శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ పాత్ర కీల‌కం : సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్

  శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిరక్ష‌ణ‌లో ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ విభాగ సిబ్బంది పాత్ర కీల‌క‌మ‌ని హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్ అన్నారు. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. హైద‌రాబాద్ పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో శ‌నివారం జ‌రిగిన సెరిమొనియల్ ప‌రేడ్‌లో హైద‌రాబాద్ సీపీ  పాల్గొన్నారు. సిబ్బంది నుంచి ఆయ‌న గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.  ఈ సంద‌ర్భంగా సీపీ స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్రగల సిటీ ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్ విభాగానికి మంచి పేరు ఉందని, సిబ్బంది నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఇత‌ర ఉద్యోగాల‌తో పోలిస్తే పోలీస్ ఉద్యోగం చాలా భిన్నంగా ఉంటుంద‌న్నారు. కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రాధాన్యం ఇస్తూ.. ఆరోగ్య ప‌రిరక్ష‌ణపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. చెడు వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండాలని, ప్రతి రోజు విధిగా వ్యాయామం చేయాలన్నారు.  ప్ర‌తి ఒక్క‌రు స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా నైపుణ్యాన్ని నేర్చుకోవాల‌ని, వృత్తి రీత్యా పోలీస్ శాఖ‌లో వ‌స్తోన్న నూత‌న పోక‌డ‌ల‌ను అందిపుచ్చుకోవాల‌న్నారు. కాగా, ఏఆర్ కు చెందిన 1044 మంది ఈ పరేడ్ ని నిర్వహించారు. అందులో సిటీ సెక్యూరిటీ గార్డు, స్వాఫ్ట్, క్వీక్ రియాక్షన్ టీమ్, సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.  ప‌రేడ్ అనంత‌రం ఏఆర్ సిబ్బందితో నేరుగా సీపీ  మాట్లాడారు. ప‌నితీరుతో పాటు క్షేత్ర‌స్థాయిలో త‌లెత్త‌తున్న ఇబ్బందులను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కొన్ని స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తీసుకురాగా, వాటిని వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్కరించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.  తర్వాత సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణాన్ని సందర్శించారు. క్రెచ్, ఆర్మ్స్ అండ్ అమ్మునిషన్ స్టోర్ రూమ్, ఆర్మ్స్ వర్క్ షాప్, బ్యారక్స్ వంటి అన్ని విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంత‌రం హెడ్ క్వార్ట‌ర్స్‌లోని అధికారుల‌తో సమీక్షా స‌మావేశం నిర్వ‌హించి.. మెరుగైన పోలీసింగ్ కొరకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి , అదనపు డీసీపీలు ఎన్. భాస్కర్, బి. కిష్టయ్య , టి. కరుణాకర్ , డి. సంజీవ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులకు అమెరికా వీసా లేదు..ఇదెక్క‌డి ట్రంప‌రిత‌నం దేవుడా!

  ఇది స‌మంజ‌స‌మేనా? షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు, ఊబ‌కాయులు ఎక్క‌డ లేరు? అమెరికా నిండా ఊబ‌కాయులే ద‌ర్శ‌న‌మిస్తారు మ‌న‌కు. అంత‌గా అమెరికా త‌గిన ప‌ని పాట లేక ఊబ‌కాయుల‌తో నిండి పోయింద‌ని చెబుతాయి అక్క‌డి జ‌న జీవ‌న  దృశ్యాలు.  హైద‌రాబాద్ కి డ‌యాబిటిస్ క్యాపిట‌ల్ గా పేరుంది. అలాగ‌ని హైద‌రాబాద్ గ్రోత్ ఎక్క‌డైనా ఆగిపోయిందా? హైద‌రాబాద్ లో షుగ‌ర్ ఉన్న వాళ్లెవ‌రూ ప‌ని చేయ‌డం  లేదా? ఇక్క‌డెవ‌రికీ ఉద్యోగాలు రావ‌డం లేదా? ఆయా యాజ‌మాన్యాలు వీరికి జాబ్స్ ఇవ్వ‌డం లేదా?  షుగ‌ర్ అన్న‌ది లైఫ్ స్టైల్లో ఒక భాగం. ఫుడ్ క‌ల్చ‌ర్ ద్వారా వ‌స్తుంది. ప‌ని ఒత్తిడిలో ఆహారం ఆల‌స్యంగా తీస్కున్నా, జంక్ ఫుడ్ అధికంగా తీస్కున్నా.. ఊబ‌కాయంతో పాటు షుగ‌ర్ కూడా వ‌స్తుంది. దానికి తోడు ఇప్పుడు ఇండియాలో కూడా ఫుడ్ అవేర్నెస్ బాగా పెరిగింది. ఆపై మిల్లెట్ ఫుడ్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. దీంతో ఊబ‌కాయం, దాని ద్వారా వ‌చ్చే షుగ‌ర్ కంట్రోల్ చేసుకునే య‌త్నం ఒక య‌జ్ఞంలా సాగుతోంది.  దొరికిందే సందుగా భావించి ఇలా ప్ర‌తి చిన్న విష‌యాల‌కూ వీసాలు ఇవ్వ‌న‌ని  మారం చేయ‌డం అన్న‌ది అమెరికాకే అత్యంత ప్ర‌మాద‌క‌రం. కార‌ణ‌మేంటంటే, అమెరికాలో ప‌ని చేయ‌గ‌లిగిన వ‌య‌సుగ‌ల వారి శాతం బాగా తక్కువ‌. దానికి తోడు ట్రంప్ తుగ్ల‌క్ చ‌ర్య‌ల కార‌ణంగా.. 1960ల కాలం త‌ర్వాత వ‌ల‌స బాగా త‌గ్గింద‌ని చెబుతున్నాయి అక్క‌డి గ‌ణాంకాలు. ఈ క్ర‌మంలో ఇలాంటి పిచ్చి చేష్ట‌ల వ‌ల్ల‌.. మ‌రింత వ‌ల‌స త‌గ్గే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. దీని ద్వారా అమెరికా ఆర్ధిక వ్య‌వ‌స్థ మ‌రింత కుంటు ప‌డే ప్ర‌మాదం క‌నిపిస్తోంది.  ఇప్ప‌టికే  హెచ్ 1 బీ వీసా మీద ల‌క్ష డాల‌ర్ల ఫీజు అంటూ దాడి  చేసి ఆ త‌ర్వాత దాన్ని స‌వ‌రించారు.. ఇప్పుడు చూస్తే బీపీ, షుగ‌ర్, ఒబేసిటీ ఉన్న వారికి కూడా వీసా ఇవ్వ‌మ‌ని అంటే న‌ష్టం వారికి కాదు అమెరికాకే ఎక్కువ క‌లుగుతుంద‌న్న మాట వినిపిస్తోంది. షుగ‌ర్ ఏమంత చెడ్డ రోగం కాదు. దాని ద్వారా ఇక్క‌డెవ‌రూ ప్రాణాలు కోల్పోవ‌డం లేదు. అందుకంటూ కూడా కొత్త మందులు వ‌చ్చేశాయ్ కూడా. కాబ‌ట్టి షుగ‌ర్ ఈజ్ నాటే డేంజ‌ర‌స్ డిసీజ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవ‌ర్ లైఫ్ స్టైల్ క‌మ్ ఫుడ్ హ్యాబిట్స్. వీటిపై దృష్టి సారిస్తే చాలు మొత్తం దానిక‌దే స‌ర్దుకుంటుంది.

షుగ‌ర్‌కి చిట్టి చిట్కాల‌తో...పోగొట్టే భార‌తీయ ఆయుర్వేదం

  భార‌త ఆయుర్వేదం ఉసిర‌కాయతో షుగ‌ర్ ని కంట్రోల్ చేయ‌గ‌ల‌దు. ఈ విష‌యం గుర్తించింది ఇక్క‌డి ఆయుర్వేద వైద్య లోకం. ఆంగ్లంలో ఆమ్లాగా పిలిచే ఉసిరిలో విటమిన్‌ సీ, యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ ప్లాంట్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భోజనం తర్వాత రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ పెరగడాన్ని ఉసిరి తగ్గిస్తుందని కొన్ని స్టడీస్‌ సూచిస్తున్నాయి. అంత సింపుల్ షుగ‌ర్ కంట్రోల్ చేయ‌డం భార‌త్ కి వెన్న‌తో పెట్టిన విద్య‌. భార‌త్ తో ఉన్న మ‌రో ఫెసిలిటీ ఏంటంటే ఇక్క‌డ వైద్యులు అమెరికా నిండా ఉన్నారు. వీరు అత్యంత గొప్ప నైపుణ్యంతో అమెరికా ఆరోగ్య సంరక్ష‌ణ చేస్తున్నారు. ఇలాంటి వారు రాకుండా క‌ట్ట‌డి చేస్తే అక్క‌డి జ‌నారోగ్యానికే ప్ర‌మాదం. ఇప్ప‌టికే అమెరికాలో టైప్ టూ డ‌యాబెటిస్ నియంత్ర‌ణ కోసం మౌంజారో తో పాటు, టైప్ 1 డ‌యాబెటీస్ కంట్రోల్ చేయ‌డం కోసం స్టెమ్ సెల్ ఆధారిత చికిత్స కూడా ప‌రిశోధ‌న‌లో ఉంది. కొత్త మందులు ఆవిష్క‌ర‌ణ‌తో పాటు గుండె జ‌బ్బుల ప్ర‌మాదం త‌గ్గించే మందులు, జీవ‌న శైలి మార్పు చేర్పుల‌లోనూ భార‌తీయ వైద్య నిపుణుల‌ది కీల‌క పాత్ర‌.    ఇలాంటివేవీ గుర్తించ‌కుండా  రాజ‌కీయ కార‌ణాల‌తో ఎలాగైనా స‌రే భార‌తీయుల‌ను ఇరుకున  పెట్టాలి. మ‌న దారికి తెచ్చుకోవాల‌న్న కుట్ర కొద్దీ తీస్కునే నిర్ణ‌యాల‌తో అమెరికాకు చేటు తేవ‌డానికి ట్రంప్ అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని అంటున్నారు అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు.

మిరపచెట్టుకు వంకాయలు?!

 బ్రహ్మం తాత తన కాలజ్ణానంలో చెప్పారో లేదో.. కానీ మిరప చెట్టుకు వంకాయలు, టమాటాలూ కాసిన వింత ఒకటి కలకలం రేపుతోంది. ఓ రైతు తన పొలంలో మిరపతోట వేస్తే.. ఆ తోటలో ఓ మిరపచెట్టుకు మిరపకాయలకు బదులు వంకాయలు, టమాటాలూ విరగకాశాయి. ఈ వింత చూడడానికి ఆ గ్రామస్తులే కాక చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తండోపతండాలుగా వచ్చారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తకెళ్ల పాడులో జరిగింది. గ్రామానికి చెందన  ముత్యాల రజిత రమేశ్ తన పొలంలో మిరపతోట వేశారు. అయితే ఆ మిరపతోటలోని ఓ మిరపచెట్టుకు మిరపకాయలకు బదులుగా టమాటా, వంకాయలు  కాసాయి.  ఈ వింత చూసిన జనం దైవలీల అంటూ ఆశ్చర్యపోవడం కనిపించింది. కొందరు హేతువాదులు మాత్రం దీని వెనుక ఏదో శాస్త్రీయకారణం ఉందంటున్నారు. సరే విషయం ఏంటో తేల్చడానికి వ్యవసాయ అధికారలు రంగంలోకి దిగారు. మిరపచెట్టుకు వంకాయలు, టమాటాలు కాయడంపై వారు పరిశించి, పరిశోధించి కారణమేంటో తేల్చడానికి రెడీ అయిపోయారు.  

ప్రజాదర్బార్ లో పోలీసులతో కొలికపూడి వాగ్వాదం

నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటారా అనిపించేలా వ్యవహరించే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. శనివారం ప్రజాదర్బార్ లో సైతం అదే తీరున వ్యవహరించారు. శనివారం (నవంబర్ 8) తిరువూరులో జరిగిన ప్రజాదర్బార్ కు హాజరైన కొలికపూడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తిరువూరులో జరిగిన ప్రజాదర్బార్ రసాబాసగా మారింది. ఇంతకే విషయమేంటంటే.. ఇటీవల మంత్రి లోకేష్ ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో జరిగే ప్రజాదర్బార్ లో పాల్గొని తీరాల్సిందే అని ఆదేశించిన నేపథ్యంలో శనివారం తిరువూరులో జరిగిన ప్రజాదర్బార్ కు శ్రీనివాసరావు హాజరయ్యారు. అయితే ప్రజా దర్బార్ కు తిరువూరు సీఐ హాజరు కాకపోవడంపై తీవ్ర అసహనానికి గురైన ఆయన ఎస్ఐను సీఐ గైర్హాజరుకు కారణమేంటంటూ నిలదీశారు. నూజివీడు కోర్టుకు వెళ్లాల్సి ఉన్నందున సీఐ ప్రజాదర్బార్ కు రాలేకపోయారని ఎస్ ఐ ఇచ్చిన జవాబుతో సంతృప్తి చెందని కొలికపూడి.. ప్రజాదర్బార్ కంటే కోర్టుకు హాజరు కావడం ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా సీఐ కోర్టుకు వెళ్లారనడానికి ఆధారాలేమైనా ఉన్నాయా? ఉంటే చూపించాలి అంటూ ఎస్ఐని అడిగారు. ఆ దశలో ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపు ప్రజాదర్బార్ ను నిలిపివేశారు. ఆయన తీరు పట్ల ప్రజా దర్బార్ కువచ్చిన వారు  విస్తుపోయారు. ప్రజార్బార్ కు వచ్చి పోలీసులతో పంచాయతీ ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి మరో సారి వివాదాస్పదంగా మారింది.  

అమ్మకానికి ఆర్సీబీ!?

ఐపీఎల్‌   ఛాంపియన్.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) అమ్మకానికి అంగట్లో ఉంది. ఈ జట్టు త్వరలో చేతులు మారనుంది.  ఆర్సీబీ ఫ్రాంచైజీ సేల్‌కి సంబంధించిన ప్రక్రియ కూడా ఆల్ రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆర్సీబీ టీమ్ ఓనర్.. డియాజియో కంపెనీ దీనిపై క్లారిటీ ఇచ్చింది.   బ్రిటీష్ డిస్టిలరీస్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ అయిన డియాజియో.. ఆర్సీబీ జట్టు అమ్మకానికి సంబంధించి  ఇప్పటికే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికల్లా.. ఆర్సీబీ అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికానుంది. యూఎస్‌ఎల్‌కు.. ఆర్సీబీ టీమ్ ఎంతో విలువైన, వ్యూహాత్మక ఆస్తి అని సంస్థ సీఈవో తెలిపారు. ఇది తమ ఆల్కబెవ్ వ్యాపారానికి ప్రధానం కాదన్నారు. సంస్థలో.. దీర్ఘకాలికంగా వాటాదారులకు విలువను అందించే ఉద్దేశంతోనే.. కంపెనీ తన ఇండియా పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తోందని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రవీణ్ సోమేశ్వర్ తెలిపారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కోర్ బిజినెస్.. ఆల్కహాల్ ఆధారిత పానీయాల రంగంలో ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ టీమ్ తమ కోర్ బిజినెస్ అయిన లిక్కర్ బిజినెస్‌కి సంబంధించింది కాదని చెబుతోంది. అందువల్లే.. ఆర్సీబీని వదులుకునేందుకు సిద్ధమైనట్లు చెబుతోంది. అయితే.. ఆర్సీబీ కొత్త యజమాని ఎవరు అన్నది వచ్చే  ఐపీఎల్ సీజన్ మెగా వేలానికి ముందు తేలనుంది. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ ఉండటం, అపారమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉండటం వల్ల.. ఆర్సీబీ ఫ్రాంచైజీకి మార్కెట్‌లో భారీ విలువ ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ ఫ్రాంచైజీ విలువ  16 వేల కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా. ఐపీఎల్ మెన్స్ టీమ్‌తో పాటు విమెన్స్ ప్రీమియర్ లీగ్ టీమ్ కూడా ఈ డీల్‌లో భాగమే! ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో.. అదానీ గ్రూప్, జేఎస్ డబ్ల్యు గ్రూప్, అదార్ పూనావాలా సహా మరికొన్ని సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ గనక పూర్తయితే.. ఐపీఎల్ చరిత్రలో ఇది అతిపెద్ద ఫ్రాంచైజీ యాజమాన్య మార్పుల్లో ఒకటిగా నిలిచిపోనుంది.  వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా.. ఇటీవలే దాదాపు 17 వేల కోట్లకు ఆర్సీబీని కొనుగోలు చేస్తోందనే వార్తలు చక్కర్లు కొట్టాయ్. అదానీ గ్రూప్‌తో పాటు ఓ ఢిల్లీ బిజినెస్ టైకూన్ కూడా ఆర్సీబీ టీమ్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు యూఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా రేసులో ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా.. అదార్ పూనావాల ఆర్సీబీ యాజమాన్య హక్కుల కోసం బాగా ప్రయత్నిస్తున్నస్టు సమాచారం.  2010లో లీగ్ విస్తరణ సమయంలోనే అదార్ తండ్రి సైరస్ పూనావాల ఫ్రాంచైజీ కోసం బిడ్ వేశారు. కానీ.. అప్పుడు దక్కలేదు. మళ్లీ.. ఇప్పుడు ఆర్సీబీని కొనేందుకు  ప్రయత్నిస్తున్నారు.  2008లో ఐపీఎల్‌ ఆరంభ సమయంలో.. యూబీ గ్రూప్ అధినేత విజయ్‌ మాల్యా.. బెంగళూరు ఫ్రాంఛైజీని దక్కించుకున్నాడు. ఆ తర్వాత.. 2016లో మాల్యాని ఆర్థికి ఇబ్బందులు చుట్టుముట్టాయ్. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దాంతో.. భారత్‌లోని తన అనుబంధ సంస్థ యునైటెడ్‌ స్పిరిట్స్‌ ద్వారా మాల్యా మద్యం కంపెనీతో పాటు బెంగళూరు ఫ్రాంచైజీని కూడా డియాజియో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ టీమ్‌ని మెయింటైన్ చేసింది. 2008లో విజయ్ మాల్యా ఆర్సీబీని 76 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. 2014 నాటికి.. డియాజియో యూఎస్ఎల్.. ఆర్సీబీలో మెజారిటీ వాటాని కొనుగోలు చేసింది. 2016 నాటికి మాల్యా నిష్క్రమణతో.. డియాజియో ఆర్సీబీని పూర్తిగా సొంతం చేసుకుంది. ప్రస్తుతం.. ఈ టీమ్‌ని.. యూఎస్‌ఎల్ అనుబంధ సంస్థ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఈ ఏడాది సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. దీనిని.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 4న.. బెంగళూరులోని చినస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో.. 11 మంది ఆర్సీబీ అభిమానులు చనిపోయారు. దాంతో.. ఆర్సీబీ నిర్వహణపై ప్రెజర్ పెరిగింది. అప్పటి నుంచే.. ఆర్సీబీ విక్రయంపై చర్చలు మొదలయ్యాయ్. మరోవైపు.. షేర్ హోల్డర్లు కూడా నాన్ కోర్ వ్యాపారాన్ని వదలిపెట్టాలని డియాజియోపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఆర్సీబీని వదులుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకుల ఆందోళన కారణమేంటంటే?

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం (నవంబర్ 7) రాత్రి నుంచి ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు.  రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన వన్ 984 విమానం సాంకేతిక లోపాలు కారణంగా చెబుతూ తీవ్రజాప్యం కావడంతో ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు. శనివారం (నవంబర్ 8) ఉదయానికి కూడా విమానం ఎప్పుడు బయలుదేరుతుందన్న విషయాన్ని అధికారులు చెప్పకపోవడం, సరైన సమాచారం ఇవ్వకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్‌పోర్ట్‌లోనే పడిగాపులు పడుతున్నారు. విమానం ఎప్పుడు టేక్‌ఆఫ్ అవుతుందనే విషయంపై సిబ్బంది స్పష్టమైన సమాచారం ఇవ్వకపో వడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం (నవంబర్ 8) ఉదయం కూడా పలు విమానాలు రద్దు కావడం, టేకాఫ్ కు తీవ్ర జాప్యం జరగడంతో శంషాబాద్ విమానాశ్రయంలో పరిస్థితి  ప్రయాణీకుల ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది.   హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో 6ఇ051, అలాగేముంబైకి వెళ్లాల్సిన 6ఇ245 వి మానాలు రద్దు కాగా, పలు విమానాలు ఆలస్యం అయ్యాయి.   దీంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  శుక్రవారం (నవంబర్ 7)  ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌  వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య మరువక ముందే ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో  విమానాల రద్దు, జాప్యం జరుగుతుండటంతో అసలేం జరుగుతోందంటూ ప్రయాణీకులు అధికారులను నిలదీస్తున్నారు.  

అద్వానీకి చంద్రబాబు బర్త్ డే విషెస్

బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకుడు  లాల్ కృష్ణ అద్వానీ శనివారం (నవంబర్ 8) తన 98వ జన్మదినం జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా అద్వానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. అద్వానీ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.   1927 నవంబర్ 8వ తేదీన జన్మించిన అద్వానీ దేశంలో బీజేపీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు.  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి భారతీయ జనతాపార్టీని అభేద్యంగా తీర్చిదిద్దడంలో అద్వానీ పాత్ర అత్యంత ముఖ్యమైనది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.  చంద్రబాబును బీజేపీకి విశ్వసనీయ మిత్రుడిగా అద్వానీ ఎప్పుడూ చెబుతుంటారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అద్వానీ హాజరైన సంగతి తెలిసిందే.  

రోడ్డు ప్రమాదంలో కారు దగ్ధం

  నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అతి వేగంగా వెడుతున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఎనిమిది మందీ సురక్షితంగా బయటపడ్డారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కారు రోడ్డుకు అడ్డంగా పడిదగ్ధం కావడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 

మెట్రో స్టేషన్ సమీపంలో అగ్రిప్రమాదం.. పలువురికి గాయాలు

దేశ రాజధాని నగరం ఢిల్లీలో  శుక్రవారం (నవంబర్ 7) అర్ధరాత్రి దాటిన తరువాత  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిథాల మెట్రో స్టేషన్ కు సమీపంలోని బెంగాలీ బస్తీలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలు వెంటనే తెలియరాలేదు. అయితే ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. గాఢ నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా మేల్కొని భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఎటు వెళ్లాలో అర్ధం కాక పలువురు మంటల్లో చిక్కుకుని గాయపడినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో వందల గుడిసెలు దగ్ధమయ్యాయి.  సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది 29 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి కేసు.. కీలక నిందితుడి అరెస్టు

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడిని సిట్ అరెస్టు చేసింది.  ఈ కేసులో  ఏ16 గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ ను  సిట్ అదుపులోనికి తీసుకుంది. అజయ్ కుమార్ సుగంధ్‌  మోన్‌ గ్లిసరైడ్స్‌, అసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌ వంటి రసాయనాలను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లుగా  సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ రసాయనాలను పామాయిల్‌ తయారీలో వినియోగించి, అదే పామాయిల్‌ను నెయ్యి పేరుతో తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేశారనీ, ఆ కల్తీ నెయ్యినే లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారనీ తమ దర్యాప్తులో నిర్ధారణ అయ్యిందని సిట్ అధికారులు తెలిపారు.   లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం వరకు పామాయిల్‌ ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. గత ఏడేళ్లు  బోలే బాబా కంపెనీ కి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్‌ను అజయ్‌ కుమార్‌ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం సేకరించి అజయ్ సుగంధ్ సుకుమార్ ను అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన అజయ్ కుమార్ సుగంధ్ ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరచగా కోర్టు అతడికి  ఈ నెల 21 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. 

కర్నూలు బస్సు ప్రమాద సంఘటన- కావేరీ ట్రావెల్స్ యజమాని అరెస్ట్, విడుదల

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటనలో   కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను  జు పోలీసులు శుక్రవారం (నవంబర్ 7) అరెస్ట్ చేశారు. గత నెల 24న కర్నూలు సమీపంలో జాతీయ రహదారిపై   ఘోర ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.   దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి  బస్సు ప్రమాదానికి కారణమైన మొదటి ముద్దాయి మిర్యాల లక్ష్మయ్య ను గత నెల 28న పోలీసులు అరెస్ట్ చేశారు.  రెండవ నిందితునిగా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను శుక్రవారం (నవంబర్ 7)   అరెస్ట్ చేశారు. అనంతరం  జే ఎఫ్ సి ఎం మొబైల్  కోర్టులో హాజరు పరిచారు. బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ కు పదివేల రూపాయలు సొంత పూచికత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

శ్రీచరణికి రూ. రెండున్నర కోట్లు ప్లస్ గ్రూప్ వన్ జాబ్

విమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో తన అద్భుత ఆటతీరులో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు అమ్మాయి శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.  ఆమెకు రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, సొంత జిల్లా కడపలో వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని   ఏపీ సీఎంఓ ట్వీట్ చేసింది. అలాగే మంత్రి నారా లోకేష్ శ్రీచరణికి ప్రభుత్వం ప్రకటించిన వరాల జల్లును సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. శ్రీచరణి మహిళల వరల్డ్ కప్ లో భారత జట్టును విజేతగా నిలబెట్టేందుకు ప్రదర్శించిన అంకిత భావం రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని కూడా గర్వపడేలా చేసిందని లోకేష్ పేర్కొన్నారు.  ఆమెను ప్రభుత్వం  గ్రూప్-1  ఉద్యోగం, రెండున్నర కోట్ల రూపాయల నగదు బహుమతి, కడపలో నివాస స్థలంతో సత్కరిస్తుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  అంతకుముందు శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో శ్రీచరణిని అభినందించిన చంద్రబాబు, ప్రపంచకప్‌ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ ప్రశంచించారు. శ్రీచరణి అద్భుత ఆట, ఆమె విజయం యువ మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.   ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ... ప్రపంచకప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి  సంతోషంగా ఉందని తెలిపారు. తన కుటుంబం అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు.  ఈ విజయం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు.  ఇక‌, శుక్రవారం (నవంబర్ 7) సాయంత్రం కడపలో ఏసీఏ, కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీచరణికి భారీ సన్మాన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించనుంది.

ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేస్తానంటున్న ట్రంప్

అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరో సారి దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయగమని చెబుతున్నారు.   అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించినట్లు వెల్లడించిన ఆయన  ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో  మాట్లాడుతూ..  మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో మేం ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం. అయితే ఆ అవసరం లేదు. ప్రతిఒక్కరూ డబ్బును అణ్వాయుధాలపై కాకుండా ఇతర విషయాలు ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిపై ఖర్చు చేయాలని అన్నారు.   ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పిన ట్రంప్..  దానిని సాధించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నామని చెప్పారు. ప్రజలకు తెలియని ఎన్నో యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం అవి లేవన్నారు. మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఇటీవల ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న అగ్ర రాజ్యాధినేత   ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్‌ కూడా ఉందని చెప్పారు.  రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయి. మా దగ్గర అంతకంటే ఎక్కువే  ఉన్నాయన్న హెచ్చరిక లాంటి వ్యాఖ్యలు చేశారు. మావద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చు. కానీ, అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చించానన్నారు. అయితే ఎక్కడ, ఎప్పుడు ఈ పరీక్షలు నిర్వహించనున్నారన్న విషయాన్ని మాత్రం ట్రంప్ బయటపెట్టలేదు. 

కంచి ఆలయంలో కలకలం.. బల్లుల విగ్రహాల తాపడాలు మార్చారా?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చినట్లు వస్తున్న ఆరోపణలను సంచలనం సృష్టిస్తున్నాయి.  కంచి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల విగ్రహాల తాపడాలను మార్చినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంచీపరంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలయంలోని పురాతన బంగారు, వెండి బల్లుల తాపడాలను మార్చేసి వాటి స్థానంలో కొత్త తాపడాలను ఏర్పాటుచేశారని శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ ఫిర్యాదు చేశారు.  దీంతో విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులు   దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో  ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని పోలీసులు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు. ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైనప్పుడు విచారణకు రావాలని ఆలయ ఈవో, సిబ్బందిని పోలీసులు ఆదేశించినట్లు తెలిసింది. 108 దివ్య క్షేత్రాల్లో ఒకటైన కాంచీపురంలోని ఈ ప్రసిద్ధ వరదరాజస్వామి ఆలయంలో బంగారు, వెండి బల్లులు విశిష్టమైనవి. నిత్యం ఈ ఆలయాన్ని దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా  వచ్చే భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి బంగారు, వెండి బల్లులను తాకితే దోషనివారణ జరుగుతుందన్నది భక్తులు విశ్వాసం.  పురాణ గాథ ప్రకారం..  గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో ఓ బల్లి పడింది. ఆ విషయాన్ని శిష్యులు గుర్తించలేదు. అది చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాప విముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలోనే మీకు విముక్తి లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లుల‌ రూపంలో వుండి స్వామి వారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఆ సమయంలో సూర్య, చంద్రులు సాక్ష్యులుగా ఉన్న బంగారు, వెండి రూపాల్లో శిష్యుల శరీరాలు బల్లుల బొమ్మలుగా వుండి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దోష నివారణ చేయమని మహర్షి ఆదేశిస్తాడు. బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని అర్థం అని చెబుతారు.

రాయల చెరువుకు గండి! జలదిగ్బంధంలో గ్రామాలు

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఓల్లూరులోని రాయల చెరువు రిజర్వాయర్ కట్టకు గండిపంది. దీంతో గురువారం (నవంబర్ 6)న పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం సంభవించలేదు కానీ, పశుసంపదకు అపార నష్టం వాటిల్లింది.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలచెరుకువు భారీగా నీరు చేరింది. గత  కొద్ది రోజులుగా వర్షాలు తగ్గడంతో ప్రమాదం లేదని జనం ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే ఏమయ్యిందో తెలియదు కానీ చెరువుకు ఒక్కసారిగా గండి పడి నీరు  ఓల్లూరు, పాతపాలెం, రాజుల కండ్రిగ, కళత్తూరు, కళత్తూరు హరిజనవాడ గ్రామాలను మంచేసింది. వరద నీరు  పోటెత్తడంతో  జనం భయాందోళనలకు గురయ్యారు. కట్టుబట్టలతో ఎత్తైన భవనాలు, ప్రదేశాలను ఆశ్రయించారు. అయితే గ్రామంలో బయట కట్టేసిన ఆవులు, గేదెలు, పాకల్లో ఉన్న మేకలు గొర్రెలు కొట్టుకుపోయాయి. అదేవిధంగా మోటారు బైకులు, ఆటోలు సైతం వరద నీటిలో   కొట్టుకుపోయాయి.  వేలాది ఎకరాలలో పంట ధ్వంసమైంది. రాగిగుంట శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన రోడ్డు మార్గం కూడా కోతకు గురవ్వడంతో ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.  అలాగేఆదవరం, కాళంగి గ్రామాల మీదుగా కాళంగి రిజర్వాయర్ కు వరద నీరు చేరింది. దీంతో కాళంగి రిజర్వాయర్ కు సామర్థ్యానికి మించి నీటి నిల్వలు చేరడంతో అధికారులు  గేట్లు ఎత్తివేశారు. ఫలితంగా కాళంగి రిజర్వాయర్ కు దిగువనున్న పంట పోలాలు ముంపునకు గురయ్యాయి. 

గ్రామ సచివాలయాలు కాదు.. విజన్ యూనిట్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేరు మార్చింది. ఇక నుంచీ వాటిని విజన్ యూనిట్స్ గా పిలవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.  గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరుకు చేసి, మరింత మెరుగైన సేవలు అందించే విధంగా రూపకల్పన చేయాలనీ, అందుకే వాటి పేరు విజన్ యూనిట్స్ గా మారుస్తున్నామన్నారు.  భవిష్యత్ లో ప్రజా సేవలకు విజన్ యూనిట్సే కేంద్ర బిందువులుగా నిలుస్తాయన్నారు.   ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా, సమర్థంగా అందించేలా టెక్నాలజీని వినియోగించుకోవాల్నారు.  ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు, రికార్డులు, సర్టిఫికెట్టు ఇలా అన్నీ  ఒకే వేదిక నుంచి అందించేలా విజన్ యూనిట్స్ పని చేయనున్నాయని వివరించారు.   

ఎస్ఆర్ఎం కాలేజీ ఫుడ్ పాయిజినింగ్ ఘటనపై విచారణకు కమిటీ

  అమరావతిలోని ఎస్ఆర్ఎమ్  కాలేజీలో ఫుడ్ పాయిజన్(  కలకలం రేగింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 300 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. అయితే విషయాన్ని బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం మేనేజ్ చేసింది. అంతేకాదు విద్యార్ధులను ఇంటికి పంపించారు. విషయం బయటకు రాకుండా విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కాగా కాలేజీలో విద్యార్థులు ఫుడ్ పాయిజినింగ్ తో అస్వస్థతకు గురి అయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎస్ఆర్ఎసం కాలేజీలో ఫుడ్ పాయిజనింగ్ పై గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన కమిటీ వేసింది. విచారణాధికారిగా తెనాలి సబ్ కలెక్టర్ అంజనాసిన్హాను నియమించింది. ఆమె ఎస్ఆర్ఎం కాలేజీతో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఎస్ఆర్ఎం కాలేజీలో కలుషితాహారం తిని  300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ధృవీకరించారు. ఈ కాలేజీలో ఆహారం నాణ్యతపై గత కొంత కాలంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. ఎస్ఆర్ఎమ్ కళాశాలలో తరచుగా ఇటువంటి ఘటనలు జరగడానికి గల కారణాలను విచారిస్తున్నామని చెప్పిన అంజనా సిన్హా.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  కళాశాలలో ఆరువేల మంది విద్యార్థులకు ఆహారం అందిస్తున్నట్లు తెలిపిన ఆమె విద్యార్థుల అస్వస్థతకు గురి కావడానికి కారణాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.