వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్టు.. ఏ కేసులోనో తెలుసా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైసీసీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్టయ్యారు.  వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం (అక్టోబర్ 29) అరెస్టు చేసింది.  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో రాజకీయ సంబంధం ఉన్న అరెస్టు ఇదే మొదటిది కావడం విశేషం.   విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలసకు చెందిన చిన్న అప్పన్న, హైదరాబాద్ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలచూస్తుంటారు.  తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో చిన్న అప్పన్న కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారుల దర్యాప్తులో తేలడంతో అతడిని బుధవారం (అక్టోబర్ 29)  తిరుపతిలోని సిట్ కార్యాలయానికి విచారణ కోసం పిలిచారు.  అక్కడ చిన్న అప్పన్నను హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం అరెస్టు చేశారు. ఆ వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి తర్వాత నెల్లూరు ఏసీబీ  న్యాయమూర్తి నివాసంలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసులో చిన్న అప్పన్నను ఏ 24గా పేర్కొన్నారు.   చిన్న అప్పన్నను ఇదే కేసులో సిట్ గత జూన్ 24న కూడా విచారణకు రావాల్సింగా నోటీసులు పంపింది. అయితే  ఈ కేసు దర్యాప్తు అధికారిగా తిరుపతి అదనపు ఎస్పీ కొనసాగడాన్ని సవాల్ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై  హైకోర్టు దర్యాప్తుపై స్టే విధించింది. సుమారు మూడున్నర నెలల తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది.  విచారణ మొదలైన కొద్ది రోజులకే ఈ కీలక అరెస్ట్ జరిగింది. చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందనీ, అంతే కాకుండా రానున్న రోజులలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందనీ అంటున్నారు. 

తుఫాన్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు

  మొంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.  బుధవారం ఉదయం మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి, పర్యటన అనంతరం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో... తుఫాన్ వల్ల సంభవించిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సేకరించన సమాచారం వరకు పరిశీలిస్తే... రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, ఇందులో 59 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు, ప్రత్తి, మొక్కజొన్న, మినుము వంటి పంటలు నీట మునిగినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. అలాగే 42 పశువులు చనిపోయినట్టు చెప్పారు. అయితే ఇది ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చూస్తుంటే... తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని అధికారులు వెల్లడించారు. యధావిధిగా ఆర్టీసీ సర్వీసులు  సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి కల్లా విద్యుత్ సరఫరా చేయాలని, గురువారం నాటికి రహదారుల గుంతలు మరమ్మతు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు యధావిధి కొనసాగించాలని సూచించారు. ఈ విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరమ్మతులకు గురైన ఫీడర్లను పునరుద్ధరిస్తున్నామని, కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు.  మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలన్నారు. పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. జలాశయాల సమర్ధ నీటి నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు గురువారం నాటికి బియ్యం, నిత్యావసరాల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా తాగు నీటి సరఫరాకు ఇబ్బంది రాకూడదని, తాగునీరు కలుషితం అయితే సహించేది లేదని, డయేరియా కేసులు నమోదు కాకుండా రూరల్ వాటర్ సప్లయ్ అధికారులు బాధ్యత వహించాలన్నారు. ప్రకాశం జిల్లాలో మెరుగైన చర్యలు చేపట్టాలి  ఒంగోలు పట్టణంలో పలు కాలనీలు నీట మునగడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని, భవిష్యత్‌లో పాలనా వైఫల్యం కనిపించకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్‌లో తుఫాన్ రక్షణ చర్యలపై పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రతీ జిల్లాలోనూ తుఫాన్ల సమయంలో తలెత్తే పరిస్థితులను అధిగమించేలా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.  రోడ్లు, పునరావాస కేంద్రాలు, విద్యుత్-తాగునీటి సరఫరా వంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజాభిప్రాయం సేకరించి, లోపాలను సరిచేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారని అధికారులు వెల్లడించగా, మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుఫాన్ తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తుఫాన్ తీవ్ర స్థాయిలో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని, ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యలపై ప్రజల నుంచి సానుకూల స్పందన, సంతృప్తి వ్యక్తమవుతోందని వెల్లడించారు. మొత్తం 1.16 లక్షల మందికి పునరావాసం  రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో 1.16 లక్షల మందికి మొంథా తుఫాను సమయంలో ఆశ్రయం లభించింది. మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం చూపింది. రాష్ట్రంలో 380 కి.మీ. పొడవున పంచాయతీరాజ్ రహదారులు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతినగా  రూ.4.86 కోట్ల నష్టం వాటిల్లింది. 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిని రూ.1,424  కోట్ల నష్టం సంభవించింది.  రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు, ఇరిగేషన్‌ పనుల్లో రూ.16.45 కోట్ల వరకు నష్టం జరిగింది. సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీలను తరలించారు. 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహించారు. 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించారు. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సీఎస్ విజయానంద్ సహా ఇతర ఉన్నతాధికారులు 

బీజేపీకి షాక్...కాంగ్రెస్‌లో చేరిన మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. వెంగళరావునగర్ మాజీ కార్పొరేటర్,బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు కిలారి మనోహర్,  సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో  చేరారు. బీజేపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇటీవల షేక్‌పేట్ నుంచి పోటీ చేసిన మాజీ కార్పొరేటర్ చర్కా మహేష్ బీజేపీకి రాజీనామా చేసిన బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కమలం పార్టీకి ఒకరి తర్వాత ఒకరు నేతలు రాజీనామాలు చేస్తున్నారు.  కాంగ్రెస్ ప్రజాపాలన విధానాలు తనను నచ్చయని కిలారి మనోహర్ అన్నారు. గతంలో తాను కష్టకాలంలో ఉన్నప్పుడు దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌పై దాడులు జరిగిన సందర్భంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి. నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ తనకు అండగా నిలిచారని, ఈ ఎన్నికల సమయంలో వారికి కృతజ్ఞతగా కాంగ్రెస్‌లో చేరుతున్నానని కిలారి మనోహర్ పేర్కొన్నారు.   జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కిలారి మనోహర్ కాంగ్రెస్‌‌లో చేరటం హస్తం పార్టీకి మరింత బలం చేకురుతుంది. ఈ నియోజకవర్గంలో కమ్మ ఓట్లు గణనీయంగా ఉండటంతో కాంగ్రెస్‌‌కు ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు.  

మెడికల్ కాలేజీల పీపీపీ నిర్ణయంపై జోక్యంపై హైకోర్టు తిరస్కరణ

  పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అది చట్టవిరుద్దం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలని పిటిషనర్ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.  కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చింది హైకోర్టు. తదుపరి విచారణని నాలుగు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ - 590ని సవాల్ చేస్తూ తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కొర్రా వసుంధర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టులో వేసిన పిల్‌పై తాజాగా విచారణ జరిగింది.  ఈ వ్యాజ్యంపై పిటీషన్ తరపున హైకోర్టులో సీనియర్ న్యాయవాది శ్రీరాం, మరో న్యాయవాది అశోక్ రాం వాదనలు వినిపించారు. టెండర్లు ఖరారు చేయకుండా స్టే ఇవ్వాలని న్యాయవాదులు అభ్యర్థించారు. న్యాయవాదుల అభ్యర్థనని తిరస్కరించింది హైకోర్టు. కాలేజీలు, ఆస్పత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని తీసుకున్న నిర్ణయంలో లాభ, నష్టాలను సమగ్రంగా పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది.

జలదిగ్బంధంలో వరంగల్ రైల్వే స్టేషన్

  తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్‌ జిల్లాలో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్‌ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని తరువాత కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63, ఉరుసులో 23.7, సంగెంలో 23.48 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే విధంగా జనగామ జిల్లా గూడూరులో 23.58, వర్ధన్నపేట (వరంగల్)లో 22.8, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 21.8, మహబూబాబాద్‌ జిల్లా ఇనగుర్తిలో 19.23, కరీంనగర్‌ జిల్లా బోర్నపల్లిలో 17.58, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 16.45, యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా వరంగల్‌ రైల్వే స్టేషన్‌లోకి వరద నీరు చేరింది. పట్టాలపైకి రెండు అడుగుల మేర నీరు నిలవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ను నిలిపివేయగా, ప్రయాణికులను బస్సుల ద్వారా గమ్యస్థానాలకు తరలించారు.ఇక మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఐదు గంటల పాటు నిలిచిపోయింది. ట్రాక్‌పై నీరు తగ్గకపోవడంతో రైలును వరంగల్‌కు తిరిగి పంపి, దారి మళ్లించారు. అలాగే గుండ్రాతిమడుగు నుంచి వరంగల్‌కు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్ను కూడా మళ్లించారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆహారం, తాగునీరు అందించేందుకు పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. మానవతా సేవలు అందించిన పోలీసులను డీజీపీ అభినందించారు. ఇదిలా ఉండగా, డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌ను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. భారీ వర్షాలతో వరంగల్ పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువుల్లా మారాయి. మోటార్ల సహాయంతో అధికారులు వరదనీటిని బయటకు పంపే పనులు చేస్తున్నారు.

భద్రాచలానికి 50 కి.మీల దూరంలో మొంథా తుఫాన్

  మొంథా తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. భద్రాచలానికి దక్షిణ ఆగ్నేయంగా 50 కి.మీల దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశముందని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయుగుండం కదలిందని పేర్కొంది. రాగల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.   తెలంగాణలో ఒకట్రెండు ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది. పలు ప్రాంతాల్లో 35-45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరంగల్‌- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది. ప్రధాన రహదారిపై వర్షం నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.  దీంతో ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు హనుమకొండ, వరంగల్, మహబూబ్ బాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తాజాగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించింది.

కడప ఐటీ పార్క్‌కు పది ఎకరాల స్థలం గుర్తింపు : ఎమ్మెల్యే మాధవి రెడ్డి

  కడప జిల్లాలో మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నామని,ఇది ఏర్పాటైతే  ఉపాధి కల్పన ప్రయత్నాలు ఊపందుకుంటాయని కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ,ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నంలో గూగుల్  డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి సమాన ప్రాధాన్యత ఇచ్చిందని ఆమె అన్నారు.  కడప, బెంగళూరుకు దగ్గరగా ఉందని, కడప జిల్లా నుండి అనేక మంది అర్హత కలిగిన యువతీ యువకులు కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో వలస వెళ్లి పనిచేస్తున్నారని, అయితే ఇక్కడ ఐటీ పార్క్‌ను స్థాపించడం ద్వారా ప్రభుత్వం స్థానిక వలసలను నిరోధించడానికి, ప్రతిభ కలిగిన యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నిస్తోందని ఆమె పేర్కొన్నారు. కడపలో ఐటీ పార్క్ ఏర్పాటు కోసం రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో 10 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం గుర్తించిందని, త్వరలోనే ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి)కి అప్పగించనున్నట్లు ఆమె తెలిపారు. కడపలో ఐటీ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో మేము ఆసక్తిగా ఉన్నామన్నారు .ప్రతి నియోజకవర్గంలో ఎంయస్‌ఎం ఈ పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా,జిల్లా యంత్రాంగం అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించడం ప్రారంభించిందని ఆమె అన్నారు.

ప్రయాణికులకు పోలీసు సిబ్బంది మానవతా సహాయం

  వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్‌లో  గోల్కొండ ఎక్స్ ప్రెస్,  మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో  కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైళ్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్   స్పందించి సంబంధిత పోలీసు అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి , రూరల్ సీఐ సరవయ్య , డోర్నకల్ సీఐ చంద్రమౌళి మరియు సిబ్బంది, ఎస్ఐలు మరియు కానిస్టేబుళ్లు రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలులోని ప్రయాణికులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేశారు. రైలు ఆలస్యం అయినప్పటికీ, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోలీసు సిబ్బంది సకాలంలో సహాయం అందించి మానవతా దృక్పథంతో సాయం చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.... మహబూబాబాద్ పోలీస్ ఎప్పుడూ ప్రజలతో ఉంటారని, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా సహాయం అవసరమైతే ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం పోలీసుల ప్రధాన ధ్యేయమని, వర్షం వంటి విపత్తు సమయంలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఎస్పీ  పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో స్పందించి భారీ వర్షాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు సహాయం చేస్తున్న మహబూబాద్ జిల్లా పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి   అభినందించారు. ఆపదలో ఆదుకున్న పోలీస్ సిబ్బంది కృషిని ప్రశంసించారు.

కూలిన కాలజ్జాని నివాసం... బ్రహ్మం గారి భక్తులు ఫైర్

  తన కాలజ్ఞాన ప్రబోధం ద్వారా భవిష్యత్తు గురించి చెప్పిన కాలజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం మొంధా తుఫాన్  తో కురుస్తున్న వర్షాలకు  కూలిపోయింది. భక్తులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . కడపలో 400 ఏళ్ళనాటి నివాస గృహం దెబ్బతినడంతో మూసివేశారు కానీ పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడం,ఈ వర్షాలకు ఆ గృహం కూలిపోవడంతో బ్రహ్మంగారి భక్తుల మనోభావాలు దెబ్బలు దెబ్బతిన్నాయి. బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు ఆయనా నివాస గృహాన్ని కాపాడుకో లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారి నివాస గృహాన్ని సందర్శిస్తారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తున్నామన్న అధికారులు నివాస గృహం పట్ల అలసత్వం వహించడంతోనే కూలిందని భక్తులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నా నివాస గృహం కూలిపోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్.. మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మెగాస్టార్

సోషల్ మీడియాలో తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి పోలీసులను ఆశ్రయించారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా తనను టార్గెట్ చేసి కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారంటూ చిరంజీవి స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం (అక్టోబర్ 29) ఉదయమే సైబర్ క్రైమ్ పీఎస్ కు చేరుకున్న చిరంజీవి... తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ను ఆపాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో చిరంజీవి దయాచౌదరి అనే వ్యక్తి పేరు ప్రస్తావించారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసభ్య కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  కాగా ఇటీవలే చిరు తన ఫొటోలను డీప్ ఫేక్ చేసి అసభ్య, అశ్లీల వీడియోలను వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఆయన కోర్టును కూడా ఆశ్రయించడంతో.. కోర్టు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించిన సంగతి కూడా తెలిసిందే.చ అంతలోనే సోషల్ మీడియాలో తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారంటూ చిరంజీవి పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది.  

అజహరుద్దీన్‌కు బంపర్ ఆఫర్...కేబినెట్‌లోకి మాజీ కెప్టెన్

  ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కేబినెట్‌లోకి అజహరుద్దీన్‌ తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మంత్రిగా  ప్రమాణస్వీకారం చేసేందుకు అజహరుద్దీన్ సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన అనుచరులు తెలిపారు.  కేబినెట్‌లో ఇంతవరకూ లేని మైనార్టీ మంత్రి లేకపోవడంతో ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి అనంతరం కేబినెట్‌లోకి తీసుకుంటారని వార్తాలు వచ్చాయి.  జూబ్లీలో భారీగా ఉన్న మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడానికి హస్తం పార్టీ ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ కూడా చదవండి: రేవంత్ హస్తిన బాట.. డీసీసీ చీఫ్ ల ఎంపికతో పాటు.. కేబినెట్ రీషఫుల్ కూడా? ఎల్లుండి శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్‌ని విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్‌కు హోం, మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కేబినెట్‌ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టాక్.

తెలంగాణలో 16 జిల్లాలకు మొంథా తుపాను ముప్పు

  మొంథా తుపాను ప్రభావం వల్ల తెలంగాణలో 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తుఫాను ముప్పుతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉన్నట్లు ఐఎండీ పేర్కొన్నాది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  కుమురం భీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. నగరంలో కురుస్తున్న వర్షం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.  ముంపున‌కు గురైన ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ద‌గ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. డీప్ మ్యాన్‌హోల్స్ ద‌గ్గర సీవ‌రేజి సూప‌ర్‌వైజ‌ర్లు ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, గాంధీనగర్‌, కవాడిగూడ, భోలక్‌పూర్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, బర్కత్‌పురా, బీఎన్‌రెడ్డినగర్‌, మీర్‌పేట్‌, బాలాపూర్‌, బడంగ్‌పేట్‌, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీషరీఫ్‌, జవహర్‌నగర్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, దోమలగూడలో వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ఎమర్జెన్సీ కోసం జ‌ల‌మండ‌లి హెల్ప్ లైన్ 155313కి కాల్ చేయాల‌ని ఆయ‌న కోరారు.   

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేస్తున్నారు. అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన ఆయన... బాపట్ల, కృష్ణా, పల్నాడు, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇటు, మంత్రులు, అధికారులు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాతావరణ ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అధికారులు వారిస్తున్న కూడా చంద్రబాబు ప్రజలకు అండగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలంటూ ఏరియల్ సర్వే చేస్తున్నారు.  ఇలా ఉండగా మొంథా తుపాన్ అనంతర సహాయక, పునరుద్ధరణ చర్యలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మంత్రులతో బుధవారం (అక్టోబర్ 29) ఏరియల్  సర్వే నిర్వహించారు.  తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలని, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత నాలుగైదు రోజులుగా మొంథా తుఫాన్‌ను ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు అంతా ఒక బృందంగా పనిచేసి నష్ట నివారణకు కృషి చేశారన్నారు.  కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు తెలిపారు. మరో రెండు రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేస్తే బాధితులకు మరింత ఊరట లభిస్తుందన్నారు.  తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, అధికారులు పర్యటించి, ప్రభుత్వ సహాయక చర్యల గురించి ప్రజలకు వివరించాలని, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవాలని సూచించారు. మొంథా తుపాన్‌ వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సిద్ధం చేయాలని   ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే నష్ట తీవ్రతను చాలా వరకు తగ్గించగలిగామని సీఎం అభిప్రాయపడ్డారు.  ఈసారి సచివాలయాలపై మైక్ అనౌన్స్‌మెంట్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశాం. ఇది ఒక నూతన విధానం. మున్సిపాలిటీల్లో డ్రైన్లు శుభ్రం చేయడం వల్ల కాలనీలు ముంపునకు గురికాలేదు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు 10 వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచాం  అని వివరించారు. ఈ తుపాన్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మరణించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటేనే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని, మన చర్యలతో ప్రజల్లో భరోసా పెరిగిందని చంద్రబాబు అన్నారు.

బిజినెస్ స్పాట్‌లైట్ అవార్డ్స్ డిజిటల్ మీడియా భాగస్వామిగా తెలుగువన్

ఔట్‌లుక్ బిజినెస్‌తో కలిసి బిజినెస్ మింట్ ప్రదానం చేసే ‘ది ఔట్‌లుక్ బిజినెస్ స్పాట్‌లైట్ రియాలిటీ అవార్డ్స్ 2025 , అలాగే ఔట్‌లుక్ బిజినెస్ స్పాట్‌లైట్ ఎంటిటీ అవార్డ్స్ 2025 లకు డిజిటల్ మీడియా భాగస్వామిగా భారతదేశంలోని ప్రముఖ మీడియా సంస్థలలో ఒకటైన  తెలుగువన్ చేరింది. ఈ విషయాన్ని తాజాగా ఇరు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. 2025 నవంబర్ 14న హైదరాబాద్‌లోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఈ ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌లు జరగనున్నాయి. రియల్ ఎస్టేట్ అలాగే వ్యాపార రంగాలలో శ్రేష్ఠత, ఆవిష్కరణ, లీడర్ షిప్ లను సత్కరించే ఈ వేడుక, భారతదేశంలో మోస్ట్ అవైటింగ్  వేడుకలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశ ఆర్థిక , సృజనాత్మక దృశ్యాన్ని రూపొందించడంలో అసాధారణమైన ఆవిష్కరణ,  లీడర్ షిప్ అలాగే  ప్రభావాన్ని చూపిన సంస్థలు, వ్యక్తుల అద్భుత  విజయాలను ఈ ‘ఔట్‌లుక్ బిజినెస్ స్పాట్‌లైట్’ అవార్డులు సత్కరిస్తాయి. ఈటీ నౌ బ్రాడ్‌కాస్ట్ పార్టనర్ గా,  ‘తెలుగువన్’ డిజిటల్ పార్టనర్ గా వ్యవహరిస్తున్నందున, ఈ అవార్డుల వేడుకలు దేశవ్యాప్తంగా ఎక్కువమందికి చేరువవుతాయనడంలో సందేహం లేదు. వీటి ద్వారా భారతదేశంలోని అత్యంత దార్శనిక బ్రాండ్‌లు,   బిజినెస్ లీడర్ల  విజయ ప్రస్థానాలకు విస్తృత ప్రచారం జరగనుంది.  రియాలిటీ అవార్డులు, ఎంటిటీ అవార్డులు రెండింటికీ 300+ సీఎక్స్ వోలు, వ్యవస్థాపకులు, డెవలపర్లు,  పరిశ్రమ మార్గదర్శకులు సహా 600 మందికి పైగా హాజరవుతారు. ఆ రోజు ప్యానెల్ చర్చలు, సెలబ్రిటీ ఎంగేజ్మెంట్లు, అలాగే ఔట్‌లుక్ బిజినెస్,  దాని డిజిటల్ ఛానెల్‌ల ద్వారా ప్రత్యేక సంపాదకీయ కవరేజ్ ఉంటాయి. ఇది కేవలం అవార్డుల వేడుక మాత్రమే కాదు, గొప్పగా ఆలోచించే భారతదేశపు అత్యంత సాహసవంతులైన వ్యక్తుల వేడుకగా భాసిల్లుతుంది. ఈ భాగస్వామ్యం గురించి బిజినెస్ మింట్ వ్యవస్థాపకుడు వివినయ్ కాంత్ కొరపాటి మాట్లాడుతూ, ‘తెలుగువన్‌’తో ఈ అనుబంధం మా దార్శనికతను ప్రాంతీయ అలాగే  డిజిటల్ ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుందన్నారు. ఔట్‌లుక్ బిజినెస్ మరియు ఈటీ నౌతో కలిసి  ఆవిష్కరణ,  విజయాల బహుళ-వేదిక వేడుకను సృష్టించాలన్నదే మా లక్ష్యం అని వినయకాంత్ కొరపాటి అన్నారు. రాబోయే ఎడిషన్లు ప్రీమియం అనుభవాలు, జాతీయ స్థాయి ఎక్స్‌పోజర్,  డైనమిక్ నెట్‌వర్కింగ్ అవకాశాలకు ఇది వేదిక అవుతుందనడంలో సందేహం లేదు.  దేశంలో ఎంటర్‌పెన్యూర్,  రియల్ ఎస్టేట్ భవిష్యత్తును నిర్వచించే వారిని గౌరవించడంలో బిజినెస్ మింట్ మరియు అవుట్‌లుక్ బిజినెస్ నిబద్ధతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే.

తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం

  మొంథా తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.1000 అందజేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ముగ్గురికి కంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3000 అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లకు వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు. మొంథా సైక్లోన్ స్పెషల్ స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్‌గా ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తుపాను బాధిత మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేకంగా 50 కిలోల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలను అప్పగించింది. నిత్యావసర సరుకులు బియ్యం, కందిపప్పు, వంట నూనె, చక్కెర వంటి సరకుల సరఫరాను వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. అదేవిధంగా, ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో పాటు ఇతర కూరగాయల సేకరణ, పంపిణీ బాధ్యతలను మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు అప్పగించింది. క్షేత్రస్థాయిలో బాధితులకు సకాలంలో సాయం అందేలా చూడాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.  తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. తుఫాన్ కారణంగా ఎడితెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ధాటికి వాగులు, కాలువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో పాటు బలమైన గాలులు వీయడంతో చెట్లు, కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ముందస్తు చర్యల్లో భాగంగా.. తుఫాన్ ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్.. 55 ఏళ్లలో 61 తీవ్ర తుపానులు!

ఈశాన్య రుతుపవనాల సీజన్ ను  తుఫాన్ల సీజన్  అనడం కద్దు. ఈ సీజన్ లొ సుముద్రంలో  ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలుగా, తీవ్ర వాయుగుండాలుగా,  తుఫాన్లుగా, తీవ్ర తుపానులుగా బలపడి అపార నష్టం కలిగిస్తుంటాయి.  దేశంలోనే అత్యధిక పొడవైన సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు తుపాన్ల బెడద ఎక్కువే. తాజాగా మొంథా తుపాన్  మంగళవారం మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటింది. ఇది రాష్ట్రాన్ని వణికించేసింది.  అయితే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం జరగలేదు. ఆస్తినష్టాన్ని కూడా ప్రభుత్వ చర్యలు కనిష్టానికి తగ్గించగలిగాయి. ఒక విధంగా ప్రకృతిలో ప్రభుత్వం యుద్ధం చేసి విజయం సాధించిందని చెప్పవచ్చు. అయితే గతంలో సంభవించిన పలు తుపానులు అపార నష్టాన్ని కలిగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితం.   గడిచిన 55 సంవత్సరాల్లో గణాంకాలను పరిశీలిస్తే 1970 నుంచి 2025 వరకు ఆంధ్రప్రదేశ్ ను 61 తుఫాన్లు తాకాయి. వీటిలో 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెన అత్యధిక ప్రాణనష్టం కలిగించింది. ఆ సమయంలో సంభవించిన ఉప్పెన దాదాపు పది వేల మంది ప్రాణాలను హరించింది.   ఇప్పటికీ దివిసీమ ఉప్పెన అంటే రాష్ట్రంలోని ఒక తరం జనం భయంతో వణికిపోతుంటారు.  ఆ తర్వాత ఉత్తరాంధ్రలో విశాఖను తాకిన హుద్ హుద్ తుపాను మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది.   ఈ తుపాను దాదాపు 40 మందిని పొట్టన పెట్టుకుంది.  వారం రోజులు పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు చీకట్లో మగ్గిపోయాయి.  ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు దాదాపు వారం రోజులు విశాఖలోనే బస చేసి సహాయక చర్యలు పర్యవేక్షించారు. కేకే లైన్ లో చిముడుపల్లి వద్ద రైల్ ట్రాక్ కొట్టుకుపోవడంతో దాదాపు 50 రోజులు పాటు  విశాఖ అరకు మధ్య  రైళ్ల రాకపోకలునిలిచిపోయాయి. అంతకు ముందు 1996లో సంభవించిన తుపాను కోనసీమలో బీభత్సం సృష్టించింది. కాకినాడ, యానాం మధ్య తీరం దాటిన ఆ తుపాను కారణంగా సంభవించిన ఉప్పెన వెయ్యి మందికి పైగా ప్రణాలను హరించింది. ఇక  ఆస్తినష్టం గురించి చెప్పనవసరమే లేదు.  గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటిన తుపాన్ల జాబితా ఇలా ఉంది.   *2025 అక్టోబర్ 28 న మెంథా తుఫాను.  *2023లో మించౌంగ్ తుఫాను బాపట్ల వద్ద తీరాన్ని తాకింది.  * 2022 లో మాంథాస్ తుఫాను.  * 2022లో అస్సాని తుఫాను మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటింది.  * 2020లో నివార్ అనే తుఫాను ఏపీ తీరాన్ని రెండుసార్లు తాకడంతో భారీ నష్టం జరిగింది. * 2018 పితాయి తుఫాను కాట్రేటి కోన వద్ద తీరాన్ని తాకింది. * 2018లో తితిలి తుఫాన్ శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద తీరాన్ని తాకి భారీ నష్టం కలిగించింది. *2013లో పితాని తుఫాను ఒడిస్సా వద్ద తీరాన్ని తాకింది. అయితే దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ నష్టం జరిగింది  * 2012లో తమిళనాడు వద్ద నీలం తుఫాను తీరం తాకింది అయితే దీని ప్రభావం వలన చిత్తూరు తో పాటు రాయలసీమ జిల్లాలకు భారీ నష్టం జరిగింది  * 2010లో లైలా తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది  *2006లో అగ్ని తుఫాన్ ఒంగోలు మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకింది. * 2006లో కైమస్ తుఫాను కావలి వద్ద తీరం తాకడంతో భారీ నష్టం జరిగింది.  అలా ఏపీ తీరాన్ని ఈశాన్య రుతుపవనాల సమయంలో వచ్చే తుఫాన్లు భారీగా నష్టాన్ని కలిగిస్తున్నాయి ఈసారి వచ్చిన తుఫాను సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో చాలావరకు నష్టం తీవ్రత తగ్గిందని చెప్పవచ్చు

చంద్రబాబు.. పెను తుపాను సైతం తలవొంచిన నిప్పుకణం

మొంథా తుపాను తీరం దాటింది. పెనుగాలులు, కుండపోత వర్షంతో కోస్తా జిల్లాలలన అతలాకుతలం చేసింది. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈ తుపాను తీరం దాటే ప్రక్రియ పూర్తయ్యింది. ఇక బలహీనపడుతుంది. అయితే దీని ప్రభావంతో మరో ఒకటి రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే దేశం మొత్తం ఈ తుపానును ఆంధ్రప్రదేశ్ ఎలా ఎదుర్కొంటుందా అని ఉత్కంఠతో ఎదురు చూసింది. ఎందుకంటే తుపాను తీవ్రత అంత భారీగా ఉంది మరి. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. పక్కా ప్రణాళిక, కచ్చితమైన ఆచరణ.. నిరంతర పరిశీలన, పర్యవేక్షణతో ఈ పెను తుపాన కారణంగా ప్రాణనష్టం జరగ లేదు. ఆస్తినష్టం కూడా కనిష్ట స్థాయిలోనే ఉంది.  ఇందుకు చంద్రబాబు ముందు చూపు, తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలే కారణఏమని చెప్పకతప్పదు. సీఎం చంద్రబాబు స్వయంగా  మంగళవారం (అక్టోబర్ 28) అర్థరాత్రి వరకూ పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు.  ఆయన పర్యవేక్షణ సమీక్షల కారణంగానే అధికారయంత్రాంగం అరహారం శ్రమించింది. ప్రభుత్వం ప్రజల కోసమే ఉందన్న విశ్వాసం కలిగేలా వ్యవహరించింది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరాఘాటంగా దాదాపు 12 గంటల పాటు ఆర్టీజీఎస్ నుంచి తుపాను పరిస్థితిని, ప్రజలకు యంత్రాంగం అందిస్తున్న సహాయ సహకారాలను పరిశీలించారు. పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలూ, ఆదేశాలూ ఇచ్చారు. దీంతో ప్రజలకు ఎక్కడ సాయం అవసరం అని సమాచారం వస్తే అక్కడకు అధికార యంత్రాంగం క్షణాల్లో చేరుకుంది. సమస్యలను వెంటనే పరిష్కరించింది. ముందు జాగ్రత్త చర్యలా వందల మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది.  ప్రమాదకరమైన రహదారులపై వాహనాల రాకపోకలనూ అనుమతించలేదు.  1995 - 1999 మధ్య  చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు, జనబాహుల్యం కూడా.. ప్రజలకు ప్రయోజనం కలిగే పనుల విషయంలో అవి పూర్తయ్యే వరకూ చంద్రబాబు నిద్రపోరు.. అధికారులను నిద్రపోనివ్వరు అనే వారు. ఇదిగో ఇప్పుడు.. మొంథా తుపానును ఎదుర్కొనేందుకు చంద్రబాబు మళ్లీ నాటి చంద్రబాబు అయ్యారు. ఆయన నిద్రపోలేదు.. అధికారులను నిద్రపోనివ్వలేదు.  ఎక్కడ ప్రజలకు అధికారుల సాయం అవసరం అనిపించిందో.. అక్కడ అధికారులు క్షణాల వ్యవధిలో చేరుకునేలా వారిని ఉరుకులు పరుగులు పెట్టించారు.   ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేయడంలో  ఆయన నిరంతరం అధికారులకు సూచనలూ, ఆదేశాలూ జారీ చేస్తూనే ఉన్నారు.  అందుకే  దటీజ్ చంద్రబాబు అంటున్నారంతా?  

మానవత్వం ముందు తలొంచిన మొంథా తుపాను

ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన పెను తుపాను మొంథాను ఓ యువకుడు అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నాడు. మానవత్వంతో స్పందించి, ప్రాణాలను కాపాడాలన్న సంకల్పం ఉంటే.. పెను తుపాను కూడా తలవొంచక తప్పదని నిరూపించాడు. ఇంతకీ విషయమేంటంటే.. భీకర తుపాను ప్రభావంతో అత్యంత భారీ వర్షం, పెనుగాలుల నడుమ అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం ఉయ్యాలవాడలో ఓ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతోంది. ఆమె పేరు అనిత.. బయట హోరు వాన, లోపల పురిటినొప్పుల యాతన.. ఈ పరిస్థితుల్లో 108 సిబ్బంది తక్షణమే స్పందించారు. ఆ మహిళను అంబులెన్స్ లోకి చేర్చి.. ఆస్పత్రికి తరలించడానికి వాయువేగంతో కదిలారు. అయితే ప్రకృతి వారి ప్రయత్నానికి అడ్డంకిగా నిలిచింది. భారీ వర్షానికి మార్గమధ్యంలోని గెడ్డ వాడు ఉప్పొంగి, ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహవేగంలో వాహనం నడపడం సాధ్యం కాదు. దాంతో 108 వాహనం నిలిచిపోయింది. ఆ సమయంలో ఆపద్భాంధవుడిగా కదిలాడు.. 108 వాహనంలో సిబ్బందిగా ఉన్న సురేష్ అనే యువకుడు. వాగు ఉధృతికి వాహనం ముందుకు కదలని పరిస్థితి ఉన్నా లెక్క చేయలేదు. పురిటి నోప్పులతో అల్లాడుతున్న మహిళను భుజానికెత్తుకుని.. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుకు ఎదురెళ్లాడు. ప్రవాహ వేగాన్ని లెక్క చేయకుండా ఆ మహిళను వాగుదాటించాడు. ఆమెను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చాడు.  అక్కడ ఆమె ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ మహిళను, ఆ మహిళ గర్భంలోని బిడ్డను కాపాడిన సురేష్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సురేష్ సాహసం ముందు, అతడి మానవత్వం ముందు పెను తుపాను తలవొంచింది.

మొంథా ఎఫెక్ట్ ఇంకా ఉంది.. విపత్తుల శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికించిన మొంథా తుపాను తీరం దాటింది. ఇక క్రమంగా బలహీనపడుతోంది. ఇప్పటికే తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడిన మొంథా.. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా బలహీనపడనుంది. ఈ వాయుగుండ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ పేర్కొంది. కోస్తాంధ్రప్రాంతంలో మాత్రం ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది.   శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న విపత్తుల సంస్థ.. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే చాన్స్ ఉందనీ పేర్కొంది. మొత్తం మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదనీ హెచ్చరించింది.