మద్యం కేసులో చంద్రబాబును అరెస్టు చేయం: కోర్టుకు సీఐడీ
posted on Oct 31, 2023 @ 3:41PM
మద్యం కేసులో ముందస్తు బెయిలు కోరుతూ చంద్రబాబు అత్యవసర పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్కిల్ కేసులో ఆరోగ్య కారణాలతో బెయిలు ఇచ్చినందున మద్యం కేసులో చంద్రబాబును ఇప్పటికిప్పుడు అరెస్టు చేయబోమని ప్రభుత్వం తరఫున వాదించిన అడిషనల్ అడడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆయన కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణకు హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఇలా ఉండగా మరి కొద్ది సేపటిలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో జైలు వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్న తెలుగుదేశం నాయకులు, శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వైపు వెళ్లే అన్ని మార్గాలనూ పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ మార్గాలలో ఆర్టీసీ బస్సులు వినా మరో వాహనాన్ని పోలీసులు అనుమతించడం లేదు.
జైలు పరిసర ప్రాంతాలలో కఠిన ఆంక్షలు విధించారు. దీంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వేశారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. ఎన్ని ఆంక్షలు విధించినా తగ్గేది లేదనీ, చంద్రబాబు వెంట రావులపాలెం వరకూ వెళ్లితీరుతామని స్పష్టం చేస్తున్నారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో జైలు పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.