ఏనుగుల బెడదకు టెక్నాలజీతో అడ్డుకట్ట!

ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా సహా  పలు ప్రాంతాల్లో రెతులకు పెను కష్టాలను తెచ్చి పెడుతున్న అడవి ఏనుగుల బెడదను నివారించేందుకు ఆధునిక సాంకేతికతను ప్రభుత్వంం అందుబాటులోకి తీసుకువచ్చింది.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సౌరశక్తి ఆధారంగా పనిచేసే వినూత్న వ్యవస్థను చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు.  ఈ టెక్నాలజీ ద్వారా ఏనుగుల సంచారాన్ని ముందుగానే గుర్తించి, వాటిని  తిరిగి అడవిలోకి పంపించడం సాధ్యమవుతుందన్నారు. ఈ   వ్యవస్థను ఏనుగులు సంచరించే మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. ఇది తన పరిధిలోకి ఏనుగు రాగానే గుర్తించి, వెంటనే తుపాకీ పేలినట్లు పెద్ద శబ్దాలు చేస్తుంది. ఆ శబ్దాలకు భయపడి ఏనుగులు వెనుదిరుగుతాయి. అదే సమయంలో అటవీ శాఖ అధికారులకు వెంటనే సంకేతాలు పంపి, వారిని అప్రమత్తం చేస్తుంది. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థ  ఏర్పాటు చేసిన ప్రాంతంలో 60 మీటర్ల పరిధిలో 120 డిగ్రీల కోణంలో నిరంతరం పర్యవేక్షిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల  ఏనుగుల బెడదకు పరిష్కారం లభించడమే కాకుండా. వన్యప్రాణులకు, మనుషులకు ఎటువంటి హానీ లేకుండా రక్షణ ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.   గతంలో ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి నాలుగు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చిన విషయాన్ని పవన్ గుర్తుచేశారు. గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న అడవి ఏనుగులను ఈ కుంకీలు విజయవంతంగా అడవుల్లోకి మళ్లిస్తున్నాయన్నారు. ఇప్పుడు వాటికి తోడుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. కుంకీల నుంచి కృత్రిమ మేధ వరకు, ఏనుగుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శనీయంగా నిలుస్తాయని చెప్పారు. ఏనుగుల సంచారాన్నే కాదు.. శేషాచలం అడవులలో చిరుతల కదలికలను కూడా ఈ విధానం ద్వారా గుర్తించవచ్చని చెప్పారు. 

ఏపీలో జలమార్గాల అభివృద్ధి.. అరూప్ సంస్థకు చంద్రబాబు ఆహ్వానం

పెట్టుబడుల వేటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దూసుకుపోతున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలన్న లక్ష్యంతో ఆయన తన లండన్ పర్యటనలోనూ నిర్విరామంగా పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా ఆయన సోమవారం (నవంబర్ 2)  ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, టెక్నాలజీ, ఖనిజ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, వారిని రాష్ట్రానికి పెట్టుబడులతో రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించారు.   ఆంధ్రప్రదేశ్ లో  రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పాటు   జలరవాణాకు ఉన్న అపార అవకాశాలను చంద్రబాబు వారికి వివరించారు.  తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసేందుకు వీలుగా జల మార్గాలను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని  ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ 'ఆరుప్'కు సూచించారు.  ఏపీని ఒక కీలకమైన లాజిస్టిక్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.  అలాగే సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ జెట్ ను మించిన వేగంతో పురోగమిస్తోందన్న చంద్రబాబు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందనీ,  అమరావతిలో వచ్చే ఏడాది జనవరి నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఏఐ వినియోగం, నిపుణుల తయారీ, ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.  ఇక రాష్ట్రంలో  భూగర్భ ఖనిజాల వెలికితీతలో యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆ సందర్భంగా పిలుపునిచ్చారు.   ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరుప్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్నీ, అల్తెరిన్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెడీ వూలాండ్, పీజీ పేపర్ కంపెనీ సీఈఓ పూనమ్ గుప్తా, మాంచెస్టర్ యూనివర్సిటీ నానోసైన్స్ ప్రొఫెసర్ రాధాబోయా సహా పలువురు ప్రముఖులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బంగాళాఖాతంలో మరో వాయుగుండం!.. తెలుగు రాష్ట్రాలకు వానగండం!!

తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగపట్టాడా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు.  వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది.  వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు రానున్న మూడు రోజులలో తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం ( నవంబర్ 4) బంగాళాఖాతంలో అల్పడీనం ఏర్పడింది. ఇది బలపడి వాయుగుండంగా, తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది  కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.  

విశాఖలో కంపించిన భూమి

విశాఖపట్నంలో మంగళవారం  (నవబంర్ 4)తెల్లవారు జామున భూమి కంపించింది. జనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి స్వల్పంగా కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో నిద్ర నుంచి ఒక్కసారిగా మేల్కోన్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవారు జామున 4.16 గంటల నుంచి 4.20 గంటల మధ్య భూమి కంపించింది.   గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది. అయితే ఈ తీవ్రత ఎంతన్నది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.  భూ కంప తీవ్రత స్వల్పంగానే ఉన్నప్పటికీ  ప్రజల్లో  మాత్రం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  భూమి కంపించిన ప్రాంతాలలో ప్రజలు చాలా వరకూ తెల్లవారే వరకూ ఇళ్ల బయటనే గడిపారు.  ఎటువంటి ఆస్త, ప్రాణ నష్టం సంభవించలేదు.  

లండన్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ

  లండన్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన బ్రిటన్‌లోని ప్రముఖ విద్యుత్ సరఫరా సంస్థ ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్‌జెరాల్డ్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి, విశాఖపట్నం వంటి నగరాల్లో నూతన టెక్నాలజీతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, నియంత్రణ రంగాల్లో భాగస్వామ్యానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.  క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్‌, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనానికి ప్రాధాన్యతనిస్తూ, 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, లక్ష్యాలను ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు వివరించారు.రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని వారిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరప్ లోని హిందుజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజాలతో  సమావేశం నిర్వహించారు. హిందూజా గ్రూప్ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకున్నారు. దశలవారీగా ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకున్నాది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ లను ఏర్పాటు చేసే అంశంపై ఒప్పందం జరిగింది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు ఒప్పందం చేస్తుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు అంశంపై  ఒప్పందం కుదిరింది.

ఉమెన్ వరల్డ్ కప్‌లో కడప స్పిన్నర్ సత్తా

  భారత జట్టుకు ఆడడం ఏ ప్లేయర్‌కైనా పెద్ద కల. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వస్తే! అందులోనూ అరంగేట్రం చేసిన కొన్ని నెలలకే ఈ అవకాశాన్ని అందుకుంటే! ఆ అదృష్టం తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికి దక్కింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా అందుకున్న ఈ స్పిన్నర్‌ భారత్‌ కప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించింది. కడపకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి మొదట బ్యాడ్మింటన్, కబడ్డీ ఆడేది. తర్వాత ఆమె మనసు క్రికెట్‌ వైపు మళ్లింది. ఫాస్ట్‌ బౌలర్‌గా కెరీర్‌ ఆరంభించింది. అందులో సఫలం కాకపోవడంతో స్పిన్నర్‌గా మారింది. దేశవాళీలో స్థిరంగా రాణించింది. దీంతో గతేడాది డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఈ స్పిన్నర్‌ను రూ.55 లక్షలు పెట్టి దక్కించుకుంది.  ఈ ఏడాది మార్చిలో సీనియర్‌ మహిళల టోర్నీలో భారత్‌-బికి ఆడి ఆకట్టుకుంది. కానీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఆమె ఊహించలేదు. లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ కావడం.. స్థిరంగా రాణిస్తుండడంతో భారత్‌ సీనియర్‌ జట్టు నుంచి పిలుపొచ్చింది. ఈ ఏప్రిల్‌లో శ్రీలంకపై అరంగేట్రం చేసింది. ప్రపంచకప్‌ జట్టులో చోటు కోసం చాలామంది రేసులో ఉండడంతో కొత్త అమ్మాయి శ్రీచరణికి అవకాశం దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అనుభవం కన్నా నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తూ శ్రీచరణికి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఆమె లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ భారత్, శ్రీలంక పిచ్‌లపై ఎంతో కీలకమవుతుందని భావించారు. ఆ నమ్మకాన్ని ఈ స్పిన్నర్‌ వమ్ము చేయలేదు. అత్యధిక వికెట్లు పడగొట్టలేదు కానీ.. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ కీలకంగా మారింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో ఆ జట్టు మరింత ఎక్కువ స్కోరు చేయలేదంటే అందుకు శ్రీచరణియే కారణం. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన డీవై పాటిల్‌ పిచ్‌పై జోరు మీదున్న ఆసీస్‌ బౌలర్లను డెత్‌ ఓవర్లలో అడ్డుకుని తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. బ్యాటర్ల కదలికలను బట్టి బంతులు వేసే శ్రీచరణి.. వైవిధ్యంతో బోల్తా కొట్టిస్తుంది. బంతి వేగాన్ని తగ్గించడం, ఒక బంతిని స్పిన్‌ చేసి మరొక బంతిని నేరుగా వేయడం ద్వారా ప్రత్యర్థి బ్యాటర్లను తికమక పెట్టింది. ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో దీప్తిశర్మ తర్వాత శ్రీచరణియే ఉంది. ఆమె ఇప్పటిదాకా 17 వన్డేల్లో 22 వికెట్లు పడగొట్టింది. ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసింది. చరణి ఇదే జోరు మున్ముందు కొనసాగిస్తే భారత్‌కు మరిన్ని విజయాలు అందించడం ఖాయం.

చేవెళ్ల బస్సు ప్రమాదంలో అనాథలైన ఇద్దరు చిన్నారులు

  రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో  చిన్నారులు అనాధలు అయ్యారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందప్ప, లక్ష్మీ అనే దంపతులకు భవానీ, శివలీల అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులిద్దరు మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రులు మరణించడంతో పిల్లల రోదన చూసి పలువురు కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు  ఈ ఘటనలో స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్న ఆ బస్ కండక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... మీడియాతో మాట్లాడారు. బస్సు మీర్జాగూడ వద్దకు రాగానే ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదని, కన్నుమూసి తెరిచేలోపు ఘోరం జరిగిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. బస్సులో పోలీసులు, ఉద్యోగులు సహా మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయడ్డారు. 

మరో ఘోర రోడ్డు ప్రమాదం...12మంది మృతి

  రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హర్మద ఏరియాలోని సికర్ రోడ్డులో వాహనలపై డంపర్ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. అతి వేగంతో వచ్చిన ట్రక్కు నియంత్రణ కోల్పోయి ఎదురు వస్తున్న వాహనాలను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాదాపు 5 కి. మీ. మేర వాహనాలను ఢీకొడుతూ వెళ్లింది.  ట్రక్కు డ్రైవర్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది.రోడ్డుపై వాహనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.    

అన్న క్యాంటీన్లు... దేవాలయాలు : రామ్మోహన్ నాయుడు

  శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల్లో  కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తో కలసి పర్యటించారు. ఈ సంధర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. తొలుత కోటబొమ్మాళి లో పార్టీ కార్యాలయంలో జిల్లా వాసుల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం కోటబొమ్మాళి డిసిసిబి భవనానికి శంకుస్థాపన చేశారు. కోటబొమ్మాళి వీధులను పరిశీలించి అభివృద్ధికి పలు సూచనలు చేశారు.  అనంతరం కోటబొమ్మాళి ప్రధాన రహదారిలో అన్నా క్యాంటీన్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా అక్కడివారికి భోజనాన్ని వడ్డించడం తో పాటు.. తర్వాత వారితో కలసి అన్నా క్యాంటీన్ లోనే మంత్రులు భోజనం చేశారు. అన్న క్యాంటీన్ పరిసరాలు, భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ సంధర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, స్వయంగా వడ్డించడం, వారితో కలసి భోజనం చెయ్యడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..  బృహత్తర లక్ష్యంతో అన్నా క్యాంటీన్ లను ప్రారంభించారని.. ఇక్కడ భోజనం చేసే వాళ్ళ కళ్లలో సంతోషం వెలకట్టలేనిది అని అన్నారు.  గత సర్కారు అన్నదానానికి కూడా రాజకీయం అంటగట్టారని.. తద్వారా ఎంతోమంది నష్టపోయారని స్పష్టం చేశారు. వారు ఈ పథకాన్ని నిర్వీర్యం చెయ్యాలని చూసినా.. చంద్రబాబు గారి స్పూర్తితో రాష్ట్రంలో చాలా చోట్ల నిర్విరామంగా పథకం తెదేపా శ్రేణులు కొనసాగించాయని, టెక్కలి నియోజకవర్గంలో బాబాయ్ అచ్చెన్నాయుడు, తాను ఈ పథకాన్ని కొనసాగించిన సంగతిని గుర్తు చేశారు.  కూటమి సర్కారు కొలువు తీరిన తరువాత మరింత వేగంతో అన్నా క్యాంటీన్ లో రాష్ట్రంలో ఏర్పడ్డాయని, కోటబొమ్మాళి లో కూడా రెండు నెలల వ్యవధిలో అన్నా క్యాంటీన్ ఏర్పడింది అంటే.. అది అచ్చెన్నాయుడు పనితీరుకు నిదర్శనం అని తెలిపారు. ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసిపోని నాణ్యత, పోషక విలువలతో అన్నా క్యాంటీన్ లో భోజనం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.  సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు దేవాలయాలు అని రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు.  కోటబొమ్మాళికి, కింజరాపు కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని..  ఇక్కడ గెలిచిన వాళ్ళు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు అంటే స్థానిక ప్రజల ప్రేమనే కారణం అని స్పష్టం చేశారు. ఇప్పటికే అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతున్న కోటబొమ్మాళి ను మోడల్ మండలం గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. యాభై ఏళ్లకు సరిపడా అభివృద్ధి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, కొత్తమ్మ తల్లి ఆలయాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, శ్రేణులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు : మంత్రి పొన్నం

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారికంగా ఇప్పటి వరకూ 19 మంది చనిపోయారని మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలను కుటుంబాలకు రూ.5 లక్షలు, ఆర్టీసీ తరుపున మరో రూ. 2 లక్షల  క్షతగాత్రులకు రూ. 2 లక్షల  పరిహారం ఇస్తామని పేర్కొన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోంది. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. 19 మందిలో 13 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు. ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

  రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్‌ ముగ్గురు కుమార్తెలు  తనూష, సాయి ప్రియ, నందిని హైదరాబాద్‌లో చదువుతున్నారు. ఇటీవల పెళ్లి ఉండటంతో సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.  మరోవైపు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిలరెడ్డి అనే యువతి కూడా ఇదే ప్రమాదంలో చనిపోయారు. ఎంబీఏ చదువుతున్న కుమార్తె మృతితో అఖిల తల్లి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనాస్థలానికి వచ్చి బోరున విలపించారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లివేడుకలో సందడిగా గడిపిన ఈ ముగ్గురూ ఇవాళ విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

ఈ టీచర్లు ఏంటో ?

  దైవంతో సమానంగా భావించే పరిస్థితి నుంచి కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. అందులో మహిళా టీచర్లు ప్రమేయం ఉండడం బాధాకరమైన విషయం ఇప్పుడు సమాజం ఇలాంటి ఉపాధ్యాయుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది విశాఖలోని సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేని సాయి తేజ ఎందుకు అకాల మరణం చెందరన్న విషయంపై విద్యార్థులు ఆందోళన చెందారు కారణాలు అన్వేషించారు. అయితే అతని స్నేహితులు ఇచ్చిన సమాచారంతో మొబైల్ డేటాను పరిశీలించారు అందులో ఊహించని నమ్మలేని నిజాలు కనిపించాయి. ఆ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు సాయి తేజ తో విభిన్నంగా చాటింగ్ చేశారు.  అందులో ఒకరు సన్నిహితం అవ్వాలన్న ప్రయత్నం చేస్తే మరొకరు ఆ విషయాన్ని తెలుసుకొని బ్లాక్మెయిలింగ్ చేశారు. అలా ఇద్దరు టీచర్ల విభిన్న ఒత్తిడితో సాయి తేజ మానసికంగా దిగులు చెందాడు. అందుకే అతను ప్రాణం తీసుకున్నాడాని కుటుంబ సభ్యులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎంపీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరు మహిళ టీచర్లను వెంటనే అరెస్ట్ చేయాలని సాయి తేజ కుటుంబ సభ్యులు కాలేజీ భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.  ఈ విషయం ఇప్పుడు నెటిజన్లలో చర్చగా మారింది విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లు ఈ రకంగా ప్రేమ వ్యామోహం తో డిగ్రీ విద్యార్థిని మానసికంగా వేధించడం సరికాదంటున్నారు. అయితే ఇలాంటి వ్యవహారాలు కొన్ని సందర్భాల్లో బయటికి వచ్చినప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు ఆపోజిట్ సెక్స్ విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పురుష టీచర్లు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది కానీ ఇప్పుడు విశాఖలోని సమతా కాలేజ్ వ్యవహారంలో మహిళ టీచర్ల తప్పుడు ప్రవర్తన గాడి తప్పిన సమాజానికి ఒక చిరునామాగా చెప్పుకుంటున్నారు

మొన్న వ‌ర్మ ఈ సారి వ‌ర్మ... శ‌ర్మ ఇద్ద‌రూ వండ‌ర్స్

  మొన్న ఆసియా  క‌ప్ తిల‌క్.. వ‌ర్మ రూపంలో భార‌త్ ప‌రం  కాగా..నేడు విమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర్మ‌, శ‌ర్మ ఇద్ద‌రూ క‌లిసి  భార‌త్ కి ప్ర‌పంచ కప్పు సాధించి పెట్టారు. ఎప్ప‌టిలాగానే సౌతాఫ్రికా ఫైన‌ల్స్ ఫీవ‌ర్ తో క‌ప్పు చేజార్చుకోవ‌డంలో వీరు కీల‌క పాత్ర పోషించారు.  ఇంత‌కీ ఎవ‌రా  శ‌ర్మ- వ‌ర్మ అంటే దీప్తీ  శ‌ర్మ‌- ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ కాగా,. అదే ష‌ఫాలీ శ‌ర్మ ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచి.. ఈ కాంబోకి తిరుగులేద‌ని నిరూపించారు.  ఇంత‌కీ  దీప్తీ  శ‌ర్మ ఈ సీరీస్ మొత్తంలో సాధించిన  వికెట్లు ఎన్ని? ష‌ఫాలీ ఈ మ్యాచ్ లో చూపించిన మ్యాజిక్ ఎలాంటిదో చూస్తే.. ష‌ఫాలీ  వ‌ర్మ ఈ మ్యాచ్ లో 87 ప‌రుగులు సాధించి.. త‌ద్వారా  గౌర‌వ‌ప్ర‌ద‌మైన  స్కోరు ప్ర‌త్య‌ర్ధి ముందుంచ‌డంలో కీల‌క  పాత్ర  పోషించింది. ఇక దీప్తీ  శ‌ర్మ ఈ టోర్నీలో 215 పరుగులు సాధించ‌డంతో పాటు 22 వికెట్లతో ఆల్ రౌండ్ షో చేసి చూపించింది, అర్ధ సెంచరీ సాధించడం మాత్ర‌మే కాక‌ ఫైనల్‌లో కీలకమైన ఐదు వికెట్లు పడగొట్టి, దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్‌కు క‌ప్పు సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. ఒక టోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసిన రికార్డును సైతం బ‌ద్ద‌లు కొట్టిందీ దీప్తి శ‌ర్మ‌.  ఈ టోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసిన  విమెన్ క్రికెట‌ర్స్ లో టాప్ గా నిలిచింది. నిజం చెప్పాలంటే ఇదొక క‌ల‌లాగా అనిపిస్తోంది. ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ లో తాను జ‌ట్టుకు ఇంత ఉప‌యోగ‌ప‌డ‌తాన‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని అంటారు దీప్తి. ఎనీ హౌ కంగ్రాట్స్ దీప్తీ అండ్ ష‌ఫాలీ అండ్ ఆల్ విమెన్ క్రికెట‌ర్స్ అంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా వీరిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తోంది.  

చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం అదేనా?

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొదట ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలుపగా.. తాజాగా వాటి సంఖ్య 25కి చేరింది. మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. యాక్సిండెట్‌కు రోడ్డు సరిగా లేకపోవడమే కారణమని స్ధానికులు అంటున్నారు. రోడ్డు చిన్నగా ఉండటం రద్దీ వల్ల తరచూ ప్రమాదలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితమే 4 వరుసల రహదారి మంజూరు అయిందని తెలిపారు. రోడ్డు విస్తరిస్తే చేట్లు నాశనం అవుతాయని కొందరు పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యూనల్‌కు వెళ్లారన్నారు. దీంతో పనులు  ఆగిపోయాని స్ధానికులు తెలిపారు. మరోవైపు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి పొన్నం ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిప్పర్‌ రాంగ్‌రూట్‌లో వచ్చి బస్సును ఢీకోట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారని తెలిపారు. మరోవైపు  సహాయ చర్యల పర్యవేక్షణకు సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద సమాచారం కోసం 9912919545, 9440854433 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం  ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌కు  తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు.  అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని , అందుకు అవసరమైన  అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. చేవేళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై, ఎప్పటికప్పుడు అక్కడ చేపడుతున్న సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని  డీజీపీ, సీఎస్‌తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు.  ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని  సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదనికి రోడ్డు సరిగా లేకపోవడమే కారణమని స్ధానికులు అంటున్నారు. రోడ్డు చిన్నగా ఉండటం రద్దీ వల్ల తరచూ ప్రమాదలు జరుగుతున్నాయని వారు వాపోయారు. ఐదేళ్ల క్రితమే 4 వరుసల రహదారి మంజూరు అయిందని తెలిపారు. రోడ్డు విస్తరిస్తే చేట్లు నాశనం అవుతాయని కొందరు పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యూనల్‌కు వెళ్లారన్నారు. దీంతో పనులు  ఆగిపోయాని స్ధానికులు తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి

హైదరాబాద్ సమీపంలో  సోమవారం (నవంబర్  3) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది దుర్మరణం పాలయ్యారు.  మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.  తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తుండగా    చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో  కంకర లోడుతో అతి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.  ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణీకులు ఉన్నట్లు చెబుతున్నారు.   బస్సులో ఉన్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులే  అని చెబుతున్నారు.  ఆదివారం (నవంబర్ 2) సెలవు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లి.. తిరిగి సోమవారం (నవంబర్3) హైదరాబాద్‌లోని కాలేజీలకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.  పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ఒకే రోజు.. ఇండియా రెండు అద్భుత విజయాలు

ఒకటి ఇస్రో సీఎంఎస్03 ప్రయోగం.. రెండు విమెన్ క్రికెట్ టీమ్ విశ్వవిజేతగా నిలవడం ఇండియా ఆదివారం(నవంబర్ 2) రెండు చిరస్మరణీయమైన విజయాలను సాధించింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయేలా సాధించిన ఈ విజయాలు భారత కీర్తి కిరీటంలో మరో రెండు కలికితురాయిలుగా నిలిచాయి. భారత్ ఒకే రోజు రెండు వేర్వేరు రంగాల్లో అద్భుత విజయాలు సాధించింది. ఒకటి అంతరిక్ష ప్రయోగంలో ఇస్రో సాధిస్తే.. రెండోది క్రీడా రంగంలో భారత మహిళలు సాధించారు. ముందుగా ఇస్రో సాధించిన ఘనత విషయానికి వస్తే..  శ్రీహరికోట నుంచి   ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. . ఈ విజయం భారత్‌ కమ్యూనికేషన్‌ రంగాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది. . ఈ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపిన సీఎంఎస్ 03 కమ్యూనికేషన్‌ ఉపగ్రహం భారత భూభాగంతో పాటు సమీప సముద్ర ప్రాంతాలపై విస్తృత కవరేజ్‌ అందిస్తుంది. కనీసం 15 సంవత్సరాలపాటు సేవలు అందించేలా రూపొందించిన ఈ మల్టీ బ్యాండ్‌ ఉపగ్రహం అత్యున్నత సాంకేతికతతో రూపొందింది.  ఈ  ప్రయోగ సమయంలో  వాతావరణ ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఇస్రో సైంటిస్టులు  సవాళ్లన్నిటినీ అధిగమించి  విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సి 25  క్రయోజెనిక్‌ ఇంజిన్‌  ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన అనంతరం,  మళ్లీ విజయవంతంగా రీ ఇగ్నైట్‌ చేయడం ద్వారా భవిష్యత్తులో ఒకే మిషన్‌లో పలు ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో ఉంచే సాంకేతిక సామర్థ్యానికి మార్గం సుగమం అయ్యిందని చెప్పాలి.  . ఈ ప్రయోగం భారత అంతరిక్ష ప్రగతిలో కీలక మలుపు, ముందడుగు అని ఇస్రో చీఫ్ అన్నారు. ఇక రెండో అద్భుత విజయం.. 47 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత మహిళల క్రికెట్ జట్టు తొలి సారిగా వన్డే వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించి సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.  ఆల్ మోస్ట్ ఎలాంటి అంచనాలూ లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతం సృష్టించింది. నాకౌట్ స్టేజికి ముందు మూడు పరాజయాలతో.. అసలు సెమీస్ కైనా చేరుతుందా అన్న అనుమానం అభిమానుల్లో కలిగింది. అయితే హర్మన్ ప్రీత్ సేన అనూహ్యంగా, అనితర సాధ్యమన్న రీతిలో పుంజుకుంది. ఇంతకు ముందు రెండు సార్లు వరల్డ్ కప్ ఫైనల్ వరకూ వచ్చి కూడా కప్ అందుకోలేకపోయిన టీమ్ ఇండియా.. ఈ సారి మాత్రం కప్పు సాధించాలన్న పట్టుదలతో ఆడింది.  సెమీ ఫైనల్ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి అంచుల నుంచి విజయం దిశగా అద్భుత పోరాటం చేసి గెలిచింది.  ఆ క్రమంలో వన్డేల్లో మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇక ఫైనల్ లోనూ ఒత్తిడిని తట్టుకుని దక్షిణాఫ్రికాపై 52 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి గర్వంగా కప్ ను ముద్దాడింది.    

విశ్వవిజేతగా నిలిచిన మహిళల క్రికెట్ జట్టుకు రాష్ట్రపతి, మోడీ అభినందనలు

వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని  మోడీ అభినందనలు తెలిపారు. జట్టు విజయంలో పాలుపంచుకున్న ప్రతి క్రీడాకారిణికీ హృదయపూర్వక అభినందనలు అంటూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. తొలి సారి విశ్వవిజేతగా నిలవడం ద్వారా చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. అలాగే ఈ విజయాన్ని ఒక చారిత్రకఘట్టంగా అభివర్ణించిన ప్రధాని మోడీ,  ఈ విజయం భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.  జట్టులో అందరూ సమష్టిగా రాణించారని పేర్కొన్న ఆయన జట్టులోని ప్రతిఒక్కరినీ హృదయపూర్వకంగా అబినందిస్తున్నట్లు పేర్కొన్నారు.