రేవంత్ రెడ్డితో భేటీ అయిన డిప్యూటి మేయర్ శ్రీలత
posted on Feb 13, 2024 @ 11:46AM
ఆరునెలల్లో మళ్లీ కెసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన నేతలే ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బిఆర్ఎస్ హాయంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కెటిఆర్ కు నమ్మినబంటు. అతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్సిన మరుసటి రోజే డిప్యూటి మేయర్ శ్రీలత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్సుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆమె తన భర్త శోభన్ రెడ్డితో కల్సి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కాంగ్రెస్ సొంతమయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా విజయాలు దక్కాయి. అయితే హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యతను కనపరిచింది. దీంతో, కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో హైదరాబాద్ పై ఫోకస్ చేసింది.
జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన భర్త శోభన్ రెడ్డితో కలిసి ఆమె సీఎంతో భేటీ అయ్యారు. రెండు రోజుల్లో శ్రీలత దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ సందర్భంగా వీరితో పాటు ఫసీయుద్దీన్ కూడా ఉన్నారు.
కొంత కాలంగా బీఆర్ఎస్ హైకమాండ్ పై శ్రీలత దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్, కేటీఆర్ తమను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.