నేడు కోర్టుకు సోనియా, రాహుల్..!

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ..ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో పటియాలా కోర్టు దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కోర్టు ఆవణలో సుమారు 16కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపులను కూడా పోలీసులు మూయించారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా తమ ఎంపీలను ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించిందట. మరోవైపు ఇక్కడ తెలంగాణలో సోనియా, రాహుల్ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ సోనియా, రాహుల్ ను అరెస్ట్ చేస్తే జైలుభరో నిర్వహించాలని కూడా నిర్ణయించుకున్నారంట. ఇదిలా ఉండగా ఈ విషయంపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ హయాంలోదే అని.. దీనివల్ల పార్లమెంట్ సమావేశాలకు అడ్డుపడటం సమంజసం కాదని.. పార్లమెంట్ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని అన్నారు.

అసెంబ్లీ.. రోజా సస్పెన్షన్ పై గందరగోళం

ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రోజా సస్పెన్షన్ పై సభలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు తలెత్తాయి.  నిన్న స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సంవత్సరంపాటు సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో ఈ రోజు వైసీపీ నేతలు రోజా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆందోళన చేపట్టారు. వైకాపా అధినేత జగన్ మాట్లాడుతూ రోజాను ఏ నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారు.. సభలో ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. లేని అధికారాన్ని దుర్వినియోగపరిచారు.. ఏడాది పాటు సస్పెండ్ చేయడం చట్ట విరుద్దం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా ఎమ్మెల్యేగిడ్డి ఈశ్వరి అరెస్ట్ కు హైకోర్టు నో!

  ఈనెల 10వ తేదీన విశాఖ ఏజన్సీ ప్రాంతంలోని చింతపల్లి వద్ద వైకాపా అధ్యక్షుడు జగన్ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన బహిరంగ సభలో, పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అసభ్యంగా మాట్లాడి, ఆయన తల నరుకుతానని హెచ్చరించారు. అందుకు ఆమెపై పాడేరు, చింతపల్లి, అరుకు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆమె శ్రీరామ్ అనే న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతో తనపై అన్యాయంగా మోపబడిన కేసులను రద్దు చేయాలని ఆమె తన పిటిషన్ ద్వారా హైకోర్టుని కోరారు. కానీ కోర్టు ఆమె అభ్యర్ధనను తిరస్కరించింది. అయితే ఆమెను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే మంజూరు చేయడంతో ఆమెకు ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు తమ దర్యాప్తుని కొనసాగించదానికి హైకోర్టు అనుమతించింది.

ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ కి నేడు శంఖుస్థాపన

  గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నిర్మించబోతున్న ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ (ఎయిమ్స్)కి నేడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఉదయం 11 గంటలకు శంఖుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజన చౌదరి, అశోక్ గజపతి రాజు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు, తెదేపా, బీజేపీల నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. శంఖుస్థాపన కార్యక్రమం ముగిసిన తరువాత అక్కడే ఒక బారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.

హెయిర్‌ స్టైల్ నచ్చలేదని...

  తన కొడుకు హెయిర్ స్టైల్ నచ్చలేదని ఓ తండ్రి కుటుంబం మొత్తాన్నీ నరికి చంపిన ఘోరమైన ఘటన రష్యాలో జరిగింది. ఓలెక్ బెలోవ్ అనే వ్యక్తి భార్య, ఆరుగురు పిల్లలతో నివసిస్తున్నాడు. ఓలెక్ భార్య తన ఆరేళ్ళ కొడుక్కి వెరైటీ స్టైల్లో హెయిర్ కట్ చేయించింది. ఆ స్టైల్ ఓలెక్‌కి నచ్చలేదు. దాంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ ముదిరి ఆమె విడాకులు ఇస్తానని అనేవరకూ వెళ్ళింది. దాంతో అతని ఆగ్రహం కట్టలు తెచ్చుకుని తన భార్యని, ఆరుగురు పిల్లల్ని దారుణంగా నరికి చంపాడు. చనిపోయే సమయంలో అతని భార్య ఆరు నెలల గర్భవతి. భార్యను, పిల్లలను నరికి చంపిన తర్వాత ఓలెక్ కత్తి చేత పుచ్చుకునే తన తల్లిదగ్గరకి వెళ్ళి ఆమెను కూడా నరికి చంపాడు. శవాలన్నిటినీ ప్లాస్టిక్ సంచుల్లో కుక్కేశాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి లొంగిపోయాడు.  

నిర్భయ కేసు.. బాల నేరస్తుడు విడుదల?

ఢిల్లీలో నిర్భయ ఉదంతం గురించి అందరికి తెలిసిందే. ఈ దారుణమైన ఘటన జరిగి ఇప్పటికే మూడు సంవత్సరాలు అయింది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాల నేరస్థుడి కూడా రేపటితో శిక్ష గడువు ముగియనుంది. మరోవైపు నిర్భయ తల్లి దండ్రులు ఆ నిందితుడిని విడిచిపెట్టొద్దని ఆరోపిస్తున్నారు. అంతేకాదు కేంద్రం, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ నేత సుబ్రహ్మణ్యం కూడా నిందితుడిని వదిలిపెట్టొద్దని పిటిషన్ దాఖలు చేశాడు. కానీ హైకోర్టు మాత్రం వాటిని తిరస్కరించి అతని విడుదల నిలుపుదలకు నో చెప్పింది. దీంతో రేపు ఆ నిందితుడు విడుదలయ్యే అవకాశం ఉంది.

రోజా పై చంద్రబాబు ఫైర్.. రోజాపై సంవత్సరం పాటు సస్పెన్షన్ వేటు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజా దూకుడిపై మండిపడ్డారు. చంద్రబాబు కాల్ మనీ గురించి ప్రకటన చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయన వద్దకే వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీనికి రోజా ప్రాతినిద్యం వహించడంతో చంద్రబాబు ఆమెపై ఫైర్ అయ్యారు. ఆమె మహిళా? ఒక ఎమ్మెల్యేగా ఆమె మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం లేకుండా ఆమె చేస్తున్న నినాదాలు ఏంటి అని నిప్పులు చెరిగారు. దీంతో రెచ్చిపోయిన రోజా చంద్రబాబుకు వ్యతిరేకంగా మళ్లీ ఆందోళనలు చేపట్టారు. దీంతో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని మంత్రి యనమల స్పీకర్ ను ప్రతిపాదించగా.. స్పీకర్ కోడెల కూడా ఆయన ప్రతిపాదనను ఆమోదించారు. దీంతో రోజాను సంవత్సరంపాటు సస్పెండ్ చేశారు.

ఫారిన్ పాలసీ చెప్పింది నిజమేనా..? ఇండియాలో అణు పరీక్షలు..?

మన దేశంలో ఏం జరుగుతుందో మనకే తెలియని ఓ సంచలనమై విషయాన్ని ఓ అంతర్జాతీయ పత్రిక ఒకటి భయటపెట్టింది. అదేంటంటే.. ఇండియా రహస్యంగా అణుపరిశోధనలు చేయడం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మాత్రం నిజం అంటుంది అంతర్జాతీయ పత్రిక. పాకిస్థాన్ అస్థిరపరచేందుకు కోసం భారత్ అత్యంత రహస్యంగా అణుకార్యక్రమం సాగిస్తోందని.. కర్ణాటక దక్షిణ ప్రాంతంలోని ఛెల్లకెరిలోని గిరిజన ప్రాంతంలో ఈ అణు పరిశోధనలు సాగుతున్నాయి 'ఫారిన్ పాలసీ'' అనే అంతర్జాతీయ పత్రిక బయటపెట్టింది. దీంతో ఇప్పుడు ఇది సంచలనమైంది. ఇప్పుడు ఈ విషయం పై ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ ఎలా రియాక్ట్ అవుతుందా అని అందరూ అసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందునా.. పాకిస్థాన్ కంటే ముందు అణు పరిశోధనల గురించి ఏ చిన్న విషయమైన చిటికెలో పసిగట్టే అమెరికా కూడా ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. మరి ఈ విషయంపై మన దేశం ఏం చెపుతుందో చూడాలి.

రేపు కోర్టుకు హాజరుకానున్న సోనియా,రాహుల్..

  నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పటికే రేపు కోర్టుకు హాజరు కాబోయే వీరిద్దరు ఏం చేస్తారో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టుకు హాజరయ్యే వీరు ఆతరువాత బెయిల్ కి దరఖాస్తు చేసుకుంటారా లేక రాహుల్ ముందుగానే తాను శబధం చేసినట్టు బెయిల్ కి దరఖాస్తు చేసుకోకుండా జైయిల్ కి వెళతారా అనేది చూడాలి. అయితే ఇప్పుడు అసలు ఈ కేసుపై సోనియా, రాహుల్ పై కోర్టులో పిటిషన్ వేసిన సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. ఈ కేసులో రాజకీయాలకు తావు లేదని.. సోనియా, రాహుల్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలి.. లేదా జైలుకు వెళ్లాలి.. అలా కాకుండా కోర్టుకు హాజరుకాకపోతే కోర్టు వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

ఏపీ బీజేపీ, టీడీపీ నేతలకు మావోయిస్టుల వార్నింగ్..

  ఉమ్మడి రాష్ట్రంలో ఏమో కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం మావోయిస్టుల ఉనికి కాస్త పెరిగిందనే చెప్పొచ్చు. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో కాస్త ఎక్కువే. ఇప్పటికే మావోయిస్టులు తెలంగాణలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేయించడం..ఆ పార్టీకి సంబంధించిన నేతలను కిడ్నాప్ చేయడం వంటివి చేశారు. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పోస్టర్లు వెలిశాయి. విశాఖ జిల్లాల గూడెం కొత్త వీధి మండలంలోని సిరిబాల ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు కనిపించాయి. అధికారంలో ఉన్న టీడీపీ - బీజేపీలను తరిమితరిమి కొట్టాలంటూ ఆ పోస్టర్లలో పిలుపునిచ్చారు.ఆన్ రాక్ యాజమాన్యంతో టీడీపీ కుమ్మక్కయిందని..బాక్సైట్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని.. మన్యంలో బాక్సైట్ గనుల తవ్వకం జరిపితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

సీబీఐ రైడ్ పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యాలు..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యలయంపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. తన కార్యాలయంపై సీబీఐ దాడులు చేయడంపై కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరోపక్క అధికార ప్రభుత్వ.. సీబీఐ అనేది స్వచ్ఛంధ సంస్థ దానికి ఆదేశించే అధికారం ఎవరికి ఉండదు అని.. సీబీఐ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఈనేపథ్యంలో అటు కేజ్రీవాల్ కి ఇటు కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి మళ్లీ ఇప్పుడు కేజ్రీవాల్ ట్విట్టర్లో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దారికి రాని వారిని అంతం చేసే పనిలో సీబీఐ ఉందని.. ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తమ దారికి రాని ప్రతిపక్షాలపై ఎంతవరకైనా వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం తమను ఆదేశించిందని.. ఈవిషయాన్ని ఓ అధికారే స్వయంగా తమకు చెప్పాడని కేజ్రీవాల్ ట్వీట్టర్లో తెలిపారు. దీంతో ఇప్పుడు కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి. మరి కేజ్రీవాల్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

చంద్రబాబు ప్లాన్ ముందు జగన్ ప్లాన్ తుస్సే..!

రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్న రాజకీయానుభవం ముందు జగన్ రాజకీయానుభవం దిగదుడుపే. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అసలే రాజకీయ చాణుక్యుడిగా చంద్రబాబుకి పేరుంది. జగన్ జ‌గ‌న్‌కు అనుభ‌వం కంటే దూకుడు ఎక్కువ‌గా ఉండ‌డంతో చాలాసార్లు ఆయ‌న ఫెయిల్ అవుతూ వ‌స్తున్నారు. ఈసారి కూడా జగన్ కు అదే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏపీ శీతాకాల సమావేశాల్లో భాగంగా వైసీపీ పార్టీ నేతలు రాజ్యాంగంపై అంబేద్కర్ గురించి మాట్లాడనివ్వకుండా.. కాల్ మనీపై మాట్లాడాలని పట్టుబట్టారు. కానీ అధికార పార్టీ మాత్రం అంబేద్కర్ గురించి మాట్లాడాలని పట్టుబట్టింది. అయితే చంద్రబాబు ఎక్కడ కాల్ మనీ వ్యవహారం మ‌రుగున‌ప‌డేలా చేస్తారో అని ఆవేశపడిపోయి అంబేద్కర్ గురించి మాట్లాడకుండా మొదట కాల్ మనీ గురించే మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో ప్రతిపక్షం దళితులకు వ్యతిరేకం అన్న భావన కలిగించాలన్న వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేసింది. అంతేకాదు వైసీపీ నేతలు దళిత ఎమ్మెల్యేలతోనే ప్రతిపక్షంపై అధికార పక్షం పదేపదే దాడి చేయించింది. దీంతో వైసీపీ దళితులకు వ్యతిరేకం అనే సంకేతాలు బయటకు పంపేలా చేసింది. మొత్తానికి చంద్రబాబు వేసిన చిన్న ప్లాన్ ముందు.. జగన్ పెద్ద ప్లాన్ బెడిసికొట్టింది.

చాలా దురదృష్టకరం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అంబేద్కర్ 125 జయంతి వేడుకల గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చర్చపై వైసీపీ నేతలు అడ్డుకోవడం చాలా దురదృష్టకరమని.. అంబేద్కర్ చర్చపై బీఏసీలో ఒప్పుకొని ఇప్పుడు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇంక అంబేద్కర్ గురించి చెబుతూ.. అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకమని.. అంబేడ్కర్‌కు ప్రపంచం మొత్తం హేట్సప్ చెప్పిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పైన చర్చ చారిత్రాత్మకం అన్నారు. రాజ్యాంగ సౌధానికి ప్రాణప్రతిష్ట చేసిన అంబేడ్కర్‌ను స్మరించుకోవడం చారిత్రాత్మకం అన్నారు.

విజయవాడలో ఉద్రిక్తం.. అంగన్ వాడీ కార్యకర్తల నిరసన..

విజయవాడ, బందర్ రోడ్డు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంగన్ వాడీ కార్యకర్తలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఫీసును చుట్టుముట్టడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులు, అంగన్ వాడీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సీఐటీయూ, అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా అంగన్ వాడీ కార్యకర్తలు మాత్రం తమ జీతాల జీవో విడుదల చేసేవరకు ఈ పోరాటం ఆపేది లేదని.. ఎంతమందిని అరెస్ట్ చేసినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు తమ సమస్యలు పరిష్కారించేవరకూ పోరాడతామని రోడ్డు మీదే బైఠాయించి ఆందోళనలు చేపడుతున్నారు.

జీఎస్టీ బిల్లుపై బీజేపీ వెనక్కి తగ్గిందా..?

ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన జీఎస్టీ బిల్లును ఆమోదింపచేయాలని చూసింది. కానీ ఊహించని విధంగా నేషనల్ హెరాల్డ్ కేసు బయటకు రావడంతో  ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బిల్లుకు సంబంధించి మోడీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లకు తేనీటి విందు ఇచ్చి బిల్లును గురించి కూడా మాట్లాడారు. సోనియా, రాహుల్ కూడా తమ డిమాండ్ లు ఒప్పుకుంటే బిల్లును ఆమోదింపజేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. కానీ ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ తో సోనియా.. రాహుల్ మోడీ సర్కార్ పై మండిపడుతున్నారు.. ఈనేపథ్యంలో బిల్లు ఆమోదం అతి కష్టమని తేలిపోయింది. మరో వైపు బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గి.. బిల్లును ప్రవేశ పెట్టి భంగపడే కన్నా.. ప్రస్తుతానికి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారట. 2016 ఏప్రిల్ తర్వాత అంటే బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రవేశ పెట్టి ఆమోదం పొందేలా చూస్తున్నారట. మరి అప్పుడైనా ఈ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో చూడాలి.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హోర్డింగులు.. మెట్రో ఎక్కడా..?

  హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల జోరు బాగానే సాగుతుంది. ఏ పార్టీ వ్యూహాలు వారికి ఉన్నాయి. ఇక అధికార పార్టీ అయితే ఇప్పటికే హైదరాబాద్ లో సగం హోర్డింగులతో నింపేసింది. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరాలు హోర్డింగులలో వేసి ప్రకటనలతో పాటు.. హోర్డింగులతో నగరమంతా గులాబీ మయం చేసేసింది. అయితే అన్నీ తమ ఖాతాలో వేసుకున్న అధికార పార్టీ మాత్రం మెట్రో రైలును మాత్రం తమ ఖాతాలో వేసుకోలేదు.. సరికదా దీనికి సంబంధించిన ఒక్క యాడ్ ను తమ హోర్డింగుల్లో ఎక్కడా వేసుకోలేదు. ఎందుకంటే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మెట్రో రైలు విషయంపై టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోయినా..రాష్ట్ర విభజన తరువాత మాత్రం అలైన్ మైంట్ మార్పు విషయంలో కొన్ని అభ్యంతరాలు చెప్పింది. అంతేకాదు కేసీఆర్ కూడా అలైన్ మైంట్లో మార్పు పక్కా అని చెప్పారు. కానీ పాత అలైన్ మెంట్ ను కొనసాగించాలని నిర్ణయించటంపై సుల్తాన్ బజార్ వ్యాపారులు.. పాతబస్తీకి చెందిన వారు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దీంతో అధికార పార్టీ లేనిపోని తలనొప్పులు ఎందుకని మెట్రో రైలును తమ ఖాతాలో వేసుకోకుండా జాగ్రత్త పడుతోంది.

రెండోరోజూ గందరగోళం

  కాల్‌మనీ వ్యవహారం మీద రెండోరోజు కూడా ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే కాల్‌మనీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. కాల్‌మనీ వ్యవహారం మీద ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, ఆ తర్వాత ఎంతసేపైనా చర్చించవచ్చని స్పీకర్ సూచించారు. చర్చ తర్వాత సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలువైన సభా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని స్పీకర్ పలు పర్యాయాలు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు పట్టు వదల్లేదు. అయితే వైసీపీ నాయకులు సభను అడ్డుకోవడం న్యాయం కాదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రమం వ్యక్తం చేశారు. బీఏసీలో నిర్ణయించిన ఎజెండా ప్రకారమే సభ నడుస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుడు సభా నిబంధనలు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. సభ జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం సహించదని ఆయన స్పష్టం చేశారు.