ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు?

వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవికాలం వచ్చే ఏడాది జూన్ నాటికి ముగుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆతరువాత వెంకయ్య ఏం చేస్తారు అన్నది అందరి సందేహం. అయితే బీజేపీ నియమాల ప్రకారం ఒక వ్యక్తి మూడుసార్లు రాజ్యసభ సభ్యత్వం పొందిన తరువాత.. ఆవ్యక్తికి ఇక ఆ పదవి నుండి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో వెంకయ్యకు రాజ్యసభనుండి పోటీ చేసే అవకాశం లేదు. పార్టీ  నియామాలను పాటించడంలో బీజేపీకి మంచి గుర్తింపు ఉంది. అయితే వెంకయ్య నాయుడి లాంటి నాయకుడికి మాత్రం దానికి మినహాంపు ఉండే అవకాశం ఉంటుందేమో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు వెంకయ్యనాయుడు కోసం తమ నియామాన్ని పక్కన పెడుతుందన్న నమ్మకం చాలామందిలో కనిపించడం లేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలా అయితే వెంకయ్య లోక్ సభ నుండి పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ వెంకయ్య మాత్రం దానికి సముఖత చూపడం లేదు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యను ఎన్నికల్లో నిలపాలని మోడీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తన గడువు ముగిసిన తరువాత ఓ ఆరు నెలలు వెంకయ్యను మంత్రిగా కొనసాగించి.. ఆతరువాత 2017 లో జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యను నిలిపి ఆ పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారంట. మొత్తానికి వెంకయ్యను మాత్రం మోడీ వదులుకునే స్థితిలో లేరు. ఆయనను లోక్ సభ లేదా.. రాజ్యసభ సభ్యుడిగా లేదా.. అదికాని పక్షంలో ఉపరాష్ట్రపతిగా చేయాలని మోడీ చూస్తున్నారు. మరి వెంకయ్యకు ఏపదవి వరించబోతుందా చూడాలి.

చెన్నై వర్షంపై దేవుడు, సెలబ్రిటీల మీద వర్మ కామెంట్లు..

వివాదాస్పద వ్యాఖ్యల బ్రాండ్ అంబాసిడర్ రాంగోపాల్ వర్మ ఇప్పుడు చెన్నె వర్షాల మీద కూడా తన దైన శైలిలో విమర్శలు చేశారు. గత వందేళ్లలో ఎప్పుడూ చూడని విధంగా చెన్నెని వర్షపాతం కమ్ముకుంది. వరద నీటితో చెన్నై మొత్తం మునిగిపోయింది. దీంతో కష్టాల్లో ఉన్న చెన్నె వాసులకు ఎవరికి తోచిన విధంగా వారు ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాంటి వారిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు దేవుడి పై కూడా విమర్శలు చేశాడు. చెన్నైలో వర్షాలు కురిసేది దేవుడి వల్లే అని.. అలాంటి దేవుడిని విమర్శిచాలి అంతే కాని.. ప్రార్ధించకూడదు అని అన్నాడు. అంతేకాదు చెన్నై ప్రజలను చూసి చాలా బాధపడుతున్నాను.. అదేవిధంగా దేవుడి మీద కోపంగా కూడా ఉన్నాను అని ట్వీటాడు. అంతేకాదు చెన్నె వాసులకు సెలబ్రిటీలు విరాళాలు ఇవ్వగా దానిని ఉద్దేశించి.. కోట్లు కోట్లు కూడబెట్టిన సూపర్ స్టార్లు.. లక్షలు దానం చేసి బిచ్చమేశారని.. అంతకంటే వారు ఇవ్వకపోయినా బాగుండేదని అన్నారు. వారు ఇచ్చిన డబ్బుతో చెన్నైవాసులకు ఏం చేయాలో అర్ధంకావడం లేదని విమర్శించాడు.. ఇక దానం చేసే విషయంలో పనిలో పనిగా తన గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు రాంగోపాల్ వర్మ.. నేనెప్పుడూ ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. నేను చాలా స్వార్థపరుడిని అని సెలబ్రిటీలలా క్వింటాళ్ల కొద్దీ ప్రార్థనలు, టన్నులకొద్దీ ప్రేమ కురిపించలేను అని అన్నారు.

చెన్నై.. మళ్లీ కుండపోత తప్పదు..

గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై వరద నీటితో నిండిపోయింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలనుండి కూడా సహాయక చర్యలు అందిస్తున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతంలో త్రివిధ దళాలు సహాయచర్యలు ముమ్మరం చేశాయి. చెన్నైలో ఉన్న 7 నదుల్లో 27 జలాశయాల్లో వరద ఉదృతి తీవ్రంగా పెరిగిపోయింది. చెన్నై సహా 13 జిలాల్లో వరద బీభత్సానికి 269 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా చెన్నైలో మళ్లీ కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో ప్రజలు ఇంకా ఆందోళనలు చెందుతున్నారు. కాగా భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నైని ప్రధాన మంత్రి మోడీ పరిశీలించి.. తక్షణ సాయం కింద రూ 1000 కోట్లు సాయం అందిస్తామని తెలిపారు.

ముఖ్య అనుచరులతో దానం భేటీ..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ లోకి చేరడంతో తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. అయితే ప్రభాకర్ చేరిక పక్కన పెడితే ఇప్పుడు అందరి దృష్టి మాత్రం దానం నాగేందర్ పైన పడింది. దానంకు సన్నిహితుడిగా పేరు పొందిన ప్రభాకర్ టీఆర్ఎస్ లోకి చేరడంతో ఇప్పుడు దానం కూడా టీఆర్ఎస్ గూటికి చేరుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దానం తన ముఖ్య అనుచరులతో కలిసి తన నివాసంలో భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడతారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తన పార్టీ మార్పుపై.. భవిష్యత్ కార్యాచరణపై దానం చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ భేటిలో దానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

టీఆర్ఎస్ లోకి సాయన్న.. కేసీఆర్ పై చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉండేవారో అందరికి తెలిసిన విషయమే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదేమో అన్న పరిస్థితి ఉండేది. ఏదో ఒక వివాదం గురించి ఇద్దరూ ఎప్పుడూ ఆరోపించుకోవడమే సరిపోయేది. వీరి మధ్యలో గవర్నర్ కూడా కొంత కాలం నలిగిపోయారు. అయితే ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం పుణ్యమా అని వారిద్దరి మధ్య ఉన్నవిబేధాలు చాలా వరకూ తగ్గాయి. ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవడం తగ్గిపోయింది. అందుకు వరంగల్ ఉపఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అన్ని పార్టీలను తన మాటలతో ఏకిపారేశారు కానీ చంద్రబాబుపై ఒక్క విమర్శకూడా చేయకపోవడం నిదర్శనం. ఇక చంద్రబాబు కూడా కేసీఆర్ గురించి ఎక్కడా విమర్శించేలా మాట్లాడటం లేదు. అయితే ఇప్పుడు జరిగిన తాజా పరిణామాలు చూస్తుంటే ఇద్దరు సీఎంలు ఇంతకుముందు ఉన్నట్టే ఉంటారా.. లేక పాత ధోరణిలోకే వస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణలో స్థానిక, గ్రేటర్ ఎన్నికలు షురూ అయిన వేళ టీఆర్ఎస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. అప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్నను తమ పార్టీలోకి చేర్చుకుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు అని అందరి సందేహం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇద్దరు సీఎంల మధ్య స్నేహ బంధం ఏర్పడుతుంది. మరి ఇలాంటి తరుణంలో ఎప్పటి నుండో టీడీపీని అంటిపెట్టుకున్న సాయన్నను తన పార్టీలోకి చేర్చుకున్న కేసీఆర్ పట్ల చంద్రబాబు ఇప్పుడు ఎలా ఉంటారో అని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. సాయన్న చేరికతో ఇద్దరిమధ్య మళ్లీ విబేధాలు తలెత్తుతాయేమో అని అనుకుంటున్నారు. లేకపోతే అవేమి పట్టించుకోకుండా ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారేమో అని అనుకునే వారు కూడా ఉన్నారు. మరి అందరి సందేహాలు తీరాలంటే ఈ విషయంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

టీఆర్ఎస్ లోకి రాజాసింగ్..?

తెలంగాణలో బీజేపీలో ఉన్న విబేధాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. గోషమహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్, ఆపార్టీ ఆధ్యక్షుడు కిషన్ రెడ్డిపై విమర్శలు చేయడం.. కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షపదవి నుండి తొలగించాలి అని ఆరోపిండం.. కిషన్ రెడ్డి వల్లే పార్టీ ఎదగడంలేదు అని అనడంతో.. ఈ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అయితే ఇప్పుడు రాజాసింగ్ చేసిన ఆరోపణలు గురించి బీజేపీ పెద్దలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే..టీఆర్‌ఎస్ నేతలతో సంప్రదింపులు జరిగిన తర్వాతే.. కిష‌న్‌పై ఆయ‌న బహిరంగ విమర్శలకు దిగారని ఓ అంచనాకొచ్చారు. ఎందుకంటే గ్రేటర్, స్థానిక ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్నను తన పార్టీలోకి చేరేవిధంగా చేసింది. అయితే వీరిద్దరు చేరడానికి ఒక రెండు రోజుల ముందే రాజాసింగ్ కిషన్ రెడ్డిపై పడ్డారని.. అంటే వారితో మంతనాలు జరిపిన తరువాతే కిషన్ రెడ్డిని బహిరంగంగా విమర్శించారని పార్టీ నేతలు అనుకుంటున్నారు. దీంతో రాజాసింగ్ టీఆర్ఎస్ పార్టీలోకి వెళతారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు? బరిలో పురుంధరేశ్వరీ?

ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం విశాఖ ఎంపీ హరిబాబు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్థానంలో మరో నేత రానున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నఎంపీ హరిబాబు తనకున్న పని ఒత్తిడి కారణంగా ఆ స్థానంలో మరెవరినైనా నియమించాలని బీజేపీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఈ నెల రెండోవారంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ అధ్యక్ష పదవి నియామకంలో ముఖ్యంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి. అవి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ తోపాటు ఎమ్మెల్సీ వీర్రాజు.. ఈ ముగ్గురిలో పురంధేశ్వరి, లక్ష్మినారాయణ మాత్రం ఎన్నికల టైంలోనే బీజేపీలో చేరారు.. కానీ వీర్రాజు మాత్రం అలా కాదు పార్టీకి నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నాడు.. అందులోనూ ఎక్కువ మంది సోము వీర్రాజు పేరునే వినిపిస్తున్నారు. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి పగ్గాలు సోము వీర్రాజు చేతికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.  మరి ఎవరి చేతికి అధ్యక్ష పదవి పగ్గాలు అందుతాయో చూడాలి.  

నేను 5 లక్షలు డిమాండ్ చేయలేదు: సానియా మీర్జా

  మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్ లో నిర్వహించదలచిన ఒక క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ముఖ్య అతిధిగా పాల్గొనాలని ఆహ్వానించగా ఆమె రూ. 5 లక్షలు ఫీజు, తన మేకప్ స్టాఫ్ కి రోజుకి రూ.75, 000, తనతో వచ్చే తన సిబ్బందికి అదనంగా మరికొంత సొమ్ము చెల్లించాలని కోరారు. అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి తనకు చార్టెడ్ విమానం ఏర్పాటు చేయాలని కోరారు. ఆమె గొంతెమ్మ కోరికలను విని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు దణ్ణం పెట్టేసి ఆమెకు బదులు మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీ చంద్ ని ఆహ్వానించారు. ఆయన ఎటువంటి షరతులు విధించకుండా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సానియా మీర్జా రాకపోవడంతో నవంబర్ 28న జరుగవలసిన తమ క్రీడా కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం డిశంబర్ 1కి వాయిదా వేసుకోవలసి వచ్చింది.   దీని గురించి సానియా మీర్జాను విమర్శిస్తూ మీడియాలో వార్తలు వచ్చేయి. వాటిపై ఆమె మేనేజర్ స్పందిస్తూ, సానియా మీర్జా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని రూ. 5 లక్షలు అడిగినట్లు వచ్చిన వార్తలలో నిజం లేదు. ఆమె డబ్బు కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్నిఎటువంటి డిమాండ్స్ చేయలేదు. కానీ ఆ కార్యక్రమం జరిగిన మరునాడు అంటే నవంబర్ 29వ తేదీన ఆమె గోవాలో ఒక కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. భోపాల్ లో తన కార్యక్రమం పూర్తయిన తరువాత సాధారణ విమానంలో గోవా వెళ్ళినట్లయితే ఆ కార్యక్రమానికి ఆమె అందుకోలేరు. అందుకే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయమని కోరాము. కానీ ఆమె గొంతెమ్మ కోరికలు కోరినట్లు మీడియాలో వార్తలు రావడం మాకు చాలా బాధ కలిగించింది,” అని అన్నారు.

పుతిన్ కు మళ్లీ ఐఎస్ఐఎస్ హెచ్చరికలు..

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గతంలో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఓ వీడియో ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఓ రష్యన్ ని రష్యా గూఢాచారిగా అనుమానించి.. అతని చంపుతూ ఓ 8 నిమిషాలు నిడువు ఉండే వీడియోను విడుదల చేశారు. అయితే మొదట ఆరు నిమిషాలు అతనిని హింసించి.. అతను రష్యా గూఢాచారినే అని చెప్పినట్టు ఉండగా తరువాత  పుతిన్ కు హెచ్చరికులు జారీ చేసినట్టు ఉంది. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం....మీ కుమారులును హతం చేస్తాం...మీ ఇళ్లను పేల్చేస్తాం...ప్రతి రష్యన్ సైనికుడి దాడిలో చనిపోయిన ప్రతి వ్యక్తికి ఇక్కడ ధ్వంసమైన ప్రతి ఇంటికి తాము బదులు తీర్చుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. దీంతో రష్య ప్రభుత్వం మరోసారి అలెర్ట్ అయింది.

టీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్.. మరి దానం?

ఇరు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణగా తయారైంది. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి చాలామంది నాయకులే వేరే పార్టీల్లోకి మారారు. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. స్థానిక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ఇక అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. అయితే ఇప్పుడు అర్ధం కానీ పరిస్థితి ఏంటంటే ప్రభాకర్ టీఆర్ఎస్ లో చేరిపోయారు.. మరి ప్రభాకర్ కు అత్యంత సన్నిహితుడైన దానం నాగేందర్ ఇప్పుడు ఏం చేస్తారు అని.. టీఆర్ఎస్ లోకి చేరుతారా? లేదా అని అందరి సందేహం. ఇలా అందరూ సందేహ పడుతున్న సమయంలో దానం కేసీఆర్ ను కలిసిన వార్త బయటకి వచ్చింది. దీంతో ఇప్పుడు దానం కూడా తాను కేసీఆర్ ను కలిశానని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది చెప్పిన దానం తాను మాత్రం పార్టీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే దానం అలా చెబుతున్నా.. టీఆర్ఎస్ మాత్రం ఒకసారి ఫిక్స్ అయితే దానం గులాబీ గూటికి వెళ్లక తప్పదు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

డిసెంబర్ 22న ముగియనున్న నిర్భయ నిందితుడి గడువు.. తరువాత?

నిర్భయ కేసులో అందరికి శిక్ష పడగా ఒక్క పిల్ల పిశాచి మాత్రం తప్పించుకున్న సంగతి తెలిసిందే. మైనర్ అనే ఒకే ఒక్క కారణం చేత ఆ దుర్మార్గుడు శిక్ష నుండి తప్పించుకున్నాడు. కానీ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. నిర్భయ చెప్పిన వాంగూల్మం ప్రకారం అందరి కంటే ఎక్కువ తనను హింసించింది బాల నేరస్తుడే అని తెలిపింది. అలాంటి వాడికి మైనర్ అన్న సాకుతో మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే పడింది. అయితే ఈనెల 22తో అతడి శిక్ష పూర్తవుతుంది. దీంతో అతడిని విడుదల చేస్తారా? లేదా? అన్నది అందరి సందేహం. అయితే ఈ విషయంపై అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అతని గడువు ముగిసిన తరువాత  విడుదల చేయకుండా ఒక స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో ఉంచి అతని ప్రవర్తనను మరో ఏడాది గమనించి ఆ తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఇప్పటి వరకూ అతని ఫేస్ కూడా ఎవరికి చూపించలేదు పోలీసులు. ఈ నేపథ్యంలో అతని ఫేస్ అందరికి చూపించాలని నిర్భయ తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘాన్ని కూడా కోరారు.

లొంగిపోయిన వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి..

రాజకీయ నాయకులకు దూకుడు ఉంటడం సహజమే.. కానీ అది ఎక్కువైనప్పుడే కాస్త తలనొప్పులు ఎదురవుతాయి. వైకాపా పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. వైకాపా పార్టీలో అందరి కంటే చెవిరెడ్డికి కాస్త దూకుడు ఎక్కువనే చెప్పొచ్చు. ఈ మధ్య రేణిగుంట విమానాశ్రయంలో ఆయన ఎయిరిండియా మేనేజర్ రాజశేఖర్ మీద చేయి చేసుకోవడం తెలిసింది. దీంతో ఆయన మీద ఒకటే విమర్శలు. అంతేకాదు పార్టీ నేతలు కూడా చెవిరెడ్డిపై జగన్ కు ఫిర్యాదు చేశారంట. ఇక చెవిరెడ్డి మీద చర్యల కోసం పోలీసులు వెతికే పరిస్థితి. దీంతో పరిస్థితి గమనించిన చెవిరెడ్డి తానే పోలీసుల దగ్గర లొంగిపోయాడు. బెయిల్ కోసం ప్రయత్నించినా.. కోర్టులో చుక్కెదురైంది. దీంతో అయిన చెవిరెడ్డి అతి దూకుడు పనికి రాదని తెలుసుకుంటారో? లేదో?

లోకేశ్ పథకానికి ఇంప్రెస్ అయిన కేంద్రమంత్రి

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న పథకాలు ఇప్పుడు కేంద్రానికి సైతం నచ్చి సాయం చేస్తున్నాయి. నారా లోకేశ్ యువతలో నైపుణ్యత పెంపొందించటానికి ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో లోకేష్ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా యువతకు నైపుణ్యత పెంపొందించాలని.. దీనిలో భాగంగానే ఇప్పటి వరకూ 1500 మందికి వివిధ విభాగాల్లో శిక్షణ కూడా ఇచ్చారు. అయితే దీన్ని ఇంకా విస్తరింపజేయాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. దీంతో ట్రస్ట్ చేపట్టిన శిక్షణ కార్యక్రమాల అమలుకు ఆర్థిక సాయం అందించటానికి తెలుగుదేశం ఎంపీలు ట్రస్టు అధికారులతో కలిసి కేంద్ర స్కిల్ డెవలప్ పెంట్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు ట్రస్ట్ గురించిన వివరాలు అన్ని చెప్పేసరికి రూడీ కూడా వారు చెప్పిన అంశం నచ్చి.. ప్రతి నియోజకవర్గానికి మూడుకోట్ల రూపాయలను ప్రాథమికంగా మంజూరు చేయటానికి అంగీకరించారు. మొత్తానికి నారా లోకేశ్ చేపట్టిన పథకం కేంద్రమంత్రిని ఇంప్రెస్ చేయడం సంతోషించాల్సిన అంశమే.

టీఆర్ఎస్ పార్టీ పాలించమంటే దళారీ చేస్తున్నారు.. ఎర్రబెల్లి

టీడీపీ ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ఒక్క ఎమ్మెల్యేని చేర్చుకున్నంత మాత్రనా టీడీపీని బలహీన పరచలేరని.. మంత్రులు పాలనను వదిలేసి ఎంపీటీసీలను కొనే పనిలో పడ్డారు అని విమర్శించారు. అధికార పార్టీ క్యాంప్ ఆఫీసు, సచివాలయాన్ని టీఆర్ఎస్ ఆఫీసులుగా మార్చారు అని మండిపడ్డారు. పాలించాలని అధికారమిస్తే గులాబీ నేతలు దళారీ పని చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. కాగా ఈ రోజు ఉదయం టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ కేసీఆర్ తో భేటీ అయి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి విదితమే.

నీటి సంద్రమైన చెన్నై.. ఏమైనా సాయం కావాలా.. చంద్రబాబు

భారీ వర్షాల కారణంగా చెన్నై నీటి మయమయిపోయింది. వరద నీటితో ఇళ్లు, రోడ్లు, ఆఫీసులు అన్నీ నీటితో నిండిపోయాయి. ఇప్పటికే వచ్చిన వర్షాలతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులో ప్రజలు ఉన్నారు.. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు నీళ్లు, పాల కోసం జనం అల్లలాడుతున్నారు.. ఈ పరిస్థితిలో మరో మూడు రోజుల వరకూ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇంకా ఆందోళన చెందుతున్నారు చెన్నై వాసులు. కాగా వరదనీటిలో చిక్కుకుపోయిన 200 మంది బాధితులను ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ వర్షాలపై జయలలితకి ఫోన్ చేసి అక్కడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అంతేకాదు వర్షాల కారణంగా అతలాకుతలమైన తమిళనాడుకి సాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ముందుకొచ్చారు. దీనిలో భాగంగానే తమిళనాడు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, ఏమైనా సాయం కావాలేమో అడగాలని చంద్రబాబు ఏపీ ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో ఐవైఆర్ కృష్ణారావు తమిళనాడు సీఎస్‌కు ఫోన్ చేసి ఆరా తీసి సాయం చేస్తామని చెప్పగా.. చిత్తూరు జిల్లాలోని  కొన్ని డ్యాంల నుంచి నీటి విడుదల తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరినట్టు తెలుస్తోంది.

టీ కాంగ్రెస్, టీడీపీకి షాక్.. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్

తెలంగాణలో కాంగ్రెస్ కు, టీడీపీకి మరో షాక్ తగిలింది. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసందే. అయితే కేసీఆర్ తో భేటీ అనంతరం కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. గులాబీ కండువాలు కప్పి కేసీఆర్ ఇద్దరు నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్ లో చేరా.. నా నియోజకవర్గం అభివృద్ధే నాకు ముఖ్యం.. సాధారణ ప్రజల కోసం కంటోన్మెంట్లోని ఆర్మీ రోడ్లను తెరిపించడంలో కేసీఆర్ ది కీలక పాత్ర.  బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతాం అని వ్యాఖ్యానించారు.

నన్ను పిలవలేదు.. దానం నాగేందర్..

  టీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి కాంగ్రెస్ నేతలందరూ హాజరవ్వగా దానం నాగేందర్ మాత్రం డుమ్మా కొట్టారు. అయితే సమన్వయ కమిటీ సమావేశానికి రానని నిన్ననే ఉత్తమ్ తెలిపారని నేతలు అంటున్నారు. కానీ దానం నాగేందర్ మాత్రం సమన్వయ కమిటీ సమావేశానికి ఉత్తమ్ నన్ను పిలవలేదు..కావాలనే నాపై దుష్ర్పచారం చేస్తున్నారు అని అంటున్నారు. కాగా కాసేపట్లో పార్టీ అనుచరులతో తన నివాసం వద్ద దానం భేటీ కానున్నారు.