తెలంగాణ స్థానిక ఎన్నికలపై తొలగిన సస్పెన్స్!
posted on Nov 18, 2025 @ 3:04PM
తెలంగాణ స్థానిక ఎన్నికలు ఎప్పడు అన్నదానిపై సస్పెన్స్ తొలగిపోయింది. జూబ్లీ ఉప ఎన్నిక విజయంతో మాంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇదే జోరులో, ఇదే జోష్ లో ఉండగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కూడా వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 1 నుంచి 9 వ తేదీ వరకూ జరగనున్న ప్రజాపాలన ఉత్సవాల తరువాత స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి 20 నెలలకు పైగా అయ్యింది. ఈ నేపథ్యంలో వాటి నిర్వహణపై గత ఏడాదిగా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకోవడంతో ఆ సస్పెన్స్ తొలగినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా పాలన వారోత్సవాలు ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటున్నారు. తొలుత పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత స్వల్ప విరామం అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.
అధికార పార్టీ తొలుత స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఉండాలని సంకల్పించింది. ఆ కారణంగానే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జాప్యం అయ్యాయని చెప్పక తప్పదు. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకించడంతో అది వీలు కాలేదు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలుత హైకోర్టును, అటు పిమ్మట సుప్రీం కోర్టునూ ఆశ్రయించింది. అయితే.. రెండు చోట్లా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల స్పందన రాలేదు. హైకోర్టు రిజర్వేషన్లలో 50శాతం పరిమితికి కట్టుబడి ఉండాలని సూచించగా, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు సంబంధించి ఈ నెల 24న సమీక్షించనుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వర్గాలలో హైకోర్టు ఏం చెబుతుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం అనుకూలంగా ఉన్న ప్రజల మూడ్ మారకుండానే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.