మార్క్ జుకెర్‌బర్గ్... ఆసక్తికర అంశాలు...

  ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ అంటే మన ఇండియన్లకి ఎంతో ఆసక్తి. ఈ మధ్య మన ప్రధాని జుకర్‌బర్గ్‌ని కలసినప్పటి నుంచి ఆ అభిమానం మరింత పెరిగిపోయింది. జుకెర్‌బర్గ్ మన ‘డిజిటల్ ఇండియా’కి మద్దతుగా తన ఫొటో మీద త్రివర్ణ పతాకాన్ని వచ్చేలా చేయడం అందరికీ బాగా నచ్చేసింది. ఇప్పుడు చాలామంది తమ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫొటోలో త్రివర్ణ పతాకం వచ్చేలా చేసుకునేంతగా జుకెర్‌బర్గ్ ఇన్‌స్పయిర్ చేశాడు. మన ఇండియన్లకు రోజురోజుకూ మరింత దగ్గరవుతున్న జుకెర్‌బర్గ్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పరిశీలిద్దాం.     1. ఫేస్‌బుక్ సీఇఓ హోదాలో మార్క్ జుకర్ బర్గ్ తీసుకుంటున్న నెల జీతం ఎంతో తెలిస్తే మీ కళ్ళు తిరుగుతాయి. ఆ జీతం ఎంత అంటే... కేవలం ఒక్క డాలర్.     2. జుకెర్‌బర్గ్ హార్వార్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో తన హాస్టల్ రూమ్‌మేట్స్‌తో, తన క్లాస్‌మేట్స్‌తో ఎంతో సన్నిహితంగా వుండేవాడు. వాళ్ళందరితో కలిసే ‘ఫేస్‌బుక్‌’ని స్థాపించాడు.   3. ఫేస్‌బుక్‌ను స్థాపించిన తర్వాత తన 23 ఏళ్ళ వయసులో, అంటే 2007లో జుకెర్‌బర్గ్ బిలియనీర్ అయ్యాడు.   4. కొన్ని ప్రదేశాలకు, సినిమా హాళ్ళకు, టీవీ షోలకు ముందుగా చెప్పకుండా సర్‌ప్రైజ్‌గా విజిట్ చేయడం జుకెర్‌బర్గ్‌కి వున్న ఒక సరదా.   5. ‘ఫేస్‌బుక్‌’కు జుకెర్‌బర్గ్ మొదట ‘ది ఫేస్‌బుక్’ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత దాన్ని ‘ఫేస్‌బుక్’గా మార్చాడు.   6. తాను స్వయానా ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు అయినప్పటికీ జుకెర్‌బర్గ్ గూగుల్ ప్లస్‌లో, ట్విట్లర్లో అకౌంట్లు కలిగి వున్నాడు.     7. ఆగస్టు 2013 సంవత్సరంలో జుకెర్‌బర్గ్ ఇంటర్నెట్.ఆర్గ్ ప్రాజెక్టును ప్రారంభించాడు. ఈ ప్రాజెక్టు ద్వారా అప్పటి వరకూ ఇంటర్నెట్ అంటేనే తెలియని ఐదు బిలియన్ల ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం సమకూరింది.   8. జుకెర్‌బర్గ్‌కి రెడ్ - గ్రీన్ కలర్ బ్లైండ్‌నెస్ వుంది. అతని నీలి రంగు బాగా కనిపిస్తుంది. అందుకే ఫేస్‌బుక్‌ అనే అక్షరాలకు నీలిరంగును ఎంపిక చేసుకున్నాడు.     9. జుకర్‌బర్గ్ గ్రే కలర్ టీ షర్ట్‌ను ధరించడాన్ని ఇష్టపడతాడు.     10. జుకర్‌బర్గ్ శాకాహారి. గతంలో మాంసాహారం తినేవాడు. కానీ ఇప్పుడు మానేశాడు

జీవితానికి ఆలస్యం ఉంటుందా?

  దేవుడు అన్నిరకాల మనుషులన్నీ సృష్టించీ సృష్టించీ అలసిపోయాడు. వాళ్ల బాధలు, కన్నీళ్లు, కష్టాలు చూసి చలించిపోయాడు. ‘ఇలా కాదు! నేను ఈసారి భూమి మీదే ఓ స్వర్గంలాంటి ప్రదేశాన్ని సృష్టిస్తాను. దాని చుట్టూ కేవలం కొండలను మాత్రమే అడ్డుగా ఉంచుతాను. ఆ కొండలని దాటి ఎవరైతే ఇవతలికి వస్తారో, వాళ్లు ఓ అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తారు’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అందమైన పూలు, ఆకాశాన్నంటే చెట్లూ, ముద్దొచ్చే జంతువులు, మనసు దోచుకునే సెలయేళ్లు…ఇలా ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు. దానికి అడ్డుగా కేవలం కొన్ని కొండలను మాత్రమే ఉంచాడు. ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఎవ్వరూ ఆ కొండలను దాటి ఆ స్వర్గంలోకి అడుగుపెట్టలేదు. ఇంతాచేసి ఆ కొండల పక్కన ఉన్న మైదానంలోనే ఓ పల్లెటూరు ఉంది. ‘లాభం లేదు! ఓసారి నేనే వెళ్లి విషయాన్ని కనుక్కుంటాను’ అనుకున్నాడు భగవంతుడు. అనుకున్నదే తడవుగా ఓ యాత్రికుని రూపంలో ఆ పల్లెటూరికి చేరుకున్నాడు. నలుగురూ చేరి ఉన్న రచ్చబండ దగ్గరకి వెళ్లి… ‘అరే! మీరు ఎప్పుడూ ఆ కొండలను దాటి అవతలికి వెళ్లలేదా. పదండి మీకు ఆ అందమైన స్వర్గాన్ని చూపిస్తాను’ అని ప్రోత్సహించాడు. ‘అబ్బే లాభం లేదు. ఇప్పటికే కాలం గడిచిపోయింది. మేం ముసలివాళ్లం అయిపోయాం. ఇప్పుడు అక్కడికి పోయి ఏంటి ఉపయోగం!’ అని పెదవి విరిచారు ఊరి జనం. ‘సరే అవతలికి వెళ్లేందుకు ఆసక్తి లేకపోతే ఓ పని చేద్దాం. కొండల పైకి ఎక్కుదాం. కనీసం అవతలి వైపు ఉన్న స్వర్గాన్ని చూసైనా సంతోషించవచ్చు కదా!’ అని బయల్దేరదీశాడు యాత్రికుడు. ‘అబ్బే ఇప్పటికే కాలం గడిచిపోయింది. ఆ కొండలని ఎక్కే ఓపిక మాలో మిగల్లేదు’ అని ఉసూరుమన్నారు పెద్దలు. ‘అయితే సరే! కనీసం ఆ కొండల వంక చూస్తూ ఉండండి. మీకు అవతలి వైపు ఉన్న స్వర్గం ఎలా ఉంటుందో నేను వర్ణిస్తే విని సంతోషిద్దురుగాని’ అని ఊరించాడు యాత్రికుడు. ‘వద్దు వద్దు! ఇప్పటికే కాలం గడిచిపోయింది. నువ్వేం చెప్పినా అర్థం చేసుకునే తెలివి మాలో మిగల్లేదు’ అనేశారు ఊరి జనం. ఇక యాత్రికుని రూపంలో ఉన్న భగవంతునికి ఏం చేయాలో అర్థం కాలేదు ‘సరే ఆ స్వర్గం సంగతి వదిలేయండి. ఇక్కడి వాతావరణం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో! హాయిగా పాటలు పాడుకుంటూ కాసేపు కాలాన్ని గడుపుదాము’ అన్నాడు. ‘అబ్బే సూర్యుడు అస్తమిస్తున్నాడు. కాలం గడిచిపోయింది. మేం పోయి పడుకోవాలి’ అంటూ తమ ఇళ్ల వైపుకి బయల్దేరారు పెద్దలు. ‘జీవితంలోని ప్రతి రోజూ ఓ కొత్త అవకాశమేనని వీళ్లకి ఎప్పుడు అర్థమవుతుందో. గడిచిపోయిన కాలం గురించి తల్చుకుంటూ, ముందున్న జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు ఈ పిచ్చివాళ్లు. కొత్త లక్ష్యాన్ని చేరుకోవడానికైనా, చూడటానికైనా, దాని గురించి ఆలోచించడానికైనా వీళ్లకి ధైర్యం లేదు కదా! కనీసం చేతిలో ఉన్న క్షణాలని అనుభవించే తెలివీ లేదు!’ అంటూ నిరాశగా వెనుతిరిగాడు భగవంతుడు.

మారాల్సింది మన ఆలోచనే....

ఏదైనా మన మంచికే జరిగింది అనుకోవాలి అంటుంటారు మన పెద్దవాళ్ళు. అందుకోసం ఓ ఉదాహరణ కూడా చెబుతుంటారు. తేలు కుడితే పాము కుట్టలేదని సంతోషించమంటారు. పాము కరిస్తే ప్రాణం పోలేదని సంతోషించమంటారు. వినటానికి బాగానే వున్నా, నిజంగా ఆ సూత్రాన్ని జీవితంలో అన్వయించుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనసు మాట వినదు. దాంతో నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని మథన పడిపోతుంటాం. ఒకసారి మా అన్నయ్య ఇలానే పరిస్థితులు బాలేవు. అన్నీ నాకెదురు తిరుగుతున్నాయి. బాడ్ టైం అనగానే  మా పెద్దనాన్నగారు తప్పు. నీ ఆలోచనా విధానం మార్చుకుని ఆ పరిస్థితులని చూడు. అప్పుడు నువ్వా మాట అనవు అంటూ ఓ కథ చెప్పారు. ఇప్పటికీ పరిస్థితులు బాలేవు అనిపించగానే మా అందరికి ఆ కథే గుర్తుకొస్తుంది. ఈ రోజు మనం ఆ కథనే చెప్పుకోబోతున్నాం.  కథ అనగానే అనగనగా అని మొదలు పెట్టాలి కదా! అనగనగా ఓసారి ఓ గురువుగారు, శిష్యుడు దేశసంచారం చేస్తూ చేస్తూ చివరికి ఓ రోజున వారి స్వంత ఊరికి చేరారు. వారి ఆశ్రమం చేరగానే అమ్మయ్య అనుకున్నారు. ఎంతో ప్రయాణం తర్వాత ఆశ్రమానికి వచ్చారేమో హాయిగా విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు. తినటానికి ఏమన్నా దొరుకుతాయేమోనని చూస్తే రాత్రి అవటం మూలాన ఏమీ దొరకలేదు. దాంతో ఖాళీ కడుపుతో పడుకోవలసి వస్తుంది. అప్పుడు గురువుగారు "ప్రభూ నీ దయ అపూర్వం" అంటారు. శిష్యుడు అశ్చర్యంగా గురువుగారి వైపు చూస్తాడు. ఇదేంటి తినటానికి ఏమీ దొరక్కపోయినా "నీ దయ అపూర్వం" అని దేవుణ్ణి పొగుడుతున్నాడు ఈయన అని. కానీ బయటకి ఏమీ అనడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే? చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాకా కనీసం తినటానికి ఓ పండో, ఫలమో కూడా దొరకపోయినా బాగా అలసిపోయారేమో నిద్రపోవటానికి సిద్ధపడ్డారు గురుశిష్యులిద్దరూ. ఇంతలో ఓ పెద్ద గాలిదుమారం మొదలయ్యింది. వారి పాక పైకప్పు కాస్తా ఎగిరిపోయింది. అది చూసిన గురువు గారు "ప్రభూ నీ దయ అపూర్వం" అంటాడు. ఇంతలో జోరున వాన కూడా మొదలవుతుంది. పైకప్పు లేదేమో ఇద్దరూ బాగా తడిసిపోతారు. అప్పుడు మళ్ళీ గురువుగారు "ప్రభూ నీ దయ అపూర్వం" అంటారు. అది చూసిన శిష్యుడికి బాగా కోపం వచ్చేస్తుంది. ఓ పక్క తినటానికి తిండి లేదు, విశ్రాంతిగా పడుకుందామంటే గాలి దుమారం, జోరున వాన. అయినా గురువుగారు "ప్రభూ నీ దయ అపూర్వం"అంటుంటే శిష్యుడికి చాలా కోపం వచ్చేస్తుంది. మనల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే దేవుడి దయ అపూర్వం అంటారేంటి అని ప్రశ్నిస్తాడు గురువుగారిని. అప్పుడు గురువుగారు ఇలా చెబుతారు. మనం మన ప్రయాణంలో ఏవేవో తిన్నాం. ఈ పూటకి ఖాళీ కడుపుతో ఉపవాసం వుంటే మన ఆరోగ్యానికి మంచిదని భావించే ఆ పరమాత్మ మనకి తినటానికి ఏమీ దొరకకుండా చేశాడు. అలసిపోయిన మన శరీరాలు సేదతీరాలనే గాలి మనకి తగిలేలా గుడిసె పైకప్పుని తొలగించాడు. మట్టికొట్టుకుపోయిన మన శరీరాలకి చక్కటి  స్నానం అందించాలని ఇంతటి వర్షాన్ని ఇచ్చాడు. మన పై ఇంత దయ చూపిస్తుంటే ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా ఎలా వుంటాం అంటారు గురువుగారు. అలా అంటూ ఆ వానలో ఆనందంతో గెంతుతూ నాట్యం చేస్తుంటాడు.  ఈ రోజు మనం చెప్పుకున్న కథలో ఒకే పరిస్థితికి ఇద్దరి వ్యక్తుల ప్రతిస్పందన ఎలా వుందో చూశాం. ఒకరు ఆనందంగా వున్నారు. మరొకరు భాధపడ్డారు. ఒకటే పరిస్థితులు ఒకరికి అనందాన్ని, మరొకరికి దుఖాన్ని ఎలా అందించాయి? "దృకృథం"లోని తేడాయే వారి వారి ఆనందానికి, బాధకి కారణం ఎదురయ్యే పరిస్థితులని మనం ఏ విధంగా చూస్తామన్న చిన్న విషయం పై ఆధారపడే అవి మనకి ఆనందాన్ని కానీ, దుఖాన్ని కానీ అందిస్తాయని తెలుసుకుంటే, మారాల్సింది పరిస్థితులు కాదు మన ఆలోచన అని అర్థమవుతుంది మనకి...ఏమంటారు? -రమ ఇరగవరపు

మనమూ రీఛార్జ్ అవ్వాల్సిందే

  మనకి ఎంతో అత్యవసరమైన సెల్‌ఫెన్, ఛార్జింగ్ లైట్ వంటి వాటికి ఒక్కరోజు ఛార్జింగ్ పెట్టడం మానేయ్యండి. వెంటనే అవి ఇక ఏమాత్రం మేం పనిచేయమంటూ మొరాయిస్తాయి. కాబట్టే మనం ఎంతో జాగ్రత్తగా, గుర్తుపెట్టుకుని మరీ వాటిని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తుంటాం. వస్తువులకే రీఛార్జ్ అంత ముఖ్యమైనప్పుడు మరి మనుషులం మనకు రీఛార్జ్ అక్కర్లేదా? చెప్పండి? తప్పకుండా కావాలి. కానీ, మనమో... మనసుకు, శరీరానికి రీఛార్జ్ కావాలన్న విషయాన్ని కూడా గుర్తించకుండా మనలో ఎనర్జీ దొరికినంతవరకు వాడేసుకుంటుంటాం. ఫలితం.. తెలియని నిర్లిప్తత, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, తెలియని అనారోగ్యంతో సతమతమవటం. ఆ ఇబ్బందులు ఏవీ వద్దు అనుకుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటుండాలి. అందుకు నిపుణులు చేస్తున్న కొన్ని సూచనలు చూద్దాం.   రీఛార్జ్‌తో రెట్టింపు ఉత్సాహం చాలాసార్లు మనం ఇంటిపనయినా లేదా ఆఫీసు పనయినా ఏదైనా కానివ్వండి. ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కొన్ని పనులు అనుకుని, అవి పూర్తయ్యేదాకా ఏమాత్రం విశ్రాంతి తీసుకోం. దాని వలన నిజానికి మన పనిచేసే నైపుణ్యం, సామర్థ్యం వంటివి తగ్గుతాయిట. అదే ఒక పనికి, మరోపనికి మధ్య కొద్దిపాటి విశ్రాంతి తీసుకున్నా చాలు.. మనసు, మెదడు, శరీరం అన్నీ ‘రీఛార్జ్’ అయ్యి, రెట్టించిన ఉత్సాహంతో తరువాత పనని చేపడతాంట.   సంపూర్ణ నైపుణ్యం సాధించడానికి... జీవితంలో వరుసగా టార్గెట్స్ నిర్ణయించుకుని, ఒకదాని తరువాత మరోటి సాధించుకుంటూ వెళ్ళాలన్న సంకల్పం మంచిదే కానీ, ఆ ధ్యాసలో పడి ‘ఆనందానికి’ దూరం కాకూడదు. మన మనసులోని ఒత్తిడిని ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ మనసుని తిరిగి రీఛార్జ్ చేసుకుంటూ వుంటే కొత్త శక్తిని కూడగట్టుకున్నవాళ్ళం అవుతాం. ఒత్తిడి లేనప్పుడు తప్పకుండా మన సంపూర్ణ నైపుణ్యం బయటపడుతుంది. ఎప్పుడైతే మనం మన సర్వశక్తులు పెట్టి ఒక పని చేస్తామో అప్పుడాపని తప్పకుండా మంచి ఫలితాలని అందిస్తుంది.   చిన్న చిన్న పనులతో రీఛార్జ్   పిల్లలతో హాలిడేస్‌కి బయటకి వెళ్ళటం, ఆదివారాలు అన్ని పనులకూ టాటా చెప్పేసి విశ్రాంతిగా గడపటం, తెలిసినవారు - బంధువులు పిలిస్తే ఆ ఫంక్షన్లకి తప్పకుండా హాజరు కావటం వంటివి నిజానికి మంచి రీఛార్జ్‌ని అందించే అవకాశాలు. కానీ మనం మన రొటీన్‌కి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని వీటన్నిటి నుంచి తప్పించుకుంటుంటాం. అయితే కాస్త సమన్వయపరుచుకోవడం తెలిస్తే అవేం పెద్ద విషయాలు కాదు. రీఛార్జ్ ప్రణాళిక అవసరం రీఛార్జ్ అవటం కూడా మన రొటీన్ పనులలాగా ఎంతో ముఖ్యమైనదని గ్రహించాలి. దానికి తగ్గ సమయాన్ని మన షెడ్యూలులో చేర్చాలి. తప్పనిసరిగా గంటకో ఐదు నిమిషాలు, రోజుకో గంట, వారానికోపూట, నెలకోరోజు, సంవత్సరానికోవారం... ఇలా ఎప్పటికప్పుడు ఓ షెడ్యూల్‌ని ఏర్పరచుకోవాలి. హాయిగా గడపటానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అది ఒక అలవాటుగా మారిపోవాలి. అప్పుడు మనసు, మెదడు, శరీరం అన్నీ ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతూ మనల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతాయి. కొత్త ఉత్తేజాన్ని, శక్తిని కూడగట్టుకుని లక్ష్యాలని సాధించడానికి సిద్ధమవుతాయి. బ్యాటరీ ఖాళీ అయ్యేవరకూ ఊరుకుంటూ సడన్‌గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది సెల్ ఫోన్. అలాగే మనం పూర్తిగా ఖాళీ అయ్యేవరకు రీఛార్జ్ కాకపోతే లక్ష్యాలని సాధించడంలో, మన దైనందిన జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడంలో వెనకబడిపోతాం. అందుకే రీఛార్జ్ తప్పనిసరి... ఏమంటారు? -రమ

అర్థం చేసుకోరూ....

    పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ ఆ పంట, ఫలాలు అందించకుండానే ఎండిపోతోంది. ఈమధ్యకాలంలో వైవాహిక బంధంలో ఆనందం కంటే బాధే ఎక్కువ ఉంటోందని  యువతీ యువకులు గట్టిగా నమ్ముతున్నారని ఓ సర్వేలో తేలింది. అందుకు కారణం ఏంటి అని ప్రశ్నిస్తే... ‘అర్థం చేసుకోరు’అన్న సమాధానం వచ్చిందిట రెండు వైపుల నుంచి. ఎవరు ఎవరిని మొదట అర్థం చేసుకోవాలి, ఎవరు ఎవరి మాట వినాలి... ఇలా ఎన్నో ప్రశ్నలు వివాహ బంధాన్ని శాసిస్తున్నాయని తేలింది. సర్దుకుపోవటం అంటే ఓడిపోవటంగా తీసుకుంటున్నారు . దాంతో ఆ పదమే భార్య భర్తల సంబంధంలో వినిపించటం లేదుట.  సమస్య గురించి మాట్లాడాలంటే చాలా వుంది. ఒకో జంటది ఒకో కథ. ఎవరి వాదన వారికుంది. తప్పు ఒప్పులు బయట వారు నిర్ణయించలేరు కాబట్టి.., నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. సమస్య సృష్టించుకోవటం ఎందుకు?  ఆ తర్వాత దాని పరిష్కారానికి ప్రయత్నించటం ఎందుకు?  ఇద్దరు ఒకటిగా మారేందుకు సిద్ధపడినప్పుడే ఆ బంధం కోసం, దానితో ముడిపడే వారి జీవితం కోసం ఒకసారి ఆలోచిస్తే మంచిది అని సూచిస్తున్నారు.  మనకి చాలా ముఖ్యం అనిపించినా దేనిని అయినా కాపాడుకోవటానికి చాలా ప్రయత్నిస్తాం కదా. అంటే మనం ముఖ్యం అనుకున్నామా లేదా అన్నదే ఇక్కడ మన ఆలోచనలని రూల్ చేస్తోంది. అందుకే బంధం కలకాలం నిలవాలంటే ఆ బంధం జీవితంలో ముఖ్యమైనది అని మొదట నమ్మాలి.  సమవుజ్జీల మధ్య గెలుపోటములు వుండవంటారు. అలాగే ఇద్దరు వ్యక్తులు కలసి ఒకటిగా నడిచే జీవితంలో కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. గెలిచినా, ఓడినా అది ఇద్దరిదీ. ఈ విషయం ఒక్కటి అర్థం అయితే పట్టుదలలు వుండవు, ఆరోపణలు వుండవు. నా మాటే నెగ్గాలనే తాపత్రయాలు వుండవు. పక్క మనిషి ఓటమిలోంచి వచ్చే కన్నీటిని చూస్తూ నాదే విజయం అని ఆనందించటానికి ఇది ఆట కాదు, జీవితం. మనిషిని గెలిచి, మనసుని ఓడిపోవటం ఎంత తెలివి తక్కువ చెప్పండి. మనసులని గాయపరుచుకుంటూ, ఇద్దరు మనుషులు నూరేళ్ళు ఒక గూటిలో కలసి వుండటం అంటే అది ఇద్దరూ, ఇద్దరికీ కోరి వేసుకుంటున్న శిక్ష. ఇక్కడ శిక్ష వేసిన వ్యక్తీ కూడా శిక్ష అనుభవిస్తారు, అదే విచిత్రం. అందుకే నూరేళ్ళ పంట... పచ్చగా పదికాలాలు నిలబడాలంటే  ఆ బంధం కోసం కొంచెం ఆలోచించాలి, మరికొంచం తెలుసుకోవాలి. ఇంకొంచం శ్రద్ద పెట్టాలి.  అసలు ఆడ, మగ ఆలోచనా విధానంలోనే వుంది అసలు చిక్కంతా. అది తెలుసుకుంటే చాలు అన్ని చిక్కుముళ్ళు ఇట్టే విప్పేయచ్చు అంటున్నారు నిపుణులు. ఏంటి ఆ చిక్కులు, వాటిని విప్పే చిట్కాలు? చెప్పుకుందాం, వచ్చేవారం ఇక్కడే కలుసుకుందాం.. అప్పటిదాకా మీ జీవితంలో పెళ్ళి ఎంత ముఖ్యమైనదో ఆలోచించండి... ఆ కారణాలని ఓ పేపర్ మీద రాసి పెట్టండి. ఇప్పటికి ఇదే హోంవర్క్... మళ్ళీ కలుసుకునే దాకా... -రమ

మతిమరుపు పోవాలంటే?

    మతి మరపుని ఓడించాలంటే చక్కగా సరిపడినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి అంటున్నారు మతిమరపు పై అధ్యయనం చేస్తున్నవారు. నిద్రపోయే సమయం తగ్గిన కొద్దీ మన జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుందట. అలాగే రోజు తప్పనిసరిగా ఓ ముప్పై నిముషాల పాటు ఏదైనా ఎక్స్ సైజ్ చేయాలట దీని వలన ఆక్సిజన్ సక్రమంగా అందటంతో పాటుమెదడు ఏక్టివ్ గా ఉంటుంది అంటున్నారు వీరు. ఇలా రోజుకి ఓ ముప్పై నిముషాల పాటు ఫిజికల్ ఏక్టివిటీ చేస్తే అల్జీమర్స్ వంటివి వచ్చే రిస్క్ సగానికి సగం తగ్గిపోతుందట. అలాగే వయసుతో పాటు తగ్గే జ్ఞాపక శక్తి కూడా ఇబ్బంది పెట్టదు అని గట్టిగ చెబుతున్నారు. అలాగే మన బ్రెయిన్ కి ఛాలెంజింగ్ పని అప్పజెప్పడం, అలాగే ఒత్తిడి తగ్గించికోవటం వంటివి కూడా అవసరం అని తేల్చి చెప్పారు వీరు. .......రమ

నిబద్ధత వుంటే.. విజయం నీ వెంటే...

కథ అనగానే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా ! అలాగే ఆ కథ కొద్దో గొప్పో మనకి జీవిత పాఠాన్ని నేర్పించేది అయితే మనం ఎప్పటికీ మరచిపోలేము. అలా నాకు ఎంతో బాగా గుర్తుండిపోయిన ఒక కథని ఈరోజు మీకు చెప్పబోతున్నా.  నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో నా స్నేహితురాలు ఈ కథని చెప్పింది... మన బాధ్యత విషయంలో మన నిబద్ధత ఎలా ఉండాలి అని.  ఇంతకీ కథ ఏంటంటే... ఒక ఊరిలో ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్ ఆఫీసు ఉంటుంది. అందులో ఉద్యోగానికి ఏమాత్రం అనుభవం లేని ఒక కుర్రాడు వెడతాడు. నీకు ఏ పని వచ్చు అంటే ఏమీ రాదు... కానీ నేర్చుకుంటాను అంటాడు. అప్పుడు ఆ యజమాని నేర్చుకోవాలనే తపన, చేసే పనిమీద నిబద్ధత ఉంటే నీవు తప్పకుండా గొప్పవాడివి అవుతావు.  చేసే ప్రతీ పని మీద నీవు 100% శ్రద్ధ పెట్టు అని చెప్పి, ఆ కుర్రాడికి  ఉద్యోగం ఇస్తాడు. కొన్ని రోజులకి  వడ్రంగం పనిలో  మంచి ప్రావీణ్యం సంపాదిస్తాడు ఆ కుర్రాడు .  ఇలా క్రమక్రమంగా ఆ కుర్రాడి నైపుణ్యాలు పెరగటం, దానితో ఆ ఆఫీసులో అతని హోదా పెరగటం జరిగింది.  అతను ప్రతీపనిని 100% శ్రద్ధ పెట్టి చేసేవాడు కాబట్టి  అతను చేసే ప్రతీపనీ ఎంతో గొప్పగా ఉండేది. నెమ్మది నెమ్మదిగా భవనాలు నిర్మించడంలో, అన్ని పనుల్లో అవగాహన పెంచుకుంటాడు. ఆఫీసులో అతని హోదా, అవసరం, గౌరవం అన్నీ రోజురోజుకూ పెరుగుతాయి. అతను కూడా తాను చేసే ప్రతీపనిని ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో చేయటంతో ఎంతో తృప్తిని పొందుతూ ఉంటాడు. తాను కట్టే ప్రతీ ఇల్లు ఒక అద్భుత కళాఖండంగా నిలవాలని తపించిపోతాడు. ఈవిధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. యజమాని వయసు మీద పడటంతో వ్యాపారాన్ని కొడుకుకి అప్పగిస్తాడు. కొడుకుకి ఈ వ్యాపారం కొత్త అవ్వటం వలన ఎప్పటి నుంచో ఇక్కడ పని చేస్తున్నఆ కార్పెంటర్  అతనికి తోడుగా నిలుస్తాడు. ఇతని ఆధ్వర్యంలో యజమాని కొడుకు త్వరలోనే అన్ని మెళకువలు నేర్చుకుంటాడు  అందువల్ల ఆ కుర్రాడు  అంటే కొడుకుకి ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది. ఈవిధంగా ఉండగా కొన్ని సంవత్సరాలకి ఆ కార్పెంటర్  వయసు పెరగటంతో  పనిచేయటం కష్టంగా మారుతుంది. దానితో ఉద్యగం మానేయ్యాలి అనుకుంటాడు. ఈ విషయాన్ని యజమానికి, అతని కొడుకుకి తెలియచేస్తాడు.  విషయం విన్న అతని యజమాని కొడుకు "తప్పకుండా నువ్వు రెస్ట్ తీసుకోవలసిన  వయసే... కానీ ఒక్క ప్రాజెక్ట్ ఉంది, ఒక ఇల్లు అద్భుతంగా కట్టాలి. ఇంతవరకు నువ్వు కట్టిన ఇళ్ళకంటే అద్భుతమైనది అయి ఉండాలి. ఈ ఒక్క ప్రాజెక్ట్ పూర్తిచేసి రిటైర్ అవ్వు"  అని అంటాడు. సరే అని అంగీకరించి, ఆ కార్పెంటర్  తన చివరి ప్రాజెక్ట్ పని మొదలుపెడతాడు.  ఐతే అతనికి  ఈ ప్రాజెక్ట్ మీద పెద్దగా శ్రద్ధ లేదు. ఏదో త్వరగా పూర్తిచేస్తే ఇక రిటైర్ అవ్వవచ్చును అనే ఆలోచనతో మొదటిసారిగా ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఇల్లు కట్టిస్తాడు. నాసిరకం వస్తువులు, సరిగా లేని డిజైన్లతో కట్టిస్తాడు. ఆ భవనం కట్టడంలో అతని అశ్రద్ధ అడుగడుగునా కనబడుతుంది. ఇల్లు పూర్తవుతుంది. ఇక బాధ్యతలనుండి తప్పుకోవచ్చును అని భావించి పూర్తి అయిన ఇంటి యొక్క తాళాలు యజమానికి ఇస్తాడు. అప్పుడు ఆ  యజమాని ఆ తాళాలను తిరిగి ఆ కార్పెంటర్  చేతిలో పెట్టి "ఇన్ని సంవత్సరాలు నువ్వు శ్రద్ధగా పనిచేసినందుకు ఇది నేను నీకు ఇచ్చే బహుమానం స్వీకరించు. నీ ఇల్లు నీకు నచ్చినట్టు కట్టుకోవాలనే ఈ ప్రాజెక్ట్ చెయ్యమని చెప్పాను" అని అంటాడు.  ఇది విని కార్పెంటర్ నివ్వెరపోతాడు అతను  తన ఇన్ని సంవత్సరాల సర్వీసులో ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా చేసిన మొదట పని ఈ ఇల్లు కట్టించడం. అంటే తనకు బహుమతిగా వచ్చిన  ఈ ఇల్లు జీవితాంతం తన అశ్రద్ధకి గుర్తుగా  తన  కళ్ళెదుట నిలుస్తుంది. బాధగా అనిపిస్తుంది అతనికి. నిబద్ధత  అంటే ఎప్పుడూ, ఎలాంటి పరిస్థితులలోనూ రాజీ పడకుండా వుండటం అని తెలుసుకుంటాడు.   -రమ

బరువేక్కించే రాత్రి షిఫ్టులు

      ఈ మధ్య కాలంలో రాత్రి షిఫ్టుల్లో పని చేసే వారి సంఖ్య చాలా పెరిగింది అలా రాత్రి షిఫ్టుల్లో పని చేసే వారిలో చాలా మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు నిపుణులు. అయితే ఆ ఆరోగ్య సమస్యలన్నీటికి మూలం వారు బరువెక్కటమే అని కూడా తేలిందట.   దానికి కారణం రాత్రి పూట అధికంగా ఆహారం తీసుకోవడం, పగలంతా నిద్రపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం ఇవన్ని వారి శరీర బరువుపై ప్రభావాన్ని చూపిస్తున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి రాత్రి షిఫ్టులు చేసే వారు నిద్రాహారాల విషయంలో ఓ పద్దతిని పాటించడం చాలా అవసరమని సూచిస్తున్నారు పరిశోధకులు..

మీరూ అదృష్టవంతులు కావచ్చు...

  కొందరికి ఏ పని చేసినా కలిసొస్తుంది. ముట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ముళ్ళదారిలో నడిచినా పూలబాట దాటినంత సాఫీగా ప్రయాణం సాగిపోతుంది. మరికొందరికి అనుకున్నదేదీ జరగదు. ఏ పని చేసినా కష్టం, నష్టం తప్ప లాభం, సుఖం అన్నవి వాళ్ళకి తెలీదు. ఇందులో మొదటిరకం వాళ్ళని అదృష్టవంతులనీ, రెండోరకం వాళ్ళని దురదృష్టవంతులనీ అనేస్తాం.  వాళ్ళ తలరాత అంతే అని కూడా అంటాం. అయితే నిజంగా అదృష్టం, దురదృష్టం అనేవి కొంతమంది దగ్గరే ‘ఫిక్స్‌డ్‌గా వుంటాయా అంటే కానేకాదు అంటున్నారు రిచర్డ్ వైజ్‌మెన్. అదృష్టం, దురదృష్టం అనేవి ఆయా వ్యక్తుల గుణగణాలపైనే ఆధారపడి వుంటాయని అంటున్నారు అయన.   అవేమీ అదృశ్య శక్తులు కావు అదృష్టం అనేది కొందరినే ఎందుకు వరిస్తుంది? అందరూ అదృష్టవంతులు ఎందుకు కాలేకపోతున్నారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలని అనుకున్నారు హెర్డ్ ఫోర్డ్ షైర్ విశ్వవిద్యాలయంలో సైకాలజిస్ట్‌గా పనిచేసే రిచర్డ్ వైజ్‌మెన్. తన పరిశోధన కోసం లండన్‌లోని అతి అదృష్టవంతులు, అతి దురదృష్టవంతుల్ని రమ్మని పత్రికల్లో ప్రకటనలిచ్చారు. అలా ఆ ప్రకటనలకి స్పందించి సుమారు 400 మందికి పైగా అదృష్టవంతులు, దురదృష్టవంతులుగా తమని తాము భావించే వారు రిచర్డ్‌ని కలిశారు. వారిని ఇంటర్వ్యూలు చేసి, వారిపై కొన్ని ప్రయోగాలు చేసి అదృష్టం, దురదృష్టాలు వ్యక్తుల గుణగణాలపై ఆధారపడతాయని కానీ, అవేం అదృశ్య శక్తులు కావని తేల్చారు రిచర్డ్. ఆసక్తికర ప్రయోగాలు రిచర్డ్ వైజ్‌మెన్ చేసిన కొన్ని ప్రయోగాలు ఎంతో ఆసక్తికరంగా సాగాయి. అందులో ఒకటి... ఒకరోజు రిచర్డ్ ఒకొక్కరికీ ఒక పత్రికని ఇచ్చి అందులో ఎన్ని  ఫొటోలు వున్నాయో చెప్పమన్నాడంట. అదృష్టవంతులు కొన్ని సెకన్లలో సమాధానం చెప్పేశారు. దురదృష్టవంతులు మాత్రం రెండు, మూడు నిమిషాల సమయం తీసుకున్నారట. ‘‘ఈ పత్రిక మొత్తంలో 43 ఫొటోలు ఉన్నాయి. ఇక లెక్కపెట్టడం ఆపేయండి’’ అని రెండో పేజీలో పెద్దపెద్ద అక్షరాలతో రాసుండటం దురదృష్టవంతులు గమనించక పోవడమే దీనికి కారణం. ఫొటోలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టాలన్న టెన్షన్‌లో వాళ్ళు మిగిలినదేదీ గమనించలేదు. అలాగే కొందరు దురదృష్టవంతులు దానిని చూసి కూడా నిజమని నమ్మలేకపోయారుట. వాళ్ళే అదృష్టవంతులు.. ఆ ప్రయోగంలో అదృష్టవంతులుగా భావించే వారు ఏ కంగారూ లేకుండా చూడ్డం వల్ల రెండో పేజీలో వున్నదాన్ని చూడగలిగారు.  దీనిని విశ్లేషిస్తూ రిచర్డ్ ఇలా అంటున్నారు... ‘‘అదృష్టవంతులకు ఉన్న వ్యక్తిత్వం, ఆలోచనా ధోరణి, సమయస్ఫూర్తి, సానుకూల దృక్పథం, చురుకుగా స్పందించే గుణాల వల్లే వారు అన్నిటిలోనూ విజయాలు సాధించి అదృష్టవంతులుగా పిలువబడుతున్నారు. అదే దురదృష్టవంతుల విషయానికి వస్తే, వారిలో చొరవ లేకపోవటం, వచ్చిన అవకాశం వదులుకోవడం, ప్రతీ విషయాన్ని తమకి ప్రతికూలంగా భావిస్తూ వుంటారు’’ అన్నారు.   కాబట్టి ‘‘నాకు అదృష్టం లేదు’’ అనే మాటలు వదిలి, అదృష్టం వరించాలంటే ఉండాల్సిన లక్షణాలను పెంపొందించుకోండి అంటున్నారు రిచర్డ్ వైజ్‌మెన్. మరి మీరు అదృష్టవంతులేనా? -రమ

సమయాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి

  శ్రీవారు మాట వినడం లేదన్నా, అత్తగారు చిరుకోపంతో చూస్తున్నా, పిల్లలు అల్లరి చేస్తున్నా... వీటన్నిటికీ ఒకటే పరిష్కారం... ‘కలసి గడపటమే’. అదేంటీ... ఇప్పుడు మేం కలసి గడపటం లేదా అని మీకు అనిపిస్తోంది కదూ...  అసలు విషయం ఏంటంటే, కుటుంబ సభ్యుల మధ్య పెరిగిపోతున్న దూరమే ఎన్నో మానసిక, శారీరక అనారోగ్యాలకి కారణం అంటున్నారు పరిశోధకులు. టీనేజ్ పిల్లల కోపతాపాలు, వారి నడవడిక, ప్రవర్తన ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల మధ్య వుండే అనుబంధంపై ఆధారపడి వుంటాయని కూడా చెబుతున్నారు వీరు. అంతేకాదు, భార్యాభర్తలు నువ్వు, నేను ఒకటి అంటూ మొదలుపెట్టిన ప్రయాణం కాస్తా తల్లిదండ్రులు అయ్యేసరికి నువ్వెంత అంటే నువ్వెంత అనేలా మారిపోవడానికి ముఖ్య కారణం ‘దూరమే’ అంటున్నారు పరిశోధకులు. కమ్యూనికేషన్ గ్యాప్ తొలగించండి:- భార్యాభర్తల మధ్య కావలసినంత సమయం ఉన్నప్పుడు ఆ బంధం చక్కగా సాగిపోతుంది. ఎప్పుడైతే పిల్లలు, బాధ్యతలు అంటూ మొదలవుతాయో ఇద్దరికి మధ్య కలసి గడిపే సమయం తగ్గిపోతుంది. దాంతో చిన్న చిన్న అపార్థాల నుంచి పెద్దపెద్ద గొడవలదాకా వచ్చే అవకాశం వుంది. అయితే అందరి విషయంలో ఇలా జరగదు. సమస్యకు మూలం ‘కమ్యూనికేషన్ గ్యాప్’ అన్న విషయం తెలుసుకున్న భార్యాభర్తలు రోజువారీ ఒత్తిడి పనుల మధ్య కూడా ఒకరికోసం ఒకరు కొంత సమయాన్ని కేటాయిస్తారు. కొన్ని జంటలపై జరిపిన అధ్యయనంలో పై విషయాలన్నీ చాలావరకు అందరు భార్యాభర్తల మధ్య జరిగే సహజ పరిణామాలని తేలింది. అయితే కొంతమంది మాత్రం వారి కోసం అంటూ కొన్ని కలసి గడిపే సమయాలని నిర్ణయించుకుని, ఆ ప్రకారం నడచుకోవడం గమనించారు పరిశోధకులు. వారిమధ్య  అనుబంధం ఎన్ని ఏళ్ళు గడచినా, ఎంత పని ఒత్తిళ్ళలో వున్నా చక్కగా, చిక్కగా వుందని కూడా గుర్తించారు. ఇదిగో అసలు సీక్రెట్:- భార్యాభర్తల బంధం తాజాగా వుండటానికి సీక్రెట్ ఏంటో తెలుసా? ‘ఇద్దరూ కలసి గడిపే సమయం’.  రోజూ తప్పకుండా  ఇద్దరూ కొంత సమయాన్ని గడపటం. అంటే ఉదాహరణకి భార్యాభర్తలు ఇద్దరూ ఉదయం, రాత్రి వాకింగ్‌కి వెళ్ళడం, ఆదివారాలలో బయట భోజనం చేయడం, ఇలా ఏదో ఒకటి అలవాటుగా మార్చుకున్న జంటల మధ్య అపోహలు తక్కువగా వున్నట్టు గమనించారు ఆ అధ్యయనంలో. అలాగే వీరిద్దరికే సొంతమైన నిక్‌నేమ్స్ వంటివి కూడా ఇద్దరినీ దగ్గర చేస్తాయిట. ఇక్కడ పరిశోధకులు ఒక రహస్యాన్ని కూడా బయటపెట్టారండోయ్. శ్రీవారు తనని ఓ ప్రత్యేకమైన పేరుతో పిలిస్తే, శ్రీమతులు తక్కువ అలుగుతారట. ఈ సీక్రెట్ మీ శ్రీవారికి చెప్పకండి. అలిగే ఛాన్స్ మిస్సయిపోతారు మీరు. అత్తాకోడళ్ళూ ఇది వినండి... సరే, భార్యాభర్తల తర్వాత అంత సంక్లిష్టమైన అత్తాకోడళ్ళ బంధానికీ ఆ అధ్యయనంలో దారి చూపించారు ఆ అధ్యయనంలో. అత్తాకోడళ్ళు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వుంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందే తప్ప తగ్గదు అని  చెబుతున్నారు అధ్యయనకర్తలు. శ్రీవారిని, పిల్లల్ని ఆనందపరచడానికి, చిన్నచిన్న బహుమతులు ఇచ్చినట్టే అప్పుడప్పుడు అత్తగారికి కూడా బహుమతులు ఇస్తుండాలిట. అలాగే అత్తగారి తరఫు వారితో, అంటే ఆమె పుట్టింటి వారితో మంచి సంబంధాలు కలిగి వుండాలిట. అన్నిటికంటే ముఖ్యంగా ఎంత బిజీగా వున్నా, అలసిపోయినా సరే అత్తగారితో ఆరోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి చెబుతూ కాసేపు కబుర్లు చెప్పాలిట. ఆమె చెప్పే విషయాలని ఓపిగ్గా వినాలిట. ఇలా చేస్తే అత్తాకోడళ్ళ మధ్య మంచి బంధం వుంటుందని అంటున్నారు. అదేంటి... అత్తగారి వైపు నుంచి చేయాల్సినవి ఏం లేవా అంటే... వున్నాయి... అవి కోడలిని ఏ విషయంపైనా ప్రశ్నించకుండా వుండటం. ఆమె పుట్టింటి వారితో మంచి అనుబంధాన్ని ఏర్పచుకోవటం, మధ్యమధ్యలో ఫోన్ చేసి పలకరించడం వంటి చిన్న చిన్న విషయాలు వారి మధ్య బంధాన్ని చక్కగా వుంచుతాయట. బంధమేదైనా ఒకటే సూత్రం:- ఇక పిల్లలు, స్నేహితులు, బంధువులు ఇలా బంధం ఏదైనా కానివ్వండి సూత్రం ఒక్కటే అంటున్నారు అధ్యయనకర్తలు. ఒకరికి ఒకరు సమయం ఇచ్చుకోవడం, తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవటం, కొంచెం సున్నితంగా వుండటం ఇవి ఏ బంధాన్ని అయినా తాజాగా వుంచుతాయిట. ముఖ్యంగా కలిసి గడిపే సమయాన్ని అలవాటుగా మార్చుకుంటే చాలుట. మరి ఆలోచిస్తారు కదూ. -రమ

మీ సెల్‌ఫోనే బ్లడ్ బ్యాంక్!

ఓ చిన్న ఆలోచన మనల్ని పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేస్తుంది. మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ సెల్ ఫోన్స్‌లో ఫ్రెండ్స్ పేరుతోపాటు వాళ్ళ బ్లడ్ గ్రూప్‌ని కూడా సేవ్ చేస్తారు. ఎందుకో తెలుసా? బ్లడ్ కావాలంటూ మనకి ఎవరైనా ఫోన్ చేయగానే ఈజీగా మన ఫ్రెండ్స్‌లో ఆ గ్రూప్ బ్లడ్ వున్న వారిని ఐడెంటిఫై చేయొచ్చని. హెల్త్ ప్రాబ్లమ్స్, ఆపరేషన్స్, యాక్సిడెంట్స్... రీజన్ ఏదైనా బ్లడ్ కావాలంటూ ఎప్పుడైనా, ఎవరైనా మనల్ని అగడవచ్చు. ఆ టైమ్‌లో రైట్ బ్లడ్ గ్రూప్ పర్సన్‌ని ఐడెంటిఫై చేయడానికే చాలా టైమ్ పడుతుంది. ఒక్కోసారి టైమ్‌కి దొరకకపోవచ్చు కూడా. సో, మనదగ్గర ఓ లిస్ట్ వుంటే హెల్ప్‌ఫుల్‌గా వుంటుంది కదా. ఇంటర్నెట్‌లో మన బ్లడ్ గ్రూప్‌ని రిజిస్టర్ చేసుకునే వెబ్‌సైట్స్ కొన్ని వున్నాయి. వాటిలో రిజిస్టర్ చేసుకుంటే మన బ్లడ్ గ్రూప్ అవసరమైనప్పుడు మనల్ని కాంటాక్ట్ చేస్తారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆ సైట్స్ వివరాలు కనిపిస్తాయి. వీలయితే అందులో పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎప్పుడు, ఎవరికి బ్లడ్ అవసరం అవుతోందో తెలీదు. ఆ టైమ్‌లో అత్యవసరం అన్నప్పుడు ఎంతో టెన్షన్‌గా అనిపిస్తుంది. ఆ టెన్షన్‌ని కాస్త తగ్గించే చిన్న ప్రయత్నం... మీ ఫోన్ లిస్ట్‌లో పేరుతోపాటు వారి బ్లడ్ గ్రూప్‌ని కూడా అడిగి సేవ్ చేయడం... -రమ

పెన్సిలూ - మ‌నిషి!

  ఒక అజ్ఞాత వ్య‌క్తి పేర ప్ర‌చారంలో ఉన్న‌ నీతి క‌థ ఆధారంగా అల్లిన‌ క‌థ ఇది... ఒక ఫ్యాక్టిరీలో వేలాది పెన్సిళ్లు త‌యార‌వుతున్నాయ‌ట‌. ఆ హ‌డావుడిని చూసిన ఒక స‌న్న‌టి పెన్సిల్ త‌నను పెట్టెలో స‌ర్దుతున్న ఓ వ్య‌క్తితో ఇలా మాట‌లు క‌లిపింది. `ప్ర‌పంచంలో ఇన్ని ల‌క్ష‌ల పెన్సిళ్లు ఉన్నాయి క‌దా. వాటితో పోలిస్తే నేను ఎందుకూ ప‌నికిరానేమో అని భ‌యంగా ఉంది. ఒక పెన్సిల్‌గా నా ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌డం క‌ష్ట‌మేమో అని భ‌యం వేస్తోంది. నాకేద‌న్నా ఉపాయం చెప్ప‌రాదా!` అని అడిగింది. దానికా వ్య‌క్తి చిరున‌వ్వుతో `అదెంత భాగ్యం! నేను చెప్పే ఒక అయిదు విష‌యాలు గుర్తుపెట్టుకో చాలు! నీ జీవితం సార్థ‌క‌మవుతుంది` అంటూ ఇలా చెప్పాడు... ఒక‌టి:  నువ్వు నీ జీవితంలో చాలా అధ్బుతాల‌ను చేస్తావు. కానీ అందుకోసం వేరొక‌రి చేతిలో ఒదిగి ఉండ‌వ‌ల‌సి ఉంటుంది. రెండు:  నీతో చ‌క్క‌గా రాయించేందుకు ఎప్ప‌టిక‌ప్ప‌డు నిన్ను చెక్క‌వ‌ల‌సి ఉంటుంది. ఆ అనుభ‌వం చాలా బాధాక‌రంగా ఉంటుంది. బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది క‌దా అని నువ్వు వెనుక‌డుగు వేశావో. ముందు మొద్దుబారి ఆ త‌రువాత ఎందుకూ ప‌నికిరాకుండా పోతావు. మూడు:  నువ్వు చేసిన పొర‌పాట్లు ఏవ‌న్నా ఉంటే దాన్ని చ‌క్క‌దిద్దుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. వాటిని శుభ్రంగా వినియోగించి, తిరిగి నేర్ప‌గా రాయి. నాలుగు:  నీ లోప‌ల ఉండేదే నీ విలువ‌కు నిజ‌మైన కొల‌మానంగా ఉంటుంది. అయిదు:  గ‌రుకైన గోడ‌ల నుంచి నున్న‌టి కాగితం వ‌ర‌కూ.... నువ్వు నానార‌కాల ప‌దార్థాల మీద రాయ‌వ‌ల‌సి ఉంటుంది. దేనిమీద రాస్తున్నామ‌న్న‌ది మ‌ర్చిపో. ప్ర‌తి సంద‌ర్భంలోనూ నీదైన ముద్ర వేసేందుకు మాత్ర‌మే ప్ర‌య‌త్నించు.   - ఈ అయిదు సూచ‌న‌లూ చేసి ఆ వ్య‌క్తి, పెన్సిల్‌ను ఈ లోకంలోకి పంపించాడ‌ట‌. ఇప్ప‌డు పెన్సిల్ స్థానంలో మ‌న‌ల్ని ఊహించుకుంటే ఈ సూచ‌న‌లు అర్ధ‌వంతంగానే తోస్తాయి. ఒక‌టి: ఒక ప‌క్క మ‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే, విధి చేతిలో నిమిత్త‌మాత్రులం అన్న విష‌యాన్ని గుర్తించాలి. మ‌న ద్వారా జ‌రుగుతున్న అద్భుతాల‌న్నింటికీ మ‌న‌మే బాధ్య‌లం అన్న అహంకారంతో ఉండ‌కూడ‌దు. రెండు:  ఎన్నో బాధాక‌ర‌మైన అనుభ‌వాల ద్వారా జీవితం మ‌న‌కు కొత్త కొత్త పాఠాల‌ను నేర్పుతుంది. అవేమీ నాకు వ‌ద్దు అనుకుంటే లోకంలో అమాయ‌కంగానే ఉండిపోతాం. అనామ‌కంగా మాత్ర‌మే మిగిలిపోతాం. మూడు:  కాలం ముందుకు సాగుతూ ఉంటుంది. దాంతో పాటుగా మ‌నం చేసిన పొర‌పాట్లూ మ‌న జీవితంలో న‌మోదు అయిపోతాయి. వాటిని వెన‌క్కితోసుకోలేక‌పోవ‌చ్చు. కానీ స‌రిదిద్దుకునే అవ‌కాశం మాత్రం జీవితం ఎప్ప‌టిక‌ప్ప‌డు మ‌న‌కి అందిస్తూనే ఉంటుంది. కొన్ని క్ష‌మాప‌ణ‌లు, కొద్దిపాటి క‌ష్టంతో పాటు... పెద్ద మ‌న‌సు, స‌రైన వివేచ‌న ఉంటే వాటిని స‌రిదిద్దుకోవ‌డం సాధ్యం కావ‌చ్చు. నాలుగు:  పైపై మెరుగులు మ‌న‌కి తాత్కాలికంగానే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌న లోప‌ల ఉండే సంస్కార‌మే మ‌న జీవితానికి, విజ‌యానికీ కొల‌మానంగా నిలుస్తుంది. మ‌న చేత‌ల‌కు విలువ‌నిస్తుంది. సంస్కారం లేనివాడు... ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎన్ని ఆడంబరాల‌ల‌ను చుట్టుకున్నా నిరుప‌యోగంగానే ఉండిపోతాడు. అయిదు:  జీవితంలోని ప్ర‌తి మ‌లుపులోనూ, ప్ర‌తి మ‌జిలీలోనూ, ప్ర‌తి మాట‌లోనూ, ప్ర‌తి మ‌మ‌త‌లోనూ... మ‌న‌దైన ముద్రంటూ ఒక‌టి ఉండాలి. వ్య‌క్తిత్వం ప‌ట్ల పూర్తి నిబ‌ద్ధ‌త ఉన్న‌ప్పుడే అది సాధ్య‌ప‌డుతుంది. - నిర్జ‌ర‌.

ఒత్తిడిని గుర్తించండి.. ఒదిలించండి

    ఒత్తిడి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అబ్బే లేదే నేనేం ఒత్తిడిలో లేను అని చాలామంది కొట్టి పారేస్తారు. కానీ ఒత్తిడిని గుర్తించటంలో మనం పొరపాటు పడినా, దాని ప్రభావాన్ని చూపించటంలో అది ఏమాత్రం జాలి పడదు. మన మనసు పైనే కాదు, శరీరం మీద కూడా దాని ప్రభావం చాలా వుంటుంది అంటున్నారు నిపుణులు. నమ్మకం కలగటం లేదా.. అయతే వివరంగా వివరాలు చెబుతాను .. 1. ఎప్పుడయినా మెడ దగ్గర విపరీతమైన నొప్పిగా అనిపించిందా? అలా అయతే మీ కంటే ముందే మీ కండరాలు మీలోని ఒత్తిడిని గుర్తించాయి అని తెలుసుకుని రిలాక్స్ అవ్వండి వెంటనే. ఒత్తిడి మనసు మీదే కాదు కండరాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది, దాంతో అవి పట్టేసినట్టు అవుతాయి.. బ్రీతింగ్ కు సంబంధించిన వ్యాయామాలు ఆ సమయం లో ఒత్తిడిని, కండరాల ఇబ్బందిని తగ్గిస్తాయి. 2. కళ్ళు అదరటం, మంటగా అనిపించటం వంటివి కళ్ళు ఒత్తిడికి గురయ్యాయని సూచిస్తాయి. ఆ సమయంలో కళ్ళు మూసుకొని ఓ పది నిముషాలు రిలాక్స్ అవ్వటం మంచిది. కాదని మొండిగా పనిచేస్తే ఆ ఒత్తిడి మనసుని చేరుతుంది. 3. గోళ్ళు కోరుకుతున్నారా? అయతే ఏదో విషయంలో మీరు ఒత్తిడికి గురయ్యారని అర్ధం. ఈ విషయం అని ఆలోచనలో పడకండి.. తెలీకుండా గోళ్ళు కొరుకుతుంటే... చక్కగా ఓ మంచి పాట వినండి, వేడి వేడి, టీ తాగండి... మనసు తేలిక పడుతుంది. 4. ఒకోసారి ఎందుకో తెలియదు.. అస్సలు నిద్ర పట్టడం లేదు అంటారు చాలామంది. ఆ ఎందుకో వెనక ఒత్తిడి దాగుందని తెలుసుకోరు. నిజానికి ఏదో ఆందోళన మనసులో నిండి వుంటే అది హార్మోన్ల మీద ప్రభావాన్ని చూపించి నిద్రని దూరం చేస్తుంది. బాగా ఒత్తిడిలో వుంటే కంటి నిండా నిద్ర కరువే. అందుకు పరిష్కారం రోజు రాత్రి పడుకునే ముందు ఓ పది నిముషాలు ధ్యానం వంటిది చేయటం. మంచి మ్యూజిక్ వింటూ నిద్రలోకి జారుకోవటం. నిద్ర వచ్చేదాకా ఇంటర్నెట్ ముందో, టీవీ ముందో గడిపితే అది ఒత్తిడిని మంరింత పెంచుతుంది కాని తగ్గించదు. నచ్చిన పుస్తకం చదవటం కూడా మనసుని రిలాక్స్ చేస్తుంది. 5. అన్నీ మరచిపోతున్నా ఈ మధ్య.... అనిపిస్తే... కచ్చితంగా ఒత్తిడిలో ఉన్నట్టే. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా వుంటే ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. దాంతో చాలా విషయాలు మర్చి పోతుంటాం. ఆ మార్చి పోవటం మళ్ళీ ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సర్కిల్ ని బ్రేక్ చేయాలంటే ఒత్తిడికి చెక్ చెప్పటం ఒక్కటే పరిష్కారం. రోజూ కొంత సేపు వ్యాయామం చేయటం, మెడిటేషన్ వంటివి ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఒత్తిడి ఎప్పుడు, ఎందుకు వస్తుందో తెలియదు. ఒకోసారి చిన్న విషయాలు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. ఎందుకు అని తీవ్రంగా ఆలోచించే కంటే... ఒత్తిడి దరిచేరకుండా మనం ఏం చేయగలం అన్నది తెలుసుకుని, అది పాటించటం మంచిది. ఇందుకు నిపుణులు చెప్పేది ఒక్కటే... మీ మనసుకు నచ్చే పనుల కోసం రోజూ కొంత సమయం కేటాయించండి. రోజు వారి ఒత్తిడులకి ఇదే మంచి పరిష్కారం అని. సో మీకు ఇష్టం అయినది ఏంటో అది చేయండి.. ఒత్తిడికి దూరంగా వుండండి. మనలని అన్నివిధాలా ఇబ్బంది పెట్టె ఒత్తిడిని సకాలంలో గుర్తించి... అందులోనుంచి బయట పడటం అన్నివిధాలా ఏంతో ముఖ్యం. 

మానవత్వ పరిమళం

ఇది చిన్న పిల్లల కథే... కానీ మనం కూడా అందులో నుంచి నేర్చుకునేది ఎంతో కొంత ఉందనిపించింది. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి నలుగురు కొడుకులు. నలుగురూ అన్ని విద్యల్లో ఆరితేరిన వారే. తెలివైన వారు కూడా. అయితే ఓ రాజుగా రాజ్యభారాన్ని తీసుకునే వారికి తెలివితేటలు, సకల విద్యలే కాదు ధర్మం, న్యాయం వంటి వాటిపైనా కూడా అవగాహన ఉండి తీరాలని నమ్మిన ఆ రాజు తన నలుగురు కొడుకులని పిలిచి ఇలా చెప్పాడు. మీ నలుగురు రాజ్యంలో తిరగండి. మీకు ఎవరు అందరికంటే నిజమైన ధర్మాత్ముడని అనిపిస్తాడో అతనిని నా దగ్గరకి తీసుకురండి అంటాడు. అలా ఎవరైతే నిజమైన  ధర్మాత్ముడిని గుర్తించి తెస్తారో వాళ్ళనే రాజుగా నియమిస్తాను అంటాడు. రాజు చెప్పిన మాటలు విన్న అతని నలుగురు కొడుకులు గుర్రాలెక్కి రాజ్య సంచారానికి బయలుదేరుతారు. కొన్నాళ్ళు గడిచాయి. ఇంతలో రాజుగారి పెద్దకొడుకు ఓ శేఠ్‌ను వెంటపెట్టుకు వస్తాడు. అతని గురించి సభలో చెప్పమంటాడు  రాజు. ఈ శేఠ్‌ నిత్యం ఎన్నో దానధర్మాలు చేస్తుంటాడు. పూజలు, వ్రతాలు చేస్తుంటాడు. ఇతనిని మించిన ధర్మాత్ముడు నాకెవరూ కనిపించలేదు అంటాడు రాజు పెద్దకొడుకు. అది విన్న రాజుగారు "నిజంగా ధర్మాత్ముడే" సంతోషం అంటూ ఆ శేఠ్‌ను సత్కరించి పంపిస్తాడు.  ఆ తర్వాత రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుడిని తీసుకువస్తాడు. ఆ బ్రాహ్మణుడు అన్ని తీర్థయాత్రలు కాలినడకన చేసాడని, అసత్యం పలకడని, కోపం లేనివాడని చెపుతాడు. రాజుగారి రెండవ కొడుకు తీసుకువచ్చిన బ్రాహ్మణుడి గురించి విన్న రాజుగారు సంతోషించి అతనికి కానుకలిచ్చి, సత్కరించి పంపిస్తాడు.  ఆ తర్వాత మూడో కుమారుడు ఓ బాబాజీని వెంట పెట్టుకువస్తాడు. ఆ బాబాజీ ఎంతో నిష్టతో తపస్సు చేస్తుంటాడని, నీరు తప్ప మరేది తీసుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడని చెబుతాడు. బక్కచిక్కిన శరీరంతో, తేజస్సు నిండిన కళ్ళతో ఉన్న ఆ బాబాజీకి నమస్కరించిన రాజు. ఇతను కూడా ధర్మాత్ముడేనని చెబుతాడు. ఇలా ముగ్గురు కొడుకులు తీసుకువచ్చిన వ్యక్తులని సత్కరించి పంపిన రాజు తన నాలుగో కొడుకు కోసం ఎదురుచూస్తుంటాడు.  కొన్నాళ్ళకి నాలుగో కొడుకు ఓ బక్కచిక్కిన, మాసిన బట్టలు వేసుకున్న ఓ రైతుని వెంటబెట్టుకువస్తాడు. అతనిని చూసి సభలో అందరూ నవ్వుతారు. పొట్ట కూటికోసం మన్నులో పనిచేసే ఇతను ధర్మాత్ముడా! అని హేళన చేస్తారు. రాజుగారు అందరిని ఆగమని ఇతను ధర్మాత్ముడు అని ఎలా గ్రహించావు అని కొడుకుని అడుగుతాడు. అందుకు అతను ఈ రైతు గాయం తగిలిన కుక్కని చేరదిసి దాని బాగోగులు చూస్తున్నాడు. అలాగే తను తినే నాలుగు మెతుకులలోనే కొంత పశుపక్ష్యాదులకి, నిస్సహాయులకి ఇస్తున్నాడు. అందరికంటే ఇతనే ధర్మాత్ముడనిపించి తీసుకు వచ్చాను అని చెబుతాడు.  రాజుగారు ఆ రైతుని సత్కరించి కానుకలు ఇచ్చి అందరికంటే ఇతనే గొప్ప ధర్మాత్ముడని ప్రశంసిస్తాడు. పూజలు, వ్రతాలు, దానధర్మాలు, తపస్సు ఇవన్నీ గొప్ప ధర్మాలే. కానీ అన్నిటికంటే గొప్ప ధర్మం నిస్సహాయ స్థితిలో ఉండి, అర్థించటం కూడా రాని ప్రాణిని ఆదుకోవటం, అలాగే ఉన్నదానిలోనే నలుగురికి పెట్టడం. ఇతరులకి సహాయపడే ఇతని ధర్మమే నిజమైన ధర్మం అంటూ నాలుగో కొడుకుని తన తరువాత రాజుగా ప్రకటిస్తాడు రాజు. ఇది కథ మనం గ్రహించాల్సిన అంశామేదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు కదా.  -రమ ఇరగవరపు