేసుకుంది. కాగా ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పురాణం సతీష్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి భూపాల్ రెడ్డి, వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి గాను కొండా మురళీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం కూడా సొంతం చేసుకున్నారు. మొత్తానికి 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుని ప్రతిపక్షాలకు చెమటలు పటిస్తుంది. ఇక మిగిలిన ఆరు స్థానాల్లో ఎన్ని టీఆర్ఎస్ కి వస్తాయో.. ఎన్ని ప్రతిపక్ష పార్టీలకు వెళతాయో చూడాలి.