శ్రీశైలంపై మొంథా ఎఫెక్ట్- పాతాళగంగ మెట్ల మార్గంలో విరిగిపడిన కొండ చరియలు

శ్రీశైలం క్షేత్రంపై మొంథా ఎఫెక్ట్ పడింది.  శ్రీశైలం మండలంలో గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. కార్తీక మాసం సందర్భంగా దర్శనానికై క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గదులకే పరిమితమయ్యారు. మరోవైపు శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంపై కొండ చరియలు విరిగిపడడంతో మూడు షాపులు ధ్వంసం అయ్యాయి.  భారీగా కొండ చర్యలు విరిగి పడుతుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యా రు.కొండచరియలు విరిగిపడిన ఘటన రాత్రి వేళ జరగడంతో ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.  వర్షపునీరు భారీగా దిగువకు ప్రవహిస్తుండటంతో  ఇళ్ల ముందు ఉన్న మట్టి రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఇలాగే కొనసాగితే పాతాళగంగ మెట్ల మార్గంలో  ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తుఫాను ప్రభావం మరో రెండు రోజులు ఉన్న నైపథ్యంలో శ్రీశైలం వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.  

మరో 24 గంటలు వాయు‘గండమే’

మొంథా తుపాను మంగళవారం (అక్టోబర్ 28) అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో అర్థరాత్రి 12.30 తర్వాత తీరం దాటినట్లు భారత వాతవరణ శాఖ వెల్లడించింది.  కాగా, మొంథా తుపాను ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం (అక్టోబర్ 29)  కోస్తా ఆంధ్రా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.   రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

వర్ష బీభత్సం.. ఈదురు గాలుల విలయం

మొంథా పెను తుపాను మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది.కాకినాడ, మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం సమీపంలో తీరం దాటింది. తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి.  అత్యధిక ప్రభావం ఉన్న కాకినాడ, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని చింతూరు, రంపాచోడవరం డివిజన్లలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి 8:30 గంటల నుంచి బుధవారం ఉదయం 6:00 గంటల వరకు ఈ ఏడు జిల్లాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.  వరి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది.   మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నిరంతరాయ కమ్యూనికేషన్ కోసం 81 వైర్‌లెస్ టవర్లు, 21 పెద్ద దీపాలను సిద్ధం చేశారు. కూలిపోయిన చెట్లను తొలగించడానికి 1,447 ఎర్త్‌మూవర్లు, 321 డ్రోన్‌లు, 1,040 చైన్‌సాలు సిద్ధంగా ఉంచారు. ముందస్తు జాగ్రత్తగా, రాష్ట్రవ్యాప్తంగా నివాసితులకు 3.6 కోట్ల అలెర్ట్ సందేశాలను పంపించారు.ఇక తుపాను ప్రభావంతో   పలు జిల్లాలు అతలాకుతలం అయ్యీయి. కుండపోత వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు ఘాట్ రోడ్డుపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.  ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒంగోలు సమీపంలోని యరజర్ల-వెంగముక్కలపాలెం మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అకస్మాత్తుగా పెరిగిన వరద తీవ్రతకు కారు అదుపుతప్పి వాగులోకి జారిపోయింది. అయితే, డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారులో నుంచి బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రస్తుతం భూభాగంపై ప్రవేశించిన ఈ తుపాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  తుపాను ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

రాత్రి సచివాలయంలోనే సీఎం చంద్రబాబు...తుఫానుపై సమీక్ష

  మొంథా తుఫాను తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి 4 గంటల సమయం పట్టనుంది. దీంతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండనున్నారు. పరిస్థితి అదుపులో తేవడానికి అధికారులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం నుంచి ఐదారుగురితో ఓ బృందాన్ని పంపాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో ఉంటే... ప్రజలకు నమ్మకం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  కాల్వలు, చెరువులు రోడ్లకు ఎక్కడైనా కోతలు, గండ్లు పడ్డాయా అనే అంశంపై రాత్రిపూట కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయడంతోపాటు.. టెక్నాలజీని వినియోగించుకుని పంట నష్టాన్ని అంచనా వేయాలని సీఎం సూచించారు. శాఖల వారీగా నష్టం అంచనా నివేదికలను సిద్దం చేసుకోవాలని పేర్కొన్నారు.  నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాను కేంద్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలేశ్వరం, బుడమేరు తదితర వాగుల్లో ప్రవాహాలపై  ఆరా సీఎం తీశారు. ఏలేశ్వరం రిజర్వాయరుకు రెండు రోజుల్లో 3 టీఎంసీల వరకూ ప్రవాహాలు రావొచ్చని అధికారులు వివరించారు. వరద నిర్వహణకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం సూచనలు చేశారు. జిల్లాల్లోని పరిస్థితిని సీఎంకు ఫోన్ ద్వారా మంత్రులు నిమ్మల, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు వివరించారు.

హైకోర్టులో లేడీ డాన్ అంగూర్ భాయ్‌కి చుక్కెదురు

  హైదరాబాద్ ధూల్‌పేట్‌లో గంజాయి వ్యాపారాలు కొనసాగించే లేడీ డాన్ అరుణ్ బాయ్ అలియాస్ అంగూర్ భాయ్‌కి   తెలంగాణలో హైకోర్టులో పీడీ యాక్ట్ పై వేసిన పిటిషన్ పై చుక్కెదురైంది. అంగూర్ భాయ్ పై పెట్టిన పీడీ యాక్ట్ ను సవాలు చేస్తూ అంగూర్ భాయ్ హైకోర్టుకు వెళ్ళింది. పీడీ యాక్ట్ పై హైకోర్టులో  వేసిన పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంజ్ న్యాయమూర్తులు మౌసమి భట్టాచార్య, గాడి ప్రవీణ్ కుమార్ వాదనలు విన్న అనంతరం అంగూర్ భాయ్ పిటిషన్ను కొట్టివేస్తూ మంగళవారం తీర్పును వెలువరించారు.  అంగూరి బాయ్ పై పీడి యాక్ట్  కొనసాగించాలని ప్రభుత్వ స్పెషల్  ప్లిడర్ స్వరూప్  ఒరిలా, అసిస్టెంట్ లీడర్ రవి కుమార్ లు వాదనలు వినిపించారు. హైకోర్టు బెంచ్ న్యాయమూర్తులు అంగూర్ భాయ్ వేసిన వేసిన పీడీ యాక్ట్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు విలువరించారు. గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ పై ఎక్సైజ్ శాఖ ఎస్టిఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి  దూళిపేట ఎక్సైజ్ సీఐ మధుబాబు సిబ్బంది కలిసి అంగూర్ భాయ్ పై అనేక కేసులు ఉండడంతో ఆమెపై పిడి యాక్ట్ పెట్టాలని ప్రతిపాదించారు. అంగూర్ భాయ్ పై పీడీ యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నియమించిన అడ్వైజరీ బోర్డు 2025 మార్చి 10న ప్రతిపాదనలకు పంపించారు. బోర్డు సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్  2025 ఏప్రిల్ 15న అంగూర్ భాయ్ పై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. పీడీ యాక్ట్ ఉత్తర్వులను  సవాల్ చేస్తూ అంగూర్ భాయ్ హైకోర్టులో పీడీ యాక్ట్ ఫై  పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ వాద ప్రతిపాదనలు విన్న అనంతరం అంగూర్ భాయ్ వేసిన పిటిషన్ను కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తులు తీర్పు వెల్లడించారు.అంగూరు భాయ్ పై పీడీ యాక్ట్ పిటీషన్ ను హైకోర్టులో కొట్టివేయడం పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డైరెక్టర్ షాన్వాస్ ఖాసిం ఎక్సైజ్ సిబ్బందిని అభినందించారు.

తీరాన్ని తాకిన తుపాను....అతి భారీ వర్షాలు

  మొంథా తుపాను తుఫాను కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిందని వాతావరణ అధికారులు తెలిపారు. యానం- అంతర్వేదిపాలేం దగ్గర తీవ్రమైన తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3-4 గంటలు పడుతుందని ఐఎండీ వెల్లడించింది. తీర ప్రాంత జిల్లాల్లో గంటకు  గంటకు 90-100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  మరోవైపు.. తుపాన్‌ ప్రభావంతో పలుచోట్ల ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి. దీంతో అనేకచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఈ గాలుల తీవ్రతకు ఇప్పటికే పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తుపాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.  రానున్న 24 గంటల్లో తీరప్రాంతంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని తెలిపారు. బంగాళాఖాతంలో 4 నుంచి 5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతుండగా, తీరంలోకి 1 నుంచి 2 మీటర్ల ఎత్తున సముద్రపు నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దీని ఆధారంగా కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.  

తుపాను ఎఫెక్ట్... హైవేలపై భారీ వాహనాలు బంద్

  బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తీవ్ర తుపాను తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తు నివారణ చర్యల్లో భాగంగా కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై మంగళవారం రాత్రి 7 గంటల నుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరిజిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 6 గంటల వరకు ఈ జిల్లాల్లోని నేషనల్ హైవేలతో పాటు అన్ని రోడ్లపై వాహనలను నిలిపివేస్తున్నాట్లు వెల్లడించారు.  కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లల్లోనే అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.  కోనసీమ జిల్లాలో ఆర్టీసీ బస్సులని నిలిపివేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవ కుమార్ ప్రకటించారు. ప్రయాణికులు ఎవరూ బస్టాండ్‌కి రావొద్దని సూచించారు.  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌కి వెళ్లే ప్రైవేట్ బస్సులు కూడా నిలిపివేశామని పేర్కొన్నారు. మరోవైపు తుఫాను కాకినాడ, మచిలీ పట్నం మధ్య తీరాన్ని తాకిందని వాతావరణ అధికారులు తెలిపారు.

ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణ : మంత్రి శ్రీధర్ బాబు

  2030 నాటికి తెలంగాణను దేశ ఏరో-ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర "రోడ్ మ్యాప్"ను సిద్ధం చేస్తున్నామన్నారు. "టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్" , "సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్" సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఏర్పాటు చేసిన "ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్" న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంగళవారం హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు.  గ్లోబల్ "ఏరోస్పేస్-డిఫెన్స్ - స్పేస్" హబ్ గా తెలంగాణ ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. హైదరాబాద్ అంటే కేవలం "సిటీ ఆఫ్ పెరల్స్" మాత్రమే కాదని, ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్ నగరంగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు 2023-24లో  రూ.15,900 కోట్లు ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే ₹30,742 కోట్లకు పెరిగాయన్నారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదని, తమ ప్రభుత్వ హయాంలో ఈ రంగం సాధించిన వృద్ధి రేటుకు నిదర్శనమన్నారు.  ఈ "న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ"లో ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజిన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపోనెంట్), లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్ (రోటేటివ్ కాంపోనెంట్) తయారవుతాయన్నారు. ఫలితంగా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. "విమాన ప్రయాణ భవిష్యత్తును నిర్మించాలనుకుంటే - దానిని తెలంగాణలో నిర్మించండి" అని ఈ వేదికగా అంతర్జాతీయ దిగ్గజ ఏరో సంస్థలకు పిలుపునిచ్చారు.  ఇంజిన్స్, కాంపోనెంట్స్, ఎమ్మార్వో, కన్వర్షన్స్, స్పేస్, డ్రోన్స్, డిజిటల్, ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్, ఈడీ మసూద్ హుస్సేన్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వైస్ ప్రెసిడెంట్ డొమినిక్ డూప్, టీజీఐఐసీ ఎండీ శశాంక, తెలంగాణ ఏరో స్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ తదితరులు పాల్గొన్నారు.

ఏఐ యుగంలో భద్రతా అతి పెద్ద రక్షణ : సీపీ సజ్జనార్

  డిప్ ఫేక్ లో తన ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే... అయితే ఏఐ యుగంలో భద్రతా పదం మీకు అతి పెద్ద రక్షణ అంటూ వీసీ సజ్జనార్ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్‌ఫేక్‌ యుగంలో, సాంకే తికత అద్భుతాలు చూపుతున్నప్పటికీ మోసగాళ్లకు కూడా కొత్త మార్గాలు దొరికి నట్లు అయింది... ఇప్పుడు ఏఐ టూల్స్ సహాయంతో మీ ముఖం, మీ స్వరం అచ్చుగుద్ది నట్టుగా క్లోన్ చేయగలుగుతున్నారు. ఈ సాంకేతిక తను కొంతమంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తూ స్నేహితుడు, సహోద్యోగి లేదా అధికారిగా నటిస్తూ అమాయకులను టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్ప డుతున్నారని అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండాలంటూ హైదరాబాద్ సీపీ కొన్ని సూచనలు చేశారు. మీ రక్షణ కోసం ‘సేఫ్ వర్డ్’ ఏర్పాటు చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితు లతో కలిసి ఒక ప్రత్యేకమైన ‘సేఫ్ వర్డ్’ (భద్రతా పదం) నిర్ణయించుకోండి. అనుమానాస్పదమైన కాల్స్ లేదా ఫోన్ కి సందేశం వచ్చిన ప్పుడు ఆ పదం ద్వారా నిజసత్యం ధృవీకరించండి. మీ వ్యక్తిగత ఫోటోలు కానీ వీడియోలు కానీ లేదా ఆర్థిక వివరాలు ఎప్పుడూ ఎవరితోనూ కూడా పంచుకోవద్దని సీపీ సూచిం చారు. ఏఐ మనకు శక్తినిస్తుంది. కానీ అదే సమయంలో ప్రమాదంలోకి నెట్టగలదు కూడా....మన  అప్రమత్తతే మనకు రక్షణ....అంటూ  హైదరాబాద్ వీసీ సజ్జనార్ తన ఎక్స్ లో ట్వీట్ చేస్తూ అందర్నీ అప్రమత్తం గా ఉండాలంటూ సూచించారు. 

సినిమా టికెట్ల రేట్లపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

  తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20 శాతం ఇస్తే టికెట్ రేట్ల పెంపునకు జీవో ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్‌తో పోటీ పడేలా షూటింగ్‌లు హైదరాబాద్‌లో నిర్వహించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. మంగళశారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు సన్మానం చేశారు.  ఒకప్పుడు తెలుగుచిత్ర పరిశ్రమ అంటే.. మదరాసి అని పిలిచేవారని గుర్తుచేశారు. టాలీవుడ్‌కు హైదరాబాద్‌కు తరలించాలని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సాయంతో భాగ్యనగరన్నికి తీసుకొచ్చారని తెలిపారు. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1964లో నంది అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు.  తనకు సినీ కార్మికుల కష్టాలు తెలుసని.. సినీ కార్మికులను పట్టించుకోనంత స్థాయికి ఇంకా తాను వెళ్లలేదని అన్నారు. సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత 10 ఎకరాల భూమి ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ అవార్డులు ప్రారంభించామని తెలిపారు.  ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేరాఫ్ కావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కృష్ణా నగర్ లో ఒక మంచి స్థలాన్ని చూడండి నర్సరీ నుంచి 12 గా తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటాని సీఎం అన్నారు.   మీ సమస్యలు తెలుసుకునేందుకే మిత్రుడు దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించాని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజుకు ఆ బాధ్యతలు ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో మా ప్రభుత్వం ముందుకు వెళుతోందని.. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మీ ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామన్నారు.  సినీ కార్మికుల  సంక్షేమానికి ఒక వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు ఫండ్ అందిస్తామని సీఎం తెలిపారు. కార్మికసంఘాల అసోసియేషన్ భవన్ నిర్మాణానికి ఆర్ధిక సాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, పొన్నం, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, సినీ నిర్మాతలు, దర్శకులు, కార్మిక సంఘాలు పాల్గోన్నారు.  

శంకర మఠంలో శ్రీ విధుశేఖర భారతీస్వామిని కలిసిన సీఎం రేవంత్

  హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. “ధర్మ విజయ యాత్ర” లో భాగంగా  శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి హైదరాబాద్ విచ్చేశారు.  ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను భారతీస్వామివారికి ముఖ్యమంత్రి వివరించారు. సీఎం.. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విధుశేఖర భారతీస్వామిని కలిసి.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

తుఫానుపై పోరు - సాంకేతికతే ఆయుధం!

ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువస్తున్న పెను తుపాను మొంథాతో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతే ఆయుధంగా యుద్ధం చేస్తోంది. తుపాను కారణంగా వర్షం తీవ్రత, పెనుగాలుల ఉధృతి ఆలా ప్రతి విషయాన్నీ సాంకేతిక పరిజ్ణానంతో  అంచనావేసి, సహాయ చర్యలపై పూర్తిగా దృష్టి పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రియల్ టైం హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసి తుపాను ప్రభావిత ప్రాంతాలలోని కోటీ 92లక్షల మందికి ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తున్నది. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు, సహాయ కార్యక్రమాలకూ ఎటువంటి ఆటంకం కలగకుండా వెంటనే విద్యుత్ ను పునరుద్ధరించేందుకు వీలుగా దాదాపు 2, 700కు పైగా జనరేటర్లను తుపాను ప్రభావిత ప్రాంతాలలో సిద్ధంగా ఉంచింది. అలాగే సెల్ టవర్లు కూలిపోయి సమాచార వ్యవస్థ స్తంభించే అవకాశం ఉందన్న అంచనాతో కమ్యూనికేషన్ కు ఎంత మాత్రం అంతరాయం కలగకుండా ఉండేందుకు 81 వైర్ లెస్ టవర్లను తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఏర్పాటు చేసింది.  ఇక భారీ వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టింది. చెట్లు నేలకొరిగిన ప్రాంతాలు, హెర్డింగ్ లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడ పడిపోయాయి అన్న వివరాలను డ్రోన్ కెమేరాలతో ఎప్పటికప్పుడు గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక తుపాను కారణంగా పంటనష్టం వివరాలను రైతులే స్వయంగా అప్ లోడ్ చేసే విధంగా యాప్ లో మార్పులు చేసి అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. తుపాను కారణంగా దాదాపు 43 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగే అవకాశాలున్నాయని ఇప్పటికే అంచనాలు వేసింది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల నుంచి నేరుగా ఫీల్డ్ డేటా డాష్ బోర్డుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసింది. ప్రజల భద్రతే లక్ష్యంగా టెక్నాలజీ ఆయుధంతో మొంథాతుపానును ఎదుర్కోనేందుకు చంద్రబాబు సర్కార్ సర్వసన్నద్ధమైంది.  

డీజీపీ ఎదుట లొంగిపోయిన చంద్రన్న

  మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చందన్న పోలీసుల ముందు లొంగిపోయారు. చంద్రన్నది పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్, సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతోనే వారు జనజీవన స్రవంతిలో కలిశారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. బండి ప్రకాశ్‌‌పై ఉన్న రూ. 20లక్షల రివార్డు, ప్రసాద్‌రావుపై ఉన్న రూ.25 లక్షల రివార్డు వారికే ఇస్తామని తెలిపారు.  ఇంక 64 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడించారు. మాంచేరియాల్ జిల్లా మందమార్రీ మండలం పోచమ్మ దేవాలయం ప్రాంతానికి చెందిన బండి ప్రకాష్ విద్యార్థి దశలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరారు.1980 దశకంలో “గ్రామాలకు వెళ్ళిపోవాలి” అనే విప్లవ ప్రచార ఉద్యమం సమయంలో ఆయన ఆక్టివ్‌గా ఉన్నారు.  తరువాత సింగరేణి ప్రాంతంలో శ్రమికుల సమస్యలపై పోరాటాలు నడిపి, సింగరేణి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడి నుంచే మావోయిస్టు రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సీపీఐ మావోయిస్టు పార్టీ  తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఆయన పార్టీకి చెందిన నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్‌గా పనిచేసి, దక్షిణ తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను సమన్వయం చేశారు. తన సుదీర్ఘ ఉద్యమ జీవితం కారణంగా ఆయన్ని “తెలంగాణ మావోయిస్టుల ఆలోచనాత్మక నేత”గా మిత్రులు, విప్లవ వర్గాలు గుర్తించాయి.

కాకినాడ పోర్టులో పదో నంబర్ ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాను తీరం వైపునకు దూసుకువస్తున్నది. మరి కొన్ని గంటలలో ఈ తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందన్న అంచనాలతో కాకినాడ పోర్టుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అలాగే గతన్నవరం, విశాఖ పోర్టులకు 9, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఎనిమిదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఉండగా తాజాగా తుపాను హెచ్చరికల కేంద్రం మొంథా తుపాను తీరం దాటే ప్రాంతంలో ఒకింత మార్పు ఉంటుందన్న అంచనాకు వచ్చింది. ఇంత వరకూ చెబుతున్నట్లుగా కాకినాడ వద్ద కాకుండా ఈ తుపాను కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.   తుపాను ప్రభావంతో ఇప్పటికే కోనసీమ ప్రాంతమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా బలంగా వీస్తున్నాయి. తుపాను తీరం సమీపానికి వచ్చే సరికి ఈ ఈదురుగాలుల వేగం మరింత పెరుగుతుందనీ, గంటకు 110 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచే ఈ గాలులకు చెట్లు నేలకొరగడమే కాకుండా, విద్యుత్ స్తంభాలు నేల కూలే ప్రమాదం ఉందనీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నంచి బయటకు రావద్దని హెచ్చరించింది.  తుపాను ప్రభావంతో ఇప్పటికే సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయా అన్నట్లుగా ఆకాశంలో నల్లని మబ్బులు కమ్మేశాయి. 

ఘోర విమాన ప్రమాదం...12 మంది మృతి

  కెన్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈ తెల్లవారుజామున కిచ్వా టెంబోకు వెళ్తున్న విమానం బయలు దేరిన కొద్దిసేపటిలో కెన్యాలోని క్వాలే కౌంటీలో కుప్ప కూలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల  కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం చేత దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, అత్యవసర సేవా బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. వాతావరణం అనుకూలించకపోయినా పైలట్ విమానాన్ని ముందుకు సాగించినట్లు స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.  పొగమంచు మరియు గాలిలో దట్టమైన మేఘాలు ఉండటం వల్ల పైలట్‌కు విజిబిలిటీ తగ్గి నియంత్రణ కోల్పోయిన అవకాశం ఉందని కూడా స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కెన్యా సర్కార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది.  

8వ వేతన కమిషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  కేంద్ర  క్యాబినెట్ 8వ వేతన కమిషన్‌కు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.  సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజన ప్రకాశ్‌ దేశాయ్‌ పే కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 18 నెలల్లో కమిషన్ ప్రతిపాదనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. అలాగే రబీ సీజన్‌లో రైతులకు పోషక ఆధారిత సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది.  ఇందుకోసం రూ.3,000 కోట్ల రూపాయల సబ్సిడీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి పాత కమర్షియల్ వాహనాలకు ఢిల్లీలో ప్రవేశం నిషేధం. బీఎస్-6 ఇంజన్ లేని వాహనాలకు కూడా అనుమతి నిరాకరించనున్నారు. రోజురోజుకు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయిని దృష్టిలో ఉంచుకుని, పాత వాణిజ్య వాహనాలపై ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు రూ.37,952 కోట్ల ఎరువుల రాయితీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మొంథా తుపాను.. పలు జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ అలర్ట్

  మొంథా తుపాను నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, ఒడిశాకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో  గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో.. ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో వరదలు వచ్చే ఛాన్స్ ఉందని, ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది.  మరోవైపు మొంథా తుపాను దిశ మార్చుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అమలాపురం యానం సమీపంలో రాత్రికి దాటే అవకాశం ఉందని కోనసీమ జిల్లా ప్రత్యేక అధికారి విజయ రామరాజు వెల్లడించారు. ఈ క్రమంలో కోనసీమ జిల్లా సముద్ర తీర ప్రాంతానికి  కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్నా వారిని యుద్ద ప్రాతిపదికన సురక్షిత ప్రాంతలకు తరలించారు.  ఇప్పటికే కోనసీమలో భారీగా కొబ్బరి చెట్లు నెలకులుతుండగా ఇద్దరు మృతి చెందారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాను ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణంగా 280 కి.మీ., కాకినాడకు ఆగ్నేయంగా 190 కి.మీ., మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 110 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.గడిచిన ఆరు గంటల్లో ఇది గంటకు 15 కి.మీ. వేగంతో కదులుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదిలి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

చెల్లిని అమ్మొదంటూ అక్కల రోదన.. నల్గొండ జిల్లాలో శిశువిక్రయం కలకలం

నల్గొండ జిల్లాలో శిశువిక్రయం కలకలం సృష్టించింది. పేదరికం, ఇద్దరు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండటం నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఎల్లాపురం కు చెందిన కొర్రబాబు, పార్వతి దంపతులు తమ శిశువును మూడు లక్షల రూపాయలకు విక్రయించారు. ఈ గిరిజన దంపతులు ఏడేళ్ల కిందట  నల్గొండకు వలస వచ్చారు.  2006లో  వారికి ఒక బాబు పుట్టి కొద్ది రోజులకే చనిపోయాడు. అనంతరం ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. 10 రోజుల కిందట 4వ కాన్పులో పార్వతికి మరో ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడం, పేదరికం వల్ల మరో ఆడపిల్లను సాకలేమంటూ..  దళారుల ద్వారా ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వారికి  తమ శిశువును రూ. 3 లక్షల రూపాయలకు  పెద్దవూర మండలం ఊరబావి తండాకు సమీపంలో పొట్టిచెలమ వద్ద చిన్నారిని కొనుగోలుదారులకు అప్పగించారు.  ఈ సందర్భంగా అంటే శిశువును అప్పగిస్తుండగా, పార్వతి, కొర్రబాబు ఇద్దరు పెద్ద బిడ్డలు  అమ్మా.. చెల్లెను అమ్మొద్దే  అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతున్న వీడియోలు బయటకు రావడంతో ఈ శిశువిక్రయం విషయం వెలుగులోకి వచ్చింది.   అంతే కాకుండా తన సోదరుడి పది రోజుల పాప కనిపించడం లేదంటూ కొర్ర బాబు అన్న సురేశ్ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది. శిశు విక్రయం ఘటనకు సంబంధించి నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐసీడీఎస్ సూపర్ వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు.. శిశువును అమ్మిన తండ్రితో పాటు కొనుగోలుదారులు, మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు.  ఇలా ఉండగా ఈ శిశువిక్రయం సంఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కృతి ఓజాలను ఆదేశించారు.  పిల్లల అమ్మకాలు, అక్రమ దత్తత‌పై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత బాధకరమని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. విక్రయించిన శిశువును వెంటనే సంరక్షణలోకి తీసుకుని, తల్లిదండ్రుల పరిస్థితిని తెలుసుకోవాలని, ఈ విషయంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.   

మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మావోయిస్టులు వరుసగా లొంగుబాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మరో కీలక మావోయిస్టు నేత మంగళవారం (అక్టోబర్ 28) పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్  పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు. బండి ప్రకష్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. -1982-84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా ఆర్ఎ‌స్‌యూ తరఫున పోరాడారు. ఆపై మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా   పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ బండి ప్రకాష్. దాదాపు 45 సంవత్సరాలుగా సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలలోనూ, రాష్ట్ర కమిటీ సభ్యుడుగానూ  పనిచేసిన బండి  ప్రకాష్ పోలీసుల ఎదుట లొంగపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బే అనడంలో సందేహం లేదు.