మొంథా తుపాన్.. కాకినాడ ‘హోప్’ ఐలాండ్

మొంథా తుపాన్ ప్రళయభీకర రూపం దాల్చి కాకినాడ తీరం వైపు దూసుకువస్తున్నది. ఈ తుపాను పెను విలయం సృష్టిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో కాకినాడ వాసులు మాత్రం ‘హోప్’ ఐలాండ్ ఉండగా భయమేల అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.   కాకినాడ తీరప్రాంతానికి కొద్ది దూరంగా బంగాళాఖాతంలో   టాడ్‌పోల్ ఆకారంలో ఉన్న ద్వీపమే ఈ హోప్ ఐలాండ్.   బంగాళాఖాతంలో 7 కిలోమీటర్ల దూరంలో  ఈ హోప్ ఐలాండ్ ఉంది. ఈ హోప్ ఐలాండ్ కారణంగానే  కాకినాడ    సహజ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. విశాఖకు డాల్ఫిన్స్ నోస్ కొండ ఎలాగో.. కాకినాడకు తుపానుల నుంచి సహజ రక్షణ కల్పించేదిగా ఈ హోప్ ఐలాండ్ ఉంది అని చెప్పవచ్చు.  ఇప్పుడు కాకినాడ వద్ద మొంథా తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ హోప్ ఐలాండ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హోప్ ఐలాండ్ కారణంగా తుపాను బీభత్స ప్రభావం చాలా వరకూ తగ్గే అవకాశం ఉందని మత్స్యకారులు ధీమాగా చెబుతున్నారు. తుపానుల నుంచి హోప్ ఐలాండ్ కాకినాడకు రక్షగా నిలుస్తూ వచ్చిందనీ, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.  బంగాళాఖాతం నుండి వస్తున్న బలమైన తుఫానుల నుండి హోప్ ఐలాండ్  కాకినాడ నగరాన్ని కాపాడుతుంది. తుఫాను ఉప్పెనలు, వంటి వాటికి ఈ హోప్ ఐలండ్ సహజ అవరోధంగా, నియంత్రికగా పని చేస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు.  సహజ అవరోధంగా హోప్ ఐలాండ్ (క్రచ్చులంక ) పనిచేస్తుంది. కా 

మొంథా తుపాన్ ఇంతకీ తీరం దాటేదెక్కడ?

మొంథా తుపాన్.. ప్రళయభీకరంగా బంగాళాఖాతంలోంచి తీరం వైపుకు దూసుకువస్తున్న ఈ పెను తుపాను గత మూడు నాలుగు రోజులుగా మూడు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. మూడు రాష్ట్రాలూ కూడా తీర ప్రాంతా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అన్ని ముందు జాగ్రత్త చర్యలతోనూ తుపాను నష్టం ప్రభావాన్ని అత్యంత కనిష్ఠానికి పరిమితం చేయాలన్న లక్ష్యంతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అయితే ఇంతకీ ఈ  మొంథా తుపాను ఎక్కడ తీరం దాటుతుంది? ఏపీ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలు మూడూ కూడా తమ రాష్ట్రంలోని ఏదో తీరం వద్ద ఈ తుపాను దాటుతుందన్న అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నాయి. సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో అలర్ట్ గా ఉన్నాయి. ఇక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మంగళవారం (అక్టోబర్ 28) సాయంత్రం లేదా రాత్రి ఈ మొంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఈ తుపాను కదలికలను నిశితంగా గమనిస్తున్న నిపుణుల సమాచారం మేరకు ఇది కొద్ది సేపు విశాఖకు సమీపంగా వస్తున్నది, అంతలోనే కాకినాడ తీరం వైపు కదులుతోంది. అలాగే కొంత మేర చెన్నైకి ఆగ్నేయంగా కదులుతోంది. దీంతీ తీరం చేరు సమయానికి తుపాను దశ ఎటు మళ్లుతుందో అన్న టెన్షన్ వాతావరణ శాఖకు పట్టుకుంది. అందుకే మూడు రాష్ట్రాలనూ కూడా పెను తుపాను ముప్పు విషయంలో అలర్ట్ చేస్తున్నది. ఒక సమయంలో కాకినాడ తీరం కాదు.. కోనసీమ  జిల్లాలోని శంకరగుప్తం, పడమటి లంక మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న సమాచారం కూడా వాతావరణ శాఖ నుంచి వచ్చింది. ఆ తరువాత మళ్లీ కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే మంగళవారం (అక్టోబర్ 28) సమయం గడిచే కొద్దీ తుపాను కదలికలపై క్లారిటీ వచ్చిందనీ, ఇది కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ వాతావరణ శాఖ చెబుతోంది.  

చిగురుటాకులా వణుకుతున్న కోస్తా తీరం

మొంథా తుపాను ప్రభావంతో కోస్తా తీరం చిగురుటాకులా వణుకుతోంది. సముద్రంలో అలలు అలలు ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. అలల తాకిడికి  ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది. ఇప్పటికే అక్కడ దెబ్బతిన్న కొన్ని గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.మొంథా తుఫాన్ తీవ్ర తుఫాన్ గా బలపడింది.  తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.   శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్  కారణంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం  ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మొంథా తుఫాన్ కారణంగా మంగళవారం విజయవాడ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన  పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అలాగే రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది.   మొంథా తుఫాను నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం   కోస్తా జిల్లాల్లోని 26 తీర ప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా తుఫాన్‌ హెచ్చరికలను రియల్‌ టైమ్‌ వాయిస్‌ అలర్టుల రూపంలో అందిస్తోంది. పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా 360 డిగ్రీల హార్న్‌ స్పీకర్‌ వ్యవస్థ కిలోమీటరు పరిధిలో హెచ్చరికలు అందిస్తుంది. ప్రజలను సందేశాలు, ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ కాల్స్‌, టాంటాంలు, క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారానూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. పెను తుపాను కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకూడదన్న  సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. 

హరీష్ రావు తండ్రి మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, హరీశ్రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. హరీష్ రావు తండ్రి మృతి పట్ల పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరీష్ రావుకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లి, సత్యానారాయణకు నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హరీష్ నివాసానికి చేరుకున్నారు. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కేసీఆర్ కు స్వయానా బావ అన్న సంగతి తెలిసిందే. పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. 

వివాహబంధంతొ ఒక్కటైన డీఎస్పీలు

పోలీసు శాఖలో ఒకే క్యాడర్ లో పని చేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులు వివాహబంధంతో ఒక్కటయ్యారు. అవనిగడ్డ డీఎస్పీగా పని చేస్తున్న విద్యశ్రీ, పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పని చేస్తున్న జగదీష్ కు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిరువురూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి ఇప్పుడు వివాహబంధంతో ఒక్కటయ్యారు.  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పోలీసు శాఖలో ఒకే క్యాడర్ లో పని చేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం విశేషంగా మారింది. వీరి ప్రేమ పెళ్లిపై పోలీసు శాఖలోనే కాకుండా సామాన్య ప్రజలలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.  

తీవ్ర తుపానుగా మారిన మొంథా!.. ఏపీకి రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో  ఏర్పడిన మొంథా తుపాను తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది.. ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్నది.  గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాన్.. తీవ్ర తుపానుగా బలపడి వేగం పెంచుకుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మెంథా తుపాన్ ఈ సాయంత్రానికి లేదా రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. తుపాను తీరాన్ని సమీపించే కొద్దీ సముద్రంలో అలల ఉధృతి పెరుగుతుందనీ, అలాగే గంటకు వంది కిలోమీటర్లకు మించిన వేగంతో గాలులు వీస్తాయనీ తెలిపింది.   ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. అలాగే చెట్లు, హోర్డింగుల సమీపంలో ఉండరాదని తెలిపింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయనీ,  కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీ జిల్లాలతో పాటు యానాం, దక్షిణ ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తీర ప్రాంతాలలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగినపూడి వద్ద  సముద్రం 500 మీటర్లు ముందుకు వచ్చింది.  ఇక విశాఖపైనా మొంథా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు 8 నుంచి 10 అడుగుల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి.  రాకాసి అలలు, భీకర గాలులతో పాటు కుండపోత వర్షం కురుస్తుండటంతో విశాఖలో జనజీవనం స్తంభించింది. అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్ర కెరటాల ఉద్ధృతి పెరిగింది. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు కెరటాల ఉద్ధృతికి ధ్వంసమైంది.   ఉప్పాడ తీరం భారీగా కోతకు గురవుతోంది.

మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి కన్నుమూత

తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు.    వయస్సుతో వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆయన మంగళవారం (అక్టోబర్ 28) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.  హరీశ్‌రావు తండ్రి మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , మాజీ మంత్రి కేటీఆర్ , బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌ కోకాపేట్‌లోని హరీశ్‌రావు స్వగృహం క్రిన్స్‌ విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. మరోవైపు సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరీష్‌రావు ఇంటికి    చేరుకున్నారు.  తన్నీరు సత్యనారాయణ భౌతిక కాయానికి  మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.   తన్నీరు సత్యనారాయణ  కేసీఆర్  స్వయానా బావ. కేసీఆర్ సోదరి లక్ష్మి భర్త అయిన తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్.. బావతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.    

శ్రీశైలంలో కన్నుల పండువగా పుష్కరహారతి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, దశ హారతులిచ్చారు.  కార్తికమాస మొదటి సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు, పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు.  దశ హారతులను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో పుష్కరిణి కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఈ లక్షదీపోత్సవంలో ఆలయం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు,అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు.

తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అటువంటి తిరుమల దివ్వక్షేత్రంలో మంగళవారం (అక్టోబర్ 28) భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  నాలుగు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం (అక్టోబర్ 27) శ్రీవారిని  మొత్తం 70 వేల 842 మంది దర్శించుకున్నారు. వారిలో  పాతికవేల 125 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 47 లక్షల రూపాయలు వచ్చింది. 

తుపాను బాధితులకు సాయంగా రూ.3 వేలు : సీఎం చంద్రబాబు

  తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3,000 చొప్పున అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి, వైద్య శిబిరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అత్యవసర వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చేపడుతున్న సహాయక చర్యలు భవిష్యత్తు తుపానులకు ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.మొంథా' తుపాను ప్రభావంతో విజయవాడ నగరానికి వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. మంగళవారం నగరంలో 16 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారు. తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం ఉద్ధృతంగా ఉన్న సమయంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని సూచించారు. అయితే, పాలు, కూరగాయలు, మెడికల్ షాపుల వంటి నిత్యావసర సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. 

నాటు సారా తయారీకి స్వస్తి పలికిన కుటుంబాలకు ఉపాధి

  నవోదయం 2.0 ద్వారా కర్నూలు జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో  నవోదయం 2.0 లో భాగంగా కర్నూలు నగరం బంగారు పేట కు చెందిన  నాటు సారా తయారీని మానుకున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధుల కల్పన లో భాగంగా  ఆటోలను,  రూ.20 లక్షల రుణాల కు సంబంధించిన మెగా చెక్ ను  జిల్లా కలెక్టర్ అందజేశారు.   ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ...కర్నూలు జిల్లాలో మొత్తం 110 నాటు సారా కేంద్రాలను ఎక్సైజ్ శాఖ గుర్తించిందని, వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నాటు సారా వృత్తిని మానుకున్న కుటుంబాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి స్థిరమైన జీవనోపాధి కల్పించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. కర్నూలు నగరంలోని బంగారు పేట ప్రాంతంలో నాటు సారా వృత్తిపై ఆధారపడి ఉన్న  కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు.   ఇందులో భాగంగా 10 మంది లబ్ధిదారులకు  రూ.20 లక్షల విలువ గల ఆటో లు, చెక్ లను అందచేశామని తెలిపారు.  ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని, గౌరవప్రదమైన జీవనోపాధి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంత రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, మెప్మా పిడి జి. శ్రీనివాసులు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి,లబ్ధిదారులు  పాల్గొన్నారు.  

గంజాయి ముఠా గుట్టురట్టు...14 మంది అరెస్ట్

  మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అన్నమయ్య జిల్లా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. కలకడ మండలంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, దాని వెనుక ఉన్న ప్రధాన నిందితుడు షేక్ బాషా తో కలిపి 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. గంజాయి ముఠాపై  మెరుపుదాడి   రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్, కలకడ సీఐ బి.లక్ష్మన్న పర్యవేక్షణలో, కలకడ ఎస్ఐ బి.రామాంజనేయులు పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు.  కలకడ మండలంలోని బంగారువాండ్లపల్లి, నడిమిచెర్ల - కొత్తపల్లి రోడ్డులోని రాతిదిబ్బ సమీపంలో పోలీసులు దాడిచేయగా, గంజాయితో సిద్ధంగావున్న నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన 13 మంది పురుషులు, ఒక మహిళా నిందితురాలు సహా మొత్తం 14 మందిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నిందితుల వద్దనుంచి సుమారు రూ. 10.20 లక్షలు విలువ చేసే 34 కిలోల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన ఒక ఆటో, మూడు మోటార్ సైకిళ్లను 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ బాషా ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి, స్థానిక చిన్న విక్రయదారుల ద్వారా జిల్లాలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ పేర్కొన్నారు. అరెస్టు అయిన 14 మంది నిందితులపై  క్రైమ్ నెంబర్ 109/2025 కింద  ఎన్ డి పి ఎస్  చట్టంలోని సెక్షన్ 20(బి)(ii)(ఏ),(బి)(సి) లతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌ నిమిత్తం వాయల్పాడు కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి  వివరించారు. ఈ కేసులో ఇంకా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.  జిల్లాలో గంజాయి విక్రయాలను, వినియోగాన్ని సహించేది లేదని ఎస్పీ  మరోసారి గట్టిగా హెచ్చరించారు. గంజాయి సేవించే యువత వెంటనే వ్యసనాన్ని వదిలిపెట్టి, చదువుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలను కోరారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్, కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ బి. రామాంజనేయులు, పిఎస్ఐ కుమారి హారిక, మరియు పోలీసు సిబ్బందిని ఎస్పీ  ప్రత్యేకంగా అభినందించారు

ఈ రాత్రి ఎలా గడుస్తుందో...ప్రజల్లో ఆందోళన!

  కోస్తా ప్రజలకు ఈ రాత్రి  ఎలా గడుస్తుందో అని ఆందోళన మొదలైంది. ఇప్పటికే తుఫాను తీవ్రత ప్రభావంతో కొండపోతుగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం తాకే దశలో పెను గాలులు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ స్థితిలో తుఫాను తీవ్ర తుఫానుగా మారి మంగళవారం సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనాలు వేస్తోంది. ఆ సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.  మొంథా తుఫాను ప్రస్తుతం  చెన్నై కాకినాడ విశాఖపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ అంచనాల బట్టి ఇది గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. ఇది మరింత బలపడుతూ మంగళవారం పెను తుఫానుగా మారనుంది. ఈ దశలో తుఫాను కాకినాడ సమీపంలో తీరం తాకే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది.  ఈ పరిస్థితుల్లో ఇప్పటికే తుఫాను ప్రభావంతో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వేచడంతోపాటు సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాధారణం కంటే ఒక మీటర్ నుంచి మూడు మీటర్లు అధికంగా ఎగిసిపడుతున్నాయి. ఏపీలోని మొత్తం 26 జిల్లాల్లో 23 జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ రాత్రి చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యధికంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా.  ఈ స్థితిలో సోమవారం రాత్రి ఏ రకంగా గడుస్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అధికార యంత్రాంగంతో సర్వం సిద్ధం చేసింది..ఎన్టీఆర్‌ఎఫ్ ..ఎఫ్డిఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

ఆపరేషన్ చేసి....వైర్ లోపల వదిలేసిన వైద్యుడు

  ఓ ప్రైవేట్ హాస్పి టల్లో పనిచేస్తున్న ఓ వైద్యుడు... పేషంట్ మహిళకు సర్జరీ చేశాడు. సక్సెస్ అయిందని ఇక నుండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెప్పి ఆమె వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు... ఇక తన ఆరోగ్యానికి డోకా లేదు అనుకున్న ఆ మహిళకు గత కొద్దిరోజులుగా కాళ్ల వాపుతో తీవ్రంగా బాధపడింది... ఎందుకు తన కాళ్లుకు  వాపు వస్తున్నయని నిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళింది.  అక్కడి వైద్యులు సిటీ స్కానింగ్ చేయడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ మహిళ వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి తనకు సర్జరీ చేసిన డాక్టర్ పై ఫిర్యాదు చేసింది....పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసు కుంది.వివరాల్లోకి వెళితే.... సంగారెడ్డి జిల్లాలోని శ్రీ చరిత హాస్పిటల్ లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి డాక్టర్ గా పని చేస్తున్నాడు. అరుణ అనే పేషెంట్ కాళ్ళ వాపుతో బాధపడుతూ శ్రీ చరిత హాస్పిటల్ కి వెళ్ళింది. ఆమెకు డాక్టర్ కిరణ్ కుమార్ వెరీకోజ్ వేన్ సర్జరీ చేశాడు. ఇకనుండి అలాంటి సమస్య ఉండదని చెప్పాడు. కానీ గత కొద్ది రోజుల తర్వాత తీవ్ర కాలు వాపు తో బాధపడు తున్న రోగి అరుణ నిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళింది. హాస్పిటల్ లో వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో సర్జరీ చేసిన డాక్టర్ నిర్లక్ష్యం బయట పడింది.  శ్రీ చరిత హాస్పిటల్ లో పనిచేస్తున్న కిరణ్ కుమార్ అనే వైద్యుడు అరుణ సర్జరీ చేసిన సమయంలో మీటర్ తీగ పేషెంట్ లోపల వదిలివేసి కుట్లు వేశాడు... ఆ మీటర్ తీగ కాస్త మహిళ గుండె వరకు చేరింది. దీంతో మహిళ  పరిస్థితి విషమంగా ఉంది. నిమ్స్ హాస్పటల్లో వైద్యులు వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స చేసి మీటర్ తీగను బయటికి తీశారు...అనంతరం బాధిత కుటుంబం సంగారెడ్డి జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చరిత హాస్పిటల్ వైద్యుడు పై ఫిర్యాదు చేశారు. శ్రీ చరిత డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.  అరుణ, బాధిత పేషంట్ వెరికోస్ వేన్ అనే వ్యాధితో బాధపడు తున్నాను. మూడు నెలల క్రితం వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా శ్రీ చరిత హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను శ్రీ చరిత హాస్పిటల్ డాక్టర్ కిరణ్ కుమార్ నాకు ఆపరేషన్ వేసి ఒక మీటర్ వైర్ శరీరం లోపలే వదిలేశాడు.డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నా ప్రాణం మీదికి వచ్చింది. నేను అనారోగ్యం పాలు అయ్యాను. రోజురోజుకీ నా ఆరోగ్యం క్షమించ పోవడంతో ఇటివలే నిమ్స్ హాస్పటల్లో అడ్మిట్ అయ్యాను. నిమ్స్ హాస్పిటల్ లో వైద్యులు సిటీ స్కానింగ్ చేయడం తో ఒక మీటర్ వయర్ నా శరీరం లోనే ఉన్నట్టుగా నిమ్స్ వైద్యులు గుర్తించారు.  అనంతరం నిమ్స్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసినా వైద్యులు ఒక మీటర్ వయర్ బయట తీశారు. శ్రీ చరిత హాస్పిటల్లో పనిచేస్తున్న కిరణ్ కుమార్ డాక్టర్ పై సంగారెడ్డి జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు.నాకు ఇద్దరు పిల్లలు, నేను చనిపోతే వారికి దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేసింది.ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించండి : సీఎం చంద్రబాబు

  మొంథా తుఫాన్ ముప్పు ఉన్న తీరప్రాంత ప్రజలను తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం నుంచి తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు.  సోమవారం ఉదయం సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి మొంథా తుఫాన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, మధ్యాహ్నం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ చేపట్టారు. తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలని చెప్పిన సీఎం అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.  తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు నిర్దేశించారు. జిల్లాల్లో తుఫాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, వాలంటరీగా వచ్చేవారిని తుఫాన్ సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని అన్నారు.  కొండచరియలు జారిపడకుండా జాగ్రత్తలు మానవ ప్రయత్నంలో ఎటువంటి అలసత్వం కనిపించకూడదని చెప్పిన ముఖ్యమంత్రి... వివిధ జిల్లాల కలెక్టర్లతో అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయని... అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని ఆ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సీఎంకు వివరించారు. ఆర్టీజీఎస్ నుంచి సమాచారం ఎప్పటికప్పుడు అందుతుందని... ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.  భారీ వర్షాలతో నీరు ఎక్కడా నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలన్నారు. తుఫాను సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పారు. విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండచరియలు జారిపడి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. మొంథా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్‌లో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు  

శ్రీవారి పరకామణి కేసు...సీఐడీ దర్యాప్తుకు కోర్టు ఆదేశాలు

  తిరుమల శ్రీవారి పరకామణి వ్యవహారంపై సీఐడీతో దర్యాప్తు చేపట్టాలని ఏపీ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.  విచారణ సందర్భంగా హైకోర్టు, కేసు దర్యాప్తు తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పరకామణిలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. టీటీడీ ఈఓ, సీబీఎస్ఓలను హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.  అలాగే నిందితుడు రవికుమార్‌పై ఏసీబీ దర్యాప్తు జరపాలని పేర్కొన్నాది. రవి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సేకరించి, నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశించింది. ఇదిలా ఉండగా, పరకామణి అక్రమాలపై ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సాధు పరిషత్ సభ్యుడికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.  ఇక పరకామణి చోరీ కేసును కూటమి సర్కార్  సీరియస్‌గా తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రవికుమార్ పరకామణి నుంచి పలు విడతలుగా నగదు దోచుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో బయటపడింది. ఈ ఘటనపై 2023లో కేసు నమోదైంది. టీటీడీ విజిలెన్స్ విచారణలో రవికుమార్ దాదాపు రూ.100 కోట్ల సొమ్మును కొల్లగొట్టినట్లు తేలింది. అయితే, ఆ సమయంలో టీటీడీ అధికారులు సరైన దర్యాప్తు చేయకుండానే లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

రెండో దశలో 12 రాష్ట్రాలలో ఎస్ఐఆర్ నిర్వహణ : జ్ఞానేశ్‌ కుమార్‌

  దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు చేపట్టే ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్‌ఐ‌ఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రెండో విడతగా మరో 12 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతల్లో ఎస్‌ఐఆర్  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించబోతున్నట్లు సీఈసీ  జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఈ సర్వేలో చనిపోయిన వారు, బదిలీ చేయబడిన వారి ఓటర్లను తొలగిస్తున్నట్లు చెప్పింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే కార్యక్రమ   ఎస్‌ఐఆర్ లక్ష్యమని వెల్లడించింది.  ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ అర్ధరాత్రి నుంచే ఓటర్ల జాబితా సీజ్ చేస్తామని సీఈసీ కీలక ప్రకటన చేసింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే కార్యక్రమ  ఎస్‌ఐఆర్ లక్ష్యమని వెల్లడించింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ అర్ధరాత్రి నుంచే ఓటర్ల జాబితా సీజ్ చేస్తామని సీఈసీ కీలక ప్రకటన చేసింది. 1951 నుంచి 2004 వరకు ఎనిమిది సార్లు ఎస్‌ఐఆర్‌ నిర్వహించగా, 21 ఏళ్ల తర్వాత మళ్లీ విజయవంతంగా పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు.  బీహార్‌లో సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లతో ఎస్‌ఐఆర్‌ విజయవంతంగా పూర్తయిందని, ఈ ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.ప్రతి ఇంటికి మూడుసార్లు బీఎల్‌ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్‌) విజిట్ చేస్తారు. బీఎల్‌ఓ అందించే ఎన్యుమరేషన్ ఫారంలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి సంతకం చేయాలని సూచించారు. 2003లో ఎవరితో నివసించామనే లింక్ వివరాలు కూడా ఫారంలో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ ఫారంలో వివరాల మ్యాచింగ్ మరియు లింకింగ్ కీలకమని పేర్కొన్నారు.  ఎన్యుమరేషన్ ఫారమ్‌ సమర్పించిన వారినే ఓటర్‌ జాబితాలో నమోదు చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్లు 50 ఫారంల వరకు ఎన్నికల సంఘానికి అందజేయవచ్చని తెలిపారు. అన్ని ఫారాలు సేకరించిన తర్వాత ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తామని చెప్పారు.ఈ ప్రక్రియలో భాగంగా ఎస్‌ఐఆర్‌ నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల అవుతుంది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు హియరింగ్‌, వెరిఫికేషన్‌, అనంతరం ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా విడుదల కానుందని సీఈసీ వెల్లడించారు.

డబ్బులు డబుల్ చేస్తానంటూ రూ.25 లక్షల మోసం

  హైదరాబాద్ నగరంలో జరిగే కొన్ని వింత వింత ఘటనలు చూస్తూ ఉంటే...ఎక్కడి నుండి వస్తాయా ఈ ఆలోచనలు అని అనిపిస్తుంది. మోసం చేయడానికి పలుమార్గాలు మంచి మార్గంలో వెళ్లడానికి ఒకే మార్గం... అన్నట్లు గా మోసగాళ్లు పలు మార్గాలను ఎంచుకొని మోసాలకు పాల్పడుతూ ఉంటారు. టెక్నాలజీ ఎంతగా పెరిగినా కూడా కొంతమంది మూఢ నమ్మకాలను నమ్మి.. మోసపోతూ ఉంటారు. భాగ్య నగరంలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది... గురువు రూపంలో వచ్చిన ఒక వ్యక్తి భారీష్ పేరుతో డబ్బులు డబుల్ చేస్తా నంటూ ఓ అమాయకుడిని నమ్మించి బురిడీ కొట్టించాడు. అతని వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ (44) అనే వ్యక్తి హైదరాబాదు నగరానికి వచ్చి బహదూర్పుర పరిధిలో నివాసం ఉంటూ సోఫా వర్క్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన గుగోలోత్ రవీందర్ (40) అనే వ్యక్తి హైదరాబాదు నగరానికి వచ్చి ఫిలింనగర్ లో ఉంటూ మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు.  మేడ్చల్ జిల్లాకు చెందిన కవీర సాయిబాబా (41) కొరియర్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. మనోహర్ సింగ్ (39) ధోబి గా పని చేస్తున్నాడు. వీళ్ళందరికీ అబ్దుల్ ఖయ్యూమ్ గురువు.... వీరందరూ అమాయకులైన మరియు ఒంటరిగా ఉన్న వ్యక్తులను మాత్రమే టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు.  ముందుగా ఈ నిందితులు అమాయకులను గుర్తించి బారిష్ పూజ చేస్తే మీ వద్ద ఉన్న డబ్బులు డబుల్ అవుతుం దని నమ్మించి... వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు... ఈ తరుణంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కుకున్నాడు... ఒంటరిగా ఉన్న బాధితుడిన్ని టార్గెట్ గా చేసుకొని బారిష్ పూజ చేస్తే డబ్బులు అనేక రేట్లు పెరుగుతుందని నమ్మించారు. వీరి మాటలు నిజమని నమ్మిన బాధితుడు పూజకు సరైనని ఒప్పుకున్నాడు.  తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో అబ్దుల్ ఖయ్యూమ్ గురువు గా పరిచయం చేస్తూ ఈ ఐదుగురు నిందితులు.... బాధితుడు ఇంటికి వెళ్లి బారిష్ పూజ చేసి అనంతరం బాధితుడికి స్వీట్లు మరియు బాదం పాలు ఇచ్చారు... మత్తు కలిపిన బాదంపాలు ప్రసాదంగా స్వీకరించిన తర్వాత సదరు బాధితుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు.  అదే సమయంలో నిందితులు బాధితుడి వద్ద ఉన్న రూ. 25 లక్షల రూపాయలను తీసుకొని అక్కడి నుండి పారిపో యారు. స్పృహ వచ్చిన బాధితుడు చూసేసరికి గురువుతో పాటు శిష్యులు కూడా అక్కడ లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగించారు.  నిన్న సాయంత్రం సమయంలో గండి మైసమ్మ వద్ద మహమ్మద్ ఇర్ఫాన్, రవీందర్, సాయి బాబా, ఠాకూర్ మనోహర్ సింగ్ లను అరెస్టు చేసి... వారి వద్ద నుండి ఒక గన్, కత్తి, రూ. 8,50,000 స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారి అయిన అబ్దుల్ ఖయ్యూమ్ పరారీ లో ఉన్నాడు.  అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని మేడ్చల్ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోటిరెడ్డి వెల్లడించారు...డబ్బులు ఎప్పుడు కూడా డబుల్ కావు.. అటువంటి పూజలే ఉండవు... ఇంత చిన్న లాజిక్ తెలియకుండా ఎలా మోసపోతున్నారు. ఇటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

అంత్యక్రియలకు వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం

  నెల్లూరు జిల్లా జలదంకి మండలం చిన్న క్రాక గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన బాధితులు గోళ్ల రమేష్, అనూష, శశాంత్, మన్విత్ వారి అంత్యక్రియలకు హాజరై, వింజమూరు మండలంలోని గొల్లవారి పాలెం నుంచి తిరిగి విజయవాడకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  గాయపడిన వారిలో సుమలతకు తలకు తీవ్ర గాయం కాగా, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మౌనిక, కృష్ణ, కృష్ణ చైతన్య, మరో మహిళ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మౌనికకు కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కావలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.