బీజేపీకి పెరుగుతున్న మద్దతు

  ఆంధ్ర, తెలంగాణాలలో ఏ పార్టీలు అధికారంలోకి వస్తాయనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో మాత్రం బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు. తత్ఫలితంగా ఇంతవరకు బీజేపీతో మైల పాటించిన అనేక పార్టీలు, తమ కుహానా సెక్యులర్ ముసుగులను పక్కన పడేసి కేంద్రంలో స్థిరమయిన ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి సహకరిస్తామని ప్రకటిస్తున్నాయి. ఒరిస్సాలో బిజూ జనతా దళ్, మహారాష్ట్రలో మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన, తమిళనాడులో అన్నాడీయంకే, చివరికి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన నేషనలిస్‌‌ట కాంగ్రెస్‌ పార్టీ తదితర పార్టీలు కూడా ఎన్డీయేకి మద్దతు ఇచ్చేందుకు సంసిద్దత ప్రకటించాయి. ఎన్డీయే కూటమి స్వయంగా 300 సీట్లు సాధించే అవకాశం ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్తగా ఇతర పార్టీల మద్దతు స్వీకరించేందుకు తాము సిద్దమని బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం 25 పార్టీలున్నాయి. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎన్డీయే కూటమిలో చేరే పార్టీల, స్వతంత్ర యంపీల జాబితా మరింత పెరుగవచ్చును.ఇంతవరకు మోడీని, బీజేపీను బూచిగా చూపిస్తూ కుహనా లౌకిక వాదంతో పబ్బం గడుపుకొన్న కాంగ్రెస్ పార్టీకి మున్ముందు గడ్డు రోజులు ఎదురవవచ్చును.

యు.పి.ఎ. నిర్ణయాలను సమీక్షిస్తాం: వెంకయ్య నాయుడు

      దేశంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ఈ విషయంలో తమకు ఎలాంటి సందేహం లేదని భారతీయ జనతాపార్టీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అవినీతి కూపంలో నెట్టేసిందని ఆయన విమర్శించారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఎన్టీయే ప్రభుత్వం సమీక్షించే అవకాశం వుందని వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ తన బాధ్యతని సమర్థంగా నిర్వహించాలేదని వెంకయ్య నాయుడు అన్నారు.

ఏపీఎస్ఆర్టీసీని ముక్కలు చేసేశారు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్‌టిసి)ని విజయవంతంగా రెండు ముక్కలు చేసేశారు. గవర్నర్ నరసింహన్ గత కొద్ది రోజులుగా ఆర్టీసిని ఎలా ముక్కలు చేయాలా అని మంతనాలు చేస్తున్నారు. డిస్కస్ చేసీ చేసీ చివరికి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసికి వున్న బస్సుల్లో ఆంధ్రప్రదేశ్‌కి 10,352 బస్సులు ఇస్తారు. తెలంగాణకి 9,064 బస్సులు ఇస్తారు. అలాగే 70,231 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయిస్తారు. 63,479 ఉద్యోగులను తెలంగాణకు ఇస్తారు. 122 డిపోలు ఆంధ్రప్రదేశ్‌కి, 94 డిపోలు తెలంగాణకు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఆర్టీసీ జోన్లు ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో 3 ఆర్టీసీ జోన్లు ఏర్పాటు చేస్తారు.

భూమా శోభానాగిరెడ్డి కుమారుడి కారులో మంటలు

  భూమా శోభానాగిరెడ్డి కుమారుడి కారులో మంటలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్ళగడ్డ మాజీ శాసనసభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించిన సంఘటనను తెలుగు ప్రజలు మరచిపోలేకపోతున్నారు. తల్లి కారు ప్రమాదంలో మరణించిన విషాదం నుంచి భూమా శోభా నాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డి ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే విఖ్యాత్ రెడ్డి కూడా ఒక కారు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో విఖ్యాత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కలుగకపోవడం అదృష్టం. బుధవారం నాడు హైదరాబాద్‌లోని బేగంపేటలో విఖ్యాత్ రెడ్డి తన కారులో ప్రయాణిస్తూ వుండగా, కారు ఇంజన్‌లోంచి అకస్మాత్తుగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన విఖ్యాత్ రెడ్డి వెంటనే కారులోచి దిగిపోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారు ఇంజన్‌లో భారీగా రేగిన మంటల కారణంగా కారు బాయ్‌నెట్, కారు లోపలి భాగాలు కాలిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన బాటసారులు మంటలను అదుపులోకి తెచ్చారు.

కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం

      తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. పని జరుగుతూ వుండగా వేడి నీరు మీద పడటంతో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురు సంస్థ ఉద్యోగులు. ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు. అయితే ఈ ఆరుగురికి చిన్నపాటి కాలిన గాయాలు అయ్యాయి తప్ప ప్రాణాపాయం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం అంటే ఏం జరిగిందో అని ప్రజలు భయపడతారని, అయితే ఇక్కడ జరిగింది అణు ధార్మికతకు సంబంధించిన ప్రమాదం కాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు.

అభయ దోషులకు 20 ఏళ్ళ జైలు

      హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిపై అత్యాచారం కేసు (అభయ కేసు)లో దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐటీ ఉద్యోగిపై అత్యాచారం చేసిన దోషులు సతీష్, వెంకటేశ్వర్లుకు చెరో ఇరవై ఏళ్ళ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇండియన్ పీనల్ కోడ్ లోని 356, 342, 376డి సెక్షన్ల ప్రకారం ఈ శిక్ష ఖరారయింది. 2013 సంవత్సరం అక్టోబర్‌లో ఐటీ ఉద్యోగిపై అత్యాచారం జరిగింది. నిర్భయ చట్టం తర్వాత జరిగిన ఈ సంఘటనను పోలీసులు బాధితురాలి పేరు బయటకి తెలియకుండా అభయ కేసుగా పేర్కొంటూ వచ్చారు. ఈ కేసు విచారణ ఏడు నెలలపాటు జరిగింది. 21 మందిని సాక్షులుగా విచారించారు.

ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు... లోక్‌సభ స్పీకర్‌‌గా అద్వానీ?

      దేశ రాజకీయాలలో ఒకసారి చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు మరోసారి చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. కేంద్రంలో ఎన్డీయే కూటమి పూర్తి స్థాయిలో ఏర్పడగానే ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబునాయుడుని నియమించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. అలాగే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే ప్రధానమంత్రి మోడీకే ఎన్డీయే కన్వీనర్ బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచన కూడా వుంది. అయితే చంద్రబాబు ఆ పదవికి సంపూర్ణంగా న్యాయం చేస్తారన్న అభిప్రాయం ఎన్డీయే పార్టీల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ సీనియర్ నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వాలనేదానిమీద కూడా చర్చ జరుగుతోంది. సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ వంటి నేతలకు అప్పగించే శాఖలు, బాధ్యతలపై బీజేపీలో అప్పుడే చర్చ మొదలైంది. అద్వానీని లోక్‌సభ స్పీకర్‌ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కేంద్ర రక్షణ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ను నియమించే సూచనలు కనిపిస్తున్నాయి.

సినీ ఫక్కీలో నైస్‌గా కోటి లూటీ

      పాట్నాలో కొంతమంది దొంగలు సినిమా స్టైల్లో కోటి రూపాయలు కొట్టేశారు. పాట్నా శివార్లలో వున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుంచి కోటి రూపాయల నగదు వ్యాన్‌లో తరలిస్తూ వుండగా ఆ వాహనాన్ని ఎనిమిదిమంది దుండగులు అడ్డుకున్నారు. వాహనం ఆగగానే వ్యాన్‌లో వున్న డ్రైవర్, ఇద్దరు గార్డులు, బ్యాంకు ఉద్యోగి మీది దాడిచేసి గాల్లోకి కాల్పులు జరిపి వారిని బంధించారు. ఆ తర్వాత వ్యాన్‌లో వున్న డబ్బు పెట్టెని తీసుకుని పరారయ్యారు. పోయేవాళ్ళు ఖాళీగా పోకుండా గార్డ్ చేతిలో వున్న రైఫిల్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు. బ్యాంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తీవ్రంగా గాలించారు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో డబ్బు పెట్టె దొరికింది. కాకపోతే అందులో డబ్బు లేదు.

పెళ్ళి చేసుకోమంటే విషం తాగిన ప్రియుడు

      ప్రేమనగర్ సినిమాలో ప్రియుడు ‘మధువు తాగనన్నాను.. విషం తాగమన్నావు’ అని పాడతాడు. హైదరాబాద్‌లో ఓ ప్రేమికుడు మాత్రం ‘పెళ్ళి చేసుకోమన్నావు.. విషం తాగుతున్నాను’ అని విషం తాగి చనిపోయాడు పెళ్ళి చేసుకొమ్మంటూ ప్రియురాలు పెట్టే టార్చర్ భరించలేక సత్యనారాయణ అనే వ్యక్తి వ్యక్తి విషం తాగి చనిపోయాడు. సత్యనారాయణకు ఆల్రెడీ పెళ్లయింది. ప్రైవేట్ జాబ్ చేసేవాడు. తన ఆఫీసులోనే పనిచేసే ఒక యువతిని ప్రేమించాడు. ప్రేమించావు కదా పెళ్ళి చేసుకో అని ఆమె చాలాకాలంగా ఒత్తిడి చేస్తోంది. ఈ విషయమై వీళ్ళిద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో విషం బాటిల్‌తో సత్యనారాయణ ఇంటికి వచ్చిన సదరు ప్రియురాలు ‘పెళ్లి చేసుకుంటావా.. విషం తాగమంటావా’ అంటు బెదిరించింది. దాంతో ఈ ప్రేమ వ్యవహారం అతని ఇంట్లో కూడా తెలిసిపోయింది. దీన్ని భరించలేకపోయిన సత్యనారాయణ తన ప్రియురాలి చేతిలో వున్న విషం బాటిల్ని లాక్కుని తానే తాగేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది.

కాంగ్రెస్ ఓటమి స్వయంకృతాపరాధమే

  సిపిఐ నేత కె.నారాయణ మీడియాతో మాట్లాడుతూ "తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని" జోస్యం చెప్పారు. "తెలంగాణాలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోవడం వారి స్వయంకృతాపరాధమేనని" ఆయన అన్నారు. కాంగ్రెస్ విషయంలో ఆయన మాటలు చాలా చేదుగా ఉన్నప్పటికీ అవి నూటికి నూరు పాళ్ళు నిజమని అంగీకరించక తప్పదు. ఎందుకంటే సోనియాగాంధీ ఎంతసేపు కూడా తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఏవిధమయిన ఎత్తులు వేయాలనే ఆలోచించారు తప్ప ఏనాడు తెలుగు ప్రజల భావోద్వేగాలను, వారి అభిప్రాయాలను పట్టించుకోలేదు. ఆ ప్రయత్నంలోనే వరుసపెట్టి అనేక తప్పులు చేసుకొంటూ వెళ్ళిపోయారు. స్వంత పార్టీ నేతలను కాదని, కాంగ్రెస్ పార్టీని సవాలు చేస్తున్న కేసీఆర్, జగన్ లను అక్కున చేర్చుకొన్నారు. నమ్మదగని వ్యక్తులను నమ్ముకొని చేయకూడని పనిని, సమయం కాని సమయంలో చేసి చేతులు కాల్చుకొంది హస్తం పార్టీ. సీమాంధ్రలో పార్టీని, నేతల భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి, ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా, పార్లమెంటరీ వ్యవస్థకు మాయని మచ్చగా రాష్ట్ర విభజన చేసింది. యావత్ దేశమంతా ఆ ఘోరకలిని చూసి నివ్వెరపోయింది. అందువలన ఆ ప్రభావం కేవలం ఆంధ్ర, తెలంగాణాలకే పరిమితమయిపోక యావత్ దేశ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ దోషిగా నిలబడింది. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఏనాడు బాధపడిందీ లేదు. పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. పైగా తెలంగాణాలో ఒకమాట, ఆంధ్రాలో ఒక మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్, జగన్ లతో రహస్య ఒప్పందాలు చేసుకొని, పైకి మాత్రం వారు తమ శత్రువులన్నట్లు వారితో యుద్ధం చేస్తూ ప్రజలను వంచించింది. ఇప్పుడు ఆ తప్పులకు ఫలితం అనుభవించబోతోంది. అయితే ఇదంతా ఎవరి కోసం చేసిందో వారికి లబ్ది కలగలేదు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన తప్పుల వలన రాహుల్ గాంధీ రాజకీయ జీవితమే కాదు, అనేకమంది నిఖార్సయిన కాంగ్రెస్ నేతల జీవితాలు కూడా బలయిపోయాయి. ఇది స్వయంకృతాపరాధమే తప్ప మరొకటి కాదు.

మోడీ స్థానంలో గుజరాత్ సీఎంగా మహిళ?

  నరేంద్రమోడీ భారతదేశ ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టిస్తే ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి దక్కుతాయి? ఈ బాధ్యతలు ఒక మహిళకు దక్కనున్నట్టు తెలుస్తోంది. మోడీ స్థానంలో సీఎం కావాలని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలామంది కలలు కంటున్నారు. వీరిలో సౌరభ్ పటేల్, నితిన్ పటేల్ ప్రధానంగా వున్నారు. అయితే గుజరాత్ తదుపరి సీఎం రాష్ట్ర రెవిన్యూ మంత్రి ఆనందిబెన్ పటేల్ అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. మోడీ మద్దతు కూడా ఈమెకే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు.

ఖమ్మంలో సీపీఐ నారాయణ ఓటమి ఖాయం

  ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సీపీఐ కార్యదర్శి నారాయణ ఓడిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ అనుమానం స్వయంగా నారాయణే కలిగిస్తున్నారు. ఖమ్మంలో తాను నైతికంగా గెలిచినట్టేనని ఆయన చెప్పారు. అంటే ఆయన నైతికంగానే తప్ప మామూలుగా ఖమ్మంలో గెలిచే అవకాశం లేదని చెప్పకనే చెప్పారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి తనను ఓడించేందుకు సీపీఎం కార్యదర్శి వీరభద్రం సర్వశక్తులూ ఒడ్డి కృషి చేశారని నారాయణ ఆరోపించారు. తనను ఓడించడానికి వీరభద్రం వైకాపా అభ్యర్థి నుంచి 15 కోట్ల రూపాయలు తీసుకున్నారని నారాయణ ఆరోపించారు. అంతేకాకుండా నారాయణ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళారు. గతంలో పువ్వాడ నాగేశ్వరరావును ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తమ్మినేని 70 లక్షలు తీసుకున్నారని, ఇప్పుడు తనను ఓడించేందుకు వైకాపాతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించే పనిలో బిజీగా వున్న రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్ ఆ తర్వాత రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌గా వుంటారు. అపాయింటెడ్ డే అయిన జూన్ 2 తర్వాత సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌గా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్రంలోని ప్రధాని మన్మోహన్ సింగ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మన్మోహన్ అధికారం చివరిలో తీసుకున్న కీలక నిర్ణయం ఇది. దీనికి సంబంధించిన ఫైలు మీద కూడా మన్మోహన్ సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేస్తే... రెండు రాష్ట్రాల గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాష్ట్ర విభజన సంగతేమోగానీ, నరసింహన్‌కి మాత్రం లక్కీఛాన్స్ దక్కింది.

లగడపాటి చివరి ప్రెస్‌మీట్ వివరాలు

      రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్ బుధవారం తన చివరి రాజకీయ ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ ప్రెస్‌మీట్‌లో తాను నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలో, జాతీయవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయనే విషయాన్ని ఆయన అంకెలతో సహా వివరించారు. సర్వే ఫలితాలను ప్రకటించిన అనంతరం లగడపాటి ఇది తన చివరి ప్రెస్ మీట్ అని ప్రకటించారు. ఇక నుంచి తన పేరు రాజకీయాల్లో వినిపించదని ఆయన తెలిపారు. తాను ఇప్పుడు వెల్లడించిన సర్వే ఫలితాలలో వ్యక్తిగతంలో ఏ పార్టీ మీ అభిమానంతోనో, ద్వేషంతోనే ప్రకటించినవి కావని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో తన పనుల ద్వారాగానీ, మాటల ద్వారాగానీ ఎవరినైనా బాధపెట్టి వుంటే క్షంతవ్యుడినని లగడపాటి చెప్పారు.

మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఫెయిలయ్యారు: అరుణ్ జైట్లీ

      నిన్న చివరి పదవీదినాన్ని జరుపుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఫెయిలయ్యారని బీజేపీ నాయకులు అరుణ్ జైట్లీ విమర్శించారు. ప్రపంచంలో మేటి ఆర్థికవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ప్రైమ్ మినిస్టర్‌గా పూర్తిగా ఫెయిలై దేశ ప్రజల దృష్టిలో చులకనైపోయారని జైట్లీ అన్నారు. ప్రధాని మన్మోహన్‌ విధాన పరమైన నిర్ణయాల విషయంలో కఠినంగా వ్యవహరించి ఉంటే గౌరవం దక్కించుకునేవారని అభిప్రాయపడ్డారు. సోనియా స్థానంలో మన్మోహన్ ప్రధాని కావటంతో అనేక పరిమితులు, ఒత్తిడులకు లోబడిఆయన పనిచేశారని జైట్లీ తన బ్లాగులో అన్నారు. లోక్‌సభ ఫలితాలు వెలువడక ముందే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలన్న మన్మోహన్ నిర్ణయాన్ని జైట్లీ పొగిడారు. పీవీ హయాంలో మన్మోహన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక రంగానికి కొత్త ఉత్సాహం ఇచ్చాయని, అయితే ప్రధానిగా ఆయన విఫలమయ్యారని జైట్లీ చెప్పారు.

టర్కీ బొగ్గుగనిలో పేలుడు.. 250 మంది మృతి!

      టర్కీలోని సోమా ప్రాంతంలో వున్న ఒక బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో దాదాపు 250 మంది గని కార్మికులు మరణించారు. గని లోపల ఇంకా చాలామంది తీవ్రంగా గాయపడి వుండొచ్చని భావిస్తున్నారు. పేలుడుతోపాటు పేలుడు వల్ల విషవాయువులు వెలువడటంతో ఇంత భారీస్థాయిలో మరణాలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మొత్తం 787 మంది కార్మికులు వున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని భయపడుతున్నారు. రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. అయితే ఎక్కడో భూమి లోపల గనిలో వున్నవారిని బయటకి తీసుకురావడానికి వారు చాలా శ్రమించాల్సి వస్తోంది. గని లోపల భారీ స్థాయిలో దుమ్ము, పొగ అలముకుని వున్నందున ఎవరికీ ఏమీ కనపించని పరిస్థితి వుంది.

లగడపాటి సర్వే ఫలితాలు: టీడీపీ, బీజేపీ హవా!

      ఎన్నికల కోడ్ ముగియడంతో సర్వేల సూపర్‌స్టార్ లగడపాటి రాజగోపాల్ తాను చేయించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను బుధవారం వెల్లడించారు. లగడపాటి గతంలో చెప్పినట్టుగానే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్టీయే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే రాష్ట్రం విడిపోయిన పక్షంలో సీమాంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. ఒకవేళ రాష్ట్రం విడిపోకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. రాష్ట్రం విడిపోయిన పక్షంలో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. లగడపాటి వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు అంకెల్లో ఇలా వున్నాయి.   సీమాంధ్రలో ఎంపీ స్థానాలు... టీడీపీ, బీజేపీ కూటమి: 19 నుంచి 22 స్థానాలు. వైకాపా: 3 నుంచి 6 స్థానాలు. సీమాంధ్రలో ఎమ్మెల్యే స్థానాలు... టీడీపీ, బీజేపీ కూటమి: 115 నుంచి 125 స్థానాలు వైకాపా: 45 నుంచి 55 స్థానాలు. తెలంగాణలో ఎంపీ స్థానాలు... టీఆర్ఎస్: 8 నుంచి 10 స్థానాలు. కాంగ్రెస్: 3 నుంచి 5 స్థానాలు. టీడీపీ, బీజేపీ కూటమి: 3 నుంచి 4 స్థానాలు. ఎంఐఎం: 1 స్థానం.  

తెలంగాణ ఎంపీటీసీల్లో కాంగ్రెస్ ఆధిక్యం

      తెలంగాణ జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ తుది దశకు చేరుకొంది. కౌంటింగ్ ప్రారంభమైన తొలిరౌండ్ నుంచి అధిక్యం ప్రదర్శించిన టీఆర్ఎస్ పార్టీ ఆ తరువాత పరిస్థితిలో మార్పు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఆధిక్యంలోకి దూసుకు వచ్చింది. తెలంగాణ జిల్లాల వారీగా బుధవారం ఉదయం పదకొండు గంటలకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి. 1. ఆదిలాబాద్: కాంగ్రెస్ (163), తెలుగుదేశం (64), తెరాస (292), ఇతరులు (117) 2. కరీంనగర్: కాంగ్రెస్ (280), తెలుగుదేశం (33), తెరాస (349), ఇతరులు (155) 3. వరంగల్: కాంగ్రెస్ (264), తెలుగుదేశం (115), తెరాస (234), ఇతరులు (60) 4. ఖమ్మం: కాంగ్రెస్ (99), తెలుగుదేశం (243), తెరాస (0), ఇతరులు (283) 5. నల్గొండ: కాంగ్రెస్ (395), తెలుగుదేశం (151), తెరాస (114), ఇతరులు (175) 6. నిజామాబాద్: కాంగ్రెస్ (228), తెలుగుదేశం (31), తెరాస (239), ఇతరులు (85) 7. మెదక్: కాంగ్రెస్ (296), తెలుగుదేశం (102), తెరాస (216), ఇతరులు (59) 8. రంగారెడ్డి: కాంగ్రెస్ (221), తెలుగుదేశం (127), తెరాస (143), ఇతరులు (122) 9. మహబూబ్ నగర్: కాంగ్రెస్ (365), తెలుగుదేశం (174), తెరాస (297), ఇతరులు (133) మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 2311, తెలుగుదేశం: 1040, తెరాస: 1884, ఇతరులు:1189.