చేతులెత్తేస్తున్న బ్యాంకులు!
posted on Feb 10, 2016 @ 5:12PM
సామాన్యుడికి రుణాలు మంజూరు కావాలంటే సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతాయి. రైతులకు రుణమాఫీ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ చిరాకుపడిపోతుంది. పోనీ ఏదో వారి జాగ్రత్తలో వాళ్లు ఉంటున్నారా అనుకోవడానికి లేదు. డబ్బు ఉన్నవారికి మరింత డబ్బుని అందించేందుకు సిద్ధంగా ఉంటాయి బ్యాంకులు. అవతలి వ్యక్తులు బలవంతులో, మోసగాళ్లో కావడం చేత ఇలా మంజూరు చేసిన రుణాలకు తరచూ నీళ్లు వదిలేసుకుంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకప్పుడు ఇలాంటి రుణాలను కప్పిపుచ్చుకునేవి. కానీ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత గవర్నరు రఘురామ్‌కు ఈ పరిస్థితి ఆందోళన కలిగించింది. బ్యాంకులు తమ రుణాలన నేర్పుగా కప్పిపుచ్చుకోవడానికి వీల్లేదనీ, తిరిగిరాని బకాయిల కోసం తగిన మొత్తాన్ని నష్టంగా చూపించాలనీ గత ఏడాది హెచ్చరికను జారీ చేశారు. దాంతో చాలాబ్యాంకులు తాము వసూలు చేసుకోలేకపోయిన బకాయిలను చూపించక తప్పలేదు. అలా రిజర్వ బ్యాంకుకు అందిన లెక్క మేరకు గత మూడేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులు మొండి బకాయిల కింద లక్షకోట్లక పైగా సొమ్మును నష్టపోయాయి. విద్యుత్, ఇనుమును ఉత్పత్తి చేసే బడా కంపెనీల వల్లే బ్యాంకులు అధికమొత్తంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు! ఇప్పటివరకూ సదరు బ్యాంకులు ఇచ్చిన రుణాలలో లక్షల కోట్లు విలువ చేసే మరిన్ని రుణాలను కూడా రాబోయే రోజుల్లో మాఫీ చేయాల్సిన పరిస్థితి ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ వంటి సంస్థల్లో అయితే ఇచ్చిన రుణాలలో దాదాపు పదో వంతు పనికిరానివిగా తేలిపోతున్నాయి. మరి కఠినమైన చర్యలకు పెట్టింది పేరైన రఘురామ్ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యల తీసుకుంటారో చూడాలి!