కేసీఆర్ యాగానికి చంద్రబాబు..! ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగానికి అంకురార్పణం చేసిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ యాగానికి వస్తారా.. లేదా ఆని. అయితే కేసీఆర్ స్వయంగా విజయవాడ వెళ్లి చంద్రబాబును ఆహ్వానించడం.. తన యాగానికి తప్పకుండా వస్తానని చెప్పడంతో రేపు జరగబోయే యాగానికి చంద్రబాబు తప్పకుండా వస్తారని అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ యాగానికి వెళ్లడం పట్ల టీ టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ టీ టీడీపీ నేతలు కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు కనుక యాగానికి వస్తే అది పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు వేరే సిగ్న‌ల్స్ ఇచ్చిన‌ట్టు ఉంటుద‌ని.. కేసీఆర్ ను.. కాని ఆపార్టీ నేతలను విమర్శించడం ఎలా తలలుపట్టుకొనే పరిస్థితి వచ్చిపడింది. అయితే అందరి సంగతి ఎలా ఉన్నా టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాత్రం అవేమి పట్టించుకోకుండా కేసీఆర్ ను ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూనే ఉన్నారు. మరోవైపు కేసీఆర్ కూడా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్ల ఓట్ల కోసమే చంద్రబాబుతో మంచిగా ఉంటున్నారని అంటున్నారు. అందుకే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు ప్రచారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. నేతలను ఎలా దిశా నిర్దేశికం చేస్తారో చూడాలని కొంతమంది టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు ఎంత ముఖ్యమో అలాగే తెలంగాణ ఓట్లు కూడా కావాలి. అందుకే ఈ యాగానికి వెళ్లే తెలంగాణ ప్రజలకు తనపై నమ్మకం కలుగుతుందనే భావనతో చంద్రబాబు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఈ యాగానికి వెళ్లడం వల్ల చంద్రబాబుకి ఎంత ప్రయోజనం ఉంటుంది.. తన ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

కేజ్రీవాస్ సరి-బేసి విధానం.. అతిక్రమిస్తే 2వేలు ఫైన్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీలోని కాలుష్యాన్ని నివారించడానికి గాను ఓ కొత్త పద్దతికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి ఎక్కువైపోతోందని దీని కారణం డీజిల్ వాహనాలే కారణమని ప్రభుత్వం గుర్తించి దానిని తగ్గించే దిశలో సరి-బేసి విధానాన్ని ప్రవేశపట్టింది. అంతేకాదు ఈ విధానాన్ని అందరూ ఖచ్చితంగా పాటించి తీరాలని.. అలా కాకుండా ఈ పద్దతిని అతిక్రమిస్తే వారికి రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. అయితే ఈ విధానంలో కొన్ని మార్పులు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ చూస్తున్నట్టు తెలుస్తోంది. నలుగురు ప్రయాణికులు కలిగిన కార్లు మహిళా డ్రైవర్లు మహిళా ప్రయాణికులు గల కార్లకు వీటి నుంచి మినహాయింపు నివ్వాలని ఆలోచిస్తోంది. అంతేకాదు ఈ విధానం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి జనవరి 1 నుండి అమలయ్యే ఈ విధానం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

రోజాపై చర్యలు తీసుకోండి.. రెండు రోజులు బయటకు రాలేదు.. ఎమ్మెల్యే అనిత

వైకాపా ఎమ్మెల్యే రోజాపై మంత్రి పీతల సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో రోజా చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా గతంలో నా మీద కూడా ఇలానే జుగుప్సాకరంగా మాట్లాడారు.. ఇప్పుడు ఎమ్మెల్యే అనితపై కూడా అలాగే నోరు పారేసుకున్నారని.. ఒక ఎమ్మెల్యేగా తను ఇలా మాట్లాడటం సరికాదని.. రోజాకు ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరుతున్నానని అన్నారు. రోజా ఒక మహిళ అనే విషయాన్ని మరిచిపోయి తను ఇష్టం వచ్చినట్టు ఒక రౌడీలా మాట్లాడుతుందని.. సభలకు వచ్చేది ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవడానికి కానీ.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకోవడానికి కాదని అన్నారు. అంబేడ్కర్ వల్లే తమ వంటి దళితులం అసెంబ్లీలో అడుగు పెట్టామని, అలాంటి తమ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రోజాను జగన్ వెనకేసుకురావడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా రోజా తనపై చేసిన వ్యాఖ్యలకు గాను తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యాయనని.. రెండు రోజులపాటు ఇంటిలోనుండి బయటకు రాలేక పోయానని తీవ్ర మనోవేధనకు గురయ్యానని ఎమ్మెల్యే అనిత అన్నారు. దళిత మహిళనైన తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా పైన సరైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని అనిత విజ్ఞప్తి చేశారు.

కేజ్రీవాల్ పై అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసు..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకూ పెరిపోతుంది. డీడీసీఏ (ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌) వ్యవహారంలో ప్రస్తుతం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనపై లేనిపోని ఆరోపణలు చేసి తనతోపాటు కుటుంబ పరువు తీసారని జైట్లీ పది కోట్లకు.. కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. దీనికి కేజ్రీవాల్ స్పందించి.. ఇలాంటి కేసులతో తనను భయపెట్టలేరని.. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము.. డీడీసీఏ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ సంఘం ముందు జైట్లీ హాజరై  ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. జైట్లీ వేసిన కేసును ప్రముఖ న్యాయవాది రామ్‌ జెత్మలానీ కేజ్రీవాల్ తరుపున వాదించనున్నారు. మరోవైపు ఆప్ నేతలు కూడా జైట్లీపై  ఫోర్జరీ, ప్రజాధనం దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని కేసు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

నేను వదులుకోవడానికైనా సిద్దమే.. చంద్రబాబు

సోమవారం తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా చంద్రబాబు శాసనమండలిలో బాహాటంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో నేతలపై ఆయన ఎంత అసంతృప్తి, కోపంగా ఉన్నారో ఇట్టే అర్ధమవుతోంది. అదేంటంటే ఈ మధ్యకాలంలో అధికార పక్ష నేతలు పలు వివాదస్పద చర్యల్లో ఇరుక్కున్నారన్న విషయం తెలసిందే. అది ఇసుక వ్యవహారంలో కావొచ్చు.. అధికారుల బదిలీల విషయంలోనూ.. తాజా కాల్ మనీ ఇష్యూలోనూ.. విపక్ష నేతలతో చెట్టాపట్టాలు వేసుకున్న తీరు ఏదైనా కావచ్చు.. ఇలా పలు విషయాల్లో వివాదాస్పదంగా మారారు. అయితే ఒకప్పుడు తమ నేతలు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండే చంద్రబాబు ఇప్పుడు మాత్రం వారిని ఉపేక్షించే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. దీనికి ఆయన నిన్న జరిగిన శాసనమండలి సమావేశంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. కొందరికి తెలివి ఎక్కువై.. వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నారని.. అలాంటి అసాంఘికశక్తుల్ని అణచివేసి.. శాంతియుత వాతావరణాన్నికల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ఇందుకు అవసరమైతే.. ఒకరిద్దరిని వదులుకోవటానికైనా తాను సిద్ధమేనని తేల్చి చెప్పారు. మరి చంద్రబాబు ఇచ్చిన వార్నింగుకు భయపడైనా తెలుగు తమ్ముళ్లు ఎంత జాగ్రత్తగా ఉంటారో చూడాలి.

అగ్రిగోల్డ్ పై హైకోర్ట్ ఫైర్.. 15 రోజుల్లో స్టార్ట్ చేయాలి..

అగ్రిగోల్డ్ కుంభకోణంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ వల్ల ఎంతో మంది నష్టపోయారని.. లక్షలాది మంది బాధితులకు సంబంధించిన ఈవిషయంలో ఏపీ సర్కారు ఏం చేస్తుంది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఈ కేసు విచారణాధికారిని తక్షణమే మార్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సీఐడీ పై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ ఇప్పటివరకూ ఎంతమందిని ప్రశ్నించింది? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు.. రెండు నెలలుగా ఎవరనీ ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని 15 రోజుల్లో స్టార్ట్ చేయాలని ఆదేశించింది.

రుణమాఫీతో చిన్న రైతులకు లాభం లేదు.. హైకోర్టు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు ఎక్కవయ్యాయనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ లో కంటే తెలంగాణలో ఈ రైతు ఆత్మహత్యలు కాస్త ఎక్కువే. ఈ నేపథ్యంలో రైతు ఆత్మహత్యలపై విచారణ చేపట్టిన హైకోర్టు రుణమాఫీ అంశంపై పలు ఆసక్తికర వాదనలు చేసింది. రుణమాఫీతో పెద్ద రైతులకు మాత్రమే తప్పించి.. చిన్న రైతులకు ఎలాంటి లబ్థి చేకూరలేదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒకట్రెండు ఎకరాలున్న రైతులకు పరిహారం అందటం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారంతా సన్నకారు రైతులేనన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రూ లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయడానికి సిద్దమైందని తెలిపారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ రైతుల ఆత్మహత్యలకు అప్పులు మాత్రమే కారణం కాదు.. ఇంకా వేరే కారణాలు ఉన్నాయి వాటిపై మరింత అధ్యయం చేయాల్సిన అవసరం ఉంది.. రుణమాఫీ కారణంగా ఆత్మహత్యలు ఆగటం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. రుణమాఫీతోనే రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం కాదని..సూచించింది.

మూడోపెళ్ళి చేసుకోలేదు దేవుడోయ్... అజార్...

  మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ తన స్నేహితురాలు షనోన్ మేరీని మూడో వివాహం చేసుకున్నాడని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన అజార్ ముచ్చటగా మూడోపెళ్ళి చేసుకున్నాడంటూ వచ్చిన వార్తలను అజారుద్దీన్ ఒక ప్రకటనలో ఖండించాడు. తాను షనోమ్ మేరీతో సన్నిహితంగా వున్నంతమాత్రాన ఆమెను పెళ్ళి చేసేసుకున్నట్టు వార్తలు ఇవ్వడమేంటని అజారుద్దీన్ ఆ ప్రకటనలో మండిపడ్డాడు. వార్తలు రాసేముందు ఆ విషయాన్ని నిర్ధారించుకుని వుంటే బావుండేదని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. అమెరికాకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ షనోమ్ మేరీ ఢిల్లీలో స్థిరపడింది. ఆమెతో అజారుద్దీన్ ఇటీవల చాలా క్లోజ్‌గా కనిపిస్తున్నాడు. లండన్ వీధుల్లో ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారు. మరి అంత క్లోజ్‌గా కనిపించడం వల్ల పెళ్ళయిపోయిందని మీడియా అపోహ పడివుండొచ్చు. పెళ్ళి అని కాకుండా షనోమ్ మేరీతో అజారుద్దీన్ సహజీవనం అని న్యూస్ ఇచ్చి వుంటే అజార్ భాయ్ ఫీలయ్యేవాడు కాదేమో!  

కేసీఆర్ యాగానికి నిధులు అక్కడివే.. మధుయాష్కీ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగం పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి నిధులు ఎక్కడినుండి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు కేసీఆర్ ను ప్రశ్నించిన ఆయన దానికి సమాధానం కూడా ఆయనే చెప్పేశారు. కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి నిధులు నారాయణ.. చైతన్య కాలేజీల నుంచి వచ్చిన ముడుపులే అని.. అలా కాకుంటే తాను చేసినవి అసత్య ఆరోపణలు అయితే నిధులకు సంబంధించిన వివరాలు ప్రజలకు అందించాలని అన్నారు. మరోవైపు కేసీఆర్ ఈ చండీయాగం తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నానని చెబుతున్నారు. మరి మధుయాష్కీ చేసిన ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.

కరీంనగర్లో సైకో వీరంగం

  కరీంనగర్ నగరంలో ఒక సైకో వీరంగం సృష్టించాడు. లక్ష్మీనగర్‌కి చెందిన బబ్లు మంగళవారం ఉదయం తల్వార్‌తో ఇంటి నుంచి బయటకి వచ్చిన బబ్లు స్థానికుల మీద దాడికి దిగాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కరీంనగర్ వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ అలీ పోలీసు సిబ్బందితో కలసి వచ్చి సైకోను అదుపు చేయడానికి ప్రయత్నించారు. బబ్లు వాళ్ళమీద కూడా దాడి చేశాడు. అలీ మీద దాడి చేసిన సైకో తల్వార్‌తో ఆయన వేలు నరికేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ ఎస్.ఐ. విజయ సారథి సైకో కాళ్ళ మీద కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సైకో దాడిలో హెడ్ కానిస్టేబుల్ అలీతోపాటు 20 మందికి గాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయుత చండీయాగానికి అంకురార్పణ

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం అంకురార్పణ కార్యక్రమం సోమవారం జరిగింది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో అయుత మహా చండీయాగానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ అంకురార్పణ, ఆరంభపూజ చేశారు. చండీయాగం ముందస్తు కార్యక్రమాలలో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉదయం గురుప్రార్థనతో పూజలు ప్రారంభించారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన రుత్విజులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణశర్మ, హరినాథ్ శర్మ ఆధ్వర్యంలో గురు ప్రార్థన, గణపతి పూజ, దేవనాంది, అంకురార్పణ, పంచగవ్య మేళనం, ప్రాశనం, గోపూజ, యాగశాల ప్రవేశం, సంస్కారం, అఖండ దీపారాధన, మహా సంకల్పం, సహస్ర మోదక మహా గణపతి హోమం, మంగళహారతి, ప్రార్థన, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, గోమాతకు పూజలు చేశారు. సోమవారం సాయంత్రం వాస్తు రాక్షోఘ్న హోమం, అఘోరాస్త్ర హోమం జరిగాయి.

ఒకేసారి చచ్చిపోతాం...

  పోలీసుల వేధింపులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకపోతే అందరం సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని దాదాపు 50 మంది మహిళలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బెదిరింపులకు దిగిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది. పొలాచి సమీపంలోని అంగలకురిచి ప్రాంతంలో నివసించే 25 కుటుంబాలకు చెందిన దళిత మహిళలు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసులు తమ ప్రాంతానికి వచ్చి, తమ కులానికి చెందిన వారిని వేధిస్తున్నారని, ఇప్పటికైనా తమ మీద వేధింపులు ఆపకపోతే అందరం కలసి కలెక్టరేట్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని ఆ మహిళలు బెదిరించారు.  

నర్సుల డాన్సు అదరహో

  చైనాలోని టియాంజిన్‌లో వున్న వైద్య కళాశాలలో నర్సింగ్ కోర్సు చేస్తున్న అమ్మాయిలందరూ సోమవారం ఉదయం సడెన్‌గా కళాశాల మైదానంలోకి వచ్చారు. ఒకరు ఇద్దరు కాదు... వెయ్యి మందికి పైగా నర్సింగ్ విద్యార్థినులు మైదానంలోకి వచ్చేసి డాన్స్ చేయడం ప్రారంభించారు. ఆకుపచ్చని మైదానంలో మల్లెపువ్వు లాంటి తెల్లటి యూనీఫామ్‌లో వున్న నర్సులు లయబద్ధంగా డాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళకి రెండు కళ్ళు చాలవేమోనని అనిపించిందట. ఇంతకీ ఈ నర్సమ్మలు ఎందుకిలా డాన్స్ చేశారంటే... దానివెనుక ఒక మంచి కారణం కూడా వుంది. ఒక సమాజ సేవా కార్యక్రమం కోసం నిధులు సేకరించడం కోసం వీరంతా ఇలా నృత్యం చేశారు.  

అక్కడేం జరుగుతోంది?.. నాకు తెలియాలి!

అయోధ్యలో ఏం జరుగుతోందో తనకు తెలియాలని యు.పి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్.ను ఆదేశించింది. ఈ మేరకు రహస్య నివేదికను తనకు సమర్పించాలని కోరింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఇటుకలు సేకరించాలని వీహెచ్‌పీ పిలుపు ఇచ్చిన ఆరు నెలల తర్వాత ఇటుకలతో కూడిన రెండు ట్రక్కులు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోందో తమకు నివేదించాలని యు.పి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్‌ను కోరింది. అయోధ్యకు సమీపంలో వున్న రామ్‌సేవక్‌పురంలోని విశ్వహిందూ పరిషత్‌కి చెందిన స్థలంలో దించిన ఇటుకలకు రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ ఆధ్వర్యంలో పూజ నిర్వహించినట్టు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ ఆదివారం నాడు ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనం నృష్టించింది. రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ నుంచి సంకేతాలు కూడా అందినట్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ చెప్పడం విశేషం.