తెలుగు.. తేనెలొలుకు.. జపాన్ నోట తెలుగు మాట
posted on Nov 16, 2025 6:50AM
విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. మన తెలుగు భాష పట్ల కూడా విదేశీ ప్రతినిథులు, రాయబారుల ఆసక్తిని, అనురక్తిని పెంచింది. తెలుగు పలుకుబడి, నుడికారం పట్ల మమకారం పెంచింది. జపాన్ రాయబారి ఓనో కెయిచ్చి ఏకంగా తన తెలుగులోనే ప్రసంగాన్ని ప్రారంభించి అందరినీ విశ్మయపరిచారు. జపాన్ దేశంతో వాణిజ్య సంబంధాలపైన ఆయన ప్రసంగించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నందుకు తాను చాలా గౌరవంగా, గర్వంగా భావిస్తున్నానన్నారు. ఈ సదస్సు ద్వారా జపాన్, భారత్ కంపెనీలు పరస్పర సహకారం అందిపుచ్చుకోవడంపై తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.
ఈ విషయాలన్నింటినీ ఆయన తెలుగులోనే చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు తెలుగు భాష పట్ల తనకున్న అభిమానాన్ని ఆయన భావోద్వేగభరితంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు. తనను ఆహ్వానించినందుకు కృతజ్ణతలు అని పేర్కొన్న ఆయన.. తెలుగులో ఇదే తన మొదటి ప్రసంగం అన్నారు. జపాన్,ఆంధ్రప్రదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలు ఈ సదస్సు ద్వారా మరింత బలోపేతమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్టీల్, ఫార్మా, రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో, శ్రీసిటీ, టయోమా ప్రీఫెక్చూర్ సంస్థలతో వాణిజ్య సహకారం కొనసాగిస్తున్నామన్నారు.