మనం చూసే దృష్టి మారితే ఆనందం మీతోనే!

పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పెద్దలంటారు. నిజానికి అందులో నిజం లేదు. పచ్చకామెర్లవాడికి కూడా లోకం మామూలుగానే కనిపిస్తుంది. కానీ పెద్దలు అలా ఎందుకన్నారు? దృష్టి స్వచ్ఛంగా ఉంటే... ప్రపంచమంతా స్వచ్ఛంగా కనిపిస్తుందని చెప్పడానికే పెద్దలు ఆ మాట అన్నారు. దృక్కోణం వక్రంగా ఉంటే... రాముడు కూడా రావణాసురుడుగా కనిపిస్తాడు. అందుకే.. దుమ్ముపట్టిన దృష్టితో చూడకండి. స్వచ్ఛమైన దృష్టితో చూడండి.. లోకమంతా అందంగా కనిపిస్తుంది. ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి.   https://www.youtube.com/watch?v=2Z5LCBfZRpw  

పిల్లల్ని ఏడిపించే పోటీలు..

ఇంట్లో పసిపిల్లలు ఉన్నారంటే ఆ సందడే వేరు. వాళ్ల ఆటపాటలతో రోజులు ఎలా గడిచిపోతాయో తెలియదు. అంతవరకు బాగానే ఉంది. కానీ అదే పిల్లలు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నారనుకోండి... అప్పుడుంటుంది అసలు టెన్షన్‌. పిల్లవాడు ఏడుపు ఆపేవరకు తల్లిదండ్రులకు ఏమీ తోచదు. కానీ జపాన్‌లోని టోక్యోలో సంగతే వేరు. అక్కడ ఏడ్చే పిల్లవాడే విజేతగా నిలుస్తాడు. అదేంటో మీరే చూడండి. జపాన్‌ రాజధాని టోక్యోలో సెన్‌సోజి అనే బౌద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయానికి 1400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ గుడి ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇక వేసవి కాలం మొదలయిందంటే ఆ సందడి ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ జరిగే ఓ పిల్లల పోటీనే ఇందుకు కారణం. ఆ పోటీ పేరు ‘నాకిజుమో’... అంటే ఏడ్చే పిల్లల పోటీ అని అర్థం. ‘ఏడ్చే పిల్లలు బాగా బలంగా ఉంటారు’ అని జపాన్లో ఓ సామెత ఉంది. అంతేకాదు! పిల్లలు ఏడిస్తే... ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులన్నీ పారిపోతాయని కూడా వాళ్లు నమ్ముతారు. అందుకనే ఏటా ఈ పోటీ పెడతారు. నాలుగు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఈ పోటీలో ప్రవేశం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనే పిల్లలని ఇద్దరు సుమోలు ఎదురెదురుగా పట్టుకుని నిలబడతారు. ఆ ఇద్దరు పిల్లలలో ఎవరు ముందు ఏడుస్తారో వాళ్లనే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ పిల్లలిద్దరూ ఒకే సమయంలో ఏడిస్తే, వాళ్లలో ఎవరు గట్టిగా ఏడుస్తున్నారో చూస్తారు. పోటీలో పిల్లలు బాగా ఏడ్చేందుకు రిఫరీలే వాళ్లని భయపెడుతారు. అప్పటికీ పిల్లవాడు ఏడవకపోతే భయపెట్టే మాస్కులు వేసుకుని పిల్లలు జడుసుకునేలా చేస్తారు. ఆ పోటీ చూసేందుకు వచ్చిన జనం కూడా పిల్లల్ని ఏడవమని అరుస్తూ రెచ్చగొడతారు. ఇంత జరిగిన తర్వాత పిల్లలు ఎడవకుండా ఎలా ఉంటారు చెప్పండి! ఈ ఏడుపు పోటీలు ఇప్పటివి కాదు. దాదాపు నాలుగు వందల ఏళ్ల నుంచీ వీటని నిర్వహిస్తున్నారట. ఏటా దాదాపు రెండు వందల మంది పిల్లల్ని ఈ పోటీలో పాల్గొనేందుకు తీసుకువస్తూ ఉంటారు. వాళ్లకి సుమో బట్టలు వేసి, నిర్వాహకుల చేతిలో పెడుతుంటారు. నిజానికి పిల్లలు అప్పుడప్పుడూ ఏడవటం మంచిదే కావచ్చు. దాని వల్ల వాళ్ల ఊపిరితిత్తులు బలపడతాయి. వాళ్ల ఆకలి, అనారోగ్యాల గురించి పెద్దవాళ్లకి తెలుస్తాయి. కానీ అదేపనిగా గుక్కపట్టి ఏడవటం వల్ల, వాళ్ల మెదడు దెబ్బతింటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జపాన్‌వాసులు మాత్రం ఈ మాటని వినేలా లేరు. - నిర్జర.

ప్రతి క్షణాన్నీ ఒడిసి పట్టుకో...

  కొంతమందిని చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆనందాన్ని అడుగడుగునా పంచుకుంటూ, జల్లుకుంటూ వెళుతూఉంటారు. వారి జీవితాల్లో ఆనందం మాత్రమే ఉందా అన్నట్టు కనిపిస్తారు. "సీక్రెట్ ఏమిటి" అని వారిని కలిసిన ప్రతీ ఒక్కరు ఆలోచనలో పడక తప్పదు. ఇంతకీ సీక్రెట్ ఏమై ఉంటుంది? దానికి సమధానం తెలుసుకునే ముందు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఆనందం, సంతోషం, అనగానే వెంటనే మీకు గుర్తు వచ్చే కొంతమంది పేర్లు ఒకచోట వ్రాయండి. అదేవిధంగా మీ జీవితంలో సంఘటనలు కూడా రాయండి. లిస్టు ఎంత వుంది?  చిన్నది అయితే కొంచం ఆనందం కోసం సీరియస్‌గా  ఆలోచన మొదలు పెట్టండి. ఎందుకంటే కొన్ని విషయాలు, సంఘటనలు మాత్రమే మనకి ఆనందాన్ని పంచుతాయి అని మనం చాలా గట్టిగా నమ్ముతాం.  అదే చంటి పిల్లలని ఒకసారి గమనించండి.... ఒక బొమ్మ కావాలని అడుగుతాడు. పేచీలు పెడతాడు. ఇస్తే సరేసరి, లేకపోతే వాడిని సముదాయిస్తే మరచిపోయి వేరొక వస్తువుతో ఆడుకుంటాడు, ఆనందంగా గడిపేస్తాడు. వాడి దృష్టిలో ఆడుకోవటం ముఖ్యం.... ఆడుకునే వస్తువు కాదు. కానీ మనకి ఆనందంగా ఉండడం ముఖ్యంకాదు అలా ఉండడానికిగల కారణాలు ముఖ్యం. డబ్బు, ఉద్యోగం, హోదా ఇవ్వన్నీ ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటారని కొంతమంది అభిప్రాయం. మరి వాళ్ళు ఆనందంగా ఉంటున్నారా? అవి మాత్రమే మనిషికి ఆనందానికి కారణాలు అనుకోవటం కేవలం అపోహ మాత్రమే. అవి లేనివాళ్ళు ఎంతోమంది చాలా ఆనందంగా ఉంటున్నారనేవిషయం మీకు తెలుసా. ఎందుకంటే అవేవీ లేనివారు వారికున్న వాటితో తృప్తిగా జీవిస్తున్నారు. అందుకే వాళ్ళు ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతున్నారు.        పసిపిల్లల బోసినవ్వు చూసినా, పండువెన్నెలని చూసినా, వర్షపు చినుకుల్లో తడిసినా, సూర్యోదయ - సూర్యాస్తమయాలని చూసినా మనస్సు ఆనందంతో పొంగిపోతుంది. ఆ ఆనందానికి కారణాలు గానీ, లాభాలుగానీ ఏమిటి? అని ఆలోచిస్తామా? అలాగే జీవితంలో ఆనందంగా ఉండాలి అన్నది మన నిర్ణయం అయితే పరిమితులు ఉండవు. కారణాలు వెతుక్కోము. వేటికీ ఆపాదించం. కాబట్టి ఆనందంగా వుండాలి అంటే సీక్రెట్ ఒకటే ఆనందంగా వుండాలని కోరుకోవటం... ఆ ఆనందాన్ని దేనితో ముడిపెట్టకుండా, అలాగే  అదేదో దానంతట అదే వస్తుందని ఎదురు చూడకుండా  ఎప్పుడూ మనతోనే వుంది అని నమ్మితే...  ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తే ఆనందం మన సొంతం. -రమ

హెల్త్ పాడుచేస్తున్న సిటీ లైఫ్ స్టైల్..!

  గ్రాడ్యుయేషన్ అయిపోగానే, జీవితపు ధ్యేయాన్ని చేరుకోవడానికి మరింత పైకి ఎదిగి కుటుంబానికి ఆసరాగా నిలబడాలనే ఆశతో ఎంతో మంది యువత ప్రతీ ఏడాదీ పల్లెటూళ్ల నుంచి సిటీలకు చేరుకుంటారు. నగరాల్లో కెరీర్ పరంగా పైకెదుగుతున్నా, ఆరోగ్యంలో మాత్రం రోజురోజుకూ ప్రమాదంలో పడుతోంది యువత. సిటీ లైఫ్ స్టైల్ ఆరోగ్యాన్ని దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. పట్నపు జీవితమనేది పైకి అందంగా కనిపిస్తున్నా, దానితో పాటే ఎన్నో కనిపించని లాంగ్ లైఫ్ ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇవి అప్పటికప్పుడు ఏమీ చేయవు. కానీ జీవితంలో ఎక్కడో ఒకసారి తమ పడగ విప్పి ప్రభావం చూపిస్తాయి.     అన్నింటి కంటే సిటీలో మొదట చెప్పుకోవాల్సింది కాలుష్యమే. ఆ సిటీ ఈ సిటీ అని తేడా లేకుండా, ప్రతీ చోటా వాతావరణాన్ని కాలుష్యపరచడంలో నగరాలు పోటీపడుతున్నాయి. ఇంటి నుంచి బయటికొచ్చి, ఆఫీసులకో లేక కోచింగ్ సెంటర్లకో వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికొచ్చి స్నానం చేసేసరికి, ఒంటికి మసి ఎంతగా పట్టిందో అర్ధమవుతుంది. కళ్లముందే ఆరోగ్యాన్ని కాలుష్యం మెల్లమెల్లగా కబళిస్తోందని తెలిసినా కెరీర్, జీవితం అంటూ తనను తానే కట్టేసుకుని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు నగర వాసి. వాయు కాలుష్యంతో పాటు, అవసరం ఉన్నా లేకపోయినా హారన్లు మోగిస్తూ సౌండ్ చేసే సిటీలోని సెన్స్ లెస్ మనుషుల ధ్వని కాలుష్యం మరో కనబడని కాలనాగు. ఈ శబ్దాల మధ్య అలవాటు అయిపోయిన నగర జీవి చిన్న చిన్న శబ్దాలు వినే శక్తిని కోల్పోతాడనడంలో సందేహం లేదు. ఒక పాతికేళ్ల పాటు నగరాల్లో జీవించిన వ్యక్తి ఊపిరితిత్తుల్ని గమనిస్తే ఈ తేడా ఖచ్చితంగా తెలుస్తుంది.     నగరజీవనంలో మరో విపత్తు తిండి అలవాట్లు. రోడ్డు మీద ఏది పడితే అది తినడమే కాక, ఇంటికి కూడా కర్రీ పాయింట్స్ నుంచే తెచ్చుకోవడం ఆరోగ్యానికి మరో ప్రమాదకరమైన పని. ఇంట్లో వండుకునే సౌలభ్యం ఉన్నవాళ్ల ఒంటిలో కూడా కూరగాయలకు కొట్టిన రంగులు చేరిపోతున్నాయి. రోడ్డు సైడ్ దుకాణం నుంచి, బ్రాండెడ్ వెజిటబుల్ మార్కెట్స్ వరకూ, అన్నింటిలోనూ రంగులే. కృత్రిమ పదార్ధాలే. సిటీ లైఫ్ లో మనిషి సగటు ఆయుర్దాయం తగ్గిపోవడం వెనుక కనబడని పాత్ర ఈ తిండి అలవాట్లది. ఇక నూడుల్స్, ఫైడ్ రైస్ పాయింట్స్ గురించి, వాటిలో వాడే నూనె గురించి ఎంత తక్కువ చెప్పుకంటే అంత మంచిది.     తిండి లేకుండా మనిషి బతకగలడు కానీ నిద్ర లేకపోతే మాత్రం శరీరం శుష్కించిపోతుంది. కానీ ఈ వాస్తవం సిటీలైఫ్ లో ఉన్న వారికి అర్ధం కావట్లేదు. గతేడాది చేసిన ఒక సర్వే ప్రకారం, మెట్రో సిటీల్లో రాత్రి నిదురపోయే సమయం సగటు 5 గంటలుగా తేలింది. కనీసం 8 గంటలు పడుకోవాల్సిన మనిషి ఐదారు గంటలు మాత్రమే పడుకుంటే, ఇక శరీరాలు రోగాలబారిన పడకుండా ఎలా ఉంటాయి. నిద్రలేక ఎర్రబడిన కళ్లు ప్రతీ ఉదయాన్న సిటీలో సూర్యుడికి స్వాగతం చెబుతుంటాయి. ఆఫీసుల్లో ఓవర్ టైం కావచ్చు. లేక పార్టీ టైం కావచ్చు. కారణమేదైనా అక్కడ కోల్పోయేది నిద్ర కాదు. ఆరోగ్యం.   అభివృద్ధి కోసం, జీవితంలో పైకెదగడం కోసం సిటీకి వచ్చే మనిషి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం రోజురోజుకూ ఫలమౌతున్నాడన్నది వాస్తవం. కాదంటారా..?