గడ్డం ఒకటే మిగిలింది...ఉత్తముడిగా మారిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల తరువాతే పీసీసీ నుంచి తప్పుకోవాలని అనుకున్నారు. కానీ ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో అలానే కొనసాగించారు. కానీ దేశమంతా పార్టీ పరిస్థితి ఇదే విధంగా ఉండటంతో మళ్ళీ సైలెంటయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా హర్ట్ అయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటమిని అవమానంగా ఫీలవుతున్నారు. తాను నమ్ముకున్న చోటే భారీ తేడాతో ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఫలితాల వెంటనే ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. పీసీసీ చీఫ్ గా ఉంటూ ఉప ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఓటమి ఆయనని మరింత కుంగదీసింది. ఇప్పుడు కొత్త పిసిసి చీఫ్ ను ఎంపిక చెయ్యమంటూ అధిష్ఠానానికి సూచించారు. ఇటీవల రాహుల్ గాంధీకి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతోందని సమాచారం. వీటన్నింటి నుంచి బయటకు రావాలని బెంగుళూరు ప్రకృతి వైద్యానికి వెళ్లారు ఉత్తమ్. అతిగా హడావుడి చేయడం కంటే ఉన్న ఎంపీ పరిధిలో పనులు ప్రశాంతంగా చేసుకుంటూ హాయిగా గడిపేయాలనుకుంటున్నారు ఉత్తమ్. బెంగుళూరు ప్రకృతి వైద్యం తరువాత నిత్యం 30 కి పైగా సిగరెట్లు తాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మొత్తానికే మానేశారు. మద్యం అలవాటు కూడా ఉత్తమ ఉండేది, కార్గిల్ యుద్ధం సమయంలో వెన్నుకు గాయమవడం ఆ నొప్పి ఇంకా వేధిస్తోంది. దాని నుంచి రిలీఫ్ అవ్వడానికి కొంత ఆల్కహాల్ తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఆల్కహాల్ ని కూడా మానేశారు. ఇక మాంసాహారం కూడా ఇష్టంగా తినే ఉత్తమ్, ఇప్పుడు కాయగూరలకు పరిమితమయ్యారు. ఉడికించిన కూరగాయలు తక్కువ కారంతో వండిన కూరలను అలవాటు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఉన్న ఉత్తమ్ ఇప్పుడు మొత్తానికీ మారిపోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే మనసే కాదు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పీసీసీ నుంచి తప్పుకొని ఢిల్లీ నియోజకవర్గానికే పరిమితమవ్వాలని నిర్ణయించుకున్నారు ఉత్తమ్. మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మారిపోయారు. రాజకీయాల్లో కేవలం తన పార్లమెంటు సీటు వరకే పరిమితం కావాలనుకుంటున్నారు.  

దొంగలు దొరుకుతారా?.. రాజధాని అవకతవకలపై నివేదిక సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత సీఆర్డీఏ అవినీతిపై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. 2019 అసెంబ్లీ సమావేశాల్లో బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆ వివరాలను చివరి రోజున ప్రకటించారు. నివేదికలో ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు కూడా అందుకు స్పందించారు. కొంత మంది తాము ఎప్పుడు కొన్నామో చెప్పగా.. మరికొంతమంది ఆ భూములు మీరే తీసుకోవాలంటూ బుగ్గనకు సవాల్ చేశారు. సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని సిబిఐ విచారణకు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ విచారణ జరిపిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. హై కోర్టు జడ్జితో అయినా సిబిఐతోనైనా విచారణ చేయించాలన్నారు. సీబీఐ విచారణను 3 నెలల్లో పూర్తయ్యేలా కేంద్రాన్ని కోరాలన్నారు. అదే సమయంలో విశాఖలో మీ అవకతవకలపై కూడా సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు. విశాఖలో వైసీపీ నేతలు ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారని బయటపెడుతుంటే అమరావితిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటున్నారని విమర్శలు గుప్పించారు. సీబీఐ విచారణపై జగన్ కు అంత గౌరవం ఉంటే శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. గత ఏడు నెలలుగా తవ్వుతున్నామంటున్నారు కానీ ఏం బయటపెట్టారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు చంద్రబాబు. అందుకు అనేక విచారణ కమిటీలు వేశారని కూడా గుర్తుచేశారు. పోలవరం పీపీఏలపై నిపుణుల కమిటీలు నియమించారు కానీ చివరికి తామే పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్రానికి చెప్పాల్సి వచ్చిందన్నారు. రాజధాని భూములపై పలు రకాల విచారణలు వేశారు. మొదట రిజిస్ర్టేషన్ శాఖ ద్వారా వివరాలు మొత్తం బయటకు తెప్పించారన్నారు. ప్రతి రైతు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లి విచారణ జరిపడమే కాకుండా మధ్యలో క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు. నిజంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు ఎవరైనా పాల్పడి ఉన్న బినామీ పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేసి ఉన్న సులువుగా దొరికిపోతరని వెల్లడించారు. అలా తమ నేతలు ఎవరైనా దొరికివుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు వేచిచూసేది కాదన్నారు. ఇప్పుడు రాజధానిని తరలించాలనుకునే నిర్ణయం తీసుకోవటానికి సిద్ధమై వాయిదా వేసుకున్న తరువాత ఈ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికను తెరపైకి తీసుకువచ్చారని తెలిపారు చంద్రబాబు.  రాజధానిని ఎందుకు మార్పు చేస్తున్నామో ప్రజలకు పూర్తిగా వివరించి వారిలో సానుకూలత వచ్చాకే ముందడుగు వేద్దామని ఈలోగా ఇన్ సైడర్ ట్రేడింగ్ ఇతర అవకతవకలపై ముందుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు. రాజధాని భూములపై సీఐడీ విచారణ ఇప్పటికే జరిగింది. లోకాయుక్తకు ఇలాంటి కేసులను విచారించడానికి అధికారం ఉండదని అంటున్నారు విశ్లేషకులు. ఇక సిబిఐ ప్రభుత్వ సిఫార్సు చేయడమే మిగిలిందన్న చర్చ జరుగుతోంది.

ఎన్నికల్లో విజయానికి కారు గుర్తు చాలు : కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

  మునిసిపల్ ఎన్నికల కసరత్తులో టిఆర్ఎస్ దూకుడు పెంచింది. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్య వర్గం భేటీ అయ్యింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు. ఎన్నికల ఇన్ చార్జిలను కూడా నియమించింది టీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు కేటీఆర్. రిజర్వేషన్లు కలిసొచ్చిన చోట తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ నిర్ణయించారు. ఎమ్మెల్యేలతో స్థానిక నాయకత్వానికీ ఇబ్బందులుంటే సమన్వయం చెయ్యాలని మునిసిపల్ ఇన్ చార్జిలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్ చైర్మన్లు , కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులు కరువయ్యారా అంటూ చురకలంటించారు. రిజర్వేషన్ ఏదైనా ఎన్నికల పార్టీ గుర్తు మీద జరుగుతాయని ఎద్దేవా చేశారు కేటీఆర్. మరోవైపు అధికార పార్టీ ఎంత హడావుడి చేస్తున్న ప్రతిపక్షాలు మాత్రం మల్లగుల్లాలు పడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ఎన్నికల కసరత్తులో అంత ఉత్సాహాన్ని చూపడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. నామినేషన్ కు ఒక్క రోజు ముందు రిజర్వేషన్ లు ప్రకటిస్తే ఎలా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. ఓటర్ల జాబితా పూర్తి కాకుండా ఎవరైనా షెడ్యూల్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఇక బిజెపి కూడా ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్టు కనిపించటంలేదు. జనవరి 22 న జరకాబోయే మునిసిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. జనవరి 5 న పోలింగ్ స్టేషన్ ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 7 మునిసిపాలిటీల్లోని ఆయా పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. పోలింగ్ స్టేషన్ ల జాబితాపై 8 వరకు సలహాలు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 9 న సాయంత్రం జాబితాను కలెక్టర్లకు అందజేయాలి. 10 న పోలింగ్ స్టేషన్ ల జాబితాను కలెక్టర్లు ఖరారు చేస్తారు. 13 న తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.  

కాంగ్రెస్ కొత్త తరహా ఆలోచన : ప్రామిసరీ నోటుపై సంతకం పెడితేనే సీటు

  అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత లోకల్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అధికార పార్టీ లోకి జంప్ కావడం ఫ్యాషన్ గా మారింది. ఒకానొక సమయంలో ఈ జంపింగ్ జపాంగ్ ల ఎఫెక్ట్ తో మున్సిపల్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కోల్పోయింది. దీంతో ఇప్పుడు గోడ దూకే నేతలకు చెక్ పెట్టేందుకు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కొత్త ఫార్ములాను వర్కౌట్ చేయాలని చూస్తుంది. గెలిచిన అభ్యర్థులు పార్టీ జారిపోకుండా కాంగ్రెస్ ఇప్పుడు జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగా పార్టీ టికెట్ ఇచ్చే ముందే అభ్యర్థుల దగ్గర నుంచి ఓ హామీ తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. గెలిచిన అభ్యర్థులు పార్టీ మారబోమని ప్రామిసరీ నోట్ , బ్లాంక్ చెక్కులు అనుమతి పత్రాలపై సంతకం చేశాకనే టికెట్ అంటూ కొత్త రూల్ పాస్ చేసింది. కనీసం ఇలానైనా గెలిచిన నేతలను కాపాడుకోవాలని కాంగ్రెస్ తిప్పలు పడుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించేవారు అఫిడవిట్ ఇవ్వాల్సిందేనని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధిష్టానం కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ బలంగా ఉన్న నిర్మల్ , మంచిర్యాల జిల్లాలో కొత్త మున్సిపాల్టీల్లో ఈ ఫిట్టింగ్ ను అమలు చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం వెయ్యి మందికి పైగా నేతలు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందులో సగం మందికి పైగా నేతలు అఫిడవిట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారు కావడమే ఆలస్యం అఫిడవిట్ లో బాండ్ పేపర్లు నింపి పార్టీ మారబోమని సంతకాలు చేసి టికెట్ తీసుకునేందుకు నేతలు రెడీ అవుతున్నారు. మొత్తానికి జంపింగ్ అభ్యర్థులకు అడ్డుకట్ట వేయాలంటే ఈ ప్రక్రియ అవసరమనేది కాంగ్రెస్ నేతల వాదన. ఈ బాండ్ల గోల ఏ మేరకు కాంగ్రెస్ కు కలిసొస్తుందో ప్రామిసరీ నోట్లు గెలిచాక జంపింగ్ లను ఎంత మేర పార్టీ మారకుండా ఆపగలుగుతుందో వేచి చూడాలి.

 మునిసిపల్ ఎన్నికలే టార్గెట్ :-ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊపందుకున్న రాజకీయం

రాజకీయ చైతన్య కేంద్రమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తేదీ ఖరారు కావడంతో ప్రజాప్రతినిధులు అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించడంలో తలమునకలయ్యారు. మున్సిపాలిటీలల్లో తెగ తిరుగుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి పనుల్లో , శంకుస్థాపనలు చేసే పనుల్లో ఎమ్మెల్యేలు తెగ బిజీ అయిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 9 మునిసిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మంత్రులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నర్సంపేట , భూపాలపల్లి , పరకాల మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనుల పై సమీక్షించారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లాలో వరుస పర్యటనలకు సంసిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలపై పూర్తిగా దృష్టి సారించారు. ఒక వైపు జిల్లాలోని కీలక నేతలతో కలిసి వ్యూహ రచన చేస్తూనే మరోవైపు ఆయా మున్సిపాలిటీలలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను ఆరా తీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఉదయం వేళల్లో మునిసిపాలిటీల్లోనే ఆయా కాలనీల్లో పర్యటించి పారిశుధ్య పనులు స్వయంగా పరిశీలిస్తున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే ఏకంగా డ్రైనేజ్ మోరీలు శుభ్రం చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరో పక్క జిల్లాలోని అధికార పార్టీ కీలక నేతలు గెలుపు అంచనాలపై లెక్కలు వేసుకుంటూ పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో వారు నిమగ్నమయ్యారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల లెక్కలు తీస్తూ వారిని ఆకట్టుకునేందుకు సమాలోచనలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ చార్జిలను నియమించి క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు. మున్సిపాల్టీల్లో టిఆర్ఎస్ తరుపున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశవహులు ఇప్పట్నుంచే వార్డుల్లో సందడి చేస్తున్నారు. తమకు పార్టీ టికెట్ ఖరారు కాక ముందే వారు అంతర్గతంగా ప్రచారం మొదలు పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుర పోరుకు టీఆర్ఎస్ తరవాత బీజేపీలో జోరు ఎక్కువగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాలను బిజెపి గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించారు. పరకాల , వర్థన్నపేట నియోజకవర్గాల్లో గతంలో బిజెపి నేతలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.కనుక ఈ రెండు మునిసిపాలిటీల్లో తమ పార్టీ మార్పు చూపాలని బిజెపి నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. అలాగే మహబూబాబాద్, జనగాం మునిసిపాలిటీలపైన ప్రత్యేక దృష్టి సారించినట్లు వినికిడి. ఇదిలా వుంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఇంకా తడబడుతూనే ఉందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు మునిసిపాలిటీలపై హస్తం పార్టీ ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోలేదని సమాచారం. కేవలం పార్టీ స్థానిక నేతలు కొంత హడావుడి కనిపిస్తోంది. ఇక ఉమ్మడి జిల్లాలో వామపక్షాలు సైతం పూర్వ పోరు బరిలో దిగేందుకు సై అంటున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, డోర్నకల్, నర్సంపేట మున్సిపాల్టీల్లో సిపిఐ, సిపిఎం పోటీ చేయనున్నట్టు తెలిసింది. అలాగే తొర్రూరు, మరిపెడ, నర్సంపేట తదితర మున్సిపాలిటీలపై దృష్టి సారించాయి. ఈసారి మున్సిపోల్స్ లో వామపక్షాల పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆ మూడు జిల్లాలు మావే.. మునిసిపల్ ఎన్నికలపై ధీమాతో ఉన్న బీజేపీ

  పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున మెజార్టీ సీట్లు గెలవాలనే పట్టుదలతో ముందుకు పోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పర్సనల్ ఎజెండాపై వీరు గెలిచారు అనే వాదన ఉంది. దీంతో ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి తమ సత్తా చాటాలని ఈ నేతలు భావిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలు కరీంనగర్ ఎంపీ సంజయ్ కు మరింత కీలకంగా మారాయి. మోదీ హవా..సంజయ్ ఇమేజ్ తో.. కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇప్పుడు జరిగే మునిసిపల్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని సంజయ్ భావిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ మినహా ఎక్కడా బీజేపీ పెద్దగా సీట్లు సాధించలేదు. కౌన్సిలర్ నుంచి ఎంపీగా విజయం సాధించిన సంజయ్ పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తామని ధీమా బీజేపీలో కనిపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి మొన్నటి ఎన్నికల్లో కాలం కలిసొచ్చింది. పసుపు బోర్డు విషయం తేలక పోవడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనితో ఈ సారి ఆయన లోకల్ సెంటిమెంట్ ప్లే చేసే పనిలో పడ్డారు. కార్పొరేషన్ గెలిస్తే నిజామాబాద్ పేరు మారుస్తామని ప్రచారం చేస్తున్నారు. అయితే లోకల్ సెంటిమెంట్ అరవింద్ కు కలిసి వస్తుందా లేదా అనేది ప్రశ్నగా మారింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తుడుం దెబ్బ అధ్యక్షుడు, ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి బిజెపికి మారిన ఆయన ఆదివాసీ సెంటిమెంట్ తో ఎంపీ అయ్యారు. ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ లో బలమైన ఓటు బ్యాంకు సోయం సొంతం. లోకల్ ఎలక్షన్స్ లో పట్టుమని పది సీట్లు కూడా బీజేపీ గెలవలేకపోయింది. అయితే ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సోయం బాపురావు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన మూడు నియోజక వర్గాల నుంచి ఎంపీలుగా తెచ్చిన ఈ ముగ్గురు నేతలు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సానుకూల ప్రకటనలకు తీసుకోలేక పోయారు. విమర్శలను ఎదుర్కొని.. ఈ ముగ్గురు ఎంపీలు మునిసిపాలిటీల్లో ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాలి.  

కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ కార్యకర్తలు!!

కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆగ్రహంతో ఎమ్మెల్యే ఫ్లెక్సీలకు కార్యకర్తలు నిప్పు పెట్టి తగులబెట్టారు. కల్లూరు మండలం, తాండ్రపాడు గ్రామంలో నాడు- నేడు కార్యక్రమానికి ఆయన వెళ్లారు. ఇందిరా గాంధీ కాలనీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యేని తమ కాలనీకి రావాలని ఆహ్వానించగా.. ఆయన అక్కడికి వెళ్లకుండా పక్కకాలనీ లోకి వెళ్లారు. దీంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఎమ్మెల్యే ప్లెక్సీలను దగ్ధం చేశారు. కొత్తగా పార్టీ లోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని.. కొన్నేళ్లుగా పార్టీలో ఉంటున్న తమను పట్టించుకోవడం లేదని పాత క్యాడర్ విమర్శిస్తోంది. ఈ ఘటన జిల్లా వైసీపీలో పెను దుమారమే రేపింది. జిల్లాలోని ముఖ్య నేతలు జోక్యం చేసుకొని తాండ్రపాడులో ఫ్లెక్సీలను దగ్ధం చేసిన కార్యకర్తలతో.. కొత్తగా పార్టీలోకి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడి అందరి మధ్య రాజీ కుదిర్చి వివాదానికి తెరదించినట్లు సమాచారం.  ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ కి మాజీ ఎమ్మెల్యేలు మురళీ కృష్ణ , మణిగాంధీ మధ్య వైరం ఉంది. ముగ్గురు నేతలు ఎవరి దారిలో వారు వెళ్తున్నారు. దీంతో కోడుమూరు వైసీపీ క్యాడర్ లో చీలికలు ఏర్పడ్డాయి. చివరకు పార్టీ కార్యక్రమాల్లో కూడా ముగ్గురు కలిసి పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. కోడుమూరు నియోజక వర్గం వైసీపీ ఇన్ చార్జి కోట్ల హర్షవర్దన్ రెడ్డి కూడా ఎన్నికల ఫలితాల నాటి నుంచి సుధాకర్ కు దూరంగా ఉన్నారు. అయితే పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం ఇద్దరూ రాజీకొచ్చి జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వీరి క్యాడర్ కూడా ఏకమయ్యారు. అయితే ఎమ్మెల్యే సుధాకర్ తో కలిసి పని చేసేందుకు మాజీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడం లేదని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు వర్గపోరును వీడకపోవడంపై చర్చ జరుగుతోంది. వీరి వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు.

అమరావతిలో యుద్ధ వాతావరణం... పెద్దఎత్తున బలగాల మోహరింపు

  అమరావతిలో వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాజధాని గ్రామాల ఆందోళనలతో అమరావతి అట్టుడుకుతోంది. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో అమరావతి అంతటా పోలీసులు మోహరించారు. మూడు రాజధానులపై కేబినెట్ లో చర్చించి అధికారికంగా ప్రకటన చేయనున్న నేపథ్యంలో అమరావతి 29 గ్రామాల్లో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. అధికారిక ప్రకటన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ పెద్దఎత్తున బలగాలను మోహరించారు. దాంతో, అమరావతి మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా సచివాలయానికి చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు కవాతు కూడా నిర్వహించారు. తుపాకులు, లాఠీలు, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్, అగ్నిమాపక వాహనాలతో సచివాలయం చుట్టూ భద్రత కల్పించారు. దాంతో, రాజధాని ప్రాంతంలో అప్రకటిత యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.  అయితే, రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంపై రైతులు మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమను రెచ్చగొట్టేవిధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని ఫైరవుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, లాఠీఛార్జీలు చేసినా అమరావతిని రాజధానిగా కొనసాగించేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. అయితే, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినాసరే యువత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ బైకులు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, అమరావతిలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని టీడీపీ సీనియర్ లీడర్ యనమల ఆరోపించారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చేసి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. తనకు ఓట్లేసిన వాళ్లనే తొక్కుకుంటూ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని, తన పని తీరును విమర్శించినా ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారని అన్నారు. భూములిచ్చిన రైతులను దొంగలుగా చూస్తారా? రైతుల ఇళ్లకు నోటీసులు అంటిస్తారా? ఇంటింటికీ నోటీసులంటించే తప్పులు వాళ్లేం చేశారో చెప్పాలన్నారు. అయినా, రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన రాజధానిని ఏవిధంగా మారుస్తారని యనమల ప్రశ్నించారు. జగన్ తన స్వార్ధం కోసమే సచివాలయాన్ని విశాఖకు తరలిస్తున్నారని, ఆర్నెళ్ల ముందు నుంచే విశాఖలో వైసీపీ రౌడీలు భూదందాలు మొదలుపెట్టారని, ఇటీవల విశాఖలో జరిగిన భూ కొనుగోళ్లను బయటపెడితే గుట్టు మొత్తం బయట పడుతుందన్నారు.

ఏపీ రాజధాని ఏదో చెప్పని బొత్స... మీడియా ప్రశ్నలకు తత్తరపాటు... 

  అమరావతి రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. అమరావతి రైతులకు వచ్చిన నష్టమేమీ లేదని, ఇక్కడ్నుంచి ఒక్క సచివాలయం మాత్రమే తరలుతోందని అన్నారు. అయితే, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రతి అంశంలోనూ బాధ్యతగా పనిచేస్తున్నామని... గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం ఎక్కడా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేయబోదని తేల్చిచెప్పారు. గ్రాఫిక్సూ, సినిమాలు అసలేం చూపించబోమన్నారు. అన్ని వాస్తవాలే చెబుతామన్న బొత్స...  అమరావతిలో 50శాతం దాటిన నిర్మాణాలను పూర్తి చేస్తామని స్పష్టత ఇచ్చారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని... అందరికీ న్యాయం చేస్తామన్నారు. అయితే, రైతులిచ్చిన 33వేల ఎకరాలను ఏం చేయబోతున్నామో త్వరలో చెబుతామన్నారు.  ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ...చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకోలేదని... రాష్ట్రాభివృద్ధిపై ఆయకున్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టే అర్ధమవుతుందన్నారు. చంద్రబాబులాగా రైతులను మోసం చేయబోమయని అన్నారు. మూడు ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో మంత్రివర్గ సమావేశం తర్వాత చెబుతామన్నారు. అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం దాదాపు 6వేల కోట్లు ఖర్చు చేసిందని... ఇందులో సుమారు 350కోట్లు కన్సల్టెంట్లకే కట్టబెట్టిందని బొత్స అన్నారు. రాజధానిని పూర్తిగా నిర్మించి ఇస్తామని విభజన చట్టంలో ఎక్కడా చెప్పలేదని... అందుకే ఐదేళ్లలో కేంద్రం 1500కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయం, కేంద్రంతో సంబంధాల ఆధారంగా ముందుకెళ్తోందన్నారు. నిధులన్నీ ఒక్క రాజధానికే ఖర్చు చేస్తే విద్య వైద్యం ఇతర సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు ఎక్కడ్నుంచి తేవాలన్నారు. అయితే, అమరావతి, కర్నూలు, విశాఖల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం దాటవేశారు.  

రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారు?.. ఎప్పటికైనా అమరావతే రాజధాని!

ఏపీ రాజధాని వివాదం గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదని తెలిపారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు, కుప్పం నుంచి తడ వరకు అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండేలా రాజధానిని ఏర్పాటు చేశామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యంగా రాజధానిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేశాం.. విశాఖను ఐటీ, ఫార్మా హబ్‌గా అభివృద్ధి చేయాలనుకున్నామని వివరించారు. విశాఖపై మీకు ప్రేమ ఉంటే డేటా సెంటర్‌ను ఎందుకు రద్దు చేశారని జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. ఆదానీ గ్రూప్‌ వచ్చి ఉంటే నాలుగైదు ఏళ్లలో విశాఖ హైదరాబాద్‌కు సమానంగా అభివృద్ధి చెందేది అన్నారు. ఓ కంపెనీని తేవడం చాలా కష్టం, వెళ్లగొట్టడం ఈజీ అని విమర్శించారు. అంతర్జాతీయ కంపెనీ లులుని కూడా వెళ్లగొట్టారని, ఆ కంపెనీకి కేటాయించిన భూములు కొట్టేద్దామనుకున్నారా? అని చంద్రబాబు మండిపడ్డారు. బోగాపురంలో 2వేల ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూసేకరణ చేస్తే దానికి కూడా అడ్డుపుల్లలు వేశారని విమర్శించారు. అమరావతికి బోలెడు ఖర్చవుతుందని, అంత డబ్బులతో రాజధాని కట్టలేమని ప్రభుత్వం చెప్పడం సాకు మాత్రమేనని చంద్రబాబు ఆరోపించారు. అన్ని అవసరాలు పోగా 10 వేల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద ఉంటుందని తెలిపారు. ఈ భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో మహానగరం నిర్మించవచ్చని చెప్పారు. ఎప్పటికైనా అమరావతే ప్రజా రాజధాని అని చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన.. ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అమరావతిలో దేవినేని ఉమ అరెస్ట్.. రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..

అమరావతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనలతో రాజధాని గ్రామాలు అట్టుడుకుతున్నాయి. పలుచోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రైతుల ఆందోళనకు మద్దతుగా టీడీపీ నేత దేవినేని ఉమా రోడ్డు పై బైఠాయించడంతో గొల్లపూడిలో ఉద్రిక్తత తలెత్తింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గ గుడి వరకు ఆయన భారీ ర్యాలీకి ప్రయత్నించారు. భారీగా తరలి వచ్చిన రైతులు, మహిళలతో కలిసి రోడ్డు పై ఆయన బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.ఇరవై తొమ్మిది గ్రామాల రైతాంగ త్యాగ ఫలంతో అమరావతి ప్రజా రాజధాని ఏర్పడిందన్నారు. ఇవ్వళ ముఖ్యమంత్రిగారు దుర్మార్గంగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఓ రాజకీయ దళారి ఓ ముద్దాయి విజయసాయిరెడ్డి భీమిలిలో రాజధాని ఉంటుందని, విశాఖపట్నంలో రాజధాని ఉంటుందని కమిటీ పూర్తి అవ్వక ముందే ప్రకటన చేశాడని మండిపడ్డారు. తమ వ్యాపారాలకు.. జగన్ మోహన్ రెడ్డికి భయపడి ప్రాంతీయ నేతలు కూడా రాజధాని మార్పుకు మద్దతు తెలుపుతున్నారని ఉమా ఆవేదను వ్యక్తం చేశారు.ఈ చర్యలకు పాల్పడిన ఉమాను తక్షణమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

సబ్ కమిటీ రిపోర్ట్ రెడీ.. బాబు హయాంలో జరిగిన అవకతవకలు బయటపెట్టనున్న వైసీపీ

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల పై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తన నివేదిక ను సీఎంకు అందచేసింది. మొత్తం 30 అంశాల పై కమిటీ నివేదిక ఇచ్చింది. నిర్మాణాల భూ కేటాయింపులు ప్రాజెక్టులపై కమిటీ పరిశీలించటమే కాక నివేదిక పై కేబినెట్ చర్చించింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్... నలుగురు మంత్రులు దీనికి సంబంధించిన సబ్ కమిటీలో ఉన్నారు. ఈ సబ్ కమిటీ జూన్ 31వ తేదిన ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వివిధ సార్లు భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతం మొదలుపెట్టుకొని అనేక ప్రాంతాల్లో జరిగిన నిర్మాణాలు, వ్యయాలు ఏవైతే ఖర్చు పెట్టరు అవన్నీ కూడా ఒకటి ఒక పూర్తి స్థాయి రిపోర్టును తయారు చేశారు. అమరావతి విషయంలో అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నారు. వాటిని కూడా రిపోర్టులో పొందుపర్చిన జరిగినట్టు సమాచారం.గత ప్రభుత్వం పాల్పడిన అనేక అవకతవకలను నిరుపిస్తామని గతంలో నుండే ప్రభుత్వం చెబుతుంది. దీని పై ప్రతిపక్ష నేతలు కూడా సవాల్ చేస్తూ తాము అవినీతి చేస్తున్నామని నిరుపిస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటిది నివేదిక కానీ రుజువు చేయలేకపోయారంటూ ఆరోపిస్తున్నారు.దానిపై స్పష్టత అందించేందుకు మరికాసేపట్లో క్యాబినెట్ సమావేశం ముగుస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.విడుదలైన నివేదిక ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.  

అమరావతి భూముల కొనుగోళ్లపై సీబీఐవిచారణ

రాజధానికి సంబంధించి కీలకమైన ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో అమరావతిలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాత దీని పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అమరావతి ప్రకటనకు ముందు జరిగిన భూకొనుగోళ్ల పై సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. నాలుగు వేల ఎకరాలు ఎవరెవరు కొన్నారో నివేదికల చాలా స్పష్టంగా పేర్కొంది సబ్ కమిటీ. ఈ నివేదికలో పలువురు టిడిపి నేతల పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎన్ని కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని ముఖ్యమంత్రి అన్నారని రాజధాని తరలింపు పై మంత్రులకు చాలా సుదీర్ఘంగా వివరించినట్టు సమాచారం. లక్ష కోట్లలో 10% శాతం వైజాగ్ లో ఖర్చు పెట్టిన కూడా హైదరాబాద్ స్థాయిలో రాజధాని అభివృద్ధి అవుతుందని, రాజధాని మార్పు ఎందుకో ఏమిటో ప్రజలకు చెప్పి చేద్దామని జగన్ చెప్పినట్లు వెల్లడించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో జియన్ రావు కమిటీ నివేదికపై చర్చించారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు పై సీఎం మంత్రుల సూచనలు అడిగినట్లు సమాచారం.రాజధాని తరలింపు పై సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.15 రోజుల్లో సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. రాజధాని తరలింపు విషయంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు పై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  

కన్నా కౌంటర్.. రాజధానిలో బాబు రియల్ ఎస్టేట్ చేస్తే.. జగన్ ఏకంగా అమ్మేస్తున్నాడు

ఉద్దండరాయునిపాలెంలో మోదీ శంకుస్థాపన చేసిన చోట మౌనదీక్ష చేపట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తన వైఖరిని స్పష్టం చేశారు కన్నా.సీడ్ క్యాపిటల్ ఇక్కడే ఉండాలన్న తమ విధానం తెలియజేశామని.. మళ్లీ గంట గంటకు విధానాన్ని తెలియ జేయటానికి తానేమి చంద్రబాబునాయుడు,జగన్ మోహన్ రెడ్డిని కాదని ఆయన మండిపడ్డారు.తమ పార్టీ విధానాన్ని మొదటి నుంచి చెబుతున్నట్లు సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణకు సహకరిస్తామన్న ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాజధాని రైతులను మోసం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా క్యాపిటల్ ను అమ్మేసి కుట్ర చేస్తోందని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మనారాయణ. చంద్రబాబు నాయుడు రాజధాని భూములను స్వర్గంగా చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని కాలయాపన చేశారన్నారు. అవినీతికి అనుకూలంగా లేదని.. ముంపు ప్రాంతం అని చూపించి ఏకంగా రాజధానిని అమ్మటానికే కుట్ర చేస్తున్నట్లు కన్నా ఆరోపించారు. క్యాబినెట్ నిర్ణయం తీసుకోకముందే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల పై ఆయన స్పందించారు. కుట్ర పూరితమైన ఆలోచనతో భేటి జరుగుతుందన్నారు. క్యాపిటల్ ఉండగా దీని పై జీఎన్ రావ్ కమిటీ వేయడం.. ఆ కమిటి పూర్తయ్యి నిర్ణయం రాక ముందే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడతారని విజయసాయి ప్రకటనలు చేయడంపై ఆయన మండిపడ్డారు. కాబినెట్ మీటింగ్ నిర్ణయాలు రాక ముందే నిన్న వాళ్ల పార్టీ ఎంపీ విశాఖపట్నంలో పండగలు చేసుకోటం ఇవన్నీ చూస్తుంటే ఒక కుట్రపూరితమైన చర్యలు తప్ప అంతకు మించి ఏమి జరగట్లేదని కన్నా మండిపడ్డారు.క్యాబినెట్ నిర్ణయం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి

విజయసాయి మాటలకు విలువ లేదా.. నెంబర్ 2 పొజిషన్ పోయిందా?

ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ విశాఖ అంటూ వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "28న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలుకుదాం. విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో థాంక్యూ జగనన్నా అంటూ జననేతకు ధన్యవాదాలు చెబుదాం." అని జగన్ విశాఖ పర్యటనను విజయవంతం చేయండి అంటూ ట్విట్టర్ లో పెద్ద పోస్టే పెట్టారు. విజయ సాయి వ్యాఖ్యలు ట్వీట్లు చూసి ఇంకేముంది వైసీపీ నెంబర్ 2 నే విశాఖను రాజధాని అన్నారంటే ఇక కంఫర్మ్ అయిపోయినట్టే... కేబినెట్ భేటీ తరువాత ప్రకటన తరువాత ప్రకటన రావడమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ కట్ చేస్తే.. టోటల్ రివర్స్ అయింది. జీఎన్‌రావు, బీసీజీ కమిటీ నివేదికలను అధ్యయనం చేసి.. హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఆ కమిటీ చెబితే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కేబినెట్ మీటింగ్ ముగిసింది కానీ రాజధానిపై సస్పెన్స్ కి మాత్రం ఎండ్ కార్డు పడలేదు. మరి ఈ మాత్రం విజయ సాయి ఇంత హడావుడి ఎందుకు చేసారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి విజయసాయి ఏం సమాధానం చెప్తారో తెలియదు కానీ.. మంత్రి పేర్ని నాని మాత్రం విజయసాయివి రాజకీయ వ్యాఖ్యలని సింపుల్ గా తేల్చేశారు. కేబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడిన ఆయన.. విజయసాయి ప్రకటనతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. విశాఖ వైసీపీ ఇన్‌చార్జ్‌గా విజయసాయిరెడ్డి మాట్లాడి ఉండవచ్చని.. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్ని నాని తెలిపారు. దీనిని బట్టి చూస్తే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టుగా.. విజయ సాయి కంగారుపడి వ్యాఖ్యలు చేసారా లేక ప్రస్తుతం పార్టీలో విజయసాయికి తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వని నేతలకు అభయహస్తం అందిస్తున్న కాంగ్రెస్ , బీజేపీ

కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలా ఉన్న సూర్యపేట జిల్లాలో ఇప్పుడు గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వార్డుల వారీగా ఓటర్ల గణన అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక రిజర్వేషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాల్టీల్లో సందడి పెరిగింది. ఆ మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీనం వల్ల వార్డుల సంఖ్య పెరిగింది. సూర్యాపేట జిల్లా పరిధిలో గతంలో 100 వార్డులుండగా కొత్త మున్సిపాలిటీ చట్టం మేరకు ఆ సంఖ్య 141 కి పెరిగింది. ప్రస్తుతం సూర్యాపేటలో 48 వార్డులు, కోదాడలో 35, హుజూర్ నగర్ లో 28 తిరుమల గిరిలో 15, నేరెడుచర్లలో 15 వార్డులున్నాయి. అన్ని చోట్ల వలస నేతలు కారణంగా అధికార టీఆర్ఎస్ లో తీవ్రమైన పోటీ నెలకొంటుంది.సూర్యాపేట మున్సిపాలిటీలో గతంలో 34 వార్డులు ఉండేవి 7 సమీప గ్రామాల విలీనంతో ఆ వార్డుల సంఖ్య 48 కి చేరింది. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. కానీ ఇతర పార్టీల నేతలు గులాబీ దళంలో చేరి ఆ పార్టీకి మద్దతిచ్చారు. దీంతో చైర్మన్ పీఠం టీఆర్ఎస్ దక్కించుకుంది.2014 నుంచి 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల వరకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లోకి వలసొచ్చారు. ఫలితంగా అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య అంతకంతా పెరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీలో ఒక్కో వార్డుకి సుమారు 5 గురు కంటే ఎక్కువ మంది కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం రాబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో గులాబీ జెండా ఎగరాల్సిందే అన్న పట్టుదలతో ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు.జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలో అధికార పార్టీలు చాలా మంది అభ్యర్ధులుంటే విపక్ష కాంగ్రెస్ లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన వీరాభిమానులు సైతం గులాబీ గూటికి చేరడంతో హస్తం పార్టీకి కౌన్సిలర్ అభ్యర్థులే కొరవడ్డారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో పూర్తిగా నిరుత్సాహం పేరుకుపోయింది. పొరపొరులో అయినా పరిస్థితి మారుతుందేమో అని ఆ పార్టీ పెద్దలు ఆశ పెట్టుకున్నారు.సూర్యపేట జిల్లాలో 2014 ఎన్నికల నాటికి తెలుగుదేశం బాగా డీలా పడింది. 2018 ఎన్నికల్లో టిడిపి పక్షాన కోదాడ అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడిన బొల్లం మల్లయ్య యాదవ్ చివరి నిమిషంలో టీఆర్ఎస్ లో చేరి విజయం సాధించారు .ఇదే జిల్లాకు చెందిన పాల్వాయి రజనీకుమారి కూడా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. మొన్న జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిడిపి బరిలోకి దిగినప్పటికీ డిపాజిట్ గల్లంతయ్యింది. ఇక పొరుగూరి విషయానికొస్తే జిల్లా వ్యాప్తంగా టిడిపికి అభ్యర్ధులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.సూర్యాపేట జిల్లా కేంద్రంలో బిజెపికి కొంత పట్టుంది. కానీ మిగతా మున్సిపాలిటీల్లో మాత్రం కమలదళానికి ఇబ్బందికర పరిస్థితి అని తెలిసిందే.ఈ తరుణంలో టీఆర్ఎస్ లో టికెట్లు ఆశించి భంగపడే నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ బిజెపిలు కాచుకోని ఉన్నాయి. ఇది పరీక్షా సమయం కనుక టికెట్లు ఆశించే వరకు ఉండి అవసరమైతే జంప్ అవ్వటానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.  

సుప్రీం ఆదేశాలు భేఖాతర్.. స్థానిక ఎన్నికలకు పాత రిజర్వేషన్లనే అమలు చేయనున్న వైసీపీ ప్రభుత్వం

స్థానిక ఎన్నికల్లో పాత కోటానే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రిజర్వేషన్ల పై సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలను ఇంకొంత కాలం వాయిదా వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లుగా కనిపిస్తుంది. పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశం అందులో భాగమేనన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను కాదని ముందుకెళ్తూ ఉండటంతో వెంటనే ఎన్నికలు జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదని స్పష్టమవుతోందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతిలో 60.15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కోరిన సుప్రీం అంగీకరించలేదు. దీంతో 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఇవన్నీ తెలిసినప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో 60.15 కోటా అమలుకు పరిచేందుకు సన్నహాలు చేస్తుంది. ఇందు కోసం తీసుకురావల్సిన ఆర్డినెన్స్ పై కేబినెట్ లో చర్చించి నిర్ణయించనున్నట్లు సమాచారం. పంచాయితీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఇప్పటికే హై కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికలు సకాలంలో ఎందుకు నిర్వహించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. రిజర్వేషన్లను ఖరారు చేయక పోవటంతో ఆ ప్రక్రియ ప్రారంభించ లేక పోయామని యస్ఈసి సమాధానం ఇవ్వడంతో ఆ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికల జాప్యం చేసేందుకు హైకోర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని తెలిసే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల మెలిక తెచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్లు 50 శాతానికి కుదిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సి ఉన్నా ఇటీవలి శీతాకాల సమావేశాల్లో ఆ పనిచేయలేదు. ఆర్డినెన్స్ ద్వారా 50 శాతం రిజర్వేషన్లను అంశం తెస్తారని అందరూ భావించారు.  దీనికి హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ అంగీకరించవని తెలిసే ముందుకెళ్తూ ఉండటం వెనుక ఏ కారణం గానైనా కొంత మేర జాప్యం చేయవచ్చునన్న వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల్లో 50 శాతానికి రిజర్వేషన్లు పెట్టడంలో బీసీలకే నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కుదిస్తే బీసీల్లో అసంతృప్తి పెచ్చురిల్లుతుందని వైసీపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఎప్పటిలానే రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించి సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తే కోర్టు ఆదేశాల ప్రకారం చేశామని ప్రచారం చేసుకునేందుకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. వైసిపి అధికారం చేపట్టగానే వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారని సర్వత్రా భావించారు. ఆ ఊపులోనే ఎన్నికలు నిర్వహిస్తే క్లీన్ స్వీప్ చేయవచ్చనుకున్నారు. అయితే సీఎం జగన్ గ్రామ సచివాలయాల ఏర్పాటు పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఆరు నెలల్లోపు పేదలకు వైసీపీ ప్రభుత్వ మార్కు చూపించి ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అయితే గ్రామ సచివాలయాల వ్యవస్థ ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం.. వివిధ పథకాలు ఇంకా అమలు దశలో ఉండడం ఇసుక ఇబ్బందులతో పాటు గ్రామీణ పట్టణ ప్రజల్లో అసంతృప్తి పెల్లుబకడంతో ఇంకొంత కాలం ఆగి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ప్రభుత్వం.  

కేబినెట్ భేటీ ముగిసింది.. అయినా వీడని సస్పెన్స్!!

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రాజధానికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదిక గురించి, అలాగే స్థానిక ఎన్నికల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులపై నిర్ణయం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ప్రకటించాలని అనుకున్నట్లు సమాచారం. వీటితో పాటు రాజధాని రైతులకు ఇచ్చే రిటర్నబుల్‌ ప్లాట్స్‌ అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.  సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. రాజధానిపై బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. రిపోర్ట్‌ వచ్చాక ఏం చేయాలన్న అంశంపై ఆలోచిస్తామని తెలిపారు. కాగా.. రాజధానిపై వచ్చే నెల 3న బీసీజీ నివేదిక ఉంటుందని సమాచారం. నివేదికపై అధ్యయనం చేసిన తర్వాతే రాజధానిపై ఫైనల్‌గా ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని తెలుస్తోంది. జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలు పరిశీలించిన అనంతరమే ప్రకటన ఉంటుందని సమాచారం.

కేటీఆర్ సీఎం... కేసీఆర్ సూపర్ సీఎం... శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల అర్ధమిదేనా?

మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ కేటీఆర్ ... త్వరలో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి అనుకూలంగా కామెంట్స్ చేశారు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆరే అన్నారు. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలుసంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.... కేటీఆర్ ముక్కసూటి మనిషని... ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే నడిచిన నాయకుడంటూ కొనియాడారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ రంగం దూసుకుపోతోందని... భవిష్యత్ లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అయితే, కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టనున్నారని, త్వరలోనే పట్టాభిషేకం జరగబోతోందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక... కేటీఆర్ సీఎం... కేసీఆర్ సూపర్ సీఎం అంటూ సంచలన కథనాన్ని కూడా ప్రచురించింది. దాంతో, ఆ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే, వచ్చే ఏడాది అంటే 2020లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పగ్గాలు అందుకోవచ్చని అంటున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఇటీవలే కేసీఆర్ ఏడాది పూర్తి చేసుకోవడం... అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కూడా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడంతో.... కొత్త సంవత్సరంలోనే పట్టాభిషేకం జరగొచ్చని చెబుతున్నారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా పట్టాభిషేకం జరగొచ్చని అంటున్నారు. ఏదిఏమైనా నిప్పు లేకుండా పొగైతే రాదు... అంటే, కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనేది కేసీఆర్ ఆకాంక్షగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో చెప్పలేని పరిస్థితులు నెలకొనడంతో... ఇఫ్పుడు తనయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని కేసీఆర్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కాకపోతే... మరెప్పుడనే భావనతో కేసీఆర్ ఉన్నారని, దాంతో, అతిత్వరలోనే కేటీఆర్ కి పట్టాభిషేకం జరిగిపోవచ్చని అంటున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు కూడా అందుకు సంకేతాలేనని చెబుతున్నారు.