తుఫానుపై పోరు - సాంకేతికతే ఆయుధం!
posted on Oct 28, 2025 @ 4:50PM
ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువస్తున్న పెను తుపాను మొంథాతో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతే ఆయుధంగా యుద్ధం చేస్తోంది. తుపాను కారణంగా వర్షం తీవ్రత, పెనుగాలుల ఉధృతి ఆలా ప్రతి విషయాన్నీ సాంకేతిక పరిజ్ణానంతో అంచనావేసి, సహాయ చర్యలపై పూర్తిగా దృష్టి పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రియల్ టైం హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసి తుపాను ప్రభావిత ప్రాంతాలలోని కోటీ 92లక్షల మందికి ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తున్నది.
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు, సహాయ కార్యక్రమాలకూ ఎటువంటి ఆటంకం కలగకుండా వెంటనే విద్యుత్ ను పునరుద్ధరించేందుకు వీలుగా దాదాపు 2, 700కు పైగా జనరేటర్లను తుపాను ప్రభావిత ప్రాంతాలలో సిద్ధంగా ఉంచింది. అలాగే సెల్ టవర్లు కూలిపోయి సమాచార వ్యవస్థ స్తంభించే అవకాశం ఉందన్న అంచనాతో కమ్యూనికేషన్ కు ఎంత మాత్రం అంతరాయం కలగకుండా ఉండేందుకు 81 వైర్ లెస్ టవర్లను తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఏర్పాటు చేసింది. ఇక భారీ వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టింది. చెట్లు నేలకొరిగిన ప్రాంతాలు, హెర్డింగ్ లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడ పడిపోయాయి అన్న వివరాలను డ్రోన్ కెమేరాలతో ఎప్పటికప్పుడు గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
ఇక తుపాను కారణంగా పంటనష్టం వివరాలను రైతులే స్వయంగా అప్ లోడ్ చేసే విధంగా యాప్ లో మార్పులు చేసి అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. తుపాను కారణంగా దాదాపు 43 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగే అవకాశాలున్నాయని ఇప్పటికే అంచనాలు వేసింది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల నుంచి నేరుగా ఫీల్డ్ డేటా డాష్ బోర్డుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసింది. ప్రజల భద్రతే లక్ష్యంగా టెక్నాలజీ ఆయుధంతో మొంథాతుపానును ఎదుర్కోనేందుకు చంద్రబాబు సర్కార్ సర్వసన్నద్ధమైంది.