తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. శుక్రవారం (అక్టోబర్ 10) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.   ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (అక్టోబర్ 9)  శ్రీవారిని మొత్తం 66,883 మంది దర్శించున్నారు. వారిలో 26 వేల  మంది    తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం  4కోట్ల 15లక్షల రూపాయలు వచ్చింది.  

బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆపడంలో ఆ రెండు పార్టీల కుట్ర : భట్టి

  రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చిత్తశుద్ది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ను ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు తప్పక అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. ఢిల్లీలో మేము ధర్నా చేసిన రోజు బీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ దాక్కున్నారు? బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చట్టబద్ధంగా చేయాల్సిన ప్రతి ప్రక్రియను మా ప్రభుత్వం పూర్తి చేసిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  సెప్టెంబర్‌ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలంటూ కోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉంటే కులగణన ఎందుకు చేయలేదు? బీసీలు అమాయకులు కాదు... రిజర్వేషన్ల పెంపు ఎంత క్లిష్టమో వారికి తెలుసు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ప్రక్రియను ప్రారంభించాం” అని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ అన్నారు .  బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బిఆర్ఎస్ లకు ఏ మాత్రం ఇష్టం లేదు. 95 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జరిగింది  బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీ లను బిఆర్ఎస్ మోసం చేసిందన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తో బీసీ ల నోటి కాడి ముద్ద లాక్కున్నారు. మేము ఢిల్లీ లో ధర్నా చేస్తే...బీజేపీ, బిఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారు’ అని మహేష్‌ గౌడ్‌  నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసింది తమ ప్రభుత్వమేనని మహేష్‌ గౌడ్‌  చెప్పారు.

హైకోర్టు ఆదేశాలను పాటిస్తాం : ఎన్నికల సంఘం

  స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సింగిల్ సెంటెన్స్‌తో ప్రెస్ నోట్ విడుదల చేసింది. లోకల్ బాడీ ఎన్నికల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడైంది. బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నె 9 పై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించగా, ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొన్నాది. కోర్టు తదుపరి విచారణను ఆరు వారాలకి వాయిదా వేశారు. ఆ సమయంలో వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండవని ఎన్నికల సంఘం తెలిపింది

ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై పోలీసులు హెచ్చరిక

  హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నెరగాళ్లు విసురు తున్న వలలో చిక్కుకుని చాలా మంది బాధితులు లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అధిక వడ్డీ ఆశ చూపించగానే బాధితులు ముందు వెనక ఆలోచించ కుండా పెట్టుబ డులు పెట్టేందుకు  సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు బాధితుల వద్ద నుండి దొరికి నంత దోచుకుం టున్నారు. ఇలా నగరంలో పలు కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై హెచ్చ రికలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చిన్న ఇన్వెస్ట్‌ మెంట్‌ తో మొదలై పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుం టున్నా రని పోలీసులు తెలిపారు. నకిలీ వెబ్‌సైట్లలో ఫేక్ లాభాలు చూపించి, ట్యాక్స్‌లు, ఫీజుల పేరుతో మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారని అట్టి వారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తం గా  ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు..ప్రజలు ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్లాట్‌ ఫారమ్‌ను ధృవీ కరించుకోవాలని, అధిక లాభాల హామీలను నమ్మి మోసపోకూడదని పోలీసులు సూచి స్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే 1930 నంబర్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీ సులు విన్నపం చేస్తున్నారు.

దేశ కుబేరుల జాబితా అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ!

  రిలయన్స్ వ్యాపార వాణిజ్య అధినేత ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని 100 మంది అగ్రగామి కుబేరుల జాబితాను ఫోర్బ్స్ గురు  వారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముకేశ్ టాప్ ప్లేస్‌లో  నిలిచారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర ఆదాయం సుమారు 105 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం 12శాతం 14శాతం ఆదాయం క్షీణించింది. ఇదిలాఉంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలి కమ్యూనికేషన్ సంస్థ జియో పబ్లిక్ ఇష్యూకు రానుంది.  2026 తొలి అర్ధభాగంలో తాము ఐపీవోకు వస్తున్నట్లు రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ వార్షిక సమావేశంలో వెల్లడించారు. మరోవైపు.. కృత్రిమమేధను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందు కు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ ఏర్పాటు గురించి ప్రకటన చేసింది. భారతదేశంలో 100 మంది అగ్రగామి కుబేరుల పోర్బ్స్ జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 92 బిలియన్ డాలర్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా.. ఓపీ జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ 40.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.  టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ నాల్గో స్థానంలో నిలవగా.. అతని సంపద 34.2 బిలియన్ డాలర్లు. ఈ సంవత్సరం అత్యధికంగా డాలర్లు సంపాదించిన వ్యక్తిగా సునీల్ మిట్టల్ నిలిచారు. ఇక టెక్ బిలియనీర్ శివ నాడార్ ఐదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 33.2బిలియన్ డాలర్లు.

ఏపీలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

  ఏపీలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్‌ జిలానీ సామున్‌, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, ఏపీపీఎస్సీ సెక్రెటరీగా రవి సుభాష్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా శివశంకర్‌ లోతేటి, పౌరసరఫరాలశాఖ వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌.ఢిల్లీరావు, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా పి. రంజిత్‌బాషా, హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్‌ సీఎండీగా అరుణ్‌బాబు నియమితులయ్యారు. 1. కొల్లాబత్తుల కార్తీక్ - నంద్యాల జాయింట్ కలెక్టర్ 2. శ్రీధర్ బాబు - కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ 3. శుభమ్ బన్సల్ - పరిశ్రమల శాఖ డైరెక్టర్ 4. మనజీర్ జిలానీ - వ్యవసాయ శాఖ డైరెక్టర్ 5. అభిషేక్ గౌడ - ఏలూరు జాయింట్ కలెక్టర్ 6. రవిసుభాష్ - ఏపీపీఎస్సీ కార్యదర్శి 7. నూరుల్ - కర్నూలు జాయింట్ కలెక్టర్ 8. శివశంకర్ లోతేటి - ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ 9. ఢిల్లీ రావు - పౌరసరఫరాల శాఖ వైస్ చైర్మన్ 10. రాహుల్ మీనా - రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ 11. పి. రంజిత్ బాషా - ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ 12. అపూర్వ భరత్ - కాకినాడ జాయింట్ కలెక్టర్ 13. మౌర్య భరద్వాజ్ - శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ 14. అరుణ్ బాబు - హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీ 15. జేవీ మురళి - సీసీఏల్ఏ కార్యదర్శి 16. సహదిత్ వెంకట్ త్రివినాగ్ - గృహనిర్మాణ శాఖ డిప్యూటీ కార్యదర్శి 17. టీఎస్ చేతన్ - సీసీఏఎల్ సంయుక్త కార్యదర్శి 18. కొమ్మిశెట్టి మురళీధర్ - ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి 19. ప్రసన్న వెంకటేశ్ - లెదర్ ఇండస్ట్రీస్ అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ 20. బి. నవ్య - రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ 21. ఎస్. భరణి - స్టెప్ కమిషనర్ 22. ప్రవీణ్ ఆదిత్య - ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ 23. తిరుమణి శ్రీపూజ - అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ 24. కేఎల్ విశ్వనాథన్ - ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ 25. గోవిందరావు - పౌరసరఫరాల శాఖ 26. ఎస్. చిన్నరాముడు - ఎస్సీ కమిషన్ కార్యదర్శి 27. జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ - ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ 28. ఎస్ఎస్ భావన - బాపట్ల జాయింట్ కలెక్టర్ 29. సి. విష్ణుచరణ్ - సోషల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ కార్యదర్శి 30. ఎస్ఎస్ శోభిక - వైద్యఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి 31. అభిషేక్ కుమార్ - ఏపీ మారిటైం బోర్డు సీఈవో

హైకోర్టు స్టే ఊహించలేదు...భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం : మంత్రి పొన్నం

  బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కోర్టు కాఫీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. హైకోర్టు స్టే విధిస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడం జరిగిందని పొన్నం పేర్కొన్నారు.  ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ వేసి అన్ని విధాలుగా చిత్తశుద్ధితో వ్యవహరించిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తమని మంత్రి పొన్నం తెలిపారు. బీసీలకు 42 శాతంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన కూడా స్టే విధించడం అన్యాయమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ రిజర్వేషన్ కొలిక్కి వచ్చిందనుకున్నాం.. కానీ కోర్టు తీర్పు ఊహించలేదని చెప్పారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. బీసీల నోటి కాడ కూడు లాగేయడం శోచనీయమని పేర్కొన్నారు.  నోటి కాడ ముద్ద ఎవరు లాగేసారో కోర్ట్ తీర్పు కాపీ వచ్చాక చెబుతామని హెచ్చరించారు. 42 శాతం బీసీల రిజర్వేషన్ కు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ బిడ్డలు అధైర్య పడాల్సిన అవసరం లేదని. .కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రెండు సభల్లో పాస్ చేసి గవర్నర్ కు పంపించామని.. గవర్నర్ బిల్లు పాస్ చేయకుండా అడ్డుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

దేశంలోనే రోల్ మోడల్‌గా నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ : మంత్రి నారాయణ

  దేశంలోనే నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దమే తన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ  తెలిపారు. ఈనెల 10న సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటన సందర్భంగా మంత్రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలిప్యాడ్ పరిశీలన, కార్యక్రమాల ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రి నారాయణ క్షుణ్ణంగా అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సీఎం ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు మంత్రి ఏర్పాట్లు చేపట్టారు.  తొలుత వెంకటాచలం మండలం ఈదగాలిలో కార్యక్రమం అనంతరం నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్లో  స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులకు మరోమారు సూచనలు చేశారు. స్మార్ట్ స్ట్రీట్ బజార్ లో ఏర్పాటు చేసిన 120 కంటైనర్ షాప్ లను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా వ్యాపారులతో మాట్లాడారు. సీఎంతో మహిళ వ్యాపారుల ఫోటో సెషన్‌కు సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అన్నింటిని సాయంత్రం లోపల పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.  తమ కల సాకారం చేస్తూ స్మార్ట్ స్ట్రీట్ బజార్‌ను ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ కు మహిళ వ్యాపారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్ లో ప్రారంభోత్సవానికి స్మార్ట్ స్ట్రీట్ బజార్ ముస్తాబయిందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి  చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుందని  తెలిపారు. స్మార్ట్ స్ట్రీట్ లో 8.4 కోట్లతో 200 షాపులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే తొలివిడతలో 30 కంటైనర్లలో 120 షాపులు సిద్ధం చేశామని చెప్పారు.  మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ స్ట్రీట్ ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో తొలుతగా నెల్లూరు సిటీలో శుక్రవారం సీఎం చేతుల మీదుగా స్మార్ట్ స్ట్రీట్ బజార్‌లో 120 షాప్ లు ప్రారంభమవు తున్నాయన్నారు. ఒక్కో షాపుకి నాలుగు లక్షలు ఖర్చు అవుతుండగా... అందులో రెండులక్షల వ్యయాన్ని కార్పొరేషన్, మెప్మాలు బరిస్తాయని తెలిపారు. మిగిలిన రెండు లక్షల్లో కంటైనర్ కి లక్షన్నర రూపాయలు, పెట్టుబడి సాయం కింద మరో 50వేలు కేవలం రూపాయి వడ్డీకే లోన్ ఇప్పించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.  ఆ రెండు లక్షల్లో కూడా పి-4 పథకంలో భాగంగా 120మంది లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు నా సొంత నిధుల నుండి మొత్తం కోటీ 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కింద అందచేస్తున్నానని మంత్రి తెలియజేశారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ పై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయని, చేస్తున్నాయని తనదైన శైలిలో మంత్రి ఖండించారు. అన్నిటినీ తట్టుకుని స్మార్ట్ స్ట్రీట్ ను విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లామని చెప్పారు. దేశంలోనే ఈ స్మార్ట్ స్ట్రీట్ ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.  స్మార్ట్ స్ట్రీట్ లో టెక్నాలజీదే పెద్ద పాత్ర అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పోల్స్ కి సీసీ కెమెరాలున్నాయని, వైఫై సౌకర్యం ఉందన్నారు. ఏదైనా అనౌన్స్ మెంట్ చేయాలంటే దీనికే స్పీకర్స్ ఉన్నాయని తెలిపారు. లైటింగ్ పోల్స్ కూడా ఇవేనన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతీదీ టెక్నాలజీ అప్డేటెడ్ అని చెప్పేందుకు గర్విస్తున్నానని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపారంలో మెళుకువలు నేర్పేందుకు మెప్మా మహిళలకు శిక్షణ కూడా ఇచ్చారన్నారు. చెన్నై బర్మా బజారుకు తీసుకెళ్లి వ్యాపారాలపై అవగాహన కూడా కల్పించామని తెలిపారు..

కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్

  కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెలసరి సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలోని మహిళలందరికీ  ప్రతి నెలా ఒక రోజు, అంటే సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన పీరియడ్స్ లీవ్ పాలసీని ఆమోదించింది. . ఈ విధానం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని మహిళా ఉద్యోగులకు వర్తిస్తుందని రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు తెలిపింది. మహిళల  శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా  ఈ నిర్ణయం  తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని  సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా వెల్లడించారు.  ఈ నిర్ణయం మహిళా శ్రామికులకు పెద్ద ఉపశమనంగా మారుతుందని రాష్ట్ర న్యాయ మంత్రి హెచ్‌.కె. పాటిల్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో, తమ రాష్ట్రం కూడా దానిని స్వీకరించాలని నిర్ణయించుకున్నామని ఆయన కేబినెట్‌ సమావేశం అనంతరం వెల్లడించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అధికారిక రంగంలో అమలు సులభమైనా, అనధికారిక రంగంలో ఇది ఒక సవాలుగా నిలుస్తుందని, అయినప్పటికీ ఇది మహిళల ఆరోగ్య సాధికారతకు బలమైన పునాది వేస్తుందని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగే అభిప్రాయపడ్డారు. మహిళల అసలైన ఆరోగ్య అవసరాలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు ప్రశంసనీయమని ఆమె అన్నారు.  

టీచర్ కు ప్రేమ వల.. రూ. 2.3 కోట్ల టోకరా

ప్రేమ పేరుతో  అమాయక మహిళలు ఎలా మోసపోతారనడానికి తార్కానంగా నిలుస్తుందీ సంఘటన. మంచి మాటలు, సానుభూతి వ్యాఖ్యలకు మోసపోయి కొత్తవారిని గుడ్డిగా నమ్మకూడదనడానికి నిదర్శనంగా నిలుస్తుందీ ఉదంతం.  ఆన్‌లైన్ పరిచయాల్లో వ్యక్తిగత వివరాలను పంచుకునే సమయంలో జాగ్రత్త వహించాలని విషయాన్ని తెలియజేస్తుందీ ఘటన.. ఇంతకీ విషయమేంటంటే.. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల నుండి మనం తీసుకోవలసిన పాఠం ఏంటంటే, నమ్మకంతోపాటు జాగ్రత్త కూడా అవసరం. ఇలాంటి సంఘటనలకు గురి కాకుండా, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.ఒంటరి తనం భరించలేక తోడు కావాలని ఆశపడటమే ఆ టీచర్ చేసిన పాపం. లేటు వయసులో తోడు కోసం ఆరాటపడిన ఆ టీచరమ్మ మాట్రిమోనియల్ సైట్ లో తన వివరాలు నమోదు చేశారు. ఆమో వయస్సు 59 ఏళ్లు. భర్త మరణంతో ఒంటరిగా జీవించడం కష్టంగా ఉండటంతో ఆమె మాట్రిమోనియల్ సైట్ ను ఆశ్రయించారు. ఆ సైట్ లో ఆమె వివరాలు చూసిన అహాన్ కుమార్ అనే వ్యక్తి తాను అట్లాంటాలో ఇంజినీర్ గా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. తన ఐడీ కార్డు కూడా చూపి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలోకి దింపాడు.  అప్పటి నుంచి అంటే 2020 నుంచి 2024 వరకూ నాలుగేళ్ల పాటు వివిధ కారణాలు చెప్పి ఆ టీచరమ్మ నుంచి సొమ్ములు దండుకున్నాడు. నాలుగేళ్లలో ఆ టీచర్ నుంచి దాదాపు 2.3 కోట్లు రాబట్టిన అహాన్ కుమార్ ఆ తరువాత మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ టీచర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

స్థానిక ఎన్నికలకు బ్రేక్.. రిజర్వేషన్లపై హైకోర్టు స్టే

  స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్, జీవోలపై స్టే ఇస్తూ 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు విచారణకు మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ నాలుగు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.  

జగన్ కు నర్సీపట్నంలో నిరసనల సెగ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నం పర్యటన రసాబాసగా మారింది. ఆయన   పర్యటన సందర్భంగా నర్సీపట్నం వ్యాప్తంగా దివంగత డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు ఆయనకు స్వాగతం పలికాయి. కరోసా సమయంలో డాక్టర్లకు కనీసం మాస్కు కూడా ఇవ్వలేకపోయిందంటూ అప్పటి జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిన కారణంగా దళితుడైన  డాక్టర్ సుధాకర్ పై  అప్పటి జగన్ సర్కార్ అత్యంత అమానుషంగా వ్యవహరించింది. ఆయన విమర్శలను సాకుగా చూపుతూ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిది. అంతటితో ఆగకుండా సుధాకర్ ను విశాఖలోని పోర్టు ఆస్పత్రి జంక్షన్ వద్ద మండుటెండలో అర్థనగ్నంగా మోకాళ్లపై కూర్చోపెట్టి చేతులు, కాళ్లకు తాళ్లు కట్టి మరీ పోలీసు స్టేషన్ కు తరలించారు. అంతే కాకుండా ఆయనపై పిచ్చివాడన్న ముద్ర వేశారు. దీనిపై అప్పట్లో ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అనంతరం డాక్టర్ సుధాకర్ మరణించారు. వైసీపీ వేధింపుల కారణంగానే సుధాకర్ మరణించినట్లు ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశాయి.  ఇప్పుడు ఇన్నేళ్లకు జగన్ మెడికల్ కాలేజీ సందర్శన అంటూ నర్సీపట్నం పర్యటనకు వచ్చిన సందర్భంగా దళిత సంఘాలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించాయి. జగన్ గోబ్యాక్ అని నినదిస్తూ నర్నీపట్నంలో మానవహారంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాయి. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను అన్యాయంగా చంపేశారంటూ విమర్శలు గుప్పించాయి. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పి నర్సీపట్నంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశాయి.  ఓ వైపు నర్సీపట్నం వ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు, మరో వైపు దళిత సంఘాల నిరసనలతో వైసీపీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి. మరో వైపు నర్సీపట్నం వ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు వెలిసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  అప్పట్లో డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చోపెట్టిన దృశ్యాలను మరో సారి నెట్టింట పోస్టు చేస్తూ నెటిజనులు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు... 9 దుంగలు స్వాధీనం

  అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ ఒక స్మగ్లరును అరెస్టు చేసింది. టాస్క్ ఫోర్స్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు  కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్  ఆధ్వర్యంలో డీఎస్పీ  ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ వినోద్ కుమార్ టీమ్ బుధవారం అన్నమయ్య జిల్లా పుల్లంపేట నుంచి కూంబింగ్ చేపట్టింది.  అక్కడ ఏం.బావి పారెస్టు బీటు పరిధిలోని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఒక వ్యక్తి కనిపించాడు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేయగా, వెంబడించి పట్టుకున్నారు. అతనిని విచారించగా పొదల్లో దాచిన ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిలో ఉపయోగించినవి 6 ఉండగా, మూడు కొత్తవి ఉన్నాయి. అతనిని దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇతనిని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి గా గుర్తించారు. అతనిని డీఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ లు విచారించారు. సీ ఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ప్రారంభం

  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోపై హైకోర్టులో విచారణ పునఃప్రారంభమైంది. నిన్న జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ పిటిషనర్ల వాదనలు విని కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ క్రమంలో ఇవాళ జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టుకు మంత్రి వాకిటి శ్రీహరి  హాజరైరు.  బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిన్న వాదనలు సాగాయి.  ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.ఈ సందర్భంగా సీజే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకే ఉందని, ఈ విషయమై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే డిస్మిస్‌ చేసిందని అడ్వకేట్‌ జనరల్‌ గుర్తు చేశారు.ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌లు సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే.    

పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు.. తప్పేంటన్న హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధం, చట్టబద్ధంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలను పీపీపీ విధాంలో అభివృద్ధి చేసేందుకు గత నెల 9న ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వసుంధర దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన హైకోర్టు థర్మాసనం గురువారం విచారణ జరిపింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల టెండర్ల ఖారారుపై స్టే ఇవ్వడానికి  నిరాకరించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, రాజ్యాంగం లేదా చట్టాన్ని ఉల్లంఘించే నిర్ణయాల్లో తప్ప న్యాయస్థానం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. అయినా పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం కాకుండా  ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిధుల కొరత కారణంగా ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకొని ఉండవచ్చనీ, అది తప్పెలా అవుతుందని ప్రశ్నించింది.  గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకు 5వేల 800 కోట్ల రూపాయల అంచనాతో పాలనపరమైన అనుమతులు ఇచ్చారన్న పిటిషనర్ తరఫున్యాయవాది మాటలపై స్పందించిన ధర్మాసనం.. పాలనపరమైన అనుమతులిస్తే సరిపోతుందా? నిధులు విడుదల చేయాలి కదా అని నిలదీసింది. నిధుల కొరత కారణంగా పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండొచ్చని, అది తప్పెలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది.   నిధుల కొరత వల్ల జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలూ నిలిచిపోయాయని గుర్తు చేసింది. నిధులున్నప్పుడే కళాశాలలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సీఎస్,  వైద్యఆరోగ్య ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్యసేవలు, మౌలికాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ వైద్య విద్య, పరిశోధన సంస్థ ఎండీకి నోటీసులు జారీచేసింది. త దుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

విజయ్ నివాసానికి బాంబు బెదరింపు

ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం  అధినేత విజయ్ నివాసానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది.  ఇటీవల కరూర్‌లో విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట సంభవించి 41 మంది మరణించిన విషాద ఘటన తర్వాత ఈ బెదిరింపు రావడం ఆందోళన రేకెత్తించింది. విజయ్ భవిష్యత్తులో మరోసారి బహిరంగ సభలు పెడితే ఆయన ఇంటిని బాంబుతో పేల్చివేస్తామంటూ  ఓఆగంతుకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ కాల్  కన్యాకుమారి నుంచి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ బెదరింపు కాల్ తో అప్రమత్తమైన పోలీసులు చెన్నైలోని నీలాంగరైలోని విజయ్ నివాసం వద్ద బందోబస్తును పటిష్టం చేశారు. విజయ్ నివాసంలో అణువణువూ తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు.   ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడి గుర్తింపు కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా ఉండగావిజయ్ నివాసంలో బాంబు పెట్టామంటూ బెదరింపు కాల్ రావడం ఇదిరెండో సారి.  

బీసీసీఐ అంటే.. బీజేపీ కంట్రోల్డ్ క్రికెట్ ఇన్ ఇండియా అనాలా?

బీసీసీఐ అంటే మామూలుగా బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. కానీ ఇప్పుడు బీసీసీఐని బీజేపీ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా అని పిలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రాల క్రికెట్ సంఘాలన్నీ బీజేపీ అగ్రనేతలు, కీలక నేతల పుత్రరత్నాల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఒక సారి ఆ వివరాలేంటని పరిశీలిస్తే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పుత్రర‌త్నం జై షా ఐసీసీ చైర్మ‌న్ గా ఉన్నారు? ఇక డిల్లీ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ  కుమారుడు రోహ‌న్ జైట్లీ. అంతే కాదు.. మధ్య ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే ఆయన కూడా బీజేపీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కుమారరత్నం మహార్యమాన్ సింధియా. ఈ జాబితా ఇక్కడితో ఆగలేదు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే.. బీజేపీ నాయకుడు రాకేష్ తివారీ కుమారుడు  హర్షవర్ధన్  తివారీ. ఈయన అతి పిన్న వయస్సులోనే..అంటే 24 ఏళ్లకే బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారు. ఇది బీసీఏ చరిత్రలోనే ఓ రికార్డ్.  అలాగే  రాజ‌స్థాన్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు ధ‌నంజ‌య్ సింగ్   రాజ‌స్థాన్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసిన గ‌జేంద్ర సింగ్ త‌న‌యుడు. రాజ‌వంశీయుడు. ఈయ‌న కూడా బీజేపీ లీడ‌రే. గ‌త మూడు ప‌ర్యాయాలుగా బీజేపీ కేంద్రంతో పాటు ప‌లు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో.. క్రికెట్ లోనూ వంశ‌పారంప‌ర్య ఆధిప‌త్యం అమ‌ల‌వుతూ వ‌స్తోంది. అందుకే  బీసీసీఐని బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అని అన‌డం క‌న్నా బీజేపీ  కంట్రోల్డ్ క్రికెట్ అసోసియేష‌న్ గానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. అంత‌గా బీసీసీఐని బీజేపీ నేత‌లు, వారి కుమారులు ఆక్ర‌మించేశారంటున్నారు పరిశీలకులు

పిఠాపురంలో పవన్ పర్యటన నేడు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం (అక్టోబర్ 9)న తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  ఈ సందర్భంగా ఆయన భాగంగా ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొం టున్న సమస్యలను తెలుసుకుంటారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు చాలా కాలంగా సముద్ర కాలుష్యం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వారు పవన్ కల్యాణ్ దృష్టికి కూడా తీసుకువచ్చారు. దీంతో ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు  పవన్ కల్యాణ్, అధికారులతో కలిసి పడవలో సముద్రంలో ప్రయాణించి కాలుష్య ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.   తరువాత ఆయన ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్యంపై మత్స్య కారుల ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ  పర్యటనలో ఆయన  పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  

ఆరులేన్లుగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణ

ఉభయ తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకమైన  హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 విస్తరణ పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లేన్ల రహదారిగా విస్తరించేందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)  నవంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ ముగించి నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.  తెలంగాణలోని దండుమల్కాపూర్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మొత్తం 231.32 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరణ జరగనుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.10,391.53 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తంలో  నిర్మాణ పనులకు రూ.6,775.47 కోట్లు, భూసేకరణ తదితర అవసరాలకు రూ.3,616.06 కోట్లుగా చెబుతున్నారు.    ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పరిధిలో కొత్తగా 162 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనికి సుమారు రూ.1,414 కోట్లు అవసరమని అధికారులు అంచనావేశారు. భూసేకరణ, ఇతర అడ్డంకులపై చర్చించేందుకు   ఎన్‌హెచ్‌ఏఐ, రోడ్లు-భవనాల శాఖ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. డీపీఆర్‌ను ఖరారు చేసేందుకు వీలుగా రహదారి మార్గంలోని విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇతర నిర్మాణాల వివరాలను ఈ నెలాఖరు నాటికి  సేకరించి..  తుది డీపీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.