చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలు.. సీఐడీ అభ్యర్థనకు హైకోర్టు నో
posted on Nov 3, 2023 @ 11:15AM
చంద్రబాబు మధ్యంతర బెయిలులో అదనపు షరతులు విధించాలంటూ ఏపీ సీఐడీ హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు కార్యకలాపాలపై నిఘాకుఇద్దరు డీఎస్పీలను నియమించాలన్న ఏపీ సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అదనపు షరతుల సంగతి పక్కన పెడితే.. చంద్రబాబునాయుడు స్కిల్ కేసుకు సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొంది. అలాగే రాజకీయ ర్యాలీలలో పాల్గొనకూడదంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలూ కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.
చంద్రబాబు మధ్యంతర బెయిలుపై సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్ పై బుధవారం (నవంబర్ 1) విచారణ జరిపిన హైకోర్టు తీర్పును శుక్రవారానికి (నవంబర్ 3) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తన అనుబంధ పిటిషన్ లో సీఐడీ బెయిలు షరతులను చంద్రబాబు ఉల్లంఘించారనీ, రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారనీ పేర్కొన్నారు.
అలాగే షరతులను ఉల్లంఘించి రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి వరకూ భారీ ర్యాలీ తీశారని కూడా పేర్కొన్నారు. అయితే సీఐడీ వాదనలతో విభేదించిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు.. చంద్రబాబు కోర్టు ఆదేశాలను అతిక్రమించలేదనీ, ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మాట్లాడటం ప్రాథమిక హక్కులో భాగమే తప్ప షరతుల అతిక్రమణ కాదని పేర్కొన్నారు. అంతే కాకుండా సీఐడీ కోరుతున్న అదనపు షరతులు ప్రాథమిక హక్కులను హరించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.