కేసీఆర్ విజయవాడ షెడ్యూల్.. స్వకార్యం.. స్వామికార్యం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి విజయవాడలో అడుగుపెట్టనున్నారు. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశం నేపథ్యంలో ఆయన విజయవాడ రానున్నారు. మొదట ఈ సమావేశానికి రావాలా.. వద్దా అని ఆలోచించిన కేసీఆర్.. సీఎంల కమిటీకి వైస్ చైర్మన్ హోదాలో ఉన్నందున వెళ్లాలని డిసైడయ్యారు. అయితే కేసీఆర్ విజయవాడకు రావడం వల్ల ఈ సమావేశానికి మాత్రమే కాదు తన వ్యక్తిగత పనులకు కూడా ఉపయోగపడుతుందని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారంట. విజయవాడ వచ్చి మొదట సమావేశంలో పాల్గొని ఆతరువాత.. తను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి చంద్రబాబు ను ఆహ్వానించడం.. అనంతరం తెలంగాణ రాష్ర్టం సిద్ధిస్తే చెల్లించుకుంటానన్న మొక్కులను చెల్లించుకోవడం.. తదితర స్వకార్యాలకు టూర్ ఫిక్స్ చేసుకున్నారు. మొత్తానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న నేపథ్యంలో.. ఒకే టూర్లో తన స్వకార్యాలు.. స్వామికార్యాలు పూర్తి చేసుకోనున్నారు.

నరసారావు పేట చిన్నదే.. మనసు పెద్దది.. వెంకయ్య

నరసారావు పేట మున్సిపాలిటీ శతాబ్ధి ఉత్సవాలు రెండో రోజు వైభజంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్ కోడెల, ఎంపీ రాయపాటి, మంత్రి కామినేని. ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు.. రైల్వే అండర్ బ్రిడ్జ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. వెంకయ్య మాట్లాడుతూ పల్నాటి పౌరుషానికి నరసారావుపేట ప్రతీక అని.. స్వాతంత్రోద్యమంలో నరసారావుది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. నరసారావు పేట చిన్నదే.. కాని మనసు పెద్దదని.. గొప్ప సంస్కృతి.. సంప్రదాయాలు ఉన్న నగరం నరసారావు పేట అని కొనియాడారు.

చంద్రబాబుపై నోరు జారిన ఈశ్వరి.. అరెస్ట కు రంగం సిద్దం..

విశాఖ ఏజెన్నీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా జగన్ ఆధ్వర్యంలో చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఎప్పటిలాగానే జగన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శల బాణాలు వదిలారు. అయితే ఇదే సభకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా హాజరయ్యారు. ఇక తన వంతు రాగానే మాట్లాడతూ.. అధికార పార్టీపై విమర్శలకు దిగారు.. కానీ అక్కడితో ఆగకుండా ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును పట్టుకొని.. బాక్సైట్ తవ్వకాలకు అంటూ వస్తే మాత్రం చంద్రబాబు తల నరుకుతూ.. బాణాలతో చంపుతా అంటూ నోరు జారింది. అంతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును అలా అంటుందా అని టీడీపీ నేతలు ఆమెపై మండిపడుతున్నారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. మధ్యాహ్నానికి ఈశ్వరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అలా సంబోదించడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చెన్నై.. మళ్లీ రిపీట్ అవుద్దీ..ఐకాస

ఇప్పటికే భారీ వర్షాల కారణంగా చెన్నై కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత వందేళ్లలో ఎప్పుడు లేని విధంగా సగటున 50 సెం.మీ వర్షంతో చెన్నై రికార్డు సృష్టించింది. అయితే మళ్లీ ఇలాంటి వర్షాలు తప్పవని హెచ్చరిస్తుంది ఐక్యరాజ్యసమితి. ఈ వర్షాలకు కారణం ఎల్ నినో అని.. దీంతో రానున్న రోజుల్లో చెన్నైలో మళ్లీ రావడం ఖాయమని.. ఒక్క చెన్నైలోనే కాకుండా.. ఇండోనేషియా.. కొలంబియా.. ఫిలిప్పీన్.. థాయ్ లాండ్ పై ఎల్ నినో ప్రబావం భారీగా ఉందని.. దీనివల్ల ఆప్రాంతాల్లో కూడా వరదలు ఖాయమని హెచ్చరిస్తోంది. అంతేకాదు శ్రీలంకలో కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో చెన్నైకి మళ్లీ కష్టాలు తప్పవని తెలుస్తోంది. అలా కాకుండా ఉండాలంటే ఇప్పటినుండే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

కాసేపట్లో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం..

విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల నుండి ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణ నుండి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ హాజరయ్యారు. కాగా పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, కొత్తపన్నుల విధానం, పర్యాటకం, నక్సలిజం వంటి వాటిపై ప్రధాన చర్చ జరగనుంది. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ మొదటి సారి అమరావతికి రావడం చాలా సంతోషంగా ఉందని..రాష్ట్రాలు విడిపోయినా ప్రజలంతా కలిసి ఉండాలని అన్నారు. అంతేకాదు సమావేశంలో రాష్ట్రాల సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. మా రాష్ట్రాల సమస్యలు గురించి లేవనెత్తుతాం.. అన్ని రాష్ట్రాలను కలుపుకొని సమస్యల పరిష్కారానికి కృషిం చేస్తామని అన్నారు.

పోలవరం ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్.. చోద్యం చూస్తున్నారా..?

ఏపీ సీఎం చంద్రబాబు పనిలో నిర్లక్ష్యం చూపిస్తే అస్సలు సహించరు.. వారిపై సీరియస్ గా క్లాస్ తీసుకుంటారని ఇప్పటికే చాలాసార్లు చూశాం. ఇప్పుడు తాజాగా పోలవరం ఎమ్మెల్యే కూడా చంద్రబాబుతో క్లాస్ పీకించుకున్నారు. చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నపోలవరం ప్రాజెక్టు పురోగతి పనుల్లో ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు సరిగా ఆసక్తి చూపించడం లేదని.. ముంపు ప్రాంతాల గ్రామాలను ప్రజలను ఒప్పించడంలో ఎలాంటి చొరవ చూపించడంలేదని పార్టీ నేతలే చంద్రబాబుకు ఫిర్యాదు చేశారంట. మరోవైపు వైసీపీ నేతలు ముంపు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతుంటే.. శ్రీనివాసరావు మాత్రం ఏం పట్టనట్టు చోద్యం చూస్తున్నారని చంద్రబాబుకు చెప్పారంట. దీంతో చంద్రబాబు శ్రీనివాసరావును దీంతో… మనం ప్రభుత్వం ప్రతిప్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు పురోగతిలో నీ పాత్ర ఎందుకు ఉండటం లేదని టీడీపీ అధినేత పోలవరం ఎమ్మెల్యేకు ఫుల్లుగా క్లాస్ తీసుకున్నారట. ఇప్పటికీ నాలుగు గ్రామాల ప్రజలు ఖాళీ చేశారు.. ఇంకా మూడు గ్రామాల ప్రజలు ఖాళీ చేయాలి.. వాళ్లకు నచ్చజెప్పి వేరే ఊళ్లకు పంపే బాధ్యత నీదే అని ఆదేశించారంట. అలా చేయకపోతే రాజకీయ భవిష్యత్ కు ఇబ్బందులుంటాయని హెచ్చరించారట. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే సీరియస్ గా  పని చేస్తారో లేదో చూడాలి. 

జనవరి 23న జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు

  జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు ముహూర్తం ఖరారు అయింది. వచ్చే నెల 23వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నారు. జంట నగరాలలో నివసిస్తున్న ఆంధ్రా ప్రజలు చాలామంది సంక్రాంతి పండుగకు తమ తమ స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారు. అలాగే కొన్ని వేల మంది శబరిమలై వెళ్లివస్తుంటారు. వారందరూ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వీలుగా జనవరి 23న ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఎన్నికల కోసం జనవరి 7వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.   జి.హెచ్.ఎం.సి. పరిధిలో గల 150 వార్డులలో రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తి అవడంతో తెలంగాణా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 150 సీట్లలో జనరల్-44, అన్-రిజర్వుడ్-44, బీసీలకు- 50, ఎస్టీలకు-2, ఎస్సీలకు-10 సీట్లను కేటాయించింది. అన్ని కోటాలలో సగం సీట్లు మహిళకు రిజర్వు చేసారు. అంటే ఈసారి జి.హెచ్.ఎం.సి. బోర్డులో సగం మంది మహిళలు ఉంటారన్న మాట.

జగన్ ఆలోచించి మాట్లాడితే మంచిది.. డొక్కా

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తాను కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యపానం నిషేదం విధిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు అందరూ విమర్శల బాణాలు వదులుతున్నారు. ఇప్పటికే చాలామంది సొంత పార్టీలోకి లిక్కర్ బిజినెస్ చేసే వాళ్లను పెట్టుకొని జగన్ ఇలా వ్యాఖ్యానించడం చాలా హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా జగన్ పై మండిపడ్డారు. ఏపీ లో మద్యం నిషేదిస్తానని జగన్ మాట్లాడిన మాటలు అవగాహన లేకుండా మాట్లాడినట్టు ఉందని అన్నారు. గతంలో మద్యం నిషేదిస్తే ఎలాంటి పరిణామాలు జరిగాయో అవన్నీ తెలుసుకొని మాట్లాడాలని.. ఏపీలో మద్యపాన నిషేదం అంతా ఈజీ కాదని అన్నారు. అందునా దొంగ చాటుగా మందు సరఫరా చేసే ముఠాలు పెరిగిపోయాయి.. జనాలు కూడా నిషేదం విధించారు కదా అని తాగకుండా మానుకోవడంలేదు.. వంద కిలోమీటర్లు దూరం ఉన్నా వెళ్లి మరీ తాగి వస్తారని ఎద్దేవ చేశారు. జగన్ అన్నీ తెలుసుకొని మాట్లాడితే మంచిదని.. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మంచిది కాదని విమర్శించారు.

టీ కాంగ్రెస్ నేతలు దానంకు చెక్ పెడుతున్నారా?

దానం నాగేందర్ పార్టీ మార్పుపై హై డ్రామానే జరిగిందని చెప్పాలి. తాను పార్టీ మారట్లేదు అని చెపుతూనే.. చీకటిలో టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరపడం.. ఆఖరికి తను ఆశించింది రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదు అని చెప్పడం.. ఇవన్నీ దానం ఎత్తుగడలను చూపించాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు దానం కు చెక్ పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ ను రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు రెండు రోజుల క్రితమే ముఖేష్ గౌడ్ తో మాట్లాడారంట. అయితే ముఖేష్ కు నగర కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారా? లేక పీసీసీలో మరేవైనా బాధ్యతలు అప్పగిస్తారా అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కాగా ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2014 ఎన్నికల్లో ప్రస్తుతం గోషమహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ పై పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో దేనిలో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు దానం ఎఫెక్ట్ తో కాంగ్రెస్ ముఖేష్ గౌడ్ ను తెరపైకి తెచ్చింది. దీంతో మళ్లీ ముఖేష్ గౌడ్ పార్టీలో క్రియాశీలకం కానున్నారు. ఒకవేళ ముఖేష్ గౌడ్ కు నగర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే... దానం నాగేందర్ కు ఏఐసీసీ లేదా పీసీసీ కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ముందే మేల్కొని.. దానం ఎప్పుడైనా పార్టీకి ఝలక్ ఇవ్వొచ్చని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి..

పార్టీ ఫిరాయింపులపై సుప్రీం.. రెండు నెలలు ఆగండి..

పార్టీ ఫిరాయింపులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్బంగా 14 నెలలవుతున్న పార్టీ ఫిరాయించిన వాళ్లపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. పార్టీ ఫిరాయింటిన వాళ్లపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు నెలలు పైన అయిపోతుంది.. కానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ తరుపు న్యాయవాది సుప్రీంకు తమ వాదనలు వినిపించారు. దీంతో సుప్రీం.. ఇది స్పీకర్ పరిధిలో ఉన్నందు వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేమని.. తమ పరిధిలో లేనందువల్ల విచారించలేమని తెలిపింది. అంతేకాదు రెండు నెలల లోపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే తాము పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు నెలల తరువాత తలసాని పరిస్థితి ఏంటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సుప్రీం కోర్టు రెండు నెలలు గడువు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ రెండు నెలల్లో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సుప్రీం యాక్షన్ తీసుకుంటుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికైనా స్పీకర్ గారు మేల్కొని ఎదో ఒక చర్య తీసుకుంటారో లేదో చూడాలి.

విజయవాడ కల్తీ మందు.. అవును మత్తు కోసం కలిపాం..!

విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మందు కేసులో కీలక సమాచారం అందినట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న మల్లాది విష్ణు సోదురుడు.. మల్లాది శ్రీనివాస్ కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మత్తు కోసం తెల్లటి పదార్థాన్ని మందులో కలిపి క్యాషియర్ వెంకటేశ్వరరావు విక్రయించాడని శ్రీనివాస్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసుల క్యాషియర్ ను ప్రశ్నించగా.. మందులో స్పరిట్ కలిపామని అంగీకరించాడు. అయితే ఈకేసులో నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తొమ్మిది బ్రాండ్లకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు శాంపిళ్లు తీసుకోగా.. దానిని సంబంధించి చేసిన పరీక్షల్లో ఈ తొమ్మిది బ్రాండ్లలో ఎలాంటి కల్తీ జరగలేదని.. స్వర్ణా బార్ లోన్ కల్తీ జరిగిందని నిర్ధారించారు. అంతేకాదు మత్తు కోసం చాలా పవర్ ఉన్న మందును వాడినట్టు అధికారులు తెలుపుతున్నారు. కాగా స్వర్ణబార్ లో కల్తీ మందు తాగి 6 గురు చనిపోగా పలువురు ఆస్వస్థకు గురైన సంగతి తెలిసిందే.

ఆర్టీవోలపై నితిన్ ఫైర్.. బందిపోటులను మించిపోయారు..

రవాణాశాఖాధికారులను బందిపోటులతో పోలుస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మీద ఉన్న శాఖలన్నింటిలో అత్యంత అవినీతి జరిగేది రవాణా శాఖలోనే అని.. ఆర్టీవో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన రవాణాశాఖాధికారులు బందిపోటులను మించిపోయారని మండిపడ్డారు. అంతేకాదు దేశంలో డ్రైవింగ్ లైసెన్సు లు రావడం చాలా తేలికైపోయిందని.. మోటరు వాహనాల నూతన చట్టం ద్వారా రవాణా శాఖలో నూతన సంస్కరణలు తీసుకురావచ్చు కానీ.. ఆర్టీవో అధికారులు ఆచట్టం అమలు కాకుండా ఉండేందుకు మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. ప్రస్తుతం నితిన్.. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ, నౌకాయాన మంత్రిగా ఉన్నారు.

టీఆర్ఎస్ ఖాతాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు

తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్ఠానాలకు గాను పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో అప్పుడే మూడు ఎమ్మెల్సీ  స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. దీనిలో నిన్న టీఆర్ఎస్ పార్టీ ఒకటి బోణి కొట్టింది. వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి గాను కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు రెండు స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.  ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పురాణం సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి నారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్ధి రియాజ్ తప్పుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతేకాదు నారాయణరెడ్డి టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు మెదక్ ఎమ్మెల్సీ స్థానం కూడా టీఆర్ఎస్ ఖాతాలో చేరింది. మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి భూపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రణబ్ కు మోడీ విషెస్.. ప్రణబ్ వెలకట్టలేని సంపద..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఆయురారోగ్యాలతో ఉండాలని.. ఆయన మన దేశానికి వెలకట్టలేని సంపద అని.. వివేకం.. మేధస్సు సమపాళ్లు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అంతేకాదు.. ప్రణబ్ గౌరవప్రదమైన నాయకుడని, ఆయన దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని.. ఈ సందర్భంగా 'ప్రెసిడెంటల్ రీట్రేట్స్' పుస్తకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

నారా లోకేశ్ చెప్పిన దొంగబ్బాయి జగనా..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పుడు విమర్శలు చేయడంలో జోరు పెంచారు. ఒకప్పుడు అంతగా మాట్లాడని లోకేశ్ ఇప్పుడు మాత్రం ప్రతిపక్షనేత అయిన జగన్ పై మాత్రం వ్యంగ్యాస్త్రాలు చేస్తూ జోరు పెంచాడు. చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరులో జ‌రిగిన జ‌న చైతన్యయాత్ర‌లో పాల్గొన్న లోకేశ్ మాట్లాడుతూ దొంగబ్బాయి.. దొంగబ్బాయి అంటూ జగన్ పేరు చెప్పకుండానే జగన్ పై అవాకులు.. చవాకులు పేల్చారు. `మ‌న దుర‌దృష్టం కొద్దీ మాయ‌మాట‌లు చెప్పే దొంగ‌బ్బాయి ఇక్క‌డ ఉన్నాడు. అత‌డితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అతను చెప్పే మాట‌లు న‌మ్మొద్దు` అని ప్ర‌జ‌ల‌కు లోకేష్ సూచించారు. అంతేకాదు పట్టిసీమ ప్రాజెక్టు గురించి కూడా తప్పుడు సమాచారం చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు.. గోదావ‌రి జ‌లాల‌న్నింటినీ రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లిస్తున్నార‌ని అక్క‌డి ప్ర‌జ‌ల‌కు చెప్పాడు.. మ‌ళ్లీ రాయ‌ల‌సీమకు వ‌చ్చి ప‌ట్టిసీమ నుంచి ఒక్క‌చుక్క కూడా మ‌న‌కు రాద‌ని చెప్పాడు.. ఇవి మాయ‌మాట‌లు కాదా? ` అని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. అంతటితో ఆగకుండా ` మీ నాన్న ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎవ‌రైనా రాయ‌ల‌సీమలో పెట్టుబ‌డులుపెట్టేందుకు ముందుకు వ‌చ్చారా? ఒక్క ప్రాజెక్టు అయినా రాయ‌ల‌సీమకు వ‌చ్చిందా?` అని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. మొత్తానికి లోకేశ్ చిన్న చిన్నగా బలమైన నాయకుడిగా ఎదుగుతున్నట్టు కనిపిస్తుంది.