ఏపీలో మరో రచ్చకు రంగం సిద్దం..
posted on Feb 10, 2016 @ 4:14PM
ఏపీ రాష్ట్రం రోజుకో దీక్ష, ఉద్యమం అంటూ అట్టుడిపోతుంది. మొన్నటికి మొన్న ముద్రగడ దీక్ష అయిపోయింది. అది అయిపోయిందో లేదో..బీసీ సంఘాల గొడవలు మొదలయ్యాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో దీక్షకు రెడీ అవుతున్నారు మాజీ మంత్రి రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి. రాయలసీమ చైత్యన్య యాత్ర పేరుతో ఈయన ఈనెల 14వ తేదీన పోరాటానికి సిద్దమయ్యారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.
కాగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఆప్రాంత నేతలు ఎప్పటినుండో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకోమని.. రాయలసీమను అభివృద్ది చేయాలని.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినా.. రాయలసీమకు మాత్రం స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని పలు డిమాండ్లు చేశారు. దీనిలో భాగంగానే అప్పట్లో మైసురా కూడా ప్రత్యేక రాయలసీమ అంటూ ఉద్యమం చేపడదామని చూశారు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాయలసీమ చైత్యన్య యాత్ర పేరుతో పోరాటానికి రెడీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అయరావతి జపం తప్ప వేరే ఆలోచన లేదని.. అభివృద్ధి అంతా అమరావతికి మళ్లిస్తూ రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని.. త్వరలో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతుందని ఆయన అంటున్నారు. మొత్తానికి వరుస దీక్షలు, ఉద్యమాలతో ఏపీ ప్రభుత్వానికి పెద్ద చిక్కులే వచ్చి పడుతున్నాయి. ఉన్న కాస్త సమయం కాస్త వారిని బుజ్జగించడానికే సరిపోతుంది. మరి ఇప్పుడు బైరెడ్డి గారి పోరాటంలో ఏం డిమాండ్లు ఉన్నాయో.. ఆ డిమాండ్లకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.